మాకే ఎందుకిలా?

22
2

[box type=’note’ fontsize=’16’] కుమారి కస్తూరి మజుందార్ ఆంగ్లంలో వ్రాసిన ‘బటర్‌ఫ్లై’ అనే కథని ‘మాకే ఎందుకిలా?’ పేరిట తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

[dropcap]మం[/dropcap]డే ఎండ రోడ్లని వేడెక్కిస్తోంది. గాలి పొడిగా మారింది. వేసవి వచ్చేసింది. ప్రతీ ఏడాది ఈ కాలం మాకు సంతోషాన్ని తెస్తుంది… మా బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది… కానీ ఈసారి.. సూర్యకాంతి అధికంగా ఉన్నా మా మనసులో ఏదో తరగని మసక. ఏదో మాయదారి రోగమనీ, ఎంతోమందిని పొట్టనపెట్టుకుందని చెప్పారు, నేను కాస్త గాబరా పడ్డాను, ఎందుకంటే పరిస్థితి ఎంత తీవ్రంగా లేకపోతే, నాన్న లక్నోకి వెళ్ళిపోదామని అంటాడు? నేను బాగా చీదరించుకునే తీవ్రమైన చలికాలం వెళ్ళిపోయింది. ఎండలు బాగా ముదరాలనీ, దాంతో మా నాన్న ఐస్ క్యాండీ వ్యాపారం జోరుగా సాగాలనీ, అప్పుడే నేనూ తమ్ముడు మామిడిపండ్లు కొనుక్కుని తినగలుతామని కోరుకున్నాను. అయితే, వరాల వేసవి వచ్చేసరికి, అంతా నాశనమయ్యిందని అమ్మ వాపోయింది. నిన్న రాత్రి, నేను తమ్ముడు పడుకున్నాం అనుకుని, అమ్మ నాన్నలు మెల్లిగా మాట్లాడుకున్నారు… నాన్న ఎన్నడూ లేనట్టు ఏడుస్తూ జీర గొంతుతో – మేం దాచుకున్న డబ్బులు అయిపోయాయని, ఊరు వదిలి వెళ్తే మళ్ళీ ఇక రాలేమని అన్నాడు. ఢిల్లీ లోని మా ఇల్లేం ఇంద్రభవనం కాదు. నిజానికా గుడిసెలో నలుగురం పడుకోవాలంటే స్థలం చాలదు. అందుకే నాన్న తరచూ బయట ఫుట్‌పాత్ మీద నిద్రపోతాడు. నాన్న బాగా అలసి పోయి ఉంటే, ఇంట్లో నిద్రపోతాడు, అప్పుడు తమ్ముడు బయట పడుకుంటాడు. నాకు తెలిసిందల్లా ఇదే! ఈ నాలుగు గోడలు, నిరంతం ఉండే డ్రైనేజ్ కంపు, అప్పుడప్పుడు దగ్గరలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి వచ్చే సువాసనలు, సాయంత్రాలు రద్దీగా ఉండేటప్పుడు రణగొణధ్వనులు, పగలంతా అమ్ముకునేవాళ్ళ కేకలతో రొద… అదీ మా ఇల్లంటే. దీన్ని కాకపోతే మరి దేన్ని మాదనుకోను? ఇక్కడ కాకపోతే మరెక్కడ సంతోషం దొరుకుతుంది?

***

అవరసరమైన వాటినన్నింటినీ సర్దుకోమని నాన్న చెప్పాడు. నా ఐదేళ్ళ తమ్ముడు తన బొమ్మ కారుని తీసుకువస్తానని అమ్మ కొంగు పట్టుకుని బ్రతిమాలుతున్నాడు. నేనేమో నాన్న కాళ్ళ దగ్గర కూర్చుని ‘ఇక్కడే ఉందాం నాన్నా’ అని ఏడ్చాను. ఆయనేమీ మాట్లాడలేదు. జాలిగా నాకేసి చూశాడు, కళ్ళతో ఏదో చెబుదామనుకున్నాడు… ఎంతో బాధాకరమైన విషయం అయ్యుంటుంది… నోటి ద్వారా చెప్పలేనిది… కానీ తన 12 ఏళ్ళ కూతురు భుజాల మీద తన విచారం బరువు మోపలేక తనని తాను అదుపు చేసుకుంటున్నట్టున్నాడు. చాలా సేపు మాట్లాడకుండా ఉండిపోయాడు. చివరగా “కావల్సినన్ని మంచినీళ్ళు తీసుకురా” అని మాత్రం అమ్మతో అన్నాడు.

***

బహుశా, అందరూ చెప్పుకుంటున్న ఆ రోగం – చాలా శక్తివంతమైనదేమో, లేకపోతే నాన్న ఐస్ క్యాండీ బండిని అలా ఆ ఇరుకు సందులో ఎందుకు వదిలేసి వస్తాడు? అది ఇక పాతకాలం వస్తువు అన్నట్టు, ఇక దాని అవసరం లేదన్నట్టు! మా ఇంటి వాకిలి దాటుకుంటే దుఃఖం ఆపుకోలేకపోయాను. “ఎందుకేడుస్తున్నావ్ అక్కా” అంటూ తమ్ముడు ఎన్నోసార్లు అడిగాడు. తన కారు బొమ్మని చూడడం ఇదే ఆఖరిసారని వాడికి తెలిస్తే, వాడూ ఏడుస్తాడేమో!

***

కొన్ని గంటల పాటు నడిచాం. అప్పటికే నా మీద నాకు అదుపు పోయినట్లనిపించింది. కొంత సేపటికి నా అరిగిన నా చెప్పులు పూర్తిగా చిల్లులు పడ్డాయి. సరిగా వేయని రోడ్ల మీద ఉన్న కంకర రాళ్ళు గుచ్చుకుని పాదాల నుండి రక్తం కారింది. అమ్మ సంచీలో ఉన్న నీళ్ళ సీసా నాకు దాహాన్ని గుర్తు చేస్తోంది, కానీ ఇంకా చాలా దూరం నడవాలి, ఉన్న నీళ్ళు తక్కువ. నొప్పి అధికంగా ఉంది, కానీ తట్టుకునే నా శక్తి క్షీణిస్తోంది. మా ప్రయాణం అయిదు రోజులని నాన్న చెప్పాడు. సగం రోజుకే నా పరిస్థితి ఇలా అయిపోతే… మిగతా ప్రయాణం మాటేమిటి? అసలు ఊపిరుంటుందా? మొదట నడక మొదలుపెట్టినప్పుడు… వీధుల్లో ఇళ్ళు, భవన సముదాయాలు కన్పించేవి. మామూలు రోజులల్లో అయితే అక్కడంతా సాధారణంగానే ఉన్నట్టు అన్పించేది. కానీ ఇవాళంతా వింతగా ఉంది. ఈ రోజు మాకంటూ ఇల్లు లేకపోగా, ఈ జనాలంతా తమ ఇళ్ళల్లో ఎలా కాలక్షేపం చేస్తున్నారో అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి…. కానీ ఆలోచనలని మళ్ళించి నా దృష్టిని రోడ్డు మీద నిలిపాను. ఎప్పుడైనా ఏదైనా అడిగితే – “మన దగ్గర అంత డబ్బు లేదు” అని జవాబిస్తుంది అమ్మ. ఇప్పుడు కూడా అదేనా కారణం? మా దగ్గర డబ్బులేకపోవడం వల్లేనా మేమిలా రోడ్డున పడ్డాం? ఎండలలో నడుస్తున్నప్పుడు ఎవరికి నీడ కావాలో రూపాయలే నిర్ణయిస్తాయా? ఎన్ని నీళ్ళు తాగాలో, ఎంత అన్నం తినాలో డబ్బే చెబుతుందా? చివరిగా నేను తిన్నది అమ్మ ఇచ్చిన ఓ చపాతీ… ఇప్పుడు నాకు బాగా ఆకలి వేస్తోంది. కానీ నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. కాస్త అదనంగా మిగిలినది తమ్ముడికిచ్చింది అమ్మ, విషయం అర్థం కాదు కనుక, గొడవ చేయకుండా ఉంటాడని.

***

నాన్న ఇక నడవలేకపోయాడు. దారిలో పోలీసులు లాఠీలతో కొట్టారు. నాన్న కిందపడినప్పుడు పాదాలు మెలిపడ్డాయి. తనని వదిలి ముందుకు నడవమంటాడు. కానీ ఎలా నాన్నని వదిలేసి వెళ్ళడం? మా నడక భారంగా సాగుతుంటే, ఉత్సాహపరిచేదే నాన్నని… ప్రతీ చీకటి చివర వెలుగు ఉంటుందని చెప్పే నాన్నని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలం? లక్నో చేరాకా చల్లటి నీళ్ళతో స్నానం చేసి, నానమ్మ చేసిపెట్టే చపాతీలు, మిఠాయిలు తినచ్చని ఎంతలా నచ్చజెప్పాడు? తను మాకు దారి చూపే కాగడా, ఆ కాగడా ఆరిపోతే, మేం దాదాపు గుడ్డివాళ్ళతో సమానమైపోతాం. చాలాసేపు బ్రతిమాలి ఒప్పించాకా, మాతోనే కుంటుతూ నడవడానికి సరేనన్నాడు నాన్న. ఆ రాత్రి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఆగుదామని అనుకున్నాం. అప్పటికే ఢిల్లీ నగరం నుంచి దూరం వచ్చేసాం. దూరంగా మినుకుమినుకు మంటూ నగరం దీపాలు కనబడుతున్నాయి. దుమ్ముతో నిండిన కాంక్రీటు నేలపై మిగతావాళ్ళంతా వెంటనే పడుకున్నారు. నాకు మాత్రం నిద్రరాలేదు. ఆ దీపాలపైనే నా దృష్టంతా. నగరం వేలాది లైట్ల కాంతితో మెరిసిపోతుంటే – ఇక్కడ ఈ ఖాళీ పెట్రోల్ బంకులో చీకట్లో మేము… ఇలా ఆలోచించకూడదని నాకు తెలుసు… మాకు కావల్సినంత ఇచ్చాడు దేవుడు… కానీ మా దగ్గర ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుంది నాకు.

***

ఇవాల్టికి నడక మొదలై మూడు రోజులు. నేను ఆశ పడడం మానేశాను. ప్రశ్నలు వేయడం ఆపేశాను. తమ్ముడిని భుజం మీద మోస్తున్న అమ్మ నడిరోడ్డు మీద మూర్ఛ పోయినప్పుడు ఉన్న కాసిని నీళ్ళు అయిపోయాయి. నాన్న బాగా కంగారు పడ్డాడు. నేను ఏడ్చాను. నేను ఎంత పిచ్చిగా చేతులు ఊపినా ఒక్క ట్రక్కు కూడా ఆగలేదు. మా తొందర కంటే వాళ్ళ తొందర ఇంకా ఎక్కువ కాబోలని అనుకున్నాను. అమ్మకి విశ్రాంతి నిద్దామని రోడ్డు మీదే ఓ పక్కగా కూర్చున్నాము. రోడ్డు మీద ఎక్కువ సమయం గడిపితే, రోడ్డు మనకు ఎన్నో నేర్పిస్తుంది – అందులో ఒకటి ఏంటంటే – కాలంలానే రోడ్డు కూడా ఎవరి కోసమూ ఆగదు. అది అనంతమైనది, విశాలమైనది. గడిచే ప్రతీ క్షణం, అది మనల్ని భయపెడుతూనే ఉంటుంది. అయితే నా మనసులో మాత్రం ఈ రోగం కన్నా రోడ్డే భయంకరమైనదని అనిపించింది. ఎందుకంటే రోడ్డుది రాతి హృదయం. దేవుడు పంపినట్టు, నిన్న రాత్రి మా దగ్గరకి ఒకాయన వచ్చాడు… ఏమైనా తిన్నారా అని అడిగాడు. మా దగ్గర ఉన్న కొన్ని బిస్కెట్లే తిన్నాం అని చెబితే – తన కారులోంచి కొన్ని పూరీలు, కాస్త టీ బయటకి తీశాడు. ముందు టీ చుక్క తాగాము. ఆయన మాకిచ్చినది ప్రసాదానికేం తక్కువ కాదు. “మీకు లిఫ్ట్ ఇద్దామంటే రూల్స్ ఒప్పుకోవు” అన్నాడయన వెళ్ళిపోతూ. రూల్సా? ఏ రూల్స్ గురించి ఆయన మాట్లాడాడు? ఆ రూల్స్ అంటే ఏంటో నాకూ కాస్త తెలుసు… అవి పేదలకి వ్యతిరేకమని అర్థమయింది. డబ్బున్న వాళ్ళు ఇంట్లో సౌకర్యంగా ఉంటే, డబ్బు లేని వాళ్ళు సూర్యుడి ప్రతాపానికి గురవుతూ ఎంతకీ గమ్యం చేరని దారులలో నడుస్తారు. ఎట్టకేలకు దేవుడు మాపై దయతలచాడు. పూరీలు అమృతంలా ఉన్నాయి.

***

‘అంతా అయిపోయింది’ అన్న అమ్మ మాటల్లో అర్థం నాకిప్పుడు తెలిసింది. 30లలో ఉన్న అమ్మ, కేవలం ఐదేళ్ళ వయసున్న తమ్ముడు మాకు క్షణాల్లో దూరమయ్యారు. ఈ ఘటన ఎంత వేగంగా జరిగిపోయిందంటే – నిజం అని నమ్మశక్యం కానంతగా! ఆత్మీయులను పోగొట్టుకోవడంలో ఎంత బాధ ఉందో ఇప్పుడు తెలుస్తోంది. క్షణాల్లో కోల్పోయాం ఇద్దరినీ! నాన్న పాదం నొప్పిపెడుతుంటే, ఆయన నడుం మీద చేయి వేసి కాస్త ఆసరా ఇస్తూ నడుస్తున్నాను. అమ్మా, తమ్ముడు కాస్త వెనక ఉన్నారు. అది రాత్రి సమయం. మేం ఎప్పటి లానే మౌనంగా ఉన్నాం. లక్నోకి చేరాలంటే ఇంకా ఎంత కాలం పడుతుందన్న మాట గురించి కాసేపు మాట్లాడుకుంటున్నాం. అయితే ‘ధడ్’ మని చప్పుడు చేస్తూ అమ్మ మళ్ళీ రోడ్డు మీద పడిపోయింది. ఆ చప్పుడుకి మా మధ్య నున్న నిశ్శబ్దం బద్దలైంది. తమ్ముడు ఏడవసాగాడు. నాన్నని ఓ బండరాయి మీద కూర్చోబెట్టి, “నేను వస్తున్నా” అని అరిచాను. ఇంతలో రోడ్డు మీద ఏదో బండి హఠాత్తుగా కీచుమంటూ ఆగిన చప్పుడు… తమ్ముడి అరుపు వినబడ్డాయి. నా గుండె అదిరింది. తల తిప్పి అక్కడ చూసిన దృశ్యం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రోడ్డు మధ్యగా అమ్మా, తమ్ముడి శవాలు పడి ఉన్నాయి, విశ్రాంతి కోసం ఆగిన చోటు నుంచి ఓ ట్రక్కు వాళ్ళని ముందుకు ఈడ్చేసింది. డ్రైవరు ఒక్క క్షణం పాటు బండి ఆపాడు. “ఇదేమయినా నిద్రపోయే స్థలమా?” అని అరిచి ముందుకు వెళ్ళిపోయాడు. నాకూ, నాన్నకి నోట మాట రాలేదు. ఆ డ్రైవర్ ప్రశ్నే పదే పదే నా చెవుల్లో వినిపించింది.

మొదటగా మాలాంటి వాళ్ళం నడవదగ్గదేనా ఈ రోడ్డు? మాది అని మేము అనుకునే నగరం మమ్మల్ని దగ్గరకి తీసుకోనప్పుడు, మరి ఈ రోడ్డేం చేస్తుంది? ఈ రోడ్డు మాకు ఈ మధ్యే పరిచయం, అయినా మా ఆప్తులని లాగేసుకుంది. దీపాల వెలుగుల్లో ఢిల్లీలో భద్రంగా ఉంటున్నవారు కూడా మా వాళ్ళని తిరిగి తేలేరు. చాలా సేపటి తర్వాత నేను ధైర్యం తెచ్చుకుని, రెండు శవాలని పక్కకి లాగి నాన్న ముందుకు తెచ్చాను. సూర్యోదయం అయ్యే సమయం. తొలి కాంతులు నాన్న ముఖంపై పడ్డాయి. ఆయన బాధ చూడలేకపోయాను, ఏడుపు తన్నుకొచ్చింది. ఆ రోగం ఏంటో, అది ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుందో నాకేం తెలియదు. ఎక్కడ్నించి వచ్చిందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కానీ అది బాగా శక్తివంతమైనదనీ, దాన్ని ఎదుర్కోవడం కష్టమని మాత్రం అర్థమైంది. వాళ్ళకి సోకకుండానే అది మా అమ్మని, తమ్ముడిని చంపేసింది.

***

మేం ఆ రోడ్డు పక్కనే కూర్చుని కొన్ని గంటలు గడిచాయి. ఎంత సేపటి నుంచి ఏడుస్తున్నానో నాకే తెలియదు. ఓ పోలీస్ పెట్రోలింగ్ వాన్ వచ్చింది. ఎక్కడ్నించి వస్తున్నాం, ఇక్కడికి ఎలా వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం…. అడిగారు. అమ్మా, తమ్ముడికా ప్రమాదం ఎలా జరిగిందో చెప్పమని మళ్ళీ మళ్ళీ అడిగారు. వాళ్ళ ప్రశ్నలకి నాన్న జవాబులు ఇవ్వలేదు. బదులుగా వాళ్ళని ఒకటే ప్రశ్న అడిగాడు – “సోదరా… ఇక్కడి నుంచి లక్నో ఎంత దూరం?” అని. “అరగంట” అని ఓ పోలీసు అధికారి చెప్పారు. అప్పుడు నాన్న ఏడ్చాడు. బిగపెట్టుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా తన్నుకొచ్చింది. అమ్మ శవాన్ని దగ్గరకి తీసుకుని బిగ్గరగా ఏడ్చాడు. వాళ్ళు శవాలని తీసుకెళ్ళారు. మమ్మల్ని బండిలో ఎక్కించుకుని మా గమ్యం వద్ద దింపారు.

ఇదంతా గడిచి ఓ వారం అయింది. కానీ అసలేం జరగనట్టుగా ఉంది. అమ్మా, తమ్ముళ్ళ చావుకి నేనే కారణం అని నన్ను నేను నిందించుకున్నాను. అమ్మ పడిపోగానే మరింత వేగంగా వెళ్ళుంటే, తను పచ్చని కాటన్ చీరలో, చేతులకి ఎంతో ఇష్టపడి ఎప్పుడో చేయించుకున్న బంగారు గాజులతో, ఈ ఇంట్లో మాతో బాటూ తిరుగుతూ ఉండేదేమో! తమ్ముడు అటు ఇటూ తిరుగుతూ, మామిడిపళ్ళు తింటూ సందడి చేసేవాడేమో! మనుషులు ఎందుకు అంత త్వరగా అధ్యాయాలు ముగించుకుని మరోదానికి వెళ్ళిపోతారు? నేనింకా కలత లోనే ఉన్నాను. నా జీవితంలో ఈ అధ్యాయానికి ముగింపు ఇవ్వలేను. నానమ్మ ఇంటికి చేరిన ఆ రాత్రి నాన్న చెప్పిన మాటలు నాలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

ఆయన అన్నాడు – “యుద్ధమైనా, రోగమైనా, భూకంపమైనా, సునామీ అయినా, ఎప్పుడూ మనమే… పేదవాళ్ళం… ఎక్కువగా కోల్పోతాం. అందుకే నేనంటాను డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తుందని. నువ్వు తగినంత డబ్బు సంపాదించకపోతే, నీకేసి ఎవరూ చూడనుకూడా చూడరు. నీకసలు ఉనికే ఉండదు. పూలు సీతాకోకచిలుకలని ఎలా ఆకర్షిస్తాయో, డబ్బున్న వాళ్ళూ అంతే. వాళ్ళు పూల లాంటి వాళ్ళు! మరి సీతాకోక చిలుక? మనలాంటి వాళ్ళని ఊరించే సంతోషమే – ఆ సీతాకోకచిలుక” అని.

~

ఆంగ్ల మూలం: కస్తూరి మజుందార్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here