[మాయా ఏంజిలో రచించిన ‘Human Family’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(ప్రపంచంలోని ఏ దేశ ప్రజలైనా, మనుషులంతా ఒక్కటేనని, మానవతే మనందరి లక్ష్యం కావాలని ఉద్భోదించే కవిత!)
~
[dropcap]మా[/dropcap]నవ కుటుంబాల్లో
స్పష్టమైన వ్యత్యాసాలను నేను గమనించాను
మనలో కొందరు గంభీరంగా ఉంటే
మరికొందరు హాస్య చతురతతో ఉంటారు
కొందరు గాఢమైన సత్యవర్తనతో
తమ జీవితాలను గడుపుతున్నామని
ప్రకటిస్తారు
ఇంకొందరు తాము నిజంగా
సత్య వాస్తవికతతో జీవిస్తున్నామని
నొక్కి చెబుతుంటారు
గోధుమవన్నె, గులాబీరంగు, నేరేడుపండు రంగు
ఇసుక రంగు,నీలి, శ్వేత వర్ణాలు
వివిధాలైన మన శరీరఛ్చాయలు
గందర గోళానికి గురి చేస్తాయి
ఏమీ తోచనివ్వకుండా చేస్తాయి
ఆనందాన్నీ ఇస్తాయి
సప్తసముద్రాల నుంచీ పయనించాను
ప్రతి భూభాగం మీదా అడుగిడాను
ప్రపంచంలోని వింతలెన్నెన్నో చూసాను
కానీ..
ఒకే తీరున ఉన్న ఒక్క మనిషీ నాకు కనబడలేదు
జేన్, మేరీ జేన్.. ఒకే పేరున్న
ఓ పదివేల మంది స్త్రీలైనా నాకు తెలుసు
అయినా
నిజంగా ఒకేలా ఉన్న ఏ ఇద్దరు ఆడవాళ్ళనూ
నేను చూళ్ళేదు
అచ్చు గుద్దినట్టు ఒకే రూపురేఖలతో ఉండే
కవల పిల్లలు కూడా
విభిన్నంగా ఆలోచిస్తారు
పక్కపక్కనే నిదురించే ప్రేయసీ ప్రియుల
ఆలోచనల్లోను పూర్తి భేదాలుంటాయి
మనం చైనాలో ఓడిపోవడాన్ని ఇష్టపడతాము
ఇంగ్లండ్ వాళ్ళ పచ్చిక మైదానాల పైన ఏడుస్తాము
గినియాలో నవ్వుతాము, మూల్గుతాము
స్పానిష్ తీరాలలో వృద్ధి చెందుతాము
ఫిన్లాండ్‌లో విజయాన్ని కోరుకుంటాం
మైనే లో పుట్టి మరణిస్తాం
చిన్నపాటి అంశాల్లో మనం విభేదిస్తాం
ప్రధాన విషయాల్లో మాత్రం
మనమందరం ఒకటే
పలు రకాలైన మనుషుల మధ్య
స్పష్టమైన వ్యత్యాసాలెన్నింటినో
నేను గమనించాను
అయినప్పటికీ
మనమంతా సమానులమే
స్నేహితులారా..
మనమెంత భిన్నంగా ఉన్నప్పటికీ
మనమెన్ని తేడాలతో ఉన్నప్పటికీ
మనమంతా సమానులమే
తరతమ భేదాలెన్ని ఉన్నప్పటికీ
స్నేహితులారా
మనమంతా సమానులమే!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ