అతడిలో
మానవీయ మొక్కల్ని నాటుతూ పోవాలి
ఒకనాటి ఆకుపచ్చ హృదయాన్ని అంటుగట్టాలి
అతడి ఆవరణలన్నీ
సంభాషణల పరిమళాలతో విరబూయాలి
అతడి స్నేహ గుణాన్ని
కొమ్మల చేతులతో విస్తరింపజేయాలి
అతడి చుట్టూ
కిరణ జన్య సంయోగ తత్వం పరిభ్రమించాలి
తన ఎదుగుదల పరిసరాల శ్రేయస్సు కోసమని
ప్రేరణాత్మక ఎరువు జల్లుతుండాలి
జీవన మైదానం సారవంతం కావాలి
నదీమ తల్లిలా అతడు పేరు తెచ్చుకోవాలి
శ్రేయోభిలాషిగా తన నీడల్ని
నలుదిశలా వ్యాపింప జేయాలి
తన హరిత స్వప్నాలు నిజం కావాలి
అతడిని జనారణ్యం
దేవతా వృక్షంలా పూజించాలి
మానవుడే.. అతడు
మాననీయుడని కీర్తించబడాలి
ధరణిపై తన మహత్తు వేళ్ళూనుకోవాలి