Site icon Sanchika

మానవత్వం – మతతత్వం

[dropcap]“ఉ[/dropcap]మేశ్ బేటా! ఎలా ఉన్నావ్?”

“నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? హజ్ యాత్ర నుండి తిరిగి వచ్చారా?” నేను అడిగాను.

“ఔను, ఇవాళే ముంబై చేరాం. నీ చలవ వల్ల మా హజ్, ఉమ్రా యాత్ర బాగా జరిగింది. నీ కొరకు కూడా మేము ప్రార్థన చేశాం. జీతే రహో బేటా.” ఆబిద్ చాచా జవాబిచ్చాడు.

“శుక్రియా చాచాజాన్! మీ ఆశీర్వాదం వల్ల నాకు అహమ్మదాబాద్‌లో మంచి ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అక్కడే ఉన్నాను. నా కొరకు కూడా మీరు చేసిన ప్రార్థన ఫలించింది.”

“అలాగా? అది మరీ మంచిది. నువు ముంబాయిలో ఉన్నావేమో కలసి, మళ్లీ ధన్యవాదాలు చెప్పాలనుకున్నాము. పర్వాలేదు, ఇంకో రెండు రోజుల్లో మేమూ అహమ్మదాబాద్ వస్తాం. అప్పుడు కలుద్దాం. ఖుదా హాఫీజ్.”

“చాచీని అడిగానని చెప్పండి. ఖుదా హాఫీజ్ చాచాజాన్!” నేను ఫోన్ పెట్టేశాను.

మా సంభాషణ హిందీలో జరిగింది. నా కళ్లముందు దాదాపు మూణ్ణెల్ల నాటి దృశ్యాలు కదలాడసాగాయి.

అది అహమ్మదాబాద్ స్టేషన్. నేను గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో ఓ ఇంటర్వ్యూకి హాజరై తిరిగి ముంబయి వెళుతున్నాను. ఏ.సీ. కోచ్ లోని నా బెర్త్ కింద సామాను పెట్టి, ప్లాట్‌ఫాం పై నుంచున్నాను. అంతలో ఓ ముస్లిం ముసలి జంట, ఓ యువకుడు వచ్చారు.

“భాయ్ సాబ్! మీరు ఇదే కోచ్‌లో వెళుతున్నారా?” ఆ యువకుడు అడిగాడు.

“ఔను. ఏం?”

“ఏం లేదు. నా పేరు రహీం. మా అబ్బాజాన్ అమ్మీజాన్ కూడా ముంబయి వెళుతున్నారు. ప్రయాణంలో వారికి ఏదైనా సహాయం అవసరమైతే చేస్తారని.”

“మీరు రావడం లేదా” నేనడిగాను.

“లేదు. నేనికిక్కడ మా షాప్ చూసుకోవాలి. అందుకనే మిమ్మల్ని వారిని కాస్త చూస్తుండమని కోరుతున్నాను.”

నేను ‘సరే’ నన్నాను. రైల్లో..

“నా పేరు ఆబిద్. నీ పేరేంటి బేటా? ముంబయి ఏదైనా పనిమీద వెళుతున్నావా?”

“లేదంకుల్. మేముండేది ముంబయిలోనే. ఓ ఇంటర్వ్యూ కని ఇక్కడికి వచ్చాను. నా పేరు ఉమేశ్.”

“ఇంటర్వ్యూ బాగా జరిగిందా బేటా?

“చాలా బాగా జరిగింది చాచా. ఇక అదృష్టం ఎలా ఉందో చూడాలి.”

“నువ్వేం ఫికర్ చేయకు ఉమేశ్. ఆ ఉద్యోగం నీకు తప్పక దొరుకుతుంది. ఇంతకూ నువ్వేం చదివావ్? ఏ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నావ్? ఇలా చనువు తీసుకుంటున్నానని ఏమనుకోవద్దు. నీ కిష్టమైతేనే చెప్పు.” ఆబిద్ చాచా మాటల్లో ఎంతో ఆప్యాయత.

“ఇందులో చెప్పక పోవడానికేముంది? సాటి ప్రయాణీకులం. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. అలా తెలుసుకుంటే దగ్గరితనం పెరుగుతుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. నేను యం. ఫాం. చేశాను. ఫలానా కంపెనీలో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్‌కి ఇంటర్వ్యూ కొచ్చాను.”

“ప్రస్తుతం ఏం చేస్తున్నావ్?” ఆబిద్ చాచాలో అదే ఆప్యాయతతో కూడిన కుతూహలం.

“ముంబయిలోనే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్నాను. అది అంత తృప్తిగా లేదు. ఇక్కడి కంపెనీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. వారి ఉత్పత్తిలో సింహభాగం విదేశాలకు ఎగుమతి చేస్తారు. వారి అధునాతన రీసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ విభాగంలో అనునిత్యం పరిశోధనలు చేస్తూ ఎన్నో కొత్త కొత్త మందులు తయారు చేస్తారు. అందుకే సొంత ఇంటికి దూరమైనా ఇక్కడి అనుభవం, మున్ముందు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వసతులు, పే ప్యాకేజీ కూడా ఆకర్శణీయంగా ఉన్నాయి.” కాస్త వివరంగానే చెప్పాను.

“చాలా సంతోషం నాయనా! అల్లా నీకు తప్పకుండా మేలు చేస్తాడు. ఇక మా విషయానికి వస్తే, మాకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. ఇందాక స్టేషన్‌కి వచ్చాడే వాడు. కూతుళ్లు వాడికంటే పెద్ద వాళ్లు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. కాని మా పెద్ద కూతురు భర్త జులాయి. డబ్బుకొరకు మా కూతుర్ని, మమ్మల్ని సతాయించేవాడు. ఇంకో ధనవంతుని కూతుర్ని వలలో వేసుకుని, మా అమ్మాయికి ‘తలాక్’ ‘తలాక్’ ‘తలాక్’ అని మూడు సార్లు చెప్పి ఇంట్లోనించి గెంటి వేశాడు. అప్పటినుంచి ఆమె మా దగ్గరే ఉంది. రహీంకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అందరూ స్కూల్, కాలేజీల్లో చదువుతున్నారు. మాకు ఇక్కడి మాణేక్ చౌక్ ప్రాంతంలో అత్తరు షాపుంది. పొట్టకు బట్టకు ఢోకా లేదు. మా పూర్వీకుల ఇల్లు ఎలాగూ ఉంది. బాధ్యతలన్నీ తీరాక, మేమిద్దరం హజ్ యాత్రకని బయలుదేరాం. అటే ఉమ్రా యాత్ర కూడా ముగించుకుని మూణ్ణెల్ల తర్వాత తిరిగి రావాలని ప్లాన్. ఇంతకీ మీరు మరాఠీ వాళ్లా?” ఆబిద్ చాచా క్లుప్తంగా తమ వివరాలు చెప్పి, నన్నడిగాడు.

“మేము తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు వాళ్లం. డెబ్భై ఏళ్ల క్రితం మా తాతగారు ఉపాధి వేటలో ముంబయి వచ్చారు. మొదట భవన నిర్మాణ కూలీగా చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ చిన్న గుత్తేదారు స్థాయికి చేరుకున్నారు. మా నాన్న, మేమంతా ముంబయిలోనే పుట్టి పెరిగాము. అక్కడే స్థిరపడ్డాము. మాలాడ్‌లో మాకు ఓ రెండు పడక గదుల ఫ్లాట్ ఉంది. నాకింకా పెళ్లి కాలేదు.” నేనూ మా కుటుంబ వివరాలు చెప్పాను.

“మేరెంతమంది అన్నదమ్ములు? మీ నాన్న గారేం చేస్తారు?”

“నాకు ఇద్దరు చెళ్లెళ్ళు. వారు కాలేజీలో చదువుతున్నారు. నాన్నగారు ఓ జాతీయ బ్యాంకులో మ్యానేజర్.”

అంతలో ‘నడియాద్’ స్టేషన్ వచ్చింది. వారిద్దరు భోజన సన్నాహాలు చేయసాగారు. నేనేమైనా టిఫిన్ ఆర్డర్ చేయాలనుకున్నాను.

“బేటా! ఇంద ఈ ప్లేట్ తీసుకుని మా బిర్యానీ తిను” ఓ పేపర్ ప్లేట్ ఇవ్వబోయింది చాచీ.

“ఒద్దొద్దు. నేనేమౖనా ఆర్డర్ చేస్తాను.” అని మొహమాట పడ్డాను. నేనేమో పక్కా శాకాహారిని. ముస్లింలు సాధారణంగా మాంసాహారం తింటారని నాలో సంకోచం.

“పర్వాలేదు బేటా! మా కోడలు పెద్ద క్యారియర్లో బిర్యానీ ఇచ్చింది. ఈ వయసులో మేమెంత తింటాం? ప్రేమతో ఇస్తున్నపుడు కాదనకు బేటా.” చాచీలో కూడా ఆత్మీయత.

“అది మాంసాహారమేమో?” సంకోచం పక్కన పెట్టి నిర్మొహమాటంగా అడిగాను.

“ఇంట్లో మేము మాంసాహారం తిన్నా, ఇలా ప్రయాణంలో మాత్రం వెజిటెబిల్ బిర్యానీయే తీసుకొస్తాం. తోటి ప్రయాణీకుల ఎదుట బొమికెలు అవీ చప్పరించడం ఎబ్బెట్టుగా ఉంటుంది.” చాచా వివరించాడు.

“సరే. కొంచెమే ఇవ్వండి. సాయంత్రం హోటల్లో టిఫిన్ చేశాను. అందుకే ఇక్కడ మీల్స్ కాకుండా ఏదైనా టిఫిన్ చేద్దామనుకున్నాను.”

“మా కోడలు చేసిన అమ్దావాదీ బిర్యానీ రుచి చూడు. మీ హైద్రాబాదీ బిర్యానీని మరిచి పోతావు.” చాచీ ఊరించింది.

“నిజంగా మా హైద్రాబాదీ బిర్యానీ కంటే రుచిగా ఉంది. ఇంత టేస్టీ బిర్యానీ ఎప్పుడూ తినలేదు. శుక్రియా చాచీజీ”

ఆ తర్వాత పడుకోవడానికి ఉపక్రమించాము.

తెల్లవారు జాము నా మొబైల్ అలారం లేవమంది. ఆవలిస్తూ లేచి చూస్తే నా సహ ప్రయాణీకులు కొందరు దిగడానికి సన్నాహాలు చేస్తూ కనిపించారు. ఆబిద్ చాచా, చాచీ అప్పటికే లేచి ఫ్రెష్ అయినట్టున్నారు.

“ఏ స్టేషన్ రాబోతుంది?” నా ఎదుటి బెర్త్ శాల్తీని అడిగాను.

“బోరీవలి” జవాబిచ్చాడతను.

“నువ్వెక్కడ దిగుతావు బేటా” ఆబిద్ చాచా అడిగాడు.

“నేను కూడా బోరీవలిలోనే దిగాలి, కాని హజ్ యాత్రకు వెళుతున్న మిమ్మల్ని ‘హజ్ హౌస్’ లో దింపి వీడ్కోలు పలకడానికి ముంబయ్ సెంట్రల్ దాకా వస్తాను.”

“నీకెందుకు శ్రమ ఉమేశ్? మేమెలాగైనా వెళతాము. నీ కొరకు మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారేమో?”

“ఏముంది? మా ఇంటికి ఓ మూడు గంటలు ఆలస్యంగా వెళతాను అంతే గదా? నాకెంతో ఆప్యాయత పంచిన మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేస్తే నాకు తృప్తిగా ఉండదు. ఆలస్యంగా ఇంటికి వస్తానని మా వాళ్లకప్పుడే ఫోన్ చేసి చెప్పాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి.” నేను భరోసా ఇచ్చాను. బోరీవలిలో దాదాపు అరవై శాతం కోచ్ ఖాళీ అయింది. ఇంకో ఇరవై శాతం మంది దాదర్‌లో దిగుతారు. ఆ తర్వాత మేము దిగాల్సిన ముంబయ్ సెంట్రల్ స్టేషన్.

చూస్తుండగానే ముంబయ్ సెంట్రల్ స్టేషన్ రానే వచ్చింది. నడుస్తున్న రైళ్లోకి ఎక్కిన కూలీతో మాట్లాడి రైలు ఆగగానే సామానుతో పాటు మేము ప్లాట్‌ఫాం పై దిగాము. కూలీతో బేరమాడి బ్రిడ్జ్ పైకి చేరాం. అక్కడున్న ఓ టక్సీలో హజ్ హౌస్ వైపుకు బయలు దేరాం.

“మీ ఇల్లు ఇక్కడినుండి ఎంత దూరం ఉమేశ్?” చాచీ అడిగింది.

“దాదాపు నలభై కిలోమీటర్లు.”

“మమ్మల్ని దింపి నువ్వు అంత దూరం పోవాలా? మా కొరకు చాలా శ్రమ తీసుకుంటున్నావు బేటా. రైల్లో మాత్రం పరిచయమైన మాకు ఇంత సహాయం చేస్తున్న నీకు ఏమిచ్చినా మా ఋణం తీరదు. నీ కొరకు కూడా మేము ప్రార్థిస్తాము. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు. జీతే రహో బేటా.“ ఆబిద్ చాచా ఆశీర్వదించాడు. అంతలో హజ్ హౌస్ వచ్చింది. ఆబిద్ చాచాని, చాచీని అక్కడి రిసెప్షన్‌లో అప్పగించి, నేను చర్చ్ గేట్ స్టేషన్ వైపు అడుగులు వేసాను. అక్కడ సబర్బన్ రైలెక్కి, మాలాడ్ స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి ఆటోలో మా ఇంటికి వెళ్లాను.

రెండు రోజుల తర్వాత సౌదీకి విమానం ఎక్కేముందు నాకు ఫోన్ చేసి మళ్లీ ధన్యవాదాలు చెప్పాడు ఆబిద్ చాచా.

***

మూణ్ణాల్ల తర్వాత ఆ ఫోన్. నాకు చాలా ఆనందమైంది. ప్రయాణాల్లో ఎంతో మంది కలుస్తారు. అటుపై వారెక్కడో మనమెక్కడో. ఆబిద్ చాచా మాత్రం అందుకు మినహాయింపు. పరాయి రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న నాకు, ఆత్మీయులకు దగ్గరైనంత అనుభూతి కలిగింది.

ఓ రోజు మా కంపెనీ క్యాంటీన్‌లో భోంచేస్తున్నప్పుడు ఫోన్ మోగింది. నంబరు చూస్తే ఆబిద్ చాచా!

“హలో సలామాలేకూం చాచా!”

“జీతే రహో బేటా! మేము అహమ్మదాబాద్ చేరాం. వచ్చే ఆదివారం నువు మా ఇంటికి భోజనానికి వస్తున్నావ్. అడ్రస్ మెసేజ్ పెడుతున్నాను. ప్రొద్దున పదకొండు గంటలకు వచ్చేయ్.“

“భోజనానికి కాదు కానీ మిమ్మల్ని కలవడానికి ఆ రోజు సాయంత్రం వస్తాను.” నేను మొహమాట పడ్డాను.

“లేదు ఉమేశ్! సెలవు రోజున ఏదో ఓ హోటల్లో తినే బదులు, మా ఆతిథ్యం స్వేకరించి, ఇంటి భోజనాన్ని ఆస్వాదించు. నువు వస్తున్నావ్. అంతే. ఇంక ఏం మాట్లాడొద్దు” అని ఫోన్ పెట్టేశాడు.

ఆబిద్ చాచా చెప్పినట్టు ఆ ఆదివారం, ఓ మిఠాయి పొట్లాం తీసుకుని వారి ఇంటికి చేరుకున్నాను. ఇంటిల్లిపాదీ గుమ్మం లోపల నుంచుని నమస్కారం చేస్తూ నాకు స్వాగతం చెప్పిన విధానంతో నా మనసు పులకించింది. ఎంతో దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లిన అనుభూతి కల్గింది. వెళ్ళగానే గుజరాత్‌లో ఉన్న ఆనవాయితీ ప్రకారం చల్లని మంచి నీళ్లిచ్చారు. భోజనానికి ఇంకా ఓ గంట ఉండడంతో, ఆ తర్వాత కేవలం పాలతో చేసిన చిక్కటి అల్లం టీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్లోని వారిని పేరుపేరునా పరిచయం చేస్తూ నా గురించి గొప్పగా చెప్పారు. భోజనం చేయకుండానే నా కడుపు నిండిపోయింది. ఆ తర్వాత ఆబిద్ చాచా చాచీల యాత్రా విశేషాలు చెప్పారు. వంటయేలోగా పిచ్చాపాటీలో పడ్దాము.

“మీరు మొదటినుంచీ అహమ్మదాబాద్‌లో ఉంటున్నారా?” కాలక్షేపానికి నేను ఓ ప్రశ్న సంధించాను.

“ఔను ఉమేశ్! ఇక్కడ మాది మూడో తరం. మా అబ్బాయిది నాలుగో తరం. మా పూర్వీకులు అప్పటి బొంబాయి రాష్ట్రంలోని భరుచ్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. మేము ఇక్కడే పుట్టి, పెరిగి ఇక్కడే స్థిరపడ్డాము. జీవితం సాఫీగానే నడుస్తోంది. మా అత్తరు దుకాణం కూడా గిట్టుబాటుగా ఉంది. మా అబ్బాయి అత్తరు తయారీ పరిశ్రమ నెలకొల్పాలనే ఆలోచనలో ఉన్నాడు. మా మనవడి డిగ్రీ పూర్తికాగానే, తండ్రీ కొడుకులు ఆ పనిలో పడతారు.” చాచా వివరించాడు.

అంతలో వంటైందని భోజనానికి రమ్మంది రహీంభాయ్ భార్య, షాహిదా బానో.

పొరలుపొరలుగా మెత్తని చపాతీలు, రుచికరమైన పనీర్ మసాలా, మష్రూం టిక్కా, బెండకాయ వేపుడు, పప్పుచారు, నంజుకోవడానికి పెసర బజ్జీలు, అప్పడాలు, ఫ్రైడ్ రైస్, అవి చూస్తేనే మనసు నిండిపోయింది. ఎప్పటికన్నా కాస్త ఎక్కువే తిన్నాను. రెండు నెలల తర్వాత ఇంటి విందు భోజనం చేసిన అనుభూతి కల్గింది. ఓ గంటసేపు విశ్రమించి భుక్తాయసం తీర్చుకున్నాను. సాయంత్రం అల్లం చాయ్ తాగి నా గదికి బయల్దేరాను.

***

మర్నాటి నుండి షరా మామూలే డ్యూటీలో పడిపోయాను. ఓ మూడు వారాల తర్వాత రహీంభాయ్ ఫోన్. ఆ మరుసటి ఆదివారం భోజనానికి రమ్మని పిలుపు. నేను మొహమాట పడ్డాను. అతను పట్టు పట్టాడు. నాకూ ఆ రుచులు ఆస్వాదించాలని తహతహగా ఉండడంతో మొదట బెట్టు చేసినా, చివరకు సరేనన్నాను.

నేను తీసుకెళ్లిన మిఠాయి, మిక్స్చర్ పొట్లాలు రహీంభాయ్ పిల్లలకిచ్చి మాటల్లో పడ్డాము. ఆ పాటికే కొంచెం సాన్నిహిత్యం పెరగడంవల్ల, నాలో బెరుకుతనం తగ్గింది. నేను చర్చ మొదలుపెట్టాను. “మీరిక్కడ అంతా బాగానే ఉందంటున్నారు కదా? మరి ఆ మధ్య మతపరమైన అల్లర్లు జరిగాయని విన్నాను. అది ఎంత వరకు నిజం?”

“అది కొంత మట్టుకే నిజం. అవి రాజకీయ అల్లర్లు. దానికి మతపు రంగు పులిమారు. విదేశీయుల ఆధిపత్యంలో ఉన్న మీడియా, గోరంత ఉన్నదాన్ని కొండంతలుగా చేసి బయటి వారికి తెలిపింది. నష్టం ఇరువైపులా జరిగింది, కాని మా మతస్తులకు జరిగిన నష్టాన్ని హైలైట్ చేసి మా వారిని రెచ్చగొట్టారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి, గుజరాత్ అభివృద్ధి అడ్డుకోవడానికి చేసిన కుట్ర అది. కాని మా ముఖ్యమంత్రి వాటికి ధీటైన జవాబు చెప్పి తొందరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఐనా కొన్ని స్వార్థ శక్తులు అయనపై బురదజల్లి, పదవీచ్యుతుని చేయాలని ప్రయత్నించాయి. వారి పప్పులు ఉడకలేదు. అదే ముఖ్యమంత్రి, గుజరాత్ బండిని మళ్ళీ పట్టాలపైకి తీసుకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ అల్లర్లకు తావీయకుండా పరిపాలన చేస్తున్నాడు. మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము.” ఆబిద్ చాచా నిస్పక్షపాతంగా నిజ స్థితిని వివరించాడు. అది విని నాకు ఒకింత ఆశ్చర్యం కలిగింది. ఔరా! మీడియా? ఎంత దుశ్చర్యకు పాల్పడింది?

“ఆ అల్లర్లకు మూలం ముస్లిములు, సాబర్మతీ ఎక్స్‌ప్రెస్ లోని ఓ కోచ్‌కు నిప్పంటించి ఎంతో మంది హిందువులను సజీవ దహనం చేయడామేనని కూడా విన్నాను.” నేను మరో విషయం కదిపాను.

“అది నూటికి నూరు పాళ్లు నిజం ఉమేశ్! ఆ విషయం సహజంగానే హిందువులను కదిలించింది. కొందరు రాజకీయ నాయకులు దాన్ని సాకుగా తీసుకుని, రెండు మతాల వారి మధ్య కలహాలు సృష్టించి కల్లోల సాగరంలో చేపల వేటకు పూనుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా దానికి ఆజ్యం పొసింది. ప్రభుత్వ వాహనాలు, ఆస్తులు తగలబెట్టబడ్దాయి. అంత వరకు ఎంతో సఖ్యంగా ఉన్న ఇరు మతాలవారు బద్ధ శత్రువులై పోయారు. వారిలో వారు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, నరుక్కున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ప్రజల్లోని విచక్షణని మేల్కొల్పింది. ప్రజలు కూడా అర్థం చేసుకుని విద్రోహ చర్యలకు చరమ గీతం పాడారు.” ఆబిద్ చాచా తన ఉర్దూ పదాలతో వాస్తవాన్ని కళ్లకు కట్టాడు.

“ఎట్టకేలకు కథ సుఖాంతమైనందుకు సంతోషం” నేను హర్షం వెలిబుచ్చాను. అంతలో భోజనానికి పిలుపు.

ఎప్పటిలా వారి వంటలను మెచ్చుకుంటూ సుష్టుగా భోంచేశాను. భుక్తాయసం తీర్చుకుని నా గూటికి బయలుదేరాను.

***

మరో నెల తర్వాత వారి ఫోనొస్తే, శని, ఆదివారాలతో పాటు రెండు సెలవులు కలిసొస్తే మా ఇంటికి ముంబయి వెళ్తున్నానని చెప్పాను. నా ప్రయాణ వివరాలడిగితే చెప్పాను. నేను బయల్దేరే రోజు అహమ్మదాబాద్ స్టేషన్లో రహీంభాయ్ ఓ మిఠాయి డబ్బాతో ప్రత్యక్షం. అతని ఆప్యాయతకు నా కళ్లు చెమర్చాయి. ‘ఈ నాటి ఈ బంధమేనాటిదో’ అని మనసులో పాడుకుని అతన్ని గట్టిగా హత్తుకున్నాను. రహీంభాయ్ రైలు కదిలేదాకా ఉండి నాకు వీడ్కోలు పలికాడు.

ఓ వారం రోజుల తర్వాతి ఆదివారం సాయంత్రం, మా అమ్మ చేసిన చేగోడీలు, కజ్జికాయలు, తీసుకుని ఆబిద్ చాచా వాళ్లింటికి చేరాను. నేను తీసుకెళ్లినవి ఇచ్చాను. వారు ఆశ్చర్యపోయారు. “ఫోన్ చెసి వస్తే బావుండేది” చాచీ గారన్నారు.

“ఫోన్ చేస్తే ఏవో స్పెషల్సని హడవుడి చేస్తారు, అందుకని ఈసారి భోజనానికి కాకుండా మిమ్మల్ని కలవాలని వచ్చాను.”

“మేము నిన్ను మా కుటుంబ సభ్యునిగా భావిస్తే నువు మమ్మల్ని పరాయివాళ్లుగా చూస్తున్నావ్. ఇదేం బాగా లేదు బేటా!”

“అది గాదు చాచా! నేనిక్కడ ఒంటిగా ఉండడంతో మీరు పిలిచినప్పుడల్లా భోజనానికి వస్తున్నాను. నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని భోజనానికి పిలువలేకుండా ఉన్నాను. అందుకే నాకు కాస్త మొహమాటంగా ఉంది.” నేను నా స్థితి వివరించాను.

“అలా ఎప్పటికీ అనుకోవద్దు. మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యునిగా భావిస్తున్నాము. ఎందుకో మీరంటే మాకు చాలా ఇష్టం ఏర్పడింది. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం. మీరక్కడ ఉన్నప్పుడు మేము ముంబయి వస్తే మీ ఇంట్లోనే దిగుతాము. అప్పుడు మీరు మాకు ఆతిథ్యమిద్దురుగాని. మీరిక్కడ ఉన్నన్ని రోజులు మేము పిలిచినా పిలవకున్నా కనీసం నెలకొక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. ఇప్పుడెలాగూ వచ్చారు కాబట్టి రాత్రి భోజనం ఇక్కడే చేసి వెళ్లండి” రహీంభాయ్ ప్రతిపాదించాడు. షాహిదాబానో కూడా మరీమరీ కోరుతూ..

“ఒక గంటలో వంట చేస్తాను. స్పెషల్స్ కాకుండా సాదా వంట చేస్తాను. మీరు మాత్రం భోంచేసే వెళ్లండి భాయి సాబ్” చేతులు జోడించింది. నాకు, ఔననక తప్పలేదు.

అంతవరకు టైం పాసుగా, ముస్లిముల వెనకబాటుతనానికి గల కారణాలపై చర్చకు ఉపక్రమించాను.

“ఔను ఆబిద్ చాచా! స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, మీకు ప్రభుత్వం ఎన్నో రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు పరిచినా మీ వారిలో ఇంకా ఎంతో బీదరికం ఎందుకున్నట్టు?”

“మీకేం చెప్పాలి ఉమేశ్ భాయ్! కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అధిక సంతానం, ఒకరుకంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం, వారిని పోషించడానికి తగిన ఆదాయం లేకపోవడంతో, మా వాళ్లు బీదరికంలో మగ్గుతున్నారు. ఆ కారణంగానే పిల్లలను పై చదువులకు పంపలేకపోతున్నారు. అది నిరుద్యోగానికి దారి తీస్తుంది. పిల్లలు ఆకతాయిగా తిరుగుతూ పెడదారి పడుతున్నారు. దానికి తోడు మా మత పెద్దలు తమ ఛాందస భావాలతో యువత మనసును కలుషితం చేస్తున్నారు. మా రాజకీయ నాయకులు కూడా మా పేరిట రాయితీలు పొంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీదవారికి అందనీయకుండా తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. మా వారిని వోటు బ్యాంకుగా పరిగణిస్తూ ఓ రొట్టెముక్క మాత్రం మాకు విదిలించి, చేతులు దులుపుకుంటున్నారు.” రహీంభాయ్ తన అక్కసు వెళ్లగక్కాడు.

“మీ హైద్రాబాద్‌నే తీసుకో, అక్కడ మా మతస్తుల గుత్తాధిపత్యం తీసుకున్న ఓ కుటుంబం మా అండ చూసుకుని కొన్నివేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంది. ముందు వారి తండ్రి పార్లమెంటుకు, పెద్ద కొడుకు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైతే, తండ్రి మరణం తర్వాత పెద్ద కొడుకు పార్లమెంటుకు, చిన్న కొడుకు అసెంబ్లీకి ఎన్నికవుతూ అధికారం చలాయిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలనుండి వారు పదవిలో ఉన్నా అక్కడి బీదవారి బాగోగులకై చేసిందేమీ లేదు. మా వాళ్లు చదువుకొని పైకి వస్తే వారి ఆధిపత్యానికి గండి పడుతుందని వారిని అదే బీదరికంలో మగ్గనిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప, మాకై, వారు సొంతంగా చేసిందేంమీ లేదు. వారు నెలకొల్పిన మైనారిటీ విద్యా సంస్థల్లో, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ధనికులనుండి లక్షలకు లక్షలు అనధికార విరాళాలు తీసుకుంటూ వారి పిల్లలకే ప్రవేశం కల్పిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలనుండి శాసన సభలకి ఎన్నికవుతూ వస్తున్న వారు తలచుకుంటే, అక్కడి బీద ముస్లిమ్‌ల జీవనస్థాయి ఎంతో మెరుగయ్యేది. ఇక్కడి మా ముస్లిమ్ నాయకుల పద్ధతి కూడా వేరుగా లేదు. వారూ మా మద్దతును అడ్డం పెట్టుకుని తమ ఆస్తులు పెంచుకుంటున్నారు” ఆబిద్ చాచా వాపోయాడు.

“మా హైద్రాబాద్ పరిస్థితిని నా కంటే బాగా విశ్లేషించారు. అవన్నీ మీకెలా తెలుసు చాచా?”

“మాది చాలా దగ్గరగా ఉన్న సమూహం. మా మతం వారు ఎక్కడున్నా, వారి గురించి మేము తెలుసుకుంటాం. మా పరిధిలో మేము ఏంతో కొంత సమాజ సేవ చేస్తుంటాం. మా నాయకులకు సలహాలు ఇస్తుంటాం, కాని వారు మమ్మల్ని పట్టించుకోరు. వారి తొత్తులు చెప్పిందే నమ్మి ఆ ప్రకారం నడుచుకుంటారు. అదే మా బాధ.“

“మీ వాళ్లలో కూడా ఇప్పుడు చాలా మంది పై చదువులకు వెళుతున్నారు. మంచి ఉద్యోగాల్లో చేరుతున్నారు. మా కంపెనీలో కూడా కొందరు మీ మతస్తులు పెద్ద హోదాల్లో ఉన్నారు.

“వారు చాలా మట్టుకు ధనికుల పిల్లలు. విరాళాలు పోసి పై చదువులకు వెళ్లిన వారు. శాసనాధికారం లేని హోదాకు విలువ లేదు. పై హోదాల్లో ఉన్న మా వారు, వారి కుటుంబాల ఉన్నతిపై దృష్టి పెడతారు తప్ప, అట్టడుగు వారికి చేయూత ఇద్దామనుకోరు. మా వారిలో ఉన్న మతతత్వం కూడా మా వెనుకబాటుతనానికి కారణం. మా మత పెద్దలు తమ ప్రవచనాలతో సామాన్య ప్రజలను రెచ్చగొట్టి, వారిని ఛాందసులుగా మారుస్తున్నారు. కొందరైతే ఈ దేశపు ఉప్పు తింటూ పొరుగు దేశానికి మద్దతు పలుకుతున్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ మన దేశ అభివృద్ధికి గండి కొడుతున్నారు. నన్నడిగితే మానవత్వానికి మించిన మతం లేదంటాను. నా మాట వినేదెవరు? ఎక్కువ నిలదీస్తే నన్ను కూడా ‘కాఫిర్’ గా పరిగణిస్తారు. కొన్ని ముస్లిముల సంప్రదాయాలను సల్మాన్ రష్డీ, తస్లిమా నస్రీన్‌లు విమర్శిస్తే వారి విరుద్ధంగా ఫత్వా జారీ చేసి వెలివేశారు.” చాచా తన నిస్సహాయతను వ్యక్త పరిచాడు.

“ఔను చాచా! స్మగ్లర్లు, డ్రగ్ డీలర్లు, దొంగనోట్ల పంపిణీదారుల్లో చాలా మట్టుకు మీ మతస్తులే ఉన్నట్టు వింటాము. అదెందుకంటారు?” వారి నుండే నిజానిజాలు తెలుసుకోవాలని నా తాపత్రయం.

“నేననేది అదే బేటా! మా రాజకీయ నాయకులు, మత పెద్దలు, తమ స్వార్థ ప్రయోజనాలకోసం యువతను పెడతోవ పట్టిస్తున్నారు. మన దేశ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ వారిలో మా మతానికి చెందిన ఇతర దేశాలపై సానుభూతి కల్పిస్తున్నారు. ఇక్కడ అరాజకాలు సృష్టించి మన దేశ సంపదను నష్టం చేస్తున్నారు. దానితో పాటు వారు నిర్మాణాత్మక పనులు చేయకుండా తమ ప్రగతికి వారే నిరోధాకంగా ఉన్నారు.” చాచా అసలు పరిస్థితిని వివరించాడు.

ఆబిద్ చాచా వాళ్ల సూటిదనం, నిస్పక్షపాత వైఖరి, నన్నాకట్టుకుంది. షాహిదాబేన్ పిలుపు రావడంతో భోజనానికి లేచాము.

అహమ్మదాబాద్‌లో ఉన్న రెండు సంవత్సరాల్లో నేను ఎన్నోసార్లు వారి ఆతిథ్యం స్వీకరించాను. ఎన్నో విషయాలపై ఆరోగ్యకర చర్చ చేశాము. ఓ సారి ముంబయి అల్లర్లపై నా నుండి వివరాలు అడిగారు.

“బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకార చర్యగా, పొరుగు దేశంలో ఉన్న ముంబయి డాన్ ప్రమేయంతో ముంబయిలో ఒక్కరోజే పలుచోట్ల బాంబు పేళుల్లు జరిగాయి. కొన్ని వందలమంది ప్రాణాలు గాలిలో కలిశాయి. వేలమంది క్షతగాత్రులయ్యారు. ఎన్నో వేల కోట్ల, ఆస్తి నష్టం జరిగింది. అది జరిగిన కొద్ది సేపట్లోనే పేళుల్లను అమలుపరిచిన ఓ ముస్లిం ధనిక కుటుంబం వేరే దేశానికి తరలి పోయింది. దానికి ప్రత్యుత్తరంగా రెండు మతాల ప్రజల మధ్య చిచ్చు రేగింది.

మతాధిపతులు రెచ్చగొట్టడంతో, అసాంఘిక శక్తులు చెలరేగిపోయాయి. రాజకీయ నాయకులు ఆజ్యం పోశారు. దాంతో ముంబయి అంతటా మతకలహాలు పాకిపోయాయి. ప్రజలు విచక్షణ కోల్పోయి ఒకరినొకరు నరుక్కున్నారు. ఒక మతం వారెక్కువగా ఉన్న ప్రాంతాల్లో అల్ప సంఖ్యాకులుగా ఉన్న ఇతర మతం వారిని వారి ఇళ్లకు వేళ్లి మరీ ఊచకోత కోశారు. అప్పుడు మాకు ఆప్తులైన ఓ ముస్లిం కుటుంబానికి మేము మా ఇంట్లో ఆసరా ఇచ్చాము. మీ లాగే మా ఇంటిల్లపాదీ మతంవైపు కాక మానవత్వం వైపు మొగ్గు చూపుతాం. స్వార్థ విద్రోహ శక్తుల చర్యలకు ఇరు మతాల ప్రజలు బలౌతున్నారు.” నేను ఆ అల్లర్ల వైనానికి ప్రత్యక్ష సాక్షిగా అసలు పరిస్థితి వివరించాను.

“ఔను ఉమేశ్ భాయ్! ఇక్కడ కూడా మాఫియా మూకల వల్లే అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో, మాకు తెలిసిన ఎందరినో, హిందూ కుటుంబాలు కాపాడాయి. అలాగే తక్కువ సంఖ్యలో హిందువులున్న ప్రాంతాల్లో, ఎక్కువ శాతం ఉన్న మావాళ్లు, వారిని అల్లరిమూకల నుండి కాపాడారు. అన్ని మతాలకు చెందిన సామాన్య ప్రజలు సఖ్యంగా, ప్రశాంతంగా సహజీవనం చేయాలనుకుంటారు. ఐతే కొందరు శాడిస్టులు, స్వార్థపరులు అరాజకాలు సృష్టించి శాంతికి భంగం కలిగిస్తారు. తమ వైఖరితో ఇతరులను ఏడిపించి పైశాచికానందం పొందుతారు. మత ఛాందసులు ప్రజల్లో ఉద్రేకాలు సృష్టించి తమ పబ్బం గడుపుకుంటారు. ప్రజల పురోభివృద్ధి వారికి కన్నుకుడుతుంది.” రహీం భాయ్ సూటిగా వాస్తవ పరిస్థితి వివరించాడు.

“మీరన్నది నిజమే. ఛాందసులు ఇరు వర్గాల్లో ఉన్నారు. వారి స్వార్థపూరిత ఆగడాలకు సామాన్య జనానీకం బలౌతోంది. విద్యా వ్యాప్తితో జనాల్లో చైతన్యం పెరిగి, విచక్షణా జ్ఞానం పెంపొందుతుంది. అప్పుడు స్వార్థ పరుల ఆట కడుతుంది.” నా స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చాను.

రెండు సంవత్సరాల నా అహమ్మదాబాద్ వాస్తవ్యం తర్వాత, నాకు ముంబయిలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో మెరుగైన హోదాలో, ఎక్కువ పే ప్యాకేజీతో ఉద్యోగం దొరికింది. నాకు వీడ్కోలు పలుకడానికి ఆబిద్ చాచీ, చాచా, రహీంభాయ్, షాహిదాబానో ఎయిర్ పోర్టుకు వచ్చారు. మెడలో ఓ పెద్ద పూలమాల వేశారు. ఇంట్లో చేసిన తినుబండారాలు ఇచ్చారు.

“ఉమేశ్ బేటా! నువు వెళుతుంటే మా సొంత కుటుంబ సభ్యుడు మా నుండి దూరమౌతున్నట్టుగా ఉంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. మేమూ ఫోన్ చేస్తాం. నీ పెళ్లికి మమ్మల్ని తప్పకుండా పిలువు. మేము తప్పక వస్తాం. నీ మంచితనంతో మా మనసులు గెలిచావు. ఇలాగే మానవత్వంతో సాగిపో. అల్లా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు.” ఆబిద్ చాచా కళ్లల్లో చెమ్మ. వారి కాళ్లకు మొక్కిన నన్ను “చల్లగా ఉండు బేటా” అని దీవించారు. అందరి కళ్లల్లో నీళ్లు. నా కళ్లూ చెమర్చాయి. భారమైన హృదయంతో నేను వారికి నమస్కరించి, బోర్డింగ్ పాస్ కౌంటరువైపు అడుగులు వేశాను. నేను కనుమరుగయ్యేదాకా వారు చేతులు ఊపుతూనే ఉన్నారు.

Exit mobile version