మానవత్వమా జోహార్లు!

0
1

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘మానవత్వమా జోహార్లు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సిం[/dropcap]హాచలం ఆఫీస్‌లో అడుగుపెట్టేసరికి సమయం ఉదయం తొమ్మిదిన్నర అవుతుంది.

బాస్ రామానుజం గారు క్యాబిన్‌లో కోపంగా ఉన్నట్లు కొలీగ్స్ యొక్క సైగల ద్వారా అర్థమయింది.

“ఏంటయ్యా సింహాచలం! మీ అందరికీ ఏం చెప్పాను? పది గంటలకి ఆడిట్ ఉంది, త్వరగా రమ్మని చెప్పానా? ఆలస్యంగా రావడం అడ్డమైన సాకులు చెప్పడం. నువ్వు డ్యూటీలో చేరి నెలే కదా అయింది. గతంలో ఆఫీస్‌లో ఇలాగే వర్క్ చేశావా? ఎందుకయ్య ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు! త్వరగా రిజిస్టర్‌లో సైన్ చేసి.. వెళ్ళు వెళ్ళు!”

కసురుకుంటున్న పెద్దాయనతో తనెందుకు ఆలస్యంగా వచ్చాడో చెప్పబోయాడు సింహాచలం.

మొహం పక్కకి తిప్పుకుంటూ సీరియస్‌గా పనిలో లీనమైన బాస్‌తో మాట్లాడలేక అక్కడి నుండి కదిలి సీట్లో నిస్సత్తువగా కూర్చున్నాడు.

***

తన కళ్ళముందే బుల్లేట్ నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్న కుర్రాడిని వేగంగా వస్తున్న ఆటో ఢీకొన్నది.

కాలేజీ కుర్రాడు బహుశా ఇరవై ఏళ్ళుంటాయి దూరంగా రోడ్‌కి ఆవలగా పడ్డాడు.

కొత్త బుల్లెట్ గాల్లో దాదాపు ఐదారు పల్టీలు కొట్టింది.

ఆ కుర్రాడేమో కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది.

పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు లెక్కచేయకుండా పిల్లల కోరికలు తీరుస్తూ లక్షలు పెట్టి బైక్స్ కొనిస్తారు.

అంతటితో ఆగకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ అంటూ సెల్ ఫోన్స్ కొంటున్నారు.

వచ్చీరాని డ్రైవింగ్. దానికి తోడు ఫోన్లో మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి?

జనాలు ఎప్పుడు జరిగే సంఘటనలే అన్నట్లుగా ఎవరి పనుల్లో వారు బిజీగా వెళుతున్నారు.

సింహాచలం హడావుడిగా ఆ కుర్రాడిని లేపే ప్రయత్నం చేశాడు.

స్పృహ తప్పిన ఆ కుర్రాడి ముఖం పై తనతో పాటు తెచ్చుకునే నీళ్ళ బాటిల్ లోని నీళ్లు చల్లాడు.

కదలిక లేదు. ఒళ్ళంతా గాయాలు.

ఆటో వాడు ఆటోతో పారిపోయాడు. కనీసం తన వలన గాయపడిన కుర్రాడికి సాయం చేసే ప్రయత్నం చేయలేదు.

సింహాచలం ఆలస్యం చేయకుండా 108 కి కాల్ చేశాడు.

ఆఘమేఘాల పై వచ్చిన వాళ్ళు వెంటనే అక్కడే ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్‌కి పయనమయ్యారు.

అప్పుడు గుర్తొచ్చింది సింహాచలానికి ఆఫీస్‌.

బాస్ ఏం చివాట్లు పెడతాడో.. ఒక్కసారిగా గుండెలు అదిరాయి.

మనస్సులో ఏదో మూల చిన్న తృప్తి.. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నాననే సంతృప్తి.

‘దేవుడా ఆ కుర్రాడి కి ఎటువంటి మేజర్ ఇంజ్యూరీస్ కాకూడదు’ అనుకున్నాడు.

***

ఆడిటర్స్ ఐదుగురు వచ్చారు.

బాస్ రామానుజం గారికి చెమటలు పడుతున్నాయి.

హడావుడిగా అటూఇటూ తిరుగుతుండగా..

“సార్! మీరు సెల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. మేడం గారు ల్యాండ్‌లైన్‌కి కాల్ చేశారు” అని ప్యూన్ వినయంగా అంటుంటే..

తన గదిలోకి వేగంగా వెళ్లారు రామానుజం గారు.

అంతే వేగంగా బయటకు వస్తూ..

“నేను అర్జెంట్‌గా బయటకు వెళ్తున్నాను.. సారీ ఫర్ ద ఇన్‌కన్వీయన్స్, మా వాళ్ళు ఆడిట్‌కి కావలసిన వివరాలు ఇస్తారు” అంటూ తన కారు వైపు కదిలారు.

***

ఆడిట్ పూర్తయ్యింది.

రిలాక్స్‌డ్‌గా ఉన్న సింహాచలం సెల్ మోగింది.

“సారీ సింహాచలం! నువ్వు ఉదయం చేసిన మంచి పనిని వినలేకపోయాను. పైగా ఆలస్యంగా వచ్చావని అడ్డదిడ్డంగా మాట్లాడాను. నువ్వు కాపాడింది ఎవరినో తెలుసా? మా అబ్బాయిని. ఇటీవలే వాడికి బుల్లెట్ కొనిచ్చాము. తప్పంతా నాదే. వాడికి సరిగ్గా బైక్ రైడింగ్ రాకపోయినా కొనిచ్చాను. రోడ్డుపై ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారట, తప్పు మావాడి దేనని. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడట. ఏదైనా మా వాడిని కాపాడిన నీ మంచితనానికి వేవేల కృతజ్ఞతలు.”

“సర్! మీ అబ్బాయని నాకు తెలియదు సార్. ఇప్పుడెలా ఉన్నాడు. పెద్దగా గాయాలేమీ అవ్వలేదు కదా?” ఆదుర్దాగా ప్రశ్నించాడు సింహాచలం.

“పర్లేదు పెద్దగా గాయాలేమీ కాలేదు. ఒళ్ళంతా దోక్కుపోయాయి. ట్రీట్మెంట్ ఇస్తున్నారు.  వీడు హడావుడిగా కాలేజ్‌కి బయలుదేరుతూ టిఫిన్ కూడా చేయలేదట.. వాళ్ళమ్మ చెప్పింది! ఇక నుండైనా ఆఫీస్‌లో పనిని ఎంతగా ప్రేమిస్తానో.. కుటుంబం పట్ల కూడా బాధ్యతగా ఉండి పిల్లల యోగక్షేమాలు పట్టించుకోవాలని అర్థమయింది. సహోద్యోగుల పట్ల కూడా కాస్త స్నేహంగా ఉండాలని తెలుసుకున్నాను.. ఉంటాను మరి.”

బాస్ మృదువుగా మాట్లాడుతుంటే సింహాచలం మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.

ఎప్పుడూ అందరి పై కేకలేస్తూ కఠినంగా మాట్లాడే వ్యక్తి మారడం, మంచిగా మాట్లాడటం అతడికి నచ్చింది.

సింహాచలానికి బాస్ ఇకనుండి అందరితో సఖ్యతగా ఉంటాడని అర్థమయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here