Site icon Sanchika

మానవత్వమున్న మనుష్యులు ఒక్కసారి ఆలోచించండి

[dropcap]కా[/dropcap]రు వేగంగా హైవే మీద వెళ్ళిపోతుంది. ఆలోచనలు అంతకంటే ఎక్కువ వేగంగా ఉన్నాయి. చేతిలో పెద్దగా డబ్బు ఉండాల్సిన పని లేదు. అంతా కార్డుల మీద గడిచిపోతుంది.

పర్స్‌లో కరెన్సీ బరువు కంటే కార్డుల బరువు ఎక్కువగా ఉంది. సౌమిత్రి ఒక ప్రోగ్రామ్ నిమిత్తం విజయవాడకు బయలుదేరింది. తన పిన్నిలు కూడా వస్తున్నారు. వాళ్ళు ప్రక్క ఊరైన నిడదవోలులో వృద్ధాశ్రమం నడుపుతున్నారు. దయదాక్షిణ్యం, మానవత్వముతో ఎందరికో ఆధారంతో ఆవాసాన్ని ఇచ్చారు.

ఎందరో తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశాల్లో విహరించడానికి అవకాశాలు కల్పించి తాము వృద్ధాశ్రమల్లో ఉండి పోతున్నారు.

పిల్లల పురోగతి కాంక్షిస్తే పెద్దల పని అధోగతి అవుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది. లెక్కలేకుండా పెరిగిపోతోంది. ఇన్ని వృద్ధాశ్రమలు, కాన్వెంట్స్‌తో సమానంగా వస్తున్నాయి.

చాలామంది తమ కార్లలో తామే వెళ్ళాలనుకుంటారు. అయితే ఆశ్రమం వారి ఎ.సి కార్లు, ఆర్.టి.సి మరియు సిటీబస్ మాదిరిగా అందర్ని ఎక్కించుకోవాలి. మరీ ముఖ్యంగా వృద్ధుల్ని ఎక్కించుకోవాలన్నది వారి ధ్యేయము. సౌమిత్రి 8 గంటలకే రెడీగా ఉంది క్రిందికి దిగాలనుకుంది. కాని ఆ రోజు ఏడుగంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కరెంట్ రిపేర్‌లో ఉంది. కరెంట్ ఆఫీసు వారు ఊరంతా కరెంట్ తేసేస్తామని ముందురోజు పేపర్‌లో, లోకల్ ఛానల్స్‌లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ప్రకారం రెడీ అయినా తన పిన్నిల కార్లు రాలేదు. ఫోన్ చేస్తే దారిలో ఉన్నాము, వేరే పనిలో ఉన్నాము, లగేజీ పెడుతున్నాము. ఇలా రకరకాల సమాధానాలు వచ్చాయి. సరేలే ఇంక కరెంట్ పోయినా వాళ్ళు వచ్చాకే దిగాలనుకుంది. నాల్గవ అంతస్తు, మొన్ననే జబ్బు చేసే తగ్గింది కూడా, బరువులు మొయ్యలేదు.

హెల్పర్ వీరలక్ష్మిని బ్యాగ్లు పట్టుకుని దింపమన్నది. సరేనంటూ హెల్పర్‌ వీరలక్ష్మి బ్యాగ్లు పుచ్చుకుని ముందు దిగింది. ఫోన్ వచ్చాక 4 అంతస్తులు దిగడం కష్టము అందుకని వాళ్ళు దారిలో ఉన్నామని ఫోన్ రాగానే దిగడం మొదలు పెట్టింది. ఈలోగా మళ్ళీ ఫోన్ వచ్చింది. సరేలే అనుకుంటూ క్రిందికి దిగింది. కలువపువ్వుల వాడు అమ్మకానికి పువ్వులు అని తెచ్చాడు. ఓ డజను కొన్నది. రోజు ఉద్యోగాలకి వెళ్ళి వ్యక్తులు “ఏంటి మేడమ్ గారు ఉదయమే క్రిందికి వచ్చారు. క్యాంపా?” అన్నారు.

“అవును ప్రపంచ సభల మీటింగ్ కి వెడుతున్నాము” అంది. ఈలోగా కార్ వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు ముసలమ్మలు దిగారు.

“రామ్మరా! లేటయ్యింది” అంటూ పిల్చారు.

“వీళ్ళంతా ఎవరు?” అంటే “మా అమ్మలు” అన్నారు.

“ఏమ్మా మిమ్మల్ని ఇక్కడ దింపాను. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోగలరా!?”

“అయ్యో ఇక్కడేనమ్మా, వెడతాను. ఇక్కడ వరకు దింపారు అంతే చాలు. ఈ గడ్డు రోజుల్లో ఏ.సి కార్లో ఎవరు తీసికొచ్చి దింపుతారు. నమస్తే అమ్మా” అంటూ సంచీలు పుచ్చుకుని వెళ్ళిపోయారు.

సౌమిత్రి కార్ ఎక్కింది.

“ఇంత ఆలస్యమా? మీటింగ్ మొదలవుతుంది. ఇంక రెండు గంటలు పైగా ప్రయాణం చేయ్యాలి” అంది.

ఇంతలో వాళ్ళు మనవడు చరణ్ “వీళ్ళు ఇంతేనండి, దారి పొడుగునా కారు ఎక్కించుకుని దింపుతున్నారు. కారు నిండా దుమ్ము, ధూళి. ఇంత వరకూ అందర్ని దింపారు. ఇప్పటికే లేటయ్యింది రండి నేను ఇంకా టిఫిన్ తినలేదు” అంటూ తొందర చేసాడు. “సరే” అంటూ కారు ఎక్కగానే శరవేగంతో బయలుదేరింది.

కారులో బాగ్‌లో తేగలు, మిక్చర్, పాలకోవాలు, జంతికలు తెచ్చారు. దగ్గు వస్తే తినడానికి ద్రాక్షపళ్ళు, జీడిపప్పు అన్నీ తెచ్చుకున్నారు. అయినా సరే చరణ్ “ఉదయం ఇడ్లీ తినాలి, వడ తినాలి, అవి తింటేగాని ఆకలి తీరదు” అన్నాడు. ‘ఏదో చిన్న పిల్లాడు, డ్రైవింగ్‌లో అర్జునుడు వంటివాడు’ అంటూ మురిసిపోయారు. ఓ చిన్న పాక హోటల్ దగ్గర ఆపుతూ “ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. ఇదే నా ఫైవ్ స్టార్ హోటల్” అన్నాడు.

వెళ్ళి తను తిని అందరికి పొట్లాలు కట్టించాడు. అందరికి కార్లోకి ఇచ్చాడు. వాటర్ బాటిల్స్ దగ్గరే ఉన్నాయి. ఈ లోగా పెద్ద పిన్నిగారు పొట్లం విప్పి “నువ్వు తిన్నావా చరణ్” అంటూ డ్రైవింగ్ చేస్తున్న చరణ్‌కి తినిపించడం మొదలు పెట్టింది. సొంత మనుమడైనా అలా తినిపించలేము, కాని ఈ మనుమడు కాని మనుమడు చరణ్‌కి అంత బాగా టిఫిన్ తినిపిస్తున్నారు. ఆ తరువాత కమలాపండు తొనలు తినిపించింది. హైవే పై చల్లగాలితో సుతిమెత్తగా కారు విజయవాడ సభలకి చేరింది.

సౌమిత్రి చాలా ఆశ్చర్యపడింది. సొంత వ్యక్తుల్ని దూరం పెడుతున్నారు యువత ఈనాడు. అందరూ ఆధునికత వైపు పరుగు తీస్తుంటే చరణ్ ఈ వృద్ధులు దగ్గర ఉండి వారికి టైముకి కావలసిన పనులు చేస్తాడు. ఆఫీసు పనులన్ని చేస్తాడు. ఆశ్రమం పురోగతికి తన వంతు ఉడుతా భక్తి సహయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళలన్నా కుడిభుజంగా ఉంటాడు. ఎమ్.టెక్ చదివి మద్రాసులో ఓ కంపెనీలో 50,000 రూ|| తెచ్చుకునే చరణ్ వృద్ధాశ్రమంలో వృద్ధుల జీవితాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపాడు. తల్లి టీచర్, తండ్రి ఎడిటర్. కుటుంబంలో ఎటువంటి బాధ్యతలు లేవు. అక్క పెళ్ళి అయిపోయింది. అందుకే కొనాళ్ళ సోషల్ సర్వీస్ చేయ్యాలన్నది ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకే అంత పెద్ద జీతం, జీవితం వదలి వృద్ధాశ్రమానికి హెల్ప్‌గా ఉన్నాడు. “నువ్వు చిన్న పిల్లాడివి ఎంతో జీవితం ఉంది. పెళ్ళి చేస్తామ”ని వాళ్ళు పిల్లని వెతకడం మొదలు పెట్టారు. అయితే చరణ్‌కి తగ్గ పిల్ల దొరకడం కష్టం అయ్యింది. ప్రయత్నం చేస్తున్నారు. అయితే చరణ్ మాత్రం బామ్మలకి ఏవిధంగా సహాయం చేయ్యాలి. వారికి మంచి ఆహారం పెట్టడం, మంచి దుస్తులు ఏర్పాటు చేసి హెల్త్ అండ్ హేల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తల్లిదండ్రుల దూరంగా పెట్టి ఆస్తుల కోసం అల్లాడుతున్న యువతకు చరణ్ ఒక స్ఫూర్తి. తమ కార్లో ఎవరు రాకుడదు. తమ స్టేటస్‌కి తెలుసున్న వారినే ఎక్కించుకోకూడదు అని కార్లు ఖాళీగా పెట్టుకుని దర్జాగా వెళ్ళిపొతున్న ఈ రోజుల్లో తమ కార్ల వృద్ధులు, అనాథలు అని తారతమ్యం లేకుండా అందరికి అవకాశం ఇచ్చే మనుష్యులు తక్కువ మంది అనే కంటే అనలు లేదని చెప్పాలి. ఇలాంటి రోజుల్లో వీరి సేవ అనంతం కదా! ఈ మార్గాన్ని ఆచరిస్తే సమాజంలో వృద్ధుల సమస్యలు తీరవచ్చును. మానవత్వమున్న మనుష్యులు ఒక్కసారి ఆలోచించండి.

Exit mobile version