మానేటి ఒడ్డు

1
2

1

అవిరళ జలాలతో పారుతున్నది బహుధాన్యపురానికి దక్షిణ దిశలో ఉన్న మానేరు నది. గట్ల వెంబడి దట్టంగా ఉన్న ఈతచెట్లు ప్రవాహ సంగీతానికి తన్మయం చెందుతున్నట్లుగా ఆకులు కదిలిస్తున్నాయి. ఈత చెట్లకు కట్టుకున్న గూళ్లనుండి పిట్టలు ఎగిరి నింగిలో బారులుగా సాగుతున్నాయి. వాగు గట్ల మీద వాలిన కొంగలు పిడిచి పెట్టిన ధవళ వస్త్రాలవలె కనిపిస్తున్నాయి. పొలాల మధ్య నాగులమర్రి నుండి ఎగురుతున్న పక్షుల కిలకిలారవాలు ప్రకృతికి పాడుతున్న మేలుకొలుపు గీతాల వలె ఉన్నవి. పచ్చని వరిపొలాలమధ్య నుండి గన్నేరువరం గల్మ వైపు సాగే తొవ్వ, పైరుతల్లి నుదుటిపాపిటలాగా ఉంది. తొవ్వకటూ ఇటూ వావిలి చెట్లూ, తంగెడు చెట్లూ, ఈదులూ దడికట్టినట్లుగా ఉన్నాయి. పొలాల నడుమ నిలువెత్తు తాటి చెట్లు ప్రకృతి దేవాలయ సముదాయంలో ధ్వజస్థంభాల వలె నిటారుగా నింగిని తాకుతున్నాయి.

తూర్పు దిశలో ఉన్న అరిపిరాల గ్రామానికి మీదుగా సూర్యుడు నింగి మీదికి నిచ్చెన ఎక్కుతున్నాడు. పసిసూర్యుని పసిడి కిరణాలు పడి వరిపొలాలు వన్నెలీనుతున్నాయి. గన్నేరువరం ఊరు ఈతచెట్ల ఆకుల సందులనుండి మానేరుకు ఆవలి వైపు కనిపించీ కనిపించనట్లుంది. ఊరున్న ఆనవాలుగా ఇండ్ల పైకప్పునుంచి పైకి లేచే పొగమబ్బులు సూర్యకాంతిలో నీలవర్ణంలో మెరుస్తున్నాయి. ఆ ఊరికి కింది వైపు మైలవరం ఇంకాకిందికి యాస్వాడ ఊళ్ల పైనుండి ప్రాతఃకాలపు ధూమాలు గాలిలో కలిసిపోతున్నాయి. యాస్వాడ జనావాసం బహుధాన్యపురం లోనిదే కాకపోతే అది మానేరుకవతల ఉండడంతో యాసవాడ పిలువబడుతున్నది. బహుధాన్యపురానికి పడమటి దిశలో వెలిగందల కాకతీయుల కాలంలో కట్టిన మట్టికోట, కోటలో జనావాసము ఉన్నది. చుట్టుప్రక్కల ఊర్ల నుండి వర్తకులు వ్యవసాయదారులు మరియు మానేరుకిరువైపుల ఉన్న బంధువుల రాకపోకలతో మానేరు నది ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. వచ్చే పోయేవారికి ముచ్చట్లు చెబుతుంది.

ఇంతలో బహుధాన్యపురము వైపు నుండి గన్నేరువరము తొవ్వ వైపు కొన్ని గుర్రాలపై అశ్వికులు వస్తున్నారు. ముందున్న గుర్రము మీద వెలిగందల ప్రభువు కందనామాత్యుడు అతనివెనుక అతని సహచరుడు ఆంతరంగిక మిత్రుడు శంకరభట్టు మరికొందరు రక్షక భటులు నెమ్మదిగా స్వారీ చేస్తూ వస్తున్నారు. ఆయన దివాణము బహుధాన్యపురంలో ఉన్నది.

కందనామాత్యునికి నదీస్నానం కడుప్రియం. శంకరభట్టు నడిపిస్తున్న హయంమీద ఆయన ముందర పదేండ్ల పిల్లడు కూచుని ఉన్నాడు. ఆ బాలుడు ఏదో అడగటం భట్టు అతనికి జవాబు చెప్పటం, మధ్య మధ్యలో భాగవత శ్లోకాలు వల్లించటం ముందున్న కందన చెవిన పడుతున్నాయి. మానేటి ఒడ్డుకు రాగానే అందరూ గుర్రాలు దిగి వాటిని మేతకు వదిలారు. స్వచ్ఛంగా ప్రవహిస్తున్న మానేటి ప్రవాహ మధ్యంలో తనివి తీరా స్నానం చేస్తూ సంధ్యావందనం కూడా ముగించుకుని సేవకులం దించిన పొడి వస్త్రాలు ధరించి వాయువ్య దిశలో ఉన్న గుట్ట వైపు చూపు ప్రసరించాడు. అంతగా ఎత్తులేని ఆ గుట్టపైన కాకతీయుల కాలం నాటి నరహరి దేవళం గోపురం పైన స్వర్ణకలశాలు సూర్యుని కాంతికి ధగధగా మెరుస్తున్నాయి. ధ్వజస్తంభం చివరన వేలాడే గంటల శబ్దం చిన్నగా వినిపిస్తున్నది. గుట్టచుట్టూ కాకతీయుల కాలం నాటి మట్టి కోట పైభాగంలో దేవాలయం ఆ ప్రాభాతకాంతిలో శోభాయమానంగా ఉన్నది.

శిరస్సు వంచి కళ్లు మూసుకుని రెండు చేతులెత్తి వెలిగందల నరహరిని మనస్సులో తలుస్తూ నమస్కరించాడు కందనామాత్యుడు.

“ప్రభూ గుట్టపైకి బయలుదేరుదామా?” అని గుర్రపు కళ్లాన్ని అందించాడు ఆంతరంగికమిత్రుడు శంకరభట్టు.

***

2

నమో నారసింహా!

నమో బహుధాన్యపురవాసా

నమోవెలిగందలాచల వాసా!

నమో మానేరునదీ తీరవాసా నమోనమః.

అంటూ వెలిగందలగుట్ట పైన వెలసిన నరసింహస్వామికి ప్రణమిల్లుతున్న కందనామాత్యుల శిరస్సు పై శఠగోపం ఆన్చి తీసి, ఆ తరువాత హారతి పళ్లెంతో వచ్చాడు కూర్మాచలం ఆగమాచార్యులు. భక్తి శ్రద్ధలతో రెండు చేతులతో హారతిగొనే సమయంలో ఎడమవైపు తలతిప్పి ఆస్థానవాద్యకారులకు కను సైగ చేశాడు ఆచార్యులు. ఆ అదను కోసమే ఎదురు చూస్తున్న ఆలయ నిలయవిద్వాంసులు తంబళ శ్రీకరణ భసవులు కీర్తన ప్రారంభించారు. తంబళ సొన్నాయి వాయిద్యానికి ఆనంద భరితుడైన కందన తీర్థ ప్రసాద సేవనంకాగానే మంటపం గట్టు పై కూర్చుని వారు పాడే కీర్తన కనుగుణంగా స్పందిస్తున్నాడు.

ఆగమాచార్యులకు తెలుసు ప్రభువుకు సంగీతమన్నా నృత్యమన్నా ప్రాణమని. ఆయన కళ్లు ఎవరి రాకకోసమో చూస్తున్నాయి. పదే పదే దేవాలయం వెనుక వైపుకు దృక్కులు బరపుతున్నాడు ఆగమాచార్యులు. అంతలోనే ఘుమ్మని మల్లెల పరిమళం ముక్కు పుటాలకు తగలగానే అమ్మయ్య వస్తున్నది భోగామణి అనుకున్నాడు.

ఘల్లు ఘల్లు మంటూ గజ్జెల శబ్దం చేస్తూ సర్వాలంకార భూషిత భోగామణి మంటపంలో ప్రవేశించి ప్రభువుకు నాట్యశైలిలో నమస్కరించింది. కందన ఆ లలనామణి నృత్య పరివేషము చూస్తూ అనుజ్జాపూర్వక సంజ్ఞనందించాడు నృత్యం ఆరంభించమని. కీర్తన మొదలైంది ‘శ్రీనారసింహా మము బ్రోవరా’ అంటూ. అనుగుణంగా హావ భావ ప్రకటనతో నృత్యం చేయసాగింది భోగామణి. కందన మనసు ఆనంద కందళితమైంది. నృత్యం కాగానే హారతి పళ్లంతో వచ్చిన  భోగామణి పళ్ళెంలో పిడికెడు నాణాలు వేసాడు. కనులకద్దుకొని పోబోతుంటే “మణీ!” అని పిలిచాడు.

“చిత్తం ప్రభూ!!” అన్నది. “రేపు మన దివాణానికి మహాకవీశ్వరులు మడికి సింగనగారు రామగిరినుండి వస్తున్నారు. రేపటి నుండి సాయంత్రం మన దివాణంలో నీ నృత్య ప్రదర్శన ఉండాలి” అన్నాడు.

“సింగనగారు వస్తున్నారా ప్రభూ!!” అన్నాడు ఆగమయ్యగారు.

“నీకు చెప్పాను కదా ఆచారి ఇంతకు ముందే అన్నట్టుగానే వారు తమ ఆమోదాన్ని తెలిపారు. రేపు వస్తున్నారు ఆచారీ! వారు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. పగటి పూట వారి ద్విపద భాగవతం కావ్యగానముంటుంది.”

“సంతోషం ప్రభూ! వారు ఆ కావ్యాన్ని మీకు అంకితమిచ్చారుగదా” అన్నది భోగామణి. చిరునవ్వు నవ్వాడు కందన. “అందులో మన వెలిగందలవేలుపు పై పద్యము కూడా ఉన్నది కదా ప్రభూ” అని గొంతు వినిపించిన వైపు అందరూ చూసారు. ఏడేళ్ల వాడు చిన్నపంచె కట్టుకుని నామం పెట్టుకుని రెండు చేతులూ జోడించిన బాలుణ్ని చూడగానే అందరికీ ప్రహ్లాదుడే గుర్తుకు వచ్చాడు. “కాదు నారయ్యా ఆ పద్యం పద్మపురాణోత్తర ఖండంలో వుంది. అది నీకు వచ్చు గదా చదువు” అన్నాడు ఆగమయ్య.

నారయ వెంటనే “ఓ! “ అంటూ

‘వెలిగందల నరహరి పద

జలరుహమకరంద మత్త షట్చరణ గుణో

జ్వల నవ్య మకర కేతన

విలసిత నవ కావ్యగీత విద్యానిలయా!

భోగామణి శ్రీకరణ భసవులు ఆగమయ్య అందరూ చప్పట్లు కొట్టడంతో నారయ్య ముఖం వికసించిన పద్మమైంది.

“సింగన కవీంద్రులు మా ఇంటికి వచ్చారంటే చాలు వీడు ఆయన దగ్గర నుండి కదలడు. ఆయన కూడా వీడిని దగ్గర కూచోబెట్టుకుని పద్యాలు నేర్పిస్తాడు. వీడు మంచికవి అవుతాడని అన్నారు నాతో సింగన” అన్నాడు కందన.

“అవును ప్రభూ రోజూ నావద్దకు వచ్చి భాగవత శ్లోకాలు నేర్చుకుంటాడు” అన్నాడు ఆచార్యులు. “అవునయ్య ఈయన నా దగ్గరికి వచ్చి కథలు చెప్పమంటాడు” అన్నది భోగామణి.

“పాపం తల్లీదండ్రీ వీడి చిన్నప్పుడే విషజ్వరంతో పోవడంతో అనాథయైపోయాడు. ఆ లక్ష్మమ్మకు పిల్లలు లేకపోవడంతో వీడిని పెంచుకోవడం వీడి అదృష్టం.” అన్నది భోగామణి.

“ఆమె మీ దివాణంలో పనిచేయడం వల్ల మీ అనుగ్రహం కూడా వీడికి కలిగింది. నారయ్యా ఇదిగో స్వామి ప్రసాదం” అంటూ దొప్ప చేతిలో పెట్టాడు ఆగమయ్య.

“శ్రీకరణ! భసవా! రేపటి నుండి వారం రోజులు మన యింట్లో భోగ నృత్యం విన్నారు కదా!”

“అయ్య వస్తం తప్పక”.

“చింతామణి చెరువు కింద మీ ముత్తాతల పొలం మంచిగ పంట పండుతుందా?”

“ఆ పొలం మీ ముత్తాతలకు చౌండ ప్రెగ్గడయ్య దానమిచ్చిండట.”

“అవునురా తమ్మళయ్యలూ. పౌండ్ర ప్రెగ్గడయ్య వారు కాకతీయ ప్రభువులు గణపతిదేవ చక్రవర్తి గారి వద్ద సేనానాయకులుగా ఉండేవారు. వారికి ఈ ప్రాంతం పర్యవేక్షణాధికారం కూడా ఉండేదట. వారు మన నరసింహదేవర భక్తులు. అంతే గాక మీ ముత్తాతల సంగీత వాయిద్యమంటే వారికి బహు ప్రీతి మన కందన ప్రభువులలాగే. అందుకే మన నర్సింహుల గుట్టకు పడమటి భాగాన ఉన్న చింతామణి చెరువు కింద ఉన్న భూమినివారికి దానంగా ఇస్తూ శిలా శాసనం వేయించారు. మీకు మీ తాతల పేర్లను మీ తల్లిదండ్రులు పెట్టారు. మీరు కూడా మీ తాతల పేరు నిలబెడుతున్నందుకు సంతోషం.

“అవునయ్య అక్కడ పొలంల రాతి మీద గట్లనే చెక్కి రాసిన బండ ఉన్నది గదయ్య మా నాయిన జెప్పిండయ్య”.

“సరే నేను వెళ్లివస్తాను ఆచారీ. ఒరే నారన్నా వస్తావా నాతో” అంటూ స్వామికి నమస్కరించి గుట్ట దిగడం మొదలు పెట్టాడు కందన. ఆయన వెనుకనే నారయ్య నడుస్తున్నాడు. “అయ్యా కవి అంటే ఏమిటి. సింగనయ్య గారు నేను కవినౌతానని అన్నారుగదా!”

“కవిత్వం చెప్పిన వాళ్లను కవి అంటారు.”

“కవిత్వం చెప్పుడంటే” మళ్లీ ప్రశ్నించాడు.

“నువ్వు ఇంతకు ముందు పద్యం చదివినావు గదా అలా పద్యం రాస్తే కవి అంటారు.”

“తమరు కూడా పద్యాలు రాస్తారా ప్రభూ.”

నవ్వాడు కందన. వెనుకనే వస్తున్న ప్రభువు ఆంతరంగిక సహచరుడు శంకరభట్టు నారన్న భుజం మీద చేయివేసి మెల్లిగా “రాస్తారు ప్రభువులు కూడా. వారికి కవిత్వమంటే ప్రాణం. నీతి తారావళి రాసినారు మన ప్రభువుల వారు. ఆ పద్యాలను సింగనయ్య గారు తమ సకలనీతి సమ్మతంలో చేర్చినారు.”

“అవునా అయితే కందనయ్య ప్రభువు కవి అన్న మాట, అయితే నేను కవినౌతాను” అన్నాడు నారన్న కళ్లు పెద్దగా విప్పి.

మెట్లు దిగుతానే చిరునవ్వు నవ్వుతూ “కవివై ఏమి రాస్తావురా నువ్వు.”

“భాగవతం” అన్నాడు నారన్న.

“అస్తు” అని దీవించాడు కందన.

***

3

పవిత్ర గోదావరీ నదీ తీరం, నరసింహ క్షేత్రం, అయినా ధర్మపురి గ్రామం బ్రాహ్మణాగ్రహారం. గోదావరినదీ స్నానానికై ఎక్కడెక్కడ నుండియో ఆ అగ్రహారానికి భక్త యాత్రికులు రావడం పరిపాటి. ఎడ్ల బండ్లపై వచ్చే వారిలో కొందరు తమ వంట సామగ్రితో వచ్చి స్నానం దైవదర్శనాల తరువాత ఏ చెట్టు కిందనో వండుకొని తినేవాళ్లయితే, మరి కొంతమంది తమకు తెలిసిన వారి ఇళ్లకు వెడతారు. కొంత మంది సంపన్నులు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేసే బ్రాహ్మణ గృహాల్లో మకాం చేసి వచ్చేప్పుడు ఆతిథ్యమిచ్చిన వారికి తమశక్త్యానుసారం ద్రవ్యమివ్వటం జరుగుతుంది.

ఇవన్నీ కాకుండా నదీ స్నానానికి, నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం రామగిరి పాలకుడు ముప్పభూపతి ప్రధానమంత్రి కేసనామాత్యుల వారు అన్నసత్రం కూడా ఏర్పాటు చేయించారు. కేసనామాత్యుల సోదరుడే వెలిగందలాధిపతి కందన.

పావన గోదావరీ నదీ స్నానానికై బమ్మెరనుండి వచ్చిన పోతన్నకు, వెలిగిందలలో మడికి సింగన కొన్నాళ్లపాటు ఉండి తన ద్విపద భాగవతం కావ్య పఠనం చేయబోతున్నాడన్న వార్త తెలిసింది. అంతకు క్రితం రోజే నదీస్నాన సమయంలో రామచంద్రుని అనుగ్రహం కలిగిన సంతోషంలో ఉన్నాడు. తన వయసులో ఉన్న సమయంలో రాచకొండ ఏలిక సర్వజ్ఞ సింగ భూపాలుని ఆకాంక్షమేరకు భోగినీ దండకము వ్రాసిన ఘంటము, ఆపై తనగురు దేవులైన ఇవటూరి సోమనాథుని ఆదేశానుసారము ఉత్తేజభరితమైన వీరభద్రవిషయమై వీరంగం చేసిన తన లేఖని జన్మ సార్థకరచనకై ఎదురు చూస్తున్నది.

ఆ తలంపుతో పవిత్ర దక్షిణ భాగీరథియైన యీ గోదావరీ నదీస్నానమొనర్చి మాహేశ్వరోపాసనకై గూర్చుండ ఆమహేశ్వరుడు సదా జపించే రామభద్రుడు కనిపించి భాగవతము వ్రాయుటకు పురికొల్పుట విధివిధానముగాక మరేమిటి? శివానుయాయుడను అయిన నేను ఆ కేశవుని చరితము లిఖించవలయుట దైవసంకల్పము గాక వేరేకాదు. మాన్యకవి మడికి సింగన తలంపు వలె

‘కృతి బోధామృత రసమట

కృతికథ శ్రీరామచంద్ర కీర్తనమట తత్

కృతి నాయకుడు లక్ష్మీ

పతియట నాకింతకంటె భాగ్యము గలదే యన్నట్లు

పలికెడిది భాగవతమట

పలికించెడువాడు రామ భద్రుండట నే

బలికిన భవహరమగునట

పలికెద వేరొండుగాఢ బలుకగనేలా!

అమ్మహానుభావుడు మడికి సింగన దశమస్కంధమును ద్విపదలో రాసినారట. తత్కావ్యగాన సప్తాహము రేపటి నుండి కందనామాత్యుల వారి గ్రామము వెలిగందలలో జరుగునని దెలియుట ఎంతో సంతోషదాయకము. వారి కావ్యగాన రసామృతము గ్రోలుటకు నేను వెలిగందల వెళతాను అని మనసులో అనుకున్నాడు పోతన్న.

అలా నిశ్చయించుకొని వెలిగందల యాత్రకు బయలుదేరు భక్తుల వద్దకు వెళ్లి “అయ్యలారా నేనూ మీతో బాటు వస్తాను” అంటూ తన ఎడ్ల కచ్చరము సిద్ధమొనర్చుకొనుటకు వెళ్లాడు. పాపమా భక్తవరులకేమి తెలుసు ఆయన భావిభాగవతకర్తయని, మహా కవియని? అందుకే ‘రావయ్యా రా మరి తొందరగా మేం బయలుదేరుతున్నామ’ని కేకలు వేసారు. పోతన్న తన కచ్చరంపై వారిని అనుసరించాడు.

***

4

వెలిగందలకు ఉత్తరానగల వీరభద్రాద్రి ప్రక్కగా ప్రవహించే పడగల వాగు, పరాంకుశుల గుట్ట వద్ద దక్షిణమువైపు తిరిగి మానేరులో కలుస్తుంది. దానికి పడమటివైపంతా బహుధాన్యపురము విస్తరించి ఉన్నది.

కందనామాత్యుల దివాణము బహుధాన్యపురపు ఈశాన్య భాగంలో ఉన్నది. దివాణము ముందు భాగమున విశాలమైన స్థలములో ఈతాకులు కప్పిన పెద్ద పందిరి వేయబడింది. మామిడాకుల తోరణాలు, బంతిపూలదండలతో పందిరి కళకళలాడుతున్నది. ఒకవైపు ఇటుకలు మట్టితోకట్టిన వేదికను ఎర్రమట్టితో అలికి సున్నపు ముగ్గులతో అలంకరించారు పురకాంతలు. వేదికకు నాలుగువైపులా అరటి చెట్లను నిలబెట్టారు యువకులు. వేదికవెనుక వైపున పెద్ద పెద్ద పచ్చడాలను కర్రలకు బిగించి తెరకట్టారు పద్మశాలులు. ప్రభువులవారికి మరికొందరికి ఒకవైపు ఉచితాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మిగతా భాగమంతా ఈతాకుల చాపలు పరిచారు పరిచారకులు.

సమావేశ స్థలానికి కొంత దూరంలో వంటల పందిళ్లు వేశారు. ఊరిజనాలకు బయటినుండి వచ్చే వారికందరికీ ఆ వారంరోజులూ అన్న సంతర్పణ ఏర్పాట్లు జరిగాయి. తాను కృతిగా గైకొన్న భాగవత దశమ స్కంధము కవి మడికి సింగన కావ్యగాన సప్తాహము చేయడం కందనామాత్యునికి ఎంతగానో సంతోషదాయకమైన విషయం.

***

5

రామగిరి నుండి సపరివారముగా వచ్చిన మడికి సింగనకు శంకరభట్టు భవంతిలో విడిది ఏర్పాట్లు చేశారు.

పోతన వెలిగందల చేరుతూనే సింగన వివరాలు తెలుసుకుని శంకరభట్టు దగ్గరికి వెళ్లాడు.

“శంకరభట్టు తమరేనా!”

“అయ్యా!”

‘మాది బమ్మెర. నా పేరు పోతన్న. నిన్న ధర్మపురిలో విషయము తెలియగానే సింగన గారి దర్శనార్థము మరియు ఆయన కావ్యగాన మాధుర్యము అనుభవించి తరించాలని వచ్చాను.”

“తమరు పోతనామాత్యులా? అంటే భోగినీ దండకము, వీరభద్ర విజయము రాసిన వారుకదా! సంతోషము.”

“ఆ విషయము మీకు తెలియునా! ఆవును ఆ పోతననే. నేను సింగన గారిని కలువ వలయును.”

“ఎవరు చిన్నాన్నా” అంటూ ఇంతలో అక్కడికి వచ్చాడు నారన్న.

“నారన్నా ఈయన గారు గొప్పకవి పోతనామాత్యులు.”

అనగానే పాదాభివందనం చేసిన నారన్నను ఆశీర్వదించి భుజంపై చేతులతో తట్టాడు. అపూర్వమైన గురుశిష్యుల కలయిక జరిగిన శుభ ఘడియ అది.

‘అయ్యా పదండి సింగనయ్య గారి వద్దకు వెళదాం” అన్నాడు శంకరభట్టు. “నారన్నా నువ్వు వెళ్లి ప్రభువులవారికి బమ్మెర పోతనామాత్యులు వచ్చారని చెప్పి వస్తావా” అని పురమాయించాడు.

***

6

శంకరభట్టు వసారాలో పట్టెమంచం మీద తలాపున ఎత్తుగా పెట్టిన తలగడల కానుకుని పరుండి ఉన్నాడు మడికి సింగన మహాకవి. ఎనభై దాటిన వయస్సులో పచ్చని పసిమిదేహకాంతితో, పాండిత్యం ప్రస్ఫుటీకరిస్తున్న కన్నులతో బ్రహ్మతేజస్సు, ముడుతలు పడిన మోములోనైనా ద్యోతకమవుతుండగా సాలోచనాత్మకుడై ఉన్నాడు.

ఇంతలో “రండి లోపలికి” అని పోతనను ఆహ్వానిస్తూ,

“అయ్యా! ఓరుగల్లు దగ్గరి బమ్మెర నుండి మీ దర్శనభాగ్యానికై పోతనకవి వచ్చారు.” అంటూ సింగనతో వినయంగా విన్నవించాడు.

‘ఆఁ’ సంభ్రమానందాశ్చర్యాలతో లేచి కూచుని “ఎవరూ సింగభూపాలునికై భోగినీ దండకము రాసిన వారేనా, వీరభద్ర విజయ కర్తయేనా ఆ బమ్మెర పోతన్నయేనా” అని అడిగాడు.

“అయ్యా నేనే ఆ పోతనను” అంటూ పాదాభివందనం కావించాడు. “ఏదో ఆ వయసులో అలా రాసాను అదీ రాచకొండ ప్రభువు వేడుక కాదనలేక.”

“అయ్యో నాయనా అది శృంగార రసరాజకావ్యం. నవరసాల్లో శృంగారాన్ని మించినదేది. అందులో నీ కవితాశక్తి తెలిసినది. కవికి కావలసిన రసహృదయము నీకున్నది. శబ్దముపై అధికారమున్నది. రక్తి భక్తి నాణానికి బొమ్మా బొరుసు వంటివి రానాయనా కూర్చో. ఎంత సంతోషమైంది ఈ రోజు నిన్ను చూచి. కుశలమా!”

“అయ్యా! దైవానుగ్రహం వల్ల కుశలమే. ధర్మపురిలో మీ భాగవత కావ్యగాన విషయము తమలియగానే ఇటు వచ్చాను.”

“చాలా సంతోషం నాయనా! కానీ నేనొక్క దశమస్కంధము మాత్రమే రాసియున్నాను అదీ పామరజన సమ్మోదము కోసం. నన్నయాదులు మార్గ పద్ధతిలో భారతము వ్రాసియున్నారు.

కానీ ఇంతవరకు భాగవతము నెవరు స్పృశించలేదు. నీవందుకు సమర్థుడవని నాకు తోచుచున్నది నాయనా.”

“సింగన కవీ! మీ నోటి నుండి ఈ మాటలు రావడం నాకు మహదానందంగా ఉన్నది. నిన్న పవిత్ర గోదవరీ నదీ మధ్యమంలో రామాజ్ఞ అయినది. ఇపుడు మీనోట స్వస్తి వచనములు వెలువడినవి.”

‘భాగవతము తెలిసి పలుకుట కష్టంబు

శూలికైన దమ్మి చూలికైన

విబుధవరుల వలన విన్నంత కన్నంత

తెలియవచ్చినంత తేటపరుతు.

“ఆహా అద్భుత పద్యధార” అంటూండగా “నమస్సుమాంజలులు పోతనకవివర్యులకు. ఎంతటి మహద్భాగ్యము మా బహుధాన్యపురానికి మా వెలిగందల నరహరి సన్నిధానానికి ముఖ్యంగా మేము తలపెట్టిన అస్మద్గురువరేణ్యులు మడికి సింగన మహాభాగవతకర్త భాగవత కావ్యగాన సంబరానికి మీ రాక మాకు మిక్కిలి ఆనందదాయకమైన విషయము. అందునా అతిథిదేవుని రూపంలో రావడం మరింత సంతోషకరం. మిత్రమా శంకరభట్టూ, పోతన గారికి వలసిన ఏర్పాట్లు చేయించు.”

“పోతన గారి వెంబడి నేనుంటాను ప్రభూ. వారికి అన్ని పనులూ నేనే చేస్తాను” అంటూ నారన్న ముందుకు వచ్చాడు.

“నారన్నా ఇక నీకు పండుగ కదరా. అలాగే కానీ. వీడికి కవులన్నా కవిత్వమన్నా తగని ప్రేమ. నీ వంటి వాడు వీడికి గురువుగా లభిస్తే మంచి కవి అవుతాడు పోతనార్యా!” అన్నాడు శంకరభట్టు.

“మన చేతిలో ఏముంది భట్టూ!’ ‘అంతా దైవ సంకల్పమే కదా!”

“అయ్యా మీరు మా శంకరుడితో విడిదికి వెళ్లి కుదుటపడేలోపు భోజనాలు సిద్ధమౌతాయి. ఆ తదుపరి కొంత విశ్రమించిన తరువాత కార్యక్రమ శుభారంభము జరుగుతుంది. నేను ఆ ఏర్పాట్లు చూస్తాను మరి.”

“సరే నాయనా” అంటూ సింగన పోతన ఒకేసారి పలికారు.

“రండి గురువర్యా” అంటూ నారన్న పిలువడంతో సింగనకు నమస్కరించి అక్కడనుండి వారి వెంబడి విడిదికి బయలుదేరాడు పోతన.

***

7

పగటి పొద్దు కొద్దిగా పడమటి వైపు వాలుతుండగా పందిట్లో హడావుడి మొదలయింది. మేళతాళాలతో మహాకవి మడికి సింగనార్యుని వేదిక వద్దకు పల్లకీలో తెస్తున్నారు. బోయీలు మోసే పల్లకి మోకుపై గౌరవసూచకంగా చేయి వేసినడుస్తున్నారు. అట్లే వెనుకవైపు మోకును పట్టుకుని నడుస్తున్నారు పోతన,శంకరభట్టు. పల్లకీ వెనుకగా రాజనర్తకి భోగామణి, రాచకాంతలు బ్రాహ్మణ స్త్రీలు పరిచారకులు, పురప్రముఖులు అనుసరిస్తున్నారు.

వేదిక వద్దకు రాగానే పల్లకీ మెల్లగా కిందకు దించారు. పట్టు పీతాంబరము కట్టుకుని, భుజాలమీదుగా పట్టు ఉత్తరీయము కప్పుకొని నుదుట నిలువుగా తిరునామముతో, మెడలో రుదిరాక్షమాలలతో, కరకంకణాలు, కర్ణకుండలాలతో పచ్చని మేనిచాయతో వయోవృద్ధులైన మడికి సింగన వెండిపొన్ను గల చేతికర్ర ఆసరాగా వేదిక పైకిచేరి చందన సింహాసనంపై ఆసీనులయ్యారు.

సభికులందరు కరతాళధ్వనులు చేస్తుంటే అందరినీ రెండుచేతులా దీవించాడు.

కందనదంపతులు, పోతన, శంకరభట్టు, నారయ్య, ఆగమాచార్యులు, భోగమణి, వేదిక పైనమడికి సింగన గౌరవ సత్కార సమాయత్తులై ఉన్నారు. కందన వేదిక పై ఒకింతముందుకు వచ్చి –

“వెలిగందల విషయవాసులారా, బహుధాన్య పురప్రజలారా! ఈ రోజు శుభదినము. మన వెలిగందల గుట్టమీది నరహరి కృపాకటాక్షము వల్ల మన ఊరి ప్రజానీకమును భగవద్భక్తి మార్గము వైపు నడిపించుటకు తాను పండితపామరజనుల హృదయజనరంజకముగాకోసమే విరచించిన ద్విపద భాగవత కావ్యగానము చేసి మనల తరింపజేయుటకు శ్రీమన్మడికి సింగనార్యులు సభాలంకృతులై ఉన్నారు. భాగవతములో దశమస్కంధమును ఈ ఏడు రోజులు మనకు వినిపిస్తారు ఇంకొక విషయము మన అదృష్టము కొద్దీ సహజకవి పోతనార్యులు ఈ సభలో ఉన్నారు. కవుల సత్కారము తదుపరి కార్యక్రమం కొన సాగుతుంది.” అని చెప్పి ఆగమాచార్యులు వేదమంత్రాలు చదువుతుంటే, తిలక ధారణ చేసి సుగంధ పుష్పాదులు చల్లి మెడలో పూలమాల వైచి పాదాభివందనం చేశారు. ఆ తరువాత ఒకరి వెనుక ఒకరు నమస్కరిస్తున్నారు.

చివరికి నారయ్య సింగన పాదాలకు నమస్కరించాడు.

“భావి కవీ ఆశీః” అంటూ దీవించాడు సింగన. అందరూ ఎక్కడి వారక్కడ తమ తమస్థానలలోనికి చేరుకున్నారు ఒక్క శంకరభట్టు తప్ప.

దానికి కారణం వెలిగందల ప్రజలకు మడికి సింగన, బమ్మెర పోతనల పరిచయం చేయమని కందనామాత్యుల ఆదేశం.

“అయ్యలారా ! అమ్మలారా! బాలబాలికల్లారా!అతిథి అభ్యాగతుల్లారా! అందరికీ వందనాలు.

దక్షిణ గంగయైన పావన గోదావరీ నదికి ఉపనది మన మానేరు. ఈ మానేరుగట్టున ఉన్న గుట్ట మీద వందల ఏండ్ల కింద వెలసిన నరసింహస్వామి మనందరికీ ఇలవేలుపు. మన కందన ప్రభువులకు ఇష్టదైవం. ఆ వెలిగందలాచల నివాసుడైన నరహరి కృపాకటాక్షములతో ఈ రోజు భాగవత సప్తాహ సమారోహణ జరుపుకుంటున్నాము.

సింగనకవి భాగవతమునందలి దశమస్కంధమును ద్విపదకావ్యముగా రచించినారు. దశమస్కంధము నందు భాగవత కథానాయకుడైన శ్రీకృష్ణుని జననం మొదలుకొని ఆయన జీవిత విశేషాలన్నీ ఉన్నాయి గనుక జనులందరూ ఆయన కథలను పాడుకొని తరించాలని ఆయన కోరిక. ఈ గ్రంథాన్ని మన ప్రభువుల వారు కందనామాత్యుల వారికి అంకితమీయడం మనందరి అదృష్టం. కందనామాత్యులు స్వయంగా కవి, అంతకు మించి సాహిత్యపు లోతు తెలిసిన వారు. ఈ రెంటికి మించి దానధర్మనిరతులు, దైవభక్తి పరాయణలు మరియు సాహిత్య పోషకులు. అందుకే మడికి సింగన మహాకవి పద్మపురాణోత్తరఖండాన్ని, ఈ ద్విపద భాగవతాన్ని మన ప్రభువులవారికి అంకితం చేశారు. వారి కోరిక మేరకు వయోభారాన్ని లెక్కచేయకుండా ఈ మానేటి ఒడ్డున, వెలిగందల నరహరి సన్నిధానమున ఈ భాగవత కావ్యగానానికి సమ్మతించివచ్చారు.

మరొక్క విషయం మీకు విన్నవించవలసి ఉన్నది. మన గ్రామ ప్రజల అదృష్టం కొద్దీ ఈ కార్యక్రమానికి ఓరుగల్లు దగ్గరి బమ్మెర నుండి సహజకవీంద్రులు పోతనామాత్యులు అరుదెంచారు.

వారికి వెలిగందల గ్రామవాసుల పక్షాన అభివాదములు తెలియచేస్తున్నాను. సింగనార్యా! ఇక మీ కావ్యగానము ఆరంభించండి.”

అప్పుడు సింగన గొంతు సవరించుకుని మనసులో ఇష్టదైవ ప్రార్థనము చేసుకుని

“నమో నారసింహాయనమః. నమో శ్రీకృష్ణాయనమః

ఈ దినము ఈ కార్యక్రమము తలపెట్టిన వెలిగందల కందనామాత్యుల వారినీ, వారి పాలనలో ఉన్న మీ అందరినీ మనసారా ఆశీర్వదిస్తున్నాను. నావిష్ణుః పృథివీ పతిః అన్నట్లు విష్ణుమూర్తి అంశలేనిదే ప్రభువులు కాలేరు. మన కందనామాత్యులు విష్ణ్వాంశ సంభూతులు. ఆధ్యాత్మిక భావ సంపన్నులు, వారి సంకల్పం వల్లనే ఈ గ్రంథం రాయటం జరిగింది. నేనొక్క దశమస్కంధము మాత్రమే రాసినాను. సంపూర్ణ మహాభాగవతము రాయడానికి ఇదిగో ఈ  పోతనామాత్యుల వంటి వారు సమర్థులు. వారు దానిని నెరవేరుస్తారన్న విశ్వాసం నాకున్నది. దానికి తోడు భగవదనుగ్రహం కూడా వారికి లభించింది. అట్లాగే మన నారయకు కూడా చిన్ననాటి నుండే సాహిత్యము పైన ఆసక్తిని గమనిస్తున్నాను. నేను పెద్దవాడినయ్యాను కానీ, పోతన వంటి మంచి గురువు లభిస్తే వీడు తప్పక కవి అవుతాడు. కవిత్వం జీవనది వంటిది. ఎప్పటికప్పుడు అది కొత్తనీరుతో ప్రవహిస్తూనే ఉండాలి. మానేరు గోదావరిలో సంగమించినట్లు మన నారయ, పోతనకడ చేరితే భవిష్యత్తులో భాగవతకావ్యం సిద్ధిస్తుంది. నారయ వంటి వారిని మరికొందరిని కూడా మన పోతన్న చేరదీసి కవితా శారదను కావ్యాలతో అలంకరించాలని కోరుతున్నాను. దానికి తోడు కవిత్వానికి ఆదరణ కావాలంటే కవులను పోషించే సహృదయులైన ప్రభువులు, రసజ్ఞులైన ప్రజలు అవసరం. చదివేవారు లేనప్పుడు ఎన్ని కావ్యాలు రాస్తే ఎన్ని కావ్యాలు రాస్తే ఏమి ప్రయోజనం. ఈ గ్రామంలో మన ప్రభువుల ఆశయం మేరకు ఆగమాచార్యులు విద్యాదీపం వెలిగిస్తున్నారని తెలిసింది. ఇచటి ఆలయనర్తకి భోగమణి మంచి నాట్యకత్తెనే కాకుండా సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యము గల విదుషి, ఎచట లలితకళలు వికసిస్తాయో అచట చక్కనైన సంస్కృతి విలసిల్లుతుంది. యథా రాజా తథా ప్రజా అన్నది పెద్దల మాట. మీ ప్రభువు రసజ్ఞుడు కనుకనే ఇవన్నీ ఇక్కడ సాధ్యమౌతున్నాయి. ఈ శంకరభట్టును చూడండి. మన కందన సాహిత్య సమాదరణమనస్కులని తెలిసి భద్రాద్రి దిగువన గోదావరి కావలి వైపునుండి వచ్చి మన ప్రభువుకు ఆప్తమిత్రుడై ఇచట విద్యావికాసానికి తన వంతు కృషి చేస్తున్నాడు. సరే ఇక నాభాగవతకావ్యగానాన్ని వినండి.” అంటూ మొదటి రోజు వినిపించవలసిన భాగాన్ని వినిపించడం మొదలు పెట్టాడు.

నారయ మడికి సింగన పాదపీఠానికి ఆనుకుని ఆయన ప్రతి మాటనూ శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. సూర్యభగవానుడు పడమటి దిశలోనున్న చందమామ గుట్ట దిగే సమయానికి ఆనాటి కావ్యగానాన్ని ఆపివేసాడు.

అప్పుడు కందన లేచి సభనుద్దేశించి, “కావ్యగానమే కాకుండా ఎన్నో ఉత్తేజకరమైన విషయాలు చెప్పిన సింగన కవీంద్రులకు ప్రణామాలు. అందుకే వారు ముప్పభూపాలునికి ఆస్థానకవి కాగలిగారు. ప్రభువులు ప్రజాపాలనం చేస్తే కవులు ప్రజలను చైతన్యవంతుల్నిచేస్తారనడానికి మడికి సింగన కవి నిదర్శనం. వారి దార్శనికతను గురించి రెండుమాటలు చెప్పవలిసిందిగా మన అతిథివర్యులు పోతనామాత్యులవారిని అభ్యర్థిస్తున్నాను.” అనగానే సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగింది.

పోతనామాత్యుడు లేచి ముందుగా సింగనకు నమస్కరించి ఆ పిదప వేదిక ముందువైపుకు వచ్చి రెండుచేతులు జోడించి నమస్కరిస్తూ

“వెలిగందల నరహరికిని

వెలిగందలకందనకును వేదికనొప్పన్

గలమడికి సింగనార్యుకు

వెలిగందల పురజనులకు వేయినమస్సుల్”

అనగానే సభచప్పట్లతో మారుమ్రోగింది.

“ఈ రోజు నాజన్మ ధన్యమైంది.నిన్న గంగను చూచాను. ఈరోజు ఈ పావన జనగంగను చూస్తున్నాను. ఈ మానేటి తీరంలో ఇంత చక్కని భాగవత తీర్థదర్శనం కలగడం నా మహద్భాగ్యం.

‘చేతులారంగ శివుని పూజించడేని

నోరు నొవ్వంగ హరికీర్త నుడువడేని

దయయు సత్యంబు లోనుగా దలపడేని

కలుగనేటికి తల్లుల కడుపు చేటు

మృదు మధుర కంఠంతో భక్తిభావ తత్పరతతో ఆయన పద్యం గొంతెత్తి ఆలాపిస్తుంటే సభ ఒక్క త్రుటిలో సూది కిందపడినా వినపడేంత నిశ్శబ్ద తన్మయతకు లోనైంది. ఆయన చెప్పే ప్రతి అక్షరం వినాలన్న కూతూహలం కలిగింది. ఒక మహాకవి వాక్కలకున్న శక్తి కావచ్చు. ఆయన నిండైన విగ్రహం, వినమ్ర విలోకనం, నిర్మల నిశ్చల మనో రూపం సరస్వతి పురుషరూపంలో అవతరించిందా అన్నంత దిగ్భమ అక్కడి వాతావరణాన్నిఆవహించింది. ఎవరికి వారు తమను తాము మరచిపోయిన స్థితి అది.

“మడికి సింగన కవివరేణ్యులు భాగవతమునందలి దశమస్కంధమును ద్విపదకావ్యముగా తెనిగించినారు కందనామాత్యుల కోరిక మేరకు. అటులనే వారి ఆకాంక్ష మేరకే పద్మపురాణోత్తర ఖండమును తెనుగు చేసినారు. ఇవి రెండుగాక రామాయణమునందలి జ్ఞానవాశిష్ఠమును తెలుగు జనులకై కావ్యముగా రచించినారు. సింగన గారొనరించిన మరొక అపూర్వ ప్రయోగము సకలనీతిసమ్మతము. అనేకమంది పూర్వకవుల రచనల నుండి నీతికి సంబంధించిన పద్యరత్నాలను ఏరి రమ్యమైన రత్నహారము వంటి రచనయొనర్చినారు. వారి ఈ నాలుగు రచనలు నాలుగు విధములుగ విశిష్టమైనవి మరియు ప్రజావళికి ప్రయోజనకరమగునవి.

భాగవతము భక్తిబోధను, పద్మపురాణోత్తరఖండము పాపపరిహారములు సూచించు మాఘస్నాన ఏకాదశీ వ్రతాది పలు ఆచారవ్యవహారముల సంబంధిగను, వశిష్ఠమహర్షి రామునికి ఉత్తమ మానవ లక్షణములు బోధించుటయే గాక జ్ఞానబోధచేయునట్టి జ్ఞానవాశిష్ఠము, ఇక నాలుగవి లోక వ్యవహారమున యుద్ధనీతి, ప్రభునీతి, బంటునీతి, పురహిత నీతి, గురు శిష్య నీతి అశ్వ నీతి ఇత్యాదులతో నీతిబోధకము. ఈ విధముగా భక్యాచారజ్ఞాననీతి దాయకములగు గ్రంథములను రచించిన ద్రష్టలు.

ప్రజలూ ప్రభువులు ఎవరి వారి కర్తవ్యమునెరిగి ధర్మబద్ధులై మసలుకున్నప్పుడే రాజ్యము క్షేమముగా ఉంటుంది. సుభిక్షముగా ఉంటుంది.

దైవకృప వల్ల సింగనకవీంద్రుల వంటి పెద్దల ఆశీస్సుల వల్ల భాగవతము వ్రాయవలయునను సంకల్పము మరింత దృఢమైనందుకు నాకు చాలా సంతోషముగనున్నది. నా పూర్వ జన్మ పుణ్యము వలననే కావచ్చును ఇంతవరకు భాగవత పురాణమును పూర్తిగా తెనుగున విరచించలేదు. నేను కూడా పూర్తిగా వ్రాయగల్గుదునో మరికొందరితో కలిసి పూర్తి చేయుదునో తెలియదు. అదియంతయును భగవంతుని ఇచ్చామాత్రముననే జరుగునని నా విశ్వాసము.

కందన వంటి ప్రభువులు సింగన వంటి కవులను కలిగియుండటం ఈ సబ్బిసాయిరమండల అదృష్టము. మొన్న ధర్మపురిలో కందనామాత్యుల సోదరులు కేసనామాత్యులు నెలకొల్పిన అన్నసత్రము జూచినాను. ఈ దినమిక్కడి అన్న సంతర్పణ చూచాను. ప్రజాక్షేమము కోరే ప్రభువులు చిరకాలము యశస్సును పొందుతారు. మీరందరు అదృష్టవంతులు. చివరగా ఒక్కమాట చెప్పి ముగింపు చెబుతాను. నేను వచ్చిన దగ్గర నుండి నాకు అన్ని సదుపాయములు కల్పించిన శంకరభట్టు కందన ప్రభువుకు తగిన మిత్రుడు. ఇటువంటి మనసెరిగి మసలుకొనే మంచిమిత్రులు దొరకటం కూడా ఒక భాగ్యమో. అలాగే ఈ చిన్నవాడు నారయ ఇతని ఉత్సాహం చూస్తుంటే నాకు వామనుడు గుర్తుకు వచ్చాడు.

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్సమస్తాస్సుఖినో భవంతు. స్వస్తి” అనగానే చప్పట్లతో పందిరంతా గలగలలాడింది. కందన సింగన సంతోషాంతరంగులై పోతనను మనసారా అభినందించారు.

‘ఇపుడు మన దేవాలయ నృత్యకళాకారిణి భోగామణి నృత్య ప్రదర్శనము ఉంటుంద’ని శంకరభట్టు సభికులకు తెలియపరుస్తుండగా వేదిక పైనున్నవారు క్రిందికవేదిక కెదురుగా తమతమ ఆసనాలలో కూర్చున్నారు. నృత్య ప్రదర్శన ఆరంభించింది భోగామణి.

***

8

లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతంలో

మురళీ నినదలోలం ముగ్గ మయూర చూడం

దళితదనుజజాలం ధన్య సౌజన్య లీలం

పరహితనవహేలం పద్మ సద్మానుకూలం

నవజలధరనీలం నౌమి గోపాల బాలమ్

సజల జలద నీలం వల్లవీ కేళిలోలం

శ్రితసురతరుమూలం విద్యుల్లసి చేలమ్

సురరిపుకులకాలం సన్మనోబిన్బులీలం

నతసురమునిజాలం నౌమి గోపాల బాలమ్

అంటూ భోగామణి నాట్యం చేయటం చూసిన పోతన ‘ఆహా ఏమి సందర్భశుద్ధి’ అని మనసులో అనుకున్నాడు. ఆమెకు తోడుగా సకలవాద్య కళాప్రవీణులు శ్రీకరణ భసవోజీలు తమ సహకారం అందిస్తున్నారు. హావభావ ప్రకటనలతో అలరించే నృత్య ప్రదర్శన ఆ సాయంత్రాన్ని వికాసవంతం చేసింది. అటు చక్కని సాహిత్యం ఇటు చక్కని నృత్యకార్యక్రమం సభాసదులను ఆనందపరవశుల్ని చేయడం పోతన గమనిస్తున్నాడు. జనులకింపైన భాషలో తన కృతిని తీర్చి దిద్దాలని మెరుపు తీగవంటి ఆలోచన మనస్సులో కదిలి వెళ్లిపోయింది.

నృత్యం పూర్తి కాగానే ఆశీస్సుల కోసం వేదిక దిగి వచ్చింది. అందరి పాదాలకు నమస్కరించింది.

“లీలాశుకుని శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకాలను చాలా చక్కగా అభినయించావు.”

“ధన్యురాలను అయ్యా!”

“మా భోగామణికి మీ భోగినీ దండకం కంఠోపాఠం పోతనార్యా” అన్నాడు శంకరభట్టు.

“అవునా” అంటూ చిరు మందహాసం చేసాడు. క్షణకాలం ఆయన కనుల ముందు సింగభూపాలుడు లకుమ కదిలారు.

ఇంతలో సింగనకు పల్లకీ వచ్చింది. మిగతా వారందరూ కాలినడకన విడిదికి బయలుదేరినారు. నడుస్తూ “ఉదయం మానేరుకు స్నానానికి వెళదాం” అన్నాడు పోతన శంకరభట్టుతో. “నేనూ వస్తాను మీతో” అన్నాడు నారయ.

“సరే అలాగే వద్దువుగాని. పద.”

***

9

బహుధాన్యపురానికి తూర్పువైపున పడగలవాగు మానేరులో కలిసే ప్రదేశానికి ఎగువన ఉన్న ఒడ్డుకు ఉదయమే చేరుకున్నారు పోతన, భట్టు, ఆగమయ్య, నారయ. స్వచ్ఛమైన జలధారలో స్నానాదికాలు సంధ్యావందనం ముగిసిన తరువాత చదునైన బండమీద ధ్యానానికి కూచుంటూ “భట్టూ మీరు వెళ్లండి నేను కొంత సేపు ఇక్కడే ఉండి ధ్యానం జపం చేసుకుని వస్తాను” అన్నాడు. “ఆగమచార్యులవారూ అన్నీ ముగసిన తరువాత గుడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటాను. ఇక మీరు వెళ్లండి.”

వాళ్లు సరేనని “రా నారయ్యా వెళదాం” అంటే “ఉహూఁ నేను గురువు గారి దగ్గర వుండి వారితోనే వస్తాను.” అన్నాడు నారయ. “ఉండనీ మీరు వెళ్లండి” అంటూ పంపించాడు పోతన. ఒకవైపు పచ్చని పొలాలు మరోవైపు స్వచ్ఛమైన మానేరు జల వాహిని. గట్టునే ఉన్న రావి చెట్టు కింద ఉన్న పరుపుబండపై కూచుంటూ, “నువ్వు నేను ధ్యానం చేసేంత సేపు ఏంచేస్తావు అలా ఆడుకో” అన్నాడు. “నేనూ ధ్యానం చేస్తా గురువుగారూ” అన్నాడు. “నువ్వా ఏంధ్యానం చేస్తావు?” మళ్లీ అడిగాడు పోతన. “మీరు ఏది చెబితే అదే” అన్నాడు. ఒక్క నిముషం కనులు మూసుకుని ‘ఈ మానేటి ఒడ్డు నాకు ఎంత చక్కని శిష్యుడిని ప్రసాదించింది ‘అనుకుని గురువే శిష్యుణ్ని వెదుక్కుంటూ రావడమంటే ఇదే కావచ్చు. అంతా దైవలీల అనుకుని “అలా కూర్చుని నీకు చేతనైనంత సేపు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని మనసులో స్మరించుకుంటూ ఉండు” అని చెప్పి తన ధ్యానంలో నిమగ్న మయ్యాడు.

లేలేత ప్రాభాతకాంతిలో వారిరువురు తేజోమూర్తులుగా కనిపిస్తున్నారు దూరంనుండి వెళ్లేవారికి. ధ్యానం కాగానే విడిదికి బయలు దేరారు ఇరువురూ.

***

10

వారం రోజులు భాగవత కావ్యగాన సప్తాహ మహోత్సవం బాగా జరిగింది. చుట్టు పక్కల ఊళ్లనుండి జనం రావడంతో మొదటి రోజు కంటే తరువాతి రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగింది. చివరి రోజు సమాపనకు ముందు మళ్లీ పోతన గారిని నాలుగు మాటలు చెప్పమని సింగన కోరితే సరే అని వేదిక మీదికి వచ్చి “భక్తజనులకు నమస్సులు. ఎంతో వైభవంగా సింగనగారి కావ్యగాన కార్యక్రమము సంపన్నమైనది. దీనికి మూలకారకులు కందనామాత్యులు.

వారి ఉదారహృదయము వల్లనే ఇంత చక్కని కార్యక్రమము జరిగినది. వీరిని గురించి పద్మపురాణములో సింగన గారు జెప్పిన పద్యము జ్ఞప్తికి వస్తున్నది.

సీ.
స్వామి భక్తుడు కార్యచతురుడు బహుకళా
వేది నీతిద్దుడు విప్ర హితుడు
సరససల్లాపుడు సప్తాంగరక్షణా
క్షముడు భావజ్ఞుడు సర్వసులభు
డరిమంత్రభేదన పరుడు ధర్మాత్ముడు
సుందరాకారుండు సుజనకవినతు
డురు దయాపరుడు నిత్యోత్సవాసక్తుండు
సద్గుణాధారుండు సౌమ్యమూర్తి

తే.గీ.

సతత గురుదేవతా పరిచారరతుడు

గుణసముద్రుండు కాశ్ప గోత్రజనితు

డనగ నుతికెక్కి పెంపున నతిశయిల్లు

మదన సదృశుండు కందన మంత్రివరుడు

అంతటి మహనీయుడు గనుకనే ఈయన రెండు గ్రంథములను నింగనకవి అంకితము గావించినాడు. అపూర్వ వచన రచనా బంధురకావ్యరసాభిజ్ఞుడగు కందన ప్రభువులు సింగన కవి సాహచర్యముచే కీర్తిప్రతిష్ఠలు పొందినానని చెప్పుకున్నారు.

నీ సహవాస సౌఖ్యముల నెమ్మి జరించుట జేసి దిక్కులన్

వాసికి నెక్కి శిష్టజనవర్గముచే బొగడొంది కావ్యవి

ద్యాసుఖకేళి బేర్చి కడు ధన్యతతో బహుదానలక్ష్ములన్

భాసురకీర్తిమైనెగడి ప్రస్తుతికెక్కితి మర్యకోటిలోన్ – అన్నారు.

మంచి వారి సహవాసము వల్ల మంచి పనులు చేయగులుగుతారు మంచిపనుల చేసినవారు తప్పక కీర్తి ప్రతిష్ఠలు పొందుతారనేది కందనమంత్రి యెడల యధార్థము.

వారి యౌదార్యమునకు మరొక విషయము జెప్పెదను. నేను ఇచటి రావడం అనుకోకుండా జరిగినది. గంగా స్నానమునకై ధర్మపురికి వచ్చి, ఇక్కడ జరుగుతున్న విషయము దెలిసిమడికి సింగన కవిని దర్శించుకొని పోదామని వచ్చాను. వారు ఈ వారము దినములిచ్చటనే ఉండవలయునని కోరినారు. బమ్మెరలో మా ఇంటి వారు విషయము దెలియక భయపడుదురేమోనని వ్యక్తము చేయగా వెంటనే బమ్మెరకు వార్తాహరుని బంపినారు. ఎంత సహృదయత. నాకు ఈ ఉత్సవమునందు పాల్గొనుట నా భావిభాగవత కావ్య రచనకు మిక్కిలి స్ఫూర్తి దాయకమైనది. ప్రపంచమున ప్రేమించు మనుష్యులు దొరకుటకన్న పెన్నిధి లేదు. నాకవి యిక్కడ పుష్కలముగ దొరకినవి. మీ యందరి అభిమానము చూరగొనుట నా భాగ్యము. చివరకు చిన్నారి నారయ సైతము నన్ను వచ్చినప్పటి నుండి వదిలి పెట్టలేదు. వాడింకను బాలుడు గనుక నా వెంట కొనిపోవుట లేదు కాని, యుక్తవయస్కుడు కాగానే వానిని నావద్దకు పంపించవలయునని సంరక్షకులను సభాముఖముగా తెలియజేయుచున్నాను. మాన్య కవివర్యులు మడికిసింగనార్యకవీంద్రులు ధన్యులు. వారి కావ్యమును ప్రభువుతో పాటు ప్రజలకు తమకావ్యగానమొనరించి అంకితము చేయగలిగినారు. ఇంత సహృదయులైన శ్రోతలిందరులభించుట కవి యదృష్టము. మిత్రుడనిన శంకరభట్టు వలెనుండవలె నన్నట్లు ఈ ఏడుదినములాయన మైత్రీ భాగ్యము పొందియున్నాను. ఆగమాచార్యుల ఆదరము, భోగామణి కళాప్రావీణ్యము, ఇక్కడి పండితులు, పురప్రముఖులు నాపై జూపిన ప్రేమాభమానములకునా నమస్సులు. మరొక్కసారి వెలిగందల పురస్కార సజ్జనులకు సవినయముగా నమస్కరిస్తూ సభ సుసంపన్నమైనదని తెలుపుతున్నాను.” అంటూ రెండు చేతులెత్తి అందరికీ నమస్కరించగానే,

కందన ప్రభువుల వారికి జయహో

మడికిసింగన మహాకవికి జయహో

పోతనకవీంద్రులకు జయహో

అంటూ సభికులు జయజయధ్వానాలు సలిపారు

అంతలో శంకరభట్టు సభను శాంతపరచి “ఇప్పుడు నృత్య ప్రదర్శనానంతరము అతిథిసత్కారము జరుగుతంది” అని ప్రకటించి సభను శాంతపరచాడు.

“నృత్య ప్రదర్శనకు ఏర్పాటు జరుగుతున్నది. అంతవరకు మన నారయ మన ప్రభువులు రచించిన నీతి తారావళి లోని కొన్ని పద్యాలు చదువుతాడు” అనగానే నారయ వచ్చి చేతులు కట్టుకుని కొన్ని పద్యాలు వనిపించాడు.

తదుపరి నృత్య ప్రదర్శన తరువాత కందన దంపతులు సింగననూ పోతననూ పట్టువస్త్రములతో, పల్లెరమున వెండిరూకలతో సత్కరించింద వారి ఆశీస్సులను పొందడంతో సభ ముగిసింది. పోతన అక్కడే తానుదయమే బమ్మెరకు బయలుదేరనున్నట్లు సింగనకూ, కందనకూ చెప్పి అనుమతి తీసుకుని విడిదికి బయలు దేరాడు. విడిదికి చేరేసరికి నారయ పెంపుడు తల్లి లక్ష్మమ్మ వంట చేసి సిద్ధంగా ఉంచింది. “అయ్యా కాళ్లు కడుక్కొని రండి వడ్డిస్తాను” అని పీటవేసి ఆకు పరచి వడ్డన చేసింది. భోజనం చేస్తూ అన్నాడు. “మీ నారయ యుక్తవయస్సు రాగానే నా వద్దకు పంపవమ్మా. ఇపుడే నాతో వస్తానని అంటే అనునయింపజేసాను.”

“చాలా సంతోషమయ్యా అలాగే పంపిస్త” అని ఆనందంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంది.

***

ముక్తాయింపు:

కోడి కూతతోనే లేచాడు పోతన. ఆయనతో పాటే లేచాడు శంకరభట్టు. కొలది సేపటిలోనే తయారై ఎడ్లు బండి సరిచూసుకొన్నాడు పోతన. ఆయన వస్తువులను బండిలో పెట్టించాడు. పక్కనే నిదురలో ఉన్న నారయపై చేయివేసి “వారం రోజులలోనే మనసుకు చాలా దగ్గరయ్యాడ భట్టూ. నాలుగైదేళ్లు గడిచాక నా వద్దకు పంపించు” అని చెప్పి లక్షమ్మకు కూడా చెప్పి బండి ఎక్కాడు.”వస్తాను భట్టూ” అని ఎడ్లను అదిలిస్తుంటే “పొలిమేరదాకా నేనూ వస్తాను” అని బండితో పాటు తనూ నడిచాడు.

“ఎంత చక్కని ఊరయ్యా మీ వెలిగందుల. ఎంత బాగా గడిచిందే ఈ వారం రోజుల కాలం.”

‘మేమూ అదే అనుకున్నామయ్యా మీరు రావడం వల్ల కార్యక్రమం మరింత శోభాయమానమైంద’ని అని మాట్లాడేంతలోపే పరాంకుశస్వామి బండలదాకా వచ్చారు. “అయ్యా మరి నేను ఉంటాను. క్షేమంగా వెళ్లారండి” అన్నాడు శంకరభట్టు. “అలాగే” అని బండి ఒక్క క్షణం ఆపి, “అవునూ ఆ రోజునుండీ అడుగుదామనుకుంటూ మరచిపోతున్నాను. మీరు గోదావరి ఆవలి ఒడ్డునుండి వచ్చారని సింగనగారన్నారు కదా! ఇంతకూ మీ ఊరి పేరేమిటి.”

“అయ్యా తుంబురు అంటారు. దాన్నే తుమ్మూరు అని కూడా అంటారు”

“ఓహో తుమ్మూరు శంకరభట్టు అన్నమాట. చాలా సంతోషం” అంటూ బమ్మెరవైపు ఎడ్లను అదిలించాడు పోతన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here