Site icon Sanchika

మాఊరి పాదముద్రలు

[dropcap]ఒ[/dropcap]క్కోసారి కాలం ప్రవాహంలా మారుతుంది
ఆ ప్రవాహం కంటితడి ముద్రలై నిలుస్తానంటుంది…!!
మేం ఎదిగిన తీరు ఒదిగిన వైనం పల్లెచిత్రమై మెరుస్తుంది…!!
ఇరుకైన ఇండ్లైనా విశాలమైన మనస్సులున్న
మమతలు పెనవేసుకున్న అనుబంధాల పొదరిల్లు నజరాన మా పల్లె
ఎన్నో వృత్తులు సబ్బండజాతుల కలబోత ఇంద్రధనుస్సు మాఊరు!!
అందరి వృత్తులు వేరైనా అందరం తెల్లవారుజామున నాగలితో పంటపొలాలను పలుకరించెటోళ్ళం
ఇంటి వెనుకాల రేగుపండ్లచెట్లు, చింతచెట్లే విందుల విడిదీలు
రేపటి కార్యక్రమాల రూపకల్పన అక్కడే జరిగేది
మా ముచ్చట్లు చూసి ఆకలి అలిగేది
ఒడువని ముచ్చట్లతో పుస్తకం తెరవబుద్ది అయ్యేది కాదు
కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే స్కూల్ డుమ్మా !!
చదువంటే నిర్లక్ష్యం లేదు
గుడిలాంటి బడంటే అంతిష్టం
పాఠాలు చెప్పే పంతుళ్ళు మాకు దేవుళ్ళు
చదువుతో పాటు అమృతం పంచేటోళ్ళు
కులాలు వృత్తుల వరకే…..
మాటా మాటా పెరిగి దోస్తులతో కొట్లాటలోస్తే గ్రూపులుగా మారి
మామిడి తోపులో ఫైటింగ్ సీన్లు అయ్యేవి
వీధి లో జరిగే గొడవలకు రావిచెట్టు కింద రచ్చబండే తీర్పు చెప్పేది….!!
ఎన్ని గొడవలున్నా తెల్లారేసరికి చెట్టు మీది మంచు బిందువులు రాలినట్లు అన్నీ మరిచిపోయేటోళ్ళం..!!
పొద్దున్నేఅందరం కలిసి ఇరుకుబావిలో ఈత నేర్చెటోళ్ళం
మర్రి చెట్టు ఊడలకు ఉయ్యాలలూగెటోళ్ళం
బోనాలపండుగ వచ్చిందంటే చాలు మాఊరి ఆడపడుచులతో
సంతోషాలు వెయ్యింతలయ్యేవి
పోచమ్మ గుడి రంగులద్దుకుని తోరణాలతో కళకళలాడేది
జాతర జోరుగా సాగేది అమ్మేటోళ్ళం కొనేటోళ్ళం మేమే….‌
వాడవాడలా పలకరింపులూ, క్షేమసమాచారాలు
పెడసరపు మాటలు ఎక్కడా ఉండేవికావు
సంక్రాంతి పండుగొచ్చిందంటే ఎద్దులపండుగ
బండ్లపోటీలు జోరుగా సాగేవి..!!
పీర్ల పండుగ నాడు సాయెబు ఇచ్చే కొబ్బరికుడుకలు, నెమలీకలతో దీవెనలు, అలాయ్ బలాయ్‌లతో కులమతాలు మాయమయ్యేవి….!!
మాఊరికి కిరీటం పెట్టినట్లు బోడగుట్ట భజనలతో మారుమ్రోగేది, పరుగుపందాలు పెట్టుకుని గుట్ట ఎక్కెటోళ్ళం, దాగుడుమూతలు ఆడుతూ సరదాగా గడిపేటోళ్ళం
మా ఊరికి ఆపన్నహస్తం రాయిచెరువు, పెద్ద చెరువులు
కాస్త వర్షానికే అలుగునిండి పంటపొలాలకు పండుగ చేసేవి
చేతినిండా పనిదొరికి ఊరును పచ్చగజేసేది…!!
మాఊరి బొడ్రాయి మా ఆయువు పట్టు
ఎవరైనా మరణిస్తే గౌనిదిగేది అక్కడే ….
అవ్వలూ, తాతలూ తాము పుట్టినూరిలోనే
కన్నుమూయాలని అనుకునేటోళ్ళు…!!
ఒక్కటేమిటి అనువనువు ఎన్నోముద్రలున్నాయి
ఇప్పుడవన్నీ చరిత్రపుటల్లో కథల్లా నిలుస్తున్నాయి….!!
మా పెద్దల జ్ఞాపకాలు,
మేం తిరుగాడిన గుర్తులూ ఆ మట్టితో ఉన్న అనుబంధం
ప్రాజెక్టు కబళించేస్తుంది…!!
ఇప్పుడు మాఊరుని ఏదుల రిజర్వాయర్ ఆక్రమించింది….!!
(ఎదుల రిజర్వాయర్ వల్ల బండరాయిపాకుల గ్రామం ముంపుకు గురౌతుందని ఊరు వదిలి వెళ్ళిపోయే ప్రజలు పడే బాధ కు చలించి రాసిన కవిత)

Exit mobile version