మార్పు

2
3

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘మార్పు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నసంతా అలుముకున్న విషాదంలా ఆకాశం మబ్బుపట్టి ఉంది. చల్లటి గాలి వీస్తూంది. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో కుంభవృష్టి కురిపించేలా ఉంది. నందగోపాల్ వరండాలో పడక్కుర్చీ వేసుకుని చేరగిల పడుకుని ఆకాశం వంక చూస్తున్నాడు. ఎడంవైపు భుజాల వరకు ఎత్తున్న ప్రహరీగోడ అవతల పక్కింట్లో ఆమె డాబామీద ఆరేసిన బట్టలు గబగబా చుట్టలు చుట్టి భుజంమీద వేసుకుని వస్తూ “కాలం కాని కాలంలో ఈ వర్షం ఏమిటో? పగలంతా ఎండ మాడ్చటం, సాయంత్రం అయ్యేసరికి వాన కురవటం” అంటూ గొణుక్కుంది.

కింద సందులో సింక్ దగ్గర నిలబడి, అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్న ఆమె భర్త “పాపం రైతుల పరిస్థితి మరీ దారుణం. చేతికొచ్చిన పంట పాడవుతుందేమో! అవసరమైనప్పుడు చచ్చి గీపెట్టినా వర్షం పడదు” అన్నాడు.

“ఊ” అంటూ ఆమె మెట్లుదిగి కిందకు వచ్చింది. గోడ అవతల పడకుర్చీలో కూర్చున్న నందగోపాల్ వంక చూస్తూ “అవంతి ఇంకా ఊరునుంచీ రాలేదా గోపాల్ గారూ!” అని అడిగింది. నందగోపాల్ ఉలిక్కిపడి తలతిప్పి ఆమెవంక చూసి “ఊహూ..” అన్నాడు.

సన్నటి తుప్పరగా వాన మొదలయింది. క్రమక్రమంగా జల్లు మొదలైంది. పక్కింట్లో భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. నందగోపాల్ కూడా పడక్కుర్చీ మడతపెట్టి ఇంట్లోకి వచ్చేలోపు వర్షం కుంభవృష్టిగా కురవటం మొదలైంది. నందగోపాల్ స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్లి, లైట్ స్విచ్ వేసాడు. లైట్ వెలగలేదు. కరెంట్ పోయినట్లుంది.

చూస్తూండగానే వాన ఉదృతంగా కురవసాగింది. చెట్లతలలు దెయ్యం పట్టినట్లు ఊగిపోతున్నాయి. క్యాండిల్ వెలిగించి స్టూల్ మీద పెట్టి మళ్ళీ పడక్కుర్చీ వాల్చుకుని పడుకున్నాడు. మనసంతా భారంగా, దిగులుగా ఉంది. అతనికి మాటిమాటికీ అవంతి గుర్తొస్తూంది. ఆమె గురించిన ఆలోచనలు ఎంత దూరంగా పారద్రోలాలని ప్రయత్నిస్తున్నా, అంతకు రెట్టింపు వేగంగా వస్తున్నాయి. భర్త లేకపోయినా ఆడది ఎంతకాలం అయినా ఉండగలదు. కానీ భార్య లేకుండా మగవాడు ఒక్కరోజు కూడా ఉండలేడు.

పగలంతా ఉద్యోగంలోనో, ఫ్రెండ్స్ తోనో గడచిపోయినా, ఇంటికి వచ్చేసరికి ఆ శూన్యం వెక్కిరించినట్లు కనిపిస్తూ ఉంటుంది. తన జీవితం మరీ! తనకి మొదటినుంచీ ఒంటరితనమే! తనకి పన్నెండేళ్ళ వయసు రాకుండానే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటం, అక్క పంచన చేరటం, బావ తనని బానిసలా చూడటం, అవన్నీ సహించి, తను చదువులో మరచిపోవాలని ప్రయత్నించటం, తర్వాత అవంతితో పెళ్లి, దాంపత్యం, అభిప్రాయ భేదాలు, ..ఏమిటో! కొంతమంది జీవితాలు ఇలా సమస్యలతోనే ముగిసిపోతుందేమో! నిట్టూర్చాడు.

నందగోపాల్‌కి అవంతితో పెళ్ళయిన తర్వాత గట్టిగా రెండు సంవత్సరాలు కూడా ఆనందంగా గడవలేదు. మొదటినుంచీ ఆమెది ఆధిపత్య ధోరణే! కానీ అతను అవన్నీ పట్టించుకోలేదు.

నందగోపాల్ డిగ్రీ చదువుతూ ఉండగానే అవంతితో పరిచయం అయింది. స్నేహంతో మొదలైనా పి.జి. చేసేటప్పుడు యూనివర్సిటీలో కూడా ఇద్దరూ క్లాస్‌మేట్స్ అయ్యారు. దాంతో పరిచయం ఎక్కువ అయింది. అది రోజురోజుకూ అభిమానంగా మారింది. అవంతి తను అతన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పగానే అతని గుండె లయ తప్పినట్లు అయింది. అప్పటికి అతనికి ఇరవై రెండేళ్ళ వయసు. అనుభవ శూన్యమైన ఆ వయసు రెండో ఆలోచన లేకుండా ఆమె ప్రేమను అంగీకరించి, పెళ్ళికి దారితీసేటట్లు చేసింది.

అవంతి తండ్రి లక్షాధికారి వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరే కూతుళ్ళు. అవంతి రెండవది. పెళ్లి కూడా ఆమె ఇష్టప్రకారం వైభవంగా జరిగిపోయింది. అక్కఇంట్లో నుంచీ అత్తగారి ఇంటికి వచ్చేసాడు. నూతన దాంపత్యపు రుచితో మధువు గ్రోలినట్లు కొన్నాళ్ళు ఆనందంగా గడిచిపోయింది. నందగోపాల్‌కి తెలుగు లెక్చరర్‌గా జాబ్ వచ్చింది. మామగారి ఇంట్లో నుంచీ వెళ్లి, సపరేట్‌గా ఉందాం అన్నాడు. అవంతి అంగీకరించలేదు. తల్లిదండ్రులను వదలిరాను అన్నది.

వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అవంతి అక్క మాధవి వాళ్ళ ఇల్లు కూడా ఉన్నది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. పాపకి నాలుగేళ్ళు, బాబుకి ఏడాది వయసు. వాళ్ళు రోజూ వస్తూపోతూ ఉండటం, పిల్లలిద్దరూ అలవాటు కావటం, అత్తమామలు ప్రస్తుతం నంద గోపాల్‌ని గౌరవంగా చూడటంతో “ ఇక్కడ నుంచీ వేరే వెళ్ళినా, అక్కడ కూడా ఒంటరితనమేగా! చిన్నప్పటి నుంచీ తనకు ఒంటరితనమే! పెళ్ళయిన తర్వాతే కొంచెం ఆనందంగా గడిచిపోతూంది. పోనీ, ఇక్కడే ఉందాం” అనుకుని నందగోపాల్ కాలేజీకి డైలీ సర్వీస్ చేయటానికి నిర్ణయించుకున్నాడు. వెళ్లిరావటానికి వీలుగా మావగారు బైక్ కొని ఇచ్చారు. కొన్నాళ్ళు ఆనందంగా గడిచిపోయింది.

డాంమ్మని ఎక్కడో పిడుగుపడింది. ఆలోచిస్తున్న నందగోపాల్ ఉలిక్కి పడ్డాడు. వాన భీకరంగా కురుస్తూంది. నందగోపాల్ లేచాడు. ఫ్రిజ్‌లో నాలుగు యాపిల్స్, బ్రెడ్, పాలపాకెట్ ఉన్నాయి. ఊరగాయ చట్నీలు కూడా ఒక పక్కన ఉన్నాయి. అన్నం వండుకుని, ఊరగాయ వేసుకుని తినవచ్చు. కానీ ఇప్పుడు వండుకునే ఓపికగానీ, ఆసక్తిగానీ లేవు. పాల పాకెట్ తీసుకుని, స్టవ్ వెలిగింది పాలు వేడిచేస్తూ, రెండు బ్రెడ్ ముక్కలు ప్లేట్లో పెట్టుకుని తింటూ కూర్చున్నాడు. బ్రెడ్ తిని, గ్లాసుడు పాలుతాగి, మిగిలినవి ఫ్రిజ్‌లో పెట్టి బెడ్ మీద పడుకున్నాడు. టైం ఎనిమిది గంటలు అయింది. అయిదింటికి పోయిన కరెంట్ ఇంకా రాలేదు. పడుకోగానే మళ్ళీ ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి.

నందగోపాల్‌కి పెళ్లయి పదేళ్ళు అయింది. పదేళ్ళలో అవంతికి రెండుసార్లు గర్భం వచ్చి, మూడో నెలలోనే పోయింది. ఈలోపు మాధవి కొడుకు వంశీకృష్ణ నందగోపాల్‌కి చాలా దగ్గర అయ్యాడు. తన పెళ్లి నాటికి వాడికి పదేళ్ళు. “బాబాయ్.. బాబాయ్” అంటూ తనని అంటిపెట్టుకుని తిరిగేవాడు. కూతురు మాత్రం తల్లికి దగ్గర అయింది. మగపిల్లాడు కాబట్టి తనకి దగ్గరగా, ఆడపిల్ల కాబట్టి తల్లికి దగ్గరగా అలవాటు అయ్యారేమో అనిపించేది నందగోపాల్‌కి. మాధవి భర్త బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండేవాడు. అందువల్ల వంశీ ఏం కావాలన్నా బాబాయినే అడిగేవాడు. నందగోపాల్ బాబుని ముద్దు చేస్తూ, అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు. బాబాయి చేత కధలు చెప్పించుకుంటూ వంశీ అతని బెడ్ మీదే పడుకుని నిద్రపోయేవాడు. వాడు ఏ ఇంట్లో ఉండే ఆ ఇంట్లోనే వాడి భోజనం, నిద్రానూ.

నందగోపాల్‌కి ప్రస్తుతం చేస్తున్న ఊరినుంచీ దూరంగా విజయవాడ ట్రాన్స్‌ఫర్ అయింది. అంతదూరం రోజూ వెళ్లిరావటం చాలా కష్టం. ఇద్దరూ ఆ ఇంట్లో నుంచీ వెళదాము అన్నాడు భార్యతో. తనకి ఇష్టంలేని పని జరిగినప్పుడు అవంతి సివంగిలా అవుతుంది. ఆమెకి తల్లి సపోర్ట్ ఒకటి. పుట్టిల్లు వదలి రావటానికి అవంతి ససేమిరా ఇష్టపడలేదు. “అమ్మాయి నన్ను వదలి ఉండలేదు. నేను అమ్మాయిని చూడకుండా ఉండలేను. నువ్వేవెళ్లి, వారానికొకసారో, నెలకొకసారో వస్తూఉండు అల్లుడూ!.. నువ్విక్కడే ఉండమ్మా! తిండికి లోటా, బట్టకి కరువా!” అన్నది అత్తగారు.

“నోర్ముయ్యవే పాపిష్టిదానా! నీ మూలంగానే అది అలా మొండిగా తయారైంది. అవంతీ! మనిషి కాలసింది తిండీ, బట్టా మాత్రమే కాదు. గౌరవ మర్యాదలు కూడా కావాలి. ఇన్నాళ్ళూ నీ మీద ప్రేమతో నువ్వేం చేసినా సహించాను. నువ్వు అల్లుడితో వెళ్ళు. మీరిద్దరూ కలసి ఉంటేనే నలుగురిలో గౌరవం. తల్లిదండ్రులకి సంతోషం. నువ్వు తక్షణం బయలుదేరు” అన్నాడు మావగారు. ఆయన చాలాసార్లు భార్య గయ్యాళితనం భరించినా, అప్పుడప్పుడూ ఇలా తిరగబడుతూ ఉంటాడు.

అవంతి విసుగుకుంటూ, గొణుక్కుంటూ బయలుదేరింది. నందగోపాల్ ఉద్యోగం చేసే ఊరిలో కాపురం పెట్టాడు. ఇప్పటిదాకా పుట్టింట్లో ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచిపోయిన అవంతికి ఇంటి బాధ్యత మీదపడటంతో నెత్తిన బండరాయి పడ్డట్లు అయింది. ఎప్పుడు చూసినా ఫోన్లో తల్లితో మాట్లాడుతూ ఉండటం, లేదా నిద్రపోవటం చేసేది. టిఫిన్లు, భోజనాలు బయటి నుంచీ తీసుకురమ్మనేది. తన మాట సాగకపోతే భీభత్సం సృష్టించేది. పిల్లలు పుట్టక పోవటానికి నందగోపాలే కారణం అన్నట్లు మాట్లాడేది. నోటికి ఎంతమాట వస్తే అంతమాట అనేది. భర్తని గడ్డిపోచలా తీసిపారేసేది. ఇద్దరి మధ్యా పడకగది సంబంధం కూడా తగ్గిపోసాగింది. దానికి తోడు ఫోనులో అత్తగారి సలహాలు. తల్లి చెప్పిన మాట తు.చ.తప్పకుండా పాటించేది అవంతి. ఆధునిక మంధరలు ఈరోజుల్లో కూడా ఉన్నారు అనిపించేది నందగోపాల్‌కి. ఆమె ఇలా ప్రవర్తించటానికి కారణం అత్తగారు అన్నవిషయం అతనికి తెలుసు. తల్లితో మాట్లాడటం తగ్గించమని చెబితే, వలవలా ఏడుస్తూ ఇరుగుపొరుగుతో తనని భర్త కష్టాలు పెడుతున్నట్లు చెప్పేది. నందగోపాల్‌కి రానురాను ఇల్లు నరకంగా అనిపించసాగింది.

ఈ గొడవలు పడలేక నందగోపాల్ సాధ్యమైనంత ఎక్కువగా బయటే గడిపేవాడు. తనని ఇంట్లో వదిలి, బజార్ల వెంబడి తిరుగుతున్నాడని గోలగోలగా అందరితో చెప్పేది. ఈసారి పెద్దవంకే దొరికింది. అవంతి తల్లికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. చూసి వస్తానని అంటే కాదనలేకపోయాడు. అలా వెళ్ళటం, వెళ్ళటం ఎన్నినెలలు గడిచినా తిరిగిరాలేదు అవంతి. నందగోపాల్ వెళ్లి అడిగితే, పెళ్ళాం కావాలంటే అతన్నే వచ్చి ఉండమని చెప్పింది. అవంతి ఇంట్లోనుంచీ వెళ్ళిపోయి రెండు సంవత్సరాలైంది. బయటి ఫుడ్ తినలేక, ఇంట్లో వండుకోలేక, అలసివస్తే కాఫీ ఇచ్చి అలసట పోగొట్టేవాళ్ళు లేక సతమతమై పోయేవాడు. పైగా ఒంటరితనం, చిత్తక్షోభ! పెళ్లిపేరుతో ఈ కాలనాగును మెడకు చుట్టుకున్నానేమో అనిపించసాగింది.

నందగోపాల్ ఫ్రెండ్ సుధీర్ అని ఒకతను లాయర్‌గా చేస్తున్నాడు. భార్య మూలంగా అతను పడుతున్న మానసికక్షోభ అర్థం చేసుకున్నాడు. “నందూ! ఈ కాలంలో అమ్మాయిలకి అవసరానికి మించిన ఆర్థిక స్వేచ్ఛ, తప్పు చేసినా సమర్థించే బంధుబలగం.. వెరసి వాళ్ళు ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచిపోతుంది. ఆడపిల్లని భర్త బాధలు పెడుతున్నాడని చెబితే నలుగురూ ‘అయ్యో పాపం’ అంటారు. అదే మగవాడిని భార్య బాధలు పెడుతుంది అని చెబితే ఆ నలుగురే హేళన చేస్తారు. ఇలాంటి కేసులు లాయర్ గా నేను ఎన్నో చూశాను.” అన్నాడు.

నందగోపాల్ మాట్లాడలేదు. సీరియస్‌గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. సుధీర్ మళ్ళీ అన్నాడు “అవంతి భర్త దగ్గరకు తిరిగిరావాలని, కోర్ట్‌లో కేస్ వేద్దాం. రాకపోయిందా తల్లీకూతురు ఇద్దరి అంతు చూస్తాను. ఈ సుధీర్ తలచుకున్నాడంటే ఎలాంటి వాళ్ళయినా గింగిరాలు తిరుగుతూ కాళ్ళబేరానికి రావలసిందే!” అన్నాడు.

ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన నందగోపాల్ “సరే! నీ ఇష్టం.” అంటూ అంగీకరించాడు. అవంతిని, ఆమె తల్లిని జైలుకి పంపితే కానీ మనశ్శాంతి ఉండదు అనేంత కసిగా ఉంది. “సరేరా! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నీ ఇష్టమైంది చెయ్యి. ఆ తల్లీ కూతుళ్ళు పెట్టే హింస ఇక భరించలేను” అన్నాడు నందగోపాల్..

బయట వర్షం తగ్గిపోయింది. శబ్దాలు వినిపించటం లేదు. హటాత్తుగా ఆగిపోయిన ఫ్యాన్ తిరగసాగింది. కరెంట్ వచ్చినట్లుంది. టైం పదిగంటలు దాటినట్లుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. నందగోపాల్‌కి లేచి బెడ్ లైట్ కూడా వేసుకోవాలని అనిపించలేదు. ఈ ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టి గాయం చేస్తున్నట్లు అశాంతి ఎక్కువైంది. మనసంతా పచ్చిపుండులా సలుపుతూ ఉంది. ఆలోచనలను బలవంతంగా దూరంగా నెట్టివేస్తూ పక్కకు తిరిగి పడుకుని నిద్రకు ఉపక్రమించాడు.

కాలింగ్ బెల్ “బజ్.. బజ్..” మని మోగుతూ ఉంటే నందగోపాల్‌కి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి, పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్‌లో టైం చూసాడు. పదకొండున్నర అయింది. తనకి నిద్రపట్టి ఎక్కువ సేపు కాలేదు. తలుపుతీసి, వరండాలోకి వచ్చాడు. వరండాలో లైట్ వెలుగుతూ ఉంది. ఇందాక వరండాలో కుర్చుని ఉన్నప్పుడు లైట్ స్విచ్ వేసి, తీయటం మర్చిపోయినట్లున్నాడు.

గేటు బయట నెత్తిమీద బ్యాగ్ పెట్టుకుని ఎవరో నిలబడి ఉన్నారు. “బాబాయ్! గేటు తియ్యి” అరిచాడు వంశీకృష్ణ బయటనుంచీ. నందగోపాల్ వడివడిగా గేటు దగ్గరకువెళ్లి గడియతీసాడు. లోపలకి శబ్దాలు వినిపించటం లేదుగానీ, వర్షం ఇంకా జల్లుజల్లుగా కురుస్తూనే ఉంది. వంశీ పరుగులాంటి నడకతో లోపలికివచ్చాడు. నందగోపాల్ మళ్ళీ గేటువేసి, వెనకేవచ్చాడు. కప్‌బోర్డ్‌లో నుంచీ టవల్ తీసి “తల తుడుచుకో వంశీ! తడిచిపోయావు” అన్నాడు. వంశీ తల తుడుచుకుని, “బాబాయ్! నా బ్యాగ్, అందులో బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. కట్టుకోవటానికి ఏమైనా ఇవ్వు” అన్నాడు.

“నీకు నైట్ డ్రెస్ వేసుకోవటం అలవాటు కాబోలు. నాకు నైట్ డ్రెస్ అలవాటు లేదు. నా లుంగీ, షర్ట్ వేసుకుంటావా! కొంచెం లూజ్ అవుతాయేమో!” అన్నాడు నందగోపాల్. “ఫర్వాలేదు. ఇవ్వు” అన్నాడు వంశీ.

వంశీ బట్టలు మార్చుకుని వచ్చాడు. అతను హైదరాబాద్‌లో బి.టెక్. మూడవ సంవత్సరం చదువుతున్నాడు “నాలుగురోజులు శలవులు వచ్చాయి బాబాయ్! నిన్ను చూసి చాలా రోజులైంది. దాదాపు సంవత్సరం పైనే అయిందనుకుంటాను. నీ దగ్గర ఒక పూట ఉండి, వైజాగ్ వెళదామని ఇలా వచ్చాను” చెప్పాడు.

వాడి మాటలు వింటుంటే నందగోపాల్ మనసంతా ఆనందంగా అనిపించింది. “అవునా!” అన్నాడు చిరునవ్వుతో. “బాబాయ్! ఆకలిగా ఉంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను. దారిలో ఆగి టిఫెన్ చేయటానికి కూడా వీలవలేదు. జోరున వాన” అన్నాడు. “అయ్యో! నేను కూడా వండుకోలేదు నాన్నా! యాపిల్స్ ఉన్నట్లున్నాయి. ఇవి తిను. పాలు కాచి తీసుకువస్తాను” అని ఫ్రిజ్‌లో నుంచీ యాపిల్ తీసి ఇచ్చాడు. పొయ్యి వెలిగించి, పాలు పొయ్యిమీద పెట్టి, తిరిగి వచ్చి, చాకుతో యాపిల్స్ ముక్కలు చేసి అందించాడు. అవి తిన్న తర్వాత పాలల్లో బూస్ట్ కలిపి ఇచ్చాడు. ఆకలి తీరినట్లయింది వంశీకి.

ఇంట్లో అవంతిలేని లోటు కొట్టవచ్చినట్లు తెలుస్తూనే ఉంది. కానీ వంశీ ఆమె ప్రసక్తి ఎత్తలేదు. అతను చిన్నవాడైనా వివేకం కలవాడు. పిన్ని బాబాయిని పెడుతున్న బాధలు అతనికి తెలుసు. ఆ విషయం మాట్లాడి మరింత బాధ పెట్టదలచుకోలేదు. నందగోపాల్ బెడ్ మీద పడుకుని ఉంటే, పక్కన కుర్చుని కాలేజీ విశేషాలు, ఫ్రెండ్స్ గురించి మాట్లాడసాగాడు. వాడు చెప్పే మాటలు వింటూ ఊ కొడుతున్నాడు నందగోపాల్.

కొంచెంసేపు అయినతర్వాత “చాలా అలసటగా ఉంది. నిద్ర వస్తూంది. రేపు మాట్లాడుకుందాం” అని చెప్పి, బాబాయి దగ్గరగా జరిగి పడుకుని, అతని గుండెమీద చెంపఆనించి, కళ్ళు మూసుకున్నాడు. నందగోపాల్ గుండె ప్రేమతో నిండిపోయింది. ఎడంచేత్తో వంశీ భుజంచుట్టూ చేయివేసి ఇంకా దగ్గరకు హత్తుకుని, కుడిచేత్తో వాడి చెంపలు, నుదురు, జుట్టు ఆప్యాయంగా స్పృశించాడు.

మెలకువ వచ్చి చూసేసరికి తెల్లగా తెల్లారిపోయింది. వంశీకృష్ణ వచ్చి, “బాబాయ్ టిఫెన్ రెడీ! త్వరగా ముఖం కడుక్కుని రా!” అన్నాడు. “పొద్దున్నే బయటకు వెళ్లి తెచ్చావా!” అడిగాడు నందగోపాల్ కప్పుకున్న దుప్పటి లాగి తీసేస్తూ. “హోటల్ నుంచీ తీసుకురాలేదు. అట్టుపిండి కొనుక్కుని వచ్చాను. ఇంట్లోనే వేసాను. టమాట చట్నీ కూడా చేసాను” అన్నాడు.

నందగోపాల్ నవ్వి, బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. పావుగంట తర్వాత టవల్‌తో ముఖం తుడుచుకుంటూ వచ్చేసరికి, వంశీ అట్లు వేసి డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టాడు. నందగోపాల్ తింటూ “నీకు ఇవన్నీ చేయటం వచ్చా!” అన్నాడు. “ఈ రోజుల్లో వంటరాని బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారా! అలాగే చూస్తూ ఉండు. చిటికెలో అన్నం, కూర, పప్పు వండేస్తాను”. అన్నాడు.

“ఈ విషయం పెళ్లి అయిన తర్వాత నీ భార్యకు చెప్పకు. రోజూ నిన్నే వండమని అంటుంది” పరిహాసంగా అన్నాడు.

“నేను చెప్పకపోయినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరూ వంట నేర్చుకోవటం లేదు. అందుకే వీధివీధికీ కర్రీ పాయింట్లూ, టిఫిన్ బండ్లూ వెలుస్తున్నాయి. పెళ్ళయిన తర్వాత భర్తే వంట చేయాలనీ, తనని బాగా చూసుకోవాలనీ అల్టిమేటం ఇచ్చేస్తారు. చేయకపోతే ఎక్కడ కేస్ పెడుతుందో అనే భయంతో భర్త వండిపెడతాడు. చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా తగలడ్డాయి మరి” అన్నాడు.

నందగోపాల్ తినటం ఆపి, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వీడు చిన్నవాడైనా ఎంత అవగాహన? అనిపించింది. “అలాగని పెళ్లి చేసుకోకుండా ఉండలేం కదా! ఆడది ఉండగలదు కానీ, మగాడు ఉండలేడు” అన్నాడు వంశీ నవ్వుతూ.

ఆరోజు ఆదివారం కావటం వలన కాలేజీకి శలవు. నందగోపాల్ స్నానం చేసివచ్చి, పేపర్ చూస్తూ కూర్చున్నాడు. వంశీ మధ్యాహ్నానికి అన్నం, కూర, పప్పు, పులుసు అన్నీ వండి వడ్డించాడు.

నందగోపాల్ అన్నం కలిపి, మొదటి ముద్ద వంశీ నోటికి అందించాడు. వాడు వచ్చిన దగ్గరనుంచీ అతనికి చాలా ఆనందంగా అనిపిస్తూంది. వంశీ కబుర్లు చెబుతూ, నవ్వుతూ, జోకులు వేసి నవ్విస్తూ ఉన్నాడు. సాయంత్రం నాలుగింటికి తిరిగి వెళ్ళటానికి బయలుదేరాడు వంశీ. నందగోపాల్ పర్స్‌లో డబ్బు ఎంత ఉందో చూడకుండా మొత్తం మడతపెట్టి వంశీ జేబులో పెట్టబోయాడు.

“వద్దు బాబాయ్! నేను నిన్ను చూడటానికి వచ్చాను గానీ, డబ్బు కోసం కాదు”

“ఛ!ఛ! ..అలా అని నేను మనసులో కూడా అనుకోను నాన్నా! కానీ నేను సంపాదించేది దాచిపెట్టి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరున్నారు?”

వంశీ ఏమీ మాట్లాడలేకపోయాడు. నందగోపాల్ డబ్బు అతని జేబులో పెట్టి “డబ్బుకోసం ఎప్పుడూ ఇబ్బంది పడవద్దు. నేను ఉన్నానని గుర్తుంచుకో!” అన్నాడు. వంశీ వెళుతూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లాయి. వాడిని గాఢ౦గా కౌగలించుకున్నాడు.

“నేను అప్పుడప్పుడు వస్తూఉంటాను. రోజూ ఫోన్ చేస్తాను” గ్రహించినట్లు ఓదార్పుగా అన్నాడు వంశీ. నందగోపాల్ బైక్ మీద వంశీని బస్టాండ్‌కి తీసుకువెళ్ళి, బస్ ఎక్కించి, తిరిగి ఇంటికి వచ్చేసరికి సుధీర్ వరండాలో సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు.

“ఎంతసేపయింది వచ్చి?” ఇంకో కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుంటూ అడిగాడు.

“ఒక పావుగంట అయింది” చెబుతూ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచీ కాగితాలు బయటకు తీసాడు. “నందూ! నీ భార్య మీద కేసు పెడదాం అనుకున్నాంగా! అన్నీ రెడీ చేసాను. సంతకం చెయ్యి” అన్నాడు.

నందగోపాల్ కాగితాలు అందిస్తున్న ఆ చేతిని నేట్టేసాడు. “వద్దురా! నాకు ఆ ఉద్దేశం లేదు” అన్నాడు.

“అదేమిటి? రెండు రోజుల క్రితమే కదా మనం అనుకున్నది. అంతలోనే డెసిషన్ మార్చుకున్నావా!”

“అభిప్రాయాలు మారటానికి రెండురోజులు కాదు, రెండు క్షణాలు చాలు” అన్నాడు నందగోపాల్.

“ఏం జరిగింది? ఎందుకలా మాట్లాడుతున్నావు?” సాలోచనగా చూస్తూ అడిగాడు సుధీర్.

“అవంతి వాళ్ళ అక్కకొడుకు వంశీ అని ఉన్నాడురా! వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని నేను చిన్నప్పటి నుంచీ స్వంతకొడుకు లాగా చూసుకుంటున్నాను. నిజంగా నాకు కన్నకొడుకు ఉన్నా అంత ప్రేమ కలిగేది కాదేమో!” నందగోపాల్ గుండెమీద అరచేత్తో రుద్దుకుంటూ అన్నాడు. “నిన్న వచ్చి ఈరోజు వెళ్ళాడు. వాడు వచ్చి నాలో నిద్రాణంగా ఉన్న మమకారాన్ని తట్టి లేపాడు. రెండు రోజులక్రితం వరకు నేను పగ, ద్వేషంతో రగిలిపోయిన మాట నిజమే! కానీ ఇప్పుడు నా మనసు వంశీమీద ప్రేమతో చల్లబడింది. వాళ్ళ పిన్ని మీద కేసు పెట్టానని తెలిస్తే నా మీద గౌరవం, అభిమానం ఉంటాయా! నా పట్ల వాడికి ఏమాత్రం వ్యతిరేకభావం కలిగినా నేను భరించలేను”

“నీ మీద అభిమానం ఉన్నవాడైతే అర్థం చేసుకోలేడా! నీ తప్పులేదని తెలియదా!”

“వాడు తెలుసుకోవటం, తెలుసుకోక పోవటం అదంతా తర్వాత సంగతి. వాళ్ళమీద నేను కేసు పెడతాను. వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా! మళ్ళీ నా మీద కేసు పెడతారు. ఇలా ఒకరి మీద ఒకరికి కక్షలు పెరిగిపోవటం తప్ప పగ ప్రతీకారాల వల్లసాధించగలిగేది ఏమీలేదు. నా మనసులో అంత పగ లేదురా! ఎంతకాలమైనా సరే, అవంతి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాను. అవంతి నన్ను అర్థం చేసుకుని తిరిగివస్తుందనే ఆశిస్తాను.”

సుధీర్ నిట్టూర్చాడు. “నువ్వు చెప్పింది కూడా నిజమే! మనుషుల మధ్య పగలు, ద్వేషాలు పెరిగిపోవటానికి కారణం ప్రేమాభిమానాలు లేకపోవటమే! ప్రేమ భావన మనసుని చల్లబరిచి, దానవుడిని మానవుడిగా మారుస్తుంది” కాగితాలు మడతపెట్టి, బ్యాగ్ లో పెట్టుకుంటూ అన్నాడు.

“ఓకే రా! మీ కాపురం చక్కబడి మీరిద్దరూ కలుసుకోవాలనీ , ఆనందంగా ఉండాలనీ కోరుకుంటున్నాను” లేచి నిలబడి, షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు సుధీర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here