మార్పు

0
3

[dropcap]హే[/dropcap]మంత్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. మంచి తెలివితేటలు కలవాడు. ఏ సబ్జెక్టు పాఠమైనా ఒక్కసారి వింటే ఇట్టే నేర్చుకుంటాడు. ఎంత తెలివైన వాడో అంత అల్లరి పిల్లవాడు. నిర్లక్ష్యవైఖరి కలవాడు. టీచర్లు ఎంత నచ్చజెప్పినా పట్టించుకునేవాడు కాదు. వాడికి గణితమంటే చాలా ఇష్టం. ఆ పిరియడ్‌లో మాత్రమే అల్లరి చేయకుండా శ్రద్ధగా వినేవాడు. లెక్కలు బాగా చేసేవాడు. మార్కులు కూడా అలాగే వచ్చేవి.

మిగతా క్లాస్ సమయంలో గోల గోల చేసి తరగతి గదిలోని పిల్లల్ని చదవకుండా ఆటపట్టించేవాడు. తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలని ఉపాధ్యాయులందరూ కలిసి నిర్ణయించారు.

***

“ఒరేయ్ హేమంత్ రేపు మీ పేరెంట్స్‌ను తీసుకుని స్కూల్‌కు రావాలి. నీవు ఒక్కడివే రాకూడదు. నీ ప్రవర్తనతో విసిగిపోయాం. తప్పకుండా మీ వాళ్ళను రమ్మని చెప్పు” అన్నాడు ప్రధానోపాధ్యాయుడు.

“అలాగే సర్” అని తలపై గోక్కుంటూ…… వెళ్ళిపోయాడు హేమంత్.

***

“సార్ హేమంత్ వాళ్ళ నాన్న వచ్చాడు.” అన్నాడు ప్యూన్ హెచ్.ఎం.తో.

“రమ్మని చెప్పండి” అన్నాడు హెచ్ .ఎం.

“సార్ అతను బాగా తాగి ఉన్నాడు. తూలుతూ వచ్చాడు. మీరు ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో లేడు. ఎందుకు అనవసరంగా అతన్ని లోపలికి” అన్నాడు ప్యూన్.

గేటు వైపు ఓసారి చూసి విసుగ్గా తలపంకించాడు హెచ్. ఎం.

‘ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నపిల్లలే అలా తయారవుతారు. పిల్లలను కనగానే సరిపోతుందా….? వారికి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వారిది కాదా…? హేమంత్ తెలితేటలు కలవాడు. వాడిపై పరిసరాల ప్రభావం చాలా ఉన్నట్లుంది. దారిలో పెడితే ప్రయోజకుడవుతాడు.’ అనుకున్నాడు ప్రధానోపాధ్యాయుడు.

***

హేమంత్ తండ్రిని గేటు దగ్గర నుంచే వెనక్కి పంపేశారు.

సాయంకాలం హేమంత్‌ను పిలిచి….”చూడు హేమంత్ నీవు అల్లరి మానకపోతే స్కూల్ రిజిస్టర్ నుండి నీ పేరు తీసేస్తాము. నీవల్ల మిగతా పిల్లలు కూడా పాడవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ నీ మీద కంప్లయింట్ చేసారు. ఇలా రిమార్క్ వస్తే భవిష్యత్తులో చాలా కష్టం అన్నాడు” తరగతి ఉపాధ్యాయుడు. “అప్పుడు ఇంటికి వెళ్లి కూర్చోవాల్సి వస్తుంది” అన్నాడు.

సార్ మందలింపు విని అప్పటికి కామ్‌గా ఉండి సరేనని తల ఊపి వెళ్ళిపోయాడు.

***

రెండురోజులు మంచిగా మారినట్లు కనిపించి మళ్లీ యధావిధిగా ఉండేవాడు.’ పిల్లలను  దండించడం ఇప్పుడు నేరం. ‘బెత్తంతో బెదిరిస్తే కూడా ఉపాధ్యాయులపై కేసులు ఫైల్ చేస్తున్నారు. మనకెందుకులే అనుకుని ఊరుకున్నారు అందరూ. వాడు ఉపాధ్యాయులందరికీ తలనొప్పిగా మారాడు. పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వాడినుండి ఇతర ఇతర పిల్లలు కూడా చెడిపోతున్నారని బాధపడుతూ ఏమీచేయలేక ఊరుకుండిపోయారు.

***

పాఠశాలకు కొత్తగా ట్రాన్స్‌ఫర్ మీద ప్రమోద అనే తెలుగు టీచర్ వచ్చారు. ఆమె హేమంత్ విషయం తెలుసుకుంది.

“మార్చడానికి నేను ప్రయత్నిస్తాను సర్” అంది ప్రమోద.

“మీ వల్ల కాదు టీచర్” అన్నారు ఉపాద్యాయులందరూ ఏకకంఠంతో ….!

“విద్యార్థులకు మనం ఎప్పుడూ ‘బాగా చదువుకోవాలి. ప్రయత్నం చేయకుండా ఫలితం ఎలా వస్తుంది.’ అని ఎన్నోసార్లు చెప్తాం. అందుకే ప్రయత్నించడంలో తప్పేంటి సార్?” ప్రశ్నించింది.

ఎవరూ ఏమీ అనలేక పోయారు .

***

ప్రమోద టీచర్ తన తరగతిలో పాఠ్యాంశాలతో పాటు నీతి కథలు ఉదాహరణగా చెప్పసాగింది. పిల్లలందరినీ జట్లుగా చేసి “అందరూ కలిసి చదివి అర్థం కానివి ఒకరికొకరు మరో జట్టుతో అడగాలి. వచ్చిన సమాధానాలు పంచుకోండి. ఎవరికీ రాని పదాలన్నీ నోట్ చేసుకుని నా పిరియడ్‍లో అడగండి” అని చెప్పింది. “క్లాస్‌లో ఒకరితో ఒకరు మాట్లాడుతూ సమాధానాలు తెలుసుకోవాలి” అంది. అందరూ ఉత్సాహంగా తలలూపారు.

మళ్ళీ వాళ్ళకు బహుమతి ప్రకటించింది. అదేంటంటే మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతే ఎవరైతే అడిగారో వాళ్ళకు ప్రైజ్ మనీ ఉంటుంది. చూద్దాం ఎవరు నన్ను చెప్పలేని ప్రశ్న అడుగుతారో అంది.

వీళ్ళందరు చదువుతున్నారో లేదో చూడడానికి హేమంత్‌ను మానిటర్‌గా నియమించింది. వాడికి మిగతావాళ్ళపై అజమాయిషీ చేయొచ్చుకదా అని సంతోషంగా ఒప్పుకున్నాడు.

హేమంత్‌కు కూడా ప్రశ్న అడిగే అవకాశం ఇచ్చింది.

అలా మూడు నెలల కాలం గడిచింది. హేమంత్‌లో మార్పు రాసాగింది. వాడికి తెలియకుండానే అన్ని సబ్జెక్టులు చదువసాగాడు.

***

హేమంత్ రెండు రోజులు స్కూల్‌కి రాలేదు. విద్యార్థులను అడిగితే ఏమో టీచర్ అన్నారంతా.

వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇద్దరు విద్యార్థులను వెంటబెట్టుకుని హేమంత్ ఇంటికి వెళ్ళింది ప్రమోద.

బాగా జ్వరంగా ఉండి పడుకున్నాడు హేమంత్.

“ఏం జరిగింది?” అనడిగింది ప్రమోద హేమంత్ తల్లితో.

“ఏం చెప్పాలమ్మా వీడి అయ్య ఆయన సంపాదించిన డబ్బును నేను నాలుగిళ్ళల్లో పాచి పని చేసి తెచ్చిన దాన్నీ తాగుడుకే తగిలేస్తాడు. నేను అడ్డుపడితే  ఇష్టం వచ్చినట్లు కొడతాడు. నాలుగు రోజుల నుంచీ తిండి లేదు పిల్లలు పస్తులున్నారు. బాగా తాగొచ్చి ఏం వండావని అడిగాడు. ఇంట్లో ఏమీ లేవు ఏం పెట్టి వండాలి అన్నాను. ఆ మాటకే నన్ను కొడుతూంటే హేమంత్ అడ్డమొచ్చాడు. అడ్డం వస్తావా అని వాడినీ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారినీ పట్టించుకోడు. పిల్లాడికీ  జ్వరం చుట్టుకుంది. డాక్టర్ కోసం వెళ్లి మందులు రాయించుకొచ్చాను. మందులకు కూడా డబ్బుల్లేవు…!” అన్నది హేమంత్ తల్లి.

“ఏం మందులు …. చీటీ ఇవ్వండి.  ఏం మందులో చూస్తాను” అన్నది ప్రేమగా

ప్రిస్క్రిప్షన్ తీసుకుని తనతోపాటు వచ్చిన పిల్లలని మెడికల్ షాపుకు పంపి మందులు తెప్పించి ఇచ్చింది.

“పండ్లు, బ్రెడ్ పంపిస్తాను. తినిపించి మందులు వేయండి” అన్నది.

“ఇంకా ఏమైనా కావాలంటే అడగండమ్మా. ఏం కాదు” అని ధైర్యం చెప్పింది ప్రమోద.

***

హేమంత్ రెండు రోజుల తర్వాత స్కూలుకి వచ్చారు. జ్వరం తగ్గిపోయింది. ప్రమోద వాడిని పిలిచి దగ్గర  కూర్చోబెట్టుకుని “నీకు అమ్మంటే అంత ప్రేమనా హేమంత్?” అన్నది.

‘ఊ’ అన్నాడు.

“అమ్మ కోసం రోజు గంటసేపు షాప్‌లో పని చేస్తాను. ఆదివారాలు కూరగాయల మార్కెట్‌లో పని చేస్తాను” అన్నాడు.

“చూడు నాన్నా, మీ అమ్మకు సహాయం చెయ్యి. కానీ నీ చదువును నిర్లక్ష్యం చేయకు. నీవు చాలా తెలివైనవాడివి. బాగా చదువుకుంటే స్కాలర్షిప్‌తో పాటు మంచి కాలేజీలో సీటు కూడా వస్తుంది. ఆ డబ్బులతో ఎవరిపైనా ఆధారపడకుండా చక్కగా చదువుకోవచ్చు. తరువాత మీ అమ్మను కూర్చోబెట్టి పోషించు కోవచ్చు” అని ప్రేమగా చెప్పింది. ఆ మాటలు హేమంత్‌పై మంత్రంలా పనిచేసాయి.

అదికాక అంతకుముందు టీచర్ వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మను ఓదార్చడం తనను బాగా చదువుకొమ్మని సలహా ఇవ్వడం ఇదంతా వాడికి ఎందుకో ఆత్మీయంగా అనిపించాయి.

అవును మరి ఇంతవరకూ ఎవరూ వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించలేదు.

అతని మనసులో మార్పు మొదలైంది.

***

ఈరోజు పదవ తరగతి పరీక్షా ఫలితాలు అని అందరూ ఎదురు చూస్తున్నారు. అవీ  రానే వచ్చాయి. అందరూ ముందుగా హేమంత్ రిజల్ట్స్ చూడసాగారు.

హేమంత్ 10/10తో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించాడు. అలాగే ట్రిపుల్ ఐటీ లో సీటు కూడా వచ్చింది.

ప్రమోదను మిగతా  టీచర్లు అందరూ ప్రశంసించారు.

హేమంత్ అందరి సమక్షంలో ప్రమోద కాళ్ళపై పడి నమస్కారించాడు.

స్కూల్ లోని  టీచర్లకూ విద్యార్థులకు మంచిపేరు వచ్చింది.

~

సూచన:- విద్యార్థులు మట్టి ముద్దలు. ఒక్కోసారి కుటుంబ పరిస్థితులు కావచ్చు మరో కారణం కావచ్చు, దారి తప్పి ప్రవర్తిస్తుంటారు. ఉపాధ్యాయులు వారికి మార్గనిర్దేశం చేసి మంచి మార్గం చూపించాలి. బంగారు భవితవ్యాన్ని చూపాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here