మార్పు రావాలి

1
4

[dropcap]“ఆం[/dropcap]టీ, మీరు ఒకసారి రండి” అంటూ విషయం చెప్పకుండా రవి ఫోన్ చేసేడు.

ఫోనులో రవి అన్నమాటతో కొడుకు శిఖర్ గురించి భయం వేసింది లలితకి.

“శిఖర్ ఎలా వున్నాడు? ఆరోగ్యం బాగానే వుందా?” అంటూ భయంగా అడిగింది లలిత.

“ఆంటీ, భయపడకండి. శిఖర్ బానే ఉన్నాడు. మిమ్మల్ని తలచుకుంటున్నాడు. అందరి పేరెంట్స్ వచ్చి వెళుతున్నారు. ఆఖరి సెమిస్టర్ కదా, ఒక్కసారి మీరు వస్తే బాగుంటుంది. తప్పకుండా రండి. గాభరా పడకండి” అని రవి ఫోన్ పెట్టేసేడు.

అలజడి భరించలేక కొడుక్కి ఫోన్ చేసింది లలిత. శిఖర్ తల్లితో బానే మాట్లాడేడు కానీ గొంతులో ఏదో బాధ తెలుస్తోంది. ‘రేపే బయలుదేరుతా, వీడు ఏదైనా బాధ అనిపిస్తే.. మనసులో పెట్టుకుంటాడు. ఏదీ బయటకు చెప్పడు’ అనుకుంది లలిత.

తెల్లవారేసరికి, లలిత ట్రైనులో కూర్చుంది. మనసంతా భారంగా ఉంది. శిఖర్ తండ్రి దూరమై పాతికేళ్ళు దాటింది. లలిత మనసు ఏ చిన్న అలజడిని తట్టుకోవాలన్నా భయపడుతోంది. గతంలో జరిగిన గాయం మానలేదు. గతం తల్చుకుంటూ ఆలోచనలలో పడింది లలిత.

***

పెళ్ళీడుకి వచ్చిన లలితకు సంబంధాలు చూస్తున్నారు. తెలిసిన వాళ్ళ ద్వారా టీచరు ఒక పిల్లాడు, రైల్వేలో టీటీ మరొక పిల్లాడు సంబంధాలు వచ్చేయి.

తల్లి.. “టీచర్ని చేసుకోమ్మా. జీవితం ప్రశాంతంగా ఉంటుంది” అంది.

తండ్రి మాత్రం..

“నీకేమైనా మతిపోయిందా? బంగారంలాంటి టీటీ సంబంధం వదులుకుని, బడి పంతులు సంబంధం చేద్దామంటావా? టీటీ అంటే జీతం కన్నా పై సంపాదన ఎక్కువ. మూడువందలు జేబులో వేసుకుని డ్యూటీకి వెళితే మూడువేలకి తక్కువ లేకుండా తెచ్చుకుంటాడు. ఎదురొచ్చిన లక్ష్మిని వదులుకోవడం ఎందుకు?” అంటూ భార్యని ఎగతాళి చేసి, కూతురుకి టీటీనిచ్చి ఘనంగా పెళ్ళి చేసేడు.

లలిత భర్త సుందరంతో సంతోషంగా ఉంది. పెళ్లయి సంవత్సరం దాటింది. శిఖర్ పుట్టేడు. ఇద్దరు ముగ్గురవగానే, సుందరంకి డబ్బు మీద వ్యామోహం పెరిగింది. ప్రయాణికులను టికెట్ లేకుండా కూర్చోపెట్టి, ఆ టికెట్ డబ్బు జేబులో వేసుకునేవాడు. శెనక్కాయలమ్మే వాళ్ళని, ఆఖరుకి టీ తెచ్చే వాళ్ళని కూడా వదలకుండా డబ్బు గుంజేవాడు. డబ్బు బాగా సంపాదించి ఇల్లు త్వరగా కొనుక్కోవాలని తపన పడేవాడు.

“ఎందుకండీ, అంత డబ్బు పిచ్చి మంచిదికాదు” అని చెప్తే..

“నీ పని నువ్వు చూసుకో. అనవసరమైన విషయాల్లోకి రాకు” అనేవాడు.

రోజులన్నీ ఒక్కలా ఉండవు. కిట్టని వాళ్ళెవరో కంప్లైంట్ ఇవ్వగా.. విజిలెన్స్ వారి దృష్టి సుందరం మీద పడింది. డ్యూటీలో ఉన్న సుందరానికి, ఇద్దరు విజిలెన్స్ ఆఫీసర్లు ఎదురుపడి..

“క్యాష్ చెక్ చెయ్యాలి. ఇఎఫ్‌టి ఇవ్వు” అన్నారు.

సుందరం ఉద్యోగంలో చేరేక, ఇలాంటి పరిస్థితి వినటమే కానీ ఎప్పుడూ ఎదురవలేదు. మూడు జేబుల్లోని డబ్బు, ఇఎఫ్‌టి ఇచ్చేడు. కాళ్ళలోంచి వణుకు వస్తోంది.. ‘దొరికిపోయాను, అయిపోయింది. చాలా పెద్ద కేస్ అవుతుంది నామీద’ అనుకుంటూ.. తలుపు వైపు చూసేడు. ట్రైన్ చాలా వేగంగా వెళుతోంది. మరేమీ ఆలోచించకుండా ట్రైనులోనించీ బయటకు దూకేశాడు. సుందరం శరీరం కరంటు స్తంభానికి తగులుకుని, ముక్కముక్కలయింది. ఈ ఘటన కళ్ళతో చూసిన విజిలెన్స్ అధికారులు సుందరం మీద కేస్ రాయకుండా దుర్ఘటనగా రాసి, కుటుంబానికి న్యాయం చేసేరు.

‘కూతురు జీవితం, ఇలా అవటానికి కారణం నువ్వే’ అంటూ లలిత తల్లి, భర్తను నిందించింది. చంటి పిల్లడితో పుట్టింట్లో రోజులు భారంగా గడుస్తున్నాయి. సుందరం జాగాలో ఉద్యోగానికి కాగితాలు తెచ్చేడు లలిత తండ్రి.

“నేను ఇప్పుడే ఉద్యోగానికి వెళ్ళను. ముందు టీచర్ ట్రైనింగ్ చేసి, ఉపాధ్యాయురాలి ఉద్యోగానికి అర్హత సంపాదించి, అప్పుడు ఆఫీసర్లను అడిగి రైల్వే స్కూల్లో పోస్టింగ్ ఇయ్యమని అడుగుతాను. పిల్లడిని బాగా చదివించుకుంటాను” అని ప్రయత్నం చేసి ఉపాధ్యాయురాలిగా స్థిరపడింది.

కొడుకు శిఖర్ ప్రముఖ ఐఐటి నించీ ఎంటెక్ ఆఖరు సెమిస్టరులో ఉన్నాడు. ‘సున్నిత మనస్తత్వంగల శిఖర్ ఏదైనా వివాదంలో ఇరుక్కున్నాడా? నాకున్నది ఒక్కటే ఆశ. నాకింక మిగిలింది నా కొడుకు ఉజ్వల భవిష్యత్తు మాత్రమే’ అని కొడుకుని తలచుకోగానే లలిత గుండె భారమై కంటివెంట నీరు కడవలై కారుతుంటే.. మనసు చిక్కబట్టుకునే ప్రయత్నం చేస్తూ నిద్రకుపక్రమించింది లలిత.

***

రూంకి చేరుకున్న లలితను శిఖర్, రవి కలవటానికి వచ్చేరు. తల్లిని చూసి వడిలిన శిఖర్ మొహంలో వెలుగొచ్చింది.

“ఏంటయిందిరా? అలా ఉన్నావు” అంటూ శిఖర్ చెయ్యి పట్టుకుని, దగ్గరికి తీసుకుంది తల్లి. ఆ కాస్తా ఓదార్పుకే, శిఖర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

“చూడండి ఆంటీ, వీడు ఎలా దిగులు పడుతున్నాడో. గైడ్ సంతకం పెట్టను. ప్రాజెక్ట్ ఆపేస్తాను అనగానే, తిండి తినడు.. ఉలకడు పలకడు” అని చెప్తున్న రవి మాటలకు..

“అదేంటీ, ప్రాజెక్ట్ అయిపోయింది కదా? మరెందుకు సంతకం చెయ్యరు?” అంది సందేహంగా లలిత.

“ఆంటీ, ప్రాజెక్ట్ పూర్తవాలంటే.. గైడ్‌ని తృప్తిపరచాలి. ఆ మాట వీడికి చెప్తే అర్థం చేసుకోడు” అన్నాడు రవి.

“నీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందా? సంతకం అయిపోయిందా?” అని రవిని అడిగింది లలిత.

“ఇంకా సంతకం అవలేదు. నేను అంతా రెడీ చేసుకున్నాను ఆంటీ” అన్నాడు రవి.

“ఏంటి, రెడీ చేసుకున్నావు రవీ?” అంది లలిత.

రవి నసుగుతూ..

“గైడ్‌కి, మంచి విదేశీ మందు ఇయ్యటానికి అందరమూ కొని ఉంచుకున్నాము. నువ్వు కూడా కొనరా అంటే, నాకు ఇష్టంలేదు అంటాడు వీడు” అంటూ శిఖర్ మీద కంప్లైంట్ చేస్తున్న రవి మాటలకు చిరాకనిపించింది.

“అతను, ఇయ్యమని అడిగేరా?” అంది లలిత.

“లేదు, వాళ్ళు అడగరు. ప్రాజెక్ట్ ఆపుతున్నారంటే.. అదే ఉద్దేశం అని, అందరూ అనుకుంటున్నారు ఆంటీ” అన్నాడు రవి.

“సరేలే, మీరు వెళ్లి పడుకోండి. పొద్దున్నే కలుద్దాము” అని వాళ్ళిద్దర్నీ రూముకి పంపించి ఆలోచనలో పడింది లలిత.

***

శిఖర్ని తీసుకుని బజారుకు వెళ్ళి, పదితులాల వెండి గణేషుడి విగ్రహం కొని, ప్యాక్ చేయించింది.. ఒక కేజీ మంచి రకం మిఠాయి తీసుకొని వెళ్ళి, గైడ్‌ని కలిసింది.

చక్కగా మాటలాడేరాయన. అతని టేబుల్ మీద రాకేశ్ శర్మ ఐఐటీ కాన్పూర్, ఎంటెక్, పిహెచ్‌డి ఈ డిగ్రీలన్నీ చూసేక.. కొంచం బాధ అనిపించింది. ఇంత ఉన్నత విద్యావంతులు చిన్న విషయాల కోసం, విద్యార్థుల ముందు ఎందుకు దిగజారి పోతున్నారో? అనుకుంటూ.. చేతిలోని గిఫ్టు, స్వీట్స్ అతనికి ఇస్తూ..

“సర్, ఈ చిన్న బహుమతి మీ శ్రీమతికి, పిల్లలకు ఇవ్వండి” అంటూ ప్యాకెట్లు అందించింది లలిత.

“ఏంటమ్మా? విప్పి చూపించండి” అన్నారు గైడ్. లలిత ప్యాక్ విప్పి చూపించింది.

“గుడ్” అన్నారు గైడ్. లలితకి అతని ఎదురుగా కూర్చోవాలంటే.. గిల్టీగా అనిపిస్తోంది.

గైడ్, గణేష్ బొమ్మని పట్టుకొని చూసి..

“బాగుందమ్మా. మీరు కూడా మందు బాటిల్స్ తేవలసింది కదా? ఇదెందుకు తెచ్చేరు?” అన్నాడు. లలితకేం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయింది.

మళ్లీ అతనే మాట్లాడుతూ..

“ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది అనగానే.. ఆఖరి సెమిస్టర్ పిల్లలంతా మందుసీసాలు పట్టుకొని ఒకళ్ళు, మరేదో పట్టుకొని ఒకళ్ళు వస్తూ ఉంటారు. తప్పుల్ని సరి చెయ్యటంలో ఆలస్యం అయితే భరించలేరు. ప్రాజెక్ట్ ఆపేస్తారేమోనని భయంతో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ.. గైడుని మంచి చేసుకోవాలని, సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకానీ వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకోరు. తొంభై పర్సంట్ విద్యార్థుల ఆలోచన ఇదే విధంగా ఉంది. గురువులకు కానుకలు ఇవ్వటం అనేది మొదటి నించీ ఉన్న ఆనవాయితీ. అప్పటి పరిస్థితులలో అది గౌరంగా భావించేవారు. ఇప్పుడు, విలువైన వస్తువులు లంచమిచ్చి, త్వరగా సంతకం చెయ్యకతప్పదని అన్నట్టు కదా! అది తప్పు. విద్యార్థుల మనస్తత్వంలో మార్పురావాలి. అయితే మరొకనెల ఆలస్యం అవుతుంది అంతే. తొందరెందుకు?

శిఖర్, చాలా తెలివైనవాడు. అందరితో పాటు శిఖర్ ప్రాజెక్ట్ ఆపేను. కష్టపడి, చదువుకొని ఇంతదూరం వచ్చేరంటే.. అందరూ తెలివైన వాళ్ళే. అందరి ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి అవుతుంది. బెంగపడద్దని తల్లిగా చెప్పండి. మీరూ, ఒక ఉపాధ్యాయునిగా ఉన్నారు. ఇటువంటి పనిని మీరు సమర్థించకూడదు. ఈ స్వీట్స్ తీసుకు వెళ్ళి శిఖర్ ఫ్రెండ్స్‌కి ఇవ్వండి. ఏదీ, నాకూ ఒకటి ఇవ్వండి. ఈ గణేషుడి బొమ్మని శిఖర్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇచ్చి పంపండి” అని గైడ్ స్వీట్ నోట్లో వేసుకుంటుంటే.. లలితకి సంతోషంగా అనిపించింది.

గైడ్‌తో మాటలాడేక ‘ఆచార్య దేవో భవ’ అనే సూక్తి గుర్తొచ్చి.. అవును, ఆచార్యుడు ఎప్పుడూ దైవంతో సమానమే అనుకుంటూ.. గైడ్‌కి నమస్కరించి తన విశ్వాసం వమ్ము కానందుకు, సంతోషంతో బయటకు వచ్చింది లలిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here