Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-65: మాస్కు మారితే..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

మాస్క్ మార్చిన అత్త ఉత్తమురాలూ ఓయమ్మా

మాస్క్ వాడిన కోడలు కడు ధన్యురాలమ్మా..

ఆహూ.. ఊహూ…

ఈ అత్తాకోడళ్ళేవిటీ…వాళ్ల మధ్య ఈ మాస్కుల గొడవలేవిటీ అనుకుంటున్నారా..

అవధరించండి..

సుశీల అత్తగారు.. ఆమెకి వినయవిధేయురాలైన కోడలు సుజన.

వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకళ్ళనొకళ్ళు ఎత్తిపొడుచుకోలేదు, దెబ్బలాడుకోలేదు.

అలాగని ఒకళ్లనొకళ్ళు తమకు మించి ప్రేమించేసుకోలేదు. ఒకరుకోసమొకళ్ళు జీవించేసెయ్యటంలేదు.

ఇద్దరూ కూడా ఎవరి హద్దుల్లో వాళ్ళుంటూ, ఒకరి కొకరికి ఎంత గౌరవం, ప్రేమా యివ్వాలో అంతమటుకే ఇచ్చుకుంటూ, ఒకరి ఇష్టాలనింకొకరు విమర్శించకుండా, ఎవరికి కావలసినట్టు వాళ్ళుంటూ ఆ యింటినీ, ఇంట్లో మగాడి మనశ్శాంతినీ చక్కగా కాపాడుతున్నారు.

మరింక విషయమేవిటంటారా.. అక్కడికే వస్తున్నా..

ఈమధ్య అందరూ మాస్కులు పెట్టుకు తీరాలనే నిబంధన ఒకటి వచ్చింది కదా.. అందుకని సుశీల కొడుకు, సుజన మొగుడూ అయిన రవి తల్లికీ, భార్యకీ కలిపి టోకుగా ఒక డజను కాటన్ మాస్కులు ఆన్‌లైన్‌లో తెప్పించేసేడు. దెబ్బలాడుకోకుండా ఆ డజను మాస్కులనీ అత్తకోడళ్ళిద్దరూ చెరొక అరడజనూ పంచుకున్నారు.

కానీ అక్కడే వచ్చింది చిక్కు.. ఆ వచ్చిన మాస్కులన్నీ కూడా ఒకే రంగు.. అదే ఆకుపచ్చరంగులో వున్నాయి.. ఏదెవరిదో ఎలా తెలుస్తుందీ.. అందుకని కోడలు తెలివిగా తను తీసుకున్న మాస్కులకి ఓ మూలగా తన పేరున్న అక్షరం ‘S’ కుట్టుకుంది. మూలగా ఆ అక్షరం లేకపోతే అత్తగారి మాస్కనీ, వుంటే తనదనీ సుజన బాగా గుర్తు పెట్టుకుంది. సుశీలకి కూడా ఆ సంగతి తెలుసు. అందుకే ఆ అక్షరం లేకుండా వున్న మాస్కు తనదని ఆవిడ కూడా గుర్తు పెట్టుకుంది. అందుకని రోజూ మాస్కులు ఉతికి ఆరేసుకున్నాక ఇద్దరూ ఆ గుర్తులని బట్టి ఎవరి మాస్కులు వాళ్ళు తీసుకుని వాళ్ల బట్టల్లో సద్దుకునే అలవాటు చేసుకున్నారిద్దరూ.

అస్తమానం అలా అనుకున్నట్టు జరిగిపోతే ఇంక కథేముందీ..

ఆరోజు కళ్లజోడు పెట్టుకోకుండా బట్టలు తీసుకోవడంవల్ల సుశీల బట్టల్లోకి సుజన మాస్కు వచ్చేసింది. అది గమనించకుండానే సుశీల ఆ మాస్క్ పెట్టుకుని ఎదురింట్లో చాలామంది కలిసి లలితాసహస్రం చదువుతుంటే తనుకూడా వెళ్ళింది. అక్కడ వాళ్ళు చదవడం అయ్యాక అందరికీ మైసూరుపాకులూ, మిక్చరూ ప్లేట్లలో పెట్టి ఇచ్చారు. మళ్ళీ పాపం ఇచ్చినవాళ్ళేమైనా అనుకుంటారేమోనని సుశీల ఓ వైపు చెవినుంచి మాస్క్ పక్కకి తప్పించి ఏమాత్రం మొహమాట పడకుండా ప్లేటు ఖాళీ చేసింది. అది పూర్తి చేసి మంచినీళ్ళు తాగుతుంటే పక్కనున్న వరలక్ష్మి “వదినగారూ, నాకు షుగరుందండీ.. స్వీటు పడేస్తే బాగుండదు.. కాస్త మీరు తీసుకుంటారా..” అనడిగితే పోన్లే పాపమనుకుంటూ ఆవిడ మాట మన్నించింది. ఇటు తిరిగేటప్పటికి వెనకింటి వనజ “అక్కయ్యగారూ, నాకు ఖారం తింటే కడుపులో మండుతుందండీ.. కాస్త ఈ మిక్చర్ తీసుకోరూ!” అని బతిమాలుతున్నట్టు అడిగితే అది కూడా నోట్లో పడేసుకుంది.

ఎక్కువసేపు మాస్కు పెట్టుకోకుండా వుండకూడదు కనక వెంటనే మూతికి మాస్కు తగిలించేసుకుంది సుశీల. అందరూ తినడాలవీ అయ్యాక అక్కడందరూ కలిసి సామూహికంగా భక్తిపాటలు పాడుకున్నారు. మంగళహారతులు పాడుకున్నారు. భక్తి విషయాలు పంచుకున్నారు. ఒకరి మంచిచెడ్డలొకరు కనుక్కున్నారు. కోవిడ్‌తో ఎక్కడ ఎంతమంది పోయేరో లెక్కలవీ చెప్పుకున్నారు. అందరికీ కామన్ టాపిక్కయిన టీవీ సీరియల్స్‌లో ముందేమవుతుందోనని చర్చించుకున్నారు. వాటన్నింటికీ మాస్కు అడ్డు రాదు కనక మాస్కు పెట్టుకునే ఆ కబుర్లన్నీ కానిచ్చేరు. ఆ కబుర్లవల్ల మైసూర్ పాక్ నేతి వాసన, మిక్చర్ నూనె వాసన కూడా సుశీల మాస్కుకి బాగా పట్టేసుకున్నాయి. అన్నీ అయ్యేక ఎవరిళ్ళకి వాళ్ళు మళ్ళేరు.

అంతసేపూ మాస్కు పెట్టుకుని కబుర్లాడిన సుశీల ఇంటికొచ్చి బట్టలు మార్చుకుంటున్నప్పుడు గుర్తించింది తను కోడలు మాస్కు పెట్టుకుని వెళ్ళినట్టు. అయ్యయ్యో ఎంత పొరపాటైందీ అనుకుంటూ గబగబా ఉతికి పెట్టేద్దామనుకునేటప్పటికి కోడలు ఆఫీసునుంచొచ్చే టైమయిందని తెలుసుకుంది. ఇప్పుడు ఉతికినా ఆరదు. అందుకని సబ్బునీళ్ళలో బట్ట ముంచి గట్టిగా పిండి, దానితో ఆ మాస్కు కిందా పైనా గట్టిగా తుడిచింది. వెంటనే మళ్ళీ పొడిబట్టతో ఇంకోసారి తుడిచింది. అది కాస్త తడి తగ్గిందని అనుకున్నాక, పట్టికెళ్ళి కోడలు బట్టలు పెట్టుకునే అలమారలో వున్న మాస్కులలో అన్నింటికన్న కిందగా పెట్టేసింది. కింద వుంటే ఓ రెండ్రోజులయ్యేక సుజన వాడుతుందనీ, అప్పటికి మాస్కుకున్న ఆ మాత్రం తడి కూడా పోతుందనీ సుశీల ఉద్దేశ్యం. అందుకనే అంత జాగ్రత్తగా ఆ మాస్కుని కోడలి బట్టల్లో పెట్టేసి అక్కడున్న తన మాస్కుని జాగ్రత్తగా చూసి తెచ్చుకుని తన బట్టల్లో పెట్టేసుకుంది.

అందరూ మనం అనుకున్నట్టే అనుకోరు కదా! ఆరేసిన బట్టల్లోవి కిందగా వున్నవి తీసి కట్టుకోవడం సుజన అలవాటు. పైన పెట్టినవి నిన్న ఉతికినవనీ, కింద వున్నవి రెండ్రోజులక్రితం వుతికినవనీ అనుకుని అలాగే సద్దుకుంటుంది సుజన బట్టలు. అందుకే ఆ మర్నాడు సుజన నిన్న అత్తగారు మర్చిపోయి పెట్టుకు వెళ్ళి, మళ్ళీ కోడలి బట్టల్లో అడుగున పెట్టిన మాస్కు హడావిడిగా పెట్టుకుని ఆఫీసుకి వెళ్ళింది.

అసలే సుశీల తిన్నది మైసూరుపాక్. ఒకటికూడాకాదు రెండూ. ఆ నేతివాసనంతా ఆ మాస్కుకి పట్టేసుకుంది. ఆ తీపికి ఆ కాటన్ మాస్కుపొరల మధ్యలోకి సన్నగా చీమలుకూడా చేరడం మొదలెట్టాయి. దానికి తోడు మిక్చర్ కుండే నిలవనూనె వాసన. రెండూ కలిసిపోయి మాస్కు కట్టుకోగానే ఒకవిధమైన వాసన గుప్పున సోకింది సుజన ముక్కుపుటాలకి.

ఆ… అదేదో బైట పిచ్చివాసనేమోలే అనుకుంటూ హడావిడిగా ఆఫీసుకి బయల్దేరిన సుజనకి దారిలోనే తన బుగ్గలమీద ఏవో పాకుతున్నట్టు అనిపించింది. గట్టిగా మాస్కుని మొహానికేసి రుద్దుకుంది. ఆఫీసుకి వెళ్ళేదాకా అలా రుద్దుకుంటూనే వుంది మొహాన్ని. లోపలున్న సన్నచీమలు ఊరుకుంటాయా.. వాటి కన్నంలో వేలెడితే కుట్టమా అన్నట్టు సుజన బుగ్గలమీద వాటి ప్రతాపం చూపించసాగేయి. ఆఫీసుకెళ్ళగానే సుజన వాష్ రూమ్ కెళ్ళి మాస్కు తీసి అద్దంలో మొహం చూసుకుంటూ కెవ్వుమంది. మూతిచుట్టూ సన్నచీమలు కుట్టడం వల్ల మూతంతా ఎర్రగా అయి, వాచిపోయి, ఆంజనేయుడి మూతిలా తయారైంది. హడిలిపోయి మాస్కు కట్టేసుకుంటే చీమలు కుట్టడం, నూనెవాసన.. ఏం చెయ్యాలో తోచలేదు సుజనకి. చీమల్ని ఒక్కటి లేకుండా చెయ్యంతా నొప్పెట్టేటట్టు మాస్కంతా దులుపుకునేటప్పటికి ఎక్కడలేని నీరసం వచ్చేసింది సుజనకి.

ఆ సింక్ నీళ్ళల్లో మాస్కుని కడిగీ కడిగీ గట్టిగా పిండి, ఆ తడి మాస్కే కట్టుకుని బయటికి వచ్చింది. వస్తుంటే దారంతా తనను చూసి మూతికీ, ముక్కుకీ కలిపి కట్టుకున్న మాస్కులని ఇంకాస్త గట్టిగా చేత్తో ఒత్తి పట్టుకున్న కొలీగ్స్‌ని చూసి ఎంతో సిగ్గుపడిపోతూ తన క్యూబికల్ దగ్గరకొచ్చింది.

“ఏమైందే?” పక్కనున్న రాధ అడిగింది.

“ఏమోనే.. ఏవిటో ఈ మాస్కంతా ఒకటే చీమలూ, పిచ్చివాసనానూ..” అంది ఏడుపొకటే తక్కువగా సుజన.

“అది నీదేనా.. లేకపోతే ఎవరిదైనా పెట్టుకుని వచ్చేసేవా!” ఆరా తీసింది.

“నాదేనే.. ఇదిగో.. ‘S’ కూడా ఉందిగా..” మరోసారి నిర్ధారించుకుంది సుజన.

“ఏం చెయ్యాలో తెలీటం లేదే.. పెట్టుకుంటే ఈ వాసన భరించలేకపోతున్నాను. పెట్టుకోకపోతే పబ్లిక్‌లో మాస్క్ పెట్టుకోకుండా వుండకూడదు కదా! పెట్టుకుతీరాలి.” అన్న సుజన మాటలకి

“పోనీ..ఆఫీసే కదా.. అందరూ మనవాళ్ళే.. తీసేద్దూ..పరవాలేదూ..” అంది రాధ.

ఆ మాటలన్న రాధకి మాస్కు ఒకవైపు చెవినుండి తీసి తన మూతి చూపించింది సుజన.

ఒక్కసారి కెవ్వుమంది రాధ.

“అదుగో.. అందుకే.. తియ్యటంలేదు.” అంటూ తల పట్టుకుని కూర్చుంది పాపం సుజన…

అందుకే అన్నారు మరి….

“మాస్క్ మార్చిన అత్త ఉత్తమురాలూ ఓయమ్మా

మాస్క్ వాడిన కోడలు కడు ధన్యురాలమ్మా..

ఆహూ.. ఊహూ…” అని…

Exit mobile version