మాస్టారి మాట

0
2

[‘మాస్టారి మాట’ అనే పిల్లల కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]

[dropcap]పం[/dropcap]డగ సెలవులన్నీ అయిపోవడంతో పాఠశాలలు తెరుచుకున్నాయి. పిల్లలంతా పాఠశాలకు వచ్చారు. నారాయణ రావు మాస్టారు ఒక్కొక్కరిని పిలిచి సెలవులు ఎలా గడిపారో చెప్పమన్నారు.

రాజీవ్ నిలబడి “నేను చుట్టాలు స్నేహితులతో భోగి సంక్రాంతి ఆనందంగా గడిపాను.” అన్నాడు.

రాకేష్ లేచి “నేను సంక్రాంతి నాడు గాలిపటం ఎగురవేసాను. కొత్త బట్టలు వేసుకుని ఊరంతా తిరిగాను, అమ్మ చేసిన పిండి వంటలు తిన్నాను” అన్నాడు.

రాహుల్ లేచి నిలబడి “కనుమ పండుగ నాడు మా ఊర్లో పెద్ద జాతర జరిగింది. ఆ జాతరలో ఆటవస్తువులు, తినుబండారాలు కొనుక్కున్నాను. నా స్నేహితులతో కలిసి ఆడుకున్నాను” అన్నాడు.

“పిల్లలూ మనం ప్రతి పండుగ నుంచి, ప్రతి సందర్భం నుంచి కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. పుస్తకాలు చదవడం ద్వారా, పురాణ పురుషులు, చారిత్రక పురుషులు మహనీయుల జీవిత చరిత్రల ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఆ స్థాయికి వెళ్లడానికి దోహదం చేసే అంశాలను తెలుసుకుంటే మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చెప్పండి, మధ్య కాలంలో ఏమేం జరిగాయో!” అనగానే

జోసెఫ్ లేచి “సార్! విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. దానికి నేను వెళ్ళాను సార్” అన్నాడు.

రాము లేచి నిలబడి “అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది సార్. మేము టీవీలో చూసాం” అన్నాడు.

“మనం ఏది విన్నా, ఏది చూసినా వాటి నుంచి కొంత నేర్చుకోవాలి. అంబేద్కర్ జీవితం నుంచి ఉన్నతంగా ఎలా ఎదగాలో తెలుసుకోవాలి. రామాయణం వింటే ఎలా జీవించాలో తెలుస్తుంది. అంతేకాదు రాముడిని ఒక పురాణ పురుషుడి గానే కాకుండా మనం ఒక గొప్ప నాయకుడిగా తెలుసుకోవచ్చు. మన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదిరించలేక మనం భయపడుతూ ఉంటాం. రాముడి జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయినా భయపడలేదు. తండ్రి మాటకు కట్టుబడి అరణ్యవాసం చేశాడు. కోతులు చూసి రమ్మంటే కాల్చి వస్తాయి అనుకోలేదు. అక్కడున్న కోతులన్నిటిని ఒక్క చోటికి చేర్చాడు. తన నాయకత్వ ప్రతిభతో వానర సాయంతో సీతమ్మ ఆచూకీ తెలుసుకున్నాడు. లంకా దహనం జరిగింది. తాను ముందుండి సేనను నడిపించాడు. వారధి నిర్మించాడు. రావణుడిపై విజయం సాధించాడు. నాయకుడంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. అందుకే జగదానంద కారకుడయ్యాడు.

మీరు కూడా మంచి నాయకులుగా ఎదగాలంటే తరగతి గదినుంచే ఆ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒక్కో తెలివైన విద్యార్థి ఇద్దరు లేదా ముగ్గురు తెలివి తక్కువ విద్యార్థులను దత్తత తీసుకోవాలి. వారు ఏ ఏ సామర్థ్యాలలో వెనుకబడ్డారో తెలుసుకుని వాటిని మెరుగుపరచాలి. ఇలా ఈ సమూహాలన్ని చక్కగా పనిచేయాలంటే తరగతికి ఒక నాయకుడు ఉండాలి. అతడి సామర్థ్యం మీదే తరగతి లోని విద్యార్థుల క్రమశిక్షణ ప్రతిభ ఆధారపడి ఉంటుంది. మీరు మంచి నాయకులుగా ఎదగాలంటే గొప్ప నాయకుల గురించి తెలుసుకోవాలి. ప్రతి దాంట్లో రెండు కోణాలు ఉంటాయి. మతం అని కాకుండా అందులో మంచిని మనం గ్రహించాలి” అని ముగించారు నారాయణ రావు మాస్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here