మాట్లండోయ్‌ మాట్లు..

2
2

[dropcap]“మా[/dropcap]ట్లండోయ్ మాట్లు, బిందెలకు, అండాలకు, డేషాలకు మాట్లేస్తాం మాట్లు” అంటూ మాట్లేసేవాడు వీధిలో వెళ్తున్నాడు.

‘ఈ బిందెకు సబ్బు ముక్క అంటించి వుంచినా నీరు చిమ్ముతూనే వుంది. సమయానికి మాట్లేసే వాడోచ్చినట్లున్నాడు’ అనుకుంటూ వంటింట్లోంచి వీధి గుమ్మం వరకు వచ్చి “ఇదుగో బాబూ నిన్నే ఇలా రా” అని మాట్లేసే వాడ్ని పిలిచింది పెంటమ్మ. తన చేతిలో వున్న బిందెను చూపిస్తూ బేరం కుదుర్చుకుంది.

“ఇదుగో ఈ బిందె అలాంటి.. ఇలాంటి బిందెకాదు. మా అమ్మమ్మ ఇచ్చింది, దాన్ని ఇచ్చేసి కొత్తది కొనుక్కోడానికి ఇష్టం లేక ఇదే బంగారంలా దాచుకున్నాను. జాగ్రత”

“ఇక్కడే మాట్లేసి ఇచ్చెయ్యి” అంది పెంటమ్మ.

“అల్లదుగోటమ్మ గారూ.. సీతారామాంజునేయ సినిమా హాలు ముందు చెట్లున్నాయి కదా, అక్కడే మావాళ్లు వున్నారు. అక్కడే మాట్లేసి ఒక్క గంట్లో తెస్తాను” చెప్పాడు మాట్లాసేవాడు.

నీరజా, వాణి, రజనీలు కూడా ఇంట్లోంచి వీధిలోకి వచ్చి వాళ్ళ ఇళ్ళలో కూడా మాట్లెయ్యవల్సిన తపేలాలు తెచ్చి ఇచ్చి బేరం కుదుర్చుకున్నారు. పాత్రలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు మాట్లేసేవాడు.

***

“ఇంకా తపేలాలు తేలేదేంటీ” అనుకుంటూ నీరజ వీధిలోకి వచ్చి సినిమా హాలు వైపు చూస్తోంది! వాణి గడియారం వైపు చూసింది. సాయింత్రం నాలుగైయ్యింది. ఒక్కొక్కరూ మాట్లు వాడి కోసం ఎదురుచూడసాగారు. అయినా మాట్లేసేవాడు తమ వస్తువులు తేలేదేంటా? అని వీధిలోకి వచ్చి ఇళ్ళకు తాళాలు వేసి అందరూ కలిసి సినిమా హాలు వద్దకు వెళ్ళారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నిర్ఘాంతపోయారు.

“ఇక్కడే మాట్లేసేవాడు వుండాలి కదా” అని అక్కడ పశువులు మేపుతున్న వార్ని అడిగారు.

“అరగంట క్రితమే అన్ని సామానులు తీసుకుని వెళ్ళి పోయాడు.” అన్నాడు పశువుల కాపరిలో ఒకడు.

తమ ఇళ్ళకు వెళ్ళాడేమో అని వాళ్ళంతా గాబరాగా బయరుదేరారు.

అతను అక్కడికి  కూడా రాకపోవడంతో వాళ్ళంతా లబోదిబో మన్నారు.

“ఇంకేముంది మీ అందరి బిందెలు, తపేలాలు తీసుకొని మాట్లేసేవాడు పరారై వుంటాడు.” అన్నాడు అప్పారావు.

మాట్లేసేవాడు చేసిన మోసానికి వెక్కి వెక్కి ఏడ్చింది పెంటమ్మ.

“మోసాలు రకరకాలు. తప్పు మనదే. అతనితో పాటూ మనం కూడా వెళ్ళాల్సింది. ఇక మీదనైనా తెలివిగా ప్రవర్తించాలి మనం” అంటూ అందరికీ  హితబోధ చేసింది ఓ మహిళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here