‘మా’విడాకులు

0
2

[dropcap]అ[/dropcap]ప్పుడే కొద్ది కొద్దిగా పొద్దు వాలుతోంది. సూర్య భగవానుడు తన డ్యూటీ ముగించుకొని వెళ్ళడానికి అన్నీ సర్దుకునే కార్యక్రమంలో ఉన్నాడు. అటు ఎండ ఇటు నీడ కాని మధ్యస్థపు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. విశాలంగా ఉన్న బాల్కనీలో అందమైన కుండీల్లో అంతకంటే అందంగా అమర్చబడిన రకరకాల రంగు రంగుల ఖరీదయిన, అరుదయిన పూలమొక్కల మధ్య వనదేవతలా కూర్చుంది సుష్మ. కనుచూపు దూరంలో ఎగిసిపడుతున్న అలలతో, చల్లగాలులకు సేదతీరుతూ తీరిగ్గా… ప్రశాంతంగా ఆ మలిపొద్దును ఆస్వాదిస్తున్న వృద్ధులతో, ఏమాత్రం భయం లేకుండా కెరటాలతో ఆడుకుంటున్న యువతీ యువకులతో, సముద్రపుటందాలను ఆస్వాదిస్తూ ముచ్చట్లలో మునిగిపోయిన ప్రేమికులతో, పిడతకిందపప్పు, కారంకారం మామిడికాయ ముక్కలు, వేడివేడి జొన్నపొత్తుల లాంటి తినుబండారాల బళ్ళతో సందడిగా కనబడుతోంది బీచ్.

అలా సాయం సంధ్యలో బాల్కనీలో కూర్చొని బీచ్‌ని, బీచ్ సందడిని చూడడం చాలా ఇష్టం సుష్మకి. అందుకే వెతికి వెతికి మరీ ఖరీదయిన ఆ ఫ్లాట్‌ని ఎంతో ఇష్టంగా కొనుక్కుంది. ముఖ్యంగా ఆ బీచ్ ఇసుకలో పోటీలు పడి మరీ ఇళ్ళు కడుతూ… మళ్ళీ అంతలోనే, ‘ఛ! సరిగ్గా కుదరలేదం’టూ దానిని చెరిపేసి, ఇంకా అందంగా ఎలా కట్టాలా అని ప్లాన్ చేస్తూ, ఒకరిని మించి ఒకరు అందంగా ఇళ్ళు కట్టడంలో పోటీలు పడుతున్న పిల్లల్ని చూడడం ఓ మార్చుకోలేని మధురమైన అలవాటుగా మారిపోయింది. ప్రతి రోజూ అదే దృశ్యం… మళ్ళీ మళ్ళీ చూస్తున్నా బోర్ కొట్టడం లేదు. తన ఈ అలవాటు తనకే వింతగా ఉంది సుష్మకి. ఒకప్పటి తన ఆలోచనలకి ఇప్పటి ఈ అలవాటుకి ఎంత తేడా! తనకు తెలియకుండానే గతంలోకి జారుకుంది.

***

“వ్వాట్….!? నువ్వేం మాట్లాడుతున్నావో నీ కర్థం అవుతోందా!?” దాదాపు అరిచినట్టే అన్నాడు మానస్. అతని గొంతులో అరుపు కంటే ఏదో వినకూడని మాట విన్న విస్మయం, బాధ, ఎక్కువగా వినిపించాయి.

“ఎస్! మానస్…. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. అర్థం కానిది నీకే…. అయినా ఇందులో అంత ఆశ్చర్యపోడానికేముంది?” చాలా కూల్‌గా అంది సుష్మ.

“ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నపుడు గాని, అది అమలు చేసినపుడు గాని నాకు చెప్పాలనిపించాలేదా? నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యడమే కాకుండా ఇంత కేజువల్‌గా ఎలా ఉన్నావు?” కోపాన్ని మించినదేదో వినిపిస్తోంది మానస్ గొంతులో.

“అబ్బ! ఊరికే అలా ప్రొలాంగ్ చెయ్యకు మానస్! నీతో చెప్తే ఒప్పుకునేవాడివా? కాదు.. కూడదు.. అంటూ ఒకటే నస పెడతావు. ఆ నస భరించడం నా…. వల్ల కాదు. అయినా ఏదో ఘోరం జరిగిపోయినట్టు ఎందుకలా అరుస్తావు? ఇప్పుడేమయిపోయింది. సరే…. అన్నట్టు నాకు క్లయింట్‌తో మీట్ ఉంది… టైమవుతోంది నేను వెళ్ళాలి…” మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా లేచి వెళ్ళపోయింది సుష్మ.

ఆమె వెళ్ళిన వైపే చూస్తూ “ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది….!” అనుకున్నాడు. చాలా సేపు అలాగే ఉండిపోయిన మానస్ ఒక నిర్ణయానికొచ్చినట్టు మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు.

***

“అమ్మా! అరగంటయింది నేనొచ్చి. ఏదో మాట్లాడాలి అర్జంటుగా రమ్మని ఫోన్ చేసావు… తీరా నేను వచ్చి ఇంతసేపయింది. ఏవేవో మాట్లాడుతున్నావు గాని అసలెందుకు పిలిచావో ఇంతవరకు చెప్పలేదు… ఏంటి విషయం? నాకు షూట్‌కి టైమవుతోంది వెళ్ళాలి….” అసహనంగా అంది సుష్మ ఎదురుగా కూర్చున్న తల్లి సుమతి వైపు చూస్తూ.

కూతురి మాటలకు చురుగ్గా చూసిన సుమతి అంది, “చూడు పాపా… నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నిజమే నీ నిర్ణయాలు నువ్వే తీసుకోగల తెలివైనదానివే. కాని ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు. నీకంటూ ఓ కుటుంబం ఉంది. నీ ప్రతి విషయంలోనూ పాలుపంచుకునే భర్త ఉన్నాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నీ భర్తతో కూడా సంప్రదించి ముందుకెళ్లాలి. నువ్వు నాతో చెప్పించుకునేంత చిన్నపిల్లవు కాదు. కాని ఒక తల్లిగా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను.”

“ఓ! మానస్ విషయాన్ని నీకు చేరేసేసాడన్నమాట”

“అవును ఎంతో అపురూపంగా నీ నోట వినాల్సిన మాట, వినకూడని విధంగా మానస్ ద్వారా వినాల్సి వచ్చింది.” కినుకగా అందావిడ.

“అబ్బ! మమ్మీ నువ్వు కూడా మానస్ లాగే చిన్న విషయానికి ఇంత ఇష్యూ చేస్తున్నావేంటి?” విసుగ్గా అంది సుష్మ.

“ఏంటి చిన్న విషయం!? ఎవ్వరికీ…. కనీసం భర్తకి కూడా చెప్పకుండా అబార్షన్ చేయించుకోడం నీకు చిన్న విషయంలా అనిపిస్తోందా? పోనీ చెప్పడం… చెప్పకపోవడం వదిలేయ్. నువ్వు చేసిన పని ఎంతవరకు సమంజసం? అది ఆలోచించావా?”

“ప్లీజ్ మమ్మీ…. ఊరికే నేనేదో పే….ద్ద తప్పు చేసినట్టు మాట్లాడకు. ఇంత పొట్టేసుకొని తిరగడం, పిల్లల్ని కనడం, ఆ ఝంఝాటమంతా ఐ కాంట్ బేర్….నావల్లకాదు.” చీదరగా అంది సుష్మ.

“నీకు బుద్ధుందా? ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా అవి?” గుడ్లురిమిందావిడ

మాట్లాడలేదు సుష్మ. అసహనంగా కదిలింది.

“వినపడుతోందా? రెట్టించిందావిడ. మళ్ళీ తనే తగ్గి కూతురికి బ్రెయిన్ వాష్ చెయ్యడం ప్రారంభించింది.

“చూడు సుష్మా! నువ్వు మరీ చిన్నపిల్లవి కాదు. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఝంఝాటం అనుకోవడం దారుణం. ఎవరైనా వింటే నవ్వి పోతారు. నవ్వడం కాదు అసహ్యం … అసహ్యించుకుంటారు. నిన్ను మనిషిలా కూడా చూడరు….”

“స్టాపిట్ మమ్మీ… నేనేదో నేరాలు ఘోరాలు చేసినట్టు మాట్లాడుతున్నావు! అసలు నవ్వడానికి, అసహ్యించుకోవడానికీ నేనంత కాని పనేం చేసాను. ఏం నువ్వు కూడా ఉద్యోగం చేసావు. ఆ జాబ్‌లో ఎదగడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఎందుకంత కష్టం… నువ్వు ఉద్యోగం చేస్తే గాని గడవని పని లేదు కదా మనకు. జాబ్ మానెయ్ అని నాన్న అంటే నువ్వు విన్నావా? జాబ్‌లో ఎదగాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఇంకా కష్టపడలేదా…? ఇప్పుడు నేను కూడా అంతే….నా కెరీర్‌లో పైపైకి పోవాలన్నదే నా లక్ష్యం. దానికోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధం. అప్పుడు నువ్వు దేనికోసం కష్టపడ్డావో దానికోసమే నేను కూడా ప్రయత్నిస్తున్నాను. ఏం నీకో రూలు నాకో రూలూనా?” తల్లిని నిలదీసింది సుష్మ.

“చాల్లే ఆపు. నా ప్రయత్నం నీ ప్రయత్నం ఒక్కలాగే ఉన్నాయా? నేను ఎదగడానికి కష్టపడ్డాను. కాని కుటుంబం అక్కర్లేదనుకొని కుటుంబ సభ్యుల్ని బాధపెట్టలేదు. భర్త భావాలను దెబ్బతీయలేదు. అన్నిటి కంటే ముఖ్యంగా మాతృత్వాన్నే ఒద్దనుకోలేదు. దేనికెంత ప్రాధాన్యత ఇవ్వాలో ఇచ్చి నెగ్గుకొచ్చాను… అదీ ఇదీ ఒకటేలా అవుతాయి?” కోపంగా అంది సుమతి.

“మమ్మీ! ఆ రోజులు వేరు… ఈ రోజులు వేరు. నీ కెరీర్ కోసం అప్పటి నీ కాలానికి తగ్గట్టు నువ్వు కష్టపడ్డావు. ఇప్పుడు నా కాలానికి తగ్గట్టు నేను డెసిషన్ తీసుకుంటున్నాను. దానికెందుకింత రాద్ధాంతం చేస్తున్నారో నాకర్థం కావడంలేదు. అయినా ఈ గొడవంతా మానస్ వల్లే. ప్రతి విషయాన్ని నీకు చేరేస్తాడు. నువ్వేమో నాకు క్లాసులు పీకడం. ఇద్దరూ కలిసి నాకు పిచ్చేక్కిస్తున్నారు.” అరిచింది.

ఇంతలోనే, “ఏంటీ… నా పేరే కలవరిస్తున్నావు?” అంటూ వచ్చాడు మానస్.

ఆ క్షణంలో అక్కడ అతణ్నలా చూడగానే చిర్రెత్తుకొచ్చింది సుష్మకు. తల్లి దగ్గర అలా ఇరికించేసిన అతడి మొహం కూడా చూడాలనిపించలేదు. అక్కడ్నుంచి లేచి వెళ్లిపోబోయింది. అది గమనించిన మానస్ గభాల్న ఆమె చెయ్యి పట్టి ఆపేసాడు.

“మాట్లాడుతుంటే అలా వెళ్లిపోతావేంటి?” తల్లి కోపంగా అనడంతో మళ్ళీ కూర్చుండిపోయింది.

“చెప్పు… నాకు షూట్‌కి టైమవుతోంది వెళ్ళాలి…” విసుగ్గా అంది.

“ఏంటి… మాటకు ముందు షూట్…. టైమవుతోంది అంటూ ఓ తొందరపడి పోతున్నావు. అసలు నువ్వు మోడలింగ్ లోకి వెళతానంటేనిన్ను ఎంకరేజ్ చేసిందెవరు? మానస్ కాదా? తనకున్న పరిచయాలతో నిన్నొక మోడల్‌గా నిలబెట్టింది మానస్ కాదా? ఇప్పుడు ఆ మానస్‌తో కూడా మాట్లాడడానికి టైం లేనంత బిజీ అయిపోయావా?” అతి కష్టం మీద కోపాన్ని అదుపులో పెట్టుకుంటోంది సుమతి.

“అంటే…. అంటే…. తను ఎంకరేజ్ చేసాడు కాబట్టి అతను నా చుట్టూ గుండ్రటి గీత గీసేసి, అందులోనే ఉండు అంటే… ఆ గీత దాటకుండా… బావిలో కప్పలా బతికేయ్యాలా? నాకంటూ గోల్ ఏదీ ఉండదా? ఏంటీ రచ్చ నాకు…. నేనేదో చెయ్యరాని పనేదో చేసినట్టు నాలుగు రోజులనుంచి ఒకటే నస మొదలు పెట్టాడు. అది చాలదన్నట్టు మొన్నటికి మొన్న మా అత్తా, మామల్ని ఉసిగొలిపి నాకు నీతులు చెప్పించాడు. నిన్నటికి నిన్న వాళ్ళక్క … అదే మా ఆడపడుచు చేత సుద్దులు చెప్పించాడు. ఇప్పుడు … ఇప్పుడు నిన్ను ప్రయోగించాడు నా మీదకు…” కసిగా అంది సుష్మ.

“ప్రయోగించడమేంటి…? ఉన్నదే చెప్పాను. ఇందులో తప్పేంటి. అయినా నేనేం బయటికెళ్ళి డప్పు కొట్టి ఎవరెవరికో చాటింపు వెయ్యలేదు కదా! నేనెంత చెప్పినా నువ్వు వినకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్తితుల్లో అదీ మన కుటుంబసభ్యులకే గా చెప్పాను. అసలు నువ్వు ఒక ఆడదానిలా ప్రవర్తిస్తున్నావా? అవున్లే… పిల్లల్ని కనడం అసహ్యం, పిల్లలంటే అయిష్టం అనే ఆడదానివి కదా…ఇంతకంటే మంచిగా ఎలా మాట్లాడతావు…” ఇక సహించలేనట్టు ఎగిరాడు మానస్. కూర్చున్న చోటు నుంచి లేచి కుర్చీని వెనక్కి తన్ని పారేసాడు.సుష్మ మాటలతో మానస్ ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుంది.

“అదిగో … అలా నోరు పారేసుకుంటే బాగుండదు… చెప్తున్నాను…” నేనేం తీసిపోయానా అన్నట్టు తనూ అదే పని చేసింది సుష్మ.

పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన సుమతి మధ్యలోకి వచ్చింది. “ఆగండాగండి… ఏంటిది! మీకేమైనా పిచ్చెక్కిందా…”

“లేకపోతే ఏంటాంటీ … నేనెంత ఓపిగ్గా ఉన్నా, తనెంత మూర్ఖురాల్లా ప్రవర్తిస్తోందో చూసారా…! పెళ్ళయి పదేళ్ళవుతోంది… పిల్లలొద్దు కెరీర్ ముద్దు అంటూ అరిగిపోయిన రికార్డ్ లా పాట పాడుతుంటే… సరే… తన ఇష్టాన్ని కాదనడమెందుకు… కాలం గడిస్తే మారుతుందేమో అని ఇంతవరకు ఓపిక పట్టాను. అర్థం చేసుకోకుండా ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతోందో చూడండి…”

“ఇప్పుడేంటీ…! కంటేనే పిల్లలా…! పిల్లల్ని కంటే నా ఫిగర్ పాడయిపోతుంది… నాకు చాన్సులు రాకుండా పోతాయి. నా కెరీర్ అడుగంటిపోతుంది… చెప్తే వినవేంటి? అయినా నీకు పిల్లలంటే అంత ఇంట్రస్ట్ ఉన్నపుడు ఎవర్నయినా ఎడాప్ట్ చేసుకుందామని చెప్పాను… ఊహూ…. అలా పనికిరాదట….” తల్లివైపు చూస్తూ అరిచింది సుష్మ.

“అదే… అదే…నేనూ అడుగుతున్నాను. నీ మాట నీదే కానీ నా మాట వినవా…? ఎడాప్ట్ చేసుకున్న పిల్లలు కన్నబిడ్డలవుతారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనకు బిడ్డల్ని కనడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, నువ్వన్నదానికి నేనూ ఒప్పుకునేవాడ్ని. కాని మనకా పరిస్థితి లేదుగా! నీకు ఎందుకు అర్థం కావడంలేదు…?” తీవ్రంగా అన్నాడు మానస్.

“సరే … సరే….నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలే కావాలీ అంటే దానికి కూడా ఒక ఆప్షన్ చెప్పాను… దానికెందుకు ఒప్పుకోవు..?”

“ఛీ…ఛీ… సిగ్గులేదూ అలా చెప్పడానికి…? ఏం నీ గర్భం పిల్లల్ని కనడానికి పనికిరాకుండా పోయిందా ఏం? అద్దె గర్భంతో పిల్లల్ని కనడానికి….!” సంస్కారాన్ని కూడా మర్చిపోయే దశకు వచ్చేసాడు మానస్.

“నోటికొచ్చినట్టు నీచంగా వాగొద్దు. ఈ రోజుల్లో అది ఎంతో సహజం. ఎంతోమంది సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కంటున్నారు. అదే నేను చెప్పాను.”

“నేనూ అదే అడుగుతున్నాను. నువ్వు పిల్లల్ని కనడానికి పనికిరావా… సరోగసీకి వెళ్దామంటున్నావెందుకు? అని….”

“అదిగో మళ్ళీ అదే మాట … సంస్కారం లేకుండా మాట్లాడకు… బాగుండదు… చెప్తున్నాను” గొంతు చించుకుంది సుష్మ.

“అబ్బో… సంస్కారం! పిల్లల్ని కనడం నాకిష్టం లేదు… వేరే ఆడదాని గర్భాన్ని అద్దెకు తెచ్చుకొని పిల్లల్ని కనమని చెప్తున్నావు… నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు… “

పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన సుమతి మధ్యలోకొచ్చింది. “సుష్మా… ఏంటా నోటి దురుసు…., మానస్ నువ్వు కూడా ఏంటి?” ఇద్దర్నీ మందలించింది.

“సుష్మా నీకు అనుభవం లేక ఇలా మాట్లాడుతున్నావు… సరోగసీ పధ్ధతి ద్వారా బిడ్డను పొందడం అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే చెయ్యాలి. ఆరోగ్య పరమైన సమస్యలు ఇతరత్రా తప్పనిసరి పరిస్తితిలో మాత్రమే సరోగసీకి వెళ్ళాలి. నీకు అలాంటి ఇబ్బందులేవీ లేవు. అలాంటపుడు ఇలాంటి పద్ధతులకు వెళ్ళడం కరెక్ట్ కాదు. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర్నుంచి మన చేతుల్లోకి వచ్చేవరకు ప్రతి దశలోను ఆడది పొందే అనుభూతి, ఆనందం మనం స్వయంగా బిడ్డను కడుపులో మోసినపుడే దొరుకుతుంది. సరోగసీలో అలాంటి అనుభూతి నీకు దొరుకుతుందా!? బిడ్డలంటే షాప్‌లో కొనుక్కునే వస్తువులు కాదు. డబ్బులు పడేసి ఇంకెవరో కడుపున మోసి కన్న తరవాత మనం తెచ్చుకోడానికి. అదీకాక ఆ పద్ధతిలో లీగల్‌గా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. లీగల్ గానే కాదు సోషల్ లైఫ్‌లో కూడా చాలా విమర్శలు, అనుమానాలు, అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని నేను చెప్పను. కాని చాలా వరకు ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటివి ఎంతోమంది విషయంలో మనం వింటున్నాం. అలాంటప్పుడు ఈ రభసంతా నీకు అవసరమా చెప్పు. ఇంకో విషయం… పిల్లల్ని కంటే ఫిగర్ పాడవుతుందని కెరీర్ పాడవుతుందని అనుకోవడం నీ భ్రమే. ఎందుకంటే ఎంతోమంది పిల్లల్ని కని, పెంచి, సక్సెస్ఫుల్ ఫేమిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు…. ” ఇంకా ఏదో చెప్పబోతున్న సుమతిని ఆపేసింది సుష్మ.

“ప్లీజ్ మమ్మీ! ఇవన్నీ వినీ వినీ విసుగొచ్చేసింది. మళ్ళీ నువ్వు కొనసాగించకు. ప్లీజ్….. ఈ విషయం మీదే మాట్లాడాలంటే మాత్రం మళ్ళీ నాకు ఫోన్ చేసి పిలిపించకు….. సారీ… ఇలా అంటున్నానని ఫీలవకు. నేను వెళ్తున్నాను…” లేచి మానస్ వైపు నిరసనగా ఓ చూపు విసిరి విసవిసా వెళ్ళిపోయింది సుష్మ.

తెల్లబోయి చూస్తూ ఉండిపోవడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయింది సుమతి. కూతురు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదామె. ఇంత బాధ్యత, బంధం తెలియకుండా పెంచిందా తను? తనను తనే ప్రశ్నించుకుంది. అల్లుడి వైపు సూటిగా చూడలేకపోయింది.

ఆమె ఇబ్బందిని గమనించిన మానస్, “ఓకే ఆంటీ నేను వెళ్లొస్తాను” అంటూ లేచాడు.

“సారీ మానస్ …” ఇబ్బందిగా చెప్పింది.

“ఇట్స్ ఒకే ఆంటీ…. మీరేం చేస్తారు… మీరు చేయాల్సిన ప్రయత్నమంతా చేసారు… ఏం జరిగితే అదే జరగనివ్వండి…. సరే! నేను వెళ్లొస్తాను.” చెప్పి వెళ్ళిపోయాడు మానస్.

***

ఇది జరిగిన కొన్ని నెలలకే, మావిడాకులతో ఒకటయిన సుష్మ, మానస్‌ల జీవితాలు విడాకులతో వేరయిపోయాయి. బంధాలను వదిలించుకొని బయటపడడంతో స్వేచ్ఛాజీవిలా తన మార్గంలో తనకు నచ్చిన విధంగా సాగిపోయింది సుష్మ. మోడల్‌గా ఒక స్థాయికి చేరుకుంది. కుప్పలు తెప్పలుగా అవకాశాలు… దాని వెంటే వద్దన్నా డబ్బు. వచ్చిన డబ్బుని తెలివిగా వ్యాపారాల్లో పెట్టడంతో అది మరింతగా పెరిగిపోయింది. వద్దన్నా వచ్చి పడుతున్న డబ్బు… మోడల్‌గా మంచి అవకాశాలు…. దాంతో పాటు సంఘంలో ఒక స్థాయి…. తను నోరు తెరిచి చెప్పడం ఆలస్యం తనకు కావలసింది తెచ్చి అందించే నౌకర్లు… తను ఏదైతే కోరుకుందో అది కష్టపడి దక్కించుకుంది. ఇంతకంటే కావలసిందేముంది. ఇదే కదా… ఇదేకదా … తను కోరుకుంది. ఎస్ …. తను చేసింది తప్పు కాదు …. అస్సలు తప్పు కాదు…. తను ధైర్యం చేసి బంధాల నుంచి బయటపడకపోతే ఇదంతా సాధ్యమయేదేనా! అయితే ఈ క్రమంలో తల్లితో కూడా విభేదాలు రావడంతో పుట్టింటికి కూడా దూరమయింది. రెండేళ్ళ క్రితం తల్లి మరణించడంతో పూర్తిగా పుట్టిల్లే లేకుండా పోయింది.

***

కొన్ని సంవత్సరాలుగా తీరికన్న మాటకే ఆస్కారం లేకుండా కెరీర్‌లో ముందుకు దూసుకుపోయిన సుష్మ ఇప్పుడిప్పుడే స్థిమితంగా కూర్చొని గతాన్ని నెమరువేసుకుంటోంది. పెరుగుతున్న వయసుతో అవకాశాలు బాగా తగ్గాయి. అవకాశాలతో పాటు తన వెన్నంటి ఉండే భజనబృందం కూడా కనుమరుగయిపోయింది. అయితే తెలివిగా డబ్బుని వ్యాపారాల్లో పెట్టడంతో అవకాశాలు తగ్గినా ఎలాంటి భయం లేకుండా హాయిగా కూర్చొని రాణివాసం అనుభవించగలుగుతోంది. ఆ క్రమంలోనే మహానగరంలో సముద్రపుటొడ్డున ఖరీదయిన ఫ్లాట్ కొనుక్కొని తనకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకొని ప్రశాంతంగా, హాయిగా బ్రతికేస్తోంది.

“నువ్వు నిజంగానే ప్రశాంతంగా, హాయిగా బ్రతకుతున్నావా!” ఈ మధ్య తరచుగా అంతరాత్మ ప్రశ్నిస్తోంది సుష్మను. అవును! నిజమే!! ఆ ప్రశ్నకు గతంలోలా దర్జాగా, ధీమాగా సమాధానం చెప్పగలదా తను….!? తన నోట్లో మాట నోట్లో ఉండగానే అన్నీ అమర్చిపెట్టే పనివాళ్ళు… తను కోరుకున్న సౌకర్యాలన్నీ నిముషాల్లో సమకూర్చి పెట్టగల బేంక్ బేలన్స్…. తన విజయాన్ని, కీర్తిని, తన స్థాయిని అనుక్షణం గుర్తు చేస్తూ కళ్ళెదురుగా కనబడుతున్న చిహ్నాలు…. వీటన్నిటితో పాటు తన జీవితంలో పూరించలేని లోటుగా భయపెడుతున్న ఒంటరితనం, అనుక్షణం ఆ ఒంటరితనాన్ని గుర్తు చేసే భయంకరమైన నిశ్శబ్దం. ఒంటరితనం ఇంత బాధపెడుతుందని, నిశ్శబ్దం ఇంత భయపెడుతుందని, నిరంతరం కట్, స్టార్ట్ రణగొణ ధ్వనుల మధ్య బతికేసిన తనకు తెలీలేదు. ఇప్పుడిప్పుడే అనుభవం లోకి వస్తోంది.

“ఎంత సాధించినా, ఎన్ని సాధించినా నీకు సాంత్వన కలిగించేది నీ కుటుంబం, నీ కడుపున పుట్టిన పిల్లలే” ఒకప్పుడు అమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు పదేపదే గుర్తొస్తున్నాయి.

 “అమ్మా లైట్ వెయ్యమంటారా?” ఆ మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుష్మ. చుట్టూ చూసింది. ఆలోచనల్లో పడి గమనించలేదు గాని బాగా చీకట్లు కమ్మేశాయి.

“ఆ … వెయ్యి” ఆమె జవాబు విని లైట్ వేసి వెళ్ళిపోయింది పనమ్మాయి.

మళ్ళీ ఆలోచనలో పడిపోయింది సుష్మ. కొంతకాలం నుంచి ఒకటే ఆలోచన.

ఏం చెయ్యాలి…? ఎంతకాలం… ఈ ఒంటరి బతుకు? చుట్టూ మనుషులే… చేతినిండా డబ్బే…. విలాసవంతమైన జీవితం…. అయినా ఎదో వెలితి! తన మూర్ఖత్వమే ఈ పరిస్థితి తీసుకొచ్చిందా…. బాల్కనీలో కూర్చిని చూస్తుంటే అమ్మా, నాన్నల చేతులు పట్టుకొని నవ్వుతూ…తుళ్ళుతూ… ఆనందంగా గంతులేస్తున్న పిల్లల్ని చూస్తుంటే… ఒకటే ఆలోచన తన మనసును తొలిచేస్తుంది.

తనకూ ఓ కుటుంబం…. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలుంటే….! హుం… ఇప్పుడెక్కడ్నుంచి వస్తారు? ఇదంతా తన చేతులారా చేసుకున్నదేగా!

పోనీ ఒకప్పుడు తను మానస్ కిచ్చిన సలహా …. అదే ఎవర్నయినా ఎడాప్ట్ చేసుకుంటే!? నో…. అది కుదిరే పని కాదు… ఎందుకంటే ఒక పసిపిల్లను తీసుకొచ్చి ఇప్పుడు తను పెంచగలదా!? ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయిన తను ఇప్పుడు ఒక పసిపిల్లను పెంచడం సాధ్యమయే పనేనా…!? ఎంతమంది పనివాళ్ళుంటే మాత్రం తను బిడ్డను పెంచగలదా? పోనీ … మరీ పసిపిల్లను కాకుండా, కొంచెం పెద్దపిల్లను తెచ్చి పెంచుకుంటే …

నో..నో… అదయితే అస్సలు అయ్యేపని కాదు. ఎందుకంటే ఊహ తెలిసిన పిల్లలు తనను అమ్మగా మనస్పూర్తిగా ఒప్పుకోగలరా? అలా వచ్చిన పిల్లకు తనకు మధ్య, తల్లీబిడ్డల బాండింగ్ ఏర్పడుతుందా? ఆ గేప్ అలాగే ఉండిపోతుంది కదా! మరెలా!? ఏం చెయ్యాలి? ఈమధ్య తరచుగా ఇవే ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటున్నాయి. ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతున్నాయి….కాని వాటికి ఒక రూపం రావడం లేదు.

ఇలా ఎన్నాళ్ళు!? తన పరుగులు…తనకేం మిగిల్చాయి? ఇదేనా? ఈ ఒంటరితనమేనా? అందర్నీ కాదనీ, అందర్నీ ఎదిరించి తను సాధించిందేంటి? సమాధానం దొరకని ప్రశ్నలు సుష్మ బుర్ర నిండా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here