[‘మాయ’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం డా. కాళేగౌడ నాగవార.]
[dropcap]కో[/dropcap]డెను అమ్మిన డబ్బు లోపలి జేబును లాగుతుండగా, ఆ సమయంలో ఒక్కడే ఆరుమైళ్ల దూరంలోని తన ఊరికి వెళ్లడానికి పెద్దయ్య మనస్సు ఒక్క క్షణం వెనుకంజ వేసింది. హోటల్లో భోజనం చేసి, డబ్బులిచ్చి, బయటికి వస్తున్నప్పుడు గల్లాపెట్టె ముందు కూర్చున్న వ్యక్తిని టైము అడిగి, తొమ్మిదిన్నర అని తెలిసిన తరువాత కూడా – ఇక్కడ ఇతరుల వసారాలో దిక్కులేని శవంలా పడివుండటానికి బదులుగా, ఇల్లు చేరడమే మేలని పదిసార్లు అనుకున్నాడు. అయ్యో పాలలో వచ్చింది పాలకు, నీళ్లల్లో వచ్చింది నీళ్లకు; నా నిజాయితీ నన్ను కాపాడవలసిందే, కనిపించినవారి గంటు ముట్టినోళ్లు బతకటం అంతలోనే ఉందని గొణుక్కుంటూ, సమాధానపడుతూ నడుస్తున్నాడు. నీటివాగు దారిలా చిరపరిచితమైన ఆ దారిలో వెన్నెల వెలుతురులో వెళ్లటానికి మనసు వెనుకంజ వేయటం గమనించి అతనికి సిగ్గు వేసింది.
పగటిపూటంత స్పష్టమైన వెన్నెలలో చెరువు నీళ్లు మెరుస్తున్నాయి. పొడువైన గట్టుమీద అతనొక్కడే సుమారు ఒకటింపావు మైలు నడవాల్సి వచ్చింది. ఆ పురాతన చెరువు చోళులకాలం నాటిదని జనం చెప్పేవారు. గట్టు ఈ చివరన అంతే పురాతనమైన శివుని గుడి ఉంది. గుడికి ఎదురుగా బట్టలు ఉతకటానికి, స్నానం చేయడానికి అనుకూలమైన స్నానఘట్టం మెట్లు మెట్లుగా పరిచిన బండపరుపులు, పగటిపూట సదా కోలాహలంగా గుమిగూడే జనం. ఇప్పుడు కూడా ఎవరో అక్కడ కూర్చునివున్నారు. పెద్దయ్య తన కళ్లను తానే నమ్మలేక, బెదిరిపోయి, తదేకంగా చూశాడు. నీటితో తడిసిన చివరి మెట్టు మీద ఒక ఆడమనిషి కూర్చుని వుండటం స్పష్టమైంది. చప్పున ఆగాడు. నిలుచున్న చోటి నుంచే తన భయమంతా పరుగుతీసేలా బిగ్గరగా “ఇది ఎవరి పిల్ల?” అన్నాడు. మోకాళ్లపై తల వాల్చి, నీళ్లకు ఎదురుగా వంగి కూర్చున్న ఆమె మాట్లాడలేదు. ఇటువైపు తిరగలేదు. పెద్దయ్య అడుగు ముందుకు వేయకుండా, “అయ్యో, భయపడ్డాను. ఎవరు నువ్వు?” అని అరిచాడు. ఈ ఆర్భాటానికి కాస్త కదిలిన ఆడమనిషి పక్కకు తిరిగి చూసింది. పిలుస్తున్న వ్యక్తి తన వీపుకు సూటిగా నిలబడివుండటం వల్ల ఆమెకు కనిపించలేదు. పెద్దయ్య మరోసారి బిగ్గరగా పిలిచాడు. అతని కాళ్లుచేతుల్లో వణుకు. ఏదైతే అది కానీ అనే చిన్న ధైర్యం రెండూ చేతులు కలిపి పోటీ పడ్డాయి. ఆమె పూర్తిగా వెనక్కి తిరిగి ‘నేను’ అంది. ఆ కంఠస్వరం పరిచితమైందికాదు. “నేను అంటే ఎవరమ్మా?” అన్నాడు. అటువైపు నుంచి మళ్లీ మాటలు లేవు.
ధైర్యం తెచ్చుకుని పెద్దయ్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె కూర్చున్న చోటే తలెత్తింది. సుమరు ముప్ఫయి ఏళ్ల ప్రాయంలోని స్త్రీ. ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. ఆమె భావరహితమైన స్థితి అతడిని ఆత్మీయంగా, బలంగా కదిలించింది. ఊరు, వీధి, పేరు, ఈ సమయంలో ఇక్కడికి రావటానికి కారణం – మొదలైనవన్నీ అడగసాగాడు. ఆమె దేనికీ సమాధానం ఇవ్వలేదు. ఆమె మూగది కాదని కచ్చితమైంది. ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నటువంటి, అయితే జీవితం మీద ఆశ ఉన్న వ్యక్తి కావచ్చని అనిపించింది. ఆ నిశ్శబ్దంలో తానొక్కడే మాట్లాడి ఆయాసపడ్డాడు. అతనిలో ఇప్పుడు భయం కనిపించలేదు. ఈ విచిత్రమైన స్థితిలో దిక్కుతోచక, తానూ కూర్చుని ఆలోచించసాగాడు.
నీలాకాశంలోని చంద్రుడిలా, వెన్నలలోని చిన్న అలలతో సమ్మోహనంగా తొణికిసలాడే ఆ పెద్ద చెరువులా, పక్కనున్న స్త్రీ కూడా తన సమస్త రహస్యాలతో మౌనంగా సంభాషిస్తోంది. పెద్దయ్యలో కుతూహలం పెరగసాగింది. ఆమెను పలకరించటానికి, అర్థం చేసుకోవటానికి తడుముకోసాగాడు. “చూడమ్మా, నేనూ తెల్లవారేవరకూ ఇలాగే కూర్చోగలను. అందువల్ల ప్రయోజనమేమిటో చెప్పు? కష్టాలు మనిషి కాక చెట్లకు, ఈ రాళ్లకు వస్తాయా..?” అని నెమ్మదిగా మాట్లాడసాగాడు. ఇదే విధంగా అతను చాలాసేపు స్వగతంలా ఏదో చెబుతూవుండగా, ఆమె “చూడండి, మీరు మీ పని చూసుకోండి” అని చెప్పి కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. పెద్దయ్య సంతోషపడ్డాడు: “ఆడమనిషి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా దుఃఖించటం చూసి ఆమె గాయాలు-బాధలు ఏమిటో తెలుసుకోవటం నాలాంటి నరరమానవుడి పనేకదా?” అన్నాడు. ఈ మాటలను ఆమె శ్రద్ధగా వింటున్నట్టే ఉంది.
మళ్లీ ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఆమె అంతరంగంలో ఏముందో తెలుసుకోవటానికి కించిత్తూ సాధ్యం కాలేదు. పదేపదే ఒత్తిడి పెట్టి అడిగి, ప్రశ్నించి విసుగొచ్చింది. చివరికి అతను అన్నీ ప్రయత్నాల నడుమ ఆమెను స్నానఘట్టం ఎదురుగా ఒడ్డు మీదున్న గుడి వసారాలోకి తీసుకుని రావటంలో సఫలమయ్యాడు. అందువల్ల అతనికి ఎంతో సంతృప్తి కలిగింది.
మూలలో, గోడకు ఒరిగిన ఆమె మోకాళ్లపై తలపెట్టుకుని కూర్చుంది. పెద్దయ్య అదే వసారాలో ఈ చివరన రాతిబండ మీద కాళ్లుచాపి పడుకున్నాడు. చేతిసంచిలోని చద్దిమూటను తలదిండుగా పెట్టుకున్నాడు. నిద్రవల్ల కళ్లు గుంజుతున్నాయి. ఆవులింతలు పెరుగుతున్నాయి. దాంతో, “చూడమ్మా, ఇప్పుడు నీ కష్టాలు చెప్పకపోయినా పరవాలేదు. నీకు చెప్పాలనిపిస్తే ఆలస్యంగానైనా చెప్పు. అయితే నాకు నిద్ర వచ్చినపుడు నువ్వు దొంగతనంగా తప్పించుకునిపోకు. ఈ శివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకు చేతనైనంత సహాయం చేస్తాను తల్లీ, అపకారం మాత్రం నేను చేయనమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు మాత్రం కూర్చున్న చోటి నుంచి కదలకూడదు..” అని చెప్పాడు. ఇది మళ్లీ అతని స్వగతమే అయ్యింది. ఆడమనిషి చెరువు గట్టు నుంచి ఇంత దూరం వచ్చి కూర్చోవటం అతనికి విచిత్రంగా కనిపించింది. ఆమె వైపు చూస్తూ మూతలుపడే కళ్లను కష్టపడి తెరవటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆమె తల ఎత్తలేదు. కదలలేదు. అది నిద్రనో లేదా మెలకువ స్థితియో కూడా ఇతనికి అర్థంకాలేదు.
***
నిద్ర మధ్యలో పెద్దయ్య చిన్నగా కలవరించాడు. పెరట్లో, పొలం మధ్య, పచ్చిక మీద నృత్యం చేసే నెమలి జంటను చూశాడు. చాలా కాలం క్రితం బాల్యంలో సాకిన జంట అది. అడవి నుంచి తెచ్చిన నెమిలి గుడ్లను ఇంట్లో కావుకు కూర్చున్న కోడి ఒడిలో పెట్టాడు. మిగతా కోడిపిల్లలతోపాటు నెమలి పిల్లలు సహజంగానే పెరిగాయి. సొంపుగా, అందంగా, సదా అల్లరి చేస్తూ పెరిగాయి. సాయంత్రాలు, ఉదయాలలో చూసిన చిత్రాలు ఇప్పుడు కళ్లల్లో మొలకెత్తుతుండగా మృదువైన చలివల్ల సగం మెలకువ; వెలుతురు ప్రసరించే సమయం; అక్కడెక్కడో సదూరంలో కొండల కావల తొంగిచూస్తున్న సూర్యుడు. వసారా అదే మూలలో కూర్చుని తళతళమని మెరిసే కన్నుల ఆడది, సిగ్గుపడి కాళ్లు దగ్గరికి లాక్కుని, రాతిస్తంభానికి ఒరిగి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. రాత్రి అతను ఊహించినదానికంటే చిన్న వయస్సులో, పల్లెటూరి నేపథ్యంలో, గంభీర ముఖభావంతో ఉన్న అందమైన స్త్రీ ఆమె. కళ్లకు, మనస్సుకు ఆమె ఒక దేవకన్యలా కనిపించి ఆశ్చర్యం, ఆనందం, భయంతో కూడిన భావాలతో వణికాడు. ఆమె ఇతని మొరటు గడ్డం, మీసాలు, నూనె రాసుకోని, దువ్వుకోని తలజుట్టువైపు చూపులు సారించింది. మౌనం ఇంకా చెదరలేదు. ముందున్న చెట్లుచేమలను చూడసాగింది.
“ఏ ఊరమ్మా మీది?” అని మళ్లీ కుశలప్రశ్నలు ఆరంభించాడు. ఇప్పటి ధ్వనిలో అతనికి తెలియకుండానే బహువచనం చేరుకుంది. ఈ ప్రశ్న, దాని చుట్టూ ఇతర ఉపప్రశ్నలకు కూడా ఆమె దగ్గర నుంచి జవాబులు రాలేదు.
బయట తిరిగి, కాళ్లుచేతులు, ముఖం కడుక్కుని, వెనుతిరిగేటప్పుడు ఇడ్లి అమ్మే అవ్వ వచ్చింది. తనతోపాటు ఉన్న ఆడమనిషిని పిలిచి బలవంతంగా ముఖం కడిగించాడు. ఇడ్లీ తిన్నారు. కడుపు నిండా తినమని బలవంతపెట్టాడు. నోటు తీసుకుని, చిల్లర ఇచ్చిన అవ్వ వెళ్లేటప్పుడు “ఈమె నీకు ఏమవుతుంది?” అంది. “అక్క కూతురు” అన్నాడు. “ఊరు?”, “శివగంగెసీమ”, “పెళ్లి”, “అయింది”, “పిల్లలు”, “ఉన్నారు”, “మరెందుకు చంకలో బిడ్డ లేకుండా ఇలా ఒట్టి చేతులతో వచ్చావమ్మా?” అంటూ అవ్వ ముఖం చిట్లించుకుంది. ఆ చకచక సంభాషణ లయబద్దతకు అనుగుణంగా ఆడమనిషి చిన్నగా నవ్వింది. దాన్ని గమనించిన పెద్దయ్య ‘పెద్దమ్మ కూతురు’ అని పరిచయం చేసి ఉండాల్సిందేమోనని కలవరపడ్డాడు.
***
నాలుగు అడుగులు జంటగా నడిచిన మనుషులు తమ కష్టసుఖాలను పంచుకుని తేలికపడుతారట. రాత్రంతా తోడుగా ఉండి ఇప్పుడు ఒకటిన్నర మైలు కలిసి నడిచినా వాళ్లిద్దరిలో ఒకరి అంతరంగం మరొకరికి అర్థం కాలేదు. వాళ్లను బంధించిన ఒక మూగ పొందిక మాత్రం విలక్షణమైనది. అతని ముందు తన అంతరంగాన్ని బయట పెట్టడానికి ఆమె ముందుకు రాలేదు. అతనికి అంతా చెప్పుకునే తపన. అందులోనూ ఆమెకు ఆసక్తి తక్కువే. వంకరగా మెలికలు తిరిగిన ఆ కాలిదారిలో ముందు నడుస్తున్న అతను “..చూడు, ఇంకో రెండు మైళ్లు నడిస్తే కగ్గలి అనే మా ఊరు వస్తుంది. అక్కడ పశువులు, దూడలు, గేదెలు, గొర్రెపిల్లలు, పొలాలు, తోటలు – అన్నీ ఉన్నాయి. భార్య, పిల్లలు, రకరకాల జనం ఉన్నారు. మబ్బుల వాన, భూమాత పంట. ఏ కొరతా లేదు. మనిషి మనస్సు ఇరుకైనపుడు మాత్రమే అతనికి దెయ్యం పట్టుకుంటుంది. దరిద్రం చుట్టుకుంటుంది. ఏ రూపంలోనైనా సరే నాలుగు రోజులు ఉండాలి – అని నీకు అనిపిస్తే ఉండు. లేదా నీ విషయమంతా చెబితే, నా సొంత ఖర్చులతో అక్కడ వదిలి వస్తాను పదా. నేనూ దేశం, కాలం చుట్టినవాడిని. రకరకాల చెరువుల నీళ్లు తాగినవాడిని. నువ్వు ఈ ప్రాంతం ఆడమనిషివి కావు- అని నాకు తెలుసమ్మా..” అంటూ సగం సంతృప్తితో, కొంచెం గర్వంతో, మరింత సంశయంతో నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆమె నీడలా అనుసరిస్తోంది. సూర్యుడు తూర్పులో ఉన్నాడు. ఆమె పొడువాటి నీడ అతని తల వరకు వ్యాపించింది.
ముందు చిన్న చెరువు గట్టు మీద నడుస్తుండగా ఆమెకు తన ఊరు, పొలం, బయలు గుర్తుకొచ్చాయి. దాంతోపాటు నిన్నటి రోజున కోడికూసే సమయంలో అమ్మమ్మ ఇంటిని వదిలి బయలుదేరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు, దాని నేపథ్యం మనస్సులో పునరావృతమయ్యాయి. ఇలా నిర్దిష్టం కానివాటిలో కనిపిస్తున్న తాత్కాలిక ప్రశాంతత కూడా తనలాంటిదానికి అక్కడ దొరకకపోవటాన్ని తలుచుకుని దుఃఖం పెరిగింది.. పుట్టగానే తల్లిని, పెరుగుతూ తండ్రిని పొగొట్టుకుంది. సోదరుడి ఆశ్రయంలో పెరిగిన తనకు పెళ్లయింది. పెళ్లయిన కొత్తలోనే పొందికలేని సోమరి భర్త. తన ఆత్మాభిమానమే తనకు ముళ్లయి, రోగపీడితుడైన బిడ్డ చనిపోయి, అత్తతో, భర్తతో ప్రతిరోజు జరుగుతున్న గొడవలు విషమించి, ఇంటి నుంచి బయటపడింది. మెట్టినింట బతకలేకపోయిందని, అన్నా-వదినలు తిట్టినపుడు తల్లి పుట్టింటికి వచ్చింది. అక్కడ-ఇప్పుడో అప్పుడో అనే అమ్మమ్మ, సంవత్సరాలకొద్దీ పొలాలలో కష్టపడటం, గేదెలు పశువులు కాసేపని; నలుగురు మేనమామలు పోట్లాడుకుని వేరుపడ్డారు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక, చావబోతున్న అమ్మమ్మ సేవలో ఉండగా, ఆ ఇంటి పనిమనిషితో మునుసంధ్యవేళ పెరట్లో నవ్వుతూ మాట్లాడిందని, నింద మోపి, రాత్రి న్యాయం జరిపి, అవమానించారు. ఇంతకు ముందులాగే, భర్త వదిలేసిందని పదే పదే ఎత్తిపొడుస్తూ మాట్లాడారు. స్త్రీ మాయ అన్నారు.. ఆ సమయంలో నవ్వింది తానో, అతనో అన్నది కానీ, దాని కుంటిసాకు కానీ జ్ఞాపకంలో వుండలేదు. అపరాధపు జాడ కానీ, స్వరూపం కానీ తెలియలేదు.
రాత్రి కంటికి నిద్రపట్టనేలేదు. తానే సాకి పెంచిన పెద్ద పుంజు గొంతెత్తి కూసింది. పాత ట్రంకు అడుగున పెట్టిన పద్దెనిమిది రూపాయలు తీసుకుంది. ఎప్పుడు మెలకువగా ఉండే అమ్మమ్మ నిద్రపోతోంది. దీపం వెలిగించి చివరిసారిగా కళ్లారా చూసుకుని వెళ్లాలనిపించింది. అలాంటి కోరికలు అక్కడే కమరిపోయాయి. చప్పుడు కాకుండా పెరటి తలుపు తీసి బయటికి వచ్చింది. వెన్నెల కాంతి స్పష్టంగా ఉంది. చుట్టూ నిశ్శబ్దం. దారి తీసుకెళ్లిన దిశలో నడవసాగింది.
పొద్దుపొడిచినపుడు బస్సు వచ్చే దారిలో నడవసాగింది. ముందు చెట్టు కింద నిలుచున్న జనాన్ని చూసి తానూ నిలుచుంది. బస్సు రాగానే ఎక్కింది. కండక్టర్ దగ్గరికి రాగానే తానే ఆ బస్సు వెళ్లే ఊరి గురించి విచారించింది. పదునాలుగు రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంది. రాత్రి ఎనిమిది గంటలకు ఆ ఊరును చేరుతుందని కండక్టర్ ఆమెకు తెలిపాడు. ఆతని జవాబు వల్ల ఆమెలో అంత వ్యత్యాసమేమీ కనిపించలేదు.
మధ్యాహ్నం ఆకలి తీవ్రమైనపుడు బస్సు ఆగినచోట అమ్మే పిల్లల దగ్గర ఆపిల్‌పండ్లు, పుచ్చకాయ, వేరుసెనగలు కొనుక్కుని తిన్నది. మరోచోట కొళాయి నీళ్లు తాగింది. అంతే ఆత్రంగా ఏదో మరుగులో మూత్రవిసర్జకు వెళ్లి వచ్చి బస్సెక్కింది.
దూరంలో పెద్దకొండ వెనుక ఎర్రటి సూర్యుడు కనుమరుగవుతున్నాడు. ఇంత దూరపు ప్రయాణంలో తాను మరీ అపరిచిత స్థలానికి వచ్చినట్టు అర్థమైంది. ప్రతిక్షణంలో తాను ముందు ఏమి చేస్తుందోననే ఆలోచనే లేదు. తనలాంటివారికి చావులో మాత్రమే నిశ్చింత అని వందసార్లు అనుకుంది. ఇప్పుడు కచ్చితంగా నిర్ణయించుకుంది.
కుడివైపున దూరంలో విశాలమైన చెరువు. తోసుకొచ్చి వెనుక నిలిచిన నీళ్లు సమీపంలో ఉంది. బస్సులోని కోలాహలం, అరుపులు. బస్సు అక్కడ ఆగటంతో కొందరు దిగుతున్నారు. తాను దిగింది. చెరువు గట్టున కింద సాగుతున్న కాలిదారిని వెతికి బయలుదేరింది.
ఏ తంటా కూడా లేకుండా చావటానికి మంచి స్థలం దొరికినప్పటికీ తాను ఎందుకు ఆలస్యం చేసిందని ఆమె నొచ్చుకుంది. అంతలో ఇప్పుడు ఎదుట నడుస్తున్న వ్యక్తి వచ్చాడు. మరుక్షణం ఏమిటో, ఎలానో అనే భయం ఆమెలో కనిపించలేదు. ఎందుకంటే తన ఇప్పటి పరిస్థితికన్నా భయంకరమైనది మరొకటి ఉందని ఆమె భావించటానికి కారణాలు కనిపించలేదు..
***
ఆ అడవి ప్రదేశంలో కగ్గలి అనే చిన్న పల్లెలో ఇంకా ఎవరూ పశువులను మేతకోసం బయలుప్రదేశంలోకి వదల్లేదు. పైగా పంటల కాలం ముగిసి వుండటంవల్ల పొలాలలో అవసరమైన పనులూ ఉండలేదు. అందువల్ల చాలామంది రకరకాల స్థాయిల్లో సోమరిపోతుల్లా తయారయ్యారు. చిన్నవయసు ఆడమనిషిని వెంటబెట్టుకుని పెద్దయ్య ఊరికి రాగానే అతని వెనుక జనం చీమలబారులా వరుసకట్టారు. అతను తన ఇల్లు చేరేటంతలో ఊరిలోని ముప్పాతిక జనం పరుగుపరుగున వచ్చి పరస్పరం కాళ్లు తొక్కుకుంటూ గుమిగూడారు. వాళ్లిద్దరూ ఊరి బయట ఇంకా అర్ధమైలుదూరంలో ఉండగానే, ఆ వైపు నుంచి సైకిల్ మీద వచ్చిన ఒక మనిషి, పెద్దయ్య ఎవరినో దేవకన్యలాంటి స్త్రీని వెంటబెట్టుకుని వస్తున్నాడని హడావుడిగా చూసింది వర్ణించి చెప్పి ఆ వార్తని వ్యాపింజేశాడు.
అప్పటికే ఆ విషయానికి కాళ్లుచేతులు ఏర్పడి, అత్యంత ఆసక్తికరంగా కనిపించిన దిక్కుల్లో ప్రయాణం ప్రారంభించింది. జాతరకు వెళ్లినవాడు కోడెను అమ్మిన డబ్బుతో ఎవరినో మనసుపడి పెళ్లిచేసుకున్నాడనీ, తను ఉంచుకున్న పాత మనిషినే కొత్తగా ధైర్యం చేసి తీసుకొస్తున్నాడని కథలు వ్యాపించాయి. ఈ విషయం అప్పటికే పెద్దయ్య భార్య సాకమ్మకు చేరటంతో, ఆమె గుండెలు బాదుకుంటూ నేలమీదపడి దొర్లసాగింది. తల్లి ఇలా కష్టపడుతుండటం చూసిన పెద్దకొడుకు కరిసిద్దు ఏమి చేయాలో తోచక నిలబడివున్నాడు. అది చూసి సాకమ్మ “అయ్యో, నా చేతకాని నా కొడకా, చూస్తూ నిలబడ్డావేమిరా? మీ నాయినా ఎవతెనో వెలయాలిని తీసుకుని వస్తున్నాడంట. ఇంటి మెట్లు ఎక్కనియ్యద్దు..” అని రాగయుక్తంగా చెప్పింది. కరిసిద్దు పెద్ద దుడ్డుకర్రను పట్టుకుని గుమ్మంలో నిలబడ్డాడు.
ఏమీ అర్థంకాక, పెద్దయ్య జనసమూహాన్ని తోసి, కొడుకు ఉన్నచోటికి వచ్చాడు. కొడుకు గొడవ పడుతున్నాడు. ఆతని భార్య విచిత్రంగా ఏడుస్తోంది. కొత్తగా వచ్చిన ఆడమనిషిని జనం చుట్టుముట్టి, ఆమెను చూడాలనే తొందరలో మీద పడసాగారు. వాళ్లల్లోనే కొందరు ముందుకొచ్చి తోపులాటను తప్పించి, ఆమెను సురక్షితమైన స్థలానికి తీసుకునిపోవటానికి ప్రయత్నించారు. అది మరింత అపార్థానికి కారణమై, పెద్ద కోలాహలం ఆరంభమైంది. పెద్దయ్య కకావికలై వసారాలోని స్తంభానికి ఒరిగి, తల మీద చేయి పెట్టుకుని, భార్య చనిపోయినవాడిలా నిస్తేజంగా కూర్చున్నాడు.
***
ఊరి బయటి చిన్న తోపు ఉన్న బసవన గుడి చల్లటి ప్రాంగణంలో న్యాయసభ మధ్యాహ్నమే చేరింది. సామాన్యంగా ఈ విధమైన ఏ న్యాయమైనా ఊరిలోపలి మారెమ్మగుడి వసారాలో రాత్రి భోజనాల తర్వాత ప్రారంభమై అర్ధరాత్రి వరకు జరగటం అక్కడి ఆనవాయితీ. సులభంగా అర్థంకాని, పెద్దయ్య తెచ్చిపెట్టిన కొత్త సమస్యను బహిరంగంగానే పరిష్కరించటానికి జనం నిర్ణయించుకున్నారు. ఇందుకోసం, సాయంత్రం వరకు ఎదురుచూసే సహనం ఎవంరిలోనూ కనిపించలేదు. అందరూ పశువులు, దూడలు, గొర్రెపిల్లలను మైదానంలోకి తీసుకుని వెళ్లే పనిని తమతమ ఇళ్లల్లో తమ కన్నా చిన్నవాళ్లకు చెప్పసాగారు. అంతకన్నా చిన్నపిల్లలు ఆ విషయాన్నే మరిచినట్టు నటించి, అక్కడ ఇక్కడ తిరిగి, చివరికి తోపు చుట్టే తిరుగుతున్నారు. దీన్ని గమనించిన ఒకరిద్దరు పెద్దవాళ్లు కోపోద్రేకంతో “నక్కకు చెబితే అది తన తోకకు చెప్పినదంట. పోండ్రా, కొంపల్ని నాశనం చేసే నా కొడుకుల్లారా..” అని మనసారా తిట్టారు. మగవాళ్ల న్యాయసభల్లో ఆడవాళ్లకు ప్రవేశం లేకపోవటం సాధారణ విషయం కూడా ఇప్పుడు తలకిందులైంది. వాళ్లంతా చుట్టుపక్కలున్న చెట్ల చాటున గుంపుగా చేరి, క్రమంగా దగ్గర దగ్గరకు రాసాగారు.
తీర్పు చెప్పేవారి ముందు పెద్దయ్య నేరస్థుడిలా చేతులు కట్టుకుని కూర్చున్నాడు. అతను తీసుకొచ్చిన ఆడమనిషి అతనికి ఎదురుగా నాలుగు బారాల దూరంలో ఎలాంటి కలవరమూ లేకుండా కూర్చుంది. ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా జరిగినదంతా వివరంగా బసవన్న మీద ప్రమాణం చేసి చెప్పాలని పెద్దయ్యకు ఉతర్వులు ఇచ్చారు. అతను పసిపిల్లవాడి ధోరణిలో -’నిన్న రాత్రి వెన్నెల వెలుతురులో చెరువు గట్టుమీద ఒక్కతే కూర్చున్న అపరిచితురాలైన ఆడమనిషిని చూసినప్పటి నుంచీ ఈ రోజు తెల్లవారిన తరువాత తమ ఇంటి గుమ్మం చేరే వరకు జరిగినదంతా చెప్పాడు. “ఈ మాటల్లో ఆవగింజంత, ముల్లుమొనంత తప్పులేదు. నేను తాకలేదు, నా తండ్రీ బసవన్నా నన్ను కాపాడు” అని లేచి నిలబడి, అంత ఎత్తులో పడుకునివున్న నల్లరాతి బసవన్నకు చేతులు జోడిరచి, నిలుచున్న చోటే ప్రదక్షణ చేశాడు. సభలోని గుసగుసలను ఆపాలన్నట్టు ఎనభై దాటిన తెల్లమీసాల పంచాయితీ పెద్ద “ఓ” అని బిగ్గరగా కేక వేయటంతో నిశ్శబ్దం ఆవరించింది.”చూడు తల్లీ, నువ్వు కూడా నిజం మాత్రమే చెప్పాలి” అని అతను అక్కడ కూర్చున్న ఆడమనిషిని చూస్తూ, “పెద్దయ్య చెబుతున్నదంతా నిజమేనా?” అని ప్రశ్నించాడు.
“నిజం”
“అలాగైతే నీ ఊరేది?”
“శివ గంగ సీమ”
“పేరు?”
“గంగమ్మ”
“కులం?”
“నరమానవ కులం”
ఆ తరువాత అడిగిన ప్రశ్నలకు ఆమె దగ్గర జవాబులు లేవు. మునుపట్లాగే దీర్ఘమైన మౌనానికి సహచరి అయింది. ఈ మౌనానికి జవాబు అక్కడ గుమిగూడిన నానారకాల మనుషుల మనస్సుల్లో నానా రకాల ప్రశ్నలు తలెత్తాయి. తాత మరోసారి పిచ్చిపట్టినవాడిలా, గట్టిగా చీది, గొంతు సరిచేసుకుని, “చూడండయ్యా, నేను కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాడిని. ఏ కారణానికి అబద్దం చెప్తాను? ఈ ఆడమనిషి సామాన్యురాలు కాదు. నా మనసుకు అమ్మవారిలా కనిపిస్త్తోంది. ఆదిశక్తి మాయా రూపం కావచ్చు. నరరూపంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. దాన్ని ఉన్నచోటే ఉంచక ఇక్కడికి తీసుకొని రావటం పెద్దయ్య తప్పు. ఇప్పుడు జరిగింది జరిగిపోయింది. ఆమె ఇక్కడ ఉన్నన్ని రోజులు మనవల్ల ఆమెకు ఎలాంటి అపచారమూ జరగకూడదు. ఇదే చెట్లతోపులో ఒక ఆశ్రమం కట్టించి నివాసం ఏర్పరచాలి. అదొక్కటే ఈ గ్రామానికి శ్రేయస్కరం..” అని దేవుడు పూనినవాడిలా వణుకుతూ చెప్పి, ఆడమనిషికి నమస్కరించాడు. పెద్ద కోలాహలం చెలరేగి, మిశ్రమ ప్రతిస్పందనతో అందరూ పైకి లేచారు.
అంతలో సాకమ్మకు నిలుచున్నచోటనే నాలుగవసారి తీవ్రంగా బేది కావటంతో నేలకొరిగింది. ఇదంతా చూసి, పూర్తి కథ వింటున్న కరిసిద్ధు ఒంట్లో క్రమంగా జ్వరం తీవ్రం కాసాగింది. అతను రొప్పసాగాడు. జనం బెదిరి ఇద్దరిని లాక్కొచ్చి, గంగమ్మ పాదాల మీదికి తోశారు. “తప్పయింది మాయమ్మా, మేము పాపాత్ములం. చెడుపనులు చేసి ముడుపులు కట్టించుకుంటాం. నువ్వే గతివి, నువ్వే బుద్ధివి. కాపాడాలి” అని కరిసిద్దు తల బాదుకున్నాడు. గంగమ్మకు దిక్కుతోచనట్టయి, అయ్యో అనిపించి, వాళ్లను లేపి కూర్చోబెట్టి, ఓదార్చింది. ఇంకా ఎంతమందికో నిలుచున్నచోటే కాళ్లు అలసిపోయి, తొడలు వణికిపోయి, ఆమె ఎదుటికి వచ్చి, మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించారు. ఆడవాళ్లంతా దాన్నే అనుసరించారు.
***
గంగమ్మ కగ్గలి ఆశ్రమానికి వచ్చి, రానున్న పున్నమికి నాలుగేళ్లు పూర్తవుతాయి. తన ఊరు, వీధి గురించి ఎలాంటి చిన్న ఆచూకి కూడా ఆమె ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ప్రజలకు ఆ విషయాల గురించి ఇప్పుడు ఎలాంటి కుతూహలమూ లేదు. తన పేరు కూడా తొందరలో ఏదో ఒకటి చెప్పింది. ఇప్పుడు అదే పేరు స్థిరపడి శాశ్వతంగా నిలిచిపోయింది. రోగాల రొష్టులు, సంతానఫలం, పంటలు, పశువుల చావు, పెళ్లి మొదలైన అన్ని సందర్భాలలోనూ – కనిపించిన సమస్త చిన్నా పెద్దా ఆనందోత్సవాలకు అమ్మ దయనే కారణమని, జనం భావించి మొక్కుకుని, ముడుపులు కట్టి, డబ్బులు, నగలు, వస్త్రాలు కానుకగా ఇస్తారు. పరిస్థితి చెడుతుండగా అలాంటివన్నీ జరగకూడదనో, లేదా అమ్మ కోపగించుకుందనో భావించి పెద్దపెద్ద ముడుపులు కట్టి మొక్కుకుంటారు.
రోజురోజుకూ తోపుచుట్టూ మరికొన్ని చెట్లు తలెత్తుతున్నాయి. తన మౌనం, కొంచెం మొరటుగా ఉన్న ప్రవర్తనకూ జనం సంతోషపడుతూ, అయితే ఎక్కువగా భయభీతులవుతుండటం చూసి గంగమ్మకు ఆశ్చర్యం కలిగేది. కాలేజి మెట్లు ఎక్కి, దిగి, అనేక సంవత్సరాల కాలం నిరుద్యోగిగా ఉండి, అలసిసొలసి పోయిన మరిస్వామి అనేవాడు అమ్మగారికి కార్యదర్శి అయ్యాడు. అతని ఓర్పు, నిదానమూ, వ్యావహారిక గుణాలు అందరికీ నచ్చాయి. భవిష్యత్తులో ఇతనే ఈ ఆశ్రమానికి ధర్మాధికారి కాగలడనే సూక్ష్మాన్ని గ్రహించిన చాలామంది ఇతనికి పిల్లనివ్వటానికి ముందుకొస్తున్నారు. భోజనానంతరం వెన్నెల రాత్రుల్లో అతనితో గంగమ్మ అరుదుగా మాట్లాడుతూ, తిరిగే ఘడియలు దీర్ఘమవ్వసాగాయి. చీకటి రోజులు వాళ్లను మరింత దగ్గరికి తెచ్చాయి. అలాంటి ఒక కటిక చీకటి రాత్రి తెల్లవారుజాము చలిలో ఆమె మరిస్వామిని కౌగిలించుకుని, ‘ఎక్కడైనా దూరంలో ఉన్న ఊరికి వెళ్లి, కొత్త చోట నిశ్చింతగా బదుకుదాం” అని గుసగుసలాడింది. అతనికి ఒళ్లు గగర్పొడిచింది. వెంటనే ఏమి మాట్లాడాలో తోచలేదు. నెమ్మదిగా తడబడుతూ ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న మొత్తం డబ్బు, అన్ని రకాల నగల వెలలను సుమారుగా మనసులోనే లెక్కవేసి గుణిస్తూ, కూడుతూ, అధికార దర్పంతో ఆమెకు లెక్క అప్పగించాడు.
కన్నడ మూలం: డా. కాళేగౌడ నాగవార
అనువాదం: రంగనాథ రామచంద్రరావు