మాయ మనసు

0
2

[dropcap]“జా[/dropcap]నకీ!.. జానకీ!..” తను కూర్చొని వున్న గది దద్దరిల్లేలా అర్ధాంగిని పిలిచారు శేషగిరిరావు.

వంటింట్లో వంటమనిషికి రాత్రికి చేయవలసిన వంటల విషయాన్ని వివరిస్తున్న జానకి.. భర్తగారి పిలుపు విని హాల్లోకి వచ్చింది.

“ఏమిటండీ.. ఆ గావుకేకలు?..” రుసరుసలాడుతూ అడిగింది.

“ఓసీ.. నీ యిల్లు బంగారంగాను!.. శుభవార్తే.. శుభవార్త..”

“ఏమిటండీ అది?..”

“ఆ అల్లూరి వాళ్లకు మన అమ్మాయి నచ్చిందట. త్వరలో నిశ్చతార్థానికి ముహూర్తం నిర్ణయించమని కబురు పంపారు..” ఆనందంగా నవ్వుతూ భార్య ముఖంలోకి చూచాడు శేషగిరిరావు.

“వారు ఒప్పుకుంటారని నాకు తెలుసునండీ.. మన అమ్మాయికి ఏం తక్కువ!.. అందం.. చదువు.. సంస్కారం.. అన్నీ యీ కాలపు కుర్రాళ్లు కోరే విధంగానే వున్నాయిగా!.. యింతకంటే మంచి సంబంధం వాళ్లకి ఎక్కడ దొరుకుతుంది?..” సగర్వంగా చెప్పింది జానకమ్మ.

“‘శుభస్య శ్రీఘ్రం’ అన్నారు పెద్దలు. నేను పంతులుగారి దగ్గరకు వెళ్లి నిశ్చితార్ధానికి.. వివాహానికి ముహూర్తాలు నిర్ణయించుకొని వస్తా..” కుర్చీపై వున్న పైపంచను భుజాన వేసుకొని శేషగిరిరావు పంతులుగారి ఇంటివైపుకు బయలుదేరాడు.

“బాగా లగ్నబలం వున్న ముహూర్తాలను నిర్ణయించమని పంతులుగారికి చెప్పండి..” అంది జానకమ్మ.

“అలాగే!.. నీవు నాకు ప్రత్యేకించి చెప్పాలా!..” ఓరకంట అర్ధాంగి వదనాన్ని చూచి వీధిలో ప్రవేశించాడు శేషగిరిరావు.

పంతులు రామశర్మగారిని, వారి యింట కలిసివిషయాన్ని వివరించాడు. పంచాంగాన్ని తీసుకొని జాతకాలు వారి వద్దనే శేషగిరిరావు ఇచ్చివున్నందున వాటినీ పరిశీలించి.. అన్ని పొంతనాలూ బాగున్నాయని.. నిశ్చితార్థానికి.. వివాహానికి ముహూర్తాలను నిర్ణయించి వ్రాసి.. శేషగిరివుగారికి అందించారు రామశర్మ.

పంతులుగారి ఇంట్లో వున్న ఫోన్ ద్వారా.. అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి రెండు ముహూర్తాల వారం, తేదీ, సమయాలను తెలియచేశాడు.

అబ్బాయి తండ్రిగారు అనంతరామయ్యగారు ఆనందంగా తన సమ్మతిని తెలియచేశారు. పరమానందంగా శేషగిరిరావుగారు అన్ని విషయాలను యింటికి తిరిగి వచ్చి అర్ధాంగికి వివరించారు.

తన గదిలో వుండి వీరి సంభాషణ అంతా విన్నది వారి ముద్దుల కూతురు మాయ.

రాత్రి భోజనాల సమయంలో అన్ని విషయాలను ఆ తల్లిదండ్రులు మాయకు వివరించారు. వారి మాటలను అమె మౌనంగా.. వినయంగా విన్నది. భోజనానంతరం తన గదికి వెళ్లిపోయింది. మంచంపై వాలింది. ఆమె మనోదర్పణం మీద గడచిన సంఘటనలు ప్రతిబింబించాయి.

***

ఆరు మాసాల క్రిందట.. తన మేనత్త భర్త వీరరాఘవయ్యగారు మరణించారు. వారికి ఒక కొడుకు ఆనంద్, ముగ్గురు కూతుళ్లు శాంతి, సౌందర్య, సౌజన్య. విజయ్ అందరికన్నా పెద్దవాడు. అత్త కౌసల్య అంటే మాయకు ఎంతో ఇష్టం.

వీరరాఘవయ్య వ్యవసాయదారుడు. ఆనంద్ అగ్రికల్చరల్ బియస్సీ గోల్డు మెడలిస్టు. ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా.. తండ్రికి సాయంగా వుంటూ నవీన పద్ధతులలో వ్యవసాయాన్ని సాగిస్తూ ఆ పల్లెటూర్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాడు.

చిన్నతనం నుంచి తనకు బావ ఆనంద్ అంటే ఎంతో అభిమానం.. గౌరవం.. వయస్సు వచ్చాక.. ఆ గౌరవాభిమానాలు మాయ మనస్సులో ప్రేమగా మారాయి.

వీరరాఘవయ్యగారు మరణించినపుడు తల్లిదండ్రులతో కలసి మాయ ఆనంద్ ఇంటికి వెళ్లింది. తనకన్నా చిన్నపిల్లలైన.. శాంతి.. సౌందర్య.. సౌజన్యలు తనకు ఇచ్చే గౌరవాన్ని.. తనపట్ల వారు చూపించే ఆధారాభిమానాలకు ఎంతగానో సంతోషించింది. అత్తగారి ఆప్యాయత.. బావ ఆదరణ ఆమెకు ఎంతగానో.. నచ్చాయి. బావను వివాహం చేసుకొని తన అత్తయ్యను ముగ్గురు మరదళ్లను బాగా చూచుకోవాలని నిర్ణయించుకొంది. వారందరికీ తనకున్న పరిజ్ఞానంతో ఆనందాన్ని కలిగించాలనుకొంది. ఆ గ్రామంలో హాస్పటల్ పెట్టి పేదలకు ఉచిత వైద్యం చేయాలనుకొంది.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. ఒకనాడు తల్లి జానకమ్మతో తన నిర్ణయాన్ని తెలియచేసింది. జానకమ్మ భద్రకాళిలా మారి “ఆ మట్టి పిసుక్కునేవాణ్ణి నాకు అల్లుడిగా చేయాలనుకొంటున్నావా!.. అది నేను బ్రతికి వుండగా జరుగదు. నీ నిర్ణయాన్ని మార్చుకో..” అంటూ శాసించి.. మాయను అసహ్యించుకొని వెళ్లిపోయింది.

తనకు సంబంధాలు చూడడం ప్రారంభించారు తల్లిదండ్రులు.. నాలుగు సంబంధాలు వచ్చాయి. ఇద్దరు పెండ్లికొడుకులు తల్లిదండ్రులకు నచ్చలేదు. ఇద్దరు పెండ్లికొడుకుల ఆస్తిపాస్తులు.. తమకన్నా తక్కువగా వున్న కారణంగా వారికి నచ్చలేదు.

ఐదవ సంబందం.. అల్లూరిది. అబ్బాయి విజయ్ ఇంజనీర్, అమెరికాలో ఉద్యోగం.. మంచి అందగాడు. ఒకే చెల్లెలు.. తండ్రి రాజకీయ నాయకుడు. తల్లి కాలేజీ ప్రిన్సిపాల్.. ఈ సంబంధం ఆ దంపతులకు బాగా నచ్చింది.

అమ్మాయిని చూచేదానికి రావలసిందిగా ఆనంద్ తల్లిదండ్రులను ఆహ్వానించారు. వచ్చారు.. చూచారు.. ఊరికి వెళ్లి వర్తమానాన్ని పంపుతామని చెప్పి వెళ్లిపోయారు.

పిల్ల ఓకే అన్న వర్తమానం.. జానకమ్మా వీరరాఘవయ్యలకు అందింది. నిశ్చితార్థ.. వివాహ ముహూర్తాలను నిర్ణయించి విజయ్ తల్లిదండ్రులకు తెలియచేశారు. కానీ.. మాయ యిష్టాయిష్టాలను గురించి ఆ దంపతులు పట్టించుకోలేదు. కారణం.. స్వాతిశయం.. అహంభావం.

***

నేనేం చేయాలి?.. ఈ ప్రశ్నను గురించి.. ఆలోచించి.. ఆలోచించి.. ఒక నిర్ణయానికి వచ్చింది మాయ.

తన తల్లిదండ్రుల తత్వం.. గుర్తుకు వచ్చింది. ఇరువురూ డాక్టర్లు.. బాగా సంపాదిస్తున్నారు. తననూ డాక్టర్ చదివించారు. తనూ సంవత్సరం నుంచీ వారితో కలసి పనిచేస్తోంది.

వారి దృష్టిలో.. తన బావ విజయ్.. వారి కుటుంబం అంటే ఎంతో చులకన, అసహ్యం. బాగా చదివారు. సమాజం దృష్టిలో గొప్ప వ్యక్తులు. పేరు ప్రతిష్ఠులున్నవారు. సాటి మనుషులను మనుషులుగా చూచే.. మనస్తత్వం లేదు. డబ్బు.. డబ్బు.. డబ్బు విపరీతమైన ధన దాహం. ఎంతవున్నా ఇంకా ఆర్జించాలనే దురాశ. తమ అంతస్తు కన్నా భిన్నంగా వుండే వారంటే చులకన.

తన తత్వం వారి తత్వానికి పూర్తి వ్యతిరేకం. దాని కారణం.. మూడు సంవత్సరాల క్రిందట చనిపోయిన తన నాయనమ్మ పార్వతమ్మ. ఆమె వేదాంతి. “రేయ్!.. అమ్మూ!.. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడూ తెలుసుకో వలసింది ఒక్కటే.. పుట్టినపుడు తనతో ఏమీ తీసుకొనివచ్చాడు? ప్రాణం పోయిన తర్వాత ఎంత సంపాయించినా తనతో ఏమి తీసుకొని పోతాడు?.. ఏదీ లేదు. కానీ.. జీవితకాలంలో.. సాటివారికి చేసిన మంచి.. ఖ్యాతిగా మారి తను పోయిన తర్వాత కూడా అలాంటి వారిని.. పదిమందీ తలచుకొంటూ వుంటారు. మనిషికి చావు తప్పదు, కీర్తికి చావులేదు. నీవు అలాంటి మంచి ఖ్యాతిని పొందేదానికి నీ భావిజీవితంలో పాటుపడాలి. మంచిపేరును తెచ్చుకోవాలి” అని తనతో చెబుతూ వుండేది. ఆమె తన జీవిత లక్ష్యానికి ఆదర్శప్రాయురాలు. నానమ్మ కళ్ల ముందు నిలిచి చెప్పినట్లుగానే అనిపించింది మాయ మనసుకు.

తన నిర్ణయాన్ని కాగితం పెన్ తీసుకొని వ్రాసింది. తను వ్రాసిన దాన్ని రేపు ఆనంద్‌కు తన తమ్ముడు మురళి ద్వారా.. చేర్చాలని తీర్మానించుకొంది. కళ్లు మూసుకొని పడుకొంది ప్రశాంత చిత్తంతో.

***

టేబుల్ మీద వున్న కవర్‍ను చేతికి తీసుకొని.. చించి అందులో వున్న కాగితాన్ని బయటికి తీసి మడత విప్పి చూచాడు శేషగిరిరావు. అది తన వూహల్లో వున్న అల్లుడు విజయ్ తనకు వ్రాసిన లేఖ. చదవడం ప్రారంభించాడు

“గౌరవనీయులైన డాక్టర్ శేషగిరిరావు గారికి.. నమస్కారములు. మీ మాయ కూడా డాక్టరే కదా!.. ఆమె యీ స్థితికి వచ్చే వరకూ.. తను ఎంతమంది తన వయస్సు మొగపిల్లలను చూచి వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఎవరినైనా ప్రేమించి ‘నేను ఇతన్ని ప్రేమించాను.. పెండ్లి చేసుకొంటాను’ అని మీతో చెప్పి వుండవచ్చు. కానీ మాయ ఆ పని చేయలేదు. తన వివాహం మీ చేతుల మీదుగా మన సంప్రదాయం ప్రకారం జరగాలని ఆశించింది. ఆమెకు మీ మీద అంతటి గౌరవాభిమానాలు. కానీ.. మీరు.. ఆమె వివాహం విషయంలో, వరుని పట్ల ఆమెకు వున్న అభిప్రాయాన్ని మీరు కనుక్కోవాలన్న విషయాన్నే మరచి, మీ ఇష్టానుసారంగా అంతా నిర్ణయించారు.

మా వాళ్ల బావ ఆనంద్‌ను ప్రేమించింది. అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొంది. ఆనంద్ వ్యవసాయం చేస్తున్నాడని, మీకు, మీ ఆవిడ గారికి, అతని పట్ల చిన్న చూపు, నిర్లక్ష్యం. కానీ మాయకు ఆ కుటుంబ సభ్యులంటే ప్రాణం. ఆనంద్ మీకు పరాయివాడు కాదు కదా!.. మీ అక్కగారి కొడుకు. ‘వృత్తులే బంధుత్వాలకు మూలం.. ఆస్తి అంతస్తులే వివాహానికి ముఖ్యం..’ అనే మీ భావన సరైనది కాదు. కలిమిలేములు శాశ్వతాలు కావు కానీ బంధుత్వం.. రక్తసంబంధం.. తెంచుకోవాలనుకొన్నా తెగిపోనివి.

నాకు మీ మాయను వివాహం చేసుకోవాలని లేదు. మీరు నాకన్నా ఎంతో పెద్దవారు. అన్నీ తెలిసినవారు. ఏది సత్యమో ఏది అసత్యమో ఆలోచించి, మీ నిర్ణయాన్ని మార్చుకొని మాయ వివాహాన్ని ఆమె యిష్టానుసారం, ఆమె కోరిన.. ఆమెకు ఎంతో యిష్టం అయిన ఆనంద్‌తో జరిపించండి.

రైతు లేనిదే రాజ్యాలుండవు. మీకూ తెలిసిందే.. ఆ రైతే దేశానికి వెన్నెముక. ఆ వర్గాన్ని గౌరవించి ఆనందన్ను అభిమానించి.. మీ పెద్దరిక విలువ అందరికీ తెలిసి వచ్చేలా.. ఆనంద్ మాయల వివాహాన్ని ఘనంగా జరిపించండి. ఆనంద్ నేను ప్లస్ టూ వరకూ కలసి చదువుకున్నాము. అతను మానవతావాది. నాకన్నా మంచి మనుసు ఉన్నవాడు.

ఒక్కగానొక్క కూతురు మీకు మాయ. మీ సత్ చింతనతో ఆమెకు ఆనందాన్ని కలిగించండి. వారి వివాహ పత్రికను నాకూ పంపండి. వచ్చి.. వారికి నా శుభాకాంక్షలను తెలియచేస్తాను. మీ ‘మాయ మనస్సు..’ మకరందం.. మల్లెపువ్వు.

ఇట్లు.. ఆనంద్.”

ఉత్తరం సాంతం చదివేసరికి.. శేషగిరిరావుకు చెమట పట్టింది. తమ కూతురు పట్ల తనూ అర్ధాంగి.. జానకీ కలసి చేసిన నిర్ణయం మహా తప్పుగా తోచింది. అతని నయనాలు అశ్రుపూరితాలైనాయి.. పశ్చాత్తాపంతో..

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here