Site icon Sanchika

మబ్బుజాతి ముసురు

[అనూరాధ బండి గారు రచించిన ‘మబ్బుజాతి ముసురు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గా[/dropcap]లిపోసుకున్న ఆలోచనలు ఇటు వదిలి
వేకువలో మాటలు నేర్పించు
వేగంలో మార్పులు చూపించు
వేలం వేయబడని సంగతులను ఉదహరించు

మనసుని ఇటు తెచ్చి
మాటలను తినిపించు
వాక్యాల పదును కాదు
వాదాల విసురు కాదు
వేకువ మెలకువని వినిపించు

మనిషన్న జ్ఞానీ!
మర్మాలు ఏవీ?
మబ్బుజాతి ముసురు
వినిపించకు

అతి పలుచని శాలువా
చలిని వేడి చెయ్యదు
తెలిసినదేదైనా మరోటి చెప్పు
‘ఇది విని వదిలే కాలమని’..

ఉక్కపోతల మరో కాల ఉదయం
నిన్ను తడిమేవరకూ
ఈ కాలాన్ని ఇలానే పాలించు

ఇక్కడ మనం క్రొత్త మొక్కలు
నాటడం మరిచినట్లున్నాం

పొగమంచు పట్టిన
ఆకులు ఎక్కువ లేవు
ఏ వ్రేలికొసలూ ఇప్పుడు
నేలని తాకడం లేదు

వేగాలన్నీ మనిషి మెదడుని
ఆక్రమించి
మనసులు వేలం వేయబడుతున్నాయి

హృదయాల వాసన
ఇప్పుడు చూడలేని వేకువ

Exit mobile version