మాడం ముచ్చుకునె!

0
2

[dropcap]’య[/dropcap]ప్పో మాడం ముచ్చుకునె….ఆట్లాపి ఇంట్లొకి రారా…! మల్ల పందులొస్తాయ్’

పన్నెండో వార్డ్‌ల ఒకాయమ్మ కొడుకుని అర్సి పిలస్తా ఉంది. ఆ వార్డ్‌ల జనాలు కొంచెం అడావిడిగా ఇండ్లు చేర్తున్నారు. యమ్నూర్లో తెలుగు మెయిన్ స్కూల్ ఆనుకునె ఉంటాది వార్డు. కర్నూలు నుండి వచ్చే రోడ్డు పన్నెండో వార్డ్ మిందనే పోవల్ల. యమ్నూరికి అది మెయిన్ రోడ్డు లెక్కనే.

తెలుగు మెయిన్ స్కూల్ వద్ద గలీజ్‌గ ఉంటది సుట్టుపక్కలంతా. పాత బాయి, అందులో పన్కి రాని కొబ్బరి కాయలు, పూలు, చెత్త ఉంటాది. పక్కనే దొడ్లు ఉంటాయి. బురద అంతా పాకి పోయుంటాది. ఇంగ అదంతా జూసి పందులొస్తాయ్ ఆడికి. ఆడ ఆడనే తిర్గుతా ఉంటాయ్. మొన్ననే పంది పిల్లల్ని పెట్టింది. ఇప్పుడింగా గలీజ్ ఎక్కువాయ. అవి యాడ పడ్తే ఆడ తిరుగుతాయ్. సప్పున ఇండ్లల్లోకి దూరుతాయ్ అప్పుడప్పుడు. ముక్యంగా ఆ సిన్న పందులు రచ్చ చెస్తయి. ఆ వార్డ్లో వాళ్ళకి యాసిరి కొచ్చింది. మున్సిపాల్టీ పట్టిచ్చుకున్న పాపానికి పోదు.

అయితే యమ్నూరు ఎంఎల్‌యెకి ఇప్పుడు మంత్రి పదవిచ్చినారు. అది గూడా మున్సిపాల్టీ మంత్రి ఆయ ఆయన. రెండ్రోజుల్లో ఫస్ట్ టైం ఊరికి వస్తా ఉండాడు. ఆయన్ని కర్నూల్ రోడ్డు మింద దింపి ఊరి బయట్నుండి ఊర్లోకి తప్పట్లు కొట్టుకుంటా తీసుకు రావల్ల అని ప్లాన్. అయితే మద్యల పన్నెండో వార్డు వస్తాది. పోయి పోయి ఎంఎల్‌యె ఇప్పుడు మంత్రి ఆయె. మున్సిపాల్టీ ఓళ్ళకి కూడా కొంచెం బయం వచ్చ. ఇంగ వార్డు కౌన్సిలర్ బారం మిందేస్కుని ఎట్లన్న వార్డ్‌లో పందులు లేకుండా చేయల్ల అని పట్టుకున్నాడు.

పందులు పట్టాలంటే ఊర్కి దిక్కు పందులేసెపే!

పందులేసేపు నాయ్న కూడా పందులు పడ్తా ఉండె. ఇప్పుడు పందులేసేపు ఊరి బయట చర్చ్ తాన పాలెం వద్ద గుడ్సెలో ఉంటాడు. ఎవురన్న పందులు పట్టమని ఊర్లో చెప్తే పట్టుకుంటడు. లేదంటే యాదో బరువులెత్తే పని చేస్తా ఉంటాడు. పందులేసేపు గోదుమ రంగులో ఉంటాడు. దిట్టంగా గట్టిగుంటాడు. పిక్కలు ఊదిపోయింటాయ్. ఆయప్పని పందుల్ని పట్టేతప్పుడు సూడల్ల…రైలు లెక్క పరిగెడ్తా ఉంటాడు. పాము లెక్క పయ్యిని ఒంపులు తిప్పుతా ఉంటడు. జనాలు ‘ఏందప్ప ఈయప్ప’ అని ఆస్చర్యం పడ్తా ఉంటారు. చేతిల ఒక ఉరి తాడు లెక్క ఒక తాడుని కట్టెకి కట్టింటాడు. కట్టె పట్టుకుని పంది మెళ్ళొ ఏసి లాగుతే పంది ఆడనే సస్తదింకా. అందరు పందులేసేపు పందుల్ని తింటాడు కాబట్టి అట్ల ఉంటాడు అనుకుంటరు. అందరనుకున్నట్ట పందులేసేపు పంది మాసం తినడు. పస్తైనా పండ్తాడు కాని తినడు. బైబిల్ పాత నిబందన గ్రందంలో పంది తినొద్దని ఉందని తినడు.

పన్నెండో వార్డు కౌన్సిలర్‌కి రెండురోజుల్ల మున్సిపాల్టీ మంత్రొస్తున్నడని బయం పట్టుకునె. అది గూడా ఆ ఊరి ఎంఎల్‌యె జిల్లా పార్టీలో చక్రం తిప్తాడు. ఎట్లన్న పందులేసేపును పట్టుకుని ఫటా ఫట్ పందుల్ని సంపిచ్చేయల్ల అనుకున్నడు. పందులేసేపుని రమ్మన మంటే యాదో రెండ్రోజుల్నుండి జొరం ఒచ్చిందని ఇంట్లనే పండుకున్నాడని రాలేను అని సెప్పి పంపినాడు. ఇంగ కౌన్సిలర్ గుండెల రాయి పడె. ముగ్గుర్నేస్కొని ఉరుక్కుంట పాలెం బోయినాడు.

“ఒలేయ్ యేసేపు! నీవు రాపోతె ఎట్లరా…మంత్రొచ్చెటప్పట్కి పందులడ్డమొస్తే వార్డు పరువు, ఊరి పరువు పోతది” అని అడుక్కున్నట్త కొంచెం, అరిసినట్ల కొంచెం అడిగె.

యేసేపు పయ్యంతా కాల్తా ఉంది. అట్లనే గుడ్సె నుండి బయటకొచ్చి “యాడొస్తానప్ప…జొరమొచ్చె కదా” అనె.

“ఒలేయ్ యేసేపు! నివు గనక రాకుంటే ఈ ఊర్ల ఇంగ నీకు పనే ఉండనట్ల చేస్తా…ఏమన్కున్నావో ఏమో మరి”

యేసేపుకి పరిస్తితి అర్తమాయ. ఇంక అరిసేది లేక “పా వస్తా పా” అనె తలొంచుకుని.

“ఒలేయ్ వీనికి టీ తాపిచ్చి తీస్క రండి. నేను మున్సిపాల్టీ ట్రక్ పంపిస్తా వార్డుకి” అని కౌన్సిలర్ మన్సుల్తో వచ్చేసె.

మాడం అట్లనే ముచ్చుకునుంది. వర్షమొస్తే పందులు పిచ్చెక్కినట్ల తిర్గుతా ఉంటాయ్. అంత లోపల పందుల్ని పట్టల్ల. వార్డ్‌ల వాల్లు పందులేసేపు పందుల్ని పట్టడానికి వచ్చినాడంటే కొంత మంది బయటకే వచ్చి చూస్తుండ్రి.

యేసేపు చేతిలో తన కర్రకు కట్టిన తాడేసుకుని నెమ్మదిగ పందుల్ దగ్గర్కి పోయినాడు. ఆయప్ప పయ్యి ఆయప్పకే వేడి కొడ్తా ఉండాది. ఒక్కొక్క పంది ఎనక చిర్తపులి పరిగెత్తినట్ల పరిగెత్తినాడు. కట్టె ఇసురు తున్నడు. పందులు ‘క్యార్ క్యార్’ అని అరుస్తా చస్తా ఉండాయి. తాడుకి ఇరుక్కుని సచ్చిన పందుల్ని ఎత్తి ట్రక్‌ల ఇసుర్తాడు. మల్ల పరిగెత్తుతాడు. మల్ల పట్టుకుంటడు. పట్టకపోయి ట్రక్‌లో ఇసుర్తాడు. అర్దం పందుల్ని కాలీ జేసినాడు. అప్పుడొచ్చె వర్షం! దబ్బ దబ్బ అని పడె. జనాలు ఆడ గడపల్ దగ్గరే దూరి దూరం నుండీ యేసేపును చూస్తున్నరు. యేసేపు పనితనాన్ని మెచ్చుకోలేనోళ్ళు ఆ ఊర్ల యెవ్వరుండరు. వర్షమొచ్చిన గూడా యెశెపు కసి తగ్గలె. ఉర్కి ఉర్కి పట్టుకుని మొత్తం పందుల్ని ఆడ నుండీ కాలీ జేసె. కౌన్సిలర్, పన్నెండో వార్డు జనాలకు హాయిగనిపిచ్చె.

కౌన్సిలర్ దూరం నుండే “ఒలేయ్ యేసేపు…పొద్దునింటికి డబ్బుల్పంప్తా సూడి” అని అరిసె.

పయ్యంతా పీకుతున్నట్లుంటే యేసేపు తలూపి పాయ.

మర్సట్రోజు పొదున్న ఎవురితోనో డబ్బులంపితే, యేసేపు కదల కుండ మెదలకుండ గుడ్సెలో పడిండినాడు. పాలెంలో వాల్లు జూసి యేసేపు పానం పోయింది అని జెప్పిరి. ఇంగ పాలెంలో జనాలు పాడె కడ్దాం అని ఆడ చెట్ల కొమ్మలు నర్కుతామనుకుంటే అవన్ని రాత్రి వర్షానికి తడి అయ్యి ఇరిగేతట్ల ఉండాయి. కౌన్సిలర్‌కి ఎవరో బొయి చెప్పినారు యేసెపు సచ్చిపోయినాడు ఇట్ల ఉండాది సమస్సె అని. సర్లె అని కౌన్సిలర్ మల్ల ట్రక్కుని యేసేపు ఇంటికి పంపె. ఇంగెట్లనో యేసేపును బట్టలో సుట్టి ట్రక్కులో ఏస్రి. పాస్టరొచ్చి ప్రేయర్ జేస. ఇంగందరు అడావిడి చేస్రి.

“పదండప్పొ తొందరగ బోదాం…మల్లా మాడం ముచ్చుకునె” అని అరిసి గబ గబ ట్రక్కు స్టార్ట్ చేస్రి.

పాలెం దాటి కర్నూల్ రోడ్డు మీదకు ట్రక్కు పోతా ఉంది.

మాడం మాత్రం ఇంగా ముచ్చుకునే ఉంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here