[శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజ గారి ‘మధుమంజీరాలు’ కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]శ్రీ[/dropcap]మతి మధుపత్ర శైలజ కథలు ఒక ప్రయోజనాన్ని ఆశించి వ్రాయబడతాయి. చెప్పే విధానం సింపుల్‌గా ఉన్నా, ఎఫెక్టివ్‍గా ఉంటుంది.
అత్తగారికి, మామగారికి కోడలు తన కథాసంపుటాన్ని అంకితం ఇవ్వడం మన హృదయాన్ని తాకుతుంది. వారి కుటుంబంలోని ఆత్మయానురాగాలను ఇది ప్రతిబింబిస్తుంది.
‘అమ్మతనం’ అనే కథలో రచయిత్రి ఇలా ఒక పాత్రతో చెప్పిస్తారు – “అత్త అమ్మలా మారితే కోడలు కూతురవుతుంది”. అత్తాకోడళ్ల అనుబంధం ఎలా ఉండాలో, ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు?
“ఈ కథలు మానవీయ విలువల ఉన్నతీకరణే” అనే విహారి గారి ప్రశంస ఎంతైనా సముచితం. డా. ఎమ్. సుగుణ రావు రాసినట్టు, “మిగతా సాహిత్య ప్రక్రియల కన్నా త్వరితగతిన పాఠకులకు చేరుతుంది కథ”.
శైలజ కథలు పాఠకులను చేరడమే కాదు, వారి మనస్సులలో నిలిచిపోతాయి.
‘అమ్మతనం’లో వాణిగారి పాత్ర ఒక కుటుంబ కౌన్సిలర్‌గా తీర్చదిద్దబడింది.
కథ ఎలా ఉండాలో, సర్ ఫిలిప్ సిడ్నీ అనే ఆంగ్ల సాహిత్య విమర్శకుడు ఇలా చెప్పాడు – “With a tale, forsooth, he cometh unto you, with a tale, which holdeth children from play, and old men from the chimney corner”.
శైలజ, ఒక సన్నివేశాన్ని జనరలైజ్ చేసి, ఒక విశ్వసత్యంగా మార్చగలదు. మొత్తం కథకు అది ఏక వాక్య సారాంశం అవుతుంది. ఉదా: “శాంతి అనేది సంతృప్తిలో ఉంటుంది.”
కథల టైటిల్స్ ఈ మధ్య మొనాటనస్‌గా ఉంటున్నాయి. సినిమా పాటల్లోని పల్లవులలో ఒక ముక్కను కథకు పేరుగా పెట్టేస్తున్నారు. అది తప్పని నేననను గాని, భాషాదారిద్య్రానికి అది తమ్ముడు! సినిమా వాళ్ళల్లో ఈ టెండెన్సీ ఉంది. వారి సృజనాత్మకత మనకు తెలిసిందే కదా! శైలజ కథల పేర్లు విభిన్నంగా ఉంటాయి. ఉదా: ‘ఆచరణ ఏది?’, ‘మమతల మాగాణి’, ‘పుడమి తల్లికి పచ్చలపతకం’, ‘శ్రమయేవ జయతే’లు. ‘యోగః కర్మసుకౌశలం’ అన్న గీతావాక్యానికి రూపం వస్తే, లచ్చవ్వ అవుతుంది. కొడుకు గిరిధర్ కలెక్టర్ ఐనా, అతని సభకి తాను చేస్తున్న వీధులూడ్చే పనిని వదలి ఆమె వెళ్లదు. ఈ కధ కవితాత్మకమైనది కూడ. లచ్చవ్వ కొడుకు ఇలా అంటాడు. అది శైలజమ్మ ప్రసంగమే.
“అన్నీ ఉన్నాయన్న అహంకారం పనికిరాదు. రాత్రంతా కష్టపడి సూర్యోదయమైన తర్వాత విరిసే పువ్వుకు తెలియదు తాను కోవెల చేరి భగవంతుని సేవలో భాగమవుతుందో, లేక మృత కళేబరానికి అలంకారమై స్మశానానికి చేరుతుందో, కాక, గాలివాటున రహదారిపైబడి పాదచారుల పదఘట్టనలపై బడి నలిగి పోతుందో.. మన జీవితం కూడ ఇంతే!”
ఎవరన్నారు కథల్లో కవిత్యం ఉండదని?
‘మమతల మాగాణి’ లో వృద్ధురాలైన తల్లి తన దగ్గర ఉండాలని చిన్నకొడుకు కోర్టులో కేసు వేస్తాడు. నిర్ణయాన్ని న్యాయమూర్తి తల్లికే అప్పగిస్తాడు. ‘ధర్మనిలయం’ కథ, నిజాయితీయే పరమావధిగా గల తండ్రికి, డబ్బు సంపాదనే ధ్యేయంగా గల కొడుకుకూ వచ్చిన ఘర్షణ. ఇద్దరూ లాయర్లే కావడం కథపై ఆసక్తిని పెంచుతుంది.
‘పుడమి తల్లికి పచ్చలపతకం’లో సేంద్రియ వ్యవసాయం, పాలేకర్ సేద్యవిధానం చక్కగా వివరించారు రచయిత్రి. బీజామృతం, గోమూత్రం, పశుగ్రాసం పండించడం, చెక్ డ్యాంలతో నీటినిల్వ.. వీటి ద్వారా సేద్యం దండగ కాదు పండగ అని శైలజ నిరూపించింది.
“సాహిత్య ప్రయోజనం ఏమిటి? సందేశమా, మానసికోల్లాసమా?” ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అన్ని భాషల సాహిత్య విమర్శకులూ, ఈ రెండింటిని చక్కగా మేళవిస్తేనే సాహిత్య ప్రయోజనం సిద్ధిస్తుందని ఏకగ్రీవంగా చెప్పారు.
“Poesy instructs as it delights” అన్నారు మేథ్యూ ఆర్నాల్డ్. శైలజ కథలు దీనికి దర్పణం పడతాయి. ఆమె మరిన్ని మంచి కథలు వాసి, సాహిత్య సేవ, తద్వారా సమాజ సేవ చేయాలని ఆశిద్దాం.
***
మధుమంజీరాలు (కథా సంపుటి)
రచన: ఉప్పలూరి మధుపత్ర శైలజ
ప్రచురణ: కస్తూరి విజయం
పేజీలు: 198
వెల: ₹ 290/-
ప్రతులకు:
(ప్రింట్ ఆన్ డిమాండ్)
కస్తూరి విజయం
ఫోన్: 9515054998
kasturivijayam@gmail.com
ఆన్‍లైన్‍లో:
https://www.flipkart.com/madhumamjeeraalu/p/itm0e326880fd822?pid=9788196915049