మధుర యామిని

0
3

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]సు[/dropcap]రేష్ సినిమా చూస్తున్నాడు కానీ ధ్యాస కథ మీద లేదు. కథ మధ్యలో వచ్చే పాటలు వింటూ ఎసి హాలులో హాయిగా నిద్రపోయాడు. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుండి నిద్రాహారాలు లేకుండా చెల్లెలు శాంతిశ్రీ పెళ్ళి పనుల హడవిడే.

వేంకటాచలం పద్మావతి దంపతులకు ముచ్చటగా ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి యజ్ఞశ్రీ. ఆ తరువాత కొడుకు సురేష్, ఇక చిన్నమ్మాయి శాంతిశ్రీ. వేంకటాచలం పేరుకు తగ్గట్టు ఆజానుబాహుడు. స్కూల్లో టీచర్‍గా పని చేస్తూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తనకు తాను పని కల్పించుకనే స్వభావం. అంతేకాకుండా రచనా వ్యాసంగం అంటే ఆయనకు ఎంతో అభిరుచి.

పేరుకు తగ్గటుగానే పద్మావతి నోములు, వ్రతాలు చేస్తూ “ముక్కోటి దేవతలారా! నిత్యం మా ‘శ్రీనిలయం’ ఇలా కళకళలాడుతూ ఉండేలా దీవించండి” అని ప్రార్థించేది. యజ్ఞశ్రీ పెళ్ళికి చేసిన అప్పులు నిదానంగా తీర్చేసి, రెండు సంవత్సరాల్లోనే చిన్నమ్మాయి శాంతిశ్రీ వివాహం కూడా ఘనంగా చేయగల్గారు.

ఇక సురేష్ మాత్రం పి.జి. చదువుతూనే సంగీతం నేర్చుకుంటున్నాడు. కొన్ని కీర్తనలు నేర్చుకొని కచేరీలు కూడా ఇచ్చేవాడు. ఆ తరువాత ఏమయ్యిందో తెలియదుగాని, సంగీతం నేర్చుకోవడం హఠాత్తుగా మానేసిన సురేష్‌కి క్రికెట్ పై క్రేజ్ ఎక్కువైయ్యింది. వీధుల్లో పిల్లలతో ఆడడం మొదలు పెట్టి రాష్ట్రస్థాయి మ్యాచుల్లో ఆడి సెంచురీ కూడా చేసి అందరి చేత శభాష్ అన్పించుకున్నాడు.

కొడుకు ప్రతిభను చూచి అబ్బురపడిపోయారు తల్లిదండ్రులు. సురేష్ క్రికెట్ ఆటలో జాతీయ స్థాయిలో ఆడటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన పేరు నేషనల్ లెవెల్ మ్యాచ్‌లో ఉన్నట్లు బోర్డు మెంబర్లు చెప్పారు. క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది కాని సురేష్‌కి మాత్రం క్రికెట్ మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. కొందరైతే రికమండేషన్ చేయించమని సలహా ఇచ్చారు. “ఒరేయ్! రెకమెండేషన్ ఒక్కటే సరిపోదురా, డబ్బులు కూడా బాగా ఇస్తేగాని క్రికెట్‍లో ఆడనీయరురా!” అని స్నేహితులు పలు విధాలుగా చెప్పడంతో సురేష్ ఒక్కసారిగా కృంగిపోయాడు.

చూస్తుండగానే పి.జి. పరీక్షలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ పుస్తకాలన్నీ దుమ్ము దులిపాడు. చదువుతూ ఉంటే పుస్తకంలో క్రికెట్ మ్యాచ్ కన్పిస్తోంది. సిక్స్, ఫోర్ అంటూ ఈలలు వేస్తున్నారు టీ.వీలు చూస్తున్న వాళ్ళు. మొత్తానికి పి.జి. పరిక్షలు ఎలాగో వ్రాసేశాడు. ఫలితాలు రానే వచ్చాయి. ఇక్కడ కూడా సరేష్‌కి చుక్కెదురైయ్యింది.

పి.జి ఫెయిలైన సురేష్ ఇంటి పట్టున సరిగా ఉండేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగెళ్లేవాడు. దానికి తోడు గెడ్డం పెంచి కళావిహీనుడయ్యడు. “ఒరేయ్ నీకు లక్ సరిగా లేదురా! లేకపోతే ఏంటిరా! అసలు ఏమీ రానివాళ్ళు ఫస్ట్ క్టాసులో కూడా పాస్ అయ్యారు. మరి నువ్వు బాగా చదివే వాడివే కదా! నీ పేపర్లు తారుమారైయుంటాయి. రీవాల్యూషన్ చేయించుకో. ఎందుకైనా మంచిది నీ పేరు మార్చుకోరా” అని స్నేహితులు ఉచిత సలహాలిచ్చారు.

సురేష్ టి.వి.లో న్యూమరాలజీ, జోతిష్యం మొ॥గు కార్యక్రమాలు చూడడం మొదలు పెట్టాడు. అలాగే జ్యోతిష్యం న్యూమరాలజీ పుస్తకాలు రోజంతా చదవుతున్నాడు. ఒకరోజు గుడిలో కూర్చున్న సురేష్‌ని ఒక స్వామిజీ అనుగ్రహించాడు. “నాయనా ప్రస్తుతం నీవు అశాంతితో కొట్టుమిట్టాడుచున్నావు. ఇప్పుడు నీవు ఏ పని చేసినా అది విజయవంతం కాదు. పైగా ప్రతికూలమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటావు. ప్రస్తుతం నీ గ్రహస్థితి ప్రకారం రాహు, కేతువుల దోషం నడుస్తోంది. నీ జాతకం మారాలంటే తగిన హోమాలు, శాంతులు, చేయించాలి. అప్పుడు నీ గ్రహస్థితి అద్భుతంగా మారుతుంది. నీ ఆగిపోయిన చదువు కూడా పూర్తి చేస్తావు, అలాగే ఆరు నెలలలోపే నీకు ఉన్నతమైన ఉద్యోగం కూడా వస్తుంది” అని, చెవిలో ఏదో చెప్పి సురేష్‍ని దీవించి వెళ్ళిపోయాడు స్వామీజీ.

శ్రీనిలయంలో కొడుకు సురేష్ చేత హోమం చేయించారు. దానితో పాటు శాంతి చేసి, దానాలు ఇప్పించారు. అంతేకాకుండా ఇంట్లో వాస్తుదోషం వుందని చెప్పడంతో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు.

సురేష్ మళ్ళీ మామూలు మనిషై ఆరోగ్యంగా తయారయ్యాడు. పి.జి. పరీక్షల్లో కూడా పాస్ అయ్యాడు. కాని ఉద్యోగమే ఇంకా రాలేదు. ఆలోచన్లలో మునిగిపోయి, దిగులుగా తయారయ్యాడు. సంవత్సర కాలం గడిచినా సురేష్‌కి మాత్రం ఉద్యోగ యోగం కల్గలేదు.

పెద్దల్లుడు మాత్రం ఏదో ఒక ఒంకతో మామగారి దగ్గర నుండి డబ్బులు గుంజడంలో సిద్ధహస్తుడు. కాని వేంకటాచలం మాత్రం తనకు ఎన్ని సమస్యలు ఎదురైనా చలించడు. అందర్ని నమ్ముతాడు. ఎవరు ఏమాట చెప్పినా వింటాడు. జాలి, దయ ఆయన గుండెల నిండా వున్నాయి. అన్ని సమస్యలకూ కాలమే పరిష్కారం చూపిస్తుందనే వ్యక్తిత్వం కల్గినవాడు.

“సాక్షాత్ శ్రీరామచంద్రునికే కష్టాలు తప్పలేదు కదా! శ్రీరాముడినే నమ్ముకున్న మహాపతివ్రత సీతాదేవికే అగ్నిపరీక్ష అనివార్యమైనది. కదా! మనం వారికన్నా గొప్పవాళ్ళమా!” అని భార్య పద్మావతితో అప్పుడప్పుడు ముచ్చటించేవాడు వేంకటాచలం. “మన పిల్లల ముద్దు ముచ్చట్లు తీర్చటమేగా మన జీవితం” అంటూ ధైర్యాన్నిస్తూ భర్త అడుగుజాడల్లో సాగిపోతోంది పద్మావతి.

ఒకరోజు పద్మావతి ప్రక్క కాలనీలో పేరంటానికి వెళ్ళి వస్తుండగా.. ఇద్దరు ముతైదువలు వచ్చి “అమ్మా మా ఇంటికి పేరంటానికి రండి! పండు తాంబూలం మరియు శుక్రవారం వాయినం ఇస్తాము” అని చెప్పి వీధి చివరకు వచ్చెన తరువాత పద్మావతిని మాటల్లో పెట్టి, ఏదో మత్తు లాంటిది స్ప్రే చేసి మెళ్ళో మంగళసూత్రాల గొలుసు లాక్కుపోయారు. ఆ వీధి మలుపులో వీధి దీపం వెలగడం లేదు. ఆ రోజు జన సంచారం కూడా తక్కువగా ఉంది. రోడ్డు ప్రక్కన పడివున్న పద్మావతిని గుర్తు పట్టి ఇంటికి తీసుకొచ్చారు.

శ్రీనిలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరుగుపొరుగువాళ్ళు వచ్చారు. కాలం బాగోలేదు. మనమే జాగ్రత్తగా ఉండాలన్నారు కొందరు. “అయినా ఈవిడకు పూజలు పునస్కారాలు ఎక్కువ, జాగ్రత్త తక్కువ” అనే అమ్మలక్కల సూటీ పోటీ మాటలు పద్మావతి చెవిన పడ్డాయి. పలకరించటానికి వచ్చి పుండు మీదకారం వేసినట్లున్నాయి వారి మాటలు, తలుచుకొని ఇంకా బాధపడింది.

‘అసలు ఏం జరుగుతోంది మా ఇంట్లో? దేవుడా ఏమిటీ పరీక్ష? నేను జీవితంలో ఏ ఒక్కరికీ హాని చేయలేదే! ఎందుకని నా కుటుంబానికి ఇన్ని కష్టాలు వచ్చిపడుతున్నాయి’ వెంకటాచలం గుండెల్లో బాధలు, ఆవేదనలు చిక్కుముళ్ళు వేసుకున్నాయి. ఈ సంఘటనతో ఆయనకు రెండవ సారి గుండెపోటు వచ్చింది. రెండు రోజులు హస్పటలో ఉండి వైద్యం చేయించుకొని ఇంటికి చేరుకున్నాడు.

తల్లిదండ్రులు సురేష్‌కి పెళ్ళిచేయాలని ఆలోచిస్తున్నారు. కాని సురేష్ మాత్రం ఈ కట్నాలతో, సాంప్రదాయలతో చాలా విసుగు చెందాడు. “అయినా నేను ఇప్పుడు పెళ్ళి చేసుకొని ఎవర్ని ఉద్ధరించాలి? అసలు నాకు ఉద్యోగమే లేదు! నా మెడకో డోలా!” అని అమ్మతో చెప్పి సింగిల్ టీ త్రాగి, సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాడు సురేష్.

కొడుకు పెళ్ళి ఎప్పుడౌతుందా! అని దిగులు పెట్టుకున్నారు. ఈ రోజులో అమ్మాయిలు తక్కువైపోయారు. అమ్మాయిలకు తొందరగానే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ, అబ్బాయిలే పెళ్ళికాని ప్రభాకర్, ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. నాటి కన్యాశుల్కం లాగా మగపెళ్ళి వారే కట్నం ఇచ్చే రోజులు మళ్ళీ వచ్చేశాయి అని బాధపడుతున్నారు తల్లిదండ్రులు.

కాలం మారుతోంది. రుతువులు తాత్కాలికంగా గతి తప్పినా మళ్ళీ గాడిలో పడుతున్నాయి. ఎండ, వెన్నెల, వర్షం, చీకటి వెలుగులు, పౌర్ణమి అలాగే అమావాస్య. జీవితం ముప్ఫై రోజులైతే, పదిహేను రోజులు వెన్నెల, పదిహేను రోజులు చీకటి. ‘మళ్ళీ వెన్నెల కోసం ఎదురు చూడటమే మనం చేసే పని’ అని అనుకుంటున్న సురేష్ జీవితంలో..

మంచి రోజు రానే వచ్చింది. సురేష్‌కి ఉద్యోగం వచ్చింది. శ్రీనిలయంలో అందరూ ఆనందోత్సాహాలతో పొంగిపోతున్నారు. “ఒరేయ్! ఇప్పుడైనా పెళ్ళి చేసుకోరా! పైగా నీవు కోరుకున్నట్టు ఉద్యోగం కూడా వచ్చేసిందిగా! నీ పెళ్ళి గురించి నాన్నగారు చాలా బెంగ పెట్టుకున్నారు” అని అమ్మ అన్నం వడ్డిస్తూ చెప్పింది.

ఉద్యోగంలో చేరిన సురేష్ తన మొదటి నెల జీతంతో అమ్మకు మంగళసూత్రం, గొలుసూ చేయించాడు. వేంకటాచలం స్కూల్ టీచర్‌గా పదవీ విరమణ చేశాడు. వేంకటాచలం పద్మావతిల షష్టిపూర్తి మహోత్సవం ఘనంగా జరిగింది. వేంకటాచలం మంగళసూత్రం గొలుసును పద్మావతి మెడలో అలంకరించాడు. అక్కలు, బావలు, పిల్లలతో ‘శ్రీనిలయం’ కళకళలాడుతూ, సీరియల్ లైట్ కాంతులతో దేదీప్యమానంగా వెల్గుతోంది.

‘మా నాన్న పెళ్ళి చూచే అదృష్టం మాకు కల్గింద’ని పిల్లలు ఆనందంతో మునిగిపోయారు.

“అల్లుడుగారు కొత్త ఇల్లు కట్టిస్తున్నారు నాలుగు లక్షలు కావాలి” అంటూ యజ్ఞశ్రీ అమ్మ దగ్గర అప్లికేషన్ వేసింది. నాన్న దగ్గర నుండీ రెండు లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది యజ్ఞశ్రీ.

ఇందుకే పెద్ద బావంటే సురేష్‌కి కోపం. పెద్దబావను తిట్టుకోని రోజు లేదు. పెద్దబావ మాయల మరాఠీ. ఉద్యోగం సరిగా చేయడు, ఇంకా జీతం ఎలా వస్తుంది? అందరి దగ్గరా అప్పులు చేస్తాడు. సకల దుర్గుణాలమూర్తి. పేకాట, కోడిపందెం, గుర్రపు రేసులు జోరుగా ఆడతాడు. ఇంకా ఏదో తక్కువైనట్లు త్రాగుడూ వగైరాలకు లక్షలకు లక్షలు నాశనం చేసిన వ్యసనమూర్తి.

కాని చినబావ అలాకాదు. అసలు తనకు కట్నమే వద్దని చెల్లాయిని పెళ్ళి చేసుకున్నాడు. సంప్రదాయాలకు దూరంగా ఉంటాడు. ఒకర్ని చేయి చాచి అడగడు. ముఖ్యంగా, ఉన్నదానితోనే తృప్తిగా జీవించే మనస్తత్వం. అందుకే చెల్లాయి శాంతిశ్రీ, చినబావ పిల్లలు అంటే తనకు చాలా ఇష్టం  – అని ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారు జామున నిద్రలోకి జారుకున్నాడు సురేష్.

ఒక్కసారిగా వేంకటాచలంగారికి రక్తపోటు పెరగడంతో హస్పటల్లో చేర్పించారు. ఆయనకు ఊపరి ఆడటంలేదు. శ్వాస పీల్చడానికి కష్టంగా ఉంది. ఐ.సి.యు. లోనికి ఎవర్ని పంపించడం లేదు. 24 గంటల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని డాక్టర్లు చెప్పారు. నాన్నకి మూడవసారి గుండెపోటు వచ్చింది. నాన్న ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయయి. శ్రీనిలయంలో విషాధ చాయలు. “నాన్న!” అంటూ గట్టిగా అరిచి మంచం మీద లేచి కూర్చున్నడు సురేష్, “బాబూ ఏమయ్యింది నాయనా?” అంటూ పరుగున వచ్చింది అమ్మ.

ఇది నిజం కాదు! నాన్నకు గుండెపోటు వచ్చింది కలలో. “అమ్మా! నాన్నకు మూడవసారి గుండెపోటు వచ్చిందని నాకు కల వచ్చింది” అని అంటూ తల్లిని పట్టుకొని బావురుమన్నాడు సురేష్. ఇంతలో తండ్రి వచ్చి సురేష్ తల నిమిరి.. విభూది పెట్టి, మంచి నీళ్ళు త్రాగించాడు. “నీవుండగా నాకు భయం లేదు బాబు” అంటూ కొడుకుని చూచి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

సురేష్ తన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాని కట్నం తీసుకోకుండా సింపుల్‌గా పెళ్ళి చేయాలని తన షరతులను సున్నితంగా చెప్పాడు. ఇప్పుడు తన ఆలోచనంతా నాన్న గురించే. అందుకనే తను కూడా ఒక ఇంటివాడినై పోతే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేశాడు. లవ్ మ్యారేజికి బై బై చెప్పేసి, అరేంజిడ్ మ్యారేజికి రాజీపడిపోయాడు పాపం సురేష్.

సునీతతో సురేష్ వివాహం చాలా సీదాసాదాగా జరిగింది. చాలా తక్కువ మంది చుట్టాలు, ఎక్కువ మంది స్నేహితులు, వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. సాంప్రదాయం ప్రకారం కొన్ని ముఖ్యమైన మొక్కులు తీర్చుకొని, గుడులు, గోపురాలు దర్శించుకున్నారు. చాలాకాలం తరువాత ఆ ఇల్లు సందడిగా మారింది.

ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో టీచర్‍గా పనిచేస్తోంది సునీత. ఇక సురేష్ డ్యూటీలు మామూలే. లేటుగా ఇంటికి రావడం, చిరాకుగా ఉండటం రొటీన్‌గా మారిపోయింది. దీనికంతటికీ కారణం ఆఫీసులో పని ఒత్తిడే. ఆఫీసులో పని చేస్తున్నంత సేపూ చుట్టూరా అమ్మాయిలే ఉంటారు. అందుకే ఆనందంగా శెలవలు పెట్టకుండా డ్యూటీ చేస్తున్నాడు. ఇంత మంచి ఉద్యోగ మిచ్చిన ఆ దేవుడు ఒక లవ్ మ్యారేజీ చేసుకునే అదృష్టం కూడా ఇస్తే బాగుండేది కదా! అని ఆలోచిస్తున్న సురేష్‌కి బస్‌లో ఎదురుగా..

ఒక ‘లలిత లవణ్య లతాంగి’ మెరిసే కళ్ళతో వచ్చి తన ముందు సీట్లో కూర్చుంది. చామన ఛాయరంగు. తళుక్కుమని మెరుస్తున్న ముక్కపుడక, వాలుచూపులతో తనను ఆకట్టుకుంది. సునీత కన్నా అందంగా ఉంది, సునీత తెలుపు కానీ ఈ అమ్మాయి చామన ఛాయ, అయినా ఈ అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది.

ఇది మోహమా! సమ్మోహనమా లేక ప్రేమయా! అసలు వేరే అమ్మాయి వంక తను ఇలా చూడవచ్చా! ఆమెతో మాట్లాడవచ్చా! మరి తనకు పెళ్ళి అయిపోయింది కదా.. అని ఆలోచించుకుంటూ ఉంటే బస్సు ఆగింది. ఆమె వడివడిగా దిగి వెళుతూ ఉంటే సురేష్ కూడా ఆమెను అనుసరించాడు.

ఆకాశమంతా నల్లని మేఘాల దుప్పటి కప్పుకొంది. ఉరుములు, మెరుపులతో ఆహ్లాదభరితంగా ఒక్కసారిగా వానజల్లు ప్రారంభమైయ్యింది. ఆ అమ్మాయి ఒక షట్టర్ తెరవని షాపు వరండాలో వానకు తడవకుండా నుంచుంది. వర్షం ఇంకా పెద్దదై తమకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వరుణదేవుడికి థాంక్స్ చెప్పుకుంటూ, దాదాపు గంటసేపు ప్రేమతో ఒకరి నొకరు ఆరాధించుకున్నారు.

వర్షం తగ్గినా ఇంకా చినుకులు పడుతూనే వున్నాయి. కొంత మంది ప్లాసిక్ట్ కవర్లనే గొడుగులుగా చేసుకొని వెళుతుంటే, కొంతమంది హాయిగా తడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతోంది. రెండు వీధులు దాటి ప్రక్క కాలనీకి దారి తీసిన ఆమెను అనుసరించాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. సురేష్‌కి మాత్రం గుండె ఆగినంత పనైయ్యింది. దూరం నుండే వెనుకకు తిరిగి, ఆనందంతో కూడిన బరువైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు.

ఇంట్లో మూడీగా ఉంటున్న సురేష్‍ని ప్రశ్నించింది భార్య సునీత. “నాకు అనేక సమస్యలుంటాయి! అవన్ని నీకు చెప్పాలా?” అని గట్టిగా అరిచాడు. “ఇక్కడ మీరొక్కరే ఉద్యోగం చేయ్యటలేదు. నేను కూడా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాను. పైగా ఇంట్లో పనులన్ని కూడా చేస్తున్నాను. నాలాగా చదువుకున్న వాళ్ళు ఇంత చాకిరి చేస్తూ కూడా, మీ కాళ్ళ దగ్గర సహనంగా పడి ఉండరు” అన్నది కోపంతో.

వీరిద్దరి మనస్పర్థలు, కోపతాపాలతో ఆగక, కొట్టుకోవడటం వరకూ వెళ్ళాయి. మధ్యలో అత్తగారు ఏదో సర్ది చెప్పబోతే “మా విషయాలు మీకెందుకు?” అని విసుక్కొంది సునీత. “పద్మావతీ! మన పెళ్ళైన కొత్తలో కూడా ఇలాంటి ‘చిటపటలు’ కొన్ని జరిగాయి. నీకు గుర్తుందా? అసలు రుసరుసలు, అలుకలు సంసారంలో లేకపోతే ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు పెరగవు తెలుసా!” అని చెపుతూ నిద్రలోకి జారుకున్నాడు వేంకటాచలం.

ఎన్నోవేల ప్రశ్నలతో సతమత మౌతున్న సురేష్‌కి తన మధుర స్నేహమయి కన్పించలేదనే బాధ రోజు రోజుకీ ఎక్కువై పోయింది. ఈ బాధ ఏమిటోగానీ చాలా మధురంగా ఉంది. ఎందుకో ఈ లోకమంతా రాత్రియందే ఎక్కువగా అందంగా ఉంటుంది. ఆ మధురమైన రేయిలో తన స్నేహితురాలికోసం ఎదురు చూస్తునే ఉన్నాడు.

“ఇల్లు కట్టడం ఇంకా పూర్తికాలేదు. ఇంకా రెండు లక్షలు డబ్బు కావాలి” అంటూ మళ్ళీ అక్క పిల్లలతో సహా ఇంటికి వచ్చింది. ఇంట్లో గందరగోళ వాతావరణం నెలకొంది. తాను రిటైర్ అయినపుడు వచ్చిన డబ్బు చాలా వరకూ అయిపోయింది, మరి ఈ రెండు లక్షలు పెద్దల్లుడికి ఎలా ఇవ్వాలి? తనకు తెలియకుండానే సమస్యల వలయంలోనికి ఇరుక్కుపోతున్నాడు వేంకటాచలం. ఇక చేసేది లేక తను దాచుకున్న డబ్బులోనిదే కొంత తీసి పెద్దకూతురికి ఇచ్చి పంపించాడు.

కాని ఈ పెద్ద బావ డబ్బు వ్యవహారమంతా సురేష్‌కి ఏమాత్రం నచ్చదు. “పెళ్ళికి ఐదు లక్షలు కట్నం, అది కాకుండా ఇల్లు కోసం, చదువుల కోసం లక్షల్లో డబ్బు ఇచ్చామే! బావ మళ్ళీ ఈ డబ్బు తిరిగిస్తాడా?” అంటూ ఆవేశంతో అక్క యజ్ఞశ్రీని ప్రశ్నించాడు సురేష్.

“ఆ విషయాలన్నీ నీకెందుకురా? నాన్నగారు చూసుకుంటారు కదా” అని తల్లి సర్ది చెప్పింది. “మీ డబ్బులు మాకక్కర లేదు” అంటూ కోపంగా అరుస్తూ “అణా పైసలతో సహా తిరిగి ఇచ్చేస్తాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయంది అక్కయ్య.

“ఆడబడచు కన్నీళ్లు పెట్టుకుంటే ఇంటికి అశుభం నాయనా” అంటూ బి.పి పెరిగిపోయిన తల్లి కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది.

సమయానికి ఇంట్లో నాన్న లేడు కాబట్టి సరిపోయింది. ఆయనుంటే ఇల్లు రణరంగమయ్యేది. ఈ విషయాలన్ని ఆలోచిస్తూ సురేష్ సతమతమౌతున్నాడు. ఆఫీస్ పనిలో తరచుగా తప్పులు రావడంతో బాస్ చేత చివాట్లు కూడా తింటూన్నాడు. ‘నేను రోజు రోజుకీ బలహీనుడనైపోతున్నాను? ఎందుకని?’ అనుకున్నాడు.

ఓహో! అదా సంగతి! తన స్నేహమయి కన్పించ లేదు కదూ! ఆమె వచ్చే బస్ కోసం ఎదురు చూస్తూ, ఆమె ప్రేమకోసం పరితపిస్తున్న సురేష్‌కి తన ప్రియురాలు సాక్షాత్ దేవతలా దర్శనమిచ్చింది. ఆమె కూడా సురేష్ చూచి పలకరింపుగా నవ్వింది. ఆమెతోపాటు ఇంటికి చేరుకున్నాడు.

మూన్ బిస్కెట్లు టీతోపాటు సురేష్‌కి ఇచ్చింది. వారిద్దరి మధ్యా మౌనం మాట్లాడుతోంది. మౌనభాషలో ఎన్నో పలకరింపులు, మరెన్నో సమాధానాలు. సురేష్ మనసు ఎంతో హయిగా, ఆనందంగా ఉరకలు వేస్తోంది.

ఆమె తన మొబైల్ ఫోన్ సురేష్‌కి ఇచ్చింది. ఫోటోలో కంటే సహజంగానే ఎంతో సౌందర్యంతో మెరిసిపోతోంది. ఒహో! తన పేరు ‘మధుర యామిని’ కదా! ఎంత అందమైన పేరు. మధురయామినికి తన స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు. అంత గొప్పగా లేడు కాని సురేష్‌ది ‘ఫోటోజెనిక్ ఫేస్’ అని ఆమె భావన. కరెంట్ పోయింది. అంతా చీకటి. వదల లేక, ఉండలేక మధురయామిని ప్రేమిస్తూ, రోజూ వచ్చి వెళుతున్నాడు.

ప్రేమలో ఇంత హాయి ఉందా! స్నేహంలో ఇంత లాలాన దాగి ఉంటుందా! ప్రేమ గురించి కవులు కవిత్వం చెపుతూ వుంటే మైమరచి వినేవాడు, అందుకే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని కలలు కనేవాడు. మరి కలలు నిజం కావుగా! మళ్ళీ భయమేసింది.

వాళ్ళిద్దరూ ఎక్కువగా రాత్రి సమయంలోనే కలిసేవాళ్ళు, అప్పుడే తరచుగా కరెంట్ పోయేది. రాత్రి ఇంత మధురంగా ఉంటుందని ఇప్పుడు తెలిసింది. అప్పటి నుండి రాత్రిని ఇష్టపడడం అలవాటు చేసుకున్నడు. సునీతతో ఆప్యాయంగా మాట్లాడుతూ, చిరాకుపడడం తగ్గించాడు. సునీతను సినిమాకు తీసుకెళ్ళాడు. కొడుకులో వచ్చిన మార్పుకి తల్లిదండ్రులు సంబరపడిపోయారు.

“మీరు తండ్రి కాబోతున్నారు! బజార్ నుండి పులుపు మామిడికాయలు తీసుకు రండి” అని సిగ్గుతో చెప్పింది సునీత. అమ్మానాన్నలు ఆనందంతో పొంగిపోయారు. “ఈ శ్రీనిలయానికి మనవడు శ్రీకాంత్ రాబోతున్నాడు పద్మా!” అంటూ ఆనంద బాష్పాలతో శ్రీవేంకటేశ్వర చిత్రపటానికి నమస్కరించాడు. ఆ రోజు అమ్మ అందరికి పాయసం వడ్డించింది.

ఎప్పటిలాగానే సురేష్ మధురయామిని ఇంటికి వెళ్ళాడు. కాని అక్కడ మాత్రం తాళం, అతన్ని వెక్కిరించింది. ఎక్కడికో వెళ్ళి ఉంటుందనుకున్నాడు. ఇక ఉండబట్ట లేక ఇంటి వాళ్లను అడిగాడు. వాళ్ళు చెప్పిన విషయం విని షాక్ తిన్నాడు.

మధురయామిని భర్త ఏదో ఆఫీసు పని మీద విదేశాలకు వెళ్ళాడు. అక్కడ పని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వస్తుండగా, అతను ఎక్కిన విమానం అదృశ్యమైపోయింది. అసలు విమానం ఏమయ్యిందో తెలియదు. విమానానికి ప్రమాదంకానీ జరిగిందా! లేక ఎవరైనా ఉగ్రవాదులు దారి మళ్ళించారా! ఇప్పటివరకు ఆ విమానం జాడ తెలియలేదు. ఈ సంఘటన జరిగి ఎన్నో సంవత్సరాలైపోయింది.

మరి మధురయామిని ఎక్కడికి వెళ్ళినట్లు? ఫోను చేశాడు. కానీ ఆ ఫోన్‌లో “ప్రస్తుతం ఈ నెంబరు పని చేయుట లేదు” అని వస్తోంది. మధురయామిని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. సురేష్ కుమిలిపోతున్నాడు.

అంటే ఆమె భర్త సురక్షితంగా ఇండియాకి తిరిగి వచ్చాడన్నమాట. ఆ తరువాత వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయిందన్న మాట. ఇది అసలు విషయం అని మధురమైన బాధతో సరిపెట్టుకున్నాడు సురేష్.

ఆ రోజు గుడిలో స్వామిజీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. “నీవు ఒక అమ్మాయి జీవితంలోకి వెళతావు. ఆమె ప్రేమను పొందుతావు. కానీ ఆమెను నీవు వివాహం చేసుకోవు. తప్పిపోయిన ఆమె భర్త మళ్ళీ ఆమెను కలుసుకుంటాడు”.

రాత్రిలో ఎంతో అందముంది, వెన్నెలలో ఇంకెంతో త్యాగముంది! దూరంగా నువ్వెళ్ళిపోయినా, ‘మధురమైన ప్రేమను నాకందించావు యామినీ, ధ్యాంక్యూ మైడియర్ మధురయామినీ’ అనుకున్నాడు.

శ్రీకాంత్ నెత్తుకున్న సునీత టెర్రస్ పైన సురేష్ చెంత చేరింది.

నీలాకాశంలో యామినీపతి చిలిపిగా నవ్వుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here