Site icon Sanchika

మధురా నిలయం!

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘మధురా నిలయం!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వై[/dropcap]ద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా, కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయో అంతుపట్టడంలేదు. వాటిని ఎలా ట్రీట్ చేయాలో తెలియడంలేదు. ఎన్నో దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అమెరికాలోని మిన్నిసోటా స్టేట్ రాచెస్టర్ మేయో క్లినిక్ వరల్డ్ వైస్ పరిశోధనలకు – మంచి ఫలితాలకు ఫేమస్. అక్కడ వ్యాధి గురించి రీసెర్చి చేస్తూ పేషంటు మీద డ్రగ్సును ప్రయోగించి చూస్తున్నారు. అవి ఎంతవరకూ పనిచేస్తాయో తెలియదు. కొన్ని నెలలు, ఒకసారి సంవత్సరాలు టైం పడుతోంది.

“ఎక్స్‌ట్రీమ్లీ సారీ మిస్టర్ కాంత్! మీ వైఫ్‌కి ఇక ట్రీట్‌మెంట్ లేదు. ప్రభుత్వ సేవలు నిలిపి వేస్తున్నాము. మేము చేయగలిగినది ఏమీ లేదు. రిహాబ్ సెంటర్‌కి తరలిస్తాం.” అన్నాడు డాక్టర్ శరణ్.

మధుర పరిస్థితి చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఏదో ఒకరోజు ఈ మాట చెబుతారని అనుకున్నదే!

అసలు కొందరు సలహా కూడా చెప్పేరు.

“ఇంకా ఎంతకాలం హాస్పిటల్లో ఉంచుతారు? మీకు తిరుగుడు శ్రమ, హాస్పిటలకి ఆదాయం తప్పితే ఆవిడ కోలుకోదు. లివర్, కిడ్నీలు చివరికి హార్ట్ కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అవి సూట్ కావు. కొద్దికాలం పొడిగించడం తప్పితే ఆవిడ లేచి తిరగదు. అసలు ఊపిరి తీసుకోడం తప్పితే కదలిక లేదు. కోమాలో వుంది. ఇన్సూరెన్స్ డబ్బుకోసం అలా ఉంచుకున్నారు. అది ముగిసింది. కనుక ఇప్పుడు చెబుతున్నారు.

ప్రతి హాస్పిటల్ వాళ్ళు డబ్బుచేసుకోవాలని చూస్తారు. మీ బాధలు వాళ్లకి ఎందుకు? నా మాట విని వెంటిలేటర్ తీసివేయండి. ఆవిడకి ప్రాణం ఏనాడో పోయినది. ఈ మెషిన్స్‌తో అలా గుండె కొట్టుకునేలా చేశారు, అంతే!” అని!

అది నిజమే అని కాంత్‍కీ తెలుసు. కానీ ఎవరు ఏమనుకుంటారో; దూరంగా వున్న కొడుకు కూతురు తప్పు పెడతారేమో.. అని ఇలా ఎదురు చూసాడు.

మధుర.. అయిదేళ్లుగా తాను సుఖపడలేదు. ఇలా ఏవేవో తెలియని జబ్బులతో బెడ్ మీదనే వుంది.

ఆమెను ఇలా చూడలేక పిల్లలు రావడం మానుకున్నారు – ‘అమ్మ లేవలేదు. జబ్బులు తగ్గే దారిలేదు.” అని. అందరికీ తెలుసు. ఇప్పుడు డాక్టర్ చెప్పేక ఫోను చేశాడు.

“సరే డాడీ, మీ ఇష్టం. ..అమ్మ ఇండియాలోవుంది అనే భ్రమలో ఉంటాం అంతే, మేము రాలేం.” అన్నారు.

అవును మరి, వాళ్ళు కూడా పేరుకి అమ్మ అనే శరీరం ఉంది కాని అది మామూలుగా పనిచేయదు అని తెలుసుకున్నారు.

గుండె రాయిచేసుకుని స్నేహితుల సాయంతో మధుర క్రిమేషన్ పూర్తిచేసాడు. ఇంటికి తిరిగి వచ్చాక ‘నేను కొత్తగా బాధ్యతను నిర్వహించాలి’ అనుకున్నాడు.

జీవితంలో అనుకోని విషాదాలు ఉంటాయి. మధుర ఏనాడు హాస్పిటల్లో చేరిందో ఆనాటినుంచి ఇల్లు శూన్యంగా మారింది. పనివాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాంత్ రోజూ హాస్పటల్‌కి వెళ్లే అవసరం లేదు. కంపెనీ పని ఇంటినుంచి చేయడం అలవాటు ఐనది. అప్పుడప్పుడు మీటింగ్స్ ఉంటే వెడతాడు.

ఫ్రెండ్స్ కలుస్తూ వుంటారు. ఏడాది గడిచేసరికి అదీ బోర్ అనిపించింది. వాళ్ళని రావద్దు అని చెప్పేడు.

బాగా చనువు వున్న ఆత్మీయులు “పెళ్లి చేసుకో. నీకు ఇంకా 60 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు చాలామంది కొత్త జీవితం గడుపుతున్నారు. నీతోబాటు సంపాదించే ఆమెను చేసుకో. ఇక మధురను మరిచిపోయి నీ గురించి ఆలోచించు.” అనడం మొదలుపెట్టారు.

“నా గురించి నేను ఆలోచిస్తే పెళ్లి అవసరంలేదు. మధురను ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా కుటుంబాన్ని ఎంతో ఆదరంగా చూసింది. చిన్న ఉద్యోగంలో వున్నప్పుడు అందులోనే సంసారం గడిపింది. పెద్ద పొజిషన్‌లోకి వచ్చినా ఏనాడూ ఇది కావాలని కోరలేదు. మధుర స్థానం ఎవ్వరూ ఆక్రమించలేరు.” అని చెప్పాడు

“సరే! మీ పిల్లల దగ్గిర వుంటావా?”

“ఇప్పుడు కాదు ఒంటరిగా వుండలేనప్పుడు! ఏమో భవిషత్ గురించి యిప్పుడే ప్లాన్ చేయలేను. వాళ్ళు తప్పదు అంటే అప్పుడే ఆలోచించవచ్చు.”

“కానీ ఇప్పుడు ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం. ఎందుకూ మా తమ్ముడు గాని అన్నగాని ఎవ్వరూ మా పేరెంట్స్‌ని చూడలేదు. వాళ్ళు నా దగ్గిరే వుంటారు. నువ్వు ఒక్కడివే కనుక మధుర మనసు మంచిది కనుకా నీకు ఇబ్బంది రాలేదు. నా పిల్లలు నన్ను చూస్తారని నమ్మకం లేదు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా వున్నప్పుడే. ఇద్దరిలో ఒకరు లేకపోతే మిగిలినవారి జీవితం దుర్భరం. డబ్బు వుండవచ్చు కానీ ప్రేమ అభిమానం ఎవరికీ ఉంటాయి? ఈ కాలం పిల్లలు మరీ స్వార్థపరులు అయిపోతున్నారు. కనుక బాగా ఆలోచించు. నీకంటూ తోడు ఉండాలి, అన్నిరకాలుగా!” అని హితబోధ చేశారు.

“లేదు. మరో మనిషిని తెచ్చి కొత్త గొడవలు తెచ్చుకోలేను. నా పిల్లలు కూడా అంగీకరించరు. ఇంటికి వస్తే అమ్మలా ఆదరించేవారు లేరు.. అని రావడం మానుకుంటారు. ఇప్పుడు ఐతే నాన్న ఒక్కరూ వున్నారని వస్తారు. నేనూ వాళ్ళ దగ్గిరకి వెడుతూండవచ్చు.

మీరు చెప్పినమాట నా డబ్బు కోసం ఎవరైనా పెళ్ళికి సిద్ధపడవచ్చు. నా పిల్లలను ఇష్టపడతారని నమ్మకం లేదు. ఈ మధ్య టీవిలో ఒక చర్చా కార్యక్రమం చూసాను. అది ఇలా రెండవ పెళ్లి చేసుకున్న వారి గురించే. ఒక డాక్టర్ మాత్రం ఆ చర్చలో చెప్పేరు. ‘..భార్య చనిపోతే మరో మనిషిని తీసుకురావడం జరగని పని. ఆమెతో బంధం ఆత్మీయత పెనవేసుకుపోయాక ఆ జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు. అరవైలో భార్యగాని భర్త గాని దూరమైతే మనసును మరో అంశం మీదకు మళ్ళించుకోవాలి. స్నేహితులతో విహారయాత్రలు, పుస్తకాలు చదవడం, రచనా వ్యాసాంగం, సోషల్ సర్వీస్ ..ఇలా తీరికలేని బిజీలోఉంటే రోజులు గడిపేయవచ్చు..’! ఆ మాటలు నాకు చాలా నచ్చాయి. అదే నేను పాటించదలచుకున్నాను.” అన్నాడు కాంత్.

“ఓకే! నీకు నీ మీద అంతటి కంట్రోల్ ఉంటే తప్పకుండా అలాగే చేయి. ఆల్ ది బెస్ట్..” అన్నారు వాళ్ళు చేసేది లేక.

వాళ్ళని తప్పించుకోడానికి అనలేదు కాంత్. మనస్ఫూర్తిగానే చెప్పేడు. అతడి మనసులో మధురకే చోటు వుంది ..దాన్ని ఎవ్వరూ ఆక్రమించుకోలేరు. కొంతకాలం ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. పిల్లల దగ్గిరకు వెళ్లి కొద్దిరోజుల తర్వాత వచ్చాడు.

అలా వెళ్ళి వస్తున్నపుడు కనిపించింది ట్రైన్‌లో శంకరి. విమానాల్లో తిరగచ్చు. కానీ మాటాడేవారు వుండరు. ఎవరికివారు అది వాళ్ళ స్వంత విమానం అన్నట్టు వుంటారు. అందుకని ట్రైన్‌లో వెళ్ళాడు.

ట్రైన్ హైదరాబాద్ చేరాక అందరూ దిగిపోయినా ఒక మహిళ అలాగే పడుకుని నిద్రపోతుంటే కాంత్ కాసేపు సందేహంగా చూసి దగ్గిరగా వెళ్లి “అమ్మా మీరు లేస్తారా.. హైదరాబాద్ వచ్చింది.” అన్నాడు.

ఆమెలో చలనం లేదు. పెద్ద వయసులో ఉన్న ఆవిడే కనుక ఆవిడను గట్టిగా కుదిపి చూసాడు. ఆవిడ శరీరం వేడితో మసిలిపోతోంది.

‘అయ్యో పాపం జ్వరం వచ్చినట్టువుంది..’ అనుకుని పోర్టర్‌ని పిలిచి చెరో వైపు పట్టుకుని రైల్వే హాస్పిటల్‌కి తీసుకువెళ్లి చేర్పించాడు. అది మామూలు జ్వరం కాదు, వేరే హాస్పిటలకి తీసుకెళ్లామన్నారు.

తెలిసిన డాక్టర్ ఉంటే ఆయన హాస్పటల్లో చేర్పించాడు. ఆవిడ కోలుకోడానికి పది రోజులు పట్టింది.

డిస్చార్జ్ చేసేముందు ఆవిడను “ఎక్కడికి వెడతారు?” అని అడిగితే “నాకు ఎవరూ లేరు.. బాబూ మీకు వంట చేసి ఇల్లు చూసుకుంటాను. మీరే నా ప్రాణాలు నిలబెట్టేరు. మీరే ఆశ్రయం ఇవ్వండి” అంటూ కన్నీళ్లు పెట్టుకుని బతిమాలింది.

ఇప్పటిదాకా పనిమనిషే వంటచేసి పెడుతోంది. రుచి పేచీ లేకపోయినా గడుపుకుంటూ వచ్చాడు.

ఈవిడను ఆదుకున్నట్టు ఉంటుంది, నాకూ మంచిగా వంటా చేస్తుంది అనుకుని ఇంటికి తీసుకువచ్చాడు.

“కొద్దిరోజులు రెస్ట్ తీసుకోండి. ఇల్లు వాతావరణం అలవాటు అవుతుంది..” అని చెప్పినా ఆవిడ, “నాకు అలవాటే బాబూ, కేటరింగ్ సర్వీస్ వారి దగ్గిర వంటలు చేసాను..” అంది.

“ఇంతవరకూ మీ పేరు అడగలేదు.. చెప్పండి” అన్నాడు కాంత్.

“పేరు శంకరి.. పిన్నీ అని పిలువు బాబూ!” అందావిడ.

అలా కాంత్ ఇంట్లో స్థిరపడి పోయినది ఆరోజునుంచి.

ఆవిడ చేతివంట చాలా రుచిగావుంది. ఇంటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ స్వంత బంధువులా కలిసిపోయింది.

పనివారిని, అతిథులను ఆదరంగా చూసేది. కాంత్ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది.

ఆవిడ ఎవరో ఎందుకు అనాథలా ఎవరూ లేరని చెప్పిందో తెలియదు. అతడు అడగనూ లేదు.

ఆవిడ వెళ్ళిపోతాను అంటే పంపివేస్తాను.. జరిగినన్నిరోజులు జరుగుతుంది అనుకున్నాడు.

కూతురు కొడుకు వీడియో కాల్ చేసినపుడు చెప్పేడు. పరిచయం చేసాడు. వాళ్ళు కూడా సంతోషించారు – ఒంటరిగా వుండే నాన్నను చూసుకునే మంచి మనిషి దొరికినందుకు.

“ఎందుకైనా మంచిది.. జాగ్రత్తగా వుండండి. అతిగా చనువు ఇవ్వొద్దు. డబ్బుకోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి” అన్నారు.

నిజమే వాళ్ళ భయం వాళ్ళది.

“అలాగేనమ్మా, మన ఇంటి వాచ్‍౬మెన్ వున్నాడు. వాడు నమ్మకమైనవాడు. పాతికేళ్లుగా పనిచేస్తున్నాడు. భయం లేదు.” అని ధైర్యం చెప్పేడు వాళ్లకి.

ఏడాది గడిచాక శంకరి మీద పూర్తి అవగాహన కుదిరింది. ఆవిడ గురించి ఎవరూ రానూ లేదు. ఫోను అయినా చేయలేదు కూడా!

కాంత్ బిజినెస్ బాగా నడుస్తోంది. వచ్చే లాభాలతో ‘మధురానిలయం’ పేరున ఎన్నో సేవా సంస్థలు ఏర్పాటు చేశాడు.

ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లల కోసం.. వినియోగించాడు.

పిల్లలు కుటుంబంతో వచ్చి వెడుతున్నారు ప్రతి ఏడాది. వాళ్లకూ శంకరిపట్ల గౌరవం ఏర్పడింది.

నాన్నగారి గురించి నిశ్చింతగా వున్నారు.

కాంత్ ఎప్పుడూ శంకరిగారిని ఆమె స్వంత విషయాలు అడగలేదు. కానీ అతడికి అర్థం అయినది .

‘పిల్లలు పట్టించుకోలేదు. కావాలని వదిలేశారు. గమ్యంలేని ప్రయాణంలో నాకు ఎదురైంది.. నాకు సోదరిగా అన్నం పెట్టే అమ్మగా స్థిరపడింది. ఎవరికీ ఎవరు బంధం అవుతారో తెలియదు. ఇద్దరు ఒంటరివాళ్ళు కాకతాళీయంగా కలిస్తే ఆత్మబంధువు అవుతారు. దీనికి రక్త సంబంధమే అవసరం లేదు. దయాగుణం సేవాగుణం ఉంటే చాలు..’ అనుకున్నాడు. ఆవిడను ఆదరించాడు.. అచ్చం తన సహచరి మధుర లాగానే!

అతడి స్నేహితులు అతడి మానసిక ధైర్యానికి అనాథ మహిళకు ఆశ్రయం ఇచ్చినందుకు మెచ్చుకున్నారు.

వాళ్లకు కూడా శంకరి పిన్నిగారే! అప్పుడప్పుడు వచ్చి ఆవిడ చేసిన వంట తిని వెడుతుంటారు.

“కాంత్ ఆదర్శం చాలా గొప్పది! ఇలా అనాథలకు ఆశ్రయం ఇవ్వడం అనేది చేస్తే వృద్ధాశ్రమాల అవసరం ఉండదు. ఇంతకంటే గొప్ప పనిలేదు. మనం కూడా ఒకరిని ‘అడాప్ట్’ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు.

అవును! దత్తత అంటే ఆస్తికి వారసులో.. మన ముచ్చట తీర్చుకోడానికో కాదు. ఒకరికి జీవితం ఇవ్వడానికి.

Exit mobile version