Site icon Sanchika

మధురమైన బాధ – గురుదత్ సినిమా 10 – 12 O’Clock

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నటించిన ‘12 O’Clock’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]ఒ[/dropcap]క గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సమయంలోనే గురుదత్ తన దగ్గర పని చేసిన వ్యక్తులకు సినీ ప్రపంచంలో బ్రేక్ ఇవ్వడానికి, ఎవరూ సాహసించలేని సహాయాలు చేయడం గమనించవచ్చు. అయన సక్సెస్, ఫెయిల్యూర్ గ్రాఫ్ లతో ప్లాన్ వేసుకుని సినిమాలు తీయలేదు. మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్లారంతే. అందుకే సినిమా పట్ల, స్నేహితుల పట్ల ప్రేమ తప్ప ఆయనకు ప్రత్యేక లెక్కలుండేవి కావు. ‘సీ.ఐ.డీ’ సినిమాకు గురుదత్ నిర్మాతగా వ్యవహరించి రాజ్ ఖోస్లాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆ సినిమా 1956లో రిలీజ్ అయ్యింది. రాజ్ ఖోస్లా దగ్గర అసిస్టేంట్ డైరక్టర్‌గా అప్పుడు మొదటిసారి పని చేసారు ప్రమోద్ చక్రవర్తి. సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత ఆయన దర్శకుడిగా మారి ఒక క్రైం థ్రిల్లర్ తీయాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట హీరోగా దేవ్ ఆనంద్‌ను అనుకున్నారు. కొన్ని కారణాల వలన దేవ్ ఆనంద్ ఆ సినిమా చేయలేకపోతే గురుదత్ ఆ సినిమాలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు. అప్పటికే ఆయనకు మంచి దర్శకుడిగా పేరు ఉంది. కాని మరొ కొత్త వ్యక్తి దర్శకత్వంలో నటించడానికి ఆయన సందేహించలేదు. తన ఇమేజ్ ప్రమోద్ చక్రవర్తిని సినీ ఫీల్డ్‌లో నిలబెట్టడానికి ఉపయోగపడితే మంచిదని అనుకుని ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు గురుదత్.

12 O clock పేరుతో అప్పట్లోనే హాలీవుడ్‌లో ఒక పాపులర్ సినిమా ఉంది. దాని ప్రభావంతో కావచ్చు ఈ సినిమాకీ అదే పేరు నిర్ణయించారు. జీ.పీ సిప్పి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 1958లో రిలీజ్ అయ్యింది. ఇందులో గురుదత్ నటన బావున్నా, సహనటుడు రెహ్మాన్ అందరినీ డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. వహిదా రెహ్మాన్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయారు. అస్సలు నటన తెలియని స్థాయిలో ఆమె ఈ సినిమాలో కనిపిస్తారు. ఇందులో వహీదాని చూసి, గురుదత్ మిగతా చిత్రాలలో ఆమెను చూసినప్పుడు ఆమెను గురుదత్ ఎలా తీర్చిదిద్దారో అర్థం అవుతుంది. నటనలో ఓనమాలు తెలియని ఆమె ఆ తరువాత ఏ స్థాయి నటి అయిందో వహీదా సినిమాలను వరుస క్రమంలో చూస్తుంటే అర్థం అవుతుంది.

ఈ సినిమాకు సంగీతం అందించింది ఓ.పీ. నయ్యర్. సినిమాలో మొత్తం ఏడు పాటలుంటే, రెండు పాటలు మాత్రమే సాహిర్ లుధియాన్వి రాసారు. మిగతా అయిదు పాటలు మజ్రూహ్ సుల్తాన్‌పురీ రాసారు. సినిమా టైటిల్స్‌లో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి. గీతాదత్, శంషాద్ బేగం, రఫీ గానం చేసిన ఈ పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గీతాదత్ పాడిన ‘కైసా జాదూ బలం తూనే డారా’ అన్న పాట, ‘తుమ్ జో హుయె మెరె హాంసఫర్’ అనే మరో డ్యూయెట్ పాపులర్ పాటల క్రిందకి వస్తాయి.

సినిమా కథకు వస్తే ఇది క్రైం థ్రిల్లర్ కాబట్టి కథ మొత్తంగా ఇక్కడ చెప్పుకోకూడదు. బానీ చౌదరీ అనే ఒక యువతి తన అక్క బావలతో కలిసి ఉంటుంది. కాని స్వతంత్రంగా జీవించాలని ఒక లాయర్ దగ్గర సెక్రెటరీగా చేరుతుంది. అక్క మాయ ఢిల్లీ నుండి వస్తుందని తెలుసుకుని బావ రాయ్ మోహన్‌తో ఆమెను ఇంటికి తీసుకురావడానికి స్టేషన్‌కి వెళుతుంది బానీ. అక్కడ రుమాలు తీసుకుందామని పర్సు తెరిచి బానీ తుపాకీ బైటకి తీస్తుంది. అప్పుడే ట్రైన్ వచ్చి ప్లాట్‌ఫారం మీద ఆగడం, తలుపు దగ్గరకు మాయ రావడం, ఆమెకు తుపాకి గుండు తగిలి మరణించడం జరుగుతుంది. అక్కని హత్య చేసిన నేరానికి బానీ జైలు పాలవుతుంది. అసలు తన చేతికి తుపాకి ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాదు. అన్ని సాక్షాలు ఆమె హంతకురాలని దృవీకరిస్తాయి. ఆమెను ప్రేమించిన లాయర్ అజయ్ కుమార్ అసలు హంతకుడిని పట్టుకుని బానీని కాపాడుకోవడం తరువాతి సినిమా కథ.

సినిమాలో హంతకుడు చాలా చక్కని ప్లాన్ వేస్తాడు. అంత  డీటేయ్లింగ్‌తో హత్యాప్రయత్నం చూపించడం అప్పటి సినిమాలలో ఇంకా మొదలవలేదు. ఈ రకమైన కొత్తదనంతో సినిమా ప్రేక్షకులను అలరించింది. ప్లాన్ అంతా పక్కాగా పన్నెండు గంటలకు ఫిక్స్ చేసి హంతకుడు తెలివిగా బానీని ఇరికిస్తాడు. అయితే ప్రేక్షకులకు హంతకుడెవరన్నది సగంలోనే తెలిసిపోవడంతో థ్రిల్ తగ్గుతుంది. బానీ ఎలా బైటకు వస్తుంది, అజయ్ ఆమెను ఎలా కాపాడతాడు అన్న విషయంపై దర్శకుడు సినిమా తర్వాతి భాగంలో దృష్టి పెట్టడం కనిపిస్తుంది.

సినిమాలో అజయ్ మిత్రుడిగా జానీ వాకర్ మోతీ పాత్రలో కనిపిస్తారు. హీరోగా గురుదత్‌కి ఎంత స్క్రీన్ ప్లేస్ దొరుకుతుందో అంతే సమయం జానీ వాకర్‌కీ దొరకడం గమనించవలసిన విషయం. వీరిద్దరూ కలిసి బానీ నిర్ధోషి అని నిరూపిస్తారు. కొంత నాటకీయత ఉన్న ఈ సినిమా కథనం ఇప్పుడు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. ఈ సినిమాకి కూడా వీ.కే మూర్తి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసారు. సస్పెన్స్ కలిగించే సన్నివేశాలలో ఆయన పనితనం గమనించవచ్చు. హిందీ సినిమాలలో వచ్చిన మంచి క్రైం థ్రిల్లర్ల లిస్ట్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో గురుదత్ చాలా ప్రశాంతంగా, అందంగా కనిపిస్తారు. ‘ప్యాసా’ సినిమా తరువాత గురుదత్ వహీదా రెహ్మాన్‌లు కలిసి నటించిన ఈ సినిమాను నిశితంగా గమనిస్తే ఇందులో వహిదా రెహ్మాన్ నటించడం రాక ఇబ్బంది పడుతుండడం గమనిస్తాం. అదే ‘ప్యాసా’లో గురుదత్ ఆమె నుండి తనకు కావలసిన పర్ఫామెన్స్‌ను ఎలా రాబట్టుకున్నారో పోలిస్తే, వహిదా రెహ్మాన్‌ను గురుదత్ నటిగా ఎంత కష్టపడి తీర్చిదిద్దారో గమనించవచ్చు. గురుదత్ డైరక్షన్‌లో నటించిన వహీదా రెహ్మాన్‌ని, అప్పట్లో ఇతర దర్శకుల దర్శకత్వంలో నటించిన వహీదా రెహ్మాన్‌ను గమనిస్తే ఆమెను నటిగా మలచడంలో గురుదత్ వహించిన ప్రధాన పాత్రను గమనించవచ్చు.

గురుదత్‌తో వహీదా విడిపోయిన తరువాత ఇతర బానర్లలో ఆమె నటించడం మొదలెట్టేటప్పటికి ఆమెకు నటన అలవాటయ్యింది. అయినా ‘గైడ్’ లో తప్ప మరెక్కడా హీరోని డామినేట్ చేసే ఫర్మానెన్స్ ఆమెనుండి ఎవరూ రాబట్టుకోలేకపోయారు. ‘రేష్మా ఔర్ షేరా’ సినిమాకు ఆమెకు జాతీయ అవార్డు లభించినా ‘ప్యాసా’తో చూస్తే ఆమె నటన అంతటి స్థాయిలో లేకపోవడం గమనించవచ్చు. అందరు గొప్పగా చెప్పుకునే ‘గైడ్’ సినిమాను ఆ నవలా రచయిత ఆర్.కె. నారయణ్ కొట్టిపడేసారు. తాను సృష్టించిన రోజీ, రాజు పాత్రలకు తెరపై కనిపించే పాత్రలకు పోలేక లేదని తన అత్మకథలోనే ఆయన రాసుకున్నారు. ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాక వహీదా రెహ్మాన్ నటన అంతకన్నా గొప్పగా ఎదగకపోవడం, నటనలో ఒక మోనోటోని రావడం ప్రేక్షకులు గమనించవచ్చు. తన కెరీర్‌లో హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఆమెతో అద్భుత పర్ఫామెన్స్‌ను రాబట్టుకున్న గురుదత్ దర్శకత్వ ప్రతిభను వహిదా రెహ్మాన్ కెరీర్‌లో ప్రస్తావించడం సినీ ప్రేమికుల కనీస కర్తవ్యం. ఆ తరువాత ఆమె హీరోయిన్‌గా రెండవ సినిమాగా వచ్చింది 12 O’Clock. ఇందులో ఆమె పేలవమైన పర్ఫామెన్స్‌ను గమనిస్తే ఆమె నటనా ప్రతిభ వెనుక ఉన్న గురుదత్ గుర్తుకు రాక మానరు. ఇది అందరూ ఒప్పుకోకపోవచ్చు కాని వాస్తవం.

ఈ సినిమా తరువాత ఆమె దేవ్ ఆనంద్‌తో ‘సోలహ్వా సాల్’లో నటించి మళ్ళీ ‘కాగజ్ కే ఫూల్’లో గురుదత్ దర్శకత్వంలో నటించారు. ఆ తరువాత ‘కాలా బజార్’ లో కనిపిస్తే, మళ్ళీ గురుదత్‌తో ‘చౌదవీ కా చాంద్’లో చూస్తాం. ఆ తరువాత కొన్ని సినిమాల తరువాత వచ్చింది ‘సాహెబ్ బీవీ ఔర్ గులామ్’. కాంట్రాక్ట్ అయిపోయిందని ఇక గురుదత్ స్టూడియోతో విడిపోయి ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు అన్నీ ఒక మూసలో చేసిన పాత్రలే. 1965లో ‘గైడ్’ తరువాత ‘తీసరీ కసమ్’ ఆమెకు విమర్శకుల నుండి ప్రశంసలు తీసుకొచ్చినా ఇందులో వహీదాకి , గురుదత్ చూపిన వహీదాకి చాలా తేడా కనిపిస్తుంది. ఇక 1963లో ‘ముఝే జీనే దో’ సినిమాలో నటించడానికి సైలెంట్‌గా ఒప్పుకుని తన కెరీర్‌ను తీర్చిదిద్దుకున్న వహీదా రెహ్మాన్ గురుదత్ జీవితంలోనుండి నిష్క్రమించడం వెనుక కారణాలు ఏమైనా, గురుదత్ ఆ తరువాత పూర్తిగా బలహీనమయ్యారని చెప్పడానికి, ఆ తరువాత ఆయన నటించిన సినిమాలు గమనించవచ్చు.

‘సాహెబ్ బీవీ ఔర్ గులామ్’ తరువాత గురుదత్ చేసిన సినిమాలలో మనకు ఆయన శరీరం మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆయన అభిమానులు ‘12 O Clock’ సినిమాను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని చూస్తారు. అందంగా ప్రశాంతంగా గురుదత్ తానుగా కనిపించిన ఆఖరి సినిమా ‘12 O clock’. ఈ సినిమా తరువాత వచ్చిన ‘చౌదవీ కా చాంద్’లో వహీదా రెహ్మన్ ప్రభావంలో ఉన్న గురుదత్ కనిపిస్తారు. ఆ తరువాతి సినిమాలలో జీవితాన్ని త్యజించిన ఒక భగ్న హృదయం కనిపిస్తుంది. ఈ వాక్యాలలో నిజం తెలుసుకోవాలంటే ‘తుమ్ జో హుయె మెరె హమ్ సఫర్’ పాట ఒక్కటి చూడండి. చాలా కాన్పిడెంట్‌గా కనిపిస్తారు ఆయన. గురుదత్ కళ్ళతో తన మనసును ఆవిష్కరిస్తారు. ‘ఆయా మజా లాయా నషా’ అనే వాక్యాల దగ్గర వహీదాని చూస్తున్నప్పుడు అయనలో ఒక హుందాతనం, కాన్పిడెన్స్ గమనించవచ్చు. ‘ఆ జానేజా చల్ దే వహా మిల్ రహా హై జహా జమీన్ ఆస్మా, తుం జో హుయె మెరె హమ్ సఫర్ రస్తే బదల్ గయే, లాఖో దియె మెరె ప్యార్ కీ రాహో మె జల్ గయే’ అన్న వాక్యాల దగ్గర ఆయన చూపిన శరీర భాషను గమనిస్తే అంత కాన్పిడెంట్‌గా మళ్ళీ వహీదా రెహ్మన్‌తో అయన్ మరే డ్యూయెట్లో తరువాత మనం చూడం. ఆ తరువాత వారు చేసిన సినిమాలలో, పాటలలో వహీదా రెహ్మాన్ పక్కన గురుదత్‌లో ప్రేమతో కొట్టుకుపోతున్న అసహాయ ఉన్మాదం కనిపిస్తుంది. ఈ తేడాను గమనించాలంటే ఇప్పుడు మనకు లభ్యమవుతున్న టెక్నాలజీతో చాలా సులువుగా ఒక వరుసలో ఈ పాటలన్నీ చూస్తే సరి.

‘12 O Clock’ సినిమాలో గురుదత్‌పై తీసిన క్లోజ్ అప్ షాట్స్ చాలా బావుంటాయి. ఆయనకు సంబంధించిన మంచి ఫోటోలు ఈ సినిమాలో మాత్రమే దొరుకుతాయి. ముఖ్యంగా దుఃఖం, బాధ, వ్యథలకు దూరంగా అందంగా ఆశతో తళుక్కుమనే ఆయన కళ్ళు వాటిలోని ఆనందాన్ని అనుభవించడం అభిమానులకు ఈ ఒక్క సినిమాలోనే కుదురుతుంది.

Exit mobile version