మధురమైన బాధ – గురుదత్ సినిమా 13 – బాజ్

0
3

[box type=’note’ fontsize=’16’] గురుదత్ దర్శకత్వం వహించిన ‘బాజ్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]గు[/dropcap]రుదత్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించిన తరువాత గురుదత్ తీసిన మొదటి సినిమా ‘బాజ్’. 1952లో ఆయన గురుదత్ ఫిలింస్‌తో కలిపి నటి గీతా బాలి, ఆమె సోదరి హరిదర్షన్ కౌర్‌లను నిర్మాతలుగా హెచ్. జి. ఫిలింస్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ నిర్మించిన ఒకే ఒక సినిమా ‘బాజ్’. తరువాత ఆ హౌస్ నుంచి విడిపోయి గురుదత్ ఒంటరిగా గురుదత్ ఫిలింస్‌లో ఏకైక పార్టనర్‌గా “ఆర్‌ పార్” అనే సినిమా తీసారు. కాని గురుదత్ సొంత ప్రొడక్షన్స్ మొదటి సినిమాగానే ‘బాజ్’ని గురించాలి. గురుదత్ మొట్టమొదట పూర్తి నిడివి హీరోగా నటించిన సినిమా ఇది. ‘బాజీ’, ‘జాల్’లో కామియోలలో ఆయన కనిపిస్తారు. ‘బాజ్’తో సినీ హీరోగా ఆయన రంగప్రవేశం చేసారు. 1953లో వచ్చిన ఈ సినిమాకు కథ రాసుకున్నది కూడా గురుదత్తే. సినిమాకు దర్శకత్వం వహించి, సినిమాలో నటించి ఒక సంపూర్ణ ఫిలిం మేకర్‌గా ఆయన తన సినీ యాత్రను ఈ సినిమానుంచే మొదలు పెట్టారని చెప్పవచ్చు.

వసంత్ గురుదత్త పదుకోణేగా మాంగలూర్‌లో జన్మించిన గురుదత్కి గోవా సాంప్రదాయలు, అక్కడి సంస్కృతితో మంచి అనుబంధం ఉంది. ‘జాల్’ సినిమాలో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు కూడా. ‘బాజ్’ సినిమా కథను పదహారవ శతాబ్దపు వాతావరణంలో నిర్మించుకున్నారు. మలబార్ ప్రాంతాల్లో వ్యాపారం కోసం వచ్చిన పోర్చుగీసు నావికులు ఇక్కడి రాజరికపు రాజతంత్రులలో పాలు పంచుకోవడం ఈ సినిమా కథా వస్తువు. రాజకుటుంబీకులలో కొందరు తమ స్వార్థం కోసం ఈ పోర్చుగీసు వ్యాపారస్థుల కుట్రలలో భాగం అయి సింహాసనం కోసం ప్రయత్నిస్తుంటే, పేద గ్రామాలలో ప్రజలు వీరికి విరుద్ధంగా తమ గొంతు వినిపిస్తున్న సమయం అది. జనరల్ బర్బోసా ఒక చిన్న రాజ్యపు మహారాణితో వ్యాపార నిమిత్తంగా ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. అలా తమ మిలటరీ రక్షణ ఆ రాజ్యానికి ఇస్తూ అక్కడ వ్యాపారం చేసుకునే వెసలుబాటును అతను కల్పించుకుంటాడు. రాణికి మేనల్లుడయిన జస్వంత్ ఆ రాజ్యానికి రాజు కావాలని కాచుకుని ఉంటాడు. దానికి బర్బోసాని సహాయం అర్థిస్తాడు ఇతను.

రాజ సైనికులు ఊరిలో రైతులతో క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ఊరి ఆడపడుచైన నిషా వారిని ఎదిరిస్తుంది. ఆమెను వెంటపడి తరుముతున్న సైనికుల నుండి మారువేషంలో ఉన్న ఆ ప్రాంతపు రాజకుమారుడు రవి రక్షిస్తాడు. ఆ ఊరిలో మరో వ్యాపారస్థుడు రంజాన్ అలీకి నిషా తండ్రి నారాయణ్ దాస్ తమ ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. తాము తప్ప మరెవ్వరూ వ్యాపార నిమిత్తం ఆ ఊరిలో సంచరించరాదన్న నియమం విధించిన బర్బోసా సైన్యం, రంజాన్ అలీకి ఆశ్రయం ఇచ్చినందుకు నారాయణ్ దాస్, రంజాన్ అలీలను బంధిస్తారు.

తండ్రిని కాపాడుకోవాలని నిషా తన స్నేహితురాలు టిల్లి తో రాజమాతను కలవడానికి నగరానికి వస్తుంది. కాని ఒప్పందాన్ని అనుసరించి ఈ విషయంలో తానేం చేయలేనంటుంది రాజమాత. నిషా తప్పని పరిస్థితులలో బర్బోసా గృహంలో ప్రవేశించి అతన్ని బంధించాలనుకుంటుంది. కాని సైనికులు ఆమెను, స్నేహితురాలు టిల్లిని బంధిస్తారు. పోర్చుగీసు నావ ఒకటి తిరుగు ప్రయాణానికి సిద్దంగా ఉంటుంది. తమకు నావలో పని చేసే వారు తక్కువగా ఉన్నారని అందువలన ఖైదీలను తమకు అప్పగించమని బర్బోసాని అడుగుతాడు నావ యజమాని. వ్యాపార నిమిత్తం వచ్చిన అతని వద్ద సరుకు తీసుకుని అతన్ని కూడా మోసం చేస్తూ ఖైదులో ఉన్న స్త్రీలను ముసలివారిని అతనికి అప్పగిస్తాడు బర్బోసా. నావలోకి వచ్చిన వారిని చూసిన తరువాత గాని ఆ వ్యాపారి  జరిగిన మోసాన్ని గ్రహించలేడు. వృద్ధులు, స్త్రీలు తనకు పని రారు. కాని నిష అందాన్ని చూసి అతను సరిపుచ్చుకుంటాడు. ఆమె ముందే అందరితో పాటు ఆమె తండ్రినీ సముద్రంలో పారవేస్తాడు. తనకు లొంగదని తెలిసి ఆమెను నావ క్రింది భాగాన స్తంభానికి కట్టిపడేస్తాడు. అక్కడ పని చేస్తున్న ఖైదీలందరిలో తిరుగుబాటు ధోరణి ప్రవేశపెడుతుంది నిష. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో పనివారంతా ఒక్కటై, వ్యూహం పన్ని వ్యాపారస్థుడ్ని హతమారుస్తారు. పోర్చుగీసు వారిని సముద్రంలో పారవేసి ఆ నావపై ఆధిపత్యం సాధిస్తారు. వారందరికీ నాయకురాలవుతుంది నిష. ‘బాజ్’ పేరుతో సముద్రపు రాణిగా తన పోరాటం మొదలెడుతుంది. పోర్చుగీసు నావలను ఆక్రమించుకోవడం వారి లక్ష్యం.

రాజకుమారుడు రవిని దేశం నుండి పంపించాలన్న ఎత్తుగడతో అతన్ని ప్రోర్చుగీసు దేశానికి వ్యాపార మెళుకువల కోసం అక్కడి రాజపరివారపు అనుమతి పొందడానికి పంపిస్తాడు బర్బోసా. ఆ నౌకని ముట్టడిస్తుంది నిష సైన్యం. రవి, ఆతని మిత్రుడు, నావలో ఉన్న రాజ నర్తకిలను చెరపడుతుంది. రవి తన ప్రాణాలు ఒకప్పుడు రక్షించాడన్న కారణంగా అతన్ని చంపించకుండా ఆ నావలో పనికి పెట్టుకుంటుంది. రవి నిషల మధ్య ప్రేమ మొదలవుతుంది. తాను రాజకుమారుడ్ని అన్న విషయాన్ని దాచిపెడతాడు రవి. చివరికి బర్బోసాను వీరంతా కలిసి హతమార్చడం, రాజ్యం నుండి పోర్చుగీసువారిని పారద్రోలడం, రవి రాజవ్వడం, నిషా రవిలు ఒకటవ్వడం సినిమా కథ.

గురుదత్ తీసిన సినిమాలో ఇది ఒక్కటే యాక్షన్ సినిమా. అప్పటి సినీ కథల మధ్య వినూత్నంగా సినిమా కథ చాలా భాగం సముద్రంలో ఒక నావ మీద చిత్రించారు గురుదత్. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సీన్లతో పాటు కత్తి యుద్దాలు కనిపిస్తాయి. నిషా పాత్రకు గీతా బాలి పూర్తి న్యాయం చేసారన్నది నిజం. ఈ సినిమాకు సంగీతం కూర్చినది ఓ. పి. నయ్యర్. అద్భుతమైన బాణీలిచ్చారాయన. గీతా దత్ గొంతు ఈ సినిమా పాటలలో తేనెలూరుతుంది. ఇన్ని విషయాల మధ్య కూడా అప్పటి ప్రేక్షకులకు పెద్దగా దగ్గర కాలేకపోయింది ఈ సినిమా. దాని వలనే కొన్ని చక్కని పాటలు పూర్తిగా జనం మధ్యకు రాకుండా ఉండిపోయారు. సంగీతాన్ని అభిమానిస్తూ, పాటలను ఆస్వాదించేవారు ఈ సినిమాలోని ప్రతి పాటతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా గీత దత్ పాడిన “తారె చాందిని అఫ్సానే” లో గీతా దత్ గొంతు విని తీరాలి. ఆమెకు గాత్రం పై ఉన్న కంట్రోల్ మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. గీతా దత్ పాటల్లో కూడా అరుదుగా వినిపించే ఈ గీతం ఆమె పాడిన పాటల్లో మరుగున పడిపోయిన ఒక ఆణిముత్యం. ఓ.పి. నయ్యర్ గీతా దత్ గొంతునే ఆ రోజులలో ఎందుకు ఎంచుకునేవారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహారణ చాలు. సినిమా హిట్ ఫెయిల్ కారణాలతో కొన్ని పాటలు అధ్బుతంగా ఉన్నా కూడా జనాన్ని చేరవు. కాని గీతా దత్ అభిమానులు మర్చిపోకూడని గీతం ఇది.

అలాగే గురుదత్ ప్రత్యేక పాటల చిత్రీకరణ ఈ సినిమాలో కూడ గమనించవచ్చు. చాలా సార్లు సినిమాలో డైలాగులకు కొనసాగింపుగా ఈ పాటలు ఉంటాయి. సైనికులను తప్పించుకుని ఒక చెట్టుపై కూర్చుని ఉన్న రవి, నిషను సైనికుల నుండి రక్షించాక, కనీసం నాకు కృతజ్ఞతలు అన్నా చెప్పవా అని అడిగినప్పుడు ఆమె జవాబు పాట రూపంలో “జరా సామనే ఆ, జరా ఆంఖ్ మిలా తెరా షుక్రియా కర్ దూ అదా” అనే పాటగా వస్తుంది. అలాగే నావలో ఖైదీలను తిరుగుబాటు కోసం ప్రేరేపించే గీతం “ఐ వతన్ కే నౌజవాన్” విషాదం ఉత్తేజం, స్పూర్తి లాంటి భావాలన్నీ కలిపి వినిపించే పాట. “హర్ జబాన్ రుకీ రుకీ హర్ నజర్ ఝుకీ ఝుకీ క్యా యహీ హై జిందగీ” అంటూ విషాదాన్ని పలికిస్తూనే “ఐ వతన్ కే నౌజవాన్ జాగ్ ఔర్ జగాకే చల్” అంటూ విషాదం నుండి ఉత్తేజం వైపుకు గీతా దత్ గొంతు ప్రయాణిస్తుంది. అద్భుతమైన కంపోజిషన్ ఇది. ఒకే పల్లవిలో ఇన్ని ఎమోషన్స్ ఒకే గాయని ఒకే సారి ఎమోట్ చేస్తూ పాట పాడడం గీతా దత్ టాలెంట్‌కి నిదర్శనం. ఓ.పి. నయ్యర్ చేసిన చక్కని కంపోజిషన్లలో ఒకటి ఇది. “ఐ దిల్ ఐ దీవానే ఆగ్ లగా లి” పాటలో అద్భుతమైన గానంతో పాటు ఆ విషాదానికి తగ్గట్టూగా ఉన్న ఫోటోగ్రఫీని గమనించవచ్చు. పాటలో గురుదత్ మార్కు చీకటి వెలుగుల సయ్యాట గొప్పగా ఉంటుంది. గీతా బాలి మానసిక స్థితి వివరించడానికి ఒక సాలె గూటి వెనుక నుండి ఆమెపై తీసిన ఒక షాట్ ఉంటుంది. గురుదత్ ఇటువంటి సింబాలిజమ్స్‌ని ఎన్నో సార్లు తన పాటలలో ప్రయోగిస్తూ ప్రేక్షకులను పాత్రల మనసుల వద్దకు తీసుకువెళతారు. ఇది వారు ఎక్కువగా హిందీ సినీ గీతాలలో చేసిన ప్రయోగం.

గురుదత్ పాటల చిత్రీకరణలో గమనిస్తే ఆర్టిస్టుల కాళ్లతో కూడా సంభాషణలు జరపగలరు. హీరోయిన్లను మొదటిసారి పరిచయం చేసున్న సందర్భంలో, హీరోయిన్ నటించే సీన్లలో వారి కాలి అడుగులతో మూడ్‌ని క్రియేట్ చేయడం ఎవరూ చేయగా మనం చూడం. గురుదత్ నటుల ముఖాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో కొన్ని సీన్ల కోసం వారి పాదలను క్లోజ్ అప్ షాట్లలలో అంతే అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ‘ఆర్ పార్’లో “బాబూజి ధీరే చల్నా” అనే పాటలో షకీలా పాదాల సవ్వడితో స్క్రీన్‌పై మొదటి పరిచయం అవుతుంది. నర్తిస్తున్న పాదాలతోనే ఆ పాత్ర పరిచయం జరుగుతుంది. ‘ప్యాసా’లో అ పాదాలు చెప్పే కథలెన్నో. ‘సాహిబ్ బీవీ ఔర్ గులాం’లో మీనాకుమారి పాదాలతోనే ఇంట్రడ్యూస్ అవుతుంది. భూత్‌నాద్ పాత్రలో గురుదత్ పరిచయం అతని మేజోళ్లతో జరుగుతుంది. ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’లో భార్యగా చోటీ బహూ, నాట్యగత్తెగా మిన్నూ ముంతాజ్ మధ్య ఉన్న వ్యత్యాసం వారి పాదాల కదలికలతో చూపిస్తాడు గురుదత్. ఈ సినిమాలో కూడా “ఐ దిల్ ఐ దీవానే” పాటలో గీతా బాలి నడక ఆమె కాళ్ల కదలికలతో ఆమెలోని విషాదాన్ని వివరిస్తారు గురుదత్. ఈ సినిమాలో క్లోజ్ అప్ షాట్ల కోసం వీకే మూర్తి ఇచ్చిన లైటింగ్ చాలా గొప్పగా ఉంటుంది.

వీకే మూర్తి ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా పని చేసారు. 1964లో గురుదత్ మరణ వార్త విన్న వెంటనే వీ. కే మూర్తి ‘నా కళ, నా ప్రయోగాలు మరణించాయి’ అని అనుకున్నారట. నస్రీన్ మున్నీ కబీర్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం చెబుతూ, అది నా స్వార్థమే కావచ్చు కాని గురు మరణ వార్త విన్న వెంటనే మిత్రుడు వెళ్ళిపోయాడు అనుకోవలసిన సందర్భంలో అనుకోకుండా ‘నా కళ నా ప్రయోగాలు ముగిసాయి’ అన్న మాటే నా నోటి వెంట వచ్చింది అని ఆయన చెమర్చిన కళ్ళతో చెప్పారు. ఒక కళాకారుడిలోని టాలెంట్‌ను గుర్తించి, అతిని వద్ద అతి ఎక్కువ రిజల్ట్‌ను రాబట్టుకునే ఆ ప్రక్రియ గురుదత్‌కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. అందుకే ఆయన మరణం తరువాత ఆయనతో పని చేసిన టీం ఎన్ని సంవత్సరాలు గొప్పగా పని చేసినా గురుదత్ సినిమాలతోనే వారు ఇప్పటికీ ఐడెంటీఫై అవుతున్నారంటే వీ.కే. మూర్తి అలా ఎందుకు అనుకున్నారో అర్థం అవుతుంది.

గురుదత్ సినిమాలలో మరో గమనించవలసిన విషయం వారి ముఖ్య పాత్రల పక్కన ఉండే పాత్రలు నాయికా నాయకుల మనసులోని భావాలను పాటల రూపంలో ప్రదర్శిస్తారు. ‘ఆర్ పార్’ సినిమాలో ఇళ్ళు కట్టే కార్మికుల నోట నాయికా నాయికల మొదటి పరిచయంతో ఉద్బవించిన ప్రేమ గురించి వివరణ ఉంటుంది. అదే “కభీ ఆర్ కభీ పార్” పాట. అలాగే ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ లో గురుదత్ మనసులోని విషాదాన్ని రోడ్డు పై ఖవ్వాలీ పాడేవారు వినిపిస్తారు. అదే “మేరి దునియా లుట్ రహీ థీ” అనే పాట. ‘కాగజ్ కే ఫూల్’లో సురేష్, శాంతి మనసులోని స్నేహాన్ని “సున్ సున్ సున్ వొ చలీ హవా”లో వినిపిస్తారు దారి పక్కన ప్రయాణిస్తున్నవారు. ప్యాసాలో “ఆజ్ సజన్ మోహే అంగ్ లగాలో” అంటూ గులాబో ప్రేమను స్పష్టపరుస్తారు రోడ్డు పై పాడేవారు. ఇదే టెక్నిక్‌ను అనుకోకుండా గురుదత్ దగ్గర అసిస్టేంట్లుగా పని చేసిన వారందరూ తమ దర్శకత్వంలో చూపించారు. ‘సిఐడి’లో రాజ్ ఖోస్లా “భూజ్ మెరా క్యా నామ్ రే”, “లెకే పెహలా పెహలా ప్యార్” అంటూ అదే స్టైల్‌లో పాటను చిత్రించడం చూస్తాం. ‘జాల్’ లో పడవ నడిపేవారు “జోర్ లగాకే” అన్న పాట పాడడం చూస్తాం. ‘బాజ్’లో అలాగే ప్రేమలో పడ్డారు నాయికా నాయికలు అంటూ వారి మనస్థితిని వివరించే పాట “మాజి అలబేలా” అంటూ నిషా స్నేహితురాలు నోట వినిపిస్తారు గురుదత్. “జో దిల్ కీ బాత్ హోతీ హై” అనే రఫీ పాటతో పాటూ గురుదత్ కోసం తలత్ మెహమూద్ పాడిన ఒకే ఒక పాట ‘బాజ్’ సినిమాలో వస్తుంది. “ముఝె దెఖో హస్రత్ కి తస్వీర్ హూ మై” అనే ఈ పాటలో తలత్ గొంతు విషాదాన్ని పలికించిన తీరు మర్చిపోలేం. గురుదత్ కోసం తలత్ మెహమూద్ పాడిన ఏకైక పాట ఇది. ఈ పాటలన్నీ మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసారు.

‘బాజ్’ సినిమా ప్రొడ్యూసర్లకి నష్టాన్నే తీసుకువచ్చింది. ఓ.పి.నయ్యర్‌కు సంగీత దర్శకత్వం వహించినందుకు డబ్బులు ఇవ్వలేకపోయారు గురుదత్. నయ్యర్ కూడా ఇక బొంబాయిలో ఉండలేను అనుకునే స్థితిలో అటో ఇటూ అంటూ మళ్ళీ ఇద్దరు కలిసి ‘ఆర్ పార్’ సినిమాకు పని చేసి సినీ చరిత్రలో తమ స్థానన్ని సుస్థిరం చేసుకున్నారన్నది తరువాత జరిగిన సంగతి. కాని గురుదత్ సినిమాలన్నీ వరుసగా చూస్తున్నప్పుడు అతను చేసిన ప్రయోగాలు మనలను విస్మయపరుస్తాయి. తీసిన సినిమాలు అతి తక్కువ అయినా, సినీ చరిత్రలో గొప్ప ప్రయోగాలు చేసిన దర్శకులు గురుదత్.

‘బాజ్’ సినిమాలో కనిపించే జాని వాకర్ భాష మాత్రం పదహారవ శతాబ్ధపు భాషతో పోలి ఉండదు. పందొమ్మిదవ శతాబ్దపు బొంబయి భాష మాట్లాడుతాడు అతను. ఇటువంటి భాషాపరమైన లోపాలు ‘ఆర్ పార్’ సినిమాలో రచయితగా అబ్రర్ అల్వీని చేర్చుకుని, అతని సహాయంతో తన సినిమాలలో మళ్ళీ ఉండకుండా గురుదత్ చూసుకున్నారు. ‘కైకు’ లాంటి దక్కనీ పదాలు, బొంబయి భాషతో కథా వాతావారణానికి సరిపోని భాష ఈ సినిమాలో జానీ వాకర్ ప్రయోగించడం నిశితంగా గమనిస్తే సినిమాలో జరిగిన పెద్ద తప్పిదం. తరువాత సినిమాలలో భాష, యాసల పై చాలా పట్టు సంపాదించారు గురుదత్. అబ్రర్ అల్వి ‘బాజ్’ సినిమా తరువాతే ఆయన టీంలో సినీ రచయితగా చేరారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు డబ్బు కోసం గీతా బాలి వద్ద డ్రైవరుగా కొన్నాళ్ళు పని చేయవలసి వచ్చినప్పుడే గురుదత్‌తో జరిగిన పరిచయం, తరువాత వారి ఆంతరంగ మిత్రుడినా గురుదత్ టీంలో సభ్యుడిగా అబ్రర్ చేరడానికి దోహదం చేసింది.

ఇప్పుడూ చూస్తే ‘బాజ్’ సినిమా ఈ లోపాలన్నిటితో కూడా సంగీత పరంగా టెక్నికల్‌గా, అప్పటి సినిమాలతో పోలిస్తే మంచి ప్రయోగంగా అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here