మధురమైన బాధ – గురుదత్ సినిమా 15 – అసిస్టెంట్‍గా గురుదత్

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రభాత్ ఫిలిం కంపెనీలో అసిస్టెంట్‍గా గురుదత్ ప్రయాణం గురించి సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]చి[/dropcap]న్నప్పటి నుండి కళలపై ఆసక్తి ఉన్న గురుదత్ నాట్యం పట్ల ఆకర్షితులయ్యారు. అల్మోరాలో 1938లో ఉదయ్ శంకర్ ఒక నాట్యకళాశాల స్థాపించారు. భారతీయ నాట్యరీతుల్లో ఎటువంటి ప్రత్యేక శిక్షణ తీసుకోని ఉదయ్ శంకర్, చిన్నతనం నుండి భారతీయ నృత్యాలను, జానపద నృత్యరీతులను, విదేశాలలో బాలెట్ నృత్యాలను చూసి తనదైన ఒక శైలిని నిర్మించుకున్నారు. ఈ విభిన్నమైన నాట్యశైలితో రష్యన్ బాలరీనా ఆనా పావ్లోవాతో కలిసి భారతీయ కథలను ఇతివృత్తంగా తీసుకుని నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అలా విదేశాలలో ఎంతో పేరు తెచ్చుకున్నాక భారతదేశంలో ఒక నృత్యకళాశాలను స్థాపించాలనే ఉద్దేశంతో “ఉదయ్ శంకర్ ఇండియా కల్చరర్ సెంటర్” పేరుతో ఉత్తరాఖండ్ లోని అల్మోరా నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిమ్తోలా అనే ప్రాంతంలో ఈ కళాశాలను స్థాపించారు. ఈ నాట్యకళాశాలలో నృత్యం అభ్యసించాలని 1942లో గురుదత్ అల్మోరా చేరుకుని కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఆ సమయంలో వీరితో పాటు ప్రముఖ నృత్య కళాకారిణి జొహ్రా సెహగెల్ కూడా ఆ కళాశాలలో ఉన్నారు. వీరికి గురుదత్ తన సొంత సినిమాలలో నృత్య దర్శకురాలిగా తరువాత అవకాశం ఇచ్చారు.

అల్మోరాలోని ఈ కళాశాల నుంచి గురుదత్ సస్పెండ్ అయ్యారని అంటారు. వీరి తమ్ముడు దేవీదత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ పరంగా కూడా అక్కడ ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కారణంగా గురుదత్ ఆ కళాశాల నుండి పంపివేయ బడ్డారు అని తెలుస్తుంది. అక్కడ నుండి వచ్చాక కొన్ని రోజులు టెలిపోన్ ఆపరేటర్‌గా కలకత్తా లోని లీవర్ బ్రదర్స్ అనే ఫాక్టరీలో పని చేసారు. కాని ఆయన ఇలాంటి ఆఫీసు పనుల చేసే ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు. అందుకే ఆయన బంధువు సహాయంతో పూణే లోని ప్రభాత్ ఫిలిం కంపెనీలో మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ మీద పనికి ఒప్పుకున్నారు. 1929 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి వీ. శాంతారాం గారు ఈ ప్రభాత్ ఫిలిం కంపెనీని స్థాపించారు. ముందు కోల్హాపూర్‌లో నిర్మించబడిన ఈ సంస్థ 1933లో పూణేకి మారింది. ఈ స్టూడియోలో సుమారు 47 సినిమాలు మరాఠీ, హిందీ భాషలలో నిర్మించారట. ప్రస్తుతం పూణేలో ఉన్న ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా, ఈ స్టూడియో పరిసరాలలోనే నడుస్తుంది. ఆ ప్రభాత్ స్టూడియోస్‌తో సంబంధం ఉన్న బాబూరావ్ పాయ్ అనే వ్యక్తితో గురుదత్ కుటుంబానికి ఉన్న చిరు పరిచయం కారణంగా అక్కడ పని చేయడానికి గురుదత్‌కి అవకాశం దొరికింది.

ప్రభాత్‌లో పని చేస్తున్నప్పుడు గురుదత్ మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‍గా పని చేసారని తెలుస్తుంది. 1944లో “చాంద్” అనే సినిమాకు, 1945లో “లాఖారాణీ” అనే సినిమాకు, 1946 లో “హమ్ ఏక్ హై” అనే మరో సినిమాకు వీరు పని చేసారు. అయితే ఈ సినిమా క్రెడిట్స్‌లో గురుదత్ పేరు కనిపించదు. “చాంద్” సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‍గా పని చేశారని, కృష్ణుని పాత్రలో ఒక నిముషం కనిపిస్తారని కొన్ని ఆర్టికల్స్‌లో‌ సమాచారం ఉంది. ఇప్పుడు లబించే “చాంద్” సినిమా ప్రింట్‌లో మాత్రం ఆ కృష్ణుని పాత్ర కనిపించదు. కాని కొందరు అసిస్టెంట్ డైరెక్టర్ల మధ్య వీరు ఒక అసిస్టెంట్‌గా పని చేసారనే సమాచారం మాత్రం నెట్లో ఉంది. BOLLYWOOD MuVyz అనే సైట్ లో, మరో కొన్ని సైట్లలో కూడా గురుదత్ ఈ సినిమాకు పని చేశారనే సమాచారం చూడవచ్చు.

చాంద్ (1944)

ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డి.డి. కశ్యప్. సంగీతానిచ్చింది  హుస్న్  లాల్ భగత్‌రామ్. ప్రేమ్ అదీబ్, బేగం పారా, సితారా దేవి, శశికళ, డి.కే సప్రు ఈ సినిమాకి ప్రధాన తారాగణం. మేనకా అనే నృత్య కళాకారిణి ట్రూప్‍లో మురారి అనే గాయకుడు పని చేస్తూ ఉంటాడు. మేనకా మురారిని ఇష్టపడుతుంది. కాని మురారి మేనకను ప్రేమించడు. జీవితం పట్ల ఉత్సాహం, ఎప్పుడూ ఆనందంతో ఉండే మురారి కలల ప్రపంచం వేరే. బాంబేలో సంగీత దర్శకుల వద్ద పని దొరుకుతుంది మురారికి. ఘుంగ్రూ అనే మరో అనాథతో పాటు మేనక వద్ద పని వదిలేసి బొంబాయి వస్తాడు మురారి. అయితే బొంబాయికి మురారి రావడం ఆలస్యం అవుతుంది. అతనికి రావలసిన ఉద్యోగం మరొకరి వశం అవుతుంది. ఉండడానికి చోటు లేక, ఉద్యోగం లేక, మురారీ, ఘుంగ్రూలిద్దరు కూడా ఒక పబ్లిక్ పార్క్ లోని బెంచి మీద కాలం గడుపుతుంటారు. అతి కష్టం మీద ఒక ఇల్లు చూసుకుని అక్కడ సంగీత పాఠశాల మొదలెట్టాలనుకుంటారు వీరిద్దరు. కాని ఆ యింటి యజమాని కూతురు దీనికి అనుమతించదు. ఆ ఇంటి యజమాని జ్వాలా ప్రసాద్ అప్పుడు పక్క ఊరికి వెళ్ళి ఉంటాడు. అతని కూతురు రాజ్ వీరిద్దరికీ సమస్య అయిపోతుంది. ఆ సమయంలో జపాన్ యుద్ధ విమానాలు నగరంలో బాంబులు వేస్తాయనే కలకలం రేగుతుంది. ఇదే అదను అనుకుని రాజ్‍ని జీతం పెంచమంటారు నౌకర్లు. ఆమె నిరాకరిస్తే వారామెను ఒంటరిగా ఆ ఇంట ఉంచి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మురారి, ఘుంగ్రూ రాజ్ కు దగ్గర అవుతారు.

వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తున్న సమయంలో మురారిని వెతుక్కుంటూ మేనక అక్కడకు వస్తుంది. అపోహల కారణంగా మురారి ఆ ఇల్లుని రాజ్‌ని వదిలి మళ్ళీ పార్కులో బెంచీ పైకి చేరతాడు. ఇక్కడ అనుకోకుండా ఒక ఆఫీసులో క్లర్కు ఉద్యోగం ఖాళీగా ఉంది అని తెలిసి ఆ ఉద్యోగానికి అప్లై చేస్తాడు మురారి. అది జ్వాలా ప్రసాద్ గారి ఆఫీసు. అందులో మురారికి ఉద్యోగం దొరుకుతుంది. ఘుంగ్రూకి కూడా అ అఫీసులో చిన్న ఉద్యోగం వస్తుంది. సేఠ్‌కి దగ్గరయి మెల్లిగా రాజ్‌ని కలుసుకుని ఆమె మనసులోని అపోహలను దూరం చేసి ఆమెకు చేరువవుతాడు మురారి. కాని ఈ లోపల సేఠ్‌కు తన కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి మురారిని ఘుంగ్రూని ఉద్యోగం నుండి తీసేస్తాడు. కూతురు ఒక ధనవంతున్ని వివాహం చేసుకోవాలని అతని కోరిక. చివరకు మేనక మురారి ప్రేమను అర్థం చేసుకుని ఈ ప్రేమికులను కలపడంతో కథ ముగుస్తుంది.

జీ.ఎమ్. దుర్రాని జీనత్ బేగం, సితారా దేవిలు కలిసి ఈ సినిమాకి పాటలు పాడారు. మొత్తం పది పాటలు ఇందులో ఉన్నాయి. అప్పట్లో జీ.ఎమ్. దుర్రాని ప్రఖ్యాత గాయకుడు. మహమ్మద్ రఫీ ఇష్టపడిన గాయకుడు కూడా. సితారా దేవి ప్రముఖ నృత్య కళాకారిణి. వీరు కూడా తనపై చిత్రించిన పాటలను తానే ఈ సినిమా కోసం పాడుకోవడం విశేషం. ఈ పాటలన్నిటినీ ఖమర్ జలాలాబాది రాసారు. ఈ సినిమా ఇప్పుడు కూడా యూ ట్యూబ్ లో ఉంది. ప్రింట్ అంత బాగా లేకపోయినా అలనాటి పాత సినిమాలను చూడాలనే ఉత్సాహం ఉన్నవారికి అందుబాటులో ఉంది. గురుదత్ అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేసిన మొదటి సినిమాగా అతని అభిమానులు ఈ సినిమాను గుర్తుంచుకుంటారు.

లాఖారాణి (1945)

ఈ సినిమాలో లచ్మన్ అనే ఒక చిన్న పాత్రలో గురుదత్ కనిపిస్తారు. దుర్గా ఖోటో, సప్రు, గణపత్ రావు ఈ సినిమాలో ప్రధాన తారాగణం. విశ్రాం బెడేకర్ సినిమా దర్శకులు. ఈ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా గురుదత్ పని చేసారంటారు.

కొంత మంది అస్పృశ్యుల కలిసి ‘బిచ్వా రాణీ కీ బస్తీ’ అనే పేరుతో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరికి రాణీ బిచ్వా నాయకురాలు. వీరంతా గాయకులు, నాట్య కళాకారులు. ప్రతి రోజు ఆ ఊరి గుడి ప్రధాన భాగంలో నృత్యం చేసి అక్కడి ప్రజలు ఇచ్చిన డబ్బుని మళ్ళీ గుడికి ఇస్తూ తమ భక్తి చాటుకునే అమాయక జనం వీరు. అందరికీ పంచిన తరువాత మిగిలిన ఆహార పదార్థాలు మాత్రమే విరికి దొరుకుతాయి. ఎప్పుడన్నా ఆలస్యంగా గుడికి వచ్చినా, గుడి తలుపులు మూసి ఉన్నా వీరికి ఆహరం దొరకదు. ఆకలితో అలా ఉండవలసిందే. లాఖా అనే యువతి రాణి గారి కుమార్తె. వీరికి కాబోయే రాణీ కూడా. ఈమె గొప్ప నాట్యగత్తె. వీరి తెగవారికి ప్రధాన నాట్య కళాకారిణీ ఈమె. రాణీ భిచ్వా కి లాఖాతో పాటు లచ్మన్ అనే ఇంకో కొడుకు కూడా ఉంటాడు. లచ్మన్ రాణి గారికి నమ్మిన బంటులా సేవ చేస్తూ ఉంటాడు. దేవునిపై నమ్మకం లేని మరో తెగ యువకుడిని లాఖా ప్రేమిస్తుంది. లాఖాను తన రాజ్యానికి తీసుకెళ్ళి తన తండ్రికి పరిచయం చేస్తాడు ఆ యువకుడు. ఈ రాజకుమారుని రాజ్యంలో అందరూ నాస్తికులు. వారు లాఖాను ఒక వింత పశువుగా చూస్తారు. ఆమె తిరిగి మందిరంలో నృత్యం చేయడాని తన వారి వద్దకు వస్తుంది.

లాఖానే వివాహం చేసుకోవాలని రాజకుమారుడు నిశ్చయించుకుంటాడు. మళ్ళీ ఒక మత్స్యకారుని వేషంలో వచ్చి లాఖాతో పరిచయం పెంచుకుంటాడు. లాఖా అతన్ని ప్రేమిస్తుంది. తన ప్రజల పట్ల తన బాధ్యతను మర్చిపోతుంది. ఈ ప్రేమ కథ తెలిసి రాణీ కూతురిని తమ ఊరి నుండి బహిష్కరిస్తుంది. ఆమె గుడికి వెళ్ళి దేవున్ని ప్రార్థిస్తుంది. దేవుడనే వాడు లేడని ఆమె వెంట వెళ్ళిన రాజకుమారుడు ఆమె భక్తిని గేలి చేస్తాడు. లాఖా మనసు విరిగిపోతుంది. రాజకుమారునితో అతని దేశానికి వెళుతుంది. తాను కూడా అప్పటి నుండి నాస్తికురాలిగా జీవిస్తానని ప్రమాణం చేస్తుంది. ఆమెకు అత్తగారిల్లు, భర్త ప్రేమ లభిస్తుంది కాని తల్లిని, తనవారిని కోల్పోతుంది. తల్లికి వారి తెగవారికి తిండిని కానుకలను పంపించే ప్రయత్నం చేస్తుంది లాఖా. కాని ఆమె తల్లి వాటిని తిరస్కరిస్తుంది.

ప్రధాన నర్తకిగా లాఖా లేకపోవడంతో గుడిలో వచ్చే డబ్బులు తగ్గుతాయి. ఆమె తెగవారు తిండికి అల్లాడుతూ ఉంటారు. ఇక తప్పక రాణి తానే నాట్యం చేస్తానని ముందుకు వస్తుంది. కాని ఆమె వయసు సహకరించదు. నృత్యంలో విలు విద్య ప్రదర్శన ఒక భాగం. రాణి బాణం సంధించలేకపోతుంది. జనం గేలి చేస్తారు. వీరికి డబ్బులు రావు. తెగలోని వారు ఆకలికి అల్లాడుతూ ఉంటారు.

ఈ సంఘటనను తమ రాజమందిరంలో నాట్య కళాకారులు హాస్యం మేళవించి అవమానకరంగా మాట్లాడుకోవడం లాఖా వింటుంది. ఆ నాట్యగత్తెను కొరడా దెబ్బలతో శిక్షిస్తుంది. అప్పుడే లచ్మన్ ఆమె వద్దకు వస్తాడు. తన తెగవారిని అన్యాయంగా ఆకలికి వదిలి తన స్వార్థం చూసుకున్న లాఖాకి ఆమె చేసిన తప్పు ఎత్తి చూపుతాడు లచ్మన్. లాఖా తన రాజమందిరాన్ని వదిలి లచ్మన్‌తో తన వారి వద్దకు వస్తుంది. మహారాణి ఆమెను దూషించినా ఆమె లెక్కచేయదు. తనవారిని ఇక వదిలి వెళ్ళనని వారితోనే ఊంటానని చెబుతుంది. కాని ఆమె కోసం రాజకుమారుడు మళ్ళీ గుడికి వస్తాడు. ఈ సారి అతన్నే హత్య చేస్తానని బెదిరిస్తుంది లాఖా. అక్కడ జరిగిన యుద్ధంలో ఆస్తికులు గెలిచి నాస్తికులు ఓడిపోతారు. గుడి తలుపులు పూర్తిగా తెరవబడతాయి. మనసు మార్చుకుని నాస్తికులు తమ వద్దకు ఎప్పుడన్నా రావచ్చనే ఆస్తికుల ప్రతిపాదనతో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాకు పాటలు రాసింది కమర్ జలాలాబాది. సంగీతం అందించింది మాస్టర్ కృష్ణా రావు. లచ్మన్ పాత్రలో గురుదత్ కనిపిస్తారు. ఆయన చేసిన మొదటి పాత్ర ఇది. దుర్గా ఖోటే రాణి మా గా నటిస్తే, మోనికా దేసాయి లాఖాగా నటించారు. రాజకుమారుడిగా సప్రు కనిపిస్తారు. విశ్రాం బేడేకర్ ఈ సినిమాకు కథ అందించి, స్క్రీన్ ప్లే చేస్తూ దర్శకత్వం వహించారు. పండిట్ సుదర్శన్ మాటలు రాసారు. సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయి. ఈ సినిమా ఇప్పుడు లభ్యం అవట్లేదు. సినిమా చూసి కాకుండా ఆర్చివ్స్‌లో కథను చదివి యథాతథంగా దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో నటించిన దుర్గా ఖోటే ఈ సినిమాకు పాటలు తానే పాడుకున్నారని అంటారు. పద్నాలుగు సినిమాలలో ఆమె ముప్పై అయిదు పాటలు పాడారని చెబుతారు. కాని ఈ సినిమా పాటల రికార్డులపై గాయకుల పేర్లు లేవు. అప్పట్లో రికార్డులపై గాయకుల పేర్లు ఉండేవి కావని అంటారు. సినిమా కూడా ఇప్పుడు దొరకని కారణంగా గాయకుల పేర్లు స్పష్టంగా ఉదహరించడం కుదరట్లేదు. అయితే ‘లాఖారాణీ’ సినిమాలో నటించేటప్పటికే దుర్గా ఖోటే అప్పట్లో ప్రఖ్యాత నటి. సప్రు కూడా రాజకుమారుని పాత్రలకు పెట్టింది పేరు. గురుదత్ నటుడిగా కనిపించిన మొదటి చిత్రంగా ఇది గురుదత్ అభిమానులకు గుర్తుండిపోతుంది.

హమ్ ఏక్ హై (1946)

ఈ సినిమాకు గురుదత్ అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేశారు. ఈ సినిమా క్రెడిట్స్‌లో గురుదత్ పేరు కనిపించకపోయినా వీరు ఈ సినిమాకు పని చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతారు. ఈ సినిమా దేవ్ ఆనంద్‌కు రెహ్మాన్‌లకు మొదటి సినిమా. ఈ సినిమాకి పని చేసే సమయంలో రెహ్మాన్, దేవ్ ఆనంద్, గురుదత్ మధ్య కుదిరిన స్నేహం తరువాత వీరు భవిష్యత్తులో కలిసి పని చేయడానికి దోహద పడింది. ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడే దేవ్ ఆనంద్ చాకలికి ఇచ్చిన షర్టు మారి అదే రోజు స్టూడియోలో గురుదత్ ఆ షర్టుతో కనిపించే సరికి దేవ్ ఆనంద్ వారితో మొదటి సారి మాట్లాడారట. అప్పుడు గురుదత్ తాను చాకలికి ఇచ్చిన షర్టు మారి ఆ స్థానంలో మరో షర్టు చాకలి తనకిచ్చి వెళ్ళాడని, తనవద్ద ఇక మరో జత లేనందు వలన అదే షర్టు వేసుకుని పనికి వచ్చానని బదులిచ్చారట. అలా జరిగిన వీరి పరిచయం స్నేహంగా మారి భవిష్యత్తులో గురుదత్‌కి దర్శకత్వం వహించే అవకాశం మొదట వస్తే దేవ్ ఆనంద్‌ను హీరోగా తీసుకోవాలని, దేవ్ ఆనంద్ నటుడిగా నిలదొక్కుకుంటే గురుదత్‌కు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మాట మీద ఉండి    చేతన్ ఆనంద్‍తో కలిసి నవకేతన్ ప్రొడక్షన్స్ స్థాపించినప్పుడు దేవ్ ఆనంద్ గురుదత్‌కు దర్శకుడిగా ‘బాజీ’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ఇక ఈ సినిమాతో పరిచయం అయిన రెహ్మాన్ గురుదత్ సినిమాలన్నిటిలో కారెక్టర్ యాక్టర్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చేసిన రెహానాకు కూడా యువనటిగా ఇది మొదటి సినిమా. అంతకు ముందు ఆమె కొన్ని సినిమాలలో బాల నటిగా చేసారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కమలా కొట్నిస్ తెలుగింటి ఆడబడుచు. కమాలా బాయిగా తెలుగు తల్లికి బ్రిటీష్ తండ్రికి జన్మించిన ఈమెను, పాండురంగ కొట్నిస్ అనే జమిందారు దత్తత తీసుకున్నారు. వీరు ప్రఖ్యాత సినిమాటోగ్రఫర్ డి. ఎస్. కొట్నిస్‌కు సోదరులు. వారి ప్రభావంతో సినిమాల వైపు ఆసక్తి చూపారు కమలా కొట్నిస్. కొన్ని తెలుగు సినిమాలలో నటించి పేరు సంపాదించుకున్న తరువాత ఆమె హిందీ సినిమాల వైపు మొగ్గు చూపారు. ‘సీతా రామ జననం’ అనే తెలుగు సినిమాలో కైకేయిగా ఆమె చేసిన పాత్రను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

‘హమ్ ఏక్ హై’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు దుర్గా ఖొటే. ఒక ఊరిలో జమిందారిణీ మా గా పేదల పాలిట పెన్నిదిగా జీవిస్తుంటుంది ఒక స్త్రీ. ఈమె భర్త మరణించాక తన కొడుకుని పెంచుకుంటూ పేదలకు సేవ చేస్తూ ఊరి బాగోగులు చూస్తూ ఉంటుంది. ఆ ఊరికి కరువు వచ్చి చాలా మంది చనిపోతారు. అనాథలయిన ఒక క్రిస్టియన్, ముస్లిం కుటుంబాలకు సంబంధించిన పిల్లలను ఈమె దత్తత తీసుకుంటుంది. అలాగే అస్పృశ్యుల కుటుంబంలో అందరూ మరణించాక ఆ ఇంట అనాథ అయిన మరో అమ్మాయికీ ఈమె తల్లి అవుతుంది. జాన్, యూసఫ్ లతో పాటు జమిందారిని కొడుకు శంకర్ కూడా కలిసి పెరుగుతాడు. వీరితో పాటు దళిత కుటుంబానికి చెందిన దుర్గ ఆ ఇంటనే పెరుగుతుంది. తామంతా ఒకే కుటుంబం అనే నేర్పిస్తుంది వారి తల్లి.

ఆ ఉర్లో మరో జమిందారు అధికారం చెలాయిస్తూ ఉంటాడు. అతని కొడుకు చోటే బాబు. చోటే బాబుతో కలిసి చదువుకుంటున్న విద్య ఆ ఊరికి వస్తుంది. ఆమె శంకర్‌ను ప్రేమిస్తుంది. కాని చోటే బాబు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. విద్య శంకర్ వివాహం చేసుకుంటారు. అందుకని ఆ కుటుంబంపై కోపం పెంచుకుంటాడు చోటే బాబు. జాన్ పెద్ద డాక్టర్ అవుతాడు. జాన్, యూసప్‌ల వివాహం కూడా వారు కోరుకున్న వారి మతానికి చెందిన స్త్రీలతోనే జరిపిస్తుంది జమిందారి మా. (ఇంకా మతాంతర వివాహాలు చర్చకు రాని రోజులవి). జాన్ ఊరిలో హాస్పిటల్ కట్టాలనుకుంటాడు. విద్య తండ్రి ఆరోగ్యం బాగోలేదని, శంకర్ దంపతులు అక్కడి వ్యవహరం చూడాలని విద్య తండ్రి ఉండే నగరానికి వెళతారు. ఊరిలో శంకర్ లేకుండా చూసి చోటే బాబు స్నేహితుడిలా నటిస్తూ జాన్ కట్టే హాస్పిటల్ ఖర్చులు పెంచుతూ ఉంటాడు. డబ్బంతా ఖర్చయిపోతుందని భయపడిన శంకర్ వద్దకు వచ్చి జాన్ చేసే అనవసర ఖర్చు అగాలంటే హాస్పిటల్ ఆపాలని చెబుతాడు చోటా బాబు. ఈ విషయంలో ముగ్గురి మధ్య విభేదాలు వచ్చి ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. చివరకు అందరూ తమ అపార్థాలు తొలగించుకుని చోటే బాబు ద్రోహాన్ని కనుక్కుని అతనికి బుద్ది చెప్పి ఒకటిగా కలిసిపోవడం కథ.

ఇందులో శంకర్‌గా దేవ్ ఆనంద్, యూసప్‌గా రెహ్మాన్, జమిందరిణీ మా గా దుర్గా ఖోటే విద్యగా కమలా కొట్నిస్ నటించారు. ఈ సినిమాలో గీతాలకు కొరియోగ్రాఫర్‌గా గురుదత్ పని చేసారు. 1977లో మన్మోహన్ దేశాయి తీసిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమాకు ఈ సినిమా మాతృక అని చెబుతారు. మూడు భిన్న మతాలకు చెందినవారు అన్నదమ్ములుగా కథ నిర్మించి తీసిన మొదటి భారతీయ సినిమా “హమ్ ఏక్ హై”.

పీ. ఎల్. సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొత్తం పది పాటలుంటాయి. హంసలాల్ భగత్‌రామ్ సంగీత దర్శకత్వం వహించారు. జొహ్రాబాయి అంబాలివాలి, అమీర్‌బాయి కర్ణాటకీ, మణీక్ వర్మ, ప్లే బాక్ అందించారు. ప్యారేలాల్ సంతోషి పాటలు రాసారు. దేవ్ ఆనంద్ మొదటి సినిమాగా ఇది హిందీ సినీ ప్రేక్షకులకు గుర్తు ఉండిపోతుంది.

ప్రభాత్ స్టూడియోస్‌లో ఉన్న సమయంలో గురుదత్ పని చేసిన మూడు చిత్రలను గమనిస్తే గురుదత్ సినిమా నిర్మాణంలో ఒకే రంగానికి పరిమితం అయి ఉండిపోకుండా సినిమా నిర్మాణాన్ని కూలంకుషంగా పరిశీలించడం కనిపిస్తుంది. ‘చాంద్’ సినిమాకు వారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే చేస్తే, ‘లాఖారాణీ’ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తూ ఒక పూర్తి నిడవి ఉన్న పాత్ర కూడా పోషించారు. ఇక తరువాత వచ్చిన ‘హమ్ ఏక్ హై’ కు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తూనే కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేసారు. సినిమాకు సంబంధించిన అన్ని డిపార్ట్‌మెంటులలో వీరు మొదటి నుంచే ఆసక్తి చూపించే వారన్నది గమనించవచ్చు. సినిమా పట్ల ఈ పూర్తి ఆసక్తే వారిని అంతటి ఉత్తమ దర్శకుడిగా మార్చగలిగింది.

అయితే వారి తమ్ముడు దేవీదత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాత్‌లో అప్పుడు పని చేస్తున్న అసిస్టెంట్ డాన్సర్ విద్యతో ప్రేమలో పడి ఆమెతో సహా పారిపోయి గురుదత్ ఇంటికి తిరిగి వచ్చారని తెలుస్తుంది. ఆ అమ్మాయికి అప్పటికే మరొకరితో పెళ్ళి నిశ్చయమయింది. అతను పోలీసు కేసు పెట్టడంతో కొంత గొడవ జరిగి చివరకు వీరు వీడిపోవలసి వచ్చింది. స్త్రీల విషయంలో గురుదత్ కొంత బలహీనంగానే ఉండేవారని అనిపిస్తుంది. అయితే సినీ రంగానికి చెందిన చాలా మంది జీవితాలలో ఇలాంటి కథలు మామూలే. కాని గురుదత్ తరువాతి జీవితంలో పడిన మానసిక వేదనకు, డిప్రెషన్‌కు, ఒంటరితనానికి, ఆత్మహత్యకు, కారణాలను విశ్లేషించుకోవడానికి నాందిగా ఈ సంఘటనలను ఇక్కడ చెప్పడం జరిగింది.

ప్రభాత్ కంపెని వదిలి వేసిన తరువాత పది నెలలు దాకా గురుదత్ మరే పని చేయకుండా ఉండిపోయారు. ఆ సమయంలోనే రచనలు చేయడం అలవాటు చేసుకున్నారు. వీరు ఇంగ్లీషులో రాసిన కథలు ఆ కాలంలోనే ఇలస్ట్రేటేడ్ వీక్లీలో ప్రచురింపబడ్డాయి. ఆ సమయంలో వీరు కలకత్తాలో కుటుంబంతో ఉండేవారు. ప్రభాత్‌ను వదిలి వేసిన తరువాత కూడా సినిమాను మర్చిపోలేకపోయారు. అందుకే ఈసారి బొంబాయి చేరి మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలు పెట్టారు. అలా ప్రఖ్యాతి చెందిన బొంబాయి టాకీస్ లోకి వీరు ప్రవేశించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here