మధురమైన బాధ – గురుదత్ సినిమా 16

0
2

బాంబే టాకీస్‌తో గురుదత్ చేసిన రెండు సినిమాలు, మరికొన్ని ఇతర సినిమాలు

[box type=’note’ fontsize=’16’] బాంబే టాకీస్‌తో గురుదత్ చేసిన రెండు సినిమాలు, మరికొన్ని సినిమాలు గురించి సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

గర్ల్స్ స్కూల్(1949)

బాంబే టాకీస్‌లో అసిస్టెంట్‌గా గురుదత్ పని చేయడం మొదలు పెట్టాక రెండు సినిమాలకు ఆయన అక్కడ పని చేసినట్లు తెలుస్తుంది. ముందుగా అమియా చక్రవర్తికి అసిస్టెంటుగా ‘గర్ల్స్ స్కూల్’ అనే సినిమాకు పని చేసారు గురుదత్. ఇందులో గీతా బాలి నాయిక. గీతా బాలితో అప్పుడు గురుదత్‌కి జరిగిన పరిచయం, ఆమెతో కలిసి మరో మూడు సినిమాలకు దర్శకుడిగా గురుదత్ పని చేయడానికి తోడ్పడింది. అంతే కాదు గీతా బాలి, గురుదత్ సినీ జీవితంలో అతని పక్కన నటించిన మొదటి హీరోయిన్ కూడా. ‘గర్ల్స్ స్కూల్’ సినిమా కథలో పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక మీనా అనే యువతి ఇల్లు వదిలి వచ్చి ఒక గ్రామంలో బాలికల పాఠశాల స్థాపిస్తుంది. ఆ ఊరి జమిందారు దీనికి ఇష్టపడడు. అతని బంధువు బిపిన్ ఆమెకు ఇబ్బందులు కలుగ జేస్తూ ఉంటాడు.

అలాంటి సమయంలో స్కూలులో టీచర్‌గా పని చేయడానికి వస్తాడు శాంతి కుమార్. అతని పేరు చూసి స్త్రీ అనుకుని అతనికి ఉద్యోగంలో వచ్చి చేరమని కబురు చేస్తుంది మీనా. ఉద్యోగంలో చేరడానికి వచ్చాక అతను అవివాహితుడని ఆ ఉద్యోగం అతనికి ఇవ్వడానికి నిరాకరిస్తుంది జమిందారు చెల్లెలు సుమిత్రా దేవి. కొన్నాళ్లు శాంతి కుమార్ అక్కడ ఉండిపోవలసి వస్తుంది. మీనా శాంతి కుమార్ ప్రేమలో పడ్డాక, ఈ సంగతి ఊరి వారికి తెలిస్తే స్కూలు పేరు చెడిపోతుందని బాలికలు చదువుకోవడానికి రారని భయంతో శాంతి కుమార్ ఆ ఊరు విడిచి వెళ్ళిపోతాడు. చివరకు కొన్ని మనస్పర్ధలు, అవి తీరి ఆఖరున హీరో హీరోయిన్ కలవడం సినిమా కథ.

ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలుంటాయి. లతా మంగేష్కర్ శంషాద్ బేగం, సి. రామచంద్ర, మన్నాడేలు గానం చేసిన ఈ పాటలను కవి ప్రదీప్ రచించారు. సంగీతం ఇచ్చింది అనిల్ బిస్వాస్. ఈ సినిమా గురించి ఇస్మత్ చుగ్తాయి తన ‘అజీబ్ ఆద్మీ’ అనే నవలలో ప్రస్తావిస్తారు. సినిమాలలో ఇంకా నిలదొక్కుకోని సమయంలో గురుదత్, గీతా బాలీ, గీతా రాయ్ వారి మిత్ర బృందం, స్టూడియో బైట చింత చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారని, ఆ గడ్డు రోజుల్లో గీత బాలీ ‘గర్ల్స్ స్కూల్’ సినిమాలో నటిస్తుందని ఆ నవలలో ప్రస్తావిస్తారు ఇస్మత్ చుగ్తాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అమియా చక్రవర్తి అప్పటికే పేరున్న దర్శకులు. అంతకు ముందు ఒక ఐదు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. దిలీప్ కుమార్‌కు ‘జ్వార్ భాటా’ సినిమాతో మొదట నటుడిగా అవకాశం ఇచ్చిన దర్శకులు ఆయన.

గీతా బాలి పన్నెండు సంవత్సరాలకు సినిమాలలో ప్రవేశించింది. ఆమెకు కూడా అప్పటి దాక పెద్ద హిట్ సినిమాలంటూ ఏం లేవు. పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఇంకా ఆమె ప్రయాణం మొదలవ్వలేదు. అంతకు ముందు రెండవ హీరోయిన్‌గా చేసిన అనుభవం ఉంది. ‘గర్ల్స్ స్కూల్’ సినిమా కూడా పెద్ద గొప్పగా ఆడలేదు.

సంగ్రాం (1950)

ఈ సినిమా తరువాత గురుదత్ జ్ఞాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘సంగ్రాం’ అనే సినిమాకు పని చేశారు. అప్పట్లో జ్ఞాన్ ముఖర్జీ చాలా పేరున్న దర్శకులు. అశోక్ కుమార్‌తో ‘కిస్మత్’ అనే అతి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడిగా ఆయనకు సినిమా దర్శకులలో చాలా పేరు ఉంది. కమర్షియల్ ఫార్ములాలతో మాస్ కోసం సినిమాలు తీయడానికి ఇష్టపడే వారు ఆయన. యాంటీ హీరోలను హిందీ సినిమాకు పరిచయం చేసిన దర్శకులు కూడా అయనే. జ్ఞాన్ ముఖర్జీని గురుదత్ తన గురువుగా భావించారు. వారి ప్రభావం గురుదత్‌పై చాలా ఉంది. జ్ఞాన్ ముఖర్జీపై ఆయనకు ఎంత అభిమానం అంటే ఆయన 1956లో మరణించిన తరువాత గురుదత్ వారి ఫోటోను తన స్టూడియో ఆఫీసులో పెట్టించుకున్నారు. అంతే కాకుండా గురుదత్ తీసిన ‘ప్యాసా’ సినిమాను జ్ఞాన్ ముఖర్జీకే అంకితం ఇచ్చారు. గురుదత్ సహాయకుడిగా జ్ఞాన్ ముఖర్జీ తీసిన ‘సంగ్రాం’ సినిమా అప్పట్లో అతి పెద్ద హిట్ చిత్రం. ఇందులో జ్ఞాన్ ముఖర్జీ కథను నడిపించిన తీరుని గురుదత్ పూర్తిగా తన తొలి సినిమాలలో అనుకరించడం మనకు కనిపిస్తుంది. అంతే కాదు గురుదత్ ‘కాగజ్ కే ఫూల్ సినిమా’ జ్ఞాన్ ముఖర్జీకి ఆయన ఇచ్చిన నివాళి అని కూడా అప్పట్లో విశ్లేషకులు చెప్పుకున్నారు.

‘సంగ్రాం’ సినిమాను ఇప్పుడు చూసినా కూడా మనకు నచ్చుతుంది. ఆ రోజుల్లో అది నిజంగా చాలా బోల్డ్ సబ్జెక్ట్ క్రిందకి వస్తుంది. పాత్రల వ్యక్తిత్వ పరిశీలకు పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉపయోగించిన ఫార్ములాను తరువాత వందల సంఖ్యలో భారతీయ సినిమాలు అనుకరించాయి. ఇందులో ప్రధాన పాత్రది పూర్తి స్థాయి నెగిటివ్ పాత్ర. అంటే పరిస్థితులు అనుకూలించక చెడు వైపుకు వెళ్ళే సగటు హిందీ సినిమా హీరోకు భిన్నంగా కోరి చిన్నప్పటి నుండి చెడు బాటను తనదిగా చేసుకున్న వ్యక్తి ఈ సినిమాలో ప్రధాన నటుడు అవడం అప్పట్లో పెద్ద సంచలనం.

ఒక పోలీసు ఉద్యోగి తల్లిలేని తన బిడ్డకు అన్నీ తానయి అతి గారాబంగా పెంచుతాడు. చిన్నతనం నుండే అతనికి కావలసినవి అన్నీ ఇవ్వడం వలన కున్వర్ చెడు స్నేహాలకు అలవాటు పడతాడు. చిన్నతనంలోనే తండ్రి రివాల్వర్ దొంగిలించి మరొక పిల్లవాడ్ని గాయపరుస్తాడు కున్వర్. తండ్రి కారణంగా శిక్ష పడకుండా తప్పించుకుంటాడు. బిడ్డ మీద పిచ్చి ప్రెమతో కున్వర్ ఏ దారిలో వెళుతున్నాడో తండ్రికి తెలుసుకోలేకపోతాడు. కున్వర్‌ని గుడ్డిగా నమ్ముతాడు అతను. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రతి విషయంలో తండిని మోసం చేస్తూ కున్వర్ జూదానికి, దొంగతనాలకు అలవాటు పడతాడు. పెరిగి పెద్దయిన తరువాత అతనికి ఇంకా స్వేచ్ఛ వస్తుంది. హోటల్ నడుపుతున్నానంటూ పట్నంలో ఒక జూదగృహం నడుపుతుంటాడు కున్వర్. అక్కడి ఉద్యోగి ఒకరు కున్వర్ గురించి పోలీసులకు సమాచారం అందిస్తారు. కున్వర్ పోలీసులకు పట్టుబడతాడు. కాని అతను వారి నుండి తప్పించుకుని పారిపోతాడు. మరో ఊరు పారిపోతున్న సమయంలో రోడ్డుపై చెడిపోయిన కారుతో ఇబ్బంది పడుతున్న యువతి కనిపిస్తుంది. కున్వర్ ఆమెకు సహాయం చేసిన తరువాత అతన్ని మర్యాదస్తుడని నమ్మి ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుని వస్తుంది. అక్కడ కున్వర్‌కు కాంత తన చిన్నప్పటి స్నేహితురాలని ఆమె తండ్రి తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది.

కాంత కున్వర్ ఏదో ఆపదలో ఉన్నాడని నమ్మి అతన్ని తన ఇంట్లో దాక్కునే అవకాశం కలిగిస్తుంది. అప్పుడే వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కున్వర్ గతం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించడం, అతనితో పని చేసిన వారు అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం, చివరకు తన తల్లి నగలను దొంగతనం చేసి అతను సమస్యల నుండి బైటపడాలనుకోవడం జరుగుతుంది. కాంతకు కున్వర్ గురించి నిజం తెలిసిపోతుంది. ఆమె తండ్రి కూడా ఆమె వివాహం మరొకరితో జరిపించాలనుకుంటాడు. వివాహం అయి మరొకరి భార్య అయిన కాంతను కున్వర్, బలవంతంగా తనతో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తాడు. కాంత అతన్ని ఎదిరిస్తుంది. చిన్నప్పటి నుండి తనకు కావలసింది అందిపుచ్చుకోనిదే ఊరుకోలేని మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్న కున్వర్ కాంతను బలవంతంగా స్వంతం చేసుకోవాలనుకుంటాడు. చివరకు తండ్రి చేతిలోనే మరణిస్తాడు. క్రమశిక్షణ లేని బాల్యం చివరకు ఎటువంటి ప్రమాద స్థితికి తీసుకుని వెళుతుందో చెప్పిన సినిమా ఇది.

గురుదత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఆఖరి చిత్రం ‘సంగ్రాం’. తరువాత 1951లో నవకేతన్ బానర్ మీద సొంతంగా దేవ్ ఆనంద్ సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూ ప్రభాత్ స్టూడియోస్‌లో గురుదత్ కిచ్చిన మాటకు కట్టుబడి అతన్ని తన సినిమాకు దర్శకత్వం వహించమని అడిగారు. అప్పుడు గురుదత్ బలరాజ్ సాహనీ సహాయంతో ‘సంగ్రాం’ పాత్రలను పోలిన సినిమా కథనే రాసుకున్నారు. జూదగృహం, అందులోని జీవితం, హీరోని ప్రేమించే నాటగత్తె, ఇలాంటి పాయింట్లను ‘సంగ్రాం’ సినిమా ప్రభావంతో తీసుకుని హాలీవుడ్ ప్రభావంతో అప్పటి నోయిర్ స్టైల్‌లో సినిమాలు తీయడానికి పూనుకున్నారు గురుదత్. అలా తయారయ్యినదే ‘బాజీ.’ ‘గర్ల్స్ స్కూల్’ సినిమాతో పరిచయం అయిన గీతా బాలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ‘సంగ్రాం’ను పోలిన కథను కూర్చుకుని ప్రధాన పాత్రను తన పంథాలో తయారు చేసుకున్నారు. గురుదత్. దర్శకుడిగా అలా అతని ప్రస్థానం మొదలయింది. అందుకే జ్ఞాన్ ముఖర్జీతో ఆయన పని చేసిన సినిమా గురుదత్ జీవితంలో గొప్ప ప్రాముఖ్యత ఉన్న సినిమాగా నిలిచిపోయింది. ఈ ప్రభావం, ‘జాల్’ సినిమాలో దేవ్ ఆనంద్ పాత్రలో కూడా గమనించవచ్చు. ఇందులో కూడా గీతా బాలీ కథానాయిక. తరువాత గురుదత్ హీరోగా మారి తీసిన ‘బాజ్’లో గురుదత్ పక్కన గీతా బాలీ నాయికగా చేసింది. ‘సంగ్రాం’ సినిమాలో శశి కపూర్, తబస్సుమ్‌లు బాల నటులుగా కనిపిస్తారు. నాయిక పాత్రలో నళినీ జయవంత్ అలరిస్తారు. ఈ సినిమా తరువాత అశోక్ కుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తూ హిందీ సినిమాలలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. సంగీతం సి. రామచంద్ర సమకూర్చారు.

‘సంగ్రాం’ సినిమా ప్రస్తావిస్తూ గుర్తు చేసుకోవలసిన వ్యక్తి జోసెఫ్ విర్షింగ్. బొంబాయి టాకీస్‌లో సినిమాటోగ్రఫర్‌గా ఇరవై సినిమాలకు పని చేసిన ఈయన జర్మన్ దేశస్తుడు. అప్పట్లో దేవికారాణీ గారి ప్రోద్బలంతో ఆమె తన భర్త హిమాన్షు రాయ్‌తో కలిసి స్థాపించిన బొంబే టాకీస్‌లో సినిమాటోగ్రఫర్‌గా చేసారు. రెండవ ప్రపంచ యుద్దంలో విదేశీయుల కాంప్‌లో ఉండవలసి వచ్చినా యుద్దం తరువాత మళ్ళీ బాంబే టాకీస్‌కే వచ్చి పని చేయడం మొదలెట్టారు. ఆ సమయంలో వచ్చిందే ‘సంగ్రాం’ సినిమా. ఈ సినిమాకు పని చేస్తున్న సమయంలో గురుదత్ ఫోటోగ్రఫీపై ఆసక్తి చూపేవారని, సినిమాలో కెమెరా పనితనాన్ని నిశితంగా పరిశీలించేవారని అతనితో పని చేసిన మిత్రులు చెబుతారు. జ్ఞాన్ ముఖర్జీకి డ్రైవర్‌గా కొన్ని రోజులు నటుడు మెహమూద్ తన కెరీర్ ప్రారంభంలో పని చేసారు. ఆ సమయంలో గురుదత్ ని ఎప్పుడూ కెమెరాతో చూసే వాడినని, ఫోటోలు తీస్తూ ఎప్పుడూ కనిపించేవారని, మెహమూద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాకు సంబంధించిన ప్రతి రంగంలో గురుదత్ కొంత శిక్షణ పొందడానికి జ్ఞాన్ ముఖర్జీ దగ్గర చేసిన శిష్యరికరం ఎంతో సహాయపడింది.

దీని తరువాత గురుదత్ తన సొంత బాణిలో సినిమాలు తీస్తూ ముందు దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. గురుదత్ సినీ జీవితాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకోవాలంటే ఆయన అతిధిగా కనిపించిన కాలబజార్ సినిమానూ, హఠాన్మరణానికి ముందు కొన్ని రీళ్ళు నటించిన లవ్ అండ్ గాడ్ సినిమాల గురించి కూడా తెలుసుకోవాల్సివుంటుంది.

కాలా బాజార్ (1960)

నవ్ కేతన్ నిర్మించిన సినిమాలలో ‘కాలా బాజార్’ కి ఒక విశేషం ఉంది. దేవ్ ఆనంద్, విజయ్ ఆనంద్, చేతన్ ఆనంద్ సోదరులు ముగ్గురు కలిసి నటించిన ఒకే ఒక సినిమా కాలా బాజార్. సినిమాలలో బ్లాక్ టిక్కెట్లు అమ్మే వ్యక్తి కథ ఇది. ఇందులో నాయిక పాత్ర వహీదా రెహ్మాన్ పోషించారు. గురుదత్ సినిమాలన్నీ విశ్లేషిస్తున్న సమయంలో ఈ సినిమా ప్రసక్తి తీసుకు రావడానికి ఒక కారణం ఉంది. ఈ సినిమాలో గురుదత్ ఒక ఐదు సెకన్ల షాట్‌లో కనిపిచడం, ఈ సినిమా నిర్మాణం గురుదత్ స్టూడియోస్‌లో జరగడం, ఇందులో నటిస్తున్నప్పుడు వహిదా రెహ్మాన్ గురుదత్ స్టూడియోస్‌లో కాంట్రాక్ట్‌లో ఉండడం ఈ మూడు కారణాల వలన ఈ సినిమా ను ప్రస్తావించుకోవాల్సివస్తుంది.

మెహబూబ్ ఖాన్ “మదర్ ఇండియా” సినిమా ప్రీమియర్ పెద్ద ఎత్తున నిర్వహించారు. దీనికి హిందీ సినిమా హేమాహేమీలందరినీ అహ్వానించారు. అప్పుడు వస్తున్న అతిథులను తన సినిమా కోసం షూట్ చేసుకోవడానికి దేవ్ ఆనంద్‌కు మెహబూబ్ ఖాన్ అనుమతి ఇచ్చారు. అలా వచ్చే అతిథులలో ముందుగా గురుదత్, గీతా దత్‌లు తరువాత, లతా మంగేష్కర్, దిలీప్ కుమార్, కిషోర్ కుమార్, రూమా గుహ, నిమ్మి, కుమ్ కుమ్, నాదిరా, నర్గిస్, మెహబూబ్ ఖాన్, సొహ్రాబ్ మోడి, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్, ముఖ్రి, యాకూబ్, నసీమ్ బాను, బేబీ నాజ్‌లు కనిపిస్తారు. అతిథులుగా గురుదత్, గీతా దత్‌లు కలిసి ప్రీమియర్‌కు రావడం చూస్తాం. గురుదత్ కామియోగా తానే దర్శకత్వం వహించిన ‘జాల్’, ‘బాజీ’ సినిమాలలో కూడా కనిపిస్తారు. ‘కాలా బజార్’ లో గురుదత్ కనిపించడం వారి మరో కామియో లుక్‌గా తీసుకోవచ్చు.

‘కాలా బజార్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు వహీదా రెహ్మాన్ గురుదత్ స్టూడియోస్‌తో కాంట్రాక్టులో ఉన్నారు. గురుదత్ స్వయంగా రాసిన ఒక వ్యాసంలో స్టూడియో పద్దతిని సమర్థిస్తూ, నటులు ఒక స్టూడియోతో కలిసి ఉండాలని, వారిని అవకాశం వచ్చినప్పుడు మరో స్టూడియో ఉపయోగించుకోవచ్చనే వాదనను ప్రస్తావిస్తారు. అప్పట్లో హాలీవుడ్‌లో ఈ పద్దతి ఉండేది. ఆ పద్దతిలోనే తన స్టూడియోని నడిపే ప్రయత్నం చేసారు గురుదత్. అప్పటికే ప్రభాత్, బాంబే టాకీస్ లాంటి స్టూడియోలు నశించిపోతున్నా, అలనాటి స్టూడియో పద్దతినే తరువాతి తరంలో గురుదత్, రాజ్ కపూర్లు పాటించేవారు. ఇటువంటి స్టూడియో కల్చర్‌తో అద్భుతమైన సినిమాలను తీయవచ్చని, ఆర్టిస్టుల మధ్య ఉండే కుటుంబ వాతావరణం సినిమా నిర్మాణంలో సహాయపడుతుందని తరువాతి తరంలో నమ్మి ఆచరించినవారు ఈ ఇద్దరు. వీరికి సీనియర్‌గా మెహబూబ్ ఖాన్‌ని చెప్పుకోవచ్చు. అలా గురుదత్ స్టూడియోతో కాంట్రాక్టుతో ఉన్న వారు మరొకరి సినిమాలలో నటించడం అందరి విషయంలోనూ జరిగింది. గురుదత్ తన సినీ జీవితంలో ఏ ఒక్క కళాకారుడి ఎదుగుదలకూ అడ్డుపడలేదు. తన దగ్గర ఒప్పందంలో వున్నా అవకాశంవస్తే వెరేవారి సినిమాల్లో నటించేందుకు అనుమతినిచ్చేవాడు.  వహీదా రెహ్మాన్ ఈ కాంట్రాక్టులో ఉన్నప్పుడే ‘12 O క్లాక్’, ‘సోల్వా  సాల్’, ‘కాలా బాజార్’, ‘ఏక్ ఫూల్ చార్ కాంటే’, ‘గర్ల్ ప్రెండ్’, ‘రూప్ కీ రాణీ చోరో కా రాజా’, సినిమాలకు పని చేసారు. ‘సాహెబ్ బీవి ఔర్’ గులాం సినిమా నిర్మణం సమయంలో ఆమె కాంట్రాక్టు కాలం ముగిసిందని గురుదత్‌కి చెప్పకుండా మరో సినిమా ఒప్పుకుని స్వతంత్రంగా తన దారి తాను చూసుకున్నారు. దీనికి కారణాలు ఏవైనా గురుదత్ కాంట్రాక్టులో ఉన్నప్పుడు వహీదా కొన్ని బైటి సినిమాలలో నటించారన్నది గమనించాలి. జానీ వాకర్, రెహ్మాన్ లాంటి నటులు కూడా గురుదత్ సినిమాలకి చేస్తూ ఎన్నో ఇతర సినిమాలు చేసారన్నది వారి సినిమాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. వీరు గురుదత్ స్టూడియోస్‌తో కాంట్రాక్టులో ఉన్నారా లేదా అన్నదానిలో స్పష్టత లేకపోయినా కేవలం గురుదత్ సినిమాలో మాత్రమే వీరు నటించలేదన్నది అర్థం అవుతుంది. కాని వీరందరికీ ప్రత్యేక గుర్తింపు గురుదత్ సినిమాలలో మాత్రమే వచ్చిందన్నది కూడా తెలుస్తుంది.

‘కాలా బాజార్’ ఒక మ్యూజికల్ హిట్. కండక్టర్‌గా పని చేస్తున్న రఘువీర్ తనతో దురుసుగా ప్రవర్తించిన ఒక ప్రయాణీకుడ్ని కొట్టడంతో అతని ఉద్యోగం పోతుంది. జబ్బుతో బాధపడే తల్లి, పెళ్ళి కాని చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు ఇతని పై ఆధారపడి ఉంటారు. బ్రతకడానికి సినిమా థియేటర్ల ముందు బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తన లాంటి వారిని చేరదీసి, ఒక మాఫియాగా ఎదుగుతాడు రఘు. అప్పుడే బ్లాక్ మార్కెటింగ్‌ని అసహ్యించుకునే అల్కాని ధియేటర్ ముందు చూస్తాడు. ఆమెని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు రఘు. కాని అల్కా నంద కుమార్ అనే సహద్యాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా ఆమెను మర్చిపోలేకపోతాడు రఘు. నంద కుమార్ విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళిన తరువాత అల్క కుటుంబం ఊటీ వెళూతుందని అతనికి తెలుస్తుంది. వారితో కలిసి ప్రయాణం చేస్తాడు రఘు. మెల్లిగా అల్కతో పరిచయం, స్నేహం పెంచుకుంటాడు. తన ప్రేమను ప్రస్తావిస్తాడు కూడా. అల్క నంద కుమార్‌తో తన నిశ్చితార్ధం జరిగిందని తాను అతని సొంతం అని చెబుతుంది. కాని ఆమె కూడా రఘు పట్ల ప్రేమను పెంచుకుంటుంది. కొన్ని సంఘటనలు తరువాత నందకుమార్, అల్క, స్నేహపూర్వకంగా విడిపోవడం. అల్క రఘులు ఒకటవడం జరుగుతుంది. చివరకు తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవించి బ్లాక్ మార్కెటింగ్ నుండి బైటపడి తనతో పాటు తప్పు పనులు చేసిన వారందరినీ మంచి మార్గంలో తీసుకువచ్చినందుకు రఘు అందరి ప్రశంసలు అందుకుంటాడు.

అప్పట్లో దేవ్ ఆనంద్ చాలా ఆధునిక భావలతో సినిమాలు తీసే సాహసం చేసేవారు. మరొకరిని ప్రేమించిన యువతి పట్ల అకర్షణ పెంచుకుని ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెను తనతో ప్రేమలో పడవేసి చివరకు ఆమెను హీరో దక్కించుకోవడం అరవైలలో ఎవరూ ఊహించని సబ్జెక్టు. ఇప్పడు ఈ కథనంతో వస్తున్న సినిమాలను చూస్తూ ఈ తరం ప్రోగ్రెసివ్ సినిమాలుగా భావిస్తున్న వారికి ఇలాంటి విషయ వస్తువుతో అరవైల ఆరంభంలోనే దేవ్ ఆనంద్ సినిమాలు తీసారన్నది తెలియాలి. దేవ్ ఆనంద్ హీరోగా నటించిన చాలా సినిమాలు అప్పటి తరం ఆలోచనలకు చాలా భిన్నంగా, ఉంటూ అప్పటి ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. ప్రొగ్రెసివ్‌గా ఉంటూనే అసభ్యతకు, అసహనానికి, తొందరబాటుకు ఎక్కడా చోటు ఇవ్వకుండా ఆ పాత్రలను మలిచారు అప్పటి దర్శకులు.

సినిమాలో ఎస్. డి. బర్మన్ సంగీతంలో చక్కని పాటలుంటాయి. ‘ఖొయా ఖోయా చాంద్’, ‘తెరీ ధూం హర్ కహీ’, ‘అప్ని తొ హర్ ఆహ్ ఎక్ తూఫాన్ హై’ లాంటి రఫీ సోలో పాటలతో పాటు, గీతాదత్ తో రఫీ గానం చేసిన “రిమ్ జిమ్ కె తరానె లేకే ఆయీ బర్సాత్” కూడా ఆనందించవచ్చు. అప్పటికి ఎస్. డి. బర్మన్‌కు లతా మంగేష్కర్‌కు కొన్ని గొడవలు జరిగి ఆయన లతతో పాటలు పాడించట్లేదు. ఈ సమయంలో ఆశా భోస్లే కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంది. గీతా దత్‌తో ఎస్.డి. బర్మన్ పాటలు పాడించాలనుకున్నారు. కాని కుటుంబ కలహాలతో గీతా దత్ రిహార్సల్స్‌కు సరిగ్గా రాలేకపోయేవారు. ఈ సినిమాలో ఆమె కేవలం రెండు పాటలు మాత్రమే పాడారు. ఇంకో మూడు పాటలు ఆశా భోస్లే పాడడం జరిగింది.

గీతా దత్ గురుదత్‌లు వివాహం చేసుకున్నప్పుడు ఆమె టాప్ గాయని. ఒక సంవత్సరంలో లతా మంగేష్కర్ కన్నా ఎక్కువ పాటలు పాడి గొప్ప పేరు తెచ్చుకున్న కళాకారిణి. బెంగాలీ భాషలో కూడా అద్భుతమైన గీతాలు పాడి విశ్లేషకుల ప్రశంసలు పొందిన స్త్రీ. గురుదత్ అప్పుడు ఇంకా పేరు తెచ్చుకోని దర్శకుడు. ఆ సమయంలో ఎవరో గీతా రాయ్‌ను అతను కేవలం డబ్బు కోసం పెళ్ళి చేసుకున్నారని అన్నారట. ఈ విషయం గురుదత్‌ని ఎంతో బాధించింది. దానికి ఫలితం గీతా దత్‌ను మిగతా సినిమాలకు పాడవద్దని గురుదత్ ఒత్తిడి తీసుకురావడం. వారి వివాహ జీవితంలో వారి మధ్య దూరం పెంచిన ముఖ్యమైన విషయం సంగతి ఇదే. తనతో కాంట్రాక్టులో ఉన్న నటీనటులందరూ వేరే సినిమాలలో నటించడం తప్పు కాదనుకుని గురుదత్ వారిని ప్రోత్సహిస్తూ, అంతటి గొప్ప కళాకారిణిని భార్యగా తన ఇంటికి పరిమితం చేయాలనుకోవడం, తమ సొంత బ్యానర్‌కే పరిమితం చేయాలను కోవడం చాలా పెద్ద తప్పు అని ఆయనకు అనిపించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతటి గొప్ప పురుషుడయినా స్త్రీని ఆస్తిగా పరిగణించే తప్పు ఈ పురుషాధిక్య వ్యవస్థ అతనితో చేయిస్తుంది. అది తప్పని కూడా అనిపించనివ్వవు చుట్టూ ఉన్న పరిస్థితులు. గీతా దత్ గురుదత్‌తో గొడవ పడుతూ దొంగతనంగా వెళ్ళి పాడుతూ గురుదత్ ఇల్లు చేరే సమయానికి తాను ఇంటికి రావాలని ఒత్తిడికి గురి అవుతూ కొన్ని సినిమాలకు పాటలు పాడుతున్న సమయం అది. ఈ కారణంతో ఇంట్లో చిరాకులతో ఆమెకు అలవాటయిన తాగుడు కారణంగా క్రమంగా తన జీవితం పై ఆమె పట్టు కోల్పోతూ అవకాశాలు లేని స్థితికి చేరారు. ఆమెను ఎంతగానో అభిమానించి ఒక కుటుంబ వ్యక్తిలా ఆమెతో మెలిగిన ఎస్. డి. బర్మన్‌కి చివర్లో ఫోన్ చేసి నాకు పాటలెందుకు ఇవ్వట్లేదు అని ఆమె అడిగే స్థితికి వచ్చారు. అప్పుడు బర్మన్ ఆమె ఫోను ఎత్తడం కూడా మానేసారట. అలా సినీ ప్రపంచం నుండి కనుమరుగయిన కళాకారిణి గీతా దత్.

విమల్ మిత్ర రాసిన “బిచడే సభీ బారీ బారీ” పుస్తకంలో గీతా దత్‌ని పాడడం ఆపమని గురుదత్ కోరడం అన్యాయమని, తాను గురుదత్‌ని ఈ విషయంలో మందలించానని చెప్పుకొస్తారు. ఈ విషయాల మధ్య 1960 లలో వచ్చిన ‘కాలా బజార్’ను గమనిస్తే ఎస్. డి. బర్మన్ దర్శకత్వంలో గీతా దత్ ఈ సినిమాలో కేవలం రెండు పాటలే పాడడం చూస్తాం. మిగతా మూడు పాటలు, ఆశా భోస్లేని స్వయంగా ఇష్టపడకపోయినా ఎస్. డి. బర్మన్ ఆమెతోనే పాడించడం గమనించవచ్చు. మరో పక్క వహీదా రెహమాన్‌కు ఈ సినిమా మంచి పేరుని తీసుకువచ్చింది. అదే సమయంలో గీతా దత్ ఎస్. డి. బర్మన్ లాంటి అంతరంగ మిత్రులకు దూరం అవడం ఈ సినిమాలో కనిపిస్తుంది. గురుదత్ జీవితంలో భర్త అనే పాత్రను నిర్వహించిన మరో కోణాన్ని పరిశీలిస్తున్న సమయంలో ‘కాలా బజార్’ సినిమా ఈ రెండు విషయాలను ధ్రువపరుస్తుంది.

లవ్ అండ్ గాడ్ (1986)

కే ఆసిఫ్ ‘ముఘల్ – ఎ – ఆజం’ సినిమా తరువాత తీయాలనుకున్న సినిమా ‘లవ్ అండ్ గాడ్’. ఇది లైలా మజ్నూల ప్రేమ కథ. దీనికి వారు ఎన్నుకున్న నటులు గురుదత్, నిమ్మి. ఈ సినిమా చేయడానికి గురుదత్ సంతోషంగా ఒప్పుకున్నారు. ఈ సినిమాపై తనకు చాలా ఆశలున్నాయని, మజ్నూ పాత్రను పోషిస్తూ తాను చాలా రోజుల తరువాత నటనను ఆనందిస్తున్నానని ఆయన తన దగ్గర మిత్రులతో చెప్పుకున్నారు కూడా. బెంగాలీ రచయిత విమల్ మిత్ర, గురుదత్ మరణానంతరం వారి జ్ఞాపకాలతో రాసిన పుస్తకం హిందీలో ‘బిచడే సభీ బారీ బారీ’ పేరుతో అనువాదం అయ్యింది. ఆ పుస్తకంలో ‘లవ్ అండ్ గాడ్’ సినిమా గురించి గురుదత్ చాలా ఆశతో, ఆసక్తితో చెప్పేవారని ఆయన రాస్తారు. ఈ సినిమా చరిత్రలో నిల్చిపోతుంది అని చాలా మంది అనుకునేవారు. నిజంగానే ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. కాని అందరూ అనుకున్నట్లు ఒక మాస్టర్ పీస్‌లా కాకుండా, భారతీయ సినిమా జగత్తులో అతి విషాద సినిమాగా మిగిలి అభిమానులకు వేదనను మిగిల్చింది.

కే ఆసిప్ పూర్తిగా కలర్‌లో తీయాలనుకున్న సినిమా ‘లవ్ అండ్ గాడ్’. ఈ సినిమా షూటింగ్ 1963లో మొదలయ్యింది. కొన్ని రీళ్ళు షూట్ చెసిన అనంతరం 1964లో గురుదత్ మరణించడంతో సినిమా ఆగిపోయింది. గురుదత్ ఖైస్‌గా నిమ్మి లైలాగా ఈ సినిమాలో నటించారు. గురుదత్ మరణించిన తరువాత ఖైస్ పాత్రకు కే. ఆసిప్ కు మరొక నటుడు చాలా కాలం దాకా దొరకలేదు. 1970లో అనుకోకుండా సంజీవ్ కుమార్‌ని ఆసీఫ్ చూడడం జరిగింది. తన సినిమాకు హీరో దొరికాడని సంతోషించి, అప్పట్లో సినిమాలలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న సంజీవ్ కుమార్‌ని కోరి తన సినిమాకు హీరోగా తీసుకున్నారు కే. ఆసిఫ్. కొంత షూటింగ్  తరువాత మార్చ్ 9, 1971న కే. ఆసీఫ్ 48 సంవర్సరాల వయసులో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు.

పదిహేను సంవత్సరాల వరకు ఈ సినిమా ప్రసక్తి మరి రాలేదు. ఆసీఫ్ భార్య దిలీప్ కుమార్ సోదరి అయిన అఖ్తర్ ఈ సినిమాను పూర్తి చేయాలని ఆసిఫ్ మరణించిన పదిహేను సంవత్సరాల తరువాత నిశ్చయించుకున్నారు. నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కె. సీ బొకాడియా సహాయం వారు కోరినప్పుడు ఆయన సంతోషంగా అంగీకరించారు. అప్పటికి షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా రీళ్ళను తెప్పించి వాటిని ఒక క్రమంలో ఉంచి కొన్ని భాగాలను మళ్ళీ షూట్ చేయడానికి పూనుకున్నారు. రెండోసారి ఈ సినిమా పూర్తి చేయడానికి ఒప్పుకుని కొంత భాగం షూటింగ్ చేసారు సంజీవ్ కుమార్.

కాని 1985లో ఈయన కూడా గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. పూర్తి కావలసిన భాగాలను ముఖ్యంగా ఒక పాటను డూప్‌తో షూట్ చేసి అతి కష్టం మీద ఈ సినిమాను 27 మే 1986న విడుదల చేసారు ఆఖ్తర్. ఈ సినిమాలో గానం చేసిన ముహమ్మద్ రఫీ, ముఖేశ్, ఖాన్ మస్తానా  కూడా సినిమా రిలీజ్ అప్పటికే మరణించారు.

కే. ఆసిఫ్ మరణించిన పదిహేను సంవర్సరాల తరువాత ఈ సినిమా మళ్ళీ పూర్తి చేయాలనే ఆలోచన రావడానికి కారణం లండన్‌లో సర్జరీ చేయించుకుని తిరిగి వచ్చిన సంజీవ్ కుమార్ చాలా సన్నబడడంతో ఈ సినిమాను పూర్తి చేయవచ్చే నమ్మకం ప్రోడ్యూసర్లకు కలిగింది. “ఫూలో మే తూ గుల్షన్ గుల్షన్” అన్న పాటను షూట్ చేయడం మాత్రం కుదరలలేదు. నౌషాద్ ఈ సినిమాకు సంగీతం అందించి పాటలు రికార్డు చేసిన ఇరవై సంవత్సరాల తరువాత మళ్ళీ పూనుకుని ఈ సినిమాకు బాక్‌గ్రౌండ్ సంగీతం కోసం పని చేసారు. ‘ముఘల్ ఏ ఆజం’కి కూడా ఎన్నో సంవత్సరాల గాప్‌తో నౌషాద్ పని చేయడం గమనించవచ్చు. చంద్రమోహన్, సప్రు తదితరులతో 1940లలో మొదట నిర్మించాలనుకున్న ఆ సినిమాకు నౌషాద్ సంగీతం ఇవ్వాలని నిశ్చయమయింది. కాని చంద్రమోహన్ మరణంతో ఆ సినిమా ఆగిపోయి, మళ్ళీ కొన్ని సంవత్సరాల అనంతరం దిలీప్ కుమార్ పృథ్వీరాజ్ కపూర్ లతో షూట్ మొదలయింది. అప్పుడు కూడా ఆ సినిమాకు సంగీతాన్ని ఇచ్చే బాధ్యతను నౌషాద్‌కే అప్పగించారు కే. ఆసీఫ్. “ముఘల్ ఏ ఆజమ్’ లాగా ‘లవ్ అండ్ గాడ్’కు కుడా నౌషాద్ ఇరవై సంవత్సరాల గాప్ తరువాత కూడా పని చేసారు. రెండు దశాబ్దాల గాప్‌తో రెండు సినిమాలకు రెండు సార్లు సంగీతాన్ని అందించిన వ్యక్తి బహుశా ప్రపంచంలో ఒక్క నౌషాద్ గారే కావచ్చు.

ఖైస్ పాత్రలో గురుదత్

ఇక లైలా తండ్రిగా జయంత్ నటించారు. ఆయనకు డబ్బింగ్ మాత్రం జయంత్ కుమారుడు ఇమ్తియాజ్ ఖాన్ ఇచ్చారు. ప్రాణ్, అమ్జద్ ఖాన్, ఆఘా, అచ్లా సచ్దేవ్, లలితా పవర్, సిమి గరేవాల్ వీళ్ళందరూ కూడా ఇరవై సంవత్సరాల తరువాత ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చి పని చేసారు. ఈ సినిమాకు డైలాగులు రాసింది వాజాహత్ మిర్జా. సినిమా కోసం మొత్తం పన్నెండు పాటలు రికార్డు చేసారు. ఆరు పాటలు ముహమ్మద్ రఫీ పాడిన సోలో గీతాలు. అద్భుతమైన గీతాలవి. “యే నాదానోకీ దునియా హై యే దీవానోకి మెహఫిల్ హై” అన్న పాట దగ్గర మాత్రం గురుదత్ గుర్తుకు వస్తారు. ఇది ఆయన కోసం రాసిన పాటేమో అనిపిస్తుంది. “ఇధర్ డూండ్తా హూ ఉధర్ డూండ్తా హూ” అనే పాట, ‘రహేగా జహన్ మే తెరా నాం’, “ప్యార్ కెహ్తే హై జిసే” “అల్లా తేరే సాథ్ హై” అనే పాటలు మరో ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. ఖుమార్ బారాబంక్వి  ఈ పాటలను రాసారు.

గురుదత్ పై చిత్రించిన కొన్ని లాంగ్ షాట్లను, వెనుక నుండి తీసిన షాట్లను అలాగే ఉంచారంటారు. ఇప్పుడు వాటిని విడదీసి చూడడం కష్టం. అలాగే సినిమాలో ఖైస్, లైలాలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తీసిన సీన్లు గురుదత్ బ్రతికి ఉన్నప్పుడు తీసినవే అట. అలా కొంత భాగం ఆ పాత చిత్రాన్ని తీసుకుని తదుపరి సీన్లు షూట్ చేసారు.

గురుదత్ మరణించేటప్పటికి ఆయన వయసు 39 సంవత్సరాలు. స్టార్ ఇమేజ్‌కి కట్టుబడకుండా పాత్రలకు న్యాయం చేసే నటులు హిందీలో అతి తక్కువ మంది. అందుకే బహుశా  కే. ఆసీప్‌కి గురుదత్ బదులుగా మరో నటుడిని తీసుకోవడం కష్టమయింది. చివరకు సంజీవ్ కుమార్‌ని ఆయన ఈ పాత్రకు ఎంచుకున్నారు. హిందీ భాషలో నటులుగా ఎంచదగ్గ హీరోలలో మొదటి వరుసలో నిలుస్తారు సంజీవ్ కుమార్. హార్ట్ ఎటాక్‌తో ఆసిఫ్ 48 ఏళ్ళకే మరణించారు. ఇక సంజీవ్ కుమార్ కూడా 47 సంవత్సరాలకే హార్ట్ ఎటాక్‌తో మరణించడంలో ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అతి దురదృష్టకరమైన సినిమాగా మిగిలిపోయింది.

“లవ్ అండ్ గాడ్” సినిమాలో గురుదత్ నటించిన కొన్ని సీన్లకు సంబంధించి రెండు ఫోటోలు మాత్రమే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆయన నటించిన సినిమా రీళ్ళు ఇప్పుడు లేవు. కే ఆసిఫ్, గురుదత్ ఇద్దరు ఉండి ఈ సినిమా నడిపించినట్లయితే ఇది ఖచ్చితంగా ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయేది. మృత్యువు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.

గురుదత్, సంజీవ్ కుమార్ ఇద్దరూ ఈ సినిమా కోసం హీరోగా ఎంపికవడం కాకతాళీయం కావాచ్చు. కే. ఆసిఫ్ కీ ఈ పాత్రకు గురుదత్ తరువాత సంజీవ్ కుమార్‌నే తీసుకోవాలని అనిపించడం కాకతాళీయం కావచ్చు. ఈ సినిమా నిర్మాణం సమయంలోనే ఈ ఇద్దరు నటులు ఇరవై సంవత్సారాల తేడాతో మరణిస్తూ ఈ సినిమాను అసంపూర్తిగా వదిలేయడం కాకతాళీయం కావచ్చు కాని వీరిద్దరిని కలిపే ఒక కామన్ పాయింట్ ఉంది. అది వీరి జన్మ దినం.

గురుదత్ జులై 9, 1925న జన్మిస్తే, సంజీవ్ కుమార్ జులై 9, 1938న జన్మించారు. ఒకటే జన్మదినాన్ని పంచుకున్న వీరు ఒకే సినిమాకు పని చేస్తూ మరణించడం కాకతాళీయమనుకోవాలా… గురుదత్ మరణించిన ఎనిమిది సంవత్సరాల తరువాత ఆ పాత్రకు కే. ఆసిఫ్, సంజీవ్ కుమార్‌ను ఎంచుకోవడం విస్మయాన్నే కలిగిస్తుంది. తాను విడిచిన చెప్పుల కోసం వెతుక్కుంటూ స్టుడియో చుట్టూ తిరుగుతున్న సంజీవ్ కుమార్‌ని కే. ఆసిఫ్ అనుకోకుండా చూడడం, అతనిలో మజ్నూ కనిపించడం, అప్పటి దాకా గురుదత్ చేసిన పాత్రకు ఎవరూ దొరకక వెతుకుతున్న ఆసిఫ్ సంజీవ్ కుమార్‌ని చూడగానే అతనే గురుదత్ స్థానంలో నటించగల నటుడు అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటికి సంజీవ్ కుమార్‌కు గొప్ప సినిమాలు ఏం లేవు. అతనింకా నటుడిగా పెద్ద గుర్తింపు పొందలేదు. కాని అనుకోకుండా అతను ఈ సినిమాకు హీరోగా ఎన్నికవడం. మధ్యలో సినిమా ఆగిపోయినా మళ్ళీ పదిహేను సంవత్సరాల తరువాత, మళ్ళీ ఆ సినిమాకి పని చేయలని అనుకోవడం, సినిమా పూర్తి కాకుండానే అర్ధాంతరంగా మరణించడం ఏమో…. కొన్ని లింకులు ఈ ప్రపంచంలో కొందరితో ఎవరికి, ఎందుకు, ఎలా ఏర్పడతాయో. ఏదో శక్తి మనల్ని ఆడిస్తుందని, ఏవో లెక్కలు మన జీవితాలను శాసిస్తున్నాయని ఇలాంటి సందర్భాలలోనే అనిపిస్తూ ఉంటుంది.