[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ప్యాసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
‘ప్యాసా’ (1957)
[dropcap]టై[/dropcap]మ్ మాగజిన్, గార్డియన్, మరియి సైట్ అండ్ సౌండ్ పత్రికలు ప్రపంచం లోని అన్ని దేశాలలో, భాషలలో వచ్చిన సినిమాలను పరీక్షించి, ప్రపంచంలోనే అతి గొప్ప సినిమాల లిస్ట్ లను తయారు చేస్తే, వాటన్నిట్లోనూ ఏకగ్రీవంగా చేర్చబడిన ఏకైక భారతీయ సినిమా ‘ప్యాసా’. ఈ సినిమాను గురుదత్ 1957లో తీసారు. కాని తన 22 ఏళ్ళ వయసులో అంటే 1947, 48ల మధ్య కాలంలోనే ఈ సినిమా కథను గురుదత్ తన స్వంత దస్తూరితో ఇంగ్లీషులో ‘కష్మకష్’ అనే పేరుతో రాసుకున్నారు. ఆ పేజీలను గురుదత్ కుమారుడు అరుణ్ దత్ దగ్గర తీసుకుని ఫోటో తీసి తన పుస్తకంలో వేసుకున్నారు నస్రీన్ మున్నీ కబీర్. గురుదత్ తండ్రి గారు కూడా కవిత్వం రాసేవారని, కాని వారిలోని ఆ విద్వత్తు ప్రపంచానికి తెలియకుండా మిగిలిపోయిందని ఆయన జీవించి ఉన్నంత కాలం కూడా ఒక అర్థం కాని అన్వేషణలోనే గడిపారని తరువాత కొన్ని ఇంటర్వ్యూలలో గురుదత్ కుటుంబీకులు చెప్పారు. గురుదత్ ఈ కథను మొదట రాసేటప్పుడు తన తండ్రి వ్యక్తిత్వానికి దగ్గరగా హీరో ఉండేలా రాసుకున్నారట. తరువాత ఈ కథను ఆధారం చేసుకుని రాసిన ‘ప్యాసా’ సినిమా స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేసారు. ఆ పాత్రల వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దడానికి తన జీవితానుభవాలను కూడా కలుపుకున్నారు. ఈ కథను సినిమాగా తీయాలన్నది ఆయనకు సినీ రంగానికి రాకముందు నుండి ఉన్న కోరిక. ఇది కమర్షియల్ కథ కాదన్నది గురుదత్ కి తెలుసు. అందువలన ముందు కొంత కాలం సినీ ప్రపంచంలో నిలదొక్కుకునే దాకా గురుదత్ ఈ కథను తెరపైకి తీసుకొచ్చే సాహసం చేయలేకపోయారు. కొన్ని హిట్లు వచ్చి తనకు దర్శకుడిగా పేరు వచ్చేదాకా ఆగారు. తరువాత తనకు ఇష్టమయిన విధంగా, అనుకున్నట్లుగా ఈ కథను తెరపైకి ఎక్కించారు. ‘ప్యాసా’ సినిమా రిలీజ్ అయిన తరువాత మెల్లిగా పుంజుకుని సక్సెస్ వైపుకు వెళ్ళింది. కాని అప్పటి భారతీయ క్రిటిక్స్ పూర్తిగా సినిమా ఆత్మను పట్టుకోలేకపోయారు. ‘ప్యాసా’కు భారత దేశంలో ఎప్పుడూ ఏమీ అవార్డులు రాలేదు.
ఈ సినిమా కథలో విజయ్‌కి జరిగినట్లుగానే, గురుదత్ మరణించిన సుమారు ఇరవై ఆరు సంవత్సరాల తరువాత అంటే 1980లలో విదేశాలలో ఈ సినిమా ప్రదర్శింపబడినప్పుడు మొట్టమొదట విశేషమైన స్పందన లభించింది. హెన్రీ మిసియోల్లో అనే ఫ్రెంచి వ్యక్తి గురుదత్ ప్రతిభను 1976లో ప్రప్రథమంగా గుర్తించారు. ఇతను ఫ్రాన్స్‌లో పెద్ద ఫిలిం విశ్లేషకుడు. అతనికి ఈ సినిమా ఎంత నచ్చిందంటే దీన్ని చూసి విశ్లేషిస్తూ ఫ్రెంచి భాషలో గొప్ప వ్యాసాలను రాసాడు. అలా ‘ప్యాసా’ ఫ్రెంచ్ సినిమా దిగ్గజాల దృష్టికి వచ్చింది. అప్పటి నుండి ఈ సినిమా ప్రతి ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడేది. ఈ సినిమా నేపథ్య సంగీతం కూడా విదేశీయులను ఆకట్టుకుంది. ఆలీవియర్ అసాయాస్ అనే ఫ్రెంచ్ ఫిలిం క్రిటీక్ ‘ప్యాసా’ను అతి గొప్ప సినిమాగా పేర్కొంటూ ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతంగా ప్రకటించారు. కవిత్వాన్ని దృశ్యంగా మార్చడంలో అద్భుతమైన ప్రతిభ గురుదత్ కనపరిచారని పొగిడారు.
గురుదత్ సినిమాలు తరువాత పారిస్‌లో ప్రతి సంవత్సరం ప్రదర్శింపబడేవి. ఈ సినిమాను తరువాత భారతీయులు డిజిటల్‌గా రీస్టోర్ ప్రక్రియను ఉపయోగించి నెగిటివ్ బాగు చేసుకున్నారు. పాడయిపోయిన ఒరిజినల్ ప్రింట్‌ని మళ్ళి కొత్తగా డిజిటల్ రిస్టోరింగ్ పద్దతిలో క్లీన్ చేసి మళ్ళీ 2015లో 75వ వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టీవల్‌కు ఈ సినిమా ప్రదర్శనకు పంపితే అక్కడ ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన క్లాసిక్స్‌తో పోటీపడి చివర్లో ప్రదర్శించిన పది ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఎన్నుకోబడింది ‘ప్యాసా.’
1957లో వచ్చిన ఈ చిత్రాన్ని గురుదత్ 1964లో మరణించిన తరువాత భారతీయులందరూ మర్చిపోయారు. 1980లలో మొదటి సారి విదేశీయులు ‘ప్యాసా’ ని ప్రపంచ గొప్ప చిత్రంగా గుర్తించడంతో గురుదత్‌ను భారతీయ సినిమా మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరం వచ్చింది. అప్పటి నుండి సినిమాను స్టడీ చేస్తున్న ప్రతి ఒక్కరూ ‘ప్యాసా’ను మాస్టర్ పీస్ అనడం మొదలెట్టారు. ఇప్పటికీ భారతీయుల కన్నా విదేశీయులు ఈ సినిమా గురించి ఎక్కువగా రాయడం నెట్‌లో చూడవచ్చు.
సినిమా లోతుల్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం అవసరం. ‘ప్యాసా’ ఒక కవి విషాద జీవితపు కథ. అయితే ఇందులో గురుదత్ మానవ స్వార్థాన్ని, భౌతికవాద ప్రపంచంలో ఇమడలేని ఒక వ్యక్తి సంఘర్షణను చూపించే ప్రయత్నం చేసారు. ప్రపంచం ఇలాగే ఉంటుంది, ఇందులోనే పోరాడాలి, ఇందులోనే విజయాన్ని సాధించాలి అనుకునే వర్గం ఒకటుంటుంది. వీరు ప్రపంచంలో ప్రతి ఎదురుదెబ్బను ఒక చాలెంజ్‌గా తీసుకుంటారు. విజయం వైపుకు ఎన్ని కష్టాలు వచ్చినా దూసుకుపోతారు. వీరినే ప్రపంచం విజేతలంటుంది. వీరికి కూడా కావలసింది తమ విజయమే. ఇలాంటి వారికి భిన్నంగా కొందరు విచిత్ర వ్యక్తులు ఉంటారు. వీరు విజయాని కన్నా, ఆ ప్రయాణంలోని సానుకూల భావజాలాన్ని ప్రేమిస్తారు. తమ మనసులోని భావాలను అదే స్థాయిలో అర్థం చేసుకుని స్వీకరించే తోడు కోసం పలవరిస్తారు. ఆ తోడుతో విజయాన్ని చేరుకోవాలనుకుంటారు. కాని ఇది మానవ స్వార్థం నడుమ అసాధ్యం. కార్ల్ మార్క్స్ థియరీ ప్రకారం కూడా “అవసరం, అవకాశం, ప్రాతిపదికన అమరే ఆర్థిక బంధాలు ఈ మానవ సంబంధాలు”. దీనికి భిన్నంగా మనసు, భావాలు, ప్రేమ, ఆదర్శాలు అంటూ అడుగులో అడుగు వేస్తూ నడవగలిగే సమూహం మానవులది మాత్రం కాదు.
కాని ఇలాంటి వాతావరణం కోసమే కొందరు జీవిస్తారు. చకోర పక్షిలా దేని కోసమో వెతుకుతూ ఉంటారు. వారు కోరుతున్న ప్రేమ, స్నేహం, అనుభూతి వరకే పరిమితం అని వాస్తవ ప్రపంచంలో తన స్వార్థాన్ని వీడి మనిషి మరొకరి చేయి ఆఖరిదాకా పట్టుకుని నడవలేడని వారికి అర్థం కాదు. కొంత వరకు మన అనుకున్న వ్యకులు కూడా జీవన ప్రయాణంలో వారి ప్రాధాన్యతల దిశగా జీవితాన్ని నడిపించుకుంటారని, ప్రాధాన్యతలు జీవితంలో ప్రతి స్థాయిలోనూ మారుతూ ఉంటాయని, ఆ మార్పుల ఆధారంగానే వారి అనుబంధం సాగుతుందని ఒప్పుకోలేని జీవులు ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండలేరు. వారిని ఎన్నో ప్రశ్నలు ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మనుషులు ఇలా ఊసరవెల్లులుగా ఎలా మారగలరు? ఆదర్శాలకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తులు సమాజంలో పై స్థానాలలో ఎలా ఉండగలరు? మనుషుల మధ్య డబ్బు ప్రభావంతో నిర్దేశించబడిన ఉన్నత స్థానంలోకి మనిషి చేరినా అక్కడ న్యాయం, మానవ సహృదయత బ్రతికి ఉంటాయా? అసలు మనిషిని అతని మనసుతో పాటు సమాజం ఎంచదెందుకు? మన ప్రేమలు, స్నేహాలు, ఆదర్శాలు, మోహాలు, ఇష్టాలు, వీటన్నికన్నా లాభ నష్టాలు, ఆర్థిక ఉన్నతి, పేరు ప్రతిష్ఠ పెద్దవి ఎలా అవుతాయి? ఎందుకు అవుతాయి? వ్యక్తి తన సౌలభ్యాన్ని, భౌతిక సుఖాన్ని మాత్రమే అన్ని మానవీయ శక్తులకన్నా, ఆదర్శాల కన్నా అత్యవసరమైన విషయంగా ఎందుకు పరిగణిస్తాడు? అలాంటప్పుడు బుద్ధిజీవి అయిన మనిషి జంతు ప్రపంచంలో ఒక జంతువుగానే మిగిలిపోతాడు కదా? మనసుకి, మానవత్వానికి ప్రాధాన్యత లేకుండా వ్యక్తుల్ని వరించే విజయాలను మానవులు గౌరవించడం జీవితంలో లొంగుబాటు కాదా?
మన చుట్టూ ఇలాంటి ప్రశ్నల మధ్య నలిగిపోతూ జీవించే వ్యక్తులను మనం చూస్తాం. సమాజంలో ఒక గుణం ఉంటుంది. తమతో కలవడానికి ఇష్టపడని వ్యక్తిని అతి లౌక్యంగా తనలోకి లాగేసుకునే శక్తి సమాజానికున్న బలం. కాని కొందరు మొండివారు ఆ ప్రవాహానికి ఎదురీదడానికి సిద్ధపడతారు తప్ప అందులో కలిసిపోవాలని అనుకోరు. ఇటువంటి సమాజంలో లభించే విజయం వారికి ఆనందం ఇవ్వదు. ఆ ప్రవాహంలో కలిసిపోవలసిన సమయం వస్తే ఆ విజయాలను, ఆ ప్రపంచాన్ని ఒదిలి ఒంటరిపోరాటానికి సిద్ధపడతారు తప్ప తల వంచరు. వీరి ప్రశ్నలకు సమాజం వద్ద జవాబులుండవు. అనవసరంగా సుఖమైన జీవితాన్ని వదులుకుని ముళ్ళబాట పట్టిన పిచ్చి వాళ్లవలే వీళ్ళు ఇతరులకు కనిపిస్తారు. వీరితో ఎవరూ నడవరు, కాని వీరిపై తలో రాయి వేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు. వీరి మేధస్సు, వీరి ప్రశ్నలు ఇతరుల సంకుచితమైన జీవితాలను ఎత్తిచూపుతూ ఉంటాయి. అందుకే వారిని చిత్రవధ చేసి మా దారి గొప్పదని చెప్పుకోవడానికి అందరూ ఏకమై ఇలాంటి వ్యక్తులను నాశనం చెయడానికి ముందుకు వస్తారు. వీరి విజయం మొత్తం సమాజపు ఓటమి అవుతుంది కాబట్టి వీరిని నాశనం చేసే దాకా సమాజం నిద్రించదు.
విషం ఇచ్చి సోక్రటిస్‌ని చంపించినా, క్రీస్తుని శిలువ వేసినా, ఆరిస్టాటిల్‌ని అంతం చేసినా, హెల్ ముత్ హుబెనర్ అనే పదిహేడు సంవత్సరాల బాలుడిని జర్మనీలో ఉరి తీసినా దానికి కారణం వీరు సమాజాన్ని ప్రశ్నించడమే.
‘ప్యాసా’ సినిమాను నిశితంగా పరిశీలిస్తే ఇలాంటి ప్రశ్నలే కనిపిస్తాయి. అయితే ఈ ప్రశ్నలను వేస్తున్నది ఒక విప్లవకారుడు, తత్వవేత్త లేదా ఒక సామాజిక కార్యకర్త కాదు. ఒక కవి. కేవలం సున్నిత మనస్కుడైన ఒక కవి. మనిషికి మనిషికి మధ్యన మనసు తప్ప మరో బంధం ఉండకూడదని, సమాజంలో మనుషుల మధ్య స్థాయి భేదాలుండకూడదని నమ్మిన ఒక రొమాంటిక్ కవి విజయ్. ఎన్ని సార్లు ‘ప్యాసా’ చూసినా ఇది ఒక పలాయనవాది కథ అని అనిపించదు. మన తెలుగు తేజాలు బాపు రమణలు కూడ ఒక సందర్భంలో ‘ప్యాసా’ సినిమాను విమర్శించారు. ‘ప్యాసా’ లో విజయ్ ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు ఆ విషాదాన్ని మోసుకొస్తున్నాడు? ఒక భ్రమరం మీద ఎవరో కాలు వేస్తే దానికి కోపం రావాలా? అసలు ఇదేం విషాదం? అంటూ ఒక వ్యాసాన్ని రాసారు.
ముస్లిం గుజ్జర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సాహిర్ చూసిన జీవితం అతనికి సమాజంలోని హిపోక్రసీని చాలా చిన్నతనంలో పరిచయం చేసింది. భూస్వామి అయిన తండ్రి అతని ఆస్తిని, బహు భార్యలను, పిల్లలను కూడా తన హక్కుగా చూసిన విధానం, దాని వలన జీవితాంతం పోరాడుతూ ఒంటరిగా నలిగిపోయిన అతని తల్లి, తండ్రి చేతి క్రింద బ్రతికిన వాళ్ళు, అప్పుడు దేశంలోని మత కలహాలు, దేశ విభజన ఇవన్నీ సాహిర్ ఆలోచనలకు ఒక రూపాన్నిచ్చాయి. మతం లోని మౌఢ్యాన్ని, ప్రతి అధికారాన్ని అహంకారాన్ని చిన్నప్పటి నుండే ప్రశ్నించే సాహిర్ కవిత్వంలో మానవ సమానత్వం కోసం తపన కనిపిస్తుంది. 1945లో ఆయన మదిలో మెదిలిని ప్రశ్నలకు రూపమే వారి ఉర్దూ కవితా సంకలనం, ‘తల్ఖియాన్’. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తోనూ, కమ్యునిజంతోనూ మమేకం అయిన కవి సాహిర్. అతని కమ్యునిస్ట్ భావజాలం కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేయాలని అనుకుంది. 1949లో దేశ విభజన అనంతరం సాహిర్ తాను పుట్టిన ప్రదేశాన్ని, పని చేస్తున్న లాహోర్‌ని వదిలి బొంబాయి చేరుకున్నారు.
సినిమాలలో ప్రవేశించబోయే ముందే సాహిర్ తన కవిత్వ సంకలనాల కారణంగా ఉర్దూలో ఒక గొప్ప కవిగా పేరు సంపాదించుకున్నారు. ‘పర్చాయియా’ అనే అతని దీర్ఘ కవిత అప్పటికే చాలా మందికి ఇష్టమయిన కవితగా ప్రశంసలు అందుకుంటుంది. ఈ పేరును గురుదత్ ‘ప్యాసా’ సినిమాలో విజయ్ పాత్ర ఫైలు పై రాయించి, తరువాత అదే పేరుతో అది పుస్తకంగా ప్రింట్ అయినట్లు చూపిస్తారు. సాహిర్ సమకాలీకులైన ఉర్దూ కవులు ఖుదా(దేవుడు), హుస్న్ (అందం) జాం (మధువు) గురించి ప్రేమ కవితలు రాస్తున్న సమయంలో కూడా సాహిర్ వీటికి భిన్నంగా స్త్రీ, సమాజం, వివక్ష, అంటూ ప్రశ్నించే కవితలను రాసేవారు. ఆయన ప్రేమ గీతాలు కూడా ఈ మూడు విషయాల చుట్టూ తిరుగుతూ ఉండేవి. మనసులో ఇంకిపోయిన సోషలిస్టిక్ భావజాలాన్ని ప్రేమగీతాలుగా కూడా మార్చగలిగిన కవి హిందీలో సాహిర్ అయితే తెలుగులో శ్రీశ్రీ. నా హృదయంలో నిదురించే చెలీ…శ్రీశ్రీ కమ్యునిజాన్ని స్తుతిస్తూ రాసిన సినీ గీతం మరి. అదే అక్కినేని గారి అభినయంతో పియనో మెట్లపై సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో ‘ఆరాధన’ సినిమాలో చిత్రించబడి ఘంటశాల గారి గొప్ప ప్రేమ గీతాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.
సాహిర్ తన కవిత్వంతో సమాజాన్ని సూటిగా ప్రశ్నించేవారు. మనుష్యుల మధ్య కుల, మత, వర్గ వైషమ్యాలు, ఆర్థిక సంబంధాలు, వీటన్నిటి మధ్య తొంగి చూసే మానవ స్వార్థాన్ని తన కలంతో దులిపేసేవారాయన. ఇంత కుళ్ళు మధ్య నేనెందుకు లొంగి ఉండాలనే తిరుగుబాటు ధోరణి అతని ప్రతి వాక్యంలో కనిపించేది. సమాజంలోని నటన, మోసం దగాలను చూసి ఒక రకమైన నిర్లక్ష్యం, హేళనతో ఆయన కవిత్వం సాగేది. గురుదత్ ‘బాజీ’ సినిమా పాటల కోసం సాహిర్ అతన్ని కలవడం ‘ప్యాసా’ సినిమాకు పడిన మొదటి పునాది. వీరి ఈ మేధాపరమైన కలయిక ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించడానికి కారణం అయింది.
గురుదత్ కూడా అప్పటి ఆర్థిక విధానాలు, సమజంలోని వైషమ్యాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. తనలోని రొమాంటిజంని సమాజంలోని భౌతికవాదం డామినేట్ చేయడం, మనిషిని మనిషిగా కాక అతను సాధించిన భౌతిక వనరుల ద్వారా గౌరవించడం, మనిషి మేధస్సుకు, ఆలోచనలకు సమాజంలో గౌరవం లేకపోవడం, ప్రేమ స్నేహం లాంటి సున్నితమైన విషయాలు కూడా భౌతిక సుఖాల మధ్య నలిగిపోవడం గురుదత్‌ని భాధించిన విషయాలు. అయితే తన ఆలోచనలు కథ రూపంగా రాసుకున్నాక అతనికి ఒక బలమైన కవి గొంతుక అవసరం అయింది. తాను సినిమాలలో దర్శకుడిగా ఎదుగుతున్న క్రమంలో అనుకోకుండా చదివిన సాహిర్ కవిత్వం అతన్ని చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా వేశ్యావాటికలను, అందులోని జీవితాలను చూపుతూ సాహిర్ తన ‘చక్లా’ కవితలో సంధించిన ప్రశ్నలు గురుదత్ మనసులో మరో రీతిలో ఉద్భవిస్తూనే ఉన్నాయి. అందుకే సాహిర్ కవిత్వాన్ని పూర్తిగా ఓన్ చేసుకుంటూ అతని ‘తహల్కియా’, ‘పర్చాయియాన్’ కవితలలోని పంక్తులను విజయ్ పాత్రకు ఆపాదించి అటు రొమాంటిక్, ప్యూరిటన్ కవిత్వ ధోరణులను సోషలిజంతో మేళవించి ‘ప్యాసా’ అనే అద్భుతాన్ని సృష్టించారు. ఇంత అద్భుతమైన భిన్న పార్శ్వాల ఐడియాలాజికల్ కలయిక మరే సినిమాలో మనకు కనిపించదు.
రొమాంటిక్ కవులు తార్కికత, మేధస్సు కన్నా ఊహలకు, భావోద్వేగాలకు, అభిరుచులకు జీవితంలో ప్రాధ్యాన్యత ఇస్తారు. వీరిలో భావోద్వేగ సున్నితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. గురుదత్ ఈ కోవకు చెందిన అర్టిస్టు.
ఎన్నో భాషలను నేర్చుకుని, స్వాతంత్ర్య పూర్వ పరిస్థితులలో పెరిగిన వీరిలో ఇంగ్లీషు భాష పై చాలా పట్టు ఉండేది. అప్పటి జీవన శైలికి దగ్గరగా ఆలోచించే యువ మేధావులలో ఒక రకమైన ప్యూరిటన్ తత్వం కూడా కనిపించేది. గురుదత్ జీవనంలో ఈ ప్యూరిటన్ తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు సింపుల్‌గా ఉంటూ సరళమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేవారు. ఈ కోవలోకి వచ్చే వ్యక్తులు సూటిగా సంభాషిస్తారు, డాంబికమైన ఆహర్యాన్ని, జీవితాన్ని అస్సలు ఇష్టపడేవారు కాదు. అందుకే మెటీరియలిజాన్ని అసహ్యించుకునేవారు. గురుదత్ సినిమాలలో ప్రతి కోణంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇంగ్లీషు సాహిత్యంలోని ప్యూరిటన్ కవులపై బైబిల్ ప్రభావం ఉండేది. గురుదత్ ‘ప్యాసా’ సినిమాలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ‘ప్యాసా’లో రెండు ముఖ్యమైన పాటల చిత్రీకరణలో శిలువ మీద ఏసు క్రీస్తు చేతులు చాచి ఉన్నట్లు విజయ్ నిలుచుని ఉంటాడు. మరో సీన్‌లో విజయ్ మరణ వార్తను రెహ్మాన్ వినిపిస్తున్నప్పుడు టైం మాగజీన్ చదువుతూ ఉంటుంది మాలా సిన్హా. ఆ టైం మాగజిన్ అట్ట మీద కూడా శిలువ బొమ్మ ఉంటుంది. మనిషిని శిలువ చేస్తున్న మానవ సమాజాన్ని ప్రశ్నించే దిశగా చూపించిన సింబాలిజం ఇది. నిజానికి ఇది సినిమా కోసం తయారు చేసిన పుస్తకం కాదు. లైఫ్ మాగజిన్ క్రిస్టియానిటీ మీద 26 డిసెంబర్ 1955న నిజంగానే ఈ కవర్‌తో పత్రికను ప్రింట్ చేసింది. గురుదత్ మనసులో ఆ బొమ్మ ఎలాంటి ముద్ర వేసిందో కాని రెండు సంవత్సరాల తరువాత తన సినిమా ద్వారా ఆ మాగజిన్ అట్టపై శిలువ చేయబడిన క్రీస్తు బొమ్మలోని భావాన్ని ‘ప్యాసా’ పాత్రలకు ఆపాదించారు. వారి మేధలో నిరంతరం ఉధ్బవించే సృజనాత్మక పోరాటానికి ఈ సంఘటనను ఒక ఉదాహరణగా కూడా చూడాలి. ‘ప్యాసా’ లో ఈ క్రిస్టీయన్ ఇమేజరీని చూసి తాను చాలా అశ్చర్యపోయానని హెన్రీ మిసియోల్లో అన్న ఫ్రెంచ్ ఫిలిం క్రిటిక్ Guru Dutt Anthologie du cinema L’Avant Scene, Tome IX అని పారిస్ నుండి వచ్చే ఓ ప్రెంచ్ పత్రిక లో 1976 లో ఒక వ్యాసం రాస్తారు. మీనా, ఘోష్ల మధ్య నడిచే ఈ సన్నివేశం ప్రపంచ సినిమాని చూసే వారికి ‘Citizen kane’ సినిమాలో భార్యా భర్తల బ్రేక్‌ఫాస్ట్ సీన్‌ను గుర్తుకు తెస్తుంది కూడా. అలాగే ‘యే దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై” అన్న పాటను చూడండి. దీన్ని For what shall it profit a man, if he shall gain the whole world and lose his own soul. (The Gospel According to Mark. 8:36) అనే బైబిల్ లోని వాక్యానికి అనువాదం అని కూడా చెప్పవచ్చు. అందుకే విదేశీయులు ఈ సినిమాకు అంతగా కనెక్ట్ అవ్వగలిగారు. కాని గమనిస్తే ఈ సినిమా తీసింది రొమాంటిజాన్ని ప్రతిపాదించే ఒక హిందూ కళాకారుడు, పాట రాసింది ముస్లిం మతానికి చెందిన ఒక సోషలిస్టు. క్రీస్తుని సింబాలికల్‌గా వాడుకున్నాడు గురుదత్. అన్ని మతాల కలయిక సమాజంపై తిరుగుబాటు చేసిన విజయ్ పాత్రలో కనిపిస్తుంది. విజయ్ పాత్రకు ఇంటి పేరు ఎక్కడా సూచించకుండా వదిలేయడం గురుదత్ లోని మానవతావాదాన్ని చూపే మరో ఉదాహరణ.
ప్లేటో అనే గ్రీకు తత్వవేత్త గురించి మనకు తెలుసు. అతను కవిత్వాన్ని ఇష్టపడేవాడు కాదు. కవిత్వం అంటే అబద్దం, కల్పనాధారం, అనైతికం అని వాదించేవాడు. కవిత్వం కన్నా తత్వశాస్త్రం గొప్పది అన్నది ప్లేటో వాదన. ఫిలాసఫర్ నిజాన్ని అన్వేషిస్తాడని, ఒక్క తత్వశాస్త్రం మాత్రమే కల్పనాధారం కాకుండా, నిజాన్ని శోధించే పని చేస్తుందని ప్లేటో స్పష్టంగా చెప్పేవాడు. మానవ భావోద్వేగాల మీద మాత్రమే ప్రభావం చూపే కవిత్వం మనిషి ఆత్మను కదిలించలేదన్నది అతని నమ్మకం. ఆరిస్టాటిల్ అనే మరో తత్వవేత్త మాత్రం మనిషి భావోద్వేగాలతో పాటు అతనిలోని తార్కికతను కూడా ఉత్తేజపరచగల లక్షణం కవిత్వంలో ఉంటుంది అని నమ్మేవాడు. వీరిద్దరినీ అధ్యయనం చేసిన ఆధునిక విమర్శకులు, తత్వశాస్త్ర పండితులు, కళ దాని అధికారిక, అంతర్గత లక్షణాల వరకు మాత్రమే పరిమితం కాకుండా మనిషి జీవిస్తున్న సామాజిక వైఖరులను, మానవ జీవితాన్ని నిర్దేశించ గల సత్యాన్వేషణ కొరకు మానవ ఆలోచనను ప్రభావితం చేయాలని ప్రకటించారు.
గురుదత్, సాహిర్ లుధియాన్వి ఇద్దరూ కూడా తమ కళ పట్ల ఇటువంటి ఆధునిక ఆలోచననే కలిగి ఉన్న కళాకారులు. అందుకే వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. గురుదత్ సత్యాన్వేషణ అతన్ని ట్రాజెడీ వైపుకు లాక్కు వెళ్ళింది, ఈ సమాజంలో తనకు స్థానం ఉండదని నమ్మి సమాజాన్ని కాదని వెళ్ళిపోవడం వైపుకు అతని ఆలోచన అతన్ని నడిపించింది. ‘ప్యాసా’ లో విజయ్ చివరకు ఎక్కడికో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ మనుషులు, ఈ సమాజం నాకు వద్దని అతని అన్వేషణ ముందుకు సాగుతుంది. అది ఎక్కడికో దర్శకుడిగా గురుదత్ చెప్పలేడు. కాని విజయ్ మాత్రం ఈ సమాజంలో ఉండలేడన్నది స్పష్టం అవుతుంది. ఈ సమాజం తనకు వద్దని విజయ్ తన తిరుగుబాటును చాటుకున్నాడు. అది మృత్యువును కౌగలించుకోవడం కావచ్చు. అస్తమిస్తున్న సూర్యుని వైపుకి ప్రయాణం కావచ్చు. అతనిలోని రొమాంటీక్ ప్యూరిటన్ కవి ఎన్నుకున్న మార్గం సమాజాన్ని త్యజించడం. సాహిర్ సమాజాన్ని హేళన చేస్తూ దాన్ని తన వ్యంగ్యాస్త్రాలతో ఇబ్బంది పెడుతూ కవిగా తన తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ ఉండిపోతాడు. ఈ కళాకారులిద్దరికీ సమాజం పట్ల నమ్మకం లేదు, గౌరవం లేదు. ఒకరు రొమాంటిక్, ప్యూరిటన్ అయితే మరొకరు ఫక్తు సోషలిస్టు. తమ జీవన ప్రయాణంలో ఈ ఇద్దరు కళాకారులు కొంత సేపు తమ తిరుగుబాటును కలిసి ఒక గొంతుకగా వినిపించిన అద్భుతం ‘ప్యాసా’. ఇందులో కేవలం ప్లేటో విమర్శించిన కవిత్వం కాదు, ఆ స్థాయి దాటి వ్యక్తిలోని తార్కికతను భావోద్వేగాలతో పాటు తట్టి లేపగలిగే సత్తా ఉన్న కవిత్వం ఉంది. అది సాహిర్ అక్షరాలతో కూర్చితే, గురుదత్ దృశ్యాలలో బంధించాడు. అందుకే ‘ప్యాసా’ ఒక గొప్ప కావ్యం, ఒక తత్వవేత్త, కవి, సామాజిక శాస్త్రవేత్త, సోషలిస్టు కలిసికట్టుగా చలన చిత్రాలలో రాసుకున్న గ్రంథం.
ఒక సంగీత కళాకారుడు తాను పాట చిత్రిస్తున్న పాత్ర ఆత్మను, ఆ పాత్ర మనసులోని భావాన్ని సంగీతం అనే మాధ్యమంతో సంభాషిస్తూ, ప్రేక్షకుల వద్దకు తీసుకురావాలి. సినిమా దర్శకుడి ఒకానొక సీన్‌లో ఒక పాట ద్వారా ఏం చెప్పాలనుకుంటూన్నారో సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆ పాటను రచించిన కవి మనను, దర్శకుని ఆలోచన ప్రేక్షకులకు చేరుతాయి. ఇది తెలుసు కాబట్టే సాహిర్ తన కవిత్వాన్ని అర్థం చేసుకుని, తాను వాడిన పదాల లోతును ఆస్వాదించగలిగే సంగీత దర్శకులనే తన పాటల కోసం కోరుకునే వారట. అలాగే సంగీత దర్శకులు ట్యూన్ కట్టిన పాటలకు అనుకూలంగా పాటను రాయడమంటే కవి పరిధిని తగ్గించడం అని ఆయన నమ్మేవారు. ‘ప్యాసా’ సినిమాకు సాహిర్ ముందు రాసుకున్న కవితలకు ట్యూన్ కట్టారు సంగీత దర్శలుకు ఎస్.డి. బర్మన్. బెంగాల్ సాంప్రదాయ సంగీతానికి, హిందీ సినిమాకు మధ్యన అతను వారధిగా కొన్ని సంవత్సరాలు నిలిచారని అని చెప్పవచ్చు. ఈయనకు ఉర్దూ రాదు. సాహిర్ కవిత్వం మాత్రం పూర్తిగా ఉర్దూలో నడుస్తుంది. సాహిర్ కవితా సంకనలం ‘తెహల్కియా’ లోని కొన్ని కవితలను యథాతథంగా తన సినిమాలో పెట్టూకోవాలన్నది గురుదత్ కోరిక. సినిమా చాలా వరకు కలకత్తా నేపథ్యంలో నడుస్తుంది. కాబట్టి ఇక్కడ బర్మన్ ఒక జుగల్బందీని చూపిస్తారు. సాహిర్ పుస్తకం నుండి తీసుకున్న కవితలకు ఏ వాద్య పరికరాలు లేకుండా యథాతథంగా గానం చేయడానికి సరిపోయే ట్యూన్ లను ఇచ్చారు. వీటికి మొహమ్మద్ రఫీ పూర్తి న్యాయం చేసారు. “జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై” అంటూ సాహిర్ అంత గొప్ప భారతదేశమా అది ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే…. ఆ కవిత్వ బలం వాధ్య పరికరాల మధ్య తగ్గకుండా కొద్దిగా ముషాయిరా పద్దతికి దగ్గరగా సంగీతాన్ని ఈ పాటకు అందించారు ఎస్.డి. బర్మన్. బెంగాల్ ప్రాంతపు సంగీతాన్ని కూడా ఇక్కడకు తీసుకురావడం ఆయన మర్చిపోలేదు. “జానే వొ కైసే” అన్న పాట ట్యూన్ వింటే వారి ఈ జుగల్బందీ అర్థం అవుతుంది.
ఈ పాటను ఎస్.డీ బర్మన్ కావాలని, కోరి హేమంత్ కుమార్‌తో పాడించారు. గురుదత్‌కి మిగతా పాటలన్నీ రఫీ పాడారు. ఒక హీరోకి ఇద్దరు నేపథ్య గాయకులు పాడడం అప్పట్లో జరిగేది కాదు. గురుదత్ దీన్ని ఇష్టపడకపోయినా ఎస్.డి. బర్మన్ కావాలని ఈ ప్రయోగం చేసారు. ఈ పాటలో ప్రతి చరణంలో చివరి వాక్యాన్ని వింటే “పంజాబ సింధు గుజరాత మరాఠా” అంటూ మనం పాడుకునే మన జాతీయ గీతం గుర్తుకు వస్తుంది. ఆ ట్యూన్‌ను యథాతథంగా వాడుకున్నారు ఎస్.డి. బర్మన్. జాతీయ గీతంలోని ఒక వాక్యం ట్యూన్‌ని ఇలా సినీ గీతంతో జుగల్‌బందీ చేయడం అయనకే చెల్లింది. ఒక రకంగా ఈ ఒక్క పాటతో పూర్తి ఉర్దూ సాంప్రదాయపు సంగీతాన్ని పోలి ఉండవలసిన మిగతా పాటలకు ధీటుగా తమ బెంగాలీ ప్రాంతపు ట్యూన్‌ని వినిపిస్తారు బర్మన్. అయితే సన్నివేశం కలకత్తాలోని ఒక పెద్ద పబ్లిషర్ ఇంట కవుల మధ్య జరుగుతుంది కాబట్టి ఈ పాట ఆ సీన్‌లో సింక్ అయిపోతుంది. అంతే కాదు అప్పటి దాకా కోట్ పేంట్‌తో కనిపించే గురుదత్ ఈ పాట కోసం పూర్తి బెంగాలీ వస్తధారణ, పంచ, లాల్చి, షాల్‌తో కనిపిస్తారు. ఈ వస్త్రధారణ విజయ్ మరణించాడని అందరూ ప్రకటించిన తరువాత బ్రతికి ఉన్న విజయ్‌లో మళ్ళీ చూస్తాం. ఇలా ఒక్క పాత్రలో రెండు కోణాలను ఇంత తాత్వికంగా చూపించిన మరో సినిమా మనకు దొరకదేమో.
ఇక ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక పెద్ద ఎసెట్. గురుదత్ తన సినిమాలో ప్రతి సీన్‌ని కథను నడపడానికి అంటే కంటిన్యుటీ కోసం వాడుకునేవారు. గురుదత్ సినిమాలో పాటలు కథకు కొనసాగింపుగా వస్తాయి తప్ప, ఇక పాట వచ్చింది మళ్ళీ కథ మొదలయ్యాక వస్తాం అని హాలు లోంచి ప్రేక్షకులు వెళ్ళిపోయే అవకాశం దొరకదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ప్రతి పాత్రను ప్రవేశపెట్టేటప్పుడు ఆ పాత్ర మనస్థితిని ఆ సీన్ వాతావరణాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిర్ధారిస్తుంది. ‘ప్యాసా’ లో ఒకో సీన్‌ని స్టడీ చేస్తుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ లోని ఎమోషన్‌ని పండించడానికి ఎంత ఉపయోగపడిందో అర్థం అవుతుంది. ఇది ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ఒక సీన్ ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చూసి మళ్ళీ సౌండ్ మ్యూట్ చేసి అదే సీన్ చూస్తే చాలా సులువుగా ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఎలివేషన్ అర్థం అవుతుంది.
విజయ్ ప్రియురాలు మీనా కనిపించిన ప్రతి సారి ఒకే ట్యూన్ ప్లే ఆవుతుంది. ఇది మౌత్ ఆర్గన్ మీద ఎస్.డి. బర్మన్ కుమారుడు ఆర్.డి. బర్మన్ ప్లే చేసారట. ఈ సినిమా అప్పటికి అతనికి పదిహేడేళ్ళు. ఆ ట్యూన్ కూడా ఆయనే కట్టుకున్నరట. అప్పుడే అతనితో ఒక సినిమా చేస్తానని గురుదత్ అతనికి మాట ఇచ్చారు. ఇది మరో అద్యాయంలో చెప్పుకుందాం. “సర్ జో తెరా చక్రాయే” అన్న పాట ట్యూన్ కూడా ఆర్.డి. కట్టినదే అంటారు. హారీ బ్లాక్ అనే హాలీవుడ్ సినిమా నుండి తీసుకున్న ట్యూన్ ఇది. ఈ సినిమాను హారీ బ్లాక్ ప్రొడ్యూసర్ చూసి కూడా ఈ పాట తన సినిమా ట్యూన్ నుండి తీసుకున్నది అని కనుక్కోలేకపోయారట. అంతగా భారతీయం చేసేసారు ఆర్.డి. ఈ ట్యూన్‌ని. ఈ పాట విజయ్ స్నేహితుడు అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి పాడతాడు. సత్తార్ రోడ్డు పై మాలిష్ చేసుకుంటూ బ్రతికే వ్యక్తి. మొదట ‘ప్యాసా’ కథ రాసినప్పుడు గురుదత్ సత్తార్ పాత్రను రాసుకోలేదు. ఈ పాత్ర వేసిన జానీ వాకర్ గురుదత్ మంచి మిత్రులు. ముందు అతన్ని విజయ్ స్నేహితుడు శ్యాం పాత్రకు తీసుకున్నారు గురుదత్. అయితే ఆ పాత్ర లో కావల్సిన విలనిజాన్ని జానీ వాకర్‌లో ప్రజలు చూడలేరని అతనికి అనిపించి, కొన్ని సీన్లు జాని వాకర్ పై షూట్ చేసాక ఆ పాత్ర అతనికి నప్పదని అనిపించి, గురుదత్ శ్యాం గా మరో నటుడిని తీసుకుని, జాని వాకర్ కోసం ప్రత్యేకంగా సృష్టించిన మరో పాత్ర సత్తార్. అలా అనుకోకుండా వచ్చిన ఈ మాలిష్ వాని పాత్ర జానీ వాకర్ సినీ జీవితంలోనే ఒక గొప్ప పాత్ర అయింది.
ఈ పాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టీ మళ్ళీ సాహిర్‌ని తలచుకోవాలి. ఒక మాలిష్ చేస్తున్న వ్యక్తికి పాట రాయాలి. అతను ఈ సినిమాలో కమెడీయన్. మరొకరయితే చాలా చిన్న పదాలతో లైట్ గా హాస్యాన్ని మేళవించి పాట రాస్తారు. సాహిర్ అదే చేసారు కాని తన సామ్యవాద భావాలను జోడించి ఆ పాటను హాస్యంతో పాటు ఒక గాంభీర్యాన్ని కలగలిపి రాస్తారు … గమనించండి…
“నౌకర్ హో యా మాలిక్, లీడర్ హో యా పబ్లిక్, అపనె ఆగే సభీ ఝుకే హై క్యా రాజా క్యా సైనిక్” (నౌఖరు కావచ్చు, యజమాని కావచ్చు, లీడర్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, నా ముందు రాజైనా ప్రజలైనా తల వంచవలసిందే). ఇది సాహిర్ శైలి. కుల వృత్తులు చేసుకునే వారి సత్తా చూపుతూ, శ్రమను నమ్ముకున్న వారి ముందు ఎవరైనా తల వంచవలసిందే అని ఎంత ఆత్మవిశ్వాసంతో ఒక మాలిష్ వానితో చెప్పిస్తారో. ఈ వాక్యాలు అక్కడ అవసరమా…. సాహిర్ రాస్తే ఏ వాక్యమైనా ఆలోచనను, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించేవిగానే ఉంటాయి. సమాజం చేతిలో నలిగిపోయిన ఏ వ్యక్తిని కూడా సాహిర్ తన కలం ద్వారా విక్టింగా చూపరు, అతను వేసే ప్రశ్నలు వాడిగా సూటిగా ఉంటూ ఆ పాత్ర అస్థిత్వానికి జీవం తీసుకొస్తాయి. ‘ప్యాసా’ లో అన్ని పాటలలో సాహిర్ మార్కు కనిపిస్తుంది. అత్యంత విషాదంలో కూడా ఒక తిరుగుబాటు కనిపిస్తుంది. ‘ప్యాసా’ సినిమాలో విజయ్ అనే కవి చేసిన వ్యక్తిగత తిరుగుబాటు సామాజికంగా రూపు మారడమే ఈ సినిమాను అమరం చేసింది.
ఈ సినిమాకు ముందు దిలీప్ కుమార్‌ని తీసుకోవాలనుకున్నారు గురుదత్. కాని ఆయన సినిమా ఒప్పుకుని మొదటి రోజు షూట్‌కి రాలేదని, సినిమా తిరస్కరించారని కొందరు అంటారు. దిలీప్ కుమార్ ఒక ఇంటర్యూలో ఈ పాత్ర దేవదాసుకి చాలా దగ్గరగా ఉంది అని, ట్రాజెడి పాత్రలలో లీనమయి నటించడం వలన తనలో చేరిన డిప్రెషన్‌ను తగ్గించుకోవడానికి కొన్ని రోజులు ట్రాజెడి పాత్రలకు దూరంగా ఉండమని డాక్టర్లు సూచించినందువలన ఈ సినిమా చేయలేకపోయానని చెప్పారు. దేవ్ ఆనద్‌నూ అడిగితే తాను బిజీగా వున్నానని, తన ఇమేజీకి సరిపోదని దేవ్ ఆనంద్ తిరస్కరించారు. అదే సమయానికి గురుదత్ దే మరో సినిమా సీఐడీలో కూడా దేవ్ పనిచేస్తున్నాడు. చివరకు ఆ పాత్ర తానే చేయాలను గురుదత్ నిశ్చయించుకున్నారు. ఇక మొదట హీరోయిన్లుగా మధుబాల, నర్గిస్ లను తీసుకోవాలని గురుదత్ అనుకున్నారట. కాని చివరకు మాలా సిన్హా, వహీదా రెహ్మాన్ లకు ఈ సినిమా దక్కింది.
సినిమాలో గురుదత్ సోదరుడి పాత్రలో మెహమూద్ కనిపిస్తారు. మెహమూద్ గురుదత్ కన్నా వయసులో చిన్న కాని ఈ సినిమాలో అన్న పాత్రను పోషించారు. జ్ఞాన్ ముఖర్జీ దగ్గర గురుదత్‌కి మెహమూద్‌కి గతంలో జరిగిన పరిచయం వలన గురుదత్ ఈ పాత్రకి మెహమూద్‌ని ఎన్నుకోవడం జరిగింది.
సినిమా చాలా ట్రాజిక్ నోట్‌తో సాగుతుందని. అస్సలు అహ్లాదం కలిగించే సీన్ ఏమీ లేదని డిస్ట్రిబ్యూటర్లు అన్నప్పుడు గురుదత్ డ్రీం సీక్వెన్స్ చేర్చి “హమ్ ఆప్ కి ఆంఖో మే” అన్న పాటను జోడించారు. ఈ పాటను సాహిర్ చాలా కొత్త పద్ధతిలో రాసారు. పరిశీలించి చూడండి ఇది కూడా సాహిర్ మార్క్సిస్ట్ ఆలోచనకి కొనసాగింపుగా కనిపిస్తుంది. ప్రశ్న జవాబు పద్దతిలో సాగే ఈ పాటలో విజయ్, మీనా ఇద్దరి వ్యక్తిత్వాలు ప్రతిబింబిస్తాయి. దీన్ని రొమాంటిక్ పాటగా మలచడం గురుదత్ ప్రతిభకు చిహ్నం అయితే రొమాంటిక్ పాట అనిపించేలా మార్క్సిస్ట్ భావజాలాన్ని గేయరూపంలో రాయడం సాహిర్ గొప్పతనం. ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించే ఒక బూర్జువా ఇక్కడ స్త్రీగా జవాబు చెబుతుంటే ఆమెను పూర్తిగా నమ్మి తనను తాను సమర్పించుకునే పీడీతుని పాత్రలో విజయ్ ప్రశ్నలు వేస్తాడు. “హం ఆప్కె కద్మో పర్ గిర్ జాయెగె గష్ ఖాకర్” అంటాడు విజయ్, “నీ కాళ్ళపై పడిపోతాను నీ మాయలో” అంటే బదులుగా “ఉస్ పర్ భీ న హమ్ అప్నీ ఆంచల్ కీ హవా దే తో” అంటుంది మీనా. అయినా నేను నా కోంగుతో నీకు గాలి విసరను అప్పుడు ఏం చేస్తావ్” అన్నది ఈ వాక్యం అర్థం. విజయ్‌తో ఆడీ పాడి తన అహాన్ని తృప్తి పరుచుకుంటున్న ఆమె అతని కోసం ఏమీ చేయడానికి సిద్ధపడదు. ప్రేమకోసం తపించి పోయే ప్రియుడితో ఇంత నిర్దయగా ఒక స్త్రీ ఆడుకోవడం సినిమాలోని కథకు ఆ పాత్రలకు సరిపోతుంది. కాని ఈ పాటలోని ప్రతి వాక్యాన్ని తీసుకుంటే ఇది ఒక జంట మధ్య జరుగుతున్న సంభాషణా… లేదా ఒక రెండు వర్గపు ప్రతినిధుల మధ్య జరుగుతున్న సంభాషణా అన్నది అర్థం కాదు. గురుదత్ ఈ పాతను చిత్రించిన మాయలోనుంచి కాకుండా కేవలం సాహిర్ గీతంలా వింటే ఈ పాటలో ఎన్నో అర్ధాలు వినిపిస్తాయి. మరో కోణంలో చూస్తే స్త్రీ పురుషుల మనస్తత్వాలను అర్ధం చేసుకుని, యువకుదు ఎంతగా యువతికి లొంగిపోతే ఆ యువతి ఎంతగా అతడిని ఏడ్పిస్తుందో, ఒక రొమాంటిక్ ధోరణిలో చిలిపిగా రచించినట్టు అనిపిస్తుంది. సాధారణంగా మన సినిమాల్లో రొమాంటిక్ పాటల్లో, హీరో బ్రతిమిలాడతాడు, నాయిక ఒప్పుకోదు, ఆఖరికి హీరో కోపం నటిస్తాడు, నాయిక వొప్పుకుంటుంది. అలాంటి పాటలకు భిన్నంగా చివరివరకూ ఇద్దరి స్వభావాలనూ మార్చకుండా చక్కగా రచించాడు సాహిర్. అంతేకాదు, ప్రేమలో పురుషుడెప్పుడూ స్త్రీని ఉన్నతంగా ఊహిస్తాడు. అందుకే పాట చిత్రీకరణలో నాయిక పైనుంచి మెట్లుదిగుతుంది. హీరో క్రిందనిలబడి నాయికవైపు దేవతను చూస్తున్నట్టు చూస్తూంటాడు.
ఈ సినిమా పాటలన్ని కూడా మంచి సాహిత్యానికి సంకేతాలు. విజయ్ మరణం గురించి గులాబో కి సత్తార్ చెప్పిన తరువాత దుఖంతో గులాబో ఒక పాట పాడుతుంది. సాహిర్ రాసిన ఈ గీతాన్ని గీతా దత్ చాలా గొప్పగా గానం చేశారు. “రుత్ ఫిరె పర్ దిన్ హమారే ఫీరే నా” అన్న విషాద గీతం గీతా దత్ గొంతులో అద్భుతంగా పలికింది. సినిమా ప్రివ్యూ చూసినప్పుడూ వహీదా రెహ్మాన్‌కి ఈ సీన్ నచ్చలేదట. విజయ్ మరణం కబురు విని గులాబో పాట పాడడం ఏంటీ అని ప్రశ్నించిందట. టీం లోని సభ్యులంతా ఈ పాట ఉండాలని అనుకోవడంతో గురుదత్ ఈ పాటను ముందు ఉంచేసినా థియేటర్‌లో జనానికి ఈ పాట నచ్చలేదనిపించి దాన్ని తొలగించారట. దీన్ని వహీదా రెహ్మన్, నస్రీన్ మున్నీ కబీర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. CONVERSATIONS WITH WAHEEDA REHMAN అనే పుస్తకంలో ఈ పాట ప్రసక్తి వస్తుంది. ఏమైనా వహీదా రెహ్మాన్ ప్రభావం గురుదత్‌పై అప్పటి నుండే కొంత ఉండిందన్న విషయానికి సూచనగా ఈ సంఘటనను తీసుకోవచ్చు ఏమో. ‘ప్యాసా’ సినిమా ఆడియో రికార్డు రిలీజ్ చేసేటప్పుడు ఈ పాటను యథాతథంగా ఉంచడం జరిగినందువలన ఈ పాట ఇప్పుడు దొరుకుతుంది. గీతా దత్ ప్రతిభకు నిదర్శనంగా ఆమె అభిమానులకు అది అందుబాటులో ఉంది.
‘ప్యాసా’ లాంటి సినిమాను గురుదత్ కళ్లతో చూసి దానికి రూపం ఇచ్చిన మరో వ్యక్తి వీ.కే. మూర్తి. సినిమటోగ్రఫీ విభాగంలో దాదా సాహెబ్ పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయ సినిమాటొగ్రఫర్ వీ.కే. మూర్తి. గురుదత్ టీం లోని వ్యక్తిగా ఆయన సృష్టించిన అద్బుతమైన చిత్రాల వెనుక మూర్తి నమ్మిన ఒక సిద్ధాంతం ఉంది. డైరెక్టర్ మెదడులో కదలాడే కథా రూపాన్ని అర్థం చేసుకుని ప్రేక్షకుల కోసం దాన్ని తెరపై సృష్టించడం సినిమాటోగ్రఫర్ పని అని నమ్మిన వ్యక్తి ఆయన. ఈయన శిష్యరికంలో ఇదే సూత్రాన్ని పాటించిన గోవింద్ నిహలాని లాంటి తరువాతి తరం సినిమాటోగ్రఫర్లు భారతదేశపు ప్రప్రథమ సినిమా స్కోప్ ఫోటోగ్రఫర్‌గా వీరిని గౌరవిస్తారు. ‘ప్యాసా’ సినిమాలో పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులకు చేర్చడంలో వీ.కే. మూర్తి కెమెరా పనితనం అద్బుతంగా పని చేసింది. మూర్తి ఈ సినిమాలో ఉపయోగించిన క్లోజ్ అప్ షాట్లు గురుదత్ షాట్లుగా తరువాత ప్రచారం పొందాయి. కథ మొత్తం క్లోజ్ అప్ షాట్లలో నడిపించడానికి దర్శకుడిని గొప్ప పనితనం ఉన్న కెమెరామేన్ కావాలి. అందుకే ‘ప్యాసా’ సినిమాను మూర్తి లేకుండా ఊహించలేం. గురుదత్ మూర్తికి ఒక మాట ఎప్పుడూ చెప్పేవారట. నటుడి కళ్ళు సమస్త విషయాలను పలకాలి. ప్రేక్షకుల కళ్లతో అవి డైరెక్టుగా సంభాషించాలి. నటుడి కళ్ళలో భావాలను పట్టుకుని ఆ దృశ్య భాషను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడం, మాటలతో చెప్పలేనివి, చెప్పటం సాధ్యం కాని భావోద్వేగాలను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చేయగలగడమే సినిమాటోగ్రఫీ. ఆ పని సరిగ్గా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకుల మనసులలోకి వెళ్ళగలుగుతుంది. అంతటి భాద్యత సినిమాటోగ్రాఫర్‌ది. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు వీ.కే. మూర్తి. ‘ప్యాసా’ సినిమాలో చిత్రించిన షాట్లలో పాత్రల కళ్లను మూర్తి ఫోకస్ చేసిన విధానం గమనిస్తే ఈ కథకు వారి సినిమాటోగ్రఫీ ఎంతగా ప్రాణం పోసిందో అర్థం అవుతుంది. మాటలు లేని ఎన్నో సీన్లలో వీ.కే. మూర్తి కర్త కర్మ క్రియ అయి పాత్రలను తన కెమెరా లోంచి చూపిస్తారు. విజయ్ ఒంటరిగా వీధులలో నడుచుకుంటూ వెళ్ళడం, గదిలో వివిధ సందర్భాలలో ఎగురుతున్న పేపర్లు గాలికి కొట్టుకుంటున్న కిటికీలు, వీటీ ద్వారా చాలా విషయాలను వీ.కే. మూర్తి తన కెమెరాతో ప్రేక్షకుల వద్దకు చేరుస్తారు.
వీ.కే. మూర్తి సినిమాటోగ్రఫీని చైనీస్ అమెరికన్ జేమ్స్ వాంగ్ హొవె అనే ప్రఖ్యాత సినిమాటోగ్రఫర్‌తో పోలుస్తారు నస్రీన్ మున్నీ కబీర్. డీప్ ఫోకస్ సినిమాటోగ్రఫీని మొట్టమొదట ప్రపంచ సినిమాలో ఉపయోగించిన వ్యక్తి ఇతను. సినిమా ఫ్రేమ్‌లో దూరాన ఉన్న వస్తువులు కూడా దూరంగా ఉంటూనే స్పష్టంగా కనిపిస్తూ ఉండడం వీరి సినిమాలలోని ప్రత్యేకత. ‘సిటిజెన్ కేన్’ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన గ్రెగ్ టోలండ్ కన్నా పది సంవత్సరాల ముందు ఈ ప్రక్రియను ఆయన వాడారు. ఆ శైలిని పట్టుకుని మరి కొంత ప్రయోగాత్మకంగా సినిమాటోగ్రఫీని ‘ప్యాసా’ సినిమాకు అందిచ్చారు మూర్తి. ‘సిటిజెన్ కేన్’ అనే ప్రపంచ ప్రఖ్యాత సినిమాను తీసిన వారు ఆర్సన్ వెల్స్. గురుదత్ సినిమాలపై వీరి ప్రభావం చాలా ఉంది. ‘ప్యాసా’ కన్నా తరువాత వచ్చిన ‘కాగజ్ కే ఫూల్’ లో చాలా షాట్లలో ఆర్సన్ వెల్స్ కనిపిస్తారు. అందుకే గురుదత్‌ని భారతీయ ఆర్సన్ వెల్స్ అని కూడా విశ్లేషకులు అంటారు. గురుదత్ శైలిని అర్థం చేసుకున్న వీ.కే. మూర్తి లో కీ లైటింగ్‌తో, వెలుగు నీడల మిశ్రమంతో పాత్రల ముఖాలపై కెమెరాను ఎలా ప్రయోగించేవారంటే వారి ముఖంలోని ప్రతి భాగం, చర్మం పై పడే ప్రతి ముడత కూడా ప్రేక్షకులతో సంభాషిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ‘ప్యాసా’ సినిమా చూడండి. గురుదత్ నుదిటి పై పడే ఆ ముడతలతో ఎన్ని విషయాలు చెప్పిస్తారో వీ.కే. మూర్తి. వహీదా ముఖంలో ప్రస్ఫుటమయ్యే భావాలు గమనించండి. మాలా సిన్‌హా కళ్ళల్లో మెదిలే మనోభావాలను చదవండి. రెహెమాన్ వదనంలో ప్రతిఫలించే విభిన్నమయిన మూడ్స్ చూడండి. ఆజ్ సజన్ పాట చిత్రీకరణలో కెమేరా మౌనంగా ప్రదర్శించిన రెండు హృదయాల డ్రామాను గమనించండి. ప్యాసా సినిమాలో తన కవితల ద్వారా సాహిర్ ఎంత ప్రధాన పాత్ర పోషించాడో, కెమేరాతో వీకే మూర్తి అంతకన్నా ఎక్కువగా ప్రధాన పాత్రను నిర్వహించాడు.
గురుదత్ భారతీయ సినిమాలోనే క్లోజ్ అప్‌లో, మాస్టర్ షాట్స్ తీసిన వ్యక్తిగా ఇప్పుడు సినిమాటోగ్రాపర్లు చెప్తారు. 75 ఎం.ఎం. 100 ఎమ్.ఎమ్. లను వాడిన మొదటి దర్శకుడు కూడా ఇతనే. గురుదత్ తన కళ్ళతో ఎలా ఒక దృశ్యాన్ని ఊహించుకునేవారో అది అదే విధంగా చిత్ర రూపంలో రావడానికి ఆయన, మూర్తి ఇద్దరు కూడా అంతలా కష్టపడేవారట.
‘ప్యాసా’ సినిమా కథకి, గురుదత్ రాసుకున్న కష్మకష్ కథకి కొన్ని తేడాలున్నాయి. మొదట రాసుకున్న కథలో హీరో పేరు శ్రీ. ఇతను రాణీ అనే వేశ్యతో స్నేహం చేస్తాడు. ఇక పబ్లిషర్ పాత్రకు మొదట గురుదత్ ‘పాటిల్’ అనే పేరు పెట్టుకున్నారట. తరువాత పాత్ర పేరు ‘శంభు’గా మార్చారు. అప్పట్లో సినీ జర్నలిస్టుగా సినిమా నటులని వణికించిన బాబూరావ్ పటేల్ గుర్తుగా ఈ పాత్రకు గురుదత్ ఆ పేరు అనుకుని ఉండవచ్చు. బాబురావ్ పటేల్ భార్య పేరు సుశీలా రాణీ. అందుకని తన కథలో పబ్లిషర్ భార్య పేరును సుషమ గా గురుదత్ మొదట పెట్టుకుని ఉండవచ్చు. ‘కష్మకశ్’ అనే కథను గురుదత్ 32 పేజీలలో రాసారు. అందులో మొదటి పేజి తప్ప మిగతావన్నీ ఇప్పుడు వారి కుటుంబీకుల వద్ద ఉన్నాయి. దీన్ని సినిమాగా తీయాలనుకునేటప్పుడు శ్రీ పేరు విజయ్‌గా, రాణీ గులాబోగా, రమేష్‌ని శ్యాం అనే విజయ స్నేహితునిగా, శంభు పాత్రను ఘోష్‌గా, సుషమను మీనాగా గురుదత్ మార్చారు. అబ్దుల్ సత్తార్, షేక్, పుష్పా, జుహి ఆ తరువాత కథన సౌలభ్యం కోసం వచ్చి చేరిన పాత్రలు. గురుదత్‌కి బాబు రావ్ పటేల్‌కి మద్య ఎప్పుడూ గొప్ప సయోధ్య లేదు. అతను తరువాత కూడా గురుదత్ సినిమాలపై ఎప్పూడూ పాజిటివ్ రెవ్యూలు రాయలేదు. ‘ప్యాసా’ గురించి కూడా అతను ఇది కన్ప్యూజన్ పెంచే సినిమా అని, మేధావిగా కనిపించడానికి గురుదత్ చేసిన ప్రయత్నం అని ఫిల్మిండియా 1957 ఏప్రిల్ ఎడిషన్‌లో హేళనగా రాసారు.
మొదట రాసుకున్న ఈ కథలో శ్రీ కి సుషమకి మధ్య ఏ విధమైన ప్రేమ బంధం లేదు. తరువాత ‘ప్యాసా’కు కథ రాసుకుంటూ ప్రపంచాన్ని ద్వేషించే విజయ్ వెనుక ఒక బలమైన గతాన్ని నిర్మించడానికి విజయ్ మీనాల మధ్య ప్రేమ అనే ఘట్టాన్ని రాసుకున్నారు గురుదత్. ‘కష్మకష్’ రాసేటప్పటికి గురుదత్‌కి సాహిర్ కవిత్వంతో పరిచయం ఏర్పడలేదు. సాహిర్ కవిత్వాన్ని తన సినిమాకు వాడుకోవాలని అతను అనుకున్న సందర్భంలో విజయ్ పాత్రకు ఒక రూపాన్ని ఇస్తూ సమాజం మోసం చేసిన ఒక కవిగా దాన్ని మలచడం జరిగింది.
‘కష్మకష్’ కథకు స్క్రీన్ ప్లే రాసుకుంటున్న సమయంలో అబ్రర్ అల్వీ తన జీవితంలో తాను చూసిన గులాబో అనే ఒక వేశ్యను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆమెకు, తనకు మధ్యన జరిగిన సంభాషణలను యథాతథంగా ఇందులో కొన్ని రాసాను అని అబ్రర్ అల్వీ, తన పుస్తకంలో చెప్పుకున్నారు. తానో సినీ రచయితను అవగలనని అబ్రర్ ఏనాడు అనుకోలేదు. కాని అతనిలోని ప్రతిభను గుర్తించి తన టీంలో చేర్చుకుని అద్బుతమైన సినీ సంభాషణలు రాయించుకున్నారు గురుదత్. ‘ప్యాసా’ సినిమాకు అబ్రర్ రాసిన సంభాషణలలో ఒక లోతు ఉంటుంది. అలాగే అవి చాలా సరళమైన పదాలతోనూ ఉంటాయి. అబ్రర్ సంభాషణలు, సాహిర్ గీతాలు, వీ.కే. మూర్తి ఫోటోగ్రఫీ, ఎస్.డి. బర్మన్ సంగీతం, రఫీ గళం సినిమాకు అద్భుతమైన కంటిన్యుటిని ఇస్తాయి. వీరిలోని ప్రతిభను నూటీకి నూరు శాతం వెలికి తీసి కలగలిపి వాడుకున్న ప్రతిభావంతమైన దర్శకుడు గురుదత్.
ఒక సందర్భంలో సాహిర్ తన సినీ జీవితాన్ని గురించి మాట్లాడుతూ హిందీ సినిమాలు ఫార్ములాలు, కథనం బట్టి నడుస్తాయని, “ఏది ఎలా చెప్పాలి” అన్న దాని మీద ప్రొడ్యూసర్లు చాలా ఖర్చు పెడతారు కాని “ఏం చెప్పాలి” అన్నదాని గురించి పెద్దగా ఆలోచించరని హిందీ సినిమా పరిస్థితిని విమర్శించారు. కాని దానికి భిన్నంగా గురుదత్ తన సినిమాలను ముఖ్యంగా ‘ప్యాసా’ను తీసారని, అతనే తన కవిత్వానికి నిజమైన గుర్తింపుని సినిమాలలో తీసుకురావడానికి తోడ్పడ్డారని చెప్పారు. ‘ప్యాసా’ విజయం, ఆ తరువాత కొంత కాలం వరకు సినీ ప్రొడ్యూసర్ల ఆలోచనలలో మార్పు తీసుకువచ్చింది అని కూడా ఈ ఇంటర్వ్యూలో అన్నారు (26 జనవరి 1962 ఫిలింఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ).
“ప్యాసా’ సినిమాను విశ్లేషించాలంటే దీనిలో ప్రతి ప్రేమ్‌ను, షాట్‌ను పరిశీలించాలి. ఒక్కో సీన్ వెనుక ఈ టీం చేసిన కష్టాన్ని గుర్తించాలి, ప్రపంచం గుర్తించిన ‘ప్యాసా’ను మనం కూడా సీన్ బై సీన్ గా చూస్తూ వెళదాం. అప్పుడే ఈ సినిమా ఒక కళాఖండం అని ఎందుకుని కొనియాడబడుతుందో అర్థం అవుతుంది.
To be continued…