మధురమైన బాధ – గురుదత్ సినిమా 19- ‘ప్యాసా’-2

1
2

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ప్యాసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

‘ప్యాసా’ సినిమా విశ్లేషణ సీన్ల వారిగా…….

[dropcap]‘ప్యా[/dropcap]సా’ సినిమాను ఆస్వాదించడానికి దీని కథను, కథనాన్ని చర్చించుకోవడంతో పాటు గురుదత్ దర్శకత్వ ప్రతిభను ప్రతి సీన్లో చూడగలిగే ప్రయత్నం జరగాలి. కథను ఎలా చెప్పాలి, ఎలా చూపించాలి, ఎప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్న దర్శకులు గురుదత్. ఈ సినిమాను ఎన్ని సార్లు చూసినా అనవసరమైన ఒక్క డైలాగ్, ఒక్క షాట్ లేదా ఒక్క మాట కూడా కనిపించదు. మౌనాన్ని కూడా భాషగా వాడుకొగల దర్శకులు గురుదత్. ‘ప్యాసా’ లోని ప్రతి సీన్ గురించి ఇప్పుడు అదే క్రమంలో చర్చించుకుందాం.

‘ప్యాసా’ సినిమాను గురుదత్ తన గురువైన జ్ఞాన్ ముఖర్జీకి అంకితం ఇచ్చారు. దీని నేపథ్యం, కారణాలు ముందు అధ్యాయాలలో చెప్పుకున్నాం. సినిమా టైటిల్స్‌లో గమనిస్తే ముందు మాలా సిన్హా పేరు వచ్చి తరువాత గురుదత్ పేరు వస్తుంది. ఇది ఆ రోజుల్లోని సినిమాలలో ఉన్న నియమం. ప్రధాన నటులలో సీనియర్ ఎవరయితే వారి పేరు ముందు వచ్చి తరువాత వేరే వారి పేర్లు వస్తాయి. దిలీప్ కుమార్ నర్గిస్‌తో నటించిన ప్రతి సినిమాలో నర్గిస్ పేరు ముందు వస్తుంది. అలాగే ఇందులో మాలా సిన్హా గురుదత్ కన్నా ముందు నుండి సినిమాలలో నటిస్తుండడం వలన క్రెడిట్స్‌లో ఆమె పేరు ముందు వస్తుంది. నటీమణులకు వారి అనుభవం ఆధారంగా ఆ రోజుల్లో గౌరవం ఇచ్చేవారు అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఇప్పటి పరిస్థితులను ఆ రోజులతో పోల్చి చూసుకుంటే నటీమణుల గౌరవంలో వచ్చిన తేడాను గమనించవచ్చు. ఇక ‘ప్యాసా’ సినిమాకు వస్తే తామర పూలతో ఉన్న అందమైన పూల కొలను బాక్ డ్రాప్ గా ఉంచి టైటిల్స్ పడతాయి.

సినిమా ప్రారంభం పార్క్‌లో ఒక బెంచిపై పడుకున్న గురుదత్‌పై షాట్‌తో మొదలవుతుంది. చెట్టుపై నుండి ఉండి ఉండి ఒకో పువ్వు అతనిపై పడుతుంది. అతని మనసులో కవిత రూపుదిద్దుకుంటూ ఉంటుంది. బాక్‌గ్రౌండ్‌లో రఫీ ఆ కవితా పంక్తులను గానం చేస్తారు. “యె హస్తె హుయె ఫూల్, యె మెహకా హువా గుల్షన్, ఏ రంగ్ మె ఔర్ నూర్ మే డూబీ హుయె రాహె, (ఈ నవ్వుతున్న పూలు, పరిమళిస్తున్న పూతోట, రంగులలో వెలుగులలో మునిగి ఉన్న ఈ బాట) అంటూ తల ఎత్తి తోటని గమనిస్తుంటాడు విజయ్. “ఏ ఫూలో కా రస్ పీకె మచల్తె హుయె భవరే (ఈ పూల రసాన్ని ఆఘ్రాణిస్తూ నర్తిస్తున్న భ్రమరాలు), బెంచి పై పడుకుని ముఖం పై చేతిని అడ్డు పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ కళ్ళు తెరుస్తాడు విజయ్. అతనిలోని కవి హృదయం, అతని రొమాంటిజం ఈ సీన్‌తో పరిచయం అవుతుంది. పెదవులపై నవ్వుతో, ప్రకృతి మధ్య మేల్కొన్న తృప్తితో పక్కకు తిరిగిన అతని మొహంపై కెమెరా ఫోకస్ ఉంటుంది. గురుదత్ “ప్యాసా” సినిమాలో తన ముఖంలోని ప్రతి భాగంతో తన మనసులోని భావాలను ప్రకటిస్తాడు. సినిమా మొదటి షాట్ నుంచి అంతా క్లోజ్ అప్ లోనే నడుస్తుంది కాబట్టి ప్రేక్షకులు పాత్రల భావాలతో తొందరగా కనెక్ట్ అవుతారు. ఈ బెంచిపై తీసిన షాట్‌లో అతని నుదిటిపై ముడతలపై కెమెరా ఫోకస్ చూడాలి. పూల మీద తుమ్మెదలు వాలుతూ ఆనందిస్తుంటే చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు విజయ్. సినిమాలో పూర్తి ఆనందంగా విజయ్ కనిపించే ఏకైక సీన్ ఇది.

(సినిమా ప్రారంభంలో బెంచి పై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తున్న విజయ్)

ఆ భ్రమరం వచ్చి గడ్డి మీద వాలుతుంది. పక్కన నడుస్తున్న వ్యక్తి ఎవరో దాన్ని తొక్కుకుంటూ నడిచి వెళ్ళిపోతాడు. ఏదో లోకంలో విహరిస్తున్న విజయ్ వాస్తవ ప్రపంచంలోకి వస్తాడు. “మై దూ భి తో క్యా దూ తుమ్హే ఐ షోక్ నజారే” (ఇంత అందమైన దృశ్యాలకు బదులుగా నేను ఏమి ఇవ్వగలను) “లే దేకె మెరె పాస్ హై కుచ్ ఆంసూ ఔర్ కుచ్ ఆహే” (కాసిని కన్నీళ్ళు, కొన్ని నిట్టూర్పులు తప్ప నా దగ్గర ఏం ఉన్నాయని) అంటూ ఆ బెంచి మీద నుండి లేచి నడిచి వెళ్ళిపోతాడు విజయ్.

ఈ సీన్ ద్వారా హీరోని పరిచయం చేస్తూ అతనో కవి అని, గొప్ప భావుకుడు అని, బెంచి మీద పడుకున్న అతని స్థితి ద్వారా అతనో పేదవాడని, ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్న అతని ధోరణితో అతని వ్యక్తిత్వాన్ని ఒకేసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తారు గురుదత్. గురుదత్ తన పాత్రలు స్క్రీన్‌పై మొట్టమొదట కనిపించే సన్నివేశానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓపెనింగ్ సీన్ కోసం ఎన్నో సార్లు రీ-షూట్ చేసేవారని చెబుతారు అతనితో పని చేసిన వ్యక్తులు. ‘ప్యాసా’ లోని ఈ ఇంట్రడక్షన్ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పూర్తి వెలుగులో షాట్ ప్రారంభం అయి చివరకు అసహనంగా విజయ్ లేచి వెళ్ళిపోతున్నప్పుడు అతని ముందు ఒక చెట్టు అడ్డంగా ఉండి నల్లటి నీడలలోకి అతను నడుచుకుంటూ వెళ్ళినట్లు షాట్ అంతా నీడలతో నిండి ఉంటుంది. అందమైన భావనా ప్రపంచం నుండి భయంకరమైన వాస్తవిక ప్రపంచం వైపుకు నడిచి వెళుతున్నాడు విజయ్ ఈ ప్రారంభపు సీన్‌లో. అతని జీవితపు స్థితిని ఈ షాట్ చెబుతుంది. ఈ షాట్‌తో మొదలయిన సినిమా చివర్లో వెలుగులోకి నడిచి వెళుతున్న హీరో హీరోయిన్లతో ముగుస్తుంది. నిశితంగా గమనిస్తే “ప్యాసా”లో ప్రతి షాట్ కథను చెబుతుంది. విజయ్ జీవితపు ప్రయాణాన్ని వివరిస్తుంది.

సినిమా కథ టూకీగా చెప్పుకుందాం. విజయ్ ఒక కవి. నిరుద్యోగి. అతన్ని ప్రేమించిన మీనా జీవితంలో స్థిరపడని విజయ్‌తో జీవించడానికి భయపడి డబ్బున్న ఘోష్‌ని వివాహం చేసుకుని వెళ్ళిపోతుంది. విజయ్ అన్నలు అతన్ని అసహ్యించుకుంటారు. విజయ్ తల్లికి ఆ ఇంట్లో బిడ్డని ఇంటికి పిలిపించుకుని ఇంత తిండి పెట్టుకునే స్వాతంత్ర్యం కూడా ఉండదు. అన్నలు విజయ్ కవితలను చెత్త కాగితాల వానికి అమ్మివేస్తారు. అవి ఎవరో యువతి కొనుక్కుని వెళ్ళిందని విజయ్‌కి తెలుస్తుంది. ఆమె వేశ్యా వృత్తిలో ఉన్న గులాబ్. విజయ్ తన కాలేజీ రీ-యూనియన్ డే న మళ్ళీ మీనాని చూస్తాడు. అక్కడ అతన్ని చూసి మీనా తడబడడం గమనించిన ఆమె భర్త విజయ్‌ని తన ఆఫీసుకు పిలిపించుకుని అటెండర్‌గా ఉద్యోగం ఇస్తాడు. అతనో పెద్ద పబ్లిషర్ అయినా విజయ్ కవితలు పబ్లిష్ చేయాలని అతను అనుకోడు. విజయ్ అవమానాలు భరిస్తూ అక్కడ ఉద్యోగం చేస్తున్నా, అతనికి మీనాకున్న పూర్వ స్నేహం తెలుసుకున్నాక విజయ్‌ని ఉద్యోగం నుండి తీసేస్తాడు ఘోష్. చివరకు విజయ్ తల్లి కూడా మరణిస్తుంది. అన్నలు అతనికి కబురు కూడా చేయరు. వాళ్లు నది ఒడ్డున కర్మ చేస్తున్నప్పుడు ఈ విషయం తెలుసుకుని విజయ్ కుమిలిపోతాడు. ఒక్క గులాబో మాత్రమే అతన్ని మనిషిగా కవిగా గుర్తిస్తుంది. ప్రపంచంలో ఎవరి ప్రేమకు గౌరవానికి నోచుకోక, ఆ దుఖంలో విజయ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తన దగ్గర ఉన్న ఒక్కగానొక్క  కోటు ఓ బిచ్చగానికి ఇచ్చి రైలు పట్టాల వైపుకు వెళతాడు. ఆ బిచ్చగాడు విజయ్‌ని కాపాడి రైలు క్రింద పడి మరణిస్తాడు. అతను వేసుకున్న కోట్ ఆధారంగా చనిపోయింది విజయ్ అనుకుంటారు అందరు. గులాబో తరువాత తన నగలు అమ్మి విజయ్ కవితలను ప్రచురిస్తుంది. ఆ పుస్తకం చాలా డబ్బు తీసుకొస్తుంది. ఆ డబ్బు కోసం విజయ్ అన్నలు, స్నేహితుడు, పాత పబ్లిషర్లు, ఘోష్ అందరూ కలిసి విజయ్ బ్రతికి ఉన్నాడని తరువాత తెలిసినా అతన్ని గుర్తించడానికి నిరాకరిస్తారు. చివరకు విజయ్ తాను విజయ్‌ని కాను అని ఆ పేరు డబ్బు, పరపతి అన్నిటిని వదిలేసి గులాబోతో తననెవరూ గుర్తించని చోటుకు వెళ్ళిపోతాడు.

ఈ కథను గురుదత్ సినిమాగా మలచడంలో అతని ప్రతిభను గమనించాలి. మొదటి సీన్లోనే విజయ్ వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తాడు గురుదత్. ఆ పార్కు నుండి విజయ్ తన కవితలను ప్రింట్ చేయమని ఇచ్చిన ఒక చిన్న ప్రెస్‌కు వెళతాడు. ఆ ప్రెస్ యజమాని షేక్. విజయ్ తన కవితల గురించి అక్కడ వాకబు చేస్తాడు. షేక్ అతన్ని ఆకలి నిరుద్యోగం గురించి రాసిన ఆ ఏడుపుగొట్టు కవితలు తానెందుకు ప్ర్రింట్ చేయాలని ప్రశ్నిస్తాడు. పైగా పూలు, పక్షులు, స్త్రీల అందం గురించి రాయమని సలహా ఇస్తాడు. మీర్, మోమిన్ కవితలు చదివావా అని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబుగా విజయ్ వాళ్ళనీ చదివాను ఫైజ్, జోష్ లవి కూడా చదివానని బదులిస్తాడు. వాళ్లు మీకు అర్థం కారులే అంటూ వ్యంగ్యంగా సమాధానం చెబుతాడు. మీర్ తాఖీ మీర్‌ని, ఉర్దూ కవిత్వంలో దేవునిగా కొలుస్తారు. మోమిన్ ఖాన్ కూడా ఉర్దూలో ప్రేమ కవిత్వానికి ప్రసిద్ధి. విజయ్ కవిత్వం రాస్తున్న సమయంలో ప్రేమ కవిత్వంతో పాటు సమాజంలో, ఆకలి, దోపిడిని ప్రశ్నించే కవులు పుట్టుకొచ్చారు. వీరిలో జోష్ మలిహాబాది, ఫైజ్ అహ్మద్ ఫైజ్ ముఖ్యులు, విజయ్ సమయానికి వీరు ప్రగతీశీల ఆధునిక కవులు. ఇక ఆ ఆఫీసులో విజయ్ తన కవిత్వం కాగితాలను వెతుకుతుంటే అక్కడే చెత్త బుట్టలో పడేసిన తన ఫైల్ కనిపిస్తుంది. ఈ సీన్ ద్వారా దర్శకుడు విజయ్ భావజాలాన్ని, అతనిలోని ఆధునిక ప్రగతీశీల భావాలని చూపిస్తున్నారు. విజయ్ లాంటి కవులను అర్థం చేసుకోలేని షేక్ లాంటి పబ్లిషర్లు ఆ కవిత్వాన్ని చెత్తలో పడేస్తున్నప్పుడు విజయ్‌కి సమాజం ఇస్తున్న స్థానం ఏంటో చెప్పే ప్రయత్నం చేసారు గురుదత్.

గురుదత్ తన సినిమా చిత్రీకరణలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా స్క్రీన్‌పై స్పష్టతతో వచ్చేలా జాగ్రత్త పడతారు. విజయ్ పాత్రనే తీసుకోండి. విజయ్‌కి అన్నిటికన్నా తన కవిత్వం ప్రాణం, దేన్ని పెద్దగా పట్టించుకోడు, ఎన్ని అవమానాలన్నా భరిస్తాడు కాని అతను సహించలేనిది తన కళను మరొకరు కించపరచడం. సినిమాలో చివరి దాకా ఈ గుణం అతనిలో చూస్తాం. దీన్ని ఎక్కడా కంటిన్యుటీ దెబ్బతినకుండా చూపిస్తారు గురుదత్. షేక్ ఆఫీసులో చెత్త బుట్టలో కవిత్వాన్నిచూసి అతనిపై విరుచుకు పడతాడు విజయ్. మళ్ళీ తన అన్నల దగ్గర కూడా అన్ని అవమానాలను మౌనంగా సహిస్తాడు కాని, తన కవిత్వం అమ్మేశారని తెలుసుకున్నప్పుడే వారితో గొడవ పడతాడు, రోడ్డు మీద ఒక స్త్రీ తన కవిత పాడుతుంటే, ఆమె ఎవరు తనను ఎక్కడకు రమ్మని అంటుంది అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ఆమె వెంట వెళతాడు. ఘోష్ ఆఫీసులో అటెండరుగా పని చేస్తూనే తన కవిత్వాన్నిఅవమానించారని తెలిసి అతనితో మొదటి సారి గట్టిగా మాట్లాడతాడు. చివరకు హాస్పిటల్‌లో గతం మర్చిపోయి షాక్‌లో పడి ఉన్న విజయ్ కూడా పక్కన కూర్చున్న నర్సు తన కవిత్వాన్ని చదువుతుంటేనే స్పృహలోకి వస్తాడు. ప్రతి సీన్‌లో కూడా కవిత్వంపై విజయ్ ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. విజయ్ దృష్టిలో కవిత్వం తన అస్తిత్వం. ప్రతి కళాకారుడి లక్షణం ఇది. దీన్ని గురుదత్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తన చిత్రీకరణలో చూపించే విధానాన్ని గమనించాలి. ఒక్క అనవసరపు మాట ఎక్కడా రాకుండా ఇంతగా తన పాత్రల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో కష్టపడే దర్శకుడు గురుదత్.

(షేక్ ప్రెస్ లో చెత్త బుట్టలోపడేసిన తన కవిత్వాన్ని ఏరుకుంటున్న విజయ్)

చెత్తలో ఎందుకు పడేశావు నా కవిత్వాన్ని అని విజయ్ అడిగినప్పుడు షేక్, పడేయక నెత్తిన పెట్టుకోనా అని బదులిస్తాడు, నీ ఖాళీ మెదడుపై నా కవితలు ఉండడం నా కిష్టం ఉండదు అని తిరిగి బదులిస్తాడు విజయ్. నా బుర్ర ఖాళీ దా.. నీవు కవివి అని ఎవరయినా అంటే నేను గాడిదను అని అర్థం అంటాడు షేక్. మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోకపోయినా నేను గుర్తు పట్టగలను అంటాడు విజయ్. ఈ సంభాషణను ఇంత విపులంగా రాయడానికి కారణం, పాత్రల సంభాషణలతో వారి ఆలోచన స్థాయిని ఎంత బాగ చెప్పవచ్చో గురుదత్ సినిమాలలో వచ్చే సంభాషణలను గమనించండి. విజయ్ ఒక కవి, భాషపై అతనికి అసమాన్యమైన పట్టు ఉంది. కోపంలో కూడా తన కవిత్వ ధోరణి, తన భాషా పటిమను ఎలా ప్రదర్శిస్తాడో చూడండి. ఏది పడితే అది, ఎట్ల పడితే అలాగ మాట్లాడే యువతరపు ప్రతినిధులకు అర్థం కావలసినది ఇది. సినిమాలో పాత్రలు వాడే భాష ఆ పాత్రను ఎలివేట్ చేయాలి. వారి వ్యక్తిత్వాన్ని చూపించాలి. అత్యంత పేదరికంలో, నిరుద్యోగంతో కొట్టుకుంటున్న విజయ్ తన కోపాన్నిప్రదర్శించేటప్పుడు వాడే భాష స్థాయి అధారంగా అతని కవితా వైఖరిని, వ్యక్తిత్వాన్ని చూపించారు సంభాషణలు రాసిన అబ్రర్ అల్వి.

ఇక అక్కడి నుండి విజయ్ వీధిలోకి వస్తాడు. అతని తల్లి కూరగాయలు కొంటూ మార్కెట్లో కనిపిస్తుంది. తోడుగా అన్న కొడుకు ఉంటాడు. వీరిని చూసి విజయ్ తప్పుకోవాలనుకుంటాడు. అతను తల్లితో కాక విడిగా ఉంటున్నాడని ప్రేక్షకులకు అప్పుడు అర్థం అవుతుంది. బాబాయిని చూసిన ఆ చిన్నవాడు నానమ్మను పిలిచి అతన్ని చూపిస్తాడు. వెళ్ళిపోతున్న విజయ్‌ని పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆపుతాడు ఆ అబ్భాయి. ఈ అబ్బాయి పాత్ర ఈ ఒక్క సీన్ లోనే కనిపిస్తుంది. తనను దాటి వెళ్ళిపోతున్న కొడుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టుకునే వయసు ఆ తల్లిది కాదు. ఇక్కడ తల్లీ కొడుకులు కలవాలి. తల్లిని దాటుకుని కొడుకు వెళ్ళిపోవడం అనే సీన్‌తో దర్శకుడు ఆ కుటుంబానికి విజయ్ ఎంత దూరం అయ్యాడో చెప్పగలిగారు. అందుకని వడివడిగా వెళ్లిపోయే విజయ్‌ను పట్టుకోవడానికి అక్కడ ఆ అబ్బాయి కారెక్టర్ పెట్టారు గురుదత్. ఈ బాబు మళ్ళీ సినిమాలో ఏ సీన్ లోనూ కనిపించడు. మొత్తానికి తల్లి బ్రతిమాలి కొడుకుని ఇంటికి తీసుకొనివస్తుంది. నీ కోసం కొన్ని మిఠాయిలు దాచి ఉంచానని చెబుతుంది. చాటుగా అవి తెచ్చి కొడుకుకి ఇస్తుంది. కాని ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నలు విజయ్‌ని అవమానిస్తారు. అతన్ని కనడమే తల్లి చేసిన పాపం అని ఆమెను కూడా అనరాని మాటలంటారు. ఇక్కడ గురుదత్ సినిమాలో తరచుగా కనిపించే ఒక దృశ్యం గురించి చెప్పాలి. మనిషికి తిండి పెట్టి అది తింటున్నప్పుడు అవమానంతో మాట్లాడడం చాలా ఉమ్మడి కుటుంబాలలో కనిపించే దృశ్యం. గురుదత్ మనసును ఎక్కువగా బాధించే విషయం ఇది అన్నది వారి సినిమాలను వరుసగా చూస్తే అర్థం అవుతుంది. అంతకు ముందు తీసిన ‘బాజీ’ నుండి ‘కాగజ్ కే ఫూల్’ దాకా కుటుంబంతో భోజనం చేసేటప్పుడు అ పాత్రల మధ్య వచ్చే సంభాషణలకు కథలో చాలా ప్రాధ్యాన్యత ఉంటుంది. కలిసి భోంచేసేటప్పుడు కుటుంబ వ్యక్తులు కనపరిచే అప్యాయత మానవ సంబంధాలలో ఎంత అవసరమో చెప్పే సీన్స్ వీరి సినిమాలలో ఎక్కువగా కనిపిస్తాయి. కాని ఇక్కడే ఒకరి పై ఒకరు అసూయలను, కోపాన్ని వెదజల్లుకుంటారు కుటుంబ సభ్యులు. భోంచేసేటప్పుడు కుటుంబంలో ప్రశాంతత లేకపోతే ఆ ఇంట్లో  బాంధవ్యాల నడుమ దూరం ఉన్నట్లే.

‘ప్యాసా’లో ఈ విషయాన్ని ఇంకా సున్నితంగా చూపిస్తారు గురుదత్. తల్లి చాటుగా పిలిచి బిడ్డకు తిండి పెడుతున్నప్పుడు అన్నలు సూటి పోటి మాటలతో అవమానిస్తారు. భోంచేస్తున్న మనిషిని ఆ సమయంలో అవమానించడం ఎంత హేయమైన చర్యో పెద్ద మాటలు లేకుండా ఇక్కడ ఆయన చూపిస్తారు. ఇంత కన్నా కుటుంబ హింస మరొకటి ఉండదన్నంత విషాదంగా ఉంటుంది ఆ సీన్. తింటున్న ప్లేటును వదిలేసి వదినను తన కవితల ఫైలు ఇమ్మని అడుగుతాడు. అన్నలు దాన్ని చెత్త వానికి అమ్మేసామని చెప్పినప్పుడు అంత అవమానాన్ని, అన్ని మాటలను అప్పటిదాకా సహిస్తున్న అతను వారికి ఎదురు తిరుగుతాడు. అన్నలు అతన్ని ఇంటి నుండి గెంటేస్తారు. ఈ తిండి దగ్గర విజయ్ అవమానపడడం మళ్ళీ ఒక హోటల్ సీన్‌లో కనిపిస్తుంది. మనిషి సంతృప్తిగా తిండి తినలేని పరిస్థితుల కన్నా హీనమైన పరిస్థితులు మరింకేం ఉంటాయి అన్నది ఒక సున్నితమైన ప్రశ్న. గురుదత్ సినిమాలలో ఈ ప్రశ్న చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది.

(తనను కూడా ఆ ఇంటి నుండి తీసికెళ్ళిపొమ్మని తల్లి విజయ్ ని అడగడం)

పరువు కోసం ఆ ఇంట పడి ఉన్నాను కాని లేదంటే నాలుగిళ్లలోపని చేసైనా తన బిడ్డకు తిండి పెట్టుకునేదాన్ని అని విజయ్ తల్లి బాధపడుతుంది. వృద్ధాప్యంలో తనదంటూ ఏం లేక పిల్లల పంచన చేరే తల్లుల స్థితిని చూపించిన సీన్ ఇది. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న విజయ్‌ని తనను కూడా అక్కడి నుండి తీసుకెళ్ళమని అడుగుతుంది తల్లి. తాను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని కాస్త ఓపిక పడితే తాను తల్లిని తనతో తీసుకువెళతాదని బదులిస్తాడు విజయ్. తల్లి మరణం గురించి వినగానే విజయ్‌లో తరువాత కలిగే పశ్చాత్తాప భావానికి, అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడాని దారి తీసిన సీన్ ఇది. తనను కని, పెంచి పెద్ద చేసిన తల్లిని వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉంచలేకపోయిన తన అసహాయ స్థితి అర్థం అయిన తరువాత విజయ్‌కి చనిపోవాలన్నంత విరక్తి కలుగుతుంది. ఆ స్థితికి అతను వెళ్ళడానికి దర్శకుడు ఈ సంభాషణ ద్వారా ప్లాట్‌ను నిర్మిస్తున్నారు.

విజయ్ పాత పేపర్ షాపులో తన అన్నలు అమ్మిన తన ఫైల్ కోసం వెతుకుతుంటూ ఉంటాడు. ఆ షాపు అతను దాన్ని ఒక స్త్రీ డబ్బు ఇచ్చి కొనుక్కుని వెళ్ళిందని చెబుతాడు. అన్నలు చెత్తలో పడేసిన విజయ్ కవిత్వాన్ని ఎవరో ఒక స్త్రీ డబ్బు ఇచ్చి కొనుక్కొని వెళ్ళడం గురించి వచ్చిన ఈ సీన్, విజయ్ కవిత్వం పట్ల అన్నల కున్న చులకన భావం, ఆదే కవిత్వాన్ని ఆదరించిన ఆ స్త్రీ పట్ల ఆసక్తిని కలుగ జేస్తుంది. మరో సంగతి ఇక్కడ గమనించాలి. గురుదత్ సినిమాలో ప్రపంచం అసహ్యించుకుని చులకన చేసే వ్యక్తులలోనే ఎక్కువ సార్లు ప్రేమ, ఆప్యాయత, మానవత్వం కనిపిస్తాయి. అతని సినిమాలన్నిటిలో ఇలాంటి కొన్ని పాత్రలు ఉంటాయి. ‘ప్యాసా’ లో గులాబో అనే ఒక వేశ్య, మాలిష్ చేసే అబ్దుల్ సత్తార్, హోటల్‌లో సర్వర్ బాయ్, ఇక్కడ చెత్త కొనుక్కునే వ్యక్తి వీరందరూ మర్యాదస్తుల కన్నా ఎన్నో రెట్లు మానవత్వాన్ని మంచితనాన్ని ప్రదర్శిస్తారు. చెత్త కొనుక్కునే వ్యక్తి ఫైల్ ఒక స్త్రీ కొనుక్కుందని చెపుతూ వెళ్ళిపోతున్న విజయ్‌ని పిలిచి “విజయ్ భయ్యా ఆమె మళ్ళీ వస్తే నేను కనుక్కుంటాను” అని బదులిస్తాడు. ఈ డైలాగ్ కథ కోసం కాదు అబ్రర్ అల్వీ ఇక్కడ రాసింది. షేక్ అనే ఎడిటర్, ప్రేస్ లో విజయ్ కవితలను చెత్తలో పడేస్తే, విజయ్ దాన్ని వెతుక్కుని ఇక్కడెందుకు ఇది పడేశావు అంటే అతను విజయ్‌తో అవమానకరంగా మాట్లాడతాడు. నిరంతరం సాహిత్యంతో గడిపే ఆ షేక్, చదువుకున్న వ్యాపారస్తుడూ, ఆ ఫైల్‌కి ఇచ్చిన గౌరవం అది. కాని ఈ చెత్త కొనుక్కునే వ్యక్తికి చదువు రాదు. ఆ ఫైల్‌లో ఉన్నవి చేతి వ్రాత ప్రతులని మాత్రమే గుర్తు పెట్టుకున్నాడు కాని అందులే ఏం ఉందో అతనికి తెలీదు. కాని విజయ్ దాని కోసం వెతుక్కుంటున్నాడని తెలిసి తాను ఆ ఫైల్ కొనుక్కున్న స్త్రీ గురించి గుర్తుంఛుకున్న విషయాన్ని చెప్పి మర్యాదగా నేను ఇది వెతికి పెడతాను అని విజయ్‌తో చెబుతాడు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వైరుధ్యాన్ని గుర్తించమని దర్శకుడు ఇక్కడ చెబుతూ, షేక్ కన్నాఈ చెత్త కొనుక్కునే వ్యక్తి మనసున్న వ్యక్తి ఎలా అయ్యాడో చెప్పడానికి ఈ డైలాగ్ ఆ చెత్త కొనుక్కునే వ్యక్తి చేత పలికిస్తారు గురుదత్.

అక్కడి నుండి విజయ్ తన స్నేహితుడు శ్యాం రూమ్‌కి వెళతాడు. గురుదత్ తన పాత్రలను పరిచయం చేసే పద్దతి ద్వారా అ పాత్రల వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని పరిచయం చేస్తాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మరో ఉదాహరణ చూద్దాం. శ్యాం తన దగ్గరకు వచ్చిన్ విజయ్‌ని చూసి అన్నలు ఇంటి నుండి గెంటేసారా అని హాస్యం ఆడతాడు. అంటే విజయ్ అన్నల స్వభావం అతనికి తెలుసని వీరిద్దరి పరిచయం చాలా ఏళ్లది అయి ఉండాలని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇక విజయ్‌కి అన్నల వద్ద జరిగిన అవమానం ఇది మొదటి సారి కాదని, ఇలా జరిగిన ప్రతిసారి పడుకోవడానికి అతను ఇక్కడికే వస్తాడని తెలుస్తుంది. శ్యామ్ పలికే మొదటి డైలాగులో కొనసాగింపుగా “నీవు ఇలాగే ఆకలితో చస్తావు, నన్ను చూడు ఒక సేఠ్ వద్ద రెండు వందలు ఇవాళ సంపాదించుకుని వచ్చాను” అంటాడు. ఎలా అని అడిగిన విజయ్‌కి ఒక డబ్బున్న సేఠ్ కారు క్రిండ పడి కాలు విరగ్గొట్టుకున్న ఒక ముసలి స్త్రీ భరణం కోసం కోర్టుకు వెళితే తాను సేఠ్ తరుపున తప్పుడు సాక్ష్యం ఇచ్చానని దానికి అతను రెండు వందలు ఇచ్చాడని చెబుతాడు శ్యాం.

ఇలా ప్రేక్షకులకు పరిచయవైన శ్యాం గురించి అర్థం అయేది అతను తన స్వార్ధం కోసం ఎవరినయినా మోసం చేయగల వ్యక్తి అని. భవిష్యత్తులో విజయ్‌ని శ్యాం మోసం చేయడం పట్ల పెద్ద ఆశ్చర్యం కలగదు ప్రేక్షకులకు. అతని వ్యక్తిత్వం మొదటి సీన్‌లో మొదటి డైలాగుతోనే దర్శకులు చెప్పేసారు మరి. శ్యాం తో అప్పుడు విజయ్ ఒక మాట అంటాడు “గుర్తుందా శ్యాం చిన్నప్పుడు ఒక కాలు తెగిన పక్షిని చూసి దాన్ని ఇంటికి తెచ్చుకుని నువ్వు ఏడు రోజులు దానికి సేవ చేసావు” దీనికి శ్యాం ఇచ్చిన జవాబు “అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. నువ్వు మాత్రం ఇప్పటికీ చిన్నవాడివే. ఎదగలేదు”. మనిషి పుటుకతోనే స్వార్థాన్ని నేర్చుకోడు. చిన్నప్పుడు పక్షికి కాలు విరిగితేనే అల్లాడిన శ్యాం ఆ చిన్నతనం దాటి సమాజంలోకి ప్రవేశించాక స్వార్థపరుడిగా మారితే, విజయ్‌లో అదే నిజాయితీ ప్రేమ ఇంకా మిగిలి ఉన్నాయి. మనిషి స్వార్థపరుడిగా మారడమే ఎదగడం అని సమాజం నిర్ణయిస్తుందనే విషయాన్ని ఎంత సరళమైన సంభాషణతో చెప్పించారో గురుదత్ గమనించండి.

ఇక అప్పుడు ఆ గదిలోకి ఒక స్త్రీ వస్తుంది. శ్యాం స్త్రీ లోలుడన్న విషయం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. శ్యాం చేసిన సైగను గమనించి చాప పరుచుకుని నిద్రపోదామనుకున్న విజయ్ లేచి దిండు మంచం మీద సర్ది గదిలో నుండి బైటకు వచ్చేస్తాడు. ఆ స్త్రీ విజయ్ బైటకు రాగానే తలుపు వేస్తుంది. విజయ్ జీవితంలో అన్ని తలుపులు మూసేసింది సమాజం అన్న భావం తెప్పిస్తారు ఆ స్త్రీ శరీర భాషతో గురుదత్. అయిన వాళ్ళూ, స్నేహితులు, చివరకు పరాయి వాళ్ళూ అందరూ అతని మొహంపై తలుపులు వేసేవారే. ఏ చోటు లేక విజయ్ పార్కులో బెంచి పైకి చేరతాడు. అతనికి కొంత దూరంలో మరో బెంచి పై ఓ స్త్రీ కూర్చుని ఉంటుంది. అతన్ని చూసి ఆమె పాట ముందు వచ్చే సాకీ ఆలాపిస్తుంది. “ఫిర్ నా కీజే మెరీ గుస్తాక్ నిగాహీ కా గిలా దేఖియే ఆప్ నే ఫిర్ ప్యార్ సే దేఖా ముజ్కో” (మరో సారి నా కళ్ళు తప్పు చేసాయని ఫిర్యాదు చేయకండి. మీరు నా వైపు ప్రేమగా మరో సారి చూసారు మరి)

సాహిర్ రాసిన సాహిత్యంలో తనకు నచ్చిన పంక్తులను గురుదత్ ఈ సినిమాకు వాడుకున్నారు. ఈ సాకి సాహిర్ మరో కవితకు రాసుకున్న మొదటి పంక్తులు. వీటిని ఇక్కడ ఉపయోగించుకున్నారు గురుదత్. అయితే ఇవే వాక్యాలతో వచ్చే మొత్తం పాటను సాహిర్ మళ్ళీ “ఫిర్ సుబహ్ హోగీ” అనే సినిమాకు రాసారు. 1958లో వచ్చిన ఆ సినిమాలో రాజ్ కపూర్, మాలా సిన్హా ప్రధాన నటులు. రష్యన్ రచయిత దాస్కావ్స్కి పుస్తకం “క్రైమ్ అండ్ పనిష్‌మెంట్” ఆధారంగా తీసిన సినిమా లోని అద్భుతమైన పాట ఇది. అయితే ఒకే కవి రాసిన కవితలోని పంక్తులు ఇలా రెండు సినిమాలలో వాడుకోవడం సాహిర్ విషయంలో చాలా సార్లు జరిగింది.

(తన కవితను పాడుతూ తనతో రమ్మని సైగ చేస్తూ వెళుతున్న గులాబో వెంట విజయ్)

ఈ సాకి తరువాత వచ్చే పాట “జానే క్యా తూనే కహీ జానే క్యా మైనే సునీ” (నీవేమన్నావో, నేనేమని విన్నానో) అంటూ సాగుతుంది. గీతా దత్ గళంలోంచి వచ్చే ఈ పాట ఇచ్చే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమలో పడిన ఆ ఒక్క క్షణపు అనుభవాన్ని ఎంత అందంగా సాహిర్ వర్ణిస్తారంటే, అనుభూతిని అనుభవించడం కన్నా దాన్ని తిరిగి స్మరించుకోవడంలోని అందాన్ని ఈ పాట విన్న ప్రతివారూ అనుభవిస్తారు. కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయే ఆ పరిచయాన్ని, ఒకరిని మరొకరు కళ్ళెత్తి చూసుకోవడాన్ని, ఈ కలయిక ప్రేమికుల మనసులో రేగిన కలవరాన్ని కవి వర్ణించిన తీరు, గీతా దత్ గానం అజరామరం. “సర్ సరాహట్ సీ హుయీ, థర్ థరాహట్ సీ హుయీ, జాగ్ ఉఠే ఖాబ్ కయీ, బాత్ కుఛ్ బన్‌హీ  గయీ” (కాస్త గిలిగింత, కాస్త కలవరింత, ఎన్నో కలలు మేలుకొన్నాయి, ఒక బంధం ఏర్పడిపోయింది), “నైన్ ఝుక్ ఝుక్ కే ఉఠే, పావ్ రుక్ రుక్ కే ఉఠే, ఆ గయీ చాల్ నయీ” (కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. కాళ్ళూ తడబడిపోతున్నాయి, ఇలా కొత్త నడక మొదలయింది) ఇలా సాగే ఈ గీతంలో ఆ మొదటి చూపులోని ప్రేమ  గురి చేసిన తడబాటుని అద్భుతంగా వర్ణిస్తాడు సాహిర్.

విజయ్‌కి ఇది తను రాసిన కవిత అని అర్థం అవుతుంది. అయితే ఇది ఆ స్త్రీ ఎందుకు గానం చేస్తుందో అర్థం చేసుకోలేని వ్యక్తి కాదు. కాని అతనికి ఆ ఫైల్ కావాలి. అందుకని ఆమె వెనుక ఆమె ఇంటి వరకు వస్తాడు విజయ్. వీరి మధ్య నడిచే సంభాషణ చర్చించబోయే ముందు ఒక విషయాన్ని స్పష్టపరుచుకోవాలి.

ఇంత గొప్ప ప్రేమ గీతం విజయ్ రాసిందే కదా. ఇది ఫైల్ లో ఉండగా మరి షేక్ కు అది ఎందుకు కనిపించలేదు అనిపించవచ్చు ఆలోచించే ప్రేక్షకులకు. షేక్ దగ్గర ఇచ్చిన ఫైలులో ఆకలి, నిరుద్యోగంపై కవితలున్నాయి. నేను మీర్, మోమిన్ ల తో పాటు జోష్, ఫైజ్ కవితలను కూడా చదివాను అని అక్కడ షేక్‌తో చెబుతాడు విజయ్ కాని ప్రేమ కవితలు నేను రాయను అనో తానో ప్రేమ ద్వేషిని అనో చెప్పడు. ఇంట్లో తాను దాచి ఉంచుకున్న ఫైల్‌ని అన్నలు చెత్తవానికి అమ్మేస్తారు. ఆ ఫైల్ కోసమే తాను వెతుకుతున్నాడు. ఇది ఆ ఫైల్‌లో పాట. అంటే ఒకప్పుడు విజయ్ ఇలాంటి ప్రేమ కవితలు రాసిన యువకుడు. అంటే అతని జీవితంలో ప్రేమకి సంబంధించిన ఓ గతం ఉంది అన్నది దర్శకులు ఇక్కడ మనకు ఓ హింట్ ఇస్తున్నారు. ఇప్పుడు అతని జీవితంలో నిరుద్యోగం నిరాశ దోబూచులాడుతున్నాయి. అందుకే ఆ కవితలే అతను రాస్తున్నాడు. రొమాంటిజం నుండి కఠిన వాస్తవానికి వచ్చిన తరువాత విజయ్ కలం ప్రేమను మరిచి ఆకలి, అసహనాన్ని గురించి రాస్తుంది ఇప్పుడు. తానేమి అనుభవిస్తున్నాడో అదే రాయగలడు తప్ప మరొకటి రాయలేను అని మరో సన్నివేశంలో తరువాత్ విజయ్ చెప్పుకుంటాడు కూడా.  (హం గంజదా హై లాయే కహాన్ సే ఖుషీ కె గీత్/ దేంగె వహీ జో పాయేంగె ఇస్ జిందగీ సే హం) ఇక ఇప్పుడు విజయ్ గతం పట్ల ఆసక్తి కలుగుతుంది ప్రేక్షకులకు.

ఆ స్త్రీ విజయ్‌ను తన ఇంటికి తీసుకువెళుతుంది. ఇక్కడ వీరిద్దరి మధ్య నడిచే సంభాషణను గమనించండి. విజయ్ ఆమెను మర్యాదగా బహువచనంతో సంబోధిస్తాడు. కాని ఆ వేశ్య ప్రతిరోజు విటులతో గడిపే స్త్రీ. ఆమె భాషలో ఆ మృదుత్వం ఉండదు. అంత గొప్ప సాహిత్యాన్ని పాట రూపంలో విటులను ఆకర్షించడానికి ఉపయోగించుకోగల భాషా పటిమ ఉన్న ఆమె కూడా కస్టమర్లతో మాట్లాడుతున్నప్పుడు కొంత కాఠిన్యంతోనే మాట్లాడుతుంది. గమనిస్తే వీరిద్దరి సంభాషణ అదే కోణంలో సాగుతుంది. చివరకు విజయ్ దగ్గర డబ్బు లేదని తెలిసి ఆమె పక్కా బజారు మనిషిగా మారి చెప్పు తీసుకుని తంతాను అంటుంది. మనిషి చేసే వృత్తి, చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు వారు మాట్లాడే భాషపై ఎంతగా ప్రభావం చూపుతాయో అబ్రర్ అల్వీ తన సంభాషణల ద్వారా చూపిస్తారు. ఒక్క సీన్‌లో గులాబోలో ఈ మూడు పార్శ్వాలు చూపిస్తారు. పార్కులో కూర్చున్నప్పుడు గులాబో కవిత్వాన్ని ఆరాధించే స్త్రీ, విజయ్‌ను తన గదిలోకి రమ్మని ఆహ్వానిస్తున్న ఆమె ఒక వ్యాపారస్తురాలు, విజయ్ డబ్బు లేని వాడని తెలిసి అతన్ని దులిపేసే గులాబో ప్రపంచ అనుభవాలతో కటువుగా మారిన ఓ స్త్రీ. ఈ మూడూ పార్శ్వాలు కేవలం ఒక రెండు నిముషాల సీన్‌లో చూపించగలిగారు అబ్రర్, గురుదత్ ఇద్దరు కూడా. కాని విజయ్ ఇంకా వ్యాపారస్తుడూ కాలేదు, ప్రపంచం అతన్ని ఇంకా రాటు దేల్చలేదు. అందుకనే ఒకే స్థాయి భాషను ఉపయోగిస్తాడు. చివరకు గులాబో దులపరించడంతో తిరిగి వెళ్ళిపోతాడు. మొదటి సారి గులాబోను స్క్రీన్ పై చూపుతూ ఈ పాట ద్వారా ప్రవేశ పెడుతూ ఆమె వృత్తి, ప్రవృత్తిని పరిచయం చేస్తూ, ఆమె జీవితం మొత్తాన్ని తరువాతి రెండు నిముషాల సీన్‌లో చూపించారు గురుదత్.

గులాబో మాటలకు తిరిగి వెళ్ళిపోతున్న విజయ్ చేతిలోని ఫైల్ నుండి ఓ కాగితం జారిపడుతుంది. గులాబో దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఫైల్ కాగితాలతో దాన్ని పోల్చి చూసుకుంటుంది. అతను ఆ కవితలను రాసిన కవి అని తెలుసుకుని అతన్ని పిలవాలని బైటకు వస్తుంది. కాని అప్పటికే విజయ్ వెళ్ళిపోతాడు. ఈ సీన్‌లో గులాబో లోపలికి వెళ్ళి ఫైల్ తీసుకురావడం చూపించడంతో కొన్ని విషయాలు స్పష్టం అవుతాయి. చెత్త వాని వద్ద ఫైలు కొనుక్కుంది ఈమే అని. విజయ్ ఆ పాట ఉన్న ఫైలు నాకు కావాలి అని అంటున్నా అతని మాటను వినక అతన్ని ఇంటి నుండి తరిమేసిన గులాబో వద్దనే ఇంకా ఆ ఫైలు ఉందని, అందరూ చెత్త అనుకున్న ఆ గేయాలను ఆమె విపరీతంగా ఇష్టపడింది అని, ఆమె వేశ్య అయినా మనిషిలోని ప్రతిభను గుర్తించగల హృదయం ఉన్న స్త్రీ అని. ఆమె చేస్తున్న వృత్తికి ఆమె ప్రవృత్తికి ఎటువంటి సంబంధం లేదని. గులాబో లోపలికి వెళ్ళి ఫైల్ లోని కాగితాలతో ఈ కాగితాన్ని సరి చూసుకోవడం అనే ఒక్క సీన్ స్క్రీన్ పై ఒక అర నిముషం ఉంటుంది. కాని దానితో ఎన్ని విషయాలను స్పష్టపరిచారు గురుదత్.

ఈ సీన్‌లో మరో చిన్న పాత్ర మొదటిసారి కనిపిస్తుంది. ఆమె జుహి. గులాబో విజయ్‌ని గెంటేస్తున్నప్పుడు ఆమె తలుపు సందు నుండి తలను బైటకు పెట్టి కొత్త పిట్ట వచ్చాడు నీ అరుపులకు భయపడి చస్తాడు అంటుంది. దీనితో గులాబో ఉండేది ఒక వేశ్యా వాటిక అన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. విజయ్‌ని తాను తిట్టి పంపించానని బాధపడుతున్న గులాబోతో డబ్బు లేని వాడ్ని తిప్పి పంపక ఆదరిస్తావా అంటూ వెక్కిరిస్తుంది జుహి. వేశ్యా వాటికను చూపించాలంటే అర్ధ నగ్నంగా స్త్రీలను నుంచోబెట్టి కెమెరాతో వారి శరీరాలను తడిమితే కాని వారి వృత్తి గురించి ప్రేక్షకులకు అర్థం కాదు అనుకునే దర్శకులు ఈ ఇద్దరి స్త్రీల సంభాషణతో వారు జీవిస్తున్న పరిస్థితులను, చేస్తున్న వృత్తిని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు గురుదత్ చూపించిన విధానం అర్థం అవాలి.

విజయ్ సముద్రం ఒడ్డున ఆ రాత్రి గడుపుతాడు. కట్ చేస్తే కలకత్తాలోని పార్క్ స్ట్రీట్. ఒక పెద్ద కారు నుండి మీనా దిగుతుండగా చూస్తాడు విజయ్. మీనా అతన్నిచూడదు. ఆమెను చూసి విజయ్ గతంలోకి వెళ్ళిపోతాడు.

కాలేజ్‌లో క్లాస్ రూంలో ముగ్గురు స్నేహితుల మధ్య సరదా సంభాషణ, వీరిలో ఇద్దరు విజయ్, శ్యాం. వేసవి సెలవుల తరువాత కాలేజికి వచ్చారని అర్థం అవుతుంది. క్లాసులో కొత్తగా వచ్చిన మీనాపై కవిత్వం చెబుతాడు విజయ్. మీనా విజయ్ పట్ల మొదటి చూపులోనే ఆకర్షణను పెంచుకుంటుంది. ఇక అప్పుడు ఒక లావాటి అమ్మాయి క్లాసులోకి వస్తుంది. ఈమె పుష్పలత. ఈ పాత్రను టున్ టున్ వేసారు. తన భారీ శరీరంతో కామెడి పాత్రలువేసే టున్ టున్ గురుదత్ సినిమాలు చాలా వాటిల్లో కనిపిస్తారు. పుష్పలత పాత్రను గురుదత్ మలిచిన తీరు గమనించాలంటే బహుశా ఒక్కసారి ఈ సినిమా చూస్తే సరిపోదు. మొదటి సారి కథలో మునిగిపోతాం. గురుదత్ దర్శకత్వాన్ని ప్రతి సీన్‌లో చూస్తున్నప్పుడు పుష్పలత పాత్రను ఆయన ఎంత ఉదాత్తంగా మలచారో చూసి ఆశ్చర్యం వేసింది. క్లాస్‌లో అతి భారంగా గొడుగుతో వస్తుంది పుష్పలత. అందరూ నవ్వుతారు. బహుశా థియేటర్ లో ప్రేక్షకులు కూడా నవ్వుకుంటూ ఉండి ఉంటారు. అమాయకంగా మొహం పెట్టి ఆ భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ బెంచీల మధ్య దూరలేక పుష్ప ముందు పక్కవారి బెంచీని లాగి మీనా పక్క సీట్ లో కూర్చుంటుంది. అందరు నవ్వుతారు. తనను చూసి అందరూ నవ్వుతున్నారని తెలిసినా ఆమె కూడా వారితో పాటు నవ్వుతూ తాను పక్కవారికి అసౌకర్యం కలిగించి బెంచి లాగి తన స్థానంలోకి వచ్చానన్న ఇంగితంతో సున్నితంగా అ బెంచీని తిరిగి యధావిధిగా పెట్టేస్తుంది. ఇతరుల పట్ల ఎంత ఆదరణ, ప్రేమ ఆమెలో ఉంటాయో ఈ చిన్న చర్య చెబుతుంది. ఆమె ఆకారాన్ని చూసి నవ్వుతున్న వారెవ్వరూ ఇది గమనించరు. చివరకు ప్రేక్షకులకు కూడా కనీ కనిపించకుండా ఈ సీన్ నడుస్తుంది. గురుదత్ ఎంత సున్నితంగా తన పాత్రల వ్యక్తిత్వాన్ని చూపించేవారో, ప్రతి పాత్రకు ఒక సొంత వ్యక్తిత్వాన్ని ఎలా ఆపాదించేవారో అర్థం చేసుకోవాలంటే ఈ సీన్ చూడాలి.

(కాలేజీ లో మొదటి సారి మీనాను చూసి ఆమెను వర్ణిస్తున్న విజయ్)

సమాజం వ్యక్తుల శరీరాన్ని బట్టి, వారి స్థితిగతులను బట్టి ఎలా వారిని గౌరవిస్తూ అగౌరవిస్తూ ఉంటుందని ఆయన చెప్పాలనుకున్నారో దానికి కొనసాగింపుగా వచ్చే సీన్ ఇది. కాని అర్థం పర్థం లేని కామెడీ కోసం ఏర్పరిచినది కాదు. అది డైరక్షన్ అంటే, తన కథకు, తన పాత్రల వ్యక్తిత్వానికి ప్రతి సీన్, ప్రతి డైలాగ్‌ని లింక్ చేసుకుంటూ కొన్ని జీవితాలను సృష్టించి వాటితో కథ చెప్పించడం గొప్ప దర్శకుడు చేసే పని. తరువాత సీన్లలో డైలాగులు లేకుండా విజయ్ మీనాల మధ్య ఆకర్షణను, పెనవేసుకుంటున్న అనుబంధాన్ని చూపిస్తారు దర్శకులు.

వెంటనే చరణం నుండి ఓ పాట మొదలయి పల్లవితో ముగుస్తుంది. విజయ్ మీనాలు ఒకే సైకిల్ పై వస్తూ ఈ పాట పాడతారు. రఫీ గీతా దత్ పాడిన ఈ యుగళ గీతం ఎందుకిలా సగంతో మొదలయిందో అర్థం కాదు. కేవలం ఒక చరణం ఒక పల్లవి ఉండే ఈ పాట ట్యూన్ చాలా బావుంటుంది. “ఫీఛె ఫీచె దునియా హై ఆగే ఆగే హం” అంటూ వచ్చే ఈ పాట మొత్తం వినాలని ఎంత ప్రయత్నించినా ఇప్పుడు దొరకట్లేదు. దీని వలన కథనానికి నష్టం జరగకపోయినా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఈ పాట ట్యూన్ బావుండటంతో ఈ పాట పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఎవరినీ లెక్కచేయని టీనేజ్ మనస్తత్వాన్ని సూచించే పాట ఇది. సినిమా నిడివి పెద్దది అయిందని గురుదత్ ఎడిటింగ్ అప్పుడు పూర్తి పాటను కాక ఇలా సగం పాటను ఉంచి ఆ సీన్‌ని తగ్గించారంటారు కొందరు.

(సైకిల్ పై మీనా విజయ్)

గతంలోనించి బైట పడిన విజయ్ మీనా కోసం వెతుకుతాడు. ఆమె కనపడదు. ఒక లావు వ్యక్తి షాపులోనించి చాలా పాకెట్లు పట్టుకుని కూలి కోసం పిలుస్తూ ఉంటాడు. నేను వాటిని కారులో పెడతాను అంటాడు విజయ్. చదువుకుని కూలి పని చేస్తున్నారే అని వాపోతూ ఆ సామాన్లు విజయ్‌తో మోయించి ఒక రూపాయి కూలి అతనికి ఇస్తాడు ఆ ఆసామి.

ఒక చిన్న హోటల్‌లో భోజనం చేస్తుంటాడు విజయ్. అతని కళ్ళల్లో ఆకలి కనిపిస్తూ ఉంటుంది. ఆత్రంగా అన్నం తింటున్న అతన్ని చూసి డబ్బులు తెచ్చావా ఇవాళ, అప్పు దొరకదు అంటాడు ఆ హోటల్ యజమాని. చేతిలో ఉన్న నాణం అతని వైపుకు విసురుతాడు విజయ్. దాని చప్పుడుని పరీక్షించి ఇది సత్తు రూపాయి అని అంటాడు హోటల్ యజమాని. ఆ మాట వినగానే విజయ్ మొహంలోని షాక్ చూడాలి. సినిమాలో అద్భుతమైన సీన్ ఇది. నోటి ముందున్న కంచం లాక్కుంటారని ఆకలితో ఉన్న మనిషి కళ్ళలో కనిపించే భయం అది. ఆ ఒక్క అర క్షణం పాటు విజయ్ కళ్ళలో ఆ భయాన్ని వీ.కే మూర్తి కెమెరా చాలా గొప్పగా పట్టుకుంటుంది.

(హోటల్‌లో భోంచేస్తున్న విజయ్. గుప్పెటలో ఉన్నది సత్తు రూపాయి. అది ఇచ్చే ధైర్యం ఆ కళ్ళలో చూడండి)

తనను సత్తు రూపాయితో మోసం చేసావంటూ మండి పడతాడు ఆ హోటల్ యజమాని. పైగా సర్వర్‌తో ఆ అన్నం ప్లేటు తీసేయమని చెబుతాడు. ఇక్కడ మరోసారి అన్నం తింటున్న వ్యక్తి ఆకలి తీర్చుకునే క్రమంలో అవమానాన్ని దిగమింగుకుంటూ కనిపిస్తాడు. గురుదత్ సినిమాలలో ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గులాబో హోటల్ యజమాని ముఖంపై డబ్బులు పడేస్తుంది. తింటున్న కంచం నుండి మనిషిని ఎలా లేపుతారని అడుగుతూ, మిగిలిన చిల్లరతో మంగలి దగ్గరకు వెళ్ళి క్షవరం చేయించుకుని మనిషిగా మొహాన్నిమార్చుకొమ్మని అతనిపై విరుచుకు పడుతుంది. తిండి తినకుండా తల వంచుకుని కూర్చున్న విజయ్‌ని భోజనం చేయమని అడుగుతుంది. ఇక్కడ ఈ రెండు పాత్రల మధ్య నడిచే సంభాషణ కూడా ఈ సినిమాలో వచ్చే మరో గొప్ప సీన్. గులాబో విజయ్‌ని నువ్వు అనే సంబోధిస్తుంది. కాని ఆమె వేశ్య అని అర్థం అయినా కూడా ఆ క్షణంలో కూడా విజయ్ ఆమెను మీరు అనే పిలుస్తాడు. నా మీద మీరు జాలి చూపించక్కరలేదు అంటాడు. మళ్ళీ తన పరుషమైన మాటకు తానే బాధపడి క్షమాపణ కోరతాడు. నిన్న నిన్నుఅవమానించినందుకు నీకు నాపై కోపం రావడం తప్పు కాదు అంటుంది గులాబో. అన్నం తినమని అడుగుతుంది లేదంటే తన మీద ఒట్టని చెబుతుంది. మీరెందుకు ఒట్టేయించుకుంటున్నారని ఆశ్చర్యపోతాడు విజయ్. కనీసం నేనెవ్వరో కూడా మీకు తెలియదే అంటాడు. దానికి గులాబో మీరు నాకు బాగా తెలుసు. మీ కవితల నుండి గేయాల నుండి నేను మిమ్మల్ని తెలుసుకున్నాను. ఇంత తెలుసుకున్నాక ఇంకా తెలుసుకునేది ఏం ఉంది అని ప్రశ్నిస్తుంది. విజయ్ ప్రపంచంలో తన ఆలోచనల ద్వారా, కవిత్వం ద్వారా గుర్తింపు పొందాలనుకుంటాడు. కాని ప్రపంచం డబ్బు, పదవులతో మనిషిని ఎంచుతుంది కాని ప్రతిభతో కాదు. అతని ప్రతిభను ఎంచి గుర్తించి అతన్ని ప్రస్తుతం గౌరవిస్తుంది సమాజం బహిష్కరించిన వేశ్య అయిన గులాబో మాత్రమే.

గులాబో నన్ను ‘మీరు’ అని ఎందుకు సంభోధిస్తున్నారు అని విజయ్‌ని అడుగుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అందరి చీత్కారాల మధ్య పెరిగిన దానిని, మీరొక్కరే నన్ను మర్యాదగా చూసారు అని అంటుంది. ఈ సీన్ గురించి రాస్తూ అబ్రర్ అల్వీ, తనకి నిజజీవితంలో గులాబో అనే ఒక వేశ్యకి మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా ఇక్కడ రాసానని తన పుస్తకంలో చెప్పుకొస్తారు. ఈ షాట్ దగ్గర మూర్తి పనితనం చూడాలి. వారిద్దరి మొహాల పై కెమెరా ఫోకస్ లో ఈ రెండు పాత్రల ముఖం కదలికలను వారి కను గుడ్ల కదలికను కూడా పట్టుకుంటుంది మూర్తి కేమెరా.

(చిన్నతనం నుండి తను చీత్కారాలకే అలవాటు పడ్డానని గులాబో విజయ్ తో చెప్పడం)

సినిమాను ఇలా క్లోజప్ షాట్లతో మొత్తం నడిపించేటప్పుడు నటుల ప్రతి ఎక్స్‌ప్రెషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక కనురెప్ప అనుకోకుండా కదిలినా షాట్ మళ్ళీ తీయాల్సిందే. గురుదత్ అలా ప్రతి సీన్‌లో తాననుకున్న ఎమోషన్ వచ్చేదాక ఎన్నో రీటేక్స్ తీసేవారట. ఆయన ఎంత పర్ఫెక్షన్ కోరుకునేవారో ‘ప్యాసా’ లో ప్రతి సీన్‌లో చూడవచ్చు. ఒక్క నటుడి చేయి కదలిక, మొహం కదలిక, కళ్ళు కెమెరా దృష్టి నుండి కదలడం లాంటి చిన్ని తేడాను కూడా తప్పుగా ఈ సినిమాలో పట్టుకోలేం. అంత పర్ఫెక్ట్ షాట్లతో ఉంటుంది సినిమా అంతా. ఈ సీన్లో విజయ్, గులాబో మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరి సంభాషణను మరొకరు వినే పద్ధతి చూడండి. మనల్ని మనలా స్వీకరించి మనం చెప్పేది మనసుతో వినే వ్యక్తి దొరికినప్పుడు అవతలి వారిలో కలిగే ఆ ఆత్రం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ఈ సీన్‌లో గురుదత్, వహీదా రెహ్మాన్ల సంభాషణ మాటలతో కన్నా కళ్లతో ఎక్కువగా జరగడం చూస్తాం. గులాబో చెప్పింది విని ఆమెతో ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోతాడు విజయ్. కనీసం ఆమెతో వెళుతున్నానని కూడా చెప్పడు. మనసు విపరీతంగా స్పందిస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక అక్కడ నుండి నిష్క్రమించే ఒక ఇంట్రోవర్ట్ ప్రవర్తన ఇది. దాన్ని సరిగ్గా అలాగే చూపిస్తాడు గురుదత్.

విజయ్ పాత్రను గమనిస్తే తనకు ఇష్టం లేనిది జరుగుతున్నా, తాను భరించలేని విషయాన్ని చూడవలసి వచ్చినా అతను వెంటనే అక్కడి నుండి తప్పుకోవడం చూస్తాం. సినిమా ప్రారంభంలో తుమ్మెదను కాళ్ళ క్రింద నలిపేసిన వ్యక్తి కాలుని చూసి అంతే అసహనంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్. షేక్ దగ్గర, అన్నదమ్ముల దగ్గర కూడా సంభాషణ నచ్చనప్పుడు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు గులాబో గతాన్ని వింటూన్నప్పుడు కూడా అంతే అసహనంగా అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. మనసుకు బాధ కలిగించే ప్రతి సందర్భంలోనూ నిష్క్రమణనే కోరుకునే అతని వ్యక్తిత్వాన్ని సినిమాలు చాలా సార్లు చూస్తాం. చివరకు ఆఖరి సీన్ కూడా… గురుదత్ నిజ జీవిత నిష్క్రమణ కూడా ఈ కోవకే వస్తుందేమో.

విజయ్ గులాబోలు కలుసుకున్నప్పుడు ఎప్పుడు కూడా పరిచయ వాక్యాలతో సంభాషణ మొదలెట్టడం కనపడదు. ఎక్కడ, ఏ పరిస్థితులలో కలుసుకున్నా ఎప్పటి నుండో ఒకరితో ఒకరు కలిసి ఉన్నట్లుగానే ప్రవర్తిస్తారు ఇద్దరు కూడా. అప్పుడే అవతలి వారిని చూసిన ఆశ్చర్యం ఇద్దరిలోని ఏక్కడా కనిపించదు. మళ్ళీ విడిపోయేటప్పుడూ కూడా అలాగే వెళ్ళిపోతారు. ఈ సీన్‌లో తన బాధ చెబుతూ పక్కకు తిరిగిన గులాబో, తిరిగి చూసే సరికి విజయ్ అక్కడ ఉండడు. ఏ రకమైన మర్యాద, ఫార్మాలిటీలు చివరి దాకా ఒకరి పట్ల మరొకరు చూపించుకోరు. కాని వారు కలుసుకున్న ప్రతి సీన్ కూడా రెండు మనసుల సంభాషణలా అనిపిస్తుంది. ఒకరి పై ఒకరు పదాలతో ప్రేమను ప్రదర్శించుకోరు. కాని ఒకరి పట్ల ఒకరికి ఉన్న నమ్మకం వారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆ పాత్రల శరీర భాష ద్వారా గురుదత్ వ్యక్తీకరింప జేస్తె, వీ.కే. మూర్తి దాన్ని సరిగ్గా తన కెమెరాతో పట్టుకోగలిగారు. చాలా షాట్లలో సంభాషణలు లేని చోట మూర్తి కెమెరా పనితనం కనిపిస్తూ ఉంటుంది. గురుదత్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలలో మూర్తి కెమెరాతో మాత్రమే కథను నడిపించారు.

ఇక్కడ నుండి సీన్ మారి సత్తార్ స్క్రీన్ పై కనిపిస్తాడు. మాలిష్ చేసుకునే సత్తార్ మొదటి సారి స్క్రీన్ పై కనిపించే సన్నివేశం ఇది. మాలిష్ చేస్తానంటూ కస్టమర్ల కోసం పార్క్‌లో గాలిస్తూ ఉంటాడు సత్తార్. రఫీ గొంతుతో ఈ పాట వినిపిస్తుంది “సర్ జో తెరా చకరాయే యా దిల్ డూబా జాయే ఆజా ప్యారే పాస్ హమారే” (తల తిరుగుతున్నా, మనసు బాలేకున్నా నా దగ్గరకు రండి) అంటూ సాహిర్ పాటతో సత్తార్ స్క్రీన్ పై రంగప్రవేశం చేస్తాడు. ఈ సాధారణమైన సీన్‌లో వచ్చే పాటలో సాహిర్ చొప్పించిన గంభీరమైన సామ్యవాద భావం గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ పాట కోసం కూడా గురుదత్ ఎన్నుకున్న ఎక్స్‌ట్రా నటులను గమనించండి, అతని పర్ఫెక్షనిజం అర్థం అవుతుంది. చివర్లో హీరా అనే లావు పాటి ఆర్టిస్టుతో కామెడీని పండిస్తూ రఫీ గానం, జానీ వాకర్ నటన, సాహిర్ సాహిత్యం ఈ మాలిష్ పాటను హిందీ సినీ గీతాలలో అజరామరం చేసింది.

(సత్తార్)

పాట చివర్లో విజయ్ పార్కులోకి వస్తాడు. ఈ పాటను అతనే రాసాడని అప్పటి నుండి తన బిజినెస్ పెరిగిందని కస్టమర్‌తో చెబుతాడు సత్తార్. విజయ్ ప్రతిభను గుర్తించిన మరో వ్యక్తిగా ప్రేక్షకులకు పరిచయం అవుతాడు సత్తార్. ఈ పాట తనకు రాసిచ్చినందుకు డబ్బులు తీసుకోకుండా విజయ్‌కి మాలిష్ చేస్తానంటాడు సత్తార్. తనకు సహాయం చేసిన వ్యక్తికి బదులుగా తానూ ఏదో చేయాలనుకునే నిజాయితీ గల పేదవాని హృదయం సత్తార్‌లో కనిపిస్తుంది. బదులుగా విజయ్ “వద్దు సత్తార్. ఈ మధ్య జీవితం నన్ను ఎంతగా నలిపేసిందంటే ఇంకే మాలిష్ అవసరం లేదు” అంటాడు. “అంతగా నలిపివేయబడిన తరువాత కూడా చిరునవ్వు చిందిస్తున్నావే. ఎలాంటి సందర్భంలో కూడా ఒకేలా ఉండగల వారిని ఇద్దరినే చూసాను అవి ఎండాకాలంలో గాడిద, చలికాలంలో కవి” అంటాడు సత్తార్. దీనికి బదులుగా విజయ్ “నిజం చెప్పావు సత్తార్ కాలం వేడి అయినా డబ్బు వేడి అయినా గాడిదలే ఒళ్ళు తెలియకుండా జీవిస్తాయి” అంటాడు.

మనిషికి తన ఆలోచనలను తన స్థాయిలోనే అర్థం చేసుకోగల వ్యక్తుల అవసరం చాలా ఉంటుంది. వారి కోసం అన్వేషిస్తాడు. అటువంటి వ్యక్తులు తన చుట్టూ లేకపోతే ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. విజయ్ అనే ఒక కవికి తనలోని అసహనాన్ని చెప్పుకోవడానికి, తనని తానుగా స్వీకరించి అర్థం చేసుకునే స్నేహితుడిగా మాలిష్ చేసుకునే సత్తార్ మాత్రమే కనిపించడం, ప్రపంచంలో మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తుంది. అందుకే ఈ సీన్‌లో వారిద్దరి మధ్య ఉన్న ఆ అర్థం చేసుకోగల తత్వాన్ని బోధపరచడానికి ఇంత భారీ ఫిలాసఫీని డైలాగులలో చొప్పించారు అబ్రర్. ఈ సీన్ విజయ్ సత్తార్ల మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది. పాల్ గోగిన్ అనే చిత్రకారుడు పారిస్‌లో ఉద్యోగాన్ని, కుటుంబాన్ని డబ్బుని వదిలి తాహితీ అనే ద్వీపంలో ఆది మానవులుగా సంచరించే వ్యక్తుల మధ్య ఉండిపోయి అక్కడే కట్టుకున్న గుడిసె గోడల మీద చిత్రాలు చిత్రించేవాడట. నాగరిక మనుషుల కన్నాఈ శ్రమైక మనుషులులో మానవత్వం, కళ పట్ల గౌరవం ఎక్కువగా ఉంటాయని గాగిన్ జీవితం చెబుతుంది. సత్తార్‌తో విజయ్‌కి ఏర్పడ అనుబంధం మరో కళాకారుడి అనుభవం కూడా.

సత్తార్‌కి అక్కడ జూహి కనిపిస్తుంది. పని వదిలిపెట్టి ఆమె దగ్గరకు వెళతడు సత్తార్. అలంకరించుకుని విటుల కోసం పార్కులో నిలబడి ఉంటుంది జూహి. ఆమెపై తనకున్న ప్రేమను ప్రకటిస్తాడు. పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. కాని ఆమె ఇదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. సత్తార్ లాంటి వ్యక్తిని నమ్ముకుని జీవించవచ్చని ఆమె అనుభవం ఆమెకు నేర్పలేదు మరి.

మరుసటి రోజు విజయ్ పార్కులో పడుకుని ఉంటాడు. పుష్పలత తన భారీ శరీరంతో పరుగెత్తుతూ ఇద్దరు పిల్లల వెంట పరుగెత్తుతూ అక్కడకు వస్తుంది. విజయ్ ని పిలిచి పరుగెత్తుతున్న పిల్లవాన్ని పట్టుకొమ్మని అడుగుతుంది. పారిపోతున్న పిల్లలను పట్టుకుని ఆపుతాడు విజయ్, పుష్పని గుర్తుపట్టి పలకరిస్తాడు. అతన్ని చూసి ఏ భేషజాలు లేకుండా “నువ్వా విజయ్, గుర్తు పట్టలేదు సుమా. కాలేజీలో ఎంత షోగ్గా ఉండేవాడివి, ఇప్పుడు ఇలా మజ్నూగా మారి ఎవరి వెంట తిరుగుతున్నావ్” అని అడుగుతుంది. విజయ్ బదులుగా “నిరుద్యోగం వెంట” అని జవాబిస్తాడు. పుష్పకి అతను చెప్పినది అర్థం కాదు. “ఈ పిల్లలు నీ పిల్లలా” అన్న ప్రశ్నకు, “వారి నాన్న పిల్లలు కూడా. వీడు గుల్లూ, వీడు ఫుల్లూ” అని జవాబిస్తూ వీరి నాన్న పేరు కూడా ఇలానే ఉంటుంది అని సమాధానమిస్తుంది. హిందీ భాషీయులకు టక్కుమని “ఉల్లూ” అన్న పదం గుర్తుకువచ్చేలా. కామెడీ స్థాయి గురుదత్ సినిమాలలో ఇలాగే ఉండేది. కామెడీ సంభాషణలు ఎక్కడా కథ ఫ్లోని సీన్లోని కథనాన్ని దెబ్బతీయవు. వెళ్లిపోతూ ఇవాళ సాయంత్రం కాలేజీలో పూర్వ విద్యార్ధులు కలుస్తున్నారని ఆ ఫంక్షన్‌కి తప్పకుండా రమ్మని చెప్పి ఎలా వచ్చిందో అలాగే పిల్లల వెంట పరుగెత్తుతూ వెళ్ళిపోతుంది పుష్పలత.

పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ విజయ్ కాలేజి ఆవరణలోకి ప్రవేశిస్తాడు. మీనాతో అతను పాడిన పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ ఉంటుంది. కాలేజీలో స్టేజీ పై రావలసిన కవి రాలేదని పుష్ప టెన్షన్ పడుతూ ఉంటుంది. బైట ఆమెకు విజయ్ కనిపిస్తాడు. బైటకు వచ్చి విజయ్‌ని లోపలకు రమ్మని బలవంత పెడుతుంది. విజయ్ లోపలికి రావడానికి ఇబ్బంది పడతాడు. నా బట్టలు అంటూ నసుగుతాడు. ఇక్కడ మరోసారి పుష్పలత వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తాడు గురుదత్. “బట్టలకేం ఉన్నాయిగా పై నుండి క్రింద దాకా ఒళ్లంతా కప్పుతూ” అని బదులిస్తుంది పుష్పలత. మనిషి వేసుకునే బట్టల ఖరీదు బట్టి మనిషికి గౌరవం ఇచ్చే సమాజం మధ్య బట్టలు ఒళ్ళు కప్పుకోడానికి కాని మరెందుకు అని అమాయకంగా ప్రశ్నించే పుష్పలత ఏ భేషజాలు లేని వ్యక్తి అని మనిషిని మనిషిగా గుర్తించే స్త్రీ అని, కాని ఆమె శరీరాకృతి కారణంగా ఈ అందమైన వ్యక్తిత్వం సమాజానికి కనిపించకుండా పోయిందని మరో మారు చూపిస్తారు గురుదత్. ఈ ఒక్క డైలాగుతో పుష్పలత పాత్ర స్థాయిని ఆయన పెంచిన తీరు గమనించాలి. విజయ్‌ని లాక్కుంటూ పుష్పలత స్టేజీ పైకి తీసుకుని వెళ్ళి ఓ కవిత వినిపించమని చెబుతుంది. మైక్ వద్ద నిలబడిన విజయ్‌కు ముందు వరుసలో కూర్చున్న మీనా కనిపిస్తుంది. మీనా కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇక్కడ బాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ మౌత్ ఆర్గన్ పై పదిహేడేళ్ళ ఆర్.డీ బర్మన్ కంపోజ్ చేసి స్వయంగా వాయించారని మరో సందర్భంలో చెప్పుకున్నాం. ఇక్కడ గురుదత్, మాలా సిన్హాల పై కెమెరా పనితనం చూడండి. పూర్తి వెలుగులో బ్రైట్ గా ఫోకస్ లో ఉంటుంది మాలా సిన్హా. ఆమె జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉందో చెప్పే దృశ్యం అది. మైక్ దగ్గర్ గురుదత్ మొహాన అన్నీ నీడలు. చేయితో మొహాన్ని కప్పేసుకుని అతను కవిత చదివేటప్పుడు పూర్తిగా చీకటిలో ఉంటాడు విజయ్. విజయ్ పాత్రలోని విషాదాన్ని, అతని జీవితంలోని ఓటమిని కెమెరా ఇలా బైటపెడుతుంది. చేయి ముఖంపై నుండి తీయగానే సగం మొహం వెలుతురులో సగం చీకటిలో ఉంటుంది. మాటలతో చెప్పలేని భావాలను ఈ కెమెరాలోని చీకటి వెలుగులు దృశ్యంతో బంధిస్తాయి.

“తంగ్ ఆ చుకే హై కష్మకషే జిందగీ సే హమ్ ఠుకరా న దే జహా కో కహీ బేదిలీ సే హం.( ఈ జీవన పోరాటం లో అలసిపోయాను, నిస్పృహతో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతానేమో) అంటూ కవిత అందుకుంటాడు విజయ్. కెమెరా మీనా పాత్రలో ఉన్న మాల్ సిన్హా పై ఫోకస్ అయేటప్పుడూ ఆమె వెనుక వరుసలో అటుపక్కన కూర్చున రెహ్మాన్ కనిపిస్తారు. నిశితంగా మీనాను గమనిస్తూ ఉంటాడు అతను. ప్రేక్షకులకు అతనే మీనా భర్త అని అర్థం అవుతుంది. ప్రేక్షకులలోంచి ఒకరు ఈ సంతోష సమయంలో ఈ విషాద గీతం ఏంటీ, ఏదన్నా సంతోషమైన గీతం వినిపించండి అని గట్టిగా ప్రశ్నిస్తారు. దానికి బదులుగా విజయ్ “హమ్ గమ్ జదాహై లాయే కహా సే ఖుషీ కే గీత్” (నేను విషాదంతో నిండి ఉన్నవాన్నీ సంతోషపు గీతాలు ఎక్కడి నుండి తేను) దేంగే వహీ జీ పాయెంగె ఇస్ జిందగీ సే హం.(ఈ జీవితంలో ఏది దొరుకుతుందో అదే ఇవ్వగలను) అంటూ జవాబిస్తాడు. విజయ్ వ్యక్తిత్వానికి నిజ జీవితంలో గురుదత్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న వాక్యాలివి. మనసు లోపల దుఖంతో మూల్గుతుంటే పైకి సుఖాన్ని నటించలేను అని చెప్పుకునే విజయ్ పాత్ర ఇక్కడ ప్రేక్షకులకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ సమాజంతో నేను నటిస్తూ ముందుకు సాగలేకపోవడమే నా అసమర్థత అని ఇలా తనను తాను ప్రకటించుకుంటాడు విజయ్.

(కాలేజీలో కవితాగానం చేస్తున్న విజయ్)

రఫీ గొంతులో వచ్చే ఈ కవితను గురుదత్ అభినయించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. తన శరీరాన్ని కొంచేం వంచి ఒక రకమైన నిస్సహాయతను ఆయన తన శరీరంతో ప్రదర్శిస్తారు. ఈ జీవితంలో నాకు ఏం దొరుకుతుందో అదే తిరిగి ఇవ్వగలను అన్న వాక్యం దగ్గర గురుదత్ ముఖం పై వ్యంగ్యంతో కూడిన ఒక చిరునవ్వు చూస్తాం. కెమెరా యాంగిల్ మారి మీనా పై ఫోకస్ అయినప్పుడూ అమె మొహంలో  చిన్న పశ్చాత్తపం కనిపిస్తుంది. అటు పక్క కూర్చున్న అమె భర్తకు విషయం పూర్తిగా అర్థం అయిందని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. “ఉభరేంగే ఏక్ బార్ అభీ దిల్ కే వల్ వలే, మానా కె దబ్ గయే హై గమే జిందగీ సే హం” (జీవితంలోని విషాదం నన్ను ముంచేసినా, మరో సారి ఇప్పుడు నా మనసులోని ఆవేశం బైటపడబోతుంది) అంటూ కవిత సాగుతుంది. ఇక్కడ ఈ కవిత రాసిన సాహిర్ గురించి మరో సారి చెప్పుకోవాలి. ఎంతటి తీవ్ర విషాదంలో కూడా తల వంచని పట్టుదలను సాహిర్ తన కవిత్వంలో ప్రదర్శిస్తారు. జీవితంలో ఎంతటి విషాదం నన్ను చుట్టుముట్టినా మనసులోని ఆవేశం ఇంకా బ్రతికే ఉంది. అది ఇలా కవిత్వం రూపంలో ప్రకటితమౌతూనే ఉంటుంది అని ఎంత గర్వంగా చెప్పుకుంటాడంటే నేనో కవిని ఎవరికీ లొంగను అన్న భావం ఈ వాక్యంలో కనిపిస్తుంది. అది ప్రాణాలు తీసే విషాదమయినా, అత్మను హత్య చేసే సమాజమయినా, నాలోని ఆవేశం ఇలా సందర్భాన్ని బట్టి బైటపడుతూనే ఉంటుంది అని ప్రకటించుకోవడం ఒక్క సాహిర్‌కే సాధ్యం. నేనింకా చావలేదు. నాలో ఆవేశం అణిగిపోలేదు అన్న అర్థంతో వచ్చే వాక్యాలు ఇవి. దీని తరువాత “లో ఆజ్ హమ్నే తోడ్ దియా రిష్త-ఎ-ఉమ్మీద్,  లో అబ్ కభీ గిలా న కరేంగే కిసీ సే హం” (ఇంక ఈ రోజుతో నేను బంధాలపై నమ్మకాన్ని వదిలేస్తున్నాను. ఇక ఎప్పుడూ ఎవరిపై ఫిర్యాదు చేయను) అని కవిత ను ముగిస్తాడు విజయ్. తనకు ఏమీ చెప్పకుండా హఠాత్తుగా తన జీవితంలోనించి వెళ్ళిపోయిన మీనా ఈ రోజు ఒక గొప్పింటి స్త్రీగా కనిపించిన తరువాత ఆమె తనను ఎందుకు వదిలేసిందో విజయ్‌కి అర్థం అవుతుంది, ఇక బంధాలపై నమ్మకాన్ని వదిలేస్తున్నాను అని తాను ప్రకటిస్తూ, ఇక ఎవరిపై ఎక్కడా ఫిర్యాదు చేయను అంటాడు. ఒక మనిషితో సంబంధాన్ని వదులుకుంటున్న సూచన అది. ఒక వ్యక్తి పట్ల ఆశ, ప్రేమ, కోరిక ఉన్నప్పుడే అవతలి వ్యక్తి నుండి మనకు కావలసింది దొరకనప్పుడు, మనల్ని వినే వారున్నారన్న నమ్మకం ఉన్నప్పుడు, ఫిర్యాదు చేసే పరిస్థితి వస్తుంది. ఇక ఏ బంధమూ లెకపోతే ఫిర్యాదు లెందుకు? ఎవరికి? ఆ వ్యక్తిపై ఏ ఫిర్యాదు లేదంటే ప్రేమ అనే బంధం ముగిసినట్లే. దీన్ని సూచిస్తూ తన స్వార్ధం కోసం తనను వదిలి వెళ్ళిన వ్యక్తి చేసిన మోసానికి బదులుగా అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఫిర్యాదులే లేని పరిస్థితికి ఆ బంధాన్ని తీసుకువచ్చి ఇక మన మధ్య ఏం ఉందని అంటూ ప్రశ్నించడం ఒక సాహిర్‌కే చెల్లింది. దీన్ని అద్భుతంగా గానం చేయడం రఫీ వంతైతే స్క్రీన్‌పై అద్భుతంగా అభినయం చేస్తారు గురుదత్. వీ.కే మూర్తి ఇక్కడ కెమెరాతో సృష్టించిన మూడ్ అంతే గొప్పగా ఉంటుంది.

ఈ సీన్‌తో మిస్టర్ ఘోష్ పరిచయం జరిగిపోతుంది. ప్రేక్షకులకు ఆ పాత్ర స్వభావం పూర్తిగా తెలిసిపోతుంది. భార్యను కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకునే ఒక సగటు మగవాడు, భార్య మరొకరిని ప్రేమించిందేమో అన్న అనుమానం కన్నా ఆ వ్యక్తి తనకన్నా ఎందులో గొప్ప అన్న అహం నరనరాలలో జీర్ణించుకున్న పురుషుడుగా మిస్టర్ ఘోష్‌ని ఈ సీన్‌లో పరిచయం చేస్తారు గురుదత్. కెమెరా హీరో హీరోయిన్ల మద్య ఫోకస్ అయినా మధ్యలో ఘోష్ పాత్రను ప్రవేశపెట్టి ఆ సీన్ నడిపిస్తూనే ఘోష్ గురించి ఇంత సమాచారాన్ని ప్రేక్షకుల మెదళ్ళలోకి ఎక్కించగలిగారు గురుదత్. మరో అనవసరమైన సీన్, కథలోని గాంభీర్యాన్ని తగ్గించే కథనం లేకుండా హీరో హీరోయిన్ల ప్రాధాన్యత తగ్గించకుండా, సీన్‌లో సీరియస్‌నెస్ చెడకుండా మరో ముఖ్యమైన పాత్రను అదీ నెగెటివ్ షేడ్స్‌తో ప్రవేశపెడుతూ అతని వ్యక్తిత్వాన్ని కూడా ఇదే సీన్ లో పరిచయం చేయడం దర్శకత్వ ప్రతిభే కదా…

(మీనా వెనుక కూర్చున్న మిస్టర్ ఘోష్. కెమెరా అతని కళ్ళలోని భావాన్ని ఎలా పట్టుకుందో చూడండి)

ఈ ఘజల్‌ను సాహిర్ అంతకు ముందే రాసుకున్నారు. దానిలో కొన్నిచరణాలను మాత్రమే గురుదత్ ‘ప్యాసా’ లో ఉపయోగించుకున్నారు. ఈ పూర్తి ఘజల్ ను 1958లో వచ్చిన ‘లైట్ హౌస్’ సినిమాలో ఆశా భోస్లే గానం చేయగా నూతన్ పై చిత్రించారు. ‘ప్యాసా’ లో ఎస్ డీ బర్మన్ దీనికి సంగీతాన్నిస్తే, ‘లైట్ హౌస్” లో దత్తా నాయక్ ఈ కవితను గీతంగా మలిచారు. సాహిర్ కవితలను ఇలా ఒకటి కన్నా ఎక్కువ సినిమాలలో మరో విధంగా వాడుకోవడం కొత్త కాదు అని ముందే చెప్పుకున్నాం కదా..

విజయ్ పాడిన ఈ ఘజల్ విని హల్ నిశబ్దంగా మారుతుంది. మనసు విషాదంతో నిండగా విజయ్ హాల్ బైటకు వస్తాడు. అక్కడ ఘోష్ అతన్ని ఆపుతాడు. విజయ్ అక్కడ ఒకప్పటి ఓల్డ్ స్టూడెంట్ అని తెలుసుకుని అతను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకుని అతని ఘజల్ బావుందని మెచ్చుకుంటాడు. తన కార్డ్ ఇచ్చి మరుసటి రోజు ఆఫీసుకు రమ్మని పిలుస్తాడు. కార్డ్ మీద “మార్డన్ పబ్లిషింగ్ హౌస్” అన్న పేరు చదివి విజయ్ మొహంలో ఆశ చిగురిస్తుంది. తన కవిత్వాన్ని ప్రపంచం వద్దకు చేర్చడానికి ఒక దారి దొరుకుతుందనే ఆశ అది. ఆ కార్డ్ ఇచ్చింది స్వయంగా అ సంస్థ యజమాని అని తెలుసుకుని అతని ముఖంలో పోయిన కళ తిరిగి వస్తుంది.

మరుసటి రోజు విజయ్ ఘోష్ ఆఫీసుకు తన కవితలున్న ఫైలు తీసుకుని వస్తాడు. ఘోష్ మాత్రం విజయ్ కాలేజ్ లో ఏ సంవత్సరం చదివాడని అడుగుతాడు. 1948 నుండి 52 వరకు అని చెబుతడు విజయ్. 52 లోనే తన వివాహం జరిగిందని చెబుతాడు ఘోష్. ఇవన్ని ఆయన తనకెందుకు చెబుతున్నాడో విజయ్‌కి అర్థం కాదు తన కవితలు చూడమని, లేదా తానే చదువుతానని అడుగుతాడు. ఈ కవిత్వం పట్ల అసక్తి లేని ఘోష్, తన అఫీసులో అటెండర్ ఉద్యోగం చేయమని విజయ్‌ని అడుగుతాడు. కవిత్వం ఫైలు అక్కడ పెట్టి వెళ్ళమని చెబుతాడు. విజయ్ అయోమయంలో పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఘోష్ ఆఫీసు నుండి బైటకు వచ్చిన విజయ్ లిఫ్ట్ దగ్గరకు వస్తాడు. ఈ లిఫ్ట్ లో సీన్, ఈ సంభాషణ హిందీ సినిమాలలో గొప్ప సీన్లలో ఒకటిగా చెప్పుకోవాలి. లిఫ్ట్ ఇనప డోరు తెరుచుకుంటుంది. మీనా లిప్ట్ లో ఉంటుంది. డోరు తెరుచుకునే సీన్ లో విజయ్ తనను తాను బంధించుకున్న ఖైదీలా అనిపిస్తాడు. ఎదురుపడిన మీనా ను చూసి విజయ్ హలో మీనా అంటాడు. మీనా చిరునవ్వు నవ్వుతుంది. ఏదో చెప్పాలనుకుంటుంది కాని ఇంకొందరు లిఫ్ట్ లోకి వస్తారు. విజయ్ మీనా ఇద్దరూ లిఫ్ట్ లో ఒక మూల మౌనంగా నుంచుంటారు. మీనా గతంలోకి వెళ్ళిపోతుంది.

(లిఫ్ట్ లో మొదటి సారి మీనాను దగ్గరగా చూసినప్పుడు విజయ్ ముఖంపై భావాలు)

మీనా, విజయ్ ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒక పార్టీలోకి వస్తారు. అటు పక్కన కొందరు జంటలుగా నాట్యం చేస్తూ ఉంటారు. వారితో కలవకుండా ఇద్దరూ ఒక బెంచి పై కూర్చుంటారు. మీనా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. విజయ్ పూర్తిగా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ మైకంలో ఉన్న విజయ్ కలలోకి వెళతాడు. వీరిద్దరి మధ్య ఒక డ్యూయెట్ నడుస్తుంది. మబ్బుల మధ్య చందమామ నుండి అందమైన మీనా ఎన్నో మెట్లు దిగి విజయ్ దగ్గరకు వస్తుంది. బాక్ గ్రౌండ్ లో “హమ్ ఆప్కె ఆంఖో మే ఇస్ దిల్ కో బసా దే తో..” అన్న పాట మొదలవుతుంది.

(హమ్ ఆప్కే ఆంఖో మే పాటలో ప్రేమ మైకంలో ఉన్న విజయ్)

హిందీ సినిమాలలో డ్రీమ్ సన్నివేశాల నేపద్యంలో చిత్రించిన పాటలలో ఒక గొప్ప పాట ఇది. అంతకు ముందు సినిమాలలో మొదటి డ్రీం సాంగ్ 1951లో ‘ఆవారా’ సినిమాలో కనిపిస్తుంది. దాని తరువాత అంత స్థాయిలో నిల్చిన మరో డ్రీం సాంగ్ ఇదే. ‘ప్యాసా’ సినిమా డిస్ట్రిబ్యూటర్లు సినిమా అంతా విషాదంగా ఉందని ఒక యుగళ గీతాన్నన్నా చేర్చమని అడిగారని గురుదత్ ఈ సీన్‌ను తరువాత చేర్చారట. ఈ పాట కూడా కథను నడిపించేలా చిత్రింపబడి ఉండడం గమనించాలి. ప్రశ్న జవాబు పద్దతిలో వచ్చే ఈ పాటలో ప్రియురాలికి పూర్తిగా లోంగిపోయిన ప్రియుడు, అతడిని తన కనుసన్నలతో అడించే ప్రియురాలు కనిపిస్తారు. పాటలో ఆడిపాడి చివరకు విజయ్‌ని ఒంటరిని చేసి మీనా తాను వచ్చిన చందమామ వద్దకే ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. హిందీ సినిమాల పాట చిత్రీకరణలో ఒక గొప్ప పాటకు ఉదాహరణగా తీసుకుంటారు దీన్ని కొరియోగ్రాఫర్లు. ఇందులో వీ. కే. మూర్తి ఫోటోగ్రఫీ అద్భుతం.

(తనతో ఆడి పాడి మీనా తిరిగి వెళ్ళిపోయినప్పుడు విజయ్ కళ్ళలో ఆశ్చర్యం)

మీనా విజయ్‌ల ప్రేమ కథను పూర్తిగా ఈ పాటలో చిత్రించారు గురుదత్. కలలోనుండి బైటకు వచ్చిన విజయ్‌కి బెంచిపై మీనా కనిపించదు. ఆమె వదిలి వెళ్ళిన లేఖ చదువుతూ విజయ్‌కి తమ ప్రేమ కథ ముగిసిందని అర్థం అవుతుంది. ఇక లిఫ్ట్ లో ఇన్ని రోజుల తరువాత కలుసుకున్న వారిద్దరి మధ్య నడిచే సంభాషణ ఇలా ఉంటుంది,

మీనా — ఎలా ఉన్నావు

విజయ్ – బ్రతికే

మీనా – నిన్ను సుఖంగా చూడడానికి ఎంతగా….(ఆమె మాటను మధ్యలో ఆపి)

విజయ్ – ధన్యవాదాలు. నా సంతోషాన్ని నేనే సంపాదించుకొవడం నేర్చుకున్నాను

మీనా – అంటే మరో అమ్మాయి నేర్పిస్తుందా….

విజయ్.. మరో అమ్మాయి.. ఒక్కరే జీవితానికి సరిపడా దుఖాన్ని ఇచ్చారు. నేనా బాధ మరో సారి అనుభవించలేను.

మీనా – అంటే మొదటి బాధను మనసు నుండి పూర్తిగా తుడిచేసావా

విజయ్ – తుడిచేయాలి

లిప్ట్ తెరుచుకుంటుంది. సంభాషణ ఆగిపోతుంది. మీనా అప్పుడు అంటుంది “ఓ మర్చిపోయాను, నేను పైకి వెళ్ళాలి” విజయ్ పెదవులపై మీద బాధతో కూడిన చిరునవ్వు…. లిఫ్ట్ మీనాతో పైకి వెళ్ళిపోతుంది. అచ్చం కలలోలా…..

ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సీన్ ఇది. క్లుప్తమైన సంభాషణలు కాని ఎన్ని అర్థాలో. విజయ్‌కి కారణం చెప్పకుండా అతని జీవితం నుండి వెళ్ళిపోతుంది మీనా.. మళ్ళీ కలిసినప్పుడు ఆ అపరాధ భావంలో నిన్ను సంతోషంగా చూడాలని నేను…. అంటూ ఏదో చెప్పబోతుంది. విజయ్ ఆమెలోని ఆ అపరాధ భావాన్ని అర్థం చేసుకుని మధ్యలో సంభాషణ తుంచి వేస్తాడు. మరో అమ్మాయి ప్రసక్తి తీసుకొచ్చినప్పుడూ మీనాలో స్త్రీ సహజమైన కుతూహాలం, అసూయ తొంగి చూస్తాయి. విజయ్ జవాబు విని ఆ పాత ప్రేమను పూర్తిగా తుడిచివేసావా అని ఆమె అడగడంలో ఆమె స్వార్థం కనిపిస్తుంది. ఒక డబ్బున్న వ్యక్తిని కోరి తాను వివాహం చేసుకుని జీవిస్తున్నప్పుడు విజయ్ మాత్రం తమ ప్రేమను గుర్తు పెట్టుకోవాలని కోరుకోవడంలో ఆమె స్వార్థం ఉంది. చివరకు నేను పైకి వెళ్ళాలి అని చెబుతూ విజయ్ కలను అతనికి మళ్ళీ గుర్తు చేస్తుంది మీనా. ఎప్పుడూ పై స్థాయి కోసం ఆశపడుతూ అందరినీ అన్నిటినీ వదులుకుని పైపైకి వెళ్ళాలనే కోరిక ఉన్న ఆమె హై క్లాస్ సొసైటీ మనస్తత్వాన్ని ఈ డైలాగ్‌తో విశదీకరిస్తారు గురుదత్.. ఆమె పైకి వెళ్ళాలని అన్నప్పుడు తమ ఇద్దరి మధ్య ఎప్పటికీ మిగిలిపోయిన ఈ స్థాయి భేదాన్ని విజయ్ గుర్తించి ఒక విషాదమైన చిరునవ్వుని పలికిస్తాడు. ఎన్ని భావాలుంటాయో ఈ ఒక్క సీన్‌లో. మనిషి లోని అత్యాశ, దురాశ, ఏదో పొందాలనే తపన వీటి మధ్య మనసుకు చోటు లేక పోవడం, ఈ సీన్‌లో కనిపిస్తాయి. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థాయి కోసం వివాహాన్ని మానవ సంబంధాలను వాడుకునే మీనా లాంటీ స్త్రీల స్వభావాన్ని ఈ ఒక్క సీన్‌లో అద్భుతంగా చిత్రిస్తారు గురుదత్. విజయ్ మీనాల మధ్య ఆ లిఫ్టు కున్న ఇనప తలుపు మనిషి మనసుకి సింబాలిక్‌గా అనిపిస్తుంది.

ఇక్కడితో సీన్ మారుతుంది. గులాబో తాను విజయ్‌ని మొదటి సారి కలుసుకున్న హోటల్ లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హోటల్  మేనేజర్ ఆమె వైపు వెకిలిగా చూస్తూ ఉంటాడు. హోటల్ మూసే సమయం అయింది ఇంకా ఎవరూ రాలేదా అని వెటకారంగా ఆమెతో అంటాడు. అతన్ని పట్టించుకోకుండా గులాబో అక్కడ పని చేసున్న సర్వర్ వద్దకు వెళుతుంది. విజయ్ అక్కడకు రావట్లేదా అని అడుగుతుంది. కొన్ని రోజులుగా అక్కడికి అతను రావట్లేదని, అతనికేమన్నా చెప్పాలా అని అడుగుతాడు సర్వర్. మేనేజర్ వెటకారంగా అంత దగ్గరగా ఆ పిల్లవాడితోనే మాట్లాడాలా నేను లేనా అంటూ పరిహాసమాడబోతాడు. అతనివైపు చూడకుండా గులాబో వెళ్ళిపోతుంది. ఈ సీన్ ద్వారా గులాబో విజయ్‌తో ఏర్పరుచుకున్న మానసిక బంధాన్ని ప్రస్తావించడమే దర్శకుని ఉద్దేశం. కాని ఇదే హోటల్‌లో అంతకు ముందు తనతో అందరూ వెటకారంగా మాట్లాడతారని గులాబో విజయ్‌కి చెప్పి బాధపడుతుంది. గులాబోతో సంబంధం లేని వేరే సీన్లను చూపించిన తరువాత మళ్ళీ అదే స్థానంలో ఆ పాత సంభాషణకు కొనసాగింపుగా ఇక్కడ సీన్ నడిపిస్తారు దర్శకులు. గులాబో అప్పుడు విజయ్‌కి చెప్పిన విషయన్ని ప్రత్యక్షంగా మళ్ళీ చూపిస్తాడు గురుదత్.

మేనేజర్ వెటకారపు మాటలను పట్టించుకోకుండా విజయ్ గురించి ఆరా తీస్తుంది గులాబో. అంతకు ముందు లిఫ్ట్ సీన్‌లో విజయ్‌ని చూసి అతనితో మాట్లాడుతూ ఎవరో వచ్చారని తాను విజయ్‌తో మాట్లాడడం చూస్తారని మౌనంగా ఉండిపోతుంది మీనా. సమాజం ముందు మర్యాదస్తురాలిగా కనిపించే తాపత్రయం ఆమెలో అక్కడ కనిపిస్తుంది. కాని ఇక్కడ గులాబో సమాజాన్ని ఎదిరించి విజయ్ క్షేమాన్ని కనుక్కోవాలని తపన పడుతుంది. ఈ ఇద్దరు స్త్రీల వ్యక్తిత్వంలో ఈ తేడాని స్పష్టంగా విశదీకరిస్తారు గురుదత్.

ఇక్కడ నుండి మరో సీన్ ఘోష్ ఆఫీసులో మొదలవుతుంది. చటర్జీ ఘోష్‌తో మాట్లాడుతూ ఉంటాడు. విజయ్ కవిత్వం బావుందని, తాను చదివానని తమ పత్రికలో కొంత ఖాళీ ఆ వారం ఉందని. అందులో విజయ్ కవితను వేద్దామని అడుగుతాడు చటర్జీ. ఘోష్ దానికి అతనిపై విరుచుకు పడతాడు. మనం కేవలం పేరున్న గొప్ప కవుల కవిత్వాన్నే ప్రచురిస్తాం కాని అనామకులది కాదు. ఆ ఖాళీ స్థలంలో ఏదో సబ్బు ఆడ్ వేయించండి అని విసుక్కుంటాడు. విజయ్ గుమ్మంలో ఉండి ఇదంతా వింటాడు. తన కవితలను తీసుకెళతానని ఘోష్‌ని అడిగి తన ఫైల్ తీసుకుంటాడు. అది తీసికెళ్ళమని చెబుతూ ఘోష్ మరుసటి రోజు తమ ఇంట్లో ఒక పార్టీ ఉందని, పనిలో సహాయానికి ఇంటికి రమ్మని విజయ్‌ని అడుగుతాడు. ఘోష్ అహం తెలుసుకున్న విజయ్ ఒక ఉద్యోగస్తుడిగా దానికి ఒప్పుకుంటాడు.

(తన ఇంట్లో పనికి రమ్మని విజయ్ ను ఘోష్ అడగడం).

To be continued…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here