Site icon Sanchika

మధురమైన బాధ – గురుదత్ సినిమా 21- ‘ప్యాసా’-4

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ప్యాసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]వి[/dropcap]జయ్ వినిపించిన ఆ కవితను వినగానే ఆ స్త్రీ వీరు కవిగారా అని ప్రశ్నిస్తుంది. దానికి శ్యాం వ్యంగ్యంగా జవాబిస్తాడు. వెంటనే సీన్ కట్ అయి ఒక నాట్యగత్తె గదిలోకి మారుతుంది. శ్యాం, విజయ్ ఇంకొంతమంది ఆ గదిలో కూర్చుని ఉంటారు. సభ్య సమాజం తిరస్కరించిన విజయ్ ఇప్పుడు అ వేశ్య నాట్యాన్ని చూడడానికి అక్కడకు వచ్చిన వాళ్లలో ఒకడిగా కనిపిస్తాడు. అంతకు ముందు పడుకోవడానికి శ్యాం గదికి వెళ్ళి శ్యాం గదిలోకి ఒక ఆడమనిషి వచ్చిందని చూసి ఆక్కడి నుండి బైటకు వచ్చి పార్కులో బెంచీ పై పడుకున్న విజయ్‌లో ఒక నైతిక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇక్కడ ఆ గదిలో కూర్చున్న విజయ్‌లో ఆత్మవిశ్వాసం లోపించిన ఒక ఓడిపోయిన మనిషి కనిపిస్తాడు. ఇప్పటి దాకా ఓటమిని స్వీకరించని వ్యక్తిత్వంతో కనిపించే విజయ్‌లో వచ్చిన ఈ మార్పు చాలా విషాదంగా ఉంటుంది. ప్రపంచం మీద పూర్తి ఆశ, కోరిక చనిపోయిన జీవిగా విజయ్‌ని ఈ సీన్‌లో చూస్తాం.

నాట్యగత్తె నాట్యాన్ని చూస్తూ మందు తాగుతూ ఉంటారు అందరు. గదిలో తెర చాటున నీడగా కనిపించే ఊయలలో ఒక పసి బిడ్ద పడుకుని ఉంటాడు. బిడ్డ ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. తబలా వాద్యంతో పాటు ఆ బిడ్డ ఏడుపు స్థాయి పెరుగుతుంది. ఆ బిడ్డ ఏడుపుతో ఆ నాట్యం చేస్తున్న స్త్రీ మొహంలో కలవరం విజయ్ గమనిస్తాడు. ఆమె ఒక్క క్షణం పక్క గదిలోకి వెళ్ళి బిడ్డ ఏడుపు మానిపించాలని చూస్తుంది. కాని ఇంతలో ఆ ఇంటి యజమానురాలు వచ్చి ఆమెను ఊయల దగ్గరకు వెళ్ళకుండా ఆపి బలవంతంగా ఆ గదిలోని వారి మధ్యకు నెడుతుంది. నాట్యం చేస్తున్న ఆ స్త్రీ బిడ్డ ఏడుపు ఆపాలని ఒక పక్క, మరో పక్క గదిలోని మగవారిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమెలోని ఈ సంఘర్షణ విజయ్ గమనిస్తూ ఉంటాడు. భుక్తి కోసం ఆ స్త్రీ మాతృత్వం, డబ్బు సంపాదన మధ్య నలిగిపోవడం అతని దుఃఖాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. సినిమా మొదట్లో పూవు మీద తుమ్మెద నాట్యాన్ని చూస్తూ పరవశిస్తున్న విజయ్ ఆ తుమ్మెదపై ఎవరో అడుగు వేసి నలిపివేసినప్పుడు పడ్డ వేదన గుర్తుంది కదా. తుమ్మెద లాంటి చిన్న ప్రాణి ఎవరో కాలి క్రింద నలిగిపోవడం చూసి సహించలేని విజయ్ ఇప్పుడు సమాజం కాలి కింద నలిగిపోతున్న ఈ మాతృమూర్తిని చూసి ఎలా తట్టుకోగలడు. విజయ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అతన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయి కాని అతనిలో ఆ సున్నిత మనస్కుడు రాటు దేలడం లేదు. విజయ్‌లో మొదటి నుంచి కనిపించే గుణం ఇది. కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తున్న విజయ్‌ని ఇంకా బాధించేది తన స్నేహితుడైన శ్యాం ఆమెను బిడ్డ దగ్గరకు వెళ్ళనీయకుండా నాట్యం చేయమని బలవంత పెట్టడం. నా బిడ్డ ఆరోగ్యం బాలేదు అని కన్నీళ్ళతో వేడుకుంటూన్న ఆమెను ఆపి, మా ఆరోగ్యం కూడా బాలేదు, మమ్మల్ని చూసుకోవా అంటూ కామోద్రేకంతో శ్యాం ఆమెను బిడ్డ దగ్గరకు వెళ్ళనీయకుండా ఆపుతాడు. ఆమె చేతుల్లో బలవంతంగా డబ్బు ఉంచుతాడు. కన్నీళ్ళతో ఆ నోట్ళను గట్టిగా పట్టుకుంటుంది ఆ యువతి. ఆ డబ్బు అవసరం కోసం, మాతృత్వపు మమకారాన్ని పక్కన పెడుతుంది. భరించలేక విజయ్ బైటికి వెళ్ళిపోతాడు.

అబ్రర్ అల్వీ తన పుస్తకంలో ఈ దృశ్యం గురించి రాస్తూ, హైదరాబాద్‌లో ఒక నాట్యగత్తె ఇంట్లో చూసిన ఈ సంఘటనను యథాతథంగా గురుదత్, తాను కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌లో జోడించామని చెప్తారు. ఆ తరువాతి సీన్‌లో ఆ వేశ్యా వాటిక బైట తాగిన మత్తులో తూలుకుంటూ నడుస్తున్న విజయ్‌ని చూస్తాం. ఆ వీధిని పరికించి చూస్తూ విజయ్ మనసులోని దుఃఖం ప్రశ్నలుగా మారి కవిత రూపంలో బైటికి వస్తాయి. వేశ్యా వాటికలోని వేశ్యల నిస్సహాయతను, అక్కడకి వెళ్ళే డబ్బున్న మగవారిని, అక్కడి వాతావరణాన్ని, ఈ కవితలో హృదయవిదారకంగా వర్ణిస్తాడు విజయ్. రఫీ గానం చేసిన ఈ కవితను స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకుల కళ్ళు చెమర్చకుండా ఉండవు.

(వేశ్యా వాటిక పరిసరాలను గమనిస్తూ ఆలోచిస్తూ కవిత మొదటి పంక్తులను మననం చేసుకుంటున్న విజయ్)

యె కూచే, యె నీలాం ఘర్ దిల్కషీ కె

యె లుట్తె హుయె కారవాన్  జిందగీ కే, కహా హై, కహా హై ముహాఫిజ్ ఖుదీ కే

జిన్హె నాజ్ హై హింద్ పర్ వో కహా హై?, కహాహై? కహా హై ?కహా హై?

యె పుర్పేచ్ గలియా, యె బద్నామ్ బాజార్, యె గుమ్నామ్ రాహి యె సిక్కోం కి ఝన్కార్

యె ఇస్మత్ కె సౌదే, యె సౌదోం పె తక్రార్, జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై? కహా హై? కహా హై? కహా హై?

యె సదియోం  సె బెఖౌప్ సహమీ సీ గలియా, యె మసలీ హుయీ అధ్కిలి జర్ద్ కలియా

యె బికతీ హుయీ ఖోఖలీ రంగ్ రలియా జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై ?కహా హై? కహా హై? కహా హై?

యె ఉజలే దరీచో మే పాయల్ కీ చన్ చన్, థకీ హారీ సాంసో మే తబలే కీ ధన్ ధన్

యె బేరూహ్ కమరోం  మే ఖాంసీ కి ఠన్ ఠన్ , జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై? కహా హై ?కహా హై? కహా హై?

యె ఫూలో కె గజరే, యె పీకో కె చీంటే, యె బేబాక్  నజరే యె గుస్తాఖ్  ఫికరే

యె డల్కే బదన్ ఔర్ యె బీమార్ చెహరే జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై ?కహా హై? కహా హై? కహా హై?

యహా పీర్ భీ ఆ చుకే హై, జవాన్  భీ, తనో మ్ంద్ బెటే భీ, అబ్బా మియా భీ

యె బీవీ భీ హై, ఔర్ బహన్ భీ హై మా భీ జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై? కహా హై ?కహా హై? కహా హై?

మదద్ చాహతీ హై యె హవ్వా కీ బేటీ, యశోదా కీ హమ్ జిన్స్ రాధా కీ బేటి

పయంబర్  కీ ఉమ్మత్ ఝులెఖా కీ బేటీ జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై ?కహా హై? కహా హై ?కహా హై?

జరా ముల్క్ కే రాహ్బారో కో బులావో, యె కూచే యె కలియా యె మంజర్ దిఖావో

జిన్జే నాజ్ హై హింద్ పర్ ఉన్కొకో లావో, జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై ?కహా హై ?కహా హై ?కహా హై?

పాత రోజుల్లో ఉత్తర భారతంలో వేశ్యా వాటికలను చక్లా అనేవారు. ఆ వేశ్యా వాటికల స్థితిని తన గేయ కవిత ‘చక్లే’లో సాహిర్ లుధియాన్వి ఇలా కళ్ళకు కట్టినట్లు రాసారు. ఈ కవిత గురుదత్‌కి చాలా నచ్చింది. దీని కోసం ‘ప్యాసా’లో ఈ వేశ్యా వాటిక సీన్‌ను కావాలని పెట్టి ఈ పాటను షూట్ చేసారు. నిజానికి చక్లే కవితను సినిమా కోసం సరళం చేశాడు సాహిర్. పాట ప్రభావం తీవ్రమయ్యేందుకు, ప్రతి ఒక్కరి మనస్సాక్షి సిగ్గుపడి జాగృతమయ్యే రీతిలో జిన్‌హే నాజ్ హై హింద్ పర్ వోహ్ కహాన్ హై? అని సినీగీతంలో మార్చాడు. అసలు కవితలో…సనా-ఖ్వాన్-ఎ-తక్దీస్-ఎ-మష్రిక్ కహాన్ హై? అని అడుగుతాడు. సనాఖ్వాన్-ఎ-తక్దీస్- మష్రిక్ అంటే, పవిత్రమైన తూర్పు దిక్కును   పూజించేవారు. మష్రిక్ దేశాలంటే, ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, యెమెన్, ఓమన్, కువైట్, యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాఎల్, జోర్డాన్, లెబనాన్, సిరియా, ఇరాక్ దేశాలు. ఈ పాదం ఇలాగే వుంచితే, ప్రేక్షకులు పాటతో ఐడెంటిఫై కారు . కాబట్టి, పాటను సరళం చేస్తూ, పరిస్థితిని భారత్ కు పరిమితం చేయటంతో ప్రేక్షకులు తాదాత్మ్యం చేందేట్టు చేశాడు.

ఈ పాటను కలకత్తాలో అతి పెద్ద వేశ్యా వాటిక సోనాగాచీ లోనే షూట్ చేయాలని గురుదత్ అనుకున్నారు. కాని అప్పటి పరిస్థితుల దృష్ట్యా అది కుదరలేదు. అందుకని స్టూడియోలో ఒక సెట్ వేసి ఈ పాటను చిత్రించారు గురుదత్. గురుదత్ ఈ సినిమాలో ప్రతి సీన్‌లో గొప్పగా చేసారని ఒప్పుకుంటాం. కాని ఈ పాటలో ప్రతి వాక్యం దగ్గర గురుదత్ హావభావాలను గమనించండి అతనిలోని విషాదం మనలోకి చొచ్చుకు వస్తుంది. పాట మొత్తం క్లోజ్ అప్ లోనే చిత్రించారు వీ.కే. మూర్తి. గురుదత్ కళ్లతో పలికించే విషాదం ఎటువంటి వారినయినా కదిలిస్తుంది. ఆ భావానికి సాహిర్ కవిత ప్రాణం అయితే రఫీ గొంతు జీవం. ఇక ఎస్.డి.బర్మన్ తన సంగీతం ఎక్కడా కవిత్వాన్ని డామినేట్ చేయకుండా అండర్ ప్లే తో ఇది కేవలం ఒక కవి చేస్తున్న కవితా గానంగా బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని మాత్రమే జోడించి చేసిన కంపోజిషన్ అత్యద్భుతం. హిందీ సినిమాలో ఇలాంటి కవితా గానాన్ని చిత్రీకరించిన మరో సందర్భం కనిపించదు.   ఈ కవితలో సంగీతం అతి మంద్రంగా ఉంటుంది. చిన్న బీట్స్ కంటున్యుటీ కోసం ఉపయోగపడతాయి తప్ప వాద్య పరికరాల ద్వని అస్సలు వినిపించదు. గురుదత్ సాహిర్‌ల అద్భుత కలయిక ఈ పాటలో అతి గొప్పగా కుదిరింది. ప్రతి ఒక్క వాక్యం గురుదత్ ఆత్మలోనుండి వస్తున్నట్లు ఉంటుంది ఆయన నటన. జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై?  అన్న ప్రశ్న వచ్చే ప్రతి సారి ఆయన కళ్ళలో ఆ విషాద ప్రశ్న ఎలా ప్రతిఫలిస్తుందంటే ఈ వ్యవస్థ ఎందుకింద దారుణంగా ఉంది అని అప్పటి దాకా దేన్ని పట్టించుకోని వ్యక్తి కూడా ప్రశ్నించుకుంటాడు. ఒక కళాకారుడు తన కళ ద్వారా ఈ ప్రతిచర్యను సాధించాడంటే, అతను అతి పెద్ద నైతిక బాధ్యతను నెరవేర్చినట్లే. ఆ బాధ్యతను ఈ పాట ద్వారా నెరవేర్చి, గురుదత్, సాహిర్ లుధియాన్వి ఇద్దరూ కూడా తమ కళను సాకారం చేసుకున్నారు. ఇంతటి ఇంపాక్ట్ ఇచ్చే మరో పాట కనిపించదు.

(వేశ్యా వాటిక లోని వీధులను చూస్తూ, ప్రేక్షకులకు చూపిస్తూ విజయ్)

ఆనాటి ‘ప్యాసా’ నుండి నేటి ‘గంగూబాయి ఖతియావాడి’ సినిమా దాకా వేశ్యా వాటికలను ఎన్నో సార్లు స్క్రీన్ పై చూపించారు. సోనాగాచిలో ఈ పాటను షూట్ చేయలేకపోయారు గురుదత్. కాని తరువాత కమల్ హాసన్ అవే వీధులలో ‘మహానది’ సినిమా కోసం కొన్ని సీన్లు షూట్ చేసారు. అవీ చాలా గొప్పగా వచ్చిన దృశ్యాలే. కాని స్టూడియోలో చిత్రించిన ఈ సీన్‌లో గురుదత్‌లో కేవలం వేదనే కాదు ఒక నిరాశావాదం, ఒక విక్టిమైజేషన్ కనిపిస్తుంది. ఇది ఎవ్వరూ తరువాత ఎంత గొప్ప ఫెర్మామెన్స్ ఇచ్చినా తెరపై ఇంత ప్రభావాత్మకంగా, ప్రతీకాత్మకంగా, కవిత్వం మాటున చూపించలేకపోయారు. అందుకే గురుదత్ అద్భుత దర్శకత్వాన్ని, సాహిర్ కలంలోని పదునుని మెచ్చుకోవాలి. ఈ కవితను మొదటి పారా నుంచి గమనిస్తే దాన్ని నిర్మించిన విధానానికి అచ్చెరువు చెందుతాం. ముందు ఆ వీధుల వైపుకి ప్రేక్షకుల దృష్టి మళ్ళించారు గురుదత్. ఎంత హడావుడి ఉంటుందో ఆ రాత్రిపూట. అక్కడి వ్యాపార కోణాన్ని, అమ్ముడవుతున్న మనుషుల్ని చూపిస్తారు. ఇది పైకి అందరికీ కనిపించే దృశ్యం. తరువాతి వాక్యాలలో ఆ స్త్రీల నవ్వుల వెనుక వారి కృశిస్తున్న దేహాలను చూపుతారు. తరువాత ఆ వీధిలో వినపడే చప్పుళ్ళను వినిపిస్తారు. ఆ సంగీతపు ధ్వనుల మధ్య రోగిష్టి స్త్రీల దగ్గులను వినమని అటువైపుకు మళ్ళి దృష్టి మరలుస్తారు. ఈ వీధులవైపుకి వెళ్ళే వారందరూ ఆ సంగీత ద్వనుల రసాస్వాదన దగ్గరే ఆగిపోయే వారే. వాటి మీదుగా ఆ దృశ్యాల వెనుక విషాదాన్ని చూపిస్తూ, మనిషన్నవాడు ఈ స్త్రీల శరీరాల పై నుండి ఎటు పక్కకు దృష్టి మరల్చాలో చెప్తారు సాహిర్. దాన్ని అదే స్థాయిలో చిత్రీకరించారు గురుదత్. ఒక కవి శిల్పాన్ని ఇంత పక్కాగా అర్థం చేసుకుని దాన్ని దృశ్య బద్ధం చేయడం అందరికీ సాధ్యం కాదు. తరువాత అక్కడి పూల దుకాణంలోని పూమాలల వైపు ఆ సుగంధం వైపుకు మన దృష్టిని మరలుస్తూ, దానితో పాటూ పాన్ తిని ఉమ్మేసిన మరకల వైపుకు చూడమంటారు. అందమైన ఆ స్త్రీల నోటి నుండి వచ్చే దూషణల వైపుకూ దృష్టి మరలుస్తారు. కృశించిపోతున్న శరీరాలను చూడమని ఆ మేకప్పుల మొహాల క్రింది వాస్తవాన్ని చూపిస్తారు. కవిగా తన భాషతో పదునైన పదజాలంతో సాహిర్ శ్రోతలకు వేశ్యా వాటికలలోని విషాదాన్ని చూపిస్తే అదే స్థాయిలో దాన్ని దృశ్యబద్ధం చేసారు గురుదత్.

సమాజాన్ని పరిశీలించే వ్యక్తి పై పై దృశ్యాలను చూసి ఒక అభిప్రాయానికి రాడు. ఆ దృశ్యాల లోతులలోకి వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఎంత లోతుగా అతను వెళితే అంతగా నిజానికి దగ్గరవుతాడు. మేధావుల ప్రయాణం ఆ లోతుల్లోకి జరగాలి. అప్పుడే వాస్తవిక ప్రపంచాన్ని దర్శిస్తారు. కాని మనిషి పై పై భ్రమలతో జీవితం గడిపేస్తాడు. ఇలా జీవించిన వారి జీవితంలో విషాదం ఉండదు. అబద్ధం అని తెలిసినా తమ జీవితం సమస్యలమయం కాకూడదని ఆ అబద్ధాన్ని నిజం అని నమ్మినట్లు నటిస్తూ, అదే నిజం అని చాటుతూ జీవితాన్ని గడిపేసే వేల కోట్ల మానవుల మధ్య, ఎవరికీ కనిపించని నిజం చూడగల విజయ్ ఎలా సంతోషంగా జీవించగలడు. ఆ వీధులలో వచ్చే ముసలి వారిని, పడుచువారిని చూసి హాస్యం ఆడే దగ్గర మాత్రమే ఆగిపోడు విజయ్ లోని కవి, మనిషి. మరో కోణంలో ఆ స్త్రీలందరు ఒకే వ్యక్తికి తల్లి, భార్యలు, చెల్లెళ్ళు అవుతారని, వారి ఈ స్థితికి దుఖిస్తాడు. ఆ గదిలోకి వెళ్ళడానికి ఇష్టపడని ఒక అమ్మాయిని బలవంతంగా లాక్కువెళుతున్న ఒక దళారిని అడ్డగించబోయి చేతకాక ‘మదద్ చాహతీ హై యే హవ్వా కీ బేటీ” అని పాడేటప్పుడు అతని మొహంలో భావాలు రాళ్లను సైతం కరిగిస్తాయి. ఇక్కడ సాహిర్ రాసిన వాక్యాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆమె హవ్వా కూతురు (క్రిస్టియన్) కావచ్చు, యశోద లేదా రాధల పుత్రిక కావచ్చు (హిందు), లేదా ప్రవక్త తరానికి ప్రతినిధి, జులేఖా కూతురు కావచ్చు(ముస్లిం). ఈ వీధులలో ఎవరికీ మతం లేదు, వావి వరుసలు లేవు, ప్రాణంలేదు, ఆత్మ లేదు…అవి కేవలం శరీరాలే… ఎంతటి విషాదపు స్థితికి ఆ కవితను లాక్కువస్తారు సాహిర్ అంటే ఈ చరణం తరువాత ఒక అవేశం కలుగుతుంది చూస్తున్నవారందరిలో కూడా…. తరువాత దేశ ప్రతిష్ఠ గురించి గొప్పలు చెప్పుకునే వారిని ఇక్కడకు పిలవండి ఈ వీధులను చూపించండి అంటూ ఒక వ్యంగ్యపు చిరునవ్వును పలికిస్తాడు విజయ్. ఇక్కడ సాహిర్ మార్క్ కనిపిస్తుంది. ఎంతటి విషాదాన్ని కూడా తిరుగుబాటు ధోరణిలోకి మరల్చగల శక్తివంతమైన కవి ఆయన. ఇంత విషాదంలో ముగింపు మళ్ళీ ప్రశ్నలతో వ్యంగ్యంతో, సమాజాన్ని ప్రశ్నించడంతో ముగుస్తుంది. ఈ శైలిని సినీ కవిత్వంలో సాహిర్ చాలా గొప్పగా పరిచయం చేస్తారు. ఆయన పాత్రలు విక్టిం స్థానంలో ఉండి కూడా ఒక శక్తిని తిరుగుబాటు ధోరణిని చివరి దాకా నిలుపుకుంటాయి. అద్భుతమైన మానవ శక్తి విషాద పాత్రలలో కూడా చూపించగలగడం సాహిర్ ప్రత్యేకత. మానవ శక్తి పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని ప్రతి సారి ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ కవితను ఈ స్థాయిలో చిత్రీకరించడం ఒక్క గురుదత్ వలనే సాధ్యం అయింది. అందుకే సాహిర్ లుధియన్వి అరవై ప్రాంతాలలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గురుదత్ పాటల చిత్రీకరణ తన కవిత్వానికి జీవం పోసిందని, అంత గొప్పగా ఆలోచించి కవి హృదయాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించగల దర్శకులు హిందీ సినిమాలో గురుదత్ తరువాత మరొకరు తనకు కనిపించలేదని చెప్పారు.

ఈ వేశ్యా వాటిక నుండి నడుచుకుంటూ ఆ వీధుల గుండా తూలుతూ విజయ్ ఒక ఇంటి గుమ్మం ముందు నిలబడిపోతాడు. అది గులాబో ఉండే ఇల్లు. గులాబో అదే వీదుల్లో ఉంటుందని మనకు మళ్ళీ గుర్తు చేస్తారు దర్శకుడు. గులాబో వ్యాపారం మానేసిందని అంతకు ముందు ఒక సీన్‌లో అర్థం అవుతుంది. ఆమె ఎవరో వచ్చిన అలికిడికి గుమ్మం దగ్గరకు వస్తుంది. ‘ప్యాసా’ సినిమాలోని అద్భుతమైన సీన్లలో నాకు వ్యక్తిగతంగా చాలా చాలా నచ్చే సీన్ ఇది. ఎంత గొప్పగా విజయ్ గులాబోల మధ్య సంభాషణ ఉంటుందంటే, దీన్ని పోల్చగల మరే సన్నివేశం నాకు భారతీయ సినిమాలో ఇప్పటి దాకా కనిపించలేదు.

తన ఇంటి ముందు ఒక స్తంభానికి ఆనుకుని నిలబడ్డ విజయ్‌ని గుర్తు పట్టి గులాబో అతన్ని పిలుస్తుంది. విజయ్ గులాబోని గుర్తు పడతాడు. అతని స్థితిని గమనించి విజయ్‌ని లోపలికి తీసుకువెళుతుంది గులాబో.

“నా మీద మళ్ళీ జాలి చూపిస్తున్నావా. ఇవాళ నేను ఆకలితో లేను గులాబ్. ఇవాళ నేను ఆకలిని మద్యంతో ముంచేసాను. చాలా తాగాను నేను. ప్రపంచం చీదరింపులను తాగాను, బాధలన్నిటినీ తాగాను, అన్నీ తాగేసాను” అంటాడు విజయ్. గులాబో విజయ్‌ని మెల్లిగా తన గదిలోకి తీసికెళ్లాలని ప్రయత్నిస్తుంది.

విజయ్ అది గమనించి “ఎక్కడకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు” అని అడుగుతాడు.

“లోపలికి పదండి విజయ్ బాబు. ఇది నా ఇల్లు. మీకు విశ్రాంతి కావాలి. మీరు తెలివిలోకి వచ్చాక వెళ్ళిపోండి” అంటుంది గులాబ్

‘తెలివిలోకి వచ్చాక వెళ్ళిపోనా. శాశ్వతంగా వెళ్ళిపోయాకే తెలివిలోకి వస్తానేమో. అందరూ నా జీవితంలోనించి వెళ్ళిపోయారు గులాబ్. ఉద్యోగం పోయింది, అమ్మ ఉండేది, ఇప్పుడు ఆమె కూడా వెళ్లిపోయింది. శాశ్వతంగా వెళ్ళిపోయింది. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాను. నేనెందుకు బ్రతికి ఉన్నాను గులాబ్” అంటాడు విరక్తితో విజయ్.

తల్లి చనిపోయిందని తెలిసిన తరువాత విజయ్ శ్యామ్ దగ్గరకు వెళతాడు. అతను తన చిన్ననాటి స్నేహితుడు. కాని శ్యాంతో కూడా తల్లి మరణం గురించి చెప్పలేకపోతాడు. తన విషాదాన్ని స్నేహితుడితో కూడా పంచుకోలేడు విజయ్. విజయ్ స్థితి చూసి అతనెందుకు అలా ఉన్నాడో తెలుసుకునే తీరిక శ్యాంకి లేదు. మందు తాగమని విజయ్‌ని ప్రోత్సహిస్తారు శ్యాం స్నేహితులు. అక్కడి నుండి వేశ్యా వాటికకు విజయ్‌ను తీసుకువెళతారు. కాని అతని హృదయంలో ఉన్న దుఃఖం గురించి తెలుసుకోవాలనుకోరు. విజయ్ కూడా వారి వద్ద తన తల్లి ప్రస్తావన తీసుకురాడు. కాని ఇక్కడ ఒక వేశ్య అయిన గులాబో అతన్ని గమనించి అతనిలో ఏదో దుఃఖం గూడు కట్టుకుని ఉందని అర్థం అయి తన గదిలోకి రమ్మని, విశ్రాంతి తీసుకొమ్మని అడుగుతుంది. దానికి కరిగిపోయిన విజయ్ ఆమెతో తన తల్లి మరణం గురించి చెబుతారు. మనతో కలిసి జీవిస్తున్న వారితో కూడా కొన్ని సార్లు మన మనసులో దుఖాన్ని పంచుకోలేం. దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉండిపోయే బంధాలు మన చుట్టూ చాలా ఉంటాయి. అని ఎవరో కొన్ని క్షణాలు మనతో కలిసి గడిపితే వారే మనకు దగ్గరగా అనిపించిన క్షణాలుంటాయి. దీనికి ప్రత్యేకంగా ఇరువురి మధ్య గొప్ప స్నేహం, బంధం ఉండవలసిన అవసరం లేదు. వారి ముందు ఎంతటి విషాదాన్నయినా తెరిచి చెప్పుకోవడానికి అభ్యంతరం ఉండదు. ఇక్కడ విజయ్ చేస్తున్నది అదే. గులాబో దగ్గరే తన మనసులోని వేదనను అతను చెప్పుకోగలుగుతున్నాడు. దీన్ని గమనించగలిగితే మనిషికీ మనిషికీ ఉండవలసిన ఆత్మీయ సంబంధం గురించి విజయ్ పడుతున్న తపన అర్థం అవుతుంది.

(తన మనసులో బాధను గులాబోతో చెబుతున్న విజయ్)

విజయ్ మాటకు జవాబుగా గులాబో “అలా మాట్లాడకండి విజయ్ బాబు. ప్రపంచానికి మీ అవసరం, మీ కవిత్వం అవసరం ఉంది.” అంటుంది. దానికి విజయ్ “ప్రపంచానికి ఎవరి అవసరమూ లేదు. నా కవిత్వాన్ని ప్రపంచానికి అందించాలని నేనెంతో ప్రయత్నం చేసాను. కాని ప్రపంచం దానికి కట్టిన ఖరీదు ఎంతో తెలుసా? చెత్త కాగితాలుగా నిర్ణయించి దాని ఖరీదు పది అణాలని తెల్చారు. నా జీవితపు ఖరీదు పది అణాలు మాత్రమే గులాబ్. ఆ పది అణాల కోసం నేను జీవించి ఉండాలని కోరుకుంటున్నావా నీవు” అని తనలోని కోపాన్ని ఆమె ముందు బైట పెడతాడు విజయ్.

“ఇలా అధైర్యపడకు విజయ్ బాబు. బ్రతకడానికి ఇంకా కొన్ని కారణాలున్నాయి. మీనా కూడా ఉంది” అంటుంది గులాబ్

“మీనా.. నీకామె ఎలా తెలుసు” అడుగుతాడు విజయ్

“మీ కవితల పుస్తకం పై ఆమె పేరు ఉంది కదా. ఇంతకీ మీనా ఎవరు విజయ్ బాబు” అడుగుతుంది గులాబ్

“మీనా తళుకు బెళుకుల హై సొసైటీకి చెందిన ఒక మర్యాదస్థురాలు. తన ఇష్టం కోసం ప్రేమిస్తుంది, తన స్వార్థం కోసం ఆ ప్రేమను అమ్ముకుంటుంది. కాని నీకు ఆమె పై ఈ కుతూహలం ఎందుకు” అడుగుతాడు విజయ్

“మీకు ఒకప్పుడు ఆమెపై ప్రేమ ఉండింది కదా… అందుకు” అంటుంది గులాబ్’

“నువ్వు నన్ను…..లేదు గులాబ్ నువ్వు నన్ను మరచిపో. నేను బాధను తప్ప మరేమీ ఇవ్వలేను. ఈరోజు దాకా నా వల్ల ఎవరూ సుఖపడింది లేదు” అంటాడూ విజయ్.

ఈ సీన్‌ను గురుదత్ మలచిన విధానాన్ని చూడండి. నాకు నువ్వంటే ప్రేమ… నువ్వు లేందే నేను బ్రతకలేను లాంటి డైలాగులు ఇక్కడ ఉండవు. “నీవు ఒకప్పుడు ఆమెను ప్రేమించావు కాబట్టి మీనా అంటే నాకు ఆసక్తి” అని గులాబో చెప్పడంతో విజయ్ జీవితాన్ని అతని ఆలోచనలని అతని ప్రేమని గులాబో తనవిగా స్వీకరిస్తుందనే సత్యం అంత మత్తులో ఉన్నా విజయ్‌కు అర్థం అవుతుంది. ప్రేమను అర్థం చేసుకోవడానికి మత్తు అడ్డు రాదు. గులాబో తనను ప్రేమిస్తుందని, తన పట్ల ఆసక్తి పెంచుకుందని, తాను ఆసక్తి చూపుతున్న వ్యక్తుల్ని, భావాలను తనవిగా స్వీకరించే స్థితిలో ఉందని విజయ్‌కి అర్థం అవుతుంది. ప్రేమ అనే భావం ఇద్దరు మనుషులను ఈ స్థాయిలో ఒకటి చేయగలగాలి. ఆ భావాన్ని ఈ సీన్ ద్వారా అద్భుతంగా చూపిస్తారు గురుదత్. ప్రేమను హీరో హీరోయిన్లు వ్యక్తపరచుకునే సన్నివేశాలు భారతీయ సినిమాలో అనేకం ఉన్నాయి. కాని ఈ పద్ధతిలో ఇంతటి విషాదంలో అంతటి ఆత్మీయ ప్రేమను గులాబో ఒక చిన్న మాటతో వ్యక్తపరుస్తే, దాన్ని విజయ్ అర్థం చేసుకునప్పుడు అతను ఒక షాక్‌కి గురయి తాను అంతటి ప్రేమకు అనర్హుడనని చెబుతాడు. గులాబో స్థాయి, ఆమె వృత్తి అతనికి అప్పుడు గుర్తుకు రాదు. అక్కడ వారిద్దరు కేవలం రెండు మనసులు మాత్రమే. విజయ్ జీవిత వైఫల్యాలు, గులాబో వృత్తి ఆ సమయంలో ఇద్దరికీ గుర్తుకు రావు. అరుదుగా ఈ ప్రపంచంలో వ్యక్తుల మధ్య వచ్చే ఆ ఒక్క ఆత్మీయ క్షణం, కలయిక ఇక్కడ ఈ శాపగ్రస్థులలో చూపిస్తారు గురుదత్. అంతే కాదు విజయ్ సామాజిక స్థాయికి తాను చేరలేనని గులాబ్‌కి తెలుసు, అతని జీవితంలో మీనా అనే మరో స్త్రీ ఉందని ఆమెకు తెలుసు అయినా విజయ్‌ని ఆమె ప్రేమిస్తుంది. అతని జీవితాన్ని,ఆలోచనలను, అతని మనుషులను అదే స్థాయిలో స్వీకరిస్తుంది. మీనా పై తనకున్న ఆసక్తి గురించి చెప్పిన గులాబో మనసును విజయ్ మొదటి సారి అర్థం చేసుకుంటాడు. ఆమె కళ్లల్లో ఆ భావాన్ని చదువుతాడు, నిర్ఘాంతపోతాడు. ఈ సీన్‌లో గురుదత్ మొఖంలో కనిపించే ఆ షాక్ చాలా గొప్పగా స్క్రీన్ పై పట్టుకోగలిగింది వీ.కే. మూర్తి ఫోటోగ్రఫీ. విజయ్‌కి తన మనసు అర్థం అయిందన్నప్పుడు గులాబో కళ్ళలో నీరు, ఆమె నిస్సహాయత ఇవన్నీ ఆ సీన్‌కు జీవం పోస్తాయి.

ఈ సంభాషణ అంతా కూడా గులాబో తన గదికి విజయ్‌ని తీసుకెళుతూ మెట్లు ఎక్కిస్తున్నప్పుడు జరుగుతుంది. గురుదత్ తన సినిమాలలో మెట్లను, ఫుట్‌పాత్‌ను, పార్క్‌లో బెంచీని, వీధులను, హీరో ధరించే కోటును ఎన్నో సందర్భాలలో రకరకాలుగా ఉపయోగించుకున్నారు. జీవితంలో ఓడిపోయి ఇక ఒక్క అడుగు కూడా వేయలేనని నిశ్చయించుకున్న ఒక మగవాన్ని ఓ స్త్రీ తన చేయూతతో జీవితపు మెట్లు ఎక్కడానికి చేస్తున్న సహయంగా, దాన్ని కోరుకుని అందక నిరాశపడిన విజయ్ జీవితంలో అటువంటి వ్యక్తిని చేరిన తరువాత కూడా ఆ ప్రేమను స్వీకరించలేని పరిస్థితులలో నెట్టివేయబడడానిన్ని సింబాలిక్‌గా మెట్ల మీద సంభాషణతో చూపించారు గురుదత్. గురుదత్ సినిమాలలో సీన్ లను చిత్రించిన తీరులో చాలా సింబాలిజమ్స్ ఉంటాయి. వాటిని సామాన్య ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుని ఆ సీన్ లోని భావాన్ని అనుభవించేలా సినిమాలకు దర్శకత్వం చేసిన వారు గురుదత్.

మెట్లపై స్పృహ తప్పిన విజయ్‌ని తన గదికి చేర్చి అతన్ని మంచంపై పడుకోబెడుతుంది గులాబ్. కాసేపు తరువాత అతనికి మెలకువ వస్తుంది. జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పొందిన అవమానాలన్నీ మళ్ళీ అతని కళ్ళ ముందు కదులుతాయి. గులాబో కాస్త దూరంలో గోడకి చేరిగిలబడి నిద్రపోతూ ఉంటుంది. అన్నలు, తన కవితలను అపహాస్యం చేసిన పబ్లిషర్లు, తల్లి అందరూ గుర్తుకు వస్తారు. దూరంగా రైలు కూత వినిపిస్తుంది. ఒక నిశ్చయానికి వచ్చినట్లు విజయ్ లేచి ఒక ఉత్తరం రాసి కోటు జేబులో పెట్టుకుంటాడు. నిద్రపోతున్న గులాబోని లేపకుండా వడివడిగా బైటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.

రైల్వే బ్రిడ్జ్ దిగి క్రిందకి వెళుతున్న విజయ్‌కి అక్కడ ఒక ముసలి బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపిస్తాడు. తన కోటు విప్పి విజయ్ అతనికి ఇస్తాడు. బ్రిడ్జి పూర్తిగా దిగి రైల్వే యార్డ్ వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక యువకుడు తాను వేసుకున్న కోటుకు తనకిచ్చి వడివడిగా చీకట్లో నడుచుకుంటూ రైల్వే యార్డ్ వైపుకి వెళుతూ ఉండడం బిచ్చగాడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ యువకుడు ఏదో చేయకూడని పని చేయబోతున్నాడన్న అనుమానం వస్తుంది. నా కెందుకులే అని ఆ పేదవాడు ఊరుకోలేకపోతాడు, విజయ్‌ను వెంబడిస్తాడు. విజయ్ తనను వెంబడిస్తున్న బిచ్చగాన్ని గమనిస్తాడు అతని తప్పించుకోవాలని ఆగి ఉన్న రైలు పెట్టెల మధ్య దాక్కుంటాడు. అతని వైపుకు రావడానికి ట్రాక్ దాటుతున్న ఆ బిచ్చగాడి కాలు, ట్రాక్ మారుతున్న పట్టాల మధ్య ఇరుక్కుంటుంది. అతని స్థితిని గమనించి అతన్ని రక్షించాలని విజయ్ తాను దాక్కున్న చోటు నుంచి బైటకు వచ్చి బిచ్చగాడి వద్దకు వెళతాడు. ఇద్దరు ఎంత ప్రయత్నించినా కాలును పట్టాల మధ్య నుండి విడిపించలేకపోతారు. రైలు వేగంగా వారి వైపుకు వస్తూ ఉంటుంది. ప్రమాదాన్ని గ్రహించి ఆ బిచ్చగాడు విజయ్‌ని బలంగా పక్కకు తోసేస్తాడు. రైలు బిచ్చగాని మీది నుండి వెళ్ళిపోతుంది. ఈ సీన్ లోని టెన్షన్‌ను తన ప్రత్యేకమైన వెలుగు నీడల ఫోటోగ్రఫీతో వీ.కే. మూర్తి చివరిదాకా ఉండగలిగేలా చూసుకున్నారు

తరువాతి సీన్లో ఒక హోటల్‌లో కొందరు పేపర్ చదువుతూ ఉంటారు. ఆ కవి మరణ వార్త విన్నారా అంటూ ఒకతను లోపలికి వస్తాడు. అయ్యో అతను నాకు తెలుసు కూడా.. పాపం ఏ కారణంతో ఇలా అంతమయ్యాడో అంటాడు మరొకడు. మళ్ళీ టీ తాగడంలో మునిగిపోతారు. ఏదయినా సెన్సేషనల్ సమాచారం వింటే అందులో ఏదో ఒక విధంగా మా ప్రమేయం, మా పాత్ర కూడా ఉంది అని చెప్పాలని ప్రయత్నించే మాబ్ మనస్తత్వాన్ని ఈ సీన్‌లో చూపిస్తారు గురుదత్. తరువాత రాబోయే కథలో విజయ్ మరణాన్ని, కవిగా అతని జీవితాన్ని వాణిజ్యకరించే సమాజపు వైఖరికి ఈ సీన్ పరిచయ ఘట్టంగా మొదలవుతుంది.

తరువాతి సీన్లో ఘోష్ ఇంట్లో డైనింగ్ టేబుల్ వద్ద ఘోష్ మీనా ఇద్దరూ కూర్చుని ఉంటారు. ఘోష్ పేపర్ చదువుతూ ఉంటాడు. యువ కవి మృతి అని గట్టిగా చదువుతాడు. మీనా త్రుళ్లిపడుతుంది. అమె చేతిలో టీ కప్పు వణుకుతుంది. టేబుల్ పై మెరుస్తున్న టీ సెట్ ఉంటుంది. వారి స్టేటస్‌కు చిహ్నంగా కనిపిస్తూ వారి మనసులో మచ్చలను కప్పేసే స్టేటస్‌కు ప్రతీకగా ఈ టీసెట్ పై కెమెరా ఫోకస్ ఉంటుంది. రాత్రి పూట రైలు క్రింద పడి ఒక యువ కవి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కోటులో అతను రాసిన లేఖను బట్టి అతను విజయ్ అనే కవి అని గుర్తుంచారని, అతని శరీరం చిద్రమైపోయిందని ఆ ఆఖరి లేఖను అతను ప్రపంచానికిచ్చిన ఆఖరి కవితగా చెప్పుకున్నాడని ఘోష్ చదవి వినిపిస్తాడు. మీనా ముఖంలోని భావాలను పరిశీలిస్తాడు. మీనా తత్తరపాటును కప్పిపుచ్చుకోవడానికి ‘లైఫ్’ అనే పేరున్న మేగజిన్‌ను మొహానికి అడ్డం పెట్టుకుంటుంది. ఈ మాగజిన్ కవర్ పేజి పై శిలువ వేయబడిన జీసస్ బొమ్మ ఉంటుంది. దీని గురించి ముందే చర్చించుకున్నాం. సమాజం శిలువ వేసిన మనిషి వేదనని అర్థం చేసుకోగల తీరిక ఎందరికి ఉందన్న ప్రశ్న ఆ సీన్‌లో కనపడుతుంది.

గులాబ్ తన గదిలో అద్దం ముందు కూర్చుని తన పాపిటలో కుంకుమ దిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న ఆశను, కోరికను ఈ విధంగా చూపిస్తారు దర్శకులు. సత్తార్ ఆ గదిలోకి వచ్చి ఆమెకు పేపర్ చూపిస్తాడు. అది చదివి ఆమె కుప్పకూలిపోతుంది.

రాత్రి పూట గదిలో ఒంటరిగా ఉన్న గులాబ్ చుట్టూ గాలికి కాగితాలు ఎగురుతూ ఉంటాయి. విజయ్ ఆశలు ఆ కాగితాల ద్వారా ఆమెతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంది. అవి విజయ్ కవితల ఫైలులోని కాగితాలు. వాటన్నిటినీ ఆమె సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ సీన్లో ఫోటోగ్రఫీతో ఒక్క డైలాగ్ లేకుండా చాలా సంభాషిస్తారు దర్శకులు. విజయ్‌కి తన కవిత్వమే జీవితం. ఆ కవిత్వమే విజయ్ అన్నది గులాబోకి గుర్తుకొచ్చే సన్నివేశం ఇది. తాను ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఆ గాలితో గదిలో చెల్లాచెదురైన కవితలు గులాబోకి మౌనంగా సహాయపడుతున్నాయి. గులాబో ఒక నిశ్చయానికి వస్తుంది. ఈ మొత్తం సీన్లో ఈ భావాన్ని ఎటువంటి మాటలు లేకూండా కేవలం దృశ్యంతో సంభాషణ జరిగేటట్లు చిత్రీకరణ చేసారు గురుదత్.

(గదిలో చెల్లాచెదురైన కాగితాలతో గులాబ్)

ఈ సీన్ తరువాత విజయ్‌ని గుర్తుకు తెచ్చుకుంటూ గులాబో ఒక పాటను పాడుతుంది. గీతా దత్ గొంతులో “రుత్ ఫిరె పర్ దిన్ హమారే ఫిరే నా ఫిరే నా” అన్న పాటలో ఆర్ధ్రత మనసును మెలితిప్పుతుంది.

రుత్ ఫిరే పర్ దిన్ హమారె ఫిరే నా ఫిరే నా ఫిరే నా

(రుతువులు మారాయి కాని నా రోజులు మాత్రం మారలేదు మారలేదు)

ధర్తీ పే రంగ్ చాయా దునియా కె భాగ్ జాగే, లెకిన్ వహీ అంధేరా అబ్ తక్ హై అప్నె ఆగె

(భూమిని రంగులు కప్పేసాయి. ప్రపంచం కాంతివంతం అయింది కాని ఆ పాత చీకటే ఇంకా నా చుట్టూతా ఉంది)

పహుంచీ నా అప్నీ నైయ్యా అబ్ తక్ కిసీ కినారే, కొయీ నహీ జొ హమ్కొ అప్నీ తరఫ్ పుకారే

(నా జీవితపు నౌక ఏ తీరానికి చేరలేదు, నన్ను తన వైపుకు పిలిచే వారేలేరు)

ఇస్ పార్ కుచ్ నహీ హై ఉస్ పార్ కుచ్ నహీ హై అపనె లియె సివాయె మఝ్ దార్ కుచ్ నహీ హై

(ఈ ఒడ్డున ఎవరూ లేరు, ఆ ఒడ్డున ఎవరూ లేరు, నా చుట్టూ సుడిగుండమే తప్ప మరేమీ లేదు)

అంటూ సాగే ఈ గీతాన్ని సాహిర్ లుధియాన్వి రాస్తే ఎస్.డి.బర్మన్ సంగీతం సమకూర్చారు. గీతా దత్ అత్యద్భుతంగా గానం చేసారు. ఈ పాటను వహీదా మీద చిత్రీకరించారు గురుదత్. సినిమా పూర్తి అయిన తరువాత తన టీం తో కలిసి దాన్ని చూసి సినిమాలో తప్పులను చర్చించుకునే అలవాటు గురుదత్‌కు ఉండేదట. అలా టీం అంతటితో సినిమాను చూస్తు తమ అభిప్రాయం చెప్పమని గురుదత్ అడిగారట. అప్పుడు వహీదా విజయ్ మరణవార్తను విని గులాబో పాట పాడడం ఏమిటని అది బావోలేదని చెప్పారట. వహీదాకి అది మొదటి సినిమా. ఆ అనుభవానికే ఆమె ఇచ్చిన ఈ సలహా ఎవరికీ నచ్చలేదు. టీం సభ్యులందరికీ ఈ పాట బాగా నచ్చింది. అందుకని వాళ్ళు ఆ పాట ఉండాలని పట్టు పట్టారట. ముందు ఆ పాటను అలానే ఉంచేసి తరువాత థియేటర్లో ప్రేక్షకుల స్పందన సరిగ్గా లేదని గురుదత్ రెండవ ప్రింట్ నుంచి ఈ పాటను తొలగించారు. కాని ఈ పాటను హెచ్.ఎమ్.వి. అప్పటికే రికార్డు చేసి ఉంచినందువలన ప్రస్తుతం నెట్‌లో ఇది లభ్యం అవుతుంది. దీన్ని ఇప్పుడూ వింటే, సినిమాలో ఇది అలాగే ఉండి ఉంటే ఒక మంచి హిట్ పాట అయి ఉండేదేమో అనిపించక మానదు. కాని తాను తీసిన సినిమా పట్ల కొన్ని సార్లు గురుదత్ చాలా నిర్దాక్షిణ్యంగా కూడా ఉండేవారని చాలా సందర్భాలలో అర్థం అవుతుంది. తాను కట్టుకున్న ఇంటినే భార్య వాస్తు బావోలేదని అంటుందన్న కారణంతో సమూలంగా కూల్చివేయడంలో చూపించిన మొండితనం వారి సినిమాల పట్ల కూడా ఆయన ప్రదర్శించేవారని షూట్ చేసిన సినిమాలను అర్ధాంతరంగా నిలిపివేసిన అతని లోని అసహనం చాలా సందర్భాలలో బైటకు వచ్చేదని గురుదత్ వ్యక్తిత్వాన్ని నిశితంగా పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఏమైనా గీతా దత్ గానం చేసిన ఈ పాట ఇప్పటి టెక్నాలజీ కారణంగా అందరికి అందుబాటులోకి వచ్చింది కాని. ఆ తరంలో చాలా మంది ఈ పాటను వినలేకపోయారు. ‘ప్యాసా’ సినిమాలో ఆ పాట లేకపోయినా దాన్ని ఇక్కడ పాఠకుల కోసం ఇవ్వడం జరిగింది.

తరువాతి సీన్లో గులాబో విజయ్ కవితల ఫైలుని తీసుకుని ఘోష్ ఆఫీసుకు వెళుతుంది. ఆ ఫైల్ మీద మీనా పేరుంటుంది. అఫీసులో గది బైట కూర్చున్న గులాబోను మీనా చూస్తుంది. ఆమె చేతిలో ఆ ఫైల్ చూసి మీనా బంట్రోతుతో ఆమెను గదిలోకి పంపించమని అడుగుతుంది. ఈ సీన్‌ను జాగ్రత్తగా గమనిస్తే ప్రారంభంలో ఆ బంట్రోత్తు ఒక కాలు ఎత్తి గులాబో కూర్చున్న బెంచీ పై పెట్టి ఆమెపైకి ఒంగి క్రిందకు చూస్తూ ఉంటాడు. గులాబో వృత్తి లేదా ఆమె పేదరికాన్ని అతను గుర్తు పట్టి ఆమె వద్ద అహంకారం చూపుతున్నాడని అర్థం అవుతుంది. గులాబో ఎక్కడికి వెళ్ళినా ఆమె వృత్తి వలన సమాజంలోని మర్యాదస్థులు కనబరిచే చులకన భావం కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా గురుదత్ ఈ విషయాన్ని మర్చిపోరు, ప్రేక్షకులను మర్చిపోనివ్వరు. ఈ బంట్రోతు గులాబో పై వంగి మాట్లాడుతున్నట్లు కేవలం ఒక్క క్షణం కనిపిస్తాడు. అక్కడకు వచ్చిన మీనా వైపుకు తిరిగి ఆమెకు సెల్యూట్ చేస్తాడు. మనిషి వృత్తి, ఆర్ధిక స్థాయి వారికి ఇచ్చే భద్రతను ఈ ఒక్క క్షణం సీన్‌లో చూపిస్తారు గురుదత్. ఇక్కడ ఆ సీన్ లేకపోయినా కథలో గాంభీర్యత చెడదు. కాని పూర్తి ఫర్ఫెక్షనిస్ట్‌గా ఆ ఒక క్షణపు నిశబ్దాన్ని కూడా దృశ్యంతో ఇలా బంధించి ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని, నిస్సహయతను చూపించగల దర్శకులు ఆయన.

లోపలికి వచ్చిన గులాబోను చూసి మీనా మీరెవరు అని బహువచనంలో సంబోధిస్తుంది. ఆమెలో కొంత మంచితనం, మర్యాద ఉన్నాయని చాలా సందర్భాలలో బైట పడుతూ ఉంటుంది. అందుకే తన ఎదురుగా విజయ్ బాధపడుతుంటే చూసి తాను బాధపడుతుంది. మళ్ళీ తన నిర్ణయాన్నీసమర్థించుకుంటుంది. తన పేరు గులాబో అని చెప్పిన ఆమెను ఎక్కడినుండి వచ్చావని అడుగుంది మీనా. అలవాటు ప్రకారం గులాబో చప్పున సోనా… అని తాను ఉండే వేశ్యా వాటిక పేరు చెప్పబోయి మాట మింగేసి ధరమ్ తల్లా అని చెబుతుంది. కాని అప్పటికే మీనాకు గులాబ్ సగంలో వదిలేసిన పేరు అర్థం అవుతుంది. ఆమె ఎవరు అన్నది ఆమెకు తెలుస్తుంది. బహువచనంలోని మాట ఏకవచనంలోకి మారుతుంది. గులాబో ఇది గుర్తించే స్థితిలో ఉండదు. ఆ కవితల ఫైలు ఇమ్మని మీనా అడుతుతుంది. గులాబో “మీకు ఇవి కవితలని తెలుసా.. అయితే ఇవెంత మంచి కవితలో కూడా తెలిసే ఉండాలి కదా. ఇవి ప్రచురించాలని నేను తీసుకువచ్చాను” అని ఆ ఫైల్ మీనాకు ఇస్తుంది. గులాబో చేతినుండి ఆ ఫైలు ఇంచుమించు లాక్కున్నట్లుగా తీసుకున్న మీనా, వాటిని చూసి ఇవి నా భర్తకు చూపించడానికి వచ్చావా అని గులాబోని అడుగుతుంది. వాటి ఖరీదు ఎంత అని అడుగుతుంది.

(గులాబో తెచ్చిన ఫైలును చూస్తున్నమీనా)

“మీరు వాటిని ప్రచురిస్తారా” అని గులాబో ఆమెను ప్రశ్నిస్తుంది. దానికి మీనా “అది నా ఇష్టం వీటికి నీకెంత డబ్బు కావాలి” అని అడుగుతుంది. గులాబో “వీటీని నేను అమ్మడానికి రాలేదు ప్రచురించడానికి వచ్చాను” అంటుంది. ఆమెను పరీక్షగా చూసిన మీనా “ఈ కవితలు నీకు ప్రాణం కదా”.. అని అడుగుతూ…  “నీకు విజయ్ ఎప్పటి నుంచి తెలుసు” అని ప్రశ్నిస్తుంది. “నీకు అతనితో ఏం సంబంధం” అని కూడా ప్రశ్నిస్తుంది.

“అలాంటి ఉత్తమ వ్యక్తికి నీలాంటి స్త్రీకి పరిచయం ఎలా కలిగింది” అని మళ్ళీ వ్యంగ్యంగా అడుగుతుంది. కన్నీళ్ళతో గులాబో “అది నా అదృష్టం” అని జవాబిస్తుంది. “డబ్బు కోసం అన్నీ అమ్ముకునే స్త్రీవి కదా నీవు. ఈ కవితలను నాకు అమ్మమంటే ఒప్పుకోవెందుకు” అని అడుగుతుంది మీనా. గులాబో ముఖంలో మారుతున్న భావాలు చూసి ఆమె విజయ్‌ను ఎంతగా ప్రేమిస్తుందో మీనాకు అర్థం అవుతుంది. ఆమె మాటలను విన్న గులాబో ఈమె మీనా అని అర్థం చేసుకుంటుంది ఆమెను “మీరు మీనా కదా” అని ప్రశ్నిస్తుంది. దానికి మీనా “నా దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. నా భర్త వచ్చేస్తారు. ఈ లోపల ఈ కవితలను నువ్వు నాకు అమ్మవలసిందే” అని గులాబోను బలవంత పెడుతుంది. “నేను నీకు వెయ్యి, రెండు వేలు, మూడూ వేలు ఇస్తాను” అని గులాబోని భయపెడుతుంది. గులాబో “ముప్పై వేలు ఇచ్చినా వీటిని నేను అమ్మను” అంటుంది. ఈ లోపల ఆ గదిలో ఘోష్ ప్రవేశిస్తాడు.

(గులాబోని ప్రశ్నిస్తున్నమీనా)

‘ప్యాసా’లో ఈ ఇద్దరు స్త్రీల మధ్య సంభాషణ సినిమా కథను స్పష్టపరిచే కీలక సన్నివేశం అని గుర్తించాలి. మీనా జీవితం అంతా పేరు ప్రతిష్ఠల చూట్టూ తిరుగుతూ ఉంటుంది. తన భార్య స్థానానికి భంగం రాకుండా, తాను సమస్యలలో పడకుండా ఉండడానికి ఏమన్నా చేయగల స్త్రీ ఆమె. విజయ్ మరణం ఆమెలో బాధను కలిగించినా అతని కవిత్వం నలుగురికి చేరడం వలన తన పేరు కూడా అందరికీ తెలుస్తుందని ఆమె భయపడుతుంది. తన క్షేమం, సమాజంలో తన స్థానం తప్ప మరో విషయం గురించి ఆలోచించని స్వార్థం మీనాలో చూస్తాం. విజయ్ మరణం తరువాత కూడా ఆమెలో మార్పు రాదు. కాని గులాబో ఎన్ని అవమానాలు, ప్రతికూల పరిస్థితులనైనా ఎదిరించి విజయ్ ప్రాణమైన కవిత్వానికి జీవం పోయాలని అలా విజయ్ జీవితానికి ఒక అర్థం కల్పించాలని తపిస్తూ ఉంటుంది. ఈ భిన్న వ్యక్తిత్వాలను ఈ రెండు పాత్రల సంభాషణలలో చూడవచ్చు. కాని స్వార్థపరురాలైన మీనా సమాజం ముందు గౌరవ మర్యాదలు పొందుతుంది. గులాబో అందరి చీత్కారాల మధ్య బ్రతుకుతూ ఉంటుంది. సమాజంలో తలక్రిందులయిన విలువలను స్పష్టపరిచే సీన్ ఇది.

ఘోష్‌ని చూసి భయంతో గులాబోని వదిలేసి టేబుల్ పైనున్న ఫైలుని చేతిలోకి తీసుకుంటుంది మీనా. అదేంటని అడుగుతాడు ఘోష్. ఆమె చేతిలోనుండి ఆ ఫైల్ తీసుకుని దాని పై మీనా పేరుని చదువుతాడు. విజయ్ మీనాకి అంకితం ఇచ్చిన కవితల ఫైలు అదని అతనికి అర్థం అవుతుంది. మీనా అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. ఆ కవితలను చదువుతున్న ఘోష్ దగ్గరగా వచ్చి తాను జీవితాంతం ఒళ్ళమ్ముకుని సంపాదించి, దాచుకున్న నగలను అతని ముందు ఉంచి, తనకా కవితలు ప్రచురించడం అవసరమని, ఆ నగలు తీసుకుని వాటిని ప్రచురించమని గులాబో ఘోష్‌ను బ్రతిమాలుతుంది.

ఇక్కడ ఘోష్‌లో ఒక వ్యాపారస్థుడు కనిపిస్తాడు. అతని భార్య పేరు ఆ ఫైలుపై ఉందన్న నిజం కన్నా వాటి ద్వారా వచ్చే ఆదాయం అతనికి ముఖ్యం అతనికి అనిపించి ఉండవచ్చు. తాను అ కవితలు ప్రచురించనని ఘోష్ నిరాకరించవచ్చు. కాని ఆ నగలు చూసిన తరువాత అతను వాటిని ప్రచురిస్తాడు. ప్రేక్షకులు ఘోష్ కూడా గులాబో ప్రేమకు చలించిపోయి వీటిని ప్రచురించాడా అని ఒక్క క్షణం అనుకోవచ్చు కూడా. ఎందుకంటే గులాబో మాటలతో ఆ సీన్ అక్కడితో ముగుస్తుంది. ప్రెస్‌లో కవిత్వం ప్రచురించబడినట్లు కొన్ని షాట్లు ఉంటాయి. దీని తరువాత ఘోష్‌లో వ్యాపారాత్మకత ఆ సినిమా చివరి దాకా కనిపిస్తూనే ఉంటుంది. అందువలన ఆ కవితలను ప్రచురించడం వెనుక ఘోష్ లోని మానవత్వం కన్నా వ్యాపార తత్వమే ఉన్నదని స్పష్టమవుతుంది.

To be continued…

Exit mobile version