Site icon Sanchika

మధురమైన బాధ – గురుదత్ సినిమా 22- ‘ప్యాసా’-5

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ప్యాసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

ప్యాసా సినిమా చివరి భాగం…

[dropcap]వి[/dropcap]జయ్ కవితలు పుస్తకరూపంలో వచ్చాక ఆ పుస్తకాన్ని ప్రజలు చాలా ఇష్టపడతారు. ఎన్నో కాపీలు ప్రింట్ అయి అన్నీ అమ్ముడవుతాయి. ఒక షాపులో ఒక పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని గులాబో నుంచుని ఉంటుంది. కాపీలు అయిపోయాయని తెలిసి జనం గోల పెడతారు. రేపటిలోపల మళ్ళీ కొత్తవి ప్రింట్ చేయించాలని బెదిరించి వెళతారు. ఆ గుంపుని గమనిస్తూ విజయ్ స్నేహితుడు శ్యాం కూడా మౌనంగా వెనుతిరిగి వెళ్ళిపోతాడు. గులాబ్ కన్నీళ్ళతో తన దగ్గర ఉన్న పుస్తకాన్ని ప్రేమగా నిమురుతూ, “నీ కళ్ళతో నీ కవిత్వానికి వచ్చిన గౌరవాన్ని నీవు చూసుకుంటే బావుండేది” అని విజయ్‌ని గుర్తు చేసుకుని బాధపడుతుంది.

తరువాత్ సీన్ ఒక హాస్పిటల్ వార్డ్‌లో మొదలవుతుంది. మంచం మీద గతం మర్చిపోయిన విజయ్ ఎటో చూస్తూ ఉంటాడు. అతన్ని డాక్టర్లు నర్సులు పలకరిస్తాడు. గాజు చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోతాడు విజయ్. విజయ్ ఆక్సిడెంట్‌లో మరణించలేదని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఘోష్ ఆఫీసులో అతన్ని కలవాలని శ్యాం వస్తాడు. తన రూమ్‌లో విజయ్ దాచుకున్న కవితలను పట్టుకొస్తాడు. వాటికి ఐదు వేలు మాత్రమే ఇస్తానని ఘోష్ అంటాడు. ఇద్దరు వ్యాపారస్థుల మధ్య వేలంపాటలా ఉంటుంది వారి మధ్య నడిచే సంభాషణ. బ్రతికి ఉన్నంత కాలం విజయ్ కవిత్వానికి శ్యాం కూడా పెద్దగా విలువ ఇవ్వడు. కాని విజయ్ మొదటి పుస్తకం అచ్చు అయి అతనికొచ్చిన పేరు చూసాక తన దగ్గర ఉన్న విజయ్ కవితలను అమ్మాలని వీలయినంత ఎక్కువ డబ్బు సంపాదించాలని శ్యాం ప్రయత్నం. పుస్తకం అమ్మాక లాభంలో నాలుగో వంతు శ్యాం కిచ్చేటట్లు ఆఖరున ఒప్పందం కుదురుతుంది.

(హాస్పిటల్‌లో ఎవరినీ గుర్తు పట్టే పరిస్థితిలో లేని విజయ్)

హాస్పిటల్‌లో విజయ్ మంచం పక్కన కూర్చున్న నర్స్ విజయ్ పుస్తకంలోని కవితలను బిగ్గరగా చదువుతూ ఉంటుంది. సాహిర్ లుధియాన్వి రాసిన పర్చాయియా అన్న పుస్తకం అట్టను చూపుతూ అందులోని కవిత్వపు పంక్తులను యథాతథంగా ఈ సీన్ కోసం వాడుకున్నారు గురుదత్. విజయ్‌కి తెలివి వస్తుంది. నర్స్ చేతిలో పుస్తకాన్ని లాక్కుని చూస్తాడు. ఇవి నా కవితలు అంటూ బిగ్గరగా అంటాడు. అతనికి స్పృహ వచ్చింది అని తెసుకుకున్న డాక్టర్లు అతన్ని మాట్లాడించబోతే తానే విజయ్‌ని అని ఆ కవితలు తనవి అని వాళ్ళతో చెబుతాడు విజయ్. ఈ పుస్తకం రాసిన విజయ్ మరణించాడని చెబుతారు డాక్టర్లు. కాని ఆ కవితలు తనవే అని విజయ్ అనడంతో అతనికి మతి చలించిందని నిర్ధారణకు వస్తారు డాక్టర్లు.

ఇప్పుడు ఘోష్ ఆఫీసులోకి విజయ్ అన్నలు వస్తారు. తాము విజయ్‌ని ఎంతో కష్టపడి ప్రేమతో పెంచామని విజయ్ కవిత్వంపై తమకు రాయల్టీ ఇవ్వాలని ఘోష్‌ని అడుగుతారు. మీరు నాకు ఆ కవితలు ఇవ్వలేదు, కాబట్టి మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని వారిని పంపేస్తాడు ఘోష్.

విజయ్‌ని పిచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. గదిలో పిచ్చివాళ్ల మధ్య బంధింపబడి అయోమయంలో ఉంటాడు విజయ్. ఆ వార్డులోకి డాక్టర్లు విజయ్ మిత్రుడు శ్యాంను, ఘోష్‌ను తీసుకుని వస్తారు. వాళ్ళు విజయ్‌ని చూసి ఇతను విజయ్ కాదు అని నిర్ధారిస్తారు. విజయ్ వాళ్లను పిలుస్తూ ఉంటాడు కాని అతని అరుపులను వాళ్ళు విననట్లు నటిస్తారు. విజయ్ బ్రతికే ఉన్నాడని చెబితే తాము విజయ్ పేరున సంపాదిస్తున్న డబ్బు కోల్పోవలసి వస్తుందన్న స్వార్థం వాళ్లలో కనిపిస్తుంది. విజయ్ ఆశ్చర్యపోతాడు. అతని మనసు గాయపడుతుంది. మరుసటి రోజు తన ఆఫీసుకు విజయ్ అన్నదమ్ములను పిలిపిస్తాడు ఘోష్. విజయ్ బ్రతికే ఉన్నాడని అయితే అతన్ని గుర్తించకుండా ఉండడానికి తాను వారికి డబ్బు ఇస్తానని అంటాడు. విజయ్ కవిత్వానికి వస్తున్న లాభాలలో కొంత వారికి ఇస్తానని ఒప్పుకుంటాడు. తమ్ముడిని గుర్తు పట్టకుండా ఉండాలంటే ఇంకాస్త డబ్బు ఎక్కువ కావాలని బేరం పెడతారు ఆ సోదరులు.

పిచ్చి ఆసుపత్రి బైట మాలిష్ చేస్తానంటూ సత్తార్ వీధిలో వెళ్తూ ఉంటాడు. అతని గొంతు విన్న విజయ్ అతన్ని పిలుస్తాడు. విజయ్‌ని చూసిన సత్తారు ముందు ఆశ్చర్యపోతాడు. తనను బలవంతంగా అక్కడ బంధించారని తనను రక్షించమని విజయ్ సత్తార్‌ని బ్రతిమిలాడుతాడు.

(పిచ్చి ఆసుపత్రిలో విజయ్)

సత్తార్ విషయం గ్రహిస్తాడు. కాపలా దారులకు మాలిష్ చేస్తానని లోపలికి వస్తాడు. గేటు తీసి ఉన్నప్పుడు అదును చూసుకుని విజయ్ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోతాడు. ఈ ఒక్క సీన్ మాత్రమే ఈ సినిమా మొత్తంలో కొంత నాటకీయంగా ఉంటుంది. విజయ్‌ని మళ్ళీ సమాజంలోకి రప్పించాలంటే ఇలాంటి నాటకీయత అవసరం అనుకుని కావచ్చు, ఈ సీన్ చిత్రించారు గురుదత్. మాములుగా మరో దారిలో విజయ్ పిచ్చి ఆసుపత్రి నుంచి త్వరగా బైటపడే మరో మార్గం ఉండదు మరి.

విజయ్ ముందు తన ఇంటికి వెళతాడు. అన్నలను కలుస్తాడు. విజయ్ ఎప్పుడో మరణించాడని నువ్వు విజయ్‌వి కావు అని అతన్ని గుర్తించడానికి నిరాకరిస్తారు అన్నలు. ఇంటి గుమ్మం దగ్గర నుంచున్న విజయ్‌ను గెంటేస్తారు. విజయ్ బస్‌లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఒక ప్రయాణికుడు మరొకతనితో విజయ్ సంవత్సరీకం టౌన్ హాల్‌లో పెద్ద ఎత్తున జరుపుతున్నారని అక్కడకి తాను వెళుతున్నానని చెబుతాడు. అందరూ విజయ్‌ని మెచ్చుకుంటూ కొందరు విజయ్ తమకు తెలుసంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. వారి మధ్యన విజయ్ మౌనంగా నుంచుని ఉంటాడు. “Seven cities claimed the mighty Homer dead, through which the living Homer begged his bread” అనే పంక్తులలోని సామాజిక విషాదాన్ని ఈ సీన్‌లో బంధించే ప్రయత్నం చేసారు గురుదత్. “ఏడు రాష్ట్రాల ప్రజలు మరణించిన వీరుడు హోమర్ తమవాడని గర్వంగా చెప్పుకుంటూంటే , వాళ్ళందరి మధ్య హోమర్ తిండి కోసం భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు” అన్న హోమర్ జీవితాన్ని విప్పి చెప్పిన ఆంగ్ల సాహిత్యంలో వాడుకలో ఉన్న ఆ పై వాక్యం లోని సామాజిక స్వార్థాన్ని ఈ సీన్‌లో ఇలా చూపించే ప్రయత్నం చేసారు గురుదత్. చూస్తున్న ప్రేక్షకులను విజయ్ లోని విరక్తి భావం అంచువరకు తీసుకువెళతారు గురుదత్. నాకు విజయ్ బాగా తెలుసు నేను అతనికి చాలా సహాయం చేసాను తెలుసా అని చెబుతూ ఓ ప్రయాణికుడు బస్సులో నించుని ఉన్న విజయ్‌ని కాస్త జరుగు అని తోసుకుంటూ దిగిపోతాడు విజయ్ మొహం మీద కనిపించీ కనిపించని ఒక వ్యంగ్యంతో కూడిన చిరునవ్వుని మూర్తి కెమెరా ఫోకస్ చేస్తుంది.

టౌన్ హాల్‌లో విజయ్ సంతాప సభ జరుగుతూ ఊంటుంది. ఎక్కడెక్కడి నుంచో జనం ఆ హాలుకి వెళుతూ ఉంటారు. వారి మధ్య విజయ్ కూడా ఉంటాడు. ఆ హాలు లోపలి గుమ్మం దగ్గర నిల్చున్న విజయ్ లోపల కిక్కిరిసిపోయిన హాలు స్టేజీపై తనను గుర్తుపట్టడానికి నిరాకరించిన బంధుమిత్రులను చూసి ఆశ్చర్యపోతాడు. ఈ షాట్లోని వెలుగు రేఖల ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. విజయ్ నీడ గుమ్మంలో ఉంటుంది. విజయ్ వెనుకాల వెలుగు కనిపిస్తుంది. జీవించి ఉన్న వ్యక్తిని నీడలలోకి  తోసేసిన సమాజం స్థితిని చూపించే షాట్ ఇది. ఘోష్ స్టేజి మీద నుండి మట్లాడుతూ ఉంటాడు “గత సంవత్సరం ఇదే రోజున విజయ్ మరణించాడు. నాకు కుదిరితే నా యావదాస్తిని ఇచ్చి, నన్ను నేను త్యాగం చేసుకుని అతన్ని తిరిగి తెచ్చుకోవాలని ఉంది. కాని అది జరగదు. ఎందుకంటే మీరే కారణం. విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అంటారు. కాని అది నిజం కాదు. మీరందరూ కలిసి అతన్ని హత్య చేసారు. ఈ రోజు కనుక విజయ్ జీవించి ఉంటే, ఏ సమాజం అయితే తనని ఆకలితో అలమటించేలా చేసిందో, ఆ సమాజమే రత్నావైడూర్యాలతో అతన్ని తూచడానికి సిద్ధంగా ఉండని చూసేవాడు. ఏ ప్రపంచంలో అతను అనామకుడుగా ఉండిపోయాడో, ఆ ప్రపంచమే అతన్ని తమ మనసనే సింహాసం మీద అతన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉందని, కీర్తిని కిరీటంగా అతని తలపై ఉంచాలని ఉవ్వీళ్ళూరుతుందని తెలుసుకునేవాడు…. పేదరికపు వీధులనుండి అతన్ని భవనాల వైపుకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నది చూసుకునేవాడు.”

ప్రపంచం లోని ఈ హిపోక్రసిని చూస్తున్న విజయ్ నోటి నుండి కవితా రూపంలో ఈ పంక్తులు వస్తాయి…

యె మహలో యె తఖ్తో యె తాజోం కీ దునియా..

యె ఇంసాన్ కే దుష్మన్ సమాజో కీ దునియా…..

(తన సంతాప సభను తిలకిస్తున్న విజయ్)

ఈ కవితను సాహిర్ రాసినప్పటినుండి గురుదత్ దీన్ని అమితంగా ఇష్టపడ్డారు. తాను అనుకున్నట్లుగా ఈ పాట వచ్చిందని దాన్ని చాలా ఇష్టంతో షూట్ కూడా చేసారు. అప్పుడు సంభాషణల రచయిత అబ్రర్ అల్వీ ఊర్లో లేరట. వచ్చిన తరువాత ఈ పాట చూసి తాను రాసిన సంభాషణలకు ఈ పాటకు కంటిన్యుటీ లేదని వాదించారట, పాట పల్లవిలో వచ్చే భవనాలు, కిరీటాలు, సంహాసనాలు అనే పదాలు రాజరికపు చిహ్నాలని అవి ఎలా ఈ సీన్‌కి విజయ్ కవితకు సరిపోతాయని వాదించారట. గురుదత్ ఎట్టి పరిస్థితులలో ఈ పాట పల్లవి మార్చడానికి ఇష్టపడలేదు. అప్పుడు అబ్రర్ పై సంభాషణను రాసి అందులో సింహాసనం, భవనాల, కిరీటాల ప్రస్తక్తి తెచ్చి అది ఘోష్ ఇస్తున్న స్పీచ్‌గా మార్చి దానికి కంటిన్యుటీలో ఈ పాట పల్లవి వచ్చేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేసారు. యాభైలలో సింహాసనాలు, కిరీటాల ప్రసక్తి ఎందుకు వచ్చింది అని ప్రేక్షకులలో ఆలోచన వచ్చే ఆస్కారం లేకుండా ఘోష్ ఇచ్చే అహంకారపు స్పీచ్‌లో ఈ పదాలను చేర్చడం జరిగింది. గురుదత్ సినిమాలలో సినీ అభిమానులు ఇష్టపడే అంశం ఇదే. ప్రేక్షకులు పిచ్చోళ్ళు, మనమేం చూపిస్తే అది చూడక చస్తారా అనే ధోరణి అసలు ఉండదు. కళాకారులకు ఇచ్చే గౌరవం ప్రేక్షకులకు ఇస్తూ, ఇంటేలెక్చువల్‌గా వారు తమ కన్నా పై స్థాయి వారని గౌరవిస్తారు గురుదత్. అతని మొదటి సినిమాలలో(ఆర్‌పార్) మజ్రూహ్ సుల్తాన్‌పురి పాటలలో గ్రామర్‌ని పక్కన పెట్టి పాటలు రాయించుకుని ఆ పాత్రలలోని అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని చూపించడంలో వెనుకాడనట్లే ‘ప్యాసా’ అనే ఇంటెలెక్చ్యువల్ సినిమా తీస్తున్నప్పుడు అదే స్థాయి ప్రేక్షకులతో సంభాషిస్తున్నానని భాషకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడా స్థాయి తగ్గకుండా సినిమాను తీసి మాస్ ప్రేక్షకుల స్థాయి కూడా పెరిగేలా చూడడం కళాకారుల బాద్యత అనే నమ్మకాన్ని ఇక్కడ ప్రదర్శించారు గురుదత్. ఈ రెండు భిన్న దృవాలను ప్రదర్శిస్తూ కూడా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయగలిగారాయన.

ఈ పాట ఎంత సహజంగా ఈ సీన్‌లో వస్తుందంటే, చూస్తున్న వారంతా అత్యంత శ్రద్ధగా ఈ పంక్తులను వింటారు. పాటను ఎలాంటి సందర్భంలో ఎలా షూట్ చేయాలో గురుదత్‌కి తెలిసినంతగా మరెవరికీ తెలీదు అనిపిస్తుంది ఈ సీన్ చూస్తుంటే. ఈ పాటలో గురుదత్ నీడలో ఉన్నట్లుగా డార్క్‌గా కనిపిస్తూ ఉంటే అతని వెనుక వెలుగు కిరణాలు ప్రసరిస్తూ కనిపిస్తాయి. ఈ ఫోటోగ్రఫీ ఆ సీన్‌ని అద్భుతంగా పండించింది. ఈ సీన్‌లో గుమ్మం దగ్గర నించున్న విజయ్, హాల్లో ఉన్న అంతమంది ప్రేక్షకుల నడుమ శిలువ వేయబడిన ఏసును మరోసారి గుర్తుకు తెస్తాడు. ‘ప్యాసా’ అంటే చాలా మంది సినీ ప్రేమికుల మదిలో మెదిలే సీన్ ఇది.

హర్ ఎక్ జిస్మ్ ఘాయల్, హర్ ఎక్ రూహ్ ప్యాసీ నిగాహో మే ఉల్ఝన్ దిలో మే ఉదాసీ

యె దునియా హై యా ఆలం-ఎ-బద్‌హవాసీ… యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యాహై

హాలులో అందరూ వెనక్కు తిరిగి చూస్తారు. ప్రేక్షకుల మధ్య తల ఒంచుకుని కూర్చుని ఉన్న గులాబో ఈ గొంతు గుర్తు పట్టి ఆశ్చర్యపోతుంది. విజయ్ తన కవితలను పబ్లిష్ చేయమని ముందు ఒక చిన్న పబ్లిషర్ అయిన షేక్ దగ్గరకు వెళతాడు కదా, అతను ప్రేక్షకుల మధ్యన ఉంటాడు. విజయ్‌ని గుర్తు పడతాడు. మెల్లగా మీనా, శ్యాం, ఘోష్ అందరూ ఒకొక్కరుగా విజయ్‌ని చూస్తారు. మీనా కళ్ళల్లో మొదటి సారి భర్తపై అసహ్యం, ఘోష్ కళ్ళలో భయం, శ్యాం కళ్ళల్లో భీతి, వహీదా కళ్ళల్లో నమ్మలేని ఆశ్చర్యం కనిపిస్తుంది. టీవీ సీరియల్లో డైలాగ్ డైలాగ్‌కి మధ్య ఆర్టిస్టుల మొహంపై ఫోకస్ చేసి సాగదీస్తారు చూడండి. ఆ డైరెక్టర్లకు ఈ సీన్ చూపించాలి. ఇంత మంది ఆర్టిస్టుల మొహంపై రెండు క్షణాలు కనిపించే ఆ కెమేరా ఎన్ని రకాల భావాలను పట్టుకుంటుందో చూడగలిగితే ఎంతో నేర్చుకోవచ్చు నిజంగా సిన్సియర్‌గా సినిమా తీయాలనుకునేవాళ్ళు. ఈ సినిమాను చూసి, అర్థం చేసుకుంటే నానా చెత్తను భరించలేం కూడా…

“యహా ఎక్ ఖిలౌనా హై ఇంసాన్ కీ హస్తీ, యె బస్తే హై ముర్దా పరస్తోం కి బస్తీ

యహా పర్ తో జీవన్ సే హై మౌత్ సస్తీ, యె దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై”

ఈ వాక్యాల దగ్గర స్టేజిపై ఆవిష్కరణకు సిద్ధం చేసిన విజయ్ శిలా విగ్రహంపై కెమెరా ఫోకస్ చేస్తారు మూర్తి. ఈ మాటలో గురుదత్‌పై జరిగిన చిత్రీకరణ సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎలాంటి మూడ్‌లో తీసుకెళుతుందో అనుభవించితే కాని అర్థం కాదు. పాత్రల మనోభావలను ప్రేక్షకులు అనుభవించే స్థాయికి తీసుకెళ్ళే పిక్చరైజేషన్ ఇది. ఈ పాట చిత్రీకరణ చూసిన వారెవయినా గురుదత్‌ని ప్రేమించకుండా ఉండలేరు. ఐకానిక్ సాంగ్ ఇది. గురుదత్ కళ్లల్లో ప్రశ్నలు, వహీదా మొహంలో ఆనందం రెండు భిన్నమైన భావాల మిశ్రమం కనిపిస్తుంది.

జవానీ భటక్తీ హై బద్కార్ బన్కర్, జవా జిస్మ్ సజ్తే హై బాజార్ బన్కర్

యహా ప్యార్ హోతా హై వ్యాపార్ బన్కర్ యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై

పై వాక్యాన్ని గమనిస్తే ఈ సందర్భంలో యవ్వనం, యువ శరీరాల ప్రసక్తి ఇక్కడ అక్కర్లేదు కాని మనం గమనించవల్సింది సాహిర్ ఈ పాటను సినిమా కోసం రాయలేదు. సాహిర్ కవితను గురుదత్ ఈ సందర్భంలో వాడుకున్నారు. ఈ కవితను ఆయన ఎంతలా ఓన్ చేసుకున్నారంటే ఈ వాక్యాన్ని ఇక్కడ మార్చదలచుకోలేదు. గురుదత్ తన సినిమాలలో హీరోయిన్లకు ఎక్కువ మేకప్ లేకుండా సాదా సీదాగా చూపించడానికి ఇష్టపడేవారు. ముఖ్యంగా వారు తీసిన చివరి సినిమాలలో గ్లామర్ పట్ల ఒక వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ వాక్యం తిరిగి రాయించడానికి ఇష్టపడకుండా ఒక కవి ప్రపంచంలోని సమస్త వ్యాపార సూత్రాలను ప్రశ్నించే క్రమంలో ఈ వాక్యం ఇక్కడ ఉంచేయాలనే నిశ్చయించుకున్నారు. దీన్ని పిక్చరైజ్ ఎంత గొప్పగా చేసారంటే, ఈ పాట చూస్తున్న ప్రేక్షకుడు ఈ హాల్‌లో యవ్వనం గురించి ప్రసక్తి ఎందుకు అని అస్సలు అనుమానించరు. నిజం చెప్పాలంటే సాహిర్ రాసిన వాక్యాలు తీసేయాలని ఎవరికి మనసు కలుగుతుంది. వాటిలోని నగ్న సత్యాలను భరించలేని వారికి తప్ప.

ఇక్కడ ప్రేమ వ్యాపారం అన్న చోట కెమెరా మరోసారి మీనాపై ఫోకస్ అవడం మర్చిపోదు. మీనాలోని పశ్చాత్తాపం ఆ అరక్షణంలో చూపించడం గురుదత్ మర్చిపోలేదు. ఇక్కడ హాలులోని ప్రేక్షకులు అందరూ తిరిగి వెనకకు చూస్తారు.

యె దునియా జహా ఆద్మీ కుచ్ నహీ హై, వఫా కుచ్ నహీ, దోస్తీ కుచ్ నహీ హై

జహా ప్యార్ కీ కద్ర్ హీ కుచ్ నహీ హై యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై

ఈ వాక్యాల దగ్గర బాల్కనీ గోడ దగ్గరగా స్టేజిని చూస్తూ గురుదత్ ఉంటే అతని వెనుక నించుని ఉంటారు ప్రేక్షకులు అందరూ…. అంతమంది మనుష్యుల అస్తిత్వం ఏంటీ అన్న ప్రశ్నను అత్యద్భుతంగా పట్టుకుంటుంది మూర్తి కెమెరా. శ్యాం, ఘోష్‌లు ఇద్దరూ ఇక మనం ప్రమాదంలో పడతాం అని అర్థం చేసుకుని మరో వ్యూహం పన్నుతారు. రౌడీలను పిలిచి విజయ్‌ని అక్కడ నుండి తీసికెళ్ళమని పురమాయిస్తారు. అతని దగ్గరకు చేరాలని వస్తున్న గులాబో కళ్ళలో మొదట ప్రమాద సంకేతం ప్రేక్షకులకు కనిపిస్తూంది. ఇద్దరు లావుపాటి మనుష్యులు విజయ్‌ని లాగి వెనక్కు పడేయాలని చూస్తారు. ఇక్కడ సీన్‌లో మూడ్‌ని వహిదా కన్నీళ్ళూ, ఎస్. డి. బర్మన్ సంగీతం స్పష్టపరుస్తాయి. ఈ కవితలోని విషాదాన్ని ఇక్కడ తన సంగీతంతో ఒక టెన్షన్ జోడించి ఇంకా ఎక్కువ చేస్తారు బర్మన్. దాన్ని అదే స్థాయిలో చిత్రీకరించారు గురుదత్. ఇక ఇప్పుడు రఫీ గొంతులో నుండి నిర్వేదం, కోపం ఒకేసారి ఇలా బయటపడతాయి….

జలా దో ఇసె ఫూంక్ డాలో యె దునియా, మెరే సామ్నే సే హటావో యె దునియా

తుమ్హారీ హై తుమ్హీ సంభలో యే దునియా.. యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై

రఫీ గొంతు ఈ వాక్యాలను ఎంత గంభీరంగా, కోపంగా, దుఖంతో పలుకుతుందంటే, కడుపులో బాధ సుళ్ళు తిరుగుతుంది. ఒక మనిషి ఈ ప్రపంచాన్ని మీరే ఏలుకోండి అని తిరిగి వెళ్ళిపోవడం లోని సమాజ వైప్యల్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మనసున్న ఓ మనిషిని ఈ స్థితికి తీసుకొచ్చిన అసహ్యకరమైన సమాజాన్ని మన జీవితాలలో భాగం చేసుకున్నందుకు, దాని ఎదిరించలేని మన చేతకానితనానికి సిగ్గు పడతాం. ఆ వ్యక్తి పతనానికి మన లాంటి మౌన మర్యాదస్తులు ఎంత వరకు కారణమవుతున్నారో అని మనస్సాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది. మనస్సాక్షిని మనసులో పాతి పెట్టేసిన వాళ్ళూ ఈ పాట ఆఖరి భాగాన్ని భరించలేరు.

ఏ ఆత్మహత్య కబురు విన్నా నాకు ఈ సీన్ ఆటోమెటిగ్గా కళ్ళ ముందుకు నిలుస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తిలోని వేదనను ఇంత కన్నా గొప్పగా మరెవ్వరూ స్క్రీన్ పై చూపలేరు ఎప్పటికీ. అంత గొప్పగా చిత్రించబడిన సీన్ ఇది. తనను పట్టుకుని లాక్కెళుతున్న వ్యక్తులపై కూడా విజయ్ శరీర భాషలో కోపం కనిపించదు. కేవలం ఒక నిస్సహాయత, అసలు నాకెవరూ వద్దు అన్న విరక్తి మాత్రమే ఉంటుంది. “నా కళ్ళ ముందు నుండి ఈ ప్రపంచాన్ని జరిపేయండి” అన్న వాక్యం దగ్గర గురుదత్ ముఖంలో దుఃఖం ఎంతలా గూడు కట్టుకుని ఊంటుందంటే, ఇంత కన్నా దుర్భర బాధ మరొకటి ఎవరికీ ఉండదేమో అనిపిస్తుంది. చాలా ఇంటెన్స్‌తో గూడు కట్టుకున్న విషాదాన్ని తన ముఖంలో చూపిస్తారు గురుదత్. గురుదత్ అసలు ముఖం ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే అది విజయ్ ముఖం అని అనిపించదు. అక్కడ ఉన్నది కేవలం ఒక పాత్ర కాదు. ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురుదత్తే…. అని నమ్మవలసి వస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత గురుదత్ మరణించిన విధానానికి ఈ సీన్‌లో ఆయన పలికించే ఇంటెన్స్ ఎమోషన్స్‌కి లింక్ ఉన్నట్లనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమా చూస్తే.

పాట చివరకు వచ్చే సరికి విజయ్ స్నేహితుడు శ్యాం హాల్‌లో మెయిన్ ఆఫ్ చేస్తాడు. చుట్టూ చీకటిలో అయోమయంలో పడిపోతారు హాల్లో ఉన్నవారంతా. అక్కడ తొక్కిసలాట మొదలవుతుంది. జనం అంతా ఒకరిపై నుండి మరొకరు బైటి ద్వారానికి వెళ్లాలని తోసుకుంటూ ఉంటారు. ప్రాణ భయంతో పరుగెడుతున్న వారి మధ్య నుండి గులాబో, షేక్ మాత్రం విజయ్ వైపుకి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. షేక్ క్రింద పడి ఉన్న విజయ్ దగ్గరకు చేరుకుంటాడు. అతన్ని హృదయానికి హత్తుకుంటాడు. చూస్తున్న ప్రేక్షకులు విజయ్‌ని ప్రేమించే ఒక్క మనిషి ఉన్నాడని సంతోషిస్తారు. తొక్కిసలాటలో క్రింద పడిపోయిన గులాబో పై నుండి చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోతారు. జుహీ గులాబోని కాపాడుతుంది.

తరువాతి సీన్ ఘోష్ ఇంట్లో చూస్తాం. ఘోష్ శ్యాం పై విరుచుకు పడతాడు. విజయ్‌ని గుర్తు పట్టకుండా అతని అన్నలను తమ పక్షాన చేర్చుకోవాలని చెబుతాడు. దీనికి వారికెంత డబ్బైనా ఎర చూపమని అంటాడు. శ్యాం మాత్రం చాలా కూల్‌గా మీ డబ్బు ఇప్పుడు విజయ్‌ని గుర్తించకుండా ఆపలేదు అని బదులిస్తాడు. నేను డబ్బు నీళ్ళల్లా ఖర్చు పెట్టడానికి సిద్ధం. ప్రతి ఒక్కరిని కొనడానికి సిద్ధం కాని విజయ్‌ని మాత్రం ఎవరూ గుర్తు పట్టకూడదు. ఇతను విజయ్ కాడు అని నిరూపించాలి లేదంటే మన మర్యాద పోతుంది. మనం పూర్తిగా నాశనమవుతాం అంటాడు ఘోష్. మీనా వీరి మాటలు చాటుగా వింటూ ఉంటుంది. “మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నా దారి నేను చూసుకుంటాను” అని అంటాడు శ్యాం. “అంటే నువ్వు తప్పించుకోగలను అనుకుంటున్నావా. ఒకసారి నువ్వు అతన్ని పిచ్చి ఆసుపత్రిలో గుర్తు పట్టడానికి నిరాకరించావు అన్న సంగతి మర్చిపోయావా” అని శ్యాంని అడుగుతాడు ఘోష్. మీనా ఇది విని ఆశ్చర్యపోతుంది. జరిగింది ఆమెకు అప్పుడు అర్థం అవుతుంది. “నేను గాలి వాటం మనిషిని. అప్పుడు గాలి మీ వైపు వీచిందని మీ పక్కన ఉన్నాను ఇప్పుడు విజయ్ పక్కన చేరతాను” అంటాడు శ్యాం. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

శ్యాం షేక్ ఆఫీసుకు వస్తాడు. విజయ్‌ని రక్షించి తీసుకొచ్చిన షేక్ అసలు రంగు ఇక్కడ బైటపడుతుంది. “విజయ్ ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాడు. అతని కవితలను ప్రచురించి నేను లక్షలు సంపాదిస్తాను” అని ప్రెస్‌లో పని వాళ్ళతో అంటూ ఉంటాడు షేక్. శ్యాం లోపలికి వచ్చి “నువ్వొక్కడివే లాభం ఎలా పొందుతావు ఈ వ్యాపారంలో” అని ప్రశ్నిస్తాడు. షేక్‌ని తాను విజయ్‌ని పిచ్చివాడని చెప్తే విజయ్ మళ్ళీ పిచ్చాసుపత్రి పాలవుతాడని తనను కలుపుకోకపోతే షేక్ ఒక్కడే విజయ్ ద్వారా లాభపడలేడని షేక్‌ని భయపెడతాడు శ్యాం. అక్కడికి విజయ్ అన్నలు వస్తారు. విజయ్‌ని తమ్ముడిగా గుర్తించడానికి పదిహేను వేలు లంచం అడుగుతారు. గదిలోకి వచ్చిన విజయ్ వీరి మాటలను వింటున్నాడని తెలిసి అన్నలు అతన్ని చేరి కౌగలించుకుంటారు. విజయ్ ఆశ్చర్యంగా అందరినీ గమనిస్తూ ఉంటాడు.

మరుసటి రోజు విజయ్ బ్రతికే ఉన్నాడన్న వార్త పేపర్లలో వస్తుంది. మళ్ళీ సీన్ టౌన్ హాల్‌కి మారుతుంది. ఇప్పుడు కెమెరా మైక్ ముందున్న విజయ్ వైపుకు మళ్ళుతుంది. జనంతో నిండి ఉన్న ఆ హాల్‌ని అందులో ఉన్న మనుష్యులని పెదవులపై వ్యంగ్యంతో ఉన్న ఒక చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు విజయ్. గురుదత్ మొహంపై కనిపించీ కనిపించని ఈ చిరునవ్వులోని వ్యంగ్యం నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం, ఎన్ని సమాధానాలు ఆ చిరునవ్వులో ఉంటాయంటే… ఈ ప్రపంచాన్ని పట్టించుకోవడం అవసరమా. .. అసలు మనకీ ప్రపంచం అవసరమా అని అతని ముఖం చెబుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రేక్షకులలో ఒకరు ఇతనే విజయ్ అని నమ్మకం ఏంటీ అని ప్రశ్నిస్తారు. ఇతనే విజయ్ అయితే ట్రైన్ క్రింద పడి మరణించినది ఎవరు అని ప్రశ్నిస్తారు. దీనికి విజయ్ అన్నలు లేచి నుంచుని సాక్షం మేము ఇతను మా తమ్ముడు అని బదులిస్తారు. తాను ఇంటికి వెళ్ళి బ్రతిమాలినా ఆని నువ్వు మాకు తెలీదు అన్న అన్నలే ఇప్పుడు అందరి ముందు ప్రేమగా తమ్ముడు అని సంబోధించడం చూస్తాడు విజయ్. షేక్ సూచన మేరకు అక్కడకు వచ్చిన శ్యాం కూడా విజయ్ నా చిన్నప్పటి స్నేహితుడు అని బదులిస్తాడు. పిచ్చాసుపత్రిలో పడి ఉన్న తనను చూసి కూడా గుర్తించడానికి నిరాకరించిన శ్యాం నలుగురు ఎదుట ప్రేమను ప్రకటిస్తాడు. షేక్ కూడా దానికి బదులిస్తాడు. అందరూ వాళ్ళ మాటలను నమ్ముతారు. చూస్తున్న విజయ్‌తో పాటు ప్రేక్షకుల మనసులో కూడా ఒక విరక్తి లాంటి భావం పాకుతుంది. రఫీ గొంతులో “యహా జీవన్ సే భీ హై మౌత్ సస్తీ.. యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యాహై” అన్న వాక్యాలు జనాల ఆనందపు కేకలలో వెనుక వినిపిస్తాయి. (ఇక్కడ జీవితం కన్నా మరణం చవక. ఈ ప్రపంచం నా సొంతమైతే నాకేంటీ). విజయ్ మనసులో ఆలోచనలు ఇవి అని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. సభలో ఉన్న మీనా ఇప్పటికైనా విజయ్ జీవితంలో ఆనందం వస్తుందని సంతోషిస్తుంది. తన పేరు చెప్తూ జయ జయ నాదాలు చేస్తున్న ప్రేక్షకులను చూస్తూ విజయ్ లోగొంతుకతో మాట్లాడడం మొదలెడతాడు. సోదరులారా ఏ విజయ్‌ని మీరు చేతులు చాచి ఆలింగనం చేసుకోవాలని అనుకుంటున్నారో, ఏ విజయ్ కోసం జయ జయ నాదాలు చేస్తున్నారో…నేను ఆ విజయ్‌ని కాదు” అంటాడు. ఆశ్చర్యపోయిన అందరికి వినిపించేలా మరోసారి గట్టిగా “నేను విజయ్‌ని కాను” అని జవాబిస్తాడు విజయ్. దీనితో హాలులో ఉన్న ప్రేక్షకులలో కోపం పెరిగిపోతుంది. వెంటనే అతని కొట్టడానికి ముందుకు రావడం మొదలెడతాడు. అంతటి ప్రేమ నిముషంలో ద్వేషంగా మారడం చూసి మరోసారి ఆశ్చర్యపోతాడు విజయ్. జనం కుర్చీలు ఎత్తి మీదకు విసరబోతారు. స్టేజి మీదకు వచ్చి విజయ్‌ని కొట్టడం మొదలెడతారు. మరోసారి ఎస్.డీ బర్మన్ కూర్చిన సంగీతంతో రఫీ గొంతు “జలాదో ఇసే ఫూంక్ డాలో ఏ దునియా. మేరే సామ్నే సె హటాదో యే దునియా.. తుమ్హారీహై తుమ్హీ సంభాలో యే దునియా.. యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై” అనే వాక్యాలు వినిపిస్తాయి.

(నిముషంలో మారిన జనం ప్రేమను ఆశ్చర్యంతో గమనిస్తున్న విజయ్)

ఈ సందర్భంలో మన తెలుగు వారికి శ్రీశ్రీ రాసిన “నిప్పులు చిమ్ముకుంటూ, నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ, నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే”…. అన్న వాక్యాలు గుర్తుకు వచ్చి తీరతాయి. తనకు పనికి రారనుకున్న వ్యక్తుల పట్ల సమాజం ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుందో చెప్పడానికి ఇంతకు మించిన వాక్యాలు తెలుగులో వేరేవి కనపడవు. ఇంత కన్నా మరో గొప్ప సీన్ భారతీయ సినిమాలో మరొకటి కనిపించదు. సాహిర్ కవిత్వంలో పదును, శ్రీశ్రీ మాటల పదును ఇంచుమించు ఒకేలా ఉంటాయి. చాలా సందర్భాలలో ఇది గమనించవచ్చు.

స్టీజి మీద విజయ్‌ని కొడుతున్న వారి నుండి సత్తార్ అతన్ని రక్షిస్తాడు. విజయ్ దగ్గరకు వెళ్ళి అతని చుట్టూ కవచంలా నిలబడి జనంపై చేయి చేసుకుంటూ మైక్ దగ్గర అలాగే నిలబడి ఉన్న విజయ్‌కి అండగా నిలబడతాడు. మనసుపై ఎన్నో దెబ్బలు తిని ఉన్న విజయ్ నిర్వికారంగా ఆ శరీరపు బాధను అనుభవిస్తూ ఉంటాడు. గురుదత్ లోని సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైఖరిని చూపించే సీన్‌గా ఇది నాకు అనిపిస్తుంది.

విజయ్‌ని తీసుకుని పక్కనే ఉన్న గదిలోకి అతన్ని చేర్చి తలుపులు మూసేస్తాడు సత్తార్. మీనా ఇది గమనిస్తుంది. ఆమె కూడా ఆ గదిలోకి వెళుతుంది.

ప్రపంచ సినిమాలు నాకు నచ్చిన రెండు గొప్ప సీన్లు చెప్పమంటే అవి రెండూ కూడా ప్యాసా సినిమాలోవి అనే చెబుతాను. వీటి కన్నా గొప్పవి నాకు ఇప్పటి దాకా కనిపించలేదు. ఇక ప్రస్తుత సినిమా పోకడ చూసాక కనిపించవనే నిశ్చయానికి వచ్చేసాను. అందులో మొదటిది మీనా, విజయ్ మధ్యన నడిచే ఈ సీన్. రెండవది ఇంతకు ముందు ప్రస్తావించిన గులాబో విజయ్ మధ్యన వచ్చే ప్రేమ సంభాషణ. ఈ సీన్ కొన్ని వందల సార్లు చూసి ఉంటాను ఇంటర్నెట్ పుణ్యమా అని. ప్రతి డైలాగ్ కంఠతా వచ్చు. అబ్రర్ అల్వీ రాసిన ఈ పదాలకు ఆయన పాదాలకు మొక్కాలనిపించిన సందర్భాలు ఎన్నో… ఈ సీన్‌ని ఆ లైబ్రరీలో చిత్రించిన విధానం, జనం వద్ద దెబ్బలు తిని బట్టలు చినిగి అన్నీ కోల్పోయిన విజయ్ తన పేరుని ఉనికిని కూడా వదులుకుని చెప్పే ఈ మాటలు, ఇక్కడ గురుదత్ పలికించిన భావాలు అతని దుఃఖంలో లోతు అర్థం అయిన వారెవ్వరూ మరచిపోలేని అద్భుత ఘట్టం ఇది.

గదిలోకి కోపంగా వచ్చిన మీనా “పిచ్చెక్కిందా నీకు. వెళ్ళి వారిని ఆపు. ఇంకా సమయం ఉంది నువ్వే విజయ్‌వి అని వారికి చెప్పు” అంటుంది.

ఈ షాట్‌లో గుమ్మం దగ్గర నుంచున్న విజయ్ నీడ ముందు కదులుతుంది. ఆ మనిషికి ఇప్పుడా నీడ తప్ప మరేమీ తోడు లేదన్న భావన ఈ సీన్ చూస్తున్న ప్రేక్షకులకు కలుగుతుంది. “వాళ్ళంతా నీ కోసం వచ్చారు. ఎందుకు వాళ్లకు నిజం చెప్పవు” అంటుంది మీనా… “నేనా విజయ్‌ను కాదు. ఆ విజయ్ ఎప్పుడో చనిపోయాడు” అంటాడు విజయ్. “చనిపోయాడా.. ఏం అంటున్నావు నువ్వు స్పృహలోకి రా విజయ్. నీ అన్నలు, షేక్ జీ, నీ స్నేహితుడు అందరూ నువ్వే విజయ్‌వి అని ఒప్పుకుంటున్నారు.” అంటుంది మీనా.

విజయ్ – స్నేహితులు? వీళ్ళు నా స్నేహితులు కారు. డబ్బుకి స్నేహితులు. ఒకప్పుడు నన్ను గుర్తు పట్టడానికి నిరాకరించారు. కాని ఇప్పుడు……..?

మీనా – ఆ ఇద్దరు ముగ్గురిపై పగ తీర్చుకోవాలని నీకే నువ్వు శత్రువుగా మారకు విజయ్. డబ్బు కీర్తిని ఎందుకు ఇలా వదులుకుంటున్నావు? వదులుకోవాలంటే షేక్ జీ, ఆ స్నేహితుడు, నీ అన్నలను వదులుకో వారిపై నీకు కోపం ఉంటే…

విజయ్ – నాకు వారిపై ఏం కోపం లేదు. నాకు ఏ మనిషి పైనా కోపం లేదు. నాకు కోపం ఉంది సమాజంలోని ఈ పద్ధతులపైన.. మనిషి లోని మానవత్వాన్ని దోచే ఈ సమాజం పైన, అవసరం కోసం సోదరులను పరాయివాళ్ళుగా, స్నేహితులను శత్రువులుగా మార్చే ఈ సిస్టం పైన. నా కోపం చనిపోయిన వారిని పూజించి, బ్రతికి ఉన్న వారిని కాళ్ళక్రింద నలిపివేసే ఆ సంస్కృతి పైన. మరొకరి దుఃఖానికి కరిగి కంట నీరు చిందించడం చేతగానితనం అనుకునే వీరి ఆలోచన పైన, తలవంచి వ్యక్తులను కలుసుకోవడం గౌరవం కాదని, వారి బలహీనత అనుకునే వారి అహంకారం పైన, ఇలాంటి వాతావరణంలో నాకెప్పుడూ శాంతి లభించదు మీనా… ఎప్పుడు శాంతి లభించదు. అందుకనే నేను వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ….” అంటూ నడుచుకుంటూ ఆ గది నుండి బైటకి వెళ్ళిపోతాడు విజయ్. మీనా ఒంటరిగా తల వంచుకుని ఆ సమాజంలోని వ్యక్తులకు ప్రతిబింబంగా మిగిలిపోతుంది. తిరిగి వెళ్ళిపోతున్న విజయ్ వైపు ఎగురుతూ వస్తున్న కాగితాలు కనిపిస్తాయి. తన నీడతో పాటు ఒంటరిగా మిగిలిపోయే మీనా విజయ్ వైపు చూస్తు ఉండిపోతుంది. విజయ్ గదిలో నుండీ బైటకి వెళ్ళిపోయాక మీనా ముందున్న నీడ కూడా మాయమై పోయి ఆమె నుంచున్న స్థానంలోనే చీకట్లోకి వెళ్ళిపోయి తానే ఓ నీడగా మిగిలిపోతుంది. ఈ సమాజంలో మిగిలిపోతున్న ఎన్నో నీడలుగా.. కాలగర్భంలో కలిసిపోయే అనామకులలో ఒకరిగా… చివరికి ఈ సమాజం తనలోకి కలుపుకున్న వారికి కూడా ఇచ్చే సౌఖ్యం ఏముందని????

గురుదత్ ఈ సినిమాను ఇక్కడితో ముగించాలనుకున్నారట. కాని డిస్ట్రిబ్యూటర్లను ఈ ముగింపు నచ్చలేదు. అప్పట్లో సుఖాంతాలను కోరుకునే జనానికి ఈ ముగింపు అర్థం లేనిదిగా ఉంటుందని వాదించారు చాలా మంది. విజయ్ వ్యక్తిత్వం చెడకుండా, సమాజాన్ని త్యజించే ముగింపు మారకుండా ఉండడానికి అప్పుడు గురుదత్ అబ్రర్ అల్వీ కలిసి ఆలోచించి సినిమా ఆఖరున మరో సీన్ జోడించి ముగించారు.

విజయ్ మీనాను ఒంటరిగా వదిలేసినప్పుడు వీచిన గాలి ఇప్పుడు గులాబో ఇంటి తలుపులను తోస్తూ వీస్తూ ఉంటుంది. ఆ తలుపు వెనకాల హాలులో గాయపడిన గులాబో మంచంపై పడుకుని ఉంటుంది. ఆమె పక్కన కుర్చీలో జుహీ కూర్చుని ఉంటుంది. ఎవరో పిలిచినట్లు అనిపించి కళ్ళు తెరుస్తుంది గులాబో. జుహీ.. నన్నెవరో పిలిచారు అంటుంది. ఎవరూ లేరు నిద్రపో అని కిటికీలు మూయడానికి లేస్తుంది జుహీ. గులాబో మంచంపై నుండి దిగుతుంది. వద్దన్న జుహీ మాటలను పట్టించుకోకుండా నన్నెవరో పిలుస్తున్నారు అంటూ బైటకు వస్తుంది. మెట్లు దిగి క్రిందకు వస్తున్న ఆమెకు తలుపు దగ్గరకు వచ్చి నిల్చున్న విజయ్ కనిపిస్తాడు.

(గులాబ్ ఇంటి ముందు విజయ్)

నీళ్ళు నిండిన కళ్ళతో అతని దగ్గరకు పరుగున వచ్చిన అతన్ని అల్లుకుపోయిన గులాబోతో విజయ్ “నేను దూరంగా వెళ్ళిపోతున్నాను గులాబ్” అంటాడు. కన్నీళ్ళతో “ఎక్కడికి” అని అడుగుతుంది గులాబ్. “మరో చోటు వెతుక్కుంటూ వెళ్ళవల్సిన అవసరం రాని చోటుకి” అని జవాబిస్తాడు విజయ్. “ఇది చెప్పడానికే వచ్చారా” అని అడిగిన గులాబ్ కళ్ళలోకి చూస్తూ “నువ్వూ వస్తావా” అని అడుగుతాడు విజయ్. విజయ్‌ని ప్రేమతో చూస్తూ అతని హృదయంపై తల వాల్చి అతనితో చేయి కలిపి వెనుతిరిగుతుంది గులాబో. తమకే తిలియని చోటుకు ఈ ప్రపంచాన్ని వదిలి వెళుతున్న వారిద్దరి వీపులను చూపిస్తూ సినిమా ముగుస్తుంది.

(ప్యాసా సినిమాలోని ఆఖరి సీన్)

ప్రపంచాన్ని త్యజించే మనిషి మనసులోకి తొంగి చూడమని చెప్పే ఈ సినిమా భారతీయ సినిమాలో నిస్సందేహంగా ఓ ‘ఆణిముత్యం’. గురుదత్ వ్యక్తిత్వానికి అతి దగ్గరగా ఉన్న సినిమా కూడా ఇదే… అందుకే ఈ సినిమాను ప్రపంచ సినీ విశ్లేషకులు ఆదరించారు. సమాజంలో మానవ స్వార్థం మనిషిలోని సున్నితత్వాన్ని మానవత్వాన్ని హత్య చేయడం వెనుక ఉన్న భావ దారిద్ర్యాన్ని, మనిషిని ప్రేమించలేని గుణాన్ని, అన్ని బంధాలలో స్వలాభాన్నే మాత్రమే చూసే మనిషి నీచత్వాన్ని పొయెటిక్‌గా ప్రెజెంట్ చేసిన “ప్యాసా’ని అర్థం చేసుకోవడం అంటే వెన్నెలలోని ఎడారిని అర్థం చేసుకోవడం, అందంలోని విషాదాన్ని, తీపిలోని చేదుని విడదీసి చూడగలగడం. ‘ప్యాసా’ సినిమాను చూడడమే ఒక గొప్ప అనుభవం.

Exit mobile version