[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ప్యాసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
ప్యాసా – మల్లెపువ్వు
[dropcap]గు[/dropcap]రుదత్ 1957లో తీసిన ‘ప్యాసా’ సినిమా చాలా పెద్ద హిట్‌గా నిలిచిన తరువాత కూడా మన దేశంలో సినీ మేధావులను అంతగా కదిలించలేకపోయింది. ‘ప్యాసా’ రిలీజ్ సమయం నుండి గమనిస్తే ఈ సినిమాకు చాలా స్లోగా పేరు వచ్చింది. ఇప్పుడు ప్రపంచ సినిమాలో ఈ సినిమాకు ఒక స్థానం ఉంది కాని అప్పట్లో ఇది బావుంది అని మెచ్చుకున్నవారు కూడా ‘ప్యాసా’కు, దాని ద్వారా గురుదత్‌కు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని ఊహించను కూడా లేదు. కాని తెలుగులో కొందరికి ఈ సినిమా కథ బాగా నచ్చింది. గురుదత్ మరణించిన చాలా సంవత్సరాలకు అంటే 1978లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను తీసిన వీ.మధుసూదనరావుగారు ఈ సినిమాకు దర్శకులు. అప్పట్లో చాలా రీమేక్ చిత్రాలను తెలుగులో తీసి హిట్ చిత్రాలు ఇచ్చిన దర్శకులు ఆయన. ‘మల్లెపూవు’ సినిమాకు ముందు వీ.మధుసూదనరావుగారు చేసిన రీమేక్ చిత్రాలను గమనించండి.
తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చినా ఒరిజినల్ ‘ప్యాసా’కు దగ్గరగా కూడా రాలేదు ఈ ‘మల్లెపూవు’. కొన్ని కళాఖండాలను ముట్టుకోకూడదు. ‘ప్యాసా’ చూసినప్పుడు ఒకోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాను మళ్ళీ గురుదత్తే తీయాలని ప్రయత్నించినా బహుశా అంత అద్భుతంగా తీయలేరేమో. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల దగ్గరకు మధుసూదనరావుగారు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా, ‘ప్యాసా’ లోని ఇంటెన్సిటీ ఈ సినిమాకు రాలేదు. రొటీన్‌గా డబ్బింగ్ కథలను తెలుగులోకి తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది తప్ప ‘ప్యాసా’ సినిమా ఆత్మ ఈ సినిమాలో కనిపించదు.
గురుదత్ సినిమాలలో స్టార్లు కనిపించరు. ఇమేజ్ చట్రంలో బిగుసుకుని ఉండిపోయే నటులతో అయన సినిమాలు తీయాలని ఇష్టపడకపోవడం కారణంగానే కొన్నిసార్లు తానే సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ‘ప్యాసా’ సినిమాలోని విజయ్ పాత్రలో గురుదత్ అంతగా ఒదిగిపోవడానికి కారణం ఆయనకు నటుడిగా ఓ ఇమేజ్ అనే చట్రం ఏర్పడలేదు. కాని తెలుగులో శోభన్ బాబు సంగతి అలా కాదు. ఆంధ్రా అందగాడిగా మిగిలిపోవడానికే ఇష్టపడిన శోభన్ బాబు ఆయన్ని అలా మాత్రమే చూడగల ప్రేక్షకుల కోసం విజయ్ పాత్రలో కూడా గ్లామర్ చొప్పించే ప్రయత్నం ‘మల్లెపూవు’లో జరిగింది. గురుదత్ కళ్లల్లో ఆ ఓటమి, బాధ శోభన్ బాబు అస్సలు పలికించలేకపోయారు. అందుకే ‘ప్యాసా’ సినిమా అంతా క్లోజ్ అప్ షాట్లలో నడిస్తే ‘మల్లెపూవు’లో శోభన్ బాబుతో మొత్తం లాంగ్ షాట్లలో కథ నడుస్తుంది. గురుదత్ తన శరీరంతో పలికించే ఓటమి, నిస్సహాయత శోభన్ బాబు నటనలో మచ్చుకయినా కనిపించవు.
సినిమాలో చాలా సీన్లను మక్కీ టు మక్కీ కాపీ చేసినా ‘ప్యాసా’ స్థాయిలో ఈ సినిమా రాకపోవడానికి కారణం గురుదత్ పాత్రలో శోభన్ బాబు ఇమడకపోవడం, అలాగే సాహిర్ లుధియాన్వీ కవిత్వానికి ధీటుగా ఈ సినిమాలో సాహిత్యం లేకపోవడం. ఆత్రేయ, ఆరుద్ర, వేటూరిలు గొప్ప కవులే. కాని కొన్ని భావాలు కొన్ని పద ప్రయోగాలు ఉర్దూ భాషలో ఉన్నట్లు మరే భాషలో ఉండవు. అందులో సాహిర్ పదాల ఎన్నిక ఓ అద్భుతం. అతని స్థాయిని ఈ సినిమాలో ఏ కవీ అందుకోలేకపోయారు. కొంత వరకు సాహిర్ పదాల పదును శ్రీశ్రీ గారిలో కనిపిస్తుంది. కాని కారణం ఏమయినా ఇందులో శ్రీశ్రీ గారు ఏ పాటనూ రాయలేదు. ‘ప్యాసా’లో సీన్ల పరంగా రాసిన విధంగా పాట రాయాలనే ప్రయత్నం కనిపించింది తప్ప ఆ పాటలలో సాహిర్ పదును లేదు. సాహిర్ లుధియాన్వీ రాసుకున్న కవితల ఆధారంగా గురుదత్ ఈ సినిమాలో కొన్ని సీన్లను నిర్మించుకున్నారు. కాని ఇక్కడ సాహిర్ పాటను కాపీ చేసే విధంగా పాటలు రాయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా సాహిర్ పాటలకు జీవం ఇచ్చింది గురుదత్, ఆ పాటలను స్క్రీన్ పై చిత్రించిన విధానం, ఈ సినిమాలో దర్శకులు అదే విధానాన్ని కాపీ చేసారు కాని గురుదత్ కళ్ళతో దృశ్యాలను బంధించలేకపోయారు. ‘ప్యాసా’ సినిమా చూడకపోతే ‘మల్లెపూవు’ సినిమా తెలుగువారికి నచ్చుతుంది. కాని ‘ప్యాసా’ చూసినవారు ‘మల్లెపూవు’ని ఇష్టపడలేరు. పాత్రల మనసులో భావాలను, వారి జీవన సంఘర్షణను వీ.కే. మూర్తి కెమెరా పట్టుకున్నంత గొప్పగా ఈ సినిమాలో ఫోటోగ్రఫీ లేకపోవడం మరో లోటు. అంటే ఒక ఒరిజినల్ పెయింటింగ్‌ని కాపీ చేసి ఆ ఒరిజినల్ లోని ఆత్మను చూపలేకపోవడం ‘మల్లెపూవు’లో స్పష్టంగా కనిపించే లోపం. ఉదాహరణకు మొదటి షాట్నే తీసుకోండి. బెంచిపై పడుకున్న గురుదత్ మొఖంపై ఫోకస్ అయిన కెమెరా తరువాత భ్రమరంపై ఎవరిదో కాలు పడిన తరువాత కోపంగా నడిచి వెళ్ళిపోయే గురుదత్. ఈ సీన్లో చూపిన వెలుగు నీడలు ఎన్నో భావాలను పలికిస్తాయి. ఈ సీన్ తెలుగులో చాలా పేలవంగా వచ్చింది. అన్నీ లాంగ్ షాట్లే… ఆ ఒరిజినల్ సీన్లోని ఆ భావావేశం కెమెరా ప్రతిఫలించిన విధానం ఒక్కటి గమనిస్తే ‘మల్లెపూవు’ ఎంత పేలవంగా ఉందో అర్థం అవుతుంది.
‘ప్యాసా’ సినిమాలో పాత్రలను గురుదత్ చాలా జాగ్రత్తగా మలచారు. ‘మల్లెపూవు’లో పెద్ద లోపం ఆ పాత్రల స్వభావాలలో మార్పు తీసుకు వచ్చే ప్రయత్నం జరగడం. మొదట జయసుధ గారి పాత్రను తీసుకుందాం. హిందీలో మాలా సిన్హా పోషించిన మీనా పాత్ర ఇది. తెలుగులో ఈమె పేరు లలిత. వేణుని వదిలి మరొకరిని వివాహం చేసుకుని ఆమె వెళ్ళిపోవడం వెనుక ఆమె పేదరికం, అసహాయత కారణం అని చెప్పే ప్రయత్నం తెలుగులో జరిగింది. ఇది ప్రేమను అమ్ముకున్న స్త్రీగా కాక ఆమెను ఓ అసహాయురాలిగా చూపాలని చేసిన ఓ ప్రయత్నం. మీనా పాత్రలో స్త్రీలలో సహజంగా ఉండే ఆ కాన్ఫ్లిక్ట్‌ను చూపించడానికి గురుదత్ చాలా కష్టపడ్డారు. ప్రేమలో అతను దెబ్బతినడానికి, అతని మనసు గాయపడడానికి కారణం మీనా ప్రవర్తన. ఇది ‘ప్యాసా’లో చాలా బాగా చూపించారు. కాని తెలుగులో లలిత పాత్ర పట్ల ప్రజలలో సానుభూతి సంపాదించాలని ప్రయత్నించారు దర్శకులు. మరి అలాంటప్పుడు ప్రేమలో వేణు మోసపోయిందేముందని? మీనా పాత్రలో స్త్రీ మనసులోని ఎన్నో షేడ్స్‌ని ఆ ద్వైధీభావనను, ప్రేమ, ప్రపంచం లోని ఐహిక సుఖాల మధ్య ఏది కోరుకోవాలో నిర్ణయించుకోలేని ఆ ద్వంద్వ మనస్తత్వాన్ని ‘మల్లెపూవు’ సినిమా విస్మరించింది. ఇది ఒరిజినల్ సినిమాలోని లోతును పట్టుకోలేకపోవడం. లలిత పాత్రకు సానుభూతిని చేకూర్చడం వలన వేణు పాత్రలోని గంభీరత తగ్గిపోయింది. ఇక శోభన్ బాబుకి జయసుధకు మధ్య నడిచే రెండు డ్యూయెట్లు కూడా సినిమాను మాస్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి జరిగిన ప్రయత్నాలు. గురుదత్ పాటల చిత్రీకరణను గమనిస్తే ఈ తెలుగు పాటలు సినిమాలోని ఒక పర్ఫెక్షనిజాన్ని దెబ్బతీసాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. గురుదత్ సృష్టించిన విజయ్ ‘చక చక సాగే చక్కని బుల్లెమ్మ’ అని తెలుగులో పాడడం బాధిస్తుంది. ‘ప్యాసా’లో విజయ్ హోటల్‌లో అన్నం తింటున్నప్పుడు సత్తు రూపాయి సీన్ గమనించండి. తెలుగులో తీసిన అదే సీన్ చూడండి శోభన్ బాబు ఈ పాత్రకు అస్సలు సరిపోలేదని అంటారు. ఈ సీన్ కూడా తెలుగులో మొత్తం లాంగ్ షాట్‌లో ఉంటుంది. క్లోజ్ అప్‌లలో గురుదత్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు తెలుగులో స్టార్ హీరోలతో రాబట్టుకోవడం చాలా కష్టం.
మాలిష్ సత్తార్ పాత్రకి తెలుగులో రాందాస్‌గా రావుగోపాలరావుగారు అస్సలు సూట్ కాలేదు. ఆ పాత్రకు పెద్దవారిగా కనిపిస్తారు. వారిపై చిత్రించిన పాట ఒరిజినల్ హిందీ పాటకు దగ్గరగా కూడా రాలేకపోయింది. కనకం, రాందాసుల మధ్య ఒరిజినల్‌లో లేని కొన్నికామెడీ సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. అలాగే కనకానికి విటుడిని తీసుకు వచ్చి అతన్ని మోసం చేసి అతని వద్ద డబ్బు లాగడంలో రాందాసు సహాయం చేయడం అతనికి కనకంపై ఉన్న ప్రేమ పట్ల కొన్ని అనుమానాలను కలిగిస్తుంది కూడా. ఈ సీన్ ఒరిజినల్ ‘ప్యాసా’లో లేదు. ఈ సీన్ వలన రాందాస్ పాత్రలోని నిజాయితీ పట్ల నమ్మకం కలగదు. సత్తార్ పాత్రతో ఇటువంటి పొరపాటు గురుదత్ చేయలేదు.
ఇక పుష్పలత పాత్రను గురుదత్ మలచిన విధానం తెలుగులో తీస్తున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేదని స్పష్టం అవుతుంది. ‘నా బట్టలు అవతారం చూడు’ అంటూ కాలేజీ ఆడిటోరియంలో బైట ఆగిపోయిన వేణుని ‘మరేం పర్లేదు రా’ అని లోపలికి తీసుకెళుతుంది ఆ లావాటి పుష్పలత. ఏదీ పెద్దగా పట్టించుకోని మనస్తత్వం ఆమెదని ఈ సీన్ చెబుతుంది. ఇదే సీన్ హిందీలో టున్ టున్ పాత్ర చేసున్నప్పుడు విజయ్ మాటకు ‘పైనుండి క్రింది దాకా శరీరాన్ని కప్పే ఉన్నాయిగా బట్టలు’ అంటూ ఆమెలో అంతర్లీనంగా ఉన్న ఆ సోషలిస్టిక్ ఫిలాసఫీని వ్యక్తపరుస్తుంది, ఇలాంటి చాలా చిన్న విషయాలు ‘ప్యాసా’లో ఫోకస్డ్‌గా కనిపిస్తాయి. కాని ‘మల్లెపూవు’ ఆ చిన్న చిన్న విషయాల ద్వారా ఆ పాత్రల ఔన్నత్యాన్ని పట్టుకోలేకపోయింది. స్టేజిపై కవిత్వాన్ని వినిపిస్తున్న విజయ్ ఆ విషాద కవిత మాకు వద్దు అని ప్రేక్షకులు అన్నప్పుడు ‘నా జీవితం నాకేమిచ్చిందో అదే మీకివ్వగలను’ అని తన కవిత్వంలో బదులిస్తాడు ‘ప్యాసా’ లో. కాని తెలుగులో పాట కావాలి అని గోల చేసే జనానికి తన ప్రేమ కథను పాటలా వినిపిస్తాడు వేణు. ప్రేక్షకుల కోరిక మేర తన కవితా పఠనాన్ని మార్చుకునే వ్యక్తిత్వం విజయ్‌ది కాదు. కాని వేణులో ఆ గుణం కనిపిస్తుంది. ఈ సందర్భంలో వచ్చే ‘మరుమల్లియ కన్నా తెల్లనిది’ అన్న పాట చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమయిన గీతం ఇది కాని ‘ప్యాసా’లో ఈ సందర్బంలో వచ్చే ‘తంగ్ ఆ చుకే హై’ అన్న కవితతో ఈ పాటను పోల్చలేం. ముఖ్యంగా ఈ సన్నివేశంలో హిందిలో గురుదత్ చూపిన కెమెరా మూమెంట్స్‌ని చూసాక, తెలుగులో ఇదే పాట ఇదే సాహిత్యం, గురుదత్ చేతిలో పడితే అద్భుతం జరిగేదేమో అనిపిస్తుంది. నిజంగా ఆరుద్ర గారు రాసిన చక్కని పాట ఇది. కాని ‘ప్యాసా’ స్థాయి చిత్రీకరణ, ఆ ఇంటెన్సిటీ లేక అతి పేలవంగా చిత్రీకరించబడింది.
చేయి జారిన మణిపూస చెలియ నీవు, తిరిగి కంటికి కనపడితీవు గాని చూపు చూపున తొలినాటి శొకవన్నె రేపౌచున్నావు ఎంతటి శాపమీది….. ఈ కవిత తరువాత ప్రేక్షకులు పాట కావాలని గోల చేసినప్పుడు వేణు ఈ పాట వినిపిస్తాడు…..
ఓ ప్రియా.. ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని,అది విషమని చివరకు తెలిసినదీ
సఖియా..
నీవెంతటి వంచన చేసావు, సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం II మరు II
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు, విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే II మరు II
ఆరుద్ర గారు రాసిన ఈ పాట వినడంలో తెలుగు శ్రోతలకు కలిగే ఆనందం. ‘ప్యాసా’ సినిమాను హిందీలో చూసిన వారికి స్క్రీన్‌పై ఈ పాటను ప్రేక్షకులుగా చూస్తుంటే కలగదు.
ఇక ‘ప్యాసా’లో అతి గొప్ప సీన్‌గా మనం చెప్పుకున్న లిప్ట్ సీన్ తెలుగులో చాలా నిరాశపరుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ‘లలితా… నా ప్రేమ కవితా’ అనే పాటను కశ్మీర్‌లో షూట్ చేసారట. అంతటి అందమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ పాట, స్టూడియోలో ఇదే సందర్భంలో హిందీలో వచ్చే ‘హమ్ ఆప్కీ ఆంఖో మే’ అన్న పాట చిత్రీకరణను గమనించండి. గురుదత్ పాటల ద్వారా సంభాషించే తీరుని పరిశీలించండి.
గురుదత్ దర్శకత్వ ప్రతిభను, ఒక కథను చెప్పే విధానాన్ని తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంత విపులంగా తెలుగులో ఇదే కథతో వచ్చిన హిట్ రీమేక్ ‘మల్లెపూవు’తో ‘ప్యాసా’ను పోల్చవలసి వస్తుంది. హిందీలో వచ్చే ఈ సీన్‌లో మీనా వ్యక్తిత్వం, తెలుగులో లలిత వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉన్నాయని ఈ లిఫ్ట్‌లో సంభాషణ చెబుతుంది. పరిస్థితులకు తల ఒగ్గి జీవిస్తున్న అసహాయురాలిగా సానుభూతి సంపాదిస్తుంది లలిత. తన సుఖానికి పెద్ద పీట వేసే సొసైటీ స్త్రీ గా ఈ లిఫ్ట్ సీన్లో మీనా పరిచయమవుతుంది. లలిత పాత్ర వేణు లోని దుఖానికి ఆక్రోశానికి కారణం అవునా కాదా అన్న అస్పష్టతలోకి వెళ్ళిపోతారు ప్రేక్షకులు. “నేను పైకి వెళ్ళాలి” అని మీనా పలికే అతి చిన్న డైలాగ్ దగ్గర హిందీలో గురుదత్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ అంతకు ముందు వచ్చే “హమ్ ఆప్ ఈ ఆంహో మే” అనే పాటలో మెట్ల పైకి వెళ్ళి పోయిన మీనా పాత్రకు ఒక అతి పెద్ద జస్టిఫికేషన్. తెలుగులో ఈ సీన్ కేవలం ఇద్దరి దారులు వేరయ్యాయి అన్న సూచనను మాత్రమే ఇస్తుంది. తరువాత ఆఫీసులో లలిత వేణుల మధ్య జరిగే సంభాషణలలో “ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. అది శరీరంతో కలిసి కాలిపోవలసిందే తప్ప మధ్యలో మాసిపోదు వేణు” లాంటీ సినిమాటిక్ డైలాగులు పెట్టి వ్యాపారంలో దివాళా తీసి పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి, పెళ్ళి కావల్సిన అవిటి చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముళ్ళ పట్ల బాధ్యత కోసం ప్రేమను బలి చేసుకున్న అసహాయురాలిగా లలితను చూపిస్తారు దర్శకులు. గురుదత్ ‘ప్యాసా’ లో ప్రతి ఒక్కరు కూడా విజయ్‌తో సంబంధం కలుపుకోవడంలో తమకు వచ్చే లాభం గురించే ఆలోచిస్తారు. అందులో మీనా కూడా ఒకరు. కాని తెలుగులో లలిత పాత్ర పట్ల చాలా సానుభూతి సృష్టిస్తారు దర్శకులు. ఇదే సీన్ ‘ప్యాసా’లో గొప్ప మానసిక పరిశీలనతో రాసారు అబ్రర్ అల్వీ. కాని తెలుగులో ఇది ఫక్తు ఫార్ములా సీన్‌లా మారింది. “ఈ సమాజంలో స్త్రీకి పెళ్ళి చేసుకోవడానికి పిల్లలను కనడానికి ఉన్న స్వేచ్ఛ ప్రేమించడానికి లేదు” అనే ఒక అర్థం లేని డైలాగ్‌తో ఈ సీన్ నడుస్తుంది. మళ్ళీ జన్మలో నీకు నా ముఖం చూపించను అని తానే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతాడు తెలుగులో వేణు. హిందీలో ఘోష్ అతన్ని ఉద్యోగం నుండి తీసేసి తన ఆధిపత్యం ప్రదర్శిస్తాడు. లలిత పాత్రకు ఆపాదించిన ఈ వ్యక్తిగత సానుభూతి కథలోని గాంభీర్యాన్ని ఇబ్బంది పెడుతుంది.
లలిత భర్త ప్రసాద్ ఇంట్లో కవి సమ్మేళనంలో ఆరుద్ర, వేటూరి గార్లు కనిపిస్తారు. ఈ సందర్భంలో వచ్చే పాట వేటూరు గారు అద్భుతంగా రాసిన గీతం. హిందీ సినిమా ‘ప్యాసా’కు అతి దగ్గరగా ఉన్న భావంతో వచ్చిన గొప్ప పాట ఇది.
మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం
ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం
ఎవరికి తెలుసు..చితికిన మనసు..చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ..ఊ..
మనసుకు మనసే కరువైతే..మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదని..ఈ జగతికి హృదయం లేదని.. నా జన్మకు ఉదయం లేనే లేదనీ ఆ..ఆ..
ఎవరికి తెలుసు.. II ఎవరికి II
గుండెలు పగిలే ఆవేదనలో..శృతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో..నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదని..నా ప్రేమకు మరణం లేదని.. నా తోటకు మల్లిక లేనే లేదనీ ఆ..ఆ..
ఎవరికి తెలుసు.. II ఎవరికి II
ఈ పాటకు సాహిత్యం, సంగీతం, సినిమాలో సందర్భం చాలా బాగా కుదిరాయి. కాని ఇదే సందర్భంలో ‘జానే వో కైసే’ అని వచ్చే ‘ప్యాసా’ సినిమా పాట చిత్రీకరణను గమనించండి.ప్రతి వాక్యం దగ్గర ప్రతి పదం దగ్గర గురుదత్ ముఖంపై క్లోజ్ అప్ షాట్లలో ఉన్న కెమెరా పనితనం చూడండి. పుస్తకాల షెల్ప్ దగ్గర క్రీస్తు శిలువ వేసి ఉన్నట్లు నిలబడి ఉండగా మొదలయ్యే ఈ షాట్‌లో కెమెరా ప్రేక్షకులతో ఎలా సంభాషిస్తుందో గమనించండి. అలాగే ఆ సీన్‌లో గురుదత్ చిన్నగా గదిలో నడుస్తూ ఆ పాటలోని ఇంటెన్సిటీని ఎలా స్క్రీన్ పై చూపిస్తారో గమనించండి. శోభన్ బాబు గారు ఆ స్థాయిలో నటించలేరని తెలుసు కాబట్టీ ఈ పాటలో మూడ్ చెడకుండా ఉంచాలని ఆయన్ని దర్శకులు ఒకే స్థానంలో స్థిరంగా నిలబెట్టి ఆ పాటలో మూమెంట్ కోసం ప్రసాద్ పాత్ర వేసిన శ్రీధర్‌ని ఆ గదిలో నడిపిస్తారు. హిందీ లో మిస్టర్ ఘోష్‌గా రెహ్మాన్ కదలకుండా ఒక చోట స్థిరంగా కూర్చుని ఉంటే విజయ్‌గా పాట పాడుతూ గురుదత్ గదిలో నడుస్తూ ఉంటారు. కాని తెలుగులో శ్రీధర్‌ని ఒక చరణంలో గదిలో నడిపిస్తూ ఒకే చోట స్థిరంగా పాట పాడుతూ శోభన్ బాబుని నిలబెట్టారు దర్శకులు. క్లోజ్ అప్ షాట్లన్నీ జయసుధ, శ్రీధర్ పైనే చూస్తాం. ఒక్క సీన్‌లో కూడా శోభన్ బాబు కళ్ళ పై ఫోకస్ ఉండదు. కాని ఈ పాట మొత్తం నటుల కళ్ళ మీధ ఫోకస్‌తో హిందీలో నడుస్తుంది.
గురుదత్ దర్శకత్వ ప్రతిభ వారి పాటల చిత్రీకరణలో కనిపిస్తుంది అని వారి పాటలు కథకు కొనసాగింపుగా ఉంటాయని ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. మధుసూదనరావుగారిదీ ఒక ప్రత్యేక స్టైల్ కావచ్చు. కాని సినిమాగా ఒకే కథను ఇద్దరు దర్శకులు తీసుకున్నప్పుడు వాటిని పోలుస్తున్న సమయంలో ఆ ఇద్దరి శైలిలో ఎవరి శైలి కథకు బలం చేకూర్చిందో తెలుసుకోవడమే సినీ మేకింగ్‌ను స్టడీ చేయడం. గురుదత్ సినిమా కథలు గొప్పగా ఉండక పోవచ్చు. ఆ టేకింగ్లో, ఎమోషన్లను స్క్రీన్‌పై చూపే విధానంలో మాత్రం చాలా గొప్పతనం ఉంటుంది. మనసు లోతుల్లోంచి భావాలను స్క్రీన్‌పై చూపడంలో ఆయన తరువాతే మరెవ్వరయినా. అలాగే ఈ సన్నివేశంలో హిందీలో పాట ఆఖరున సీన్ గమనించండి. ఆ హాలులో పాట విన్న ప్రేక్షకులలో ఒక్కరు మాత్రమే చప్పట్లు కొట్టబోయి అందరూ మౌనంగా ఉండడం చూసి ఆగిపోతాడు. ఆ కవిత్వాన్ని విన్న వారంతా తమ తమ పనుల్లో మాటల్లో మునిగిపోతారు. ఒక కవికి ధనిక రసికుల మధ్య జరిగే అవమానం అది. ఈ సీన్‌లో సమాజం సాహిత్యానికిచ్చే విలువను గురుదత్ అత్యద్భుతంగా చూపిస్తారు. కాని తెలుగులో ప్రసాద్ “మా యింట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయి” అంటూ వేణుని అవమానిస్తాడు. ‘ప్యాసా’ సినిమాలో సమాజం కవిని చేసే నిర్లక్ష్యం కనిపిస్తే తెలుగులో ఆ నిర్లక్ష్యం వ్యక్తిగతంలా కనిపిస్తుంది. గదిలో అందరూ వేణు కవిత్వాన్ని మెచ్చుకుంటూ ప్రసాద్ ఒక్కడే అక్కసుతో మాట్లాడడం తెలుగులో చూస్తాం. ‘ప్యాసా’ సినిమాలో కవికి జరిగిన ద్రోహం వ్యక్తిగతం కాదు. అది సామాజికం. అందుకే చివర్లో “నాకీ సిస్టం పైనే కోపం వ్యక్తుల మీద కాదు” అంటూ విజయ్ ‘ప్యాసా’లో అందరినీ వదిలి వెళ్ళిపోతాడు. ఈ తేడా చిన్నదే కావచ్చు కాని చివర్లో వేణు సమాజాన్ని త్యజించడం వెనుక ఉన్న బాధను జస్టిపై చేయదు తెలుగులో వచ్చిన ‘మల్లెపూవు’.
హిందీ మూలం ‘ప్యాసా’కు తెలుగులో ‘మల్లెపూవు’ని పోలుస్తున్నప్పుడు తెలుగులో ఊరట కలిగించే ఒక్క అంశమన్నా లేదని కూడా అనలేం. ఈ సినిమాకు ప్రాణం పోసిన వ్యక్తులుగా ముగ్గురు ఆర్టిస్టులను ప్రశంసించాలి. హిందీ ఒరిజినల్‌లో చేసిన నటుల కన్నా, కొన్ని సార్లు వీరు గొప్పగా నటించారు అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయి ఉండవచ్చు. కాని ఒరిజినల్ ‘ప్యాసా’ స్థాయికి దగ్గరగా రాదు. అయినా ఇందులో గొప్పగా నటించిన ఆ నటులు ముగ్గురిని తప్పకుండా గుర్తించాలి. అందులో ఒకరు మల్లిక పాత్ర వేసిన లక్ష్మి, వేణు తల్లి పాత్ర వేసిన నిర్మలమ్మ, ప్రసాద్ పాత్రలో శ్రీధర్.
‘ప్యాసా’లో ఈ తల్లి పాత్రను లీలా మిశ్రా వేసారు. ఆమె చాలా బాగా చేసారు. కాని నిర్మలమ్మ ఆమెను మించిపోయే నటనను ప్రదర్శించారు. కొడుకు మీద ప్రేమ, నిస్సహాయత, ఒక సందర్భంలో ఉద్యోగం వచ్చిందని వేణు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు పెద్ద కొడుకుల స్వార్థాన్ని ప్రశ్నించడం (ఈ సీన్ ‘ప్యాసా’లో లేదు) మొత్తానికి తల్లి లోని వేదనను తన గొంతులోని జీరతో, డైలాగ్ పలికే విధానంతో ఎక్స్‌ప్రెషన్ లలో చాలా సహజంగా చేసారు నిర్మలమ్మ. అలాగే ఘోష్ పాత్ర చేసిన రెహ్మాన్‌కు ధీటుగా అ పాత్రకు సరి అయిన న్యాయం చేసారు శ్రీధర్. రెహ్మాన్ కూడా దర్శకుల నటులు. పాత్రకు తన సహజత్వాన్ని జోడించే ప్రయత్నం చేయరు. వీరికి పర్సనాలిటీ ఆ గొంతు అదనపు ఆకర్షణ. గురుదత్ వీరి ప్లస్ లను గమనించి వాటి పైనే ఫోకస్ చేస్తూ సినిమాను నడిపించారు. కాని శ్రీధర్ కొన్ని సీన్లలో ఆయనపై కెమెరా ఫోకస్ లేకపోయినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు గమనించాలి. ఆ పాత్రకు ఒక ఒరిజినాలిటి తీసుకురాగలిగారు ఆయన. ‘మరు మల్లియ కన్నా తెల్లనిది’ పాటలో గమనించండి. ముందు ఆ పాటను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు ప్రసాద్ పాత్రలో శ్రీధర్. ‘నీవెంతటి ద్రోహం చేసావు సిరి సంపదకమ్ముడు పోయావు’ అని వేణు పాడుతున్నప్పుడు అది విని ముఖంలో కళ కోల్పోయిన భార్యను చూసాక ఆయనలో అనుమానం కలుగుతుంది. తరువాత వేణుని గమనించిన అతనిలో అది కోపంగా మారుతుంది. క్రమంగా అది వేణు పట్ల ద్వేషంగా ప్రకటితమవుతుంది, హిందీలో ఈ ట్రాన్సాక్షన్ ఘోష్ పాత్రలో రెహ్మాన్ ఇంత డీప్‌గా చూపలేదు. కెమెరా మూమెంట్లతో మాత్రమే కథ నడిపించే గురుదత్ అవసరం అయిన మేర మాత్రమే రెహ్మన్‌ని చూపించడం ఇక్కడ జరిగింది. ఈ చిన్న గాప్‌ను అద్భుతంగా పట్టుకున్న శ్రీధర్ తన ఒరిజినాలిటితో ఆ సన్నివేశంలో తన పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రబిబింబించేలా చూస్తారు. అ పాత్రకు ఈ సందర్భంలో హిందీలో జరగని న్యాయం తెలుగులో ప్రసాద్ పాత్ర ద్వారా శ్రీధర్ ఇక్కడ చూపించగలిగారు. స్టార్ ముద్ర లేకపోవడంతో రేస్‌లో వెనుకపడ్డారు కాని తెలుగులో మంచి నటులు ఆయన. హిందీలో కెమెరా గురుదత్‌ని వదిలి రాలేదు. తెలుగులో శోభన్ బాబుపై ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రసాద్ పాత్రను వివరించడానికి ఆర్టిస్ట్‌గా శ్రీధర్ తన వంతు న్యాయం చేసారు. అసలైన ఆర్టిస్టు చేయవలసిన పని అది. దీని వలన సీన్‌లో గాప్ చాలా కవర్ అయింది. కాని వ్యక్తిగతంగా శ్రీధర్ ప్రతిభను గమనించేవారు సినీ దర్శకులలో తక్కువ అవడం వారి కెరీర్ ముందుకు సాగకపోవడానికి ఒక కారణం కావచ్చు.
‘ప్యాసా’లో గులాబో పాత్రను తెలుగులో లక్ష్మి చేసారు. లక్ష్మిని గురుదత్ డైరెక్ట్ చేసి ఉంటే అద్భుతాలు పలికించేవారేమో. ‘మల్లెపూవు’ సినిమాలో కెమెరా తత్తరపాటు లేకుండా ఈ ముగ్గురి నటులపై ఫోకస్ అవడం గమనించవచ్చు. హిందీలో వహిదా రెహమాన్‌కి హీరోయిన్‌గా ‘ప్యాసా’ మొదటి సినిమా. ఆవిడ దర్శకులు మలచిన నటి తప్ప స్వతహాగా గొప్ప ఎమోషన్లను పలికించగల నటి కాదు. హిందీలో ఆమె నటించిన ‘ఖామోషీ’ సినిమాను తెలుగులో సావిత్రి గారు చేసిన ‘చివరకు మిగిలేది’, బెంగాలీలో అదే పాత్ర చేసిన సుచిత్రా సేన్‌తో కలిపి చూడండి. ఆవిడ చాలా లిమిటెడ్ స్పేస్ ఉన్న నటి అనిపించక మానదు. దిలీప్ కుమార్ పక్కన మీనా కుమారీని, నర్గీస్‌ను, వైజయంతీ మాలను చూసి వహిదా రెహ్మాన్‌ను చూస్తే నటనపై ఆమెకున్న పట్టు చాలా తక్కువ అని ఒప్పుకుంటాం. గురుదత్ చేతిలో పడి రాయి వజ్రంగా మారి ఆ కాంతిని నిలుపుకోవడం నేర్చుకుని ముందుకు సాగింది తప్ప ఇతర సినిమాలలో ఆమె నటన స్థాయి పైన చెప్పుకున్న నటీమణుల స్థాయికి దగ్గరగా కూడా రాదు. నిష్పక్షపాతంగా ఈ విషయం చెప్పుకోవడానికి ‘మల్లెపూవు’లో లక్ష్మి నటనను గమనించండి. ఈ సినిమాలో ఆమె గొంతుతో వాచకంతో, శరీర భాషతో పలికించే భావాలు అమోఘంగా ఉంటాయి. ముఖ్యంగా ‘చినమాట ఒక చిన మాట’ అంటూ ఒక వేశ్యగా ఆమె ఎంట్రీలో లక్ష్మిని చూసి తరువాత అమె ఆ పాత్రలో పలికించే వివిధ షేడ్స్‌ను గమనించండి. ఆమెను ఒక గొప్ప నటిగా ఒప్పుకుని తీరతాం.
‘ఆజ్ సజన్ మోహే అంగ్ లగాలో’ పాట తెలుగులో ‘నీవు వస్తావని బృందావని ఆశగా వేచేనయ్యా కృష్ణయ్యా’ అని వాణీ జయరాం గారి గొంతులో వస్తుంది. తెలుగు పాటలలో ఒక మంచి భక్తి పాట ఇది. ఈ పాటలో ఇక్కడ వీ.కే. మూర్తి ఫోటోగ్రఫీ లేదు, గురుదత్ దర్శకత్వం లేదు. లక్ష్మి ఈ పాటలో పలికించే భావాలను గమనించండి, ప్రతి వాక్యం ఆమె మనసులోంచి వస్తున్నట్లు ఆమె చూపే ఆ ఎమోషన్ అత్యద్బుతం. నిజంగా దక్షిణాది సినిమా రంగం గర్వించదగ్గ నటి ఆమె. కొన్ని సీన్లను ఒంటి చేతితో ఈ సినిమాలో నడిపించారు ఆవిడ. ఈ పాత్రకు హిందీలో వహీదా కన్నా తెలుగులో లక్ష్మి న్యాయం చేసారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
డైలాగులను పూర్తి ఎమోషన్‌తో పలకడంలో శోభన్ బాబు గారు కూడా లక్ష్మి గారితో పోటీ పడలేరు. గమనిస్తే గిరిబాబు రూమ్ లో మొదటి సారి మందు తాగుతూ ఓ కవితను చెప్పవలసిన చోట శోభన్ బాబు గారికి చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్పడం చూడవచ్చు. “కలలెన్నో కన్నాను కవితలే రాసాను కలలు కల్లలు కాగా కన్నీరే తాగాను, మధువు మత్తని చెప్పుట మాయ మాట, బాధ మరపించునన్నది పాత పాట, మనసు కలిగిన వారికే మత్తు గానీ, మనసు విరిగిన వారికి మధువు ఏల”….. ఈ పంక్తులు చక్రవర్తి గారి గొంతులో వింటాం. శోభన్ బాబు గారి డైలాగ్ డెలివరీతో ఈ వాక్యాలకు న్యాయం జరగదని డైరెక్టర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి.
సాహిర్ లుధియాన్వీ ‘చక్లే’ కవిత స్థానంలో వచ్చే పాట వేశ్యావాటికల నడుమ చిత్రించే సన్నివేశంలో వేటూరి గారి మాటలలో వస్తుంది. విడిగా ఈ సాహిత్యం కూడా చాలా బావుంటుంది. కాని తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ గీతం దగ్గర కాలేకపోయింది. ఆడియోలో ఈ పాట వింటున్నప్పుడు వేటూరి గారు ఈ పాటకు మంచి న్యాయమే చేసారనిపిస్తుంది కాని స్క్రీన్ పై ఆ విషాదం కనిపించదు.
ఎవ్వరు ఎవ్వరు ఈ నేరాలడేగేవారెవ్వరో, ఈ పాపం కడిగే దిక్కెవరో… ఎవ్వరో వారెవ్వరో
అందెలు సందడి చేసిన జాతరలో… ఆకలేసి ఏడ్చిన పసికందులు.. అందం అంగడికెక్కిన సందులలో అంగలార్చి ఆడిన రాబందులు,…. ఎందుకో ఈ చిందులు… ఎవరికో ఈ విందులు… ఏమిటో… ఏవిటో ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో. … ఏ కర్మం ఈ గాయం చేసిందో…. ఏవిటో.. ఆ ధర్మం ఏమిటో…
ఆ… శీలానికి శిలువలు, కామానికి కొలువులు.. కన్నీటి కలువలు, నీ చెలువలు.. కదులుతున్న ఈ శవాలు. రగులుతున్న శ్మశానాలు, మదం ఎక్కిన మతి తప్పిన నర జాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో…. ఈ గాథలు ముగిసేదింకెన్నడో….. ఎన్నడో మోక్షం ఇంకెప్పుడో..
అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో.. మైల పడిన మల్లెలు ఈ నవ్వులు…. కుక్కలు చింపిన విస్తరి తీరులల్లో ముక్కలయిన బ్రతుకులు ఈ పువ్వులు… ఎందరికో ఈ కౌగిళ్ళు…. ఎన్నళ్ళో ఈ కన్నీళ్ళూ.. ఎక్కడ ఎక్కడ ఏ వేదం ఇది ఘోరం అన్నదో. … ఏ వాదం ఇది నేరం అన్నదో… ఎక్కడో ఆ వేదం ఎక్కడో
ఈ మల్లెల దుకాణాలు, ఈ గానా బజానాలు… వెదజల్లిన కాగితాలు, వెలకట్టిన జీవితాల వల్లకాటి వసంతాలు కడ్తున్నాయి స్వాగతాలు. .. గొంతు తెగిన దాహాలకు తూట్లు పడిన దేహాలు.. ఎక్కడో ఎక్కడో ఈ రాధల బృందావనం ఎక్కడో ఈ బాధలకు వేణు గానం ఎన్నడో ఎన్నడో… ఎక్కడో…. ఎప్పుడో..
వేటూరి గారు రాసిన ఈ సాహిత్యంలో చాలా వేదన దుఃఖం ఉంది. వేశ్యా గృహాల దీన స్థితిని కళ్లకు కట్టినట్టూ చూపించారు కవిగారు. ఈ పాట చిత్రీకరణ కూడా మధుసూదనరావు గారు మిగతా పాటల కన్నా చాలా జాగ్రత్తగా చేసారనిపిస్తుంది. కాని హిందీలో వచ్చే సన్నివేశానికి సమానమైన స్థాయిలో ఈ పాట రాలేదు. గురుదత్ మార్కు తీసుకురావడంలో ఈ సినిమా విఫలమయింది. ఇక దీని తరువాత మెట్ల మీద శోభన్ బాబు, మల్లికల మధ్య నడిచే సీన్‌లో శోభన్ బాబు నటన హాస్యాస్పదంగా ఉండడం బాధనిపిస్తుంది. కాదన్న వారు ఒరిజినల్ ‘ప్యాసా’లో గురుదత్ ని చూడండి.
ఈ సీన్‌లో లలిత ప్రసక్తి వచ్చినప్పుడు మరోసారి వేణు ఆమెను తప్పు పట్టడం ఎందుకో అర్థం కాదు. లలితను చివరి సారి కలిసినప్పుడు ఆమె కథ విని ఎంతో సానుభూతితో “నువ్వు సుఖంగా ఉండు, నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను” అని చెప్పి వచ్చేసాక ఇప్పుడు మల్లిక దగ్గర మళ్ళీ లలితది తప్పు అయినట్లు చెప్పడంలో అర్థం లేదు. వేణు మరణం గురించి పేపర్లో వచ్చిన న్యూస్ ప్రసాద్ చదువుతున్నప్పుడు శిలువ వేసిన ఏసు క్రీస్తు ఉన్న బొమ్మను అడ్డం పెట్టుకున్న లలితను చూపించడం ‘ప్యాసా’ సీన్‌ను కాపీ చేయడం తప్ప, లలితలోని అసహాయతను ఒక సీన్‌లో చూపించాక మళ్ళీ ఆమెను ఆ టేబిల్ దగ్గర ఇలా చూపడంతో ఆమె వ్యక్తిత్వం పట్ల అస్పష్టత ఏర్పడుతుంది.
ఇక మల్లిక లలితలు పత్రికాఫీసులో కలుసుకునే సీన్‌ను హిందీలో గమనించండి. ముందు బహువచనంలో సాగే ఆ సంభాషణ చివరకి ఏకవచనంలో మారడం ‘ప్యాసా’లో చూస్తాం. తన స్వార్థం కోసం విజయ్ ప్రేమను కాదని వెళ్ళిపోయిన మీనా ఆఫీసులో ముందు గులాబోను మర్యాదగానే సంబోధిస్తుంది. ఆమె ఎవరో తెలిసిన తరువాత ఆమె ఏకవచనంలోకి మారుతుంది. కాని ‘మల్లెపూవు’ సినిమాలో లలితను గొప్ప ప్రేమికురాలిగా, త్యాగమూర్తిగా ఒకసారి చూపాక, ఆమె మల్లికను చూడగానే ఏకవచనంలో అవమానకరంగా సంభాషణ మొదలెట్టడం అసహజంగా ఉంది. ఇది ఆమె పాత్ర పట్ల ప్రేక్షకులను మళ్ళా కన్‌ఫ్యూజన్‌లో పడేస్తుంది. తెలుగులో సినిమాలో ధైర్యంగా లలితను ప్రశ్నిస్తుంది మల్లిక. హిందీలో గులాబోలో ఆ ధైర్యం ఉండదు. లక్ష్మి పరంగా నటనలో ఈ సంభాషణ రక్తి కడుతుంది. ఈ సీన్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. హిందీ ‘ప్యాసా’ కన్నా బాగా వచ్చిన సీన్ ఇది. లక్ష్మి గారి గొంతులో ఎమోషన్స్ అద్భుతంగా పలుకుతాయి ఈ సీన్‌లో. హిందీలో వహిదాకు ఇక్కడ ఎక్కువ డైలాగులు ఉండవు. ఆమె పై కెమెరా యాంగిల్స్‌తో సీన్ నడిపిస్తారు గురుదత్. కాని తెలుగులో లక్ష్మి పరిపక్వత కలిగిన నటనను ప్రదర్శించారు.
తరువాత సినిమా అంతా ప్యాసాను అనుకరిస్తూ వెళ్ళిపోతుంది. ఆఖరున స్మారక సభలో వచ్చే ‘యె మెహలో ఎ తఖ్తో’ అన్న పాటను తెలుగులో అత్రేయగారు ఇలా రాసారు.
ఏమీ లోకం, ఏమీ స్వార్ధం, ఎక్కడుందీ మానవత్వం
బ్రతికున్నా చచ్చినట్టే ఈ సంఘంలో చస్తేనే బ్రతికేది ఈ లోకంలో
నిజం నలిగిపోతుంది, ధనం చేతిలో నిల్గి మూల్గుతున్నది వల్లకాడిలో
మనుషులెందరున్నారు ఇందరిలో, మనసనేది ఉన్నది ఎందరిలో
ఒక్క మనసు బ్రతికున్నా ఊరుకోదు మౌనంగా, రగిలి రగిలి మండుతుంది మహా జ్వాలగా
సాటి మనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు, లాభముంటే శవాన్నైనా పూజించే వీళ్ళు
ఈ ఊసరవెల్లులు, ఈ దగాకోరులు వీళ్ళే మన సంఘంలో పెద్ద మనుషులు, చీడపురుగులు
మండిపోనీ మసైపోని ధనమదాందులు, జరాసంధులు ఈ రాబందులు ఏలే లోకం కాలిపోని
పేదల గుండెల నెత్తుటి కంటల్ పేరిచి కట్టిన కోటలన్నీ కూలిపోనీ
కులాల పేరిట, మతాల పేరిట తరతరాలుగ చరిత్ర కుళ్ళూ.. మాసిపోని
శపిస్తున్నా, శాసిస్తున్నా, శపధం చేస్తున్నా
ఆగిపోదు ఈ గీతము, మూగబోదు ఈ కంఠము
ఇది ప్రళయం, ఇది విలయం,.. ఇది మహోదయం…
ఆత్రేయ అంతటి మహాకవి రాసిన కవిత గురించి ఇలా అనకూడదేమో కాని నిజం చెప్పాలంటే, సాహిర్ పాట దగ్గరకు కూడా రాలేని ఈ గీతంలో వేణు వ్యక్తిత్వమే మారిపోతుంది. ఇక్కడ వేణులో ఒక పోరాటానికి నాంది పలికే కోపం, ఆవేశం కనిపిస్తాయి. కాని ఒరిజినల్ ‘ప్యాసా’లో వ్యక్తిగా ఈ సమజంలో జీవించాలనే ఇచ్ఛను విజయ్ పాత్రలో చంపేసే ఘట్టం ఇది. తెలుగులో వేణు పాత్ర వ్యక్తిత్వంలో ఇక్కడకు వచ్చేసరికి చాలా అస్పష్టత చేరింది. దానికి ఈ పాట ఇంకా దోహదం చేసింది. వేణుపై దుండగులు చేసే దాష్టికాన్ని చూసి మల్లిక రాందాసులు కూడా ఈ పాటకు గొంతు కలుపుతారు. వేణుని రక్షించి రాందాసు స్టేజీ మీదకు తీసుకువస్తాడు. మీరందరూ స్మరించుకుంటున్న కవి ఈ వేణు బాబు అని ఆ సభలోని వారందరికీ వేణుని పరిచయం చేస్తాడు రాందాసు. వేణు నేను బ్రతికే ఉన్నానని స్పష్టంగా అందరికీ చెప్పుకుంటాడు. మెంటల్ హస్పిటల్ డాక్టర్ కూడా ఇతనే వేణు అని అక్కడకు వచ్చి చెబుతాడు. తన అన్నలు, ప్రసాద్ లాంటి పబ్లిషర్లు చేసిన మోసాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని అందరి ముందు బైటపెడతాడు వేణు. సమాజాన్ని మార్చగల ఒక శక్తిగా ఆ స్టేజిపై ఆ క్షణం మారిపోతాడు. అంతటి ఉత్తేజాన్ని అందరికీ పంచి, చివర్లో మల్లిక దగ్గరకు వచ్చి నేను ఈ మనుషులకు, అవమానాలకు దూరంగా వెళ్ళిపోతున్నానని వచ్చి చెప్పడం కన్‌ఫ్యూజన్. కవుల జీవితాలు ఇప్పుడు మారే సమయం వచ్చిందని అంత గంభీరంగా స్టేజీపైన వేణు గొంతు చించుకు చెప్పిన తరువాత మళ్ళీ ఏం జరిగి అతను అందరికీ దూరంగా మల్లికతో వెళ్ళిపోతున్నాడో అర్థం కాదు. ‘ప్యాసా’ సినిమా ముగించినట్లు ఈ సినిమాను ముగించాలి అని దర్శకులు అనుకుంటే నేనే వేణుని అని అంత గట్టిగా వేణు స్టేజిపై చెప్పడం వెనుక ఉన్న కారణం అర్థం కాదు. వేణు వ్యక్తిత్వాన్ని చూపడంలో దర్శకులు ఈ ఆఖరి ఘట్టంలో పూర్తిగా విపలం అయ్యారని చెప్పవచ్చు.
లలిత పాత్రను కొన్ని సందర్భాలలో ఒక విక్టింగా చూపిస్తూ, మరోసారి వేణు నోట స్వార్థపరురాలిగా చెప్పిస్తూ, వేణు పాత్రను ఒక సీన్‌లో ఒకలా మరో సీన్‌లో మరో విధంగా చూపిస్తూ మొత్తానికి ‘ప్యాసా’ సినిమా కథను తెలుగువారి దగ్గరకు తీసుకు వచ్చారు వీ.మధుసూదనరావు గారు.
ఈ సినిమా గురించి ఈ సందర్భంలో ఇక్కడ ప్రసావించడంలో రెండు కారణాలున్నాయి. ‘మల్లెపూవు’ సినిమా కథలోని ఈ అస్పష్టతను పట్టించుకోకుండా దీన్ని ఆదరించిన ప్రేక్షకులు ఒరిజినల్ ‘ప్యాసా’ను చూస్తే అప్పుడు ఆ కథలోని లోతు, అందులోని ప్రశ్నలు, సమాజం మనిషి పట్ల చూపే వివక్షను ప్రశ్నించిన దర్శకత్వ ప్రతిభను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు. ‘మల్లె పూవు’ కథ తెలుగు వారికి తెలుసు, ఆ కథను గురుదత్ స్క్రీన్‌పై ఎలా చిత్రించారో చూడడం వలన దర్శకత్వం ఒక కథను ఏ స్థాయిలో నిలపగలదో తెలుసుకోవచ్చు.
మధుసూదనరావుగారు ‘ప్యాసా’ సినిమ కథను మాత్రమే పట్టుకున్నారు. దాన్ని కమర్షలైజ్ చేసే ప్రయత్నం చేసారు. కాని ఆ కథ వెనుక గురుదత్ ఆత్మను తెలుగువారి ముందు తీసుకురాలేకపోయారు. నిజం చెప్పాలంటే ఈ పని ఎవరూ చేయలేరు. ముందు చెప్పినట్లు గురుదత్ మరోసారి ‘ప్యాసా’ తీయాలనుకున్నా ఇంత గొప్పగా తీయలేకపోయేవారేమో. కొన్ని మాస్టర్ పీస్‌లు కొన్ని సందర్భాలలోనే సృష్టించబడతాయి. ‘ప్యాసా’ సినిమా ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఇది తెలుగులో ‘మల్లెపూవు’గా అని కొట్టిపడేసే సాధారణ ప్రేక్షకులకు ‘ప్యాసా’ని ఒకసారి చూడడానికి ఉత్సాహపరచడానికి ఈ అధ్యాయం రాయవలసి వచ్చింది. గురుదత్‌లో ఏం గొప్పతనం ఉంది అని ప్రశ్నించే తెలుగువారికి ‘ప్యాసా’, ‘మల్లెపువ్వు’ రెండు పక్కన పెట్టుకుని చూసే అవకాశం ఉంది. సినిమా కథకు ఆత్మను జోడించడం ఎలాగో నేర్చుకోవాలంటే గురుదత్ సినిమాలను శ్రద్ధగా స్టడీ చేస్తే చాలు.
కాని భారత దేశంలో అన్ని భాషలు ఉండగా ‘ప్యాసా’ను తెలుగులోనే రీమేక్ చేసారన్నది ఒప్పుకోవలసిన నిజం. ‘ప్యాసా’ చూడకుండా ఉంటే ఈ సినిమాలో పైన చర్చించిన వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ గారి పాటలలోని సొగసును ఆనందించవచ్చు. కాని ‘ప్యాసా’ తో పోలిస్తే తెలుగు ‘మల్లెపూవు’లో ఒక సాహిర్, వీ.కే మూర్తి, అబ్రర్ అల్వీ, ఎస్.డీ బర్మన్, ముఖ్యంగా గురుదత్ లేని లోటు కనిపిస్తుంది. శోభన్ బాబు గారు తెలుగువారు ఇష్టపడిన నటులు. కాని ఆయన గురుదత్ స్థాయిలో నటించలేరు. ఇది నాలాంటి వారి మూఢభక్తి అనో కేవలం పిచ్చి అభిమానం అనో అనుకునే వారికి ఈ రెండు సినిమాలు నెట్‌లో లభ్యం అవుతున్నాయి. అవి రెండు చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రావలసిందని అభ్యర్థన.