మధురమైన బాధ – గురుదత్ సినిమా 25 – కాగజ్ కే ఫూల్-2

0
3

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘కాగజ్ కే ఫూల్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

‘కాగజ్ కే ఫూల్’ సీన్ బై సీన్ విశ్లేషణ

[dropcap]‘కా[/dropcap]గజ్ కే ఫూల్’ మొదలవడమే ఒక విషాదమైన ట్యూన్‌తో జరుగుతుంది. నెరిసిన జుట్టుతో, పెరిగిన గడ్డంతో ఒక ముసలి వ్యక్తి స్టూడియో గేటు తెరుచుకుని లోపలికి వస్తాడు. కెమెరా స్టూడియో పేరు పై ఫోకస్ చేస్తుంది. అది అజంతా పిక్చర్స్. ఒక పెద్ద విగ్రహం కాళ్ళ దగ్గర ఆగిపోయిన ఆ వృద్ధుడిని బాక్‌డ్రాప్‌గా చూపుతూ ఇక్కడ పేర్లు పడతాయి. సినిమాలో వచ్చే ‘వక్త్ నే కియా క్యా హసీన్ సితం’ గీతానికి కూర్చిన సంగీతంతో అతి విషాదంగా వచ్చే మ్యూజిక్ నడుమ ఈ క్రెడిట్స్ ద్వారా ఒక మూడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు గురుదత్. ఆ ముసలి వ్యక్తే మన సినీ నాయకుడు సురేష్ సిన్హా. ఖాళీగా ఉన్న స్టూడియోలోకి అతను నడుచుకుంటూ వస్తాడు. వెనుక నుండి బాక్ గ్రౌండ్లో సురేష్‌ని ఓ గొంతు పరిచయం చేస్తుంది. ఈ నరేటర్ అవసరాన్ని మొదటి సారి ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలోనే కథనం కోసం గురుదత్ వాడుకున్నారు. అంతకు ముందు ఆయన తీసిన సినిమాలలో ఎక్కడా నరేటర్ అవరసరం రాలేదు.

(స్టూడియో లోకి నడిచి వస్తున్న సురేష్ సిన్హా)

నాటకాలలో ఈ పద్ధతి ఎక్కువగా అవసరం అవుతుంది. అయితే సినిమా మొదట్లో ఎంట్రీ ఇచ్చే ఈ హీరో అప్పటి ట్రెండ్‌కి భిన్నంగా ఉన్న వ్యక్తి. ఈ ఎంట్రీని చూపిస్తూ ప్రేక్షకులతో కనెక్ట్ అవడానికి గురుదత్ ఇక్కడ ఓ నరేటర్‌ని వాడుకోవలసి వచ్చింది. అంతే కాదు అప్పటి ప్రేక్షకులలో చాలా మందికి స్టూడియో లోపలి వాతావరణం తెలిసి ఉండదు. కాబట్టి ఈ పరిచయం ఇంకా అవసరం అవుతుంది. ఈ షాట్లన్నీ కూడా చాలా వరకు సగం చీకటీ సగం వెలుగు మధ్య ఉంటాయి. తెల్లవారి జామున అంత పెద్ద షెడ్ల క్రింద వాతావరణం ఎలా ఉంటుందో అదే దృశ్యాన్ని వీ.కే. మూర్తి కెమెరా ఇక్కడ చూపిస్తుంది. స్టూడియో మెట్లు ఎక్కి అతి కష్టం మీద పైకి చేరుకుంటాడు సురేష్ సిన్హా. లైట్ బాయ్‌లు బహుశా లైటింగ్ కోసం నించునే చోటు అయి వుండవచ్చు. చూట్టూ పొడవాటి లైట్లు ఉంటాయి. ఇప్పుడు సిన్హా మొహంపై కెమెరా ఫోకస్ అవుతుంది. అతని వృద్ధాప్యం జీవితంలోని ఓటమి స్పష్టంగా ఆ ముఖంలో కనిపిస్తూ ఉండగా.. “దేఖీ జమానే కీ యారీ… బిచడే సభీ బారీ బారీ” (లోకపు  స్నేహాన్ని చూసాను, ప్రతివారూ ఒక్కొక్కరుగా వీడి వెళ్ళిపోయిన పోయిన వారే) అన్న పాట పల్లవి స్లోగా ప్లే అవుతుంది. “క్యా లేకే మిలె అబ్ దునియా సే ఆంసూ కే సివా కుచ్ పాస్ నహీ, యా  ఫూల్ హీ ఫూల్ థె  దామన్ మే , యా  కాంటో కీ భీ ఆస్ నహీ, మతలబ్ కీ దునియా హై సారీ, బిచడే సభీ బారీ బారీ (ఏం తీసుకుని ప్రపంచాన్ని కలవాలి, కన్నీళ్ళు తప్ప నా దగ్గర ఏమీ లేవు, పూలతో ఒకప్పుడు ఒడి నిండి ఉండేది ఇప్పుడు ముళ్ళు లభిస్తాయన్న ఆశ కూడా లేదు, తమ అవసరాన్ని మాత్రమే గుర్తించే స్వార్ధ ప్రపంచం ఇది , అందరూ ఒకొక్కరుగా వీడి వెళ్ళిపోయారు) అంటూ సురేష్ జీవితాన్ని మొత్తం ఈ మొదటి సీన్ లోనే చూపిస్తారు దర్శకులు.

(సినిమాలో మొదటి సారి క్లోజ్‌అప్‌లో స్టూడియో మెట్లెక్కుతున్న సురేష్ సిన్హా పై కెమెరా ఫోకస్)

గతంలోకి వెళుతూ ఆ వృద్ధుడు అక్కడే నేలపై చతికిలపడిపోతాడు. అతని శరీరంలోని అలసటను ఇలా చూపించడం వలన అతని జీవితం పట్ల ఒక అవగాహన ప్రేక్షకులలో కలగుతుంది. గురుదత్ సినిమాలలో ఈ మొదటి సీన్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానితోనే సినిమా మూడ్, జెనర్ అన్నీ స్పష్టమవుతాయి ప్రేక్షకులకు.

అంత పైనుండి చీకటిలో క్రిందకు చూస్తున్న సురేష్‌కు తన గతంలో ఆ స్టూడియో వైభవం కళ్ళకు కనపడుతుంది. చూట్టూ లైట్లు వాటి మధ్య షాట్ కోసం సిద్ధం అవుతున్న వ్యక్తులు కనపడతారు. ఆ లైట్ల మధ్య సురేష్ గతం మొదలవుతుంది. ఈ షాట్లకు వాడిన కెమెరాలు అప్పట్లోనే అతి పాతవని వీ.కే. మూర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా తీసింది 1959లో అయినా 1940ల నేపథ్యంలో కథ నడుస్తుంది. అందుకని సురేష్ సిన్హా ఆ స్టూడియోలో దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు వచ్చే షాట్లలో ప్రేక్షకులకు చూపడానికి వాడిన కెమెరా, ఇతర పరికరాలు అన్నీ కూడా అంత పాతవాటినే వాడుకోవడం జరిగిందట. సినీ నిర్మాణాన్నిస్టడీ చేయగలవారు అప్పటి ఆ తొలినాటి కెమెరాలను లైట్లను, ఇతర పరికరాలను గుర్తు పడతారు.

ఈ విషాద గీతం నేపద్యంలోనే సురేష్ సిన్హా గతాన్ని పరిచయం చేస్తూ అతని ఆటోగ్రాప్ కోసం గుంపుగా నిలిచి ఉన్న అందమైన యువతులు, పెద్ద ధియేటర్ లో వీ.ఐ.పీ. లాంజ్ నుంచి క్రిందకు చూస్తున్న సురేష్, నోట్లో పైప్, ఖరీదైన కోటూ అతని మెడలో పడే దండలు, అతన్ని చుట్టు ముట్టే జనం ఈ సీన్లన్నీ ఒకొకటిగా కదిలిపోతాయి. ఉన్నత స్థితిలో ఉన్న కళాకారుని జీవితాన్ని ఆ కొన్ని సెకండ్లలో చూపించడం జరుగుతుంది. ఈ షాట్లలో సురేష్ వైభవాన్ని, చూట్టూ ఉన్న ఖరీదైన జీవితాన్ని చూపిస్తున్నప్పుడు కెమెరా పనితనం చాలా బావుంటుంది. వీ.కే. మూర్తి కెమెరా ఆ భవనాల పై కప్పుని కూడ కవర్ చేసి చూపిస్తుంది. ఈ షాట్ దగ్గర బాక్ గ్రౌండ్ లో “వక్త్ హై మెహర్బాన్ , ఆర్జూ హై జవాన్,  ఫిక్ర్ కల్ కీ కరే ఇతనే ఫుర్సత్ హై  కహా” (సమయం అనుకూలంగా ఉంది, కోరికలు యవ్వన ప్రాయంలో ఉన్నాయి, రేపటి గురించి అలోచించే సమయం ఎక్కడ ఉంది) అన్న వాక్యం వస్తుంది. “దౌర్ యె చల్తా రహే, రంగ్ ఉచల్తా రహే , రూప్ మచలతా రహే , జామ్ బదలతా రహే (ఈ స్థితి ఇలాగే సాగనీ,  ఈ రంగులు ఇలాగే ఎగరనీ , ఈ అందాలు ఇలాగె గుబాళించనీ, ఈ మధువు ఇలాగే మారుతూండనీ ) అంటూ సాగే కోరస్‌తో ఒకనాటి సురేష్ సిన్హా వైభోగం కళ్ళ ముందు నిలుస్తుంది. కాని ఆ వైభోగంలో కూడా సురేష్‌లో ఒక ఒంటరితనం, అయోమయం అతని ముఖంపై కనపడుతుంది. ఆ వైభోగం ఇచ్చే మత్తులో అతను జీవిస్తున్నట్లు కనపడదు. ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ అందరినీ ఒకసారి చూసే గురుదత్ కళ్లలో ఈ భావాలన్నీ పలుకుతాయి. అక్కడ ఉన్నా అక్కడ లేని ఒక అభావం అతని ముఖంపై ఆ సీన్లో వీ.కే. మూర్తి కెమెరా స్పష్టంగా పట్టుకోగలిగింది. అంతటి జనం మధ్య ముందుకు వెళుతున్న సురేష్ కోరుకుంటున్న జీవితం అది కాదేమో అనిపిస్తూ ఉంటుంది.

(అంత మంది మధ్య కూడా ఒంటరి ఈ సురేష్ సిన్హా)

తరువాత పెద్ద కారులో స్టూడియోలో స్క్రిప్ట్ చదువుతూ వస్తున్న సురేష్‌ని గుర్తుపట్టి టెక్నీషియన్లు నమస్కారం చేయడం, వారికి ప్రతి నమస్కారం చేస్తున్న సురేష్‌ని చూసినప్పుడు ఆ స్టూడియోలో అతనో ప్రముఖ వ్యక్తి అని అర్థం అవుతుంది. సురేష్ సిన్హా మధ్యవయస్కుడు, యువకుడు కాదు. ఈ సినిమా తీస్తున్నప్పుడు గురుదత్ వయసు కేవలం 34 సంవత్సరాలు. కాని తన కన్నా ఇరవై సంవత్సరాలు ఎక్కువ వయసున్న పాత్రను కోరి చేసారాయన. సినిమా అంతానూ మధ్య వయస్కుడిగా, తరువాత ముదుసలిగానే కనిపిస్తారు.

గడియారం తొమ్మిది కొడుతుండగానే స్టూడియోలోకి ప్రవేశించడం సురేష్ అలవాటు. దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు అక్కడి స్టాఫ్. స్టూడియోలో అతని వెనకాల తిరిగే ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరక్టర్లు, తమ పనిని అతను ఆమోదిస్తే చాలు అన్న భావంతో ఉండే స్టూడియో పరివారం కనిపిస్తారు. సురేష్ దేవదాసు సినిమా తీస్తునాడని అర్థం అవుతుంది. పారో పాత్ర కోసం తీసుకున్న ఓ ప్రముఖ నటి తన హేర్ స్టైల్ పట్ల కోపం ప్రదర్శిస్తుంది. అతి సాదాగా తనను స్క్రీన్ పై డైరెక్టర్ చూపాలనుకుంటున్నాడని, ప్రత్యేకమైన మేకప్, హేర్ స్టైల్, జుట్టులో రింగులు లేకుండా తానెట్లా స్క్రీన్‌పై కనిపించాలని ఆమె బాధపడుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్లు ఆమె అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటారు. ఫైనాన్సర్లు కూడా అదే విధంగా ఆమె కోరికలు తీర్చే ప్రయత్నంలో ఉంటారు. కాని సురేష్ ఈ మార్పుకు ఒప్పుకోడు.

నా కోసం కొంచెం కారెక్టర్ని మార్చు అని అడిగిన నటికి ఆయన గట్టిగా “కారెక్టర్ అధారంగా నువ్వు మారాలి, నీ కోసం కేరెక్టర్ మారదు” అని చెబుతాడు.

ఒకప్పుడు దర్శకుడు సినిమాని నడిపించే గురువు హోదాలో ఉండేవాడు. సినిమా పరిశ్రమలో వచ్చిన కొత్త పోకడల కారణంగా ఇప్పుడు దర్శకుడు కన్నా నటుల డామినేషన్ ఎక్కువయింది. హీరో ఇమేజ్ ఆధారంగా సినిమా కథ నిర్మిస్తున్న ఈ రోజుల్లో, సినిమాలలో క్వాలిటీ తగ్గడం వెనుక కారణం స్పష్టంగా అర్థం అవుతే తప్ప సినిమా పరిస్థితులు మారవు. ఇప్పుడు దర్శకులుగా మారిన వారికి కూడా సురేష్ సిన్హా నచ్చడేమో. కాని గురుదత్ తన సినిమాలన్నిటినీ కూడా ఇమేజ్ చట్రానికి దూరంగా తీసారు. అందుకే ఈ రోజు అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇమేజ్ చట్రంలో పడి సినిమాలు తీస్తున్నవారు కాల ప్రవాహంలో కొట్టుకుపోతారు తప్ప కళాకారులుగా నిలిచి ఉండరు. సురేష్ సిన్హా ఈ సినిమాలో దర్శకుడిలో చూపుతున్న పాషన్ గురుదత్ నిజ జీవిత వ్యక్తిత్వంలో ఓ ప్రధాన భాగం. ఇది ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు కాబట్టే సురేష్ సిన్హాలో పూర్తిగా గురుదత్ మాత్రమే కనిపిస్తారు. తాను అనుకున్న విధంగా సినిమా తీయడంలో అంతా సహకరించలేకపోతే సినిమా మరొకరితో తీయించుకోండి అని ధైర్యంగా చెప్పి వెళ్ళిపోతాడు సురేష్ సిన్హా. ఇక్కడ ఏ సందర్భంలో కూడా రాజీ పడలేని సురేష్ సిన్హాలో గురుదత్తే మరో సారి కనిపిస్తారు. ‘కాగజ్ కే ఫూల్’లో సురేష్ పాత్ర గురుదత్ వ్యక్తిత్వంలా అనిపించడానికి కారణం, సురేష్ సినీ దర్శకుడు అవడం, అతనిలో చాలా లక్షణాలు గురుదత్ వ్యక్తిత్వంతో కలిసిపోయి ఉండడం కారణం. ‘ప్యాసా’లో విజయ్ కవి. గురుదత్ స్వయంగా కవి కాదు కాబట్టి విజయ్ కొన్ని సందర్భాలలో సినిమా పాత్రలాగే కనిపిస్తాడు. చూసే ప్రేక్షకుడు ఆ పాత్రతో ఐడెంటిఫై అవగలిగారు. కాని సురేష్ సిన్హా ఓ పాత్రలా అనిపించడు. అక్కడ కేవలం గురుదత్ మాత్రమే కనిపిస్తాడు. సినీ దర్శకులకు చాలా దూరంగా ఉండే ప్రేక్షకులు ఆ పాత్రలో తమను తాము చూసుకోలేకపోయారు. అదే సురేష్ సిన్హా నటుడు అయినట్లయితే ప్రేక్షకులు ఈ కథను స్వీకరించే పద్ధతిలో తప్పకుండా మార్పు ఉండేది. కారణం ప్రేక్షకులకు సినిమా అంటే కనిపించే నటీనటులే. తెర వెనుక శ్రమించే వారు కాదు. అది సినిమాను నడిపించిన దర్శకులయినా సరే. దర్శకులకు దగ్గర అయే ప్రేక్షకులు మాస్‌లో నుండి రారు. వీరు ఇంటలెక్చువల్స్ అయి ఉంటారు. అందుకే ‘కాగజ్ కే ఫూల్’ సినిమా సాధారణ ప్రేక్షకుల సినిమా కాదు. ఆ రోజుల్లో ఇంటలెక్చువల్స్‌కి కూడా ఇది చేరకపోవడానికి, కారణం, ఇతర ఇంటలెక్చువల్స్‌ని సహేతుకంగా స్వీకరించే గుణం ఆ వర్గంలో చాలా తక్కువ ఉండడం.

సురేష్ ఇప్పుడు స్టూడియో నుండి ఇంటికి బైలుదేరతాడు. వెనుక బాక్‌గ్రౌండ్‌లో మొదట వచ్చిన పాట కంటిన్యూ అవుతుంది. “రాత్ భర్ మెహమాన్ హై , బహారే యహా, రాత్ గర్ డల్ గయీ ఫిర్ యే ఖుషియా కహా” (రాత్రి వచ్చే అతిథుల్లాంటివి  ఈ అనందాలు, రాత్రి గడిచిపోయిన తరువాత ఆ సంతోషాలు ఉండవు, ఎటువెళ్తాయో ఎవరికీ తెలియదు. ) “పల్ భర్ కీ ఖుషియా హై సారీ,  బడనే లగీ బేకరారీ” (క్షణకాలం నిలిచే సుఖాలే ఇవి , మనసులో అలజడి పెరిగిపోతూనే ఉంది) సినిమా అంతా నడిచే ఈ పాట సురేష్ జీవితంలోని ఒంటరితనానికి ప్రతీకగా నిలుస్తుంది. అంతటి గౌరవాన్ని, ప్రముఖ స్థానాన్ని అనుభవిస్తూ కూడా ఇంటికి చేరుకున్న సురేష్‌కి స్వాగతం పలికేది ఈ ఒంటరితనమే. ఏ ఆనందమూ కూడా ఒక్క క్షణం సుఖం తప్ప సురేష్‌కు ఇచ్చేదేమీ లేదని, ఆ తరువాత వచ్చే ఒంటరితనమే సురేష్ జీవితంలో మిగిలిపోయే వేదన అని వ్యక్తపరచడం ఈ బాక్‌గ్రౌండ్ పాట ఉద్దేశం. గురుదత్ సినిమాలను దగ్గరగా గమనిస్తే ఆ వ్యథాభరిత విషాదాన్ని వర్ణించ వలసిన ప్రతి సారి గురుదత్ ఓ బాక్‌గ్రౌండ్ పాటను ఆధారం చేసుకున్న సందర్భాలు అతని సినిమాలలో కనిపిస్తాయి. Mr. and Mrs. 55 లో “మేరి దునియా లుట్ రహీ థీ” తీసుకున్నా, ‘ప్యాసా’లో “ఆజ్ సజన్ మోహే అంగ్ లగాలే” తీసుకున్నా అక్కడ ఎవరో పక్కన పాడుతున్నట్లు సీన్ నడుస్తుంది. అది ఖవ్వాలి గాయకులే కావచ్చు, వీధి పాటగాళ్ళే కావచ్చు. మరొకరి పాట ద్వారా పాత్రల మనసులోని సంఘర్షణను చూపిస్తారు గురుదత్. కాని ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో మాత్రమే ఓ నరేటర్, ఆ తరువాత ఓ పూర్తి స్థాయి బాక్‌గ్రౌండ్ సాంగ్ కనిపిస్తుంది. సినిమా అంతా వస్తూ పోయే ఈ మరో బాక్‌గ్రౌండ్ నరేషన్ పాట రూపంలో మాట రూపంలో రావడం వలన ఈ సినిమాకు ఆత్మకథ రూపం పూర్తిగా వచ్చి చేరుతుంది. ఒక జీవితాన్నియథాతథంగా ఓ వ్యక్తి తెరపై చూపుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గురుదత్ సినిమా టేకింగ్‌లో ప్రతి సినిమాలో ఇలా ఒక విలక్షణ ప్రయోగం కనిపించి తీరుతుంది.

ఓ కొలను ముందు ఉన్న అతి ఖరీదైన భవనంలోకి ఒంటరిగా ప్రవేశిస్తాడు సురేష్. అ భవనం వైభోగంగా ఉన్నా చీకట్లో ఉంటుంది. ఆ భవనంలోకి ప్రవేశిస్తున్న సురేష్ పై షాట్ గమనించండి. బైట కొలను, ఆకాశం మాత్రమే వెలుగులో ఉండి లోపల అంతా చీకటి. గురుదత్ ఆకారం కూడా ఒక నీడలా మాత్రమే ఉంటుంది. ఆ ఇంట్లో సురేష్ జీవితంలోని ఒంటరితనాన్ని చూపించే అద్భుతమైన షాట్ ఇది. డబ్బుతో పెద్ద బంగళాలు కట్టుకుని అందులో ఒంటరిగా సంచరించే వ్యక్తుల జీవితపు విషాదాన్ని ఈ ఒక్క సీన్ చూపిస్తుంది. ఇంట్లో గాలికి ఊగుతున్న తెరల మధ్య ఖరీదైన ఫర్నీచర్. ఇంట్లోకి వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని సిగార్ తాగుతూ ఇంటిని మొత్తం పరికిస్తున్న గురుదత్ పట్ల ఒక రకమైన సానుభూతి కలుగుతుంది. అతని నుదుటి పై పడే ముడతల మధ్య ఆలోచిస్తున్న అతని కళ్ళు. ఈ రూపం మనసులో నిలిచిపోతుంది. సురేష్ సిన్హా జీవితంలోని ఆ భయంకరమైన ఒంటరితనాన్ని మాటలు లేకుండా పరిచయం చేసే షాట్ ఇది. తన గదిలోకి వచ్చి ఒక అల్మారా తెరుస్తాడు సురేష్ సిన్హా. అందులో ఒక చిన్న పిల్ల ఆడుకునే అమ్మాయి బొమ్మ ఉంటుంది. షాట్ అప్పటి దాకా చీకటిగా ఉండి ఈ అల్మారా తెరిచేటప్పుడు పూర్తిగా లైట్ల ఫోకస్ మధ్య ఉంటుంది. అంటే ఆ బొమ్మ సురేష్ సిన్హా జీవితంలో వచ్చే ఆనందానికి ప్రతీకగా అర్థం అనే విషయాన్ని డైరక్టర్ కమ్యూనికేట్ చేస్తున్నరని అర్థం. ఆ అల్మారా నుండి మళ్ళీ వెనుకకు వెళుతున్న సురేష్ సిన్హా మళ్ళీ చీకట్లో ఓ నీడగా కలిసిపోతాడు. మాటలతో చెప్పలేని విషయాలని ఈ షాట్ ఎంత హృద్యంగా చెబుతుందో గమనించండి. ఫిలిం మేకింగ్ గురించి తెలుసుకోవాలనుకునే వారంతా చూడవలసిన షాట్ ఇది.

ఇక్కడి నుండి సీన్ డెహ్రాడూన్ లోని బోర్డింగ్ స్కూల్‌కి మారుతుంది. కొందరు ఆడపిల్లలు బాల్‌తో ఆడుతూ ఉంటారు. వీరిలో సురేష్ సిన్హా కూతురు పమ్మీ కూడా ఉంటుంది. పద్నాలుగు పదిహేనేళ్ళ వయసున్న అమ్మాయిగా కనిపిస్తుంది ఈ పాత్రలో అలనాటి బాలనటి నాజ్. తనని చూడడానికి వచ్చిన తండ్రిని చూసి పమ్మీ సంతోషిస్తుంది. ఆనందంతో తండ్రిని అల్లుకుపోతుంది. పక్కన ఉన్న స్నేహితురాళ్ళందరికీ తండ్రిని పరిచయం చేస్తుంది. కాని ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి పమ్మిని తీసుకుని వెళ్ళిపోతూ పమ్మీ తల్లి మాత్రమే ఆమెకు గార్డియన్ అని తండ్రిని కలిసే అనుమతి ఆమెకు లేదని చెబుతుంది. తన బిడ్డను తననుండి లాక్కువెళ్ళిపోతున్నప్పుడు సురేష్ సిన్హాలో ఒక అసహాయత కనిపిస్తుంది.

సురేష్ తన మామగారైన బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళతాడు. సర్. బీ.బీ వర్మ అతని భార్య పూర్తిగా పాశ్చత్య జీవనశైలిలో జీవిస్తూ కనిపిస్తారు. అనవసరమైన మర్యాదలు, డాంబికంగా ఉండే ఆ ఇంటి అలంకరణ వారి జీవిత పంథాను చూపిస్తాయి. కుక్కకు జలుబు చేసింది అంటూ అదో ముఖ్యమైన విషయంగా మాట్లాడుకుంటే అల్లుడిని పట్టించుకోని ఆ దంపతుల ప్రపంచానికి సురేష్ ప్రపంచానికి మధ్య దూరం చాలా ఉందని అని ఈ సీన్‌తో అర్థం అవుతుంది. ఇక్కడ సురేష్ వర్మ ఇంటి వాతావరణం ఆర్సన్ వెల్స్ ‘సిటిజెన్ కేన్’ సినిమాలో చూపిన భవనపు వాతావరణానికి పోలి ఉంటుంది. ఆ ఇంటి చూట్టు తిరిగే కెమెరా మూమెంట్లను గమనిస్తే ఆ ఇంటిలోని ప్రతి భాగం స్పష్టంగా కెమెరా పట్టుకోవడం చూడవచ్చు. స్పష్టంగా ఇంట్లోని ప్రతి మూలను చూపిస్తూ మళ్ళీ పాత్రలను అంటే స్పష్టంగా ఫ్రేమ్‌లో చూపించడం వెనుక కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాలి.

ఓ కుక్క పిల్లనును పరిచయం చేస్తూ ఇది మా ఇంట్లో మరో కొత్త మెంబర్ అని అల్లుడితో అంటుంది అత్తగారు. నేను మరో మెంబర్ని కలవాలని వచ్చాను… మీ కూతురిని అని వ్యంగ్యంగా జవాబిస్తాడు సురేష్. నౌఖరుతో సురేష్ భార్యకు కబురు చేస్తాడు మామగారు. మెట్లు దిగి వచ్చి ఆనందంగా సురేష్‌ని పలుకరిస్తాడు రాకీ, సురేష్ బావమరిది. అలా గట్టిగా మాట్లాడడం మర్యాద కాదని తండ్రి గుర్తు చేస్తే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాకీ. సురేష్ భార్య అతన్ని కలవడానికి ఇష్టపడట్లేదని నౌఖరు కబురు తీసుకువస్తాడు. దీనికి ఏ మాత్రం స్పందించరు ఆమె తల్లి తండ్రులు. తన కూతురుని స్కూలు యాజమాన్యం కలనివ్వలేదని సురేష్ చెప్పినా వారిలో ప్రతిస్పందన ఉండదు. తనను కదని భార్య ఇల్లు వదిలి రావడం, ఇప్పుడు కూతురు కూడా తనకు దూరమవడం ఏంటని ప్రశ్నిస్తాడు సురేష్. చిన్నతనంలో తల్లి అవసరం బిడ్డకు ఉంటుందని తాను ఊరుకున్నానని కాని ఇప్పుడు తన బిడ్డ తన దగ్గర ఉండాలని అంటాడు. సినిమా అనే అసహ్యకరమైన వాతావరణంలో తన మనవరాలుండడం తనకిష్టం లేదని చెబుతాడు బీ.బీ. వర్మ.

ఆ రోజుల్లో చాలా ధనిక కుటుంబాలు సినిమాలలో పని చేసేవారిని ద్వేషించేవారు. ఈ సినిమా 1940ల వాతావరణంలో తీసిందన్నది మరో సారి అర్థం అవుతుంది. అలాగే అప్పటి ఆలోచనలకి ఇప్పటి ధనిక వర్గపు ఆలోచలలో వచ్చిన తేడాను గమనించి రెండు పరిణామాలూ ఆరోగ్యకరం కానివే అన్న మరో విషయం పట్ల కూడా చర్చ జరుపుకోవలసిన అవకాశం ఇచ్చే సీన్ ఇది.

పమ్మీని నాకు దూరం చేయలేరెవ్వరు అన్న సురేష్ సిన్హా ప్రశ్నకు కోర్టుకు వెళ్ళమని బదులిస్తాడు వర్మ. ఇంటి గొడవలు కోర్టు దాకా వెళ్లాలా అని అడిగిన సురేష్ ప్రశ్నకు బ్రిటీష్ న్యాయం పట్ల నాకు పూర్తి నమ్మకం ఉందని బదులిస్తాడు వర్మ. నేను బీనాతో మాట్లాడుతాను అని మెట్లు ఎక్కి భార్య గది దగ్గరకు వెళతాడు సురేష్. అతని మొహం పై తలుపు వేస్తుంది భార్య. అవమానంతో ఇంటి బైటకు వచ్చిన సురేష్‌కు అక్కడే కార్లో అతని కోసం ఎదురు చూస్తున్న్ రాకీ కనిపిస్తాడు. రాకీ ఒక్కడికే సురేష్ బాధ అర్థం అవుతుంది. అతన్ని కార్లో ఎక్కుంచుకుని అతనికిష్టమైన గుర్రాల మధ్యకు తీసుకువెళతాడు రాకీ.

ఈ సినిమాలో రాకీ పాత్ర వచ్చి పోవడం అసంబద్దంగానే అనిపిస్తుంది. రాకీ పెళ్ళి పట్ల నమ్మకం లేని యువకుడు. గుర్రప్పందాలు, సరదా జీవితం అతని నైజం కాని మనిషిని గౌరవించే స్వభావం ఉన్నవాడు. గుర్రాలకు ట్రీట్ చేసే డాక్టర్‌గా జూలియట్ అనే అమ్మాయి రాకీకి అక్కడ పరిచయం అవుతుంది. ఆమెతో కలిసి తిరుగుతుంటాడు రాకి.

ఢిల్లీలో ఒక వీధి. జోరున కురుస్తున్న వర్షాన్ని తప్పించుకోవడానికి ఓ చెట్టు క్రిందకు వస్తాడు సురేష్ సిన్హా. ఆ వెనుక అతి సాధారణంగా కనిపించే ఓ అమ్మాయి తుమ్ముతూ చలికి వణుకుతూ కనిపిస్తుంది. ఆమెను పలకరించబోతాడు సురేష్. కాని అతనో పోకిరి కావచ్చని ముందు అతన్ని దులపరించేలా మాట్లాడుతుంది ఆమె. వర్షంలో రెయిన్ కోట్ లేకుండా ఎందుకు వచ్చావని సురేష్ అమెను అడిగినప్పుడు, జలుబు, తుమ్ములు ఉచితంగా దొరుకుతాయి కాని రెయిన్ కోట్‌కి డబ్బులు కావాలి అని బదులిస్తుంది ఆమె. ఆమె పరిస్థితి చూసి తన కోటు ఆమెకిస్తాడు సురేష్. మరి మీకు అన్న ప్రశ్నకు జవాబుగా నేను కొంచెం బ్రాందీ తాగాను, నాకు జలుబు చేయదు అని జవాబిస్తాడు సురేష్. తాగితే మనిషి అనాగరికంగా ప్రవర్తిస్తాడని విన్నానే అన్నదానికి నవ్వి, కొందరు ఇతరుల అనాగరిక స్వబావాన్ని భరించడానికి కూడా తాగుతారు అని బదులిస్తాడు సురేష్. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు, నేను ఇరవై నిముషాలలో బొంబాయి ట్రైను పట్టుకోవాలి అని హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సురేష్ సిన్హా.

(సినిమాలో వహిదా పరిచయం చెట్టు వెనుక వర్షంలో తడుస్తున్న శాంతిగా)

ఇప్పుడు సీన్ మళ్ళీ స్టూడియోకి మారుతుంది. షాట్‌కి కావల్సినవి అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాడు సురేష్. ఒక ఎక్స్‌ట్రా నటి బిడ్డకు పాలిస్తూ మేకప్ రూమ్‌లో ఉండిపోతుంది. ఆమెను తీసుకొచ్చిన వ్యక్తి ఆమెను అసహ్యంగా తిడతాడు. బిడ్దను వదిలి రాబోతున్న ఆమెను చూసి సురేష్ ఆమెను బిడ్డను పడుకోపెట్టే సెట్ పైకి రమ్మని చెబుతాడు. తోడుగా ఆమెతో వచ్చిన ఆమె పెద్ద కూతురుని ప్రేమగా పలకరిస్తాడు. ఆ అమ్మాయిని చూసిన తరువాత మరో సారి కూతురు దగ్గర లేని లోటు అనుభవిస్తాడు.

డిల్లీలో చెట్టు క్రింద సురేష్ కు కనిపించిన ఆ అమ్మాయి కోటు తీసుకుని స్టూడియోకి వస్తుంది. బైట సురేష్‌ని చూస్తుంది కాని సురేష్ ఆమెను గుర్తు పట్టడు. అతని వెనుకే ఆమె సెట్ పైకి వస్తుంది. కెమెరా ఆమె రావడాన్ని షూట్ చేస్తుంది. ఆమెను చూసిన టెక్నీషియన్స్ షూటింగ్ ఆపు చేస్తారు. క్రేన్ పై ఉన్న సురేష్‌ని ఆమె చూసి తాను ఆ కోటు తిరిగి ఇవ్వడానికి వచ్చానని చెబుతుంది. ఆమెను పక్కన కూర్చోమని చెప్పి తన పనిలో పడిపోతాడు సురేష్.

(కోటు ఇవ్వడానికి వచ్చిన శాంతి డైరక్టర్ గా చూసిన సురేష్ సిన్హా)

గురుదత్‌తో పరిచయం ఉన్నవారు, ఎవరు వచ్చినా, ఎలాంటి పని పడినా షూటింగ్ మధ్యలో గురుదత్ ఎవరినీ పట్టించుకునేవాడు కాదని చెబుతారు. సురేష్ సిన్హాలో అదే లక్షణం ఇక్కడ కనిపిస్తుంది. పనిలో పడి ఆ అమ్మాయి సంగతి మర్చిపోతాడు సురేష్. రోజంతా ఒంటరిగా కూర్చుని ఇక అక్కడ ఉండలేక కోటుతో పాటు ఓ ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతుంది ఆమె. ఆ ఉత్తరం కళ్ళద్దాలు లేక చదవలేక పక్కనున్న అసిస్టెంట్‌కి ఇచ్చి చదవమని చెబుతాడు సురేష్. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వయసు తేడాను చెప్పే సీన్ ఇది. ఈ సినిమాలో డైలాగుల మధ్య కన్నా ప్రధాన సంభాషణలు లేనప్పుడు గురుదత్ చిత్రీంచిన షాట్లలో చాలా కథ నడుస్తుంది. చాల విషయాలను దర్శకుడు ఇలాంటి చిన్న విషయాలలో చెబుతాడు. పరిశీలిస్తే అలాంటి సీన్లలో ఈ ఉత్తరం కోసం అద్దాలు వెతుక్కుని అవి కనపడక అసిస్టెంట్‌కి ఆ ఉత్తరం ఇచ్చి చదవమని సురేష్ చెప్పడం చాలా గొప్పగా వచ్చిన సీన్. హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడాను చూపించిన మంచి సీన్ ఇది.

తరువాత సీన్‌లో ప్రివ్యూ థియేటర్‌లో ఆ రోజు తీసిన షాట్లు చూస్తూ ఉంటాడు సురేష్. అందులో ఆ అమ్మాయి కోటు ఇవ్వడాని వచ్చి పొరపాటున కెమెరా ముందుకు వచ్చిన షాట్ వస్తుంది. ఇదెందుకు ప్రింట్ అయిందని అందరు అడిగే లోపల దాన్ని స్క్రీన్‌పై నడవనివ్వమని చెప్పి సురేష్ తన సీట్‌లో నుండి లేచి వచ్చి స్క్రీన్ దగ్గరగా వెళ్ళి ఆమెను పరిశీలిస్తాడు. సీన్ అయిపోయిన తరువాత ఉత్సాహంతో ఈమె కోసమే వెతుకుతున్నాను అని గట్టిగా చెబుతాడు. అర్థం కాని వారికి తానిన్నాళ్ళు వెతుకుతున్న పార్వతి ఈమే అని ఈమె ఎక్కడున్నా సరే పట్టుకుని రండి అని మిగతావారికి చెబుతాడు. తాను ఊహిస్తున్న రూపాన్ని చూసిన ఆనందం అతని మొహంలో కనిపిస్తుండగా షాట్ ముగుస్తుంది. ఒక చిత్రకారుడు తాననుకున్న విధంగా శిల్పం వచ్చినా, ఒక రచయిత తాననుకున్న విధంగా గేయం వచ్చినా, ఒక దర్శకుడు తాను అనుకుంటున్న విధంగా ఒక పాత్ర తనెదురుగా వచ్చి నిలిచినా వారిలో కలిగే భావావేశం ఎలాంటి ఆనందపు చరమ దశలోకి తీసుకుని వెళూతుందో గురుదత్ కళ్ళలో ఇక్కడ కనిపించే ఆ ఆనందం చెబుతుంది.

(సురేష్ సిన్హాకి దొరికిన పారో)

ఒక దర్శకుడికి తన పాత్రల పట్ల ఉన్న ప్రేమ, బంధం స్పష్టపరిచే సీన్ ఇది. దర్శకుడి అనుబంధం పాత్రలతో ఉంటుంది కాని నటులతో కాదు. ఆ నటులలో వారికి ఆ పాత్రలే కనిపిస్తాయి. మిగతా వారికేమో కాని గురుదత్ జీవితంలో ఇదే బంధం అన్నిటినీ డామినేట్ చేసింది. పాత్రలనే చూడగలిగిన ఆయన వాటి వెనుక వ్యక్తులను చూడలేకపోవడం, చూసిన తరువాత నిరాశపడడమే ఆయన జీవితంలో ఇతరులకు అర్థం కాని ఓ కోణం. దీనికి కారణం, ప్రతి క్షణం కళాకారుడిగా మాత్రమే తప్ప వాస్తవ ప్రపంచంలో మనిషిగా బ్రతకలేకపోయిన ఆయన ఆలోచన విధానం కావచ్చు. వాస్తవానికి, ఆయన కలలోని కల్పనకు మధ్య తేడాను గుర్తుంచలేని స్థితిలోకి వెళ్ళిపోవడమే గురుదత్ జీవితంలోని విషాదానికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తూ ఉంటుంది. కళాకారుని ఈ అత్యుత్తమ ఊహా స్థితి అద్భుతమైన కళాఖండాలను అందిస్తే వ్యక్తిగతంగా అతన్ని ఇంకా ఒంటరిని చేసింది. ఆ స్థితిలో తనెదురు చూసిన రూపం కళ్ళ ముందు కనపడితే ఓ దర్శకుడు అనుభవించే తృప్తి ఆనందం ఈ సీన్‌లో సురేష్ సిన్హా కళ్ళల్లో చూస్తాం.

స్టూడియోకి వచ్చిన ఆ అమ్మాయిని పరిశీలిస్తారు ప్రొడ్యూసర్లు, ఫైనాన్సర్లు ఇతర పరివారం అంతా కూడా. వారి మధ్య భయం భయంగా నిలుచుని ఉంటుంది ఆమె. వాళ్ళందరి మధ్య ఆమె విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తుంది.. నేను యాక్టింగ్ చేయలేను అని ఏడవడం మొదలెడుతుంది. ఆమె ఏ రకంగా సినిమాకు పనికి వస్తుందో వారికి అర్థం కాదు. కెమెరా ముందు ముడుచుకుపోయే ఆమెలో సురేష్ ఏమి చూసాడో ఎవరికీ అర్థం కాదు. సాధారణమైన, ప్లేన్ ఫేస్ ఉన్న ఆమె హీరోయిన్ ఎలా అవుతుంది అని అందరూ సురేష్‌తో వాదనకు దిగుతారు. ఇంకొకరు కావాలంటే సైలెంట్ సినిమాల హీరోయిన్‌గా చేయండి మన సినిమాకు కాదు. డైలాగ్ చెప్పడమే ఆమెకు రాదు అని కూడా అంటారు. అన్ని విని కూడా సురేష్ అమ్మాయికి మేకప్ వేయించి సెట్ పైకి తీసుకు రమ్మని తన అసిస్టెంట్ కు చెబుతాడు. మిగతా వారికి టెస్ట్ తరువాత మీరు నిర్ణయించుకోండి అని జవాబు చెప్పి వెళ్ళిపోతాడు.

వహిదా రెహ్మాన్‌ని చూసినప్పుడు ఈమె సినిమా హీరోయిన్ ఎలా అయింది అనే ఆలోచన వచ్చి తీరుతుంది. ఈమెలో ఆనాటి మధుబాల అందం, మీనా కుమారి గాంభీర్యం, నూతన్ చలాకీతనం మచ్చుకు కూడా కనిపించవు. వైజయంతి మాల కన్నాఈమె గొప్ప డాన్సర్ కాదు. నిజం చెప్పాలంటే గురుదత్ ఆమెను నటిని చేయనట్లయితే ఆమె హీరోయిన్‌గా మాత్రం మనగలిగేదే కాదు. ఆమె సినిమాలన్నీ ఇప్పుడు వరుస పెట్టి చూసినా గురుదత్ సినిమాలోని వహిదా మరే సినిమాలోనూ కనిపించదు. డైలాగ్ డెలివరీలో కూడా ఆమె తేలిపోతుంది. వహీదా హీరోయిన్ అవగలిగింది అంటే దానికి కేవలం గురుదత్ మాత్రమే కారణం. ఆమెలో ఎవరికీ కనపడని కోణాన్ని, యాంగిల్స్ ని, అందాన్నిఆయన చూపించగలిగారు. తరువాత ఆమె ఆ పేరు మీద సినీ రంగంలో కొన్ని సంవత్సరాలు పని చేసింది. కాని జీవంతో ఆమె నటించిన పాత్రలు గుప్పెడు కూడా కనిపించవు. దర్శకుడి వలన బ్రతికిన నటి తప్ప దర్శకుడిని బ్రతికించిన నటి కాదు వహీదా. వీ.కే. మూర్తి, సుబ్రత మిత్ర (తీసరీ కసం), ఫాలీ మిస్త్రీ (గైడ్, నీల్ కమల్) లాంటి సినిమాటోగ్రఫర్లు ఉన్న సినిమాలలోనే ఆమె అందంగా కనిపించేది. కెమెరామెన్, దర్శకులు మలచిన నటి ఆమె. ఇది ఒప్పుకోవలసిన నిజం. కేవలం అందంలోనే కాదు నటనలో కూడా ఈమె ఎక్కడా అత్యుత్తమ స్థాయి ప్రదర్శించినట్లు అనిపించదు. దిలీప్ కుమార్ లాంటి దిగ్గజాల పక్కన ఓ వైజయంతి మాల ఓ నర్గిస్ ఉన్నట్లుగా ఆమె ప్రెజెన్స్ ఉండదు. చాలా సామాన్యమైన నటి ఆమె. కాని ఆమెలో ఆ సాధారణత్వాన్ని ఇష్టపడిన గురుదత్ అటువంటి సినిమాలను నిర్మిస్తున్న దర్శకుడిగా ఆమెను ఏరి కోరి నటిగా తన సినిమాలలో స్థానం ఇచ్చారు. ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో వచ్చిన ఈ సన్నివేశం వహీదాను నటిగా తీసుకున్నప్పుడు గురుదత్ అనుభవించినదే అని చెప్పవచ్చు. ఒక వ్యక్తిలో ఏదో విషయం ఉందంటే ఆ వ్యక్తిలోని ప్రతిభను లాగడానికి గురుదత్ చాలా ఖర్చుపెట్టేవాడని, శ్రమ పడేవాడని, గురుదత్ తీర్చిదిద్దిన జానీ వాకర్, అబ్రర్ అల్వీ. గురు స్వామి, వీ.కే. మూర్తిల కెరియర్ లను గమనిస్తే అర్థం అవుతుంది. వీరందరూ కూడా గురుదత్ మరణం తరువాత ఆ కళాత్మకత చూపలేకపోయారు.

 తరువాతి సీన్‌లో సురేష్ స్టూడియోలోకి నడుచుకుంటూ వెళతాడు. ఇక్కడ వీ.కే. మూర్తి పనితనం చూడండి. పై కప్పులో ఓ చిన్న రంద్రం నుండి నేలపైకి వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. ఆ వెలుగు మధ్యలోనుండి నడుచుకుంటూ వెళ్లి ఓ మూల కుర్చీలో కూర్చుంటాడు సురేష్. స్క్రీన్ మొత్తంలో ఆ వెలుగు తప్ప మిగతా అంతా ఖాళీగా ఉంటుంది.

(వీ.కే. మూర్తికి దేశంలోనే గొప్ప పేరు తీసుకువచ్చిన షాట్ ఇది)

ఆ వెలుగు మధ్య తలుపు తోసుకుని పార్వతి మేకప్‌లో వహీదా వచ్చి నిలుచుంటుంది. నటిగా వహీదా అదృష్టం ఈ షాట్. మరే నటికి దొరకని అద్భుత అవకాశం ఇది. దీన్ని తరువాత చాలా మంధి కాపీ చేయాలని ప్రయత్నించినా ఎవరికీ సాధ్యపడని షాట్ ఇది. (ఓం శాంతి ఓం సినిమాలో దీపికా షారుక్‌ల మద్య ఈ షాట్ కాపీ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది.) వహిదా కేరికేచర్ మాత్రమే స్క్రీన్‌పై కనపడుతూ ఓ అద్భుతమైన ఫీల్ ఇస్తుంది ఇక్కడ. అతి సాధారణమైన వహీదా రూపంలో ఓ దైవత్వాన్ని ఈ షాట్లో చూపిస్తారు గురుదత్. ఇది నాకు తెలిసి ఎవరూ సాహసించని, చూపించలేని అద్భుతం. ఈ షాట్‌లో వహిదాని ఇలా చూపించి ఆమె భవిష్యత్తును సినిమాలలో సుస్థిరం చేసారు దర్శకులు. ఆమెని ఈ మేకప్‌లో ఇలా చూస్తున్నప్పుడు అచ్చంగా తాను వెతుకుతున్న పార్వతి ఎదురుగా వచ్చి నిలుచుందనిపిస్తుంది సురేష్‌కు. శరత్ చంద్ర నాయిక పారో ఇలాగే ఉండేది అనిపిస్తుంది అతనికి. తనను చూసి మైమరచి పారో అని పిలిచిన సురేష్‌ని అప్పుడు తన పేరు శాంతి అని చెప్పి పరిచయం చేసుకుంటుంది ఆమె. అప్పటి దాకా ఆమె పేరు కూడా ప్రేక్షకులకు పరిచయం కాదు.

(సురేష్ సిన్హా కళ్ళకు శాంతిలో కనిపించిన పారో)

ఇక్కడ సురేష్ శాంతిల మధ్య జరిగే సంభాషణలో శాంతికి ప్రపంచంలోని డబ్బు పిచ్చి, లోభం ఇంకా అంటలేదని అర్థం అవుతుంది. ఆమెను గమనించిన సురేష్ ఆమె మాటలన్నీ విని నీవు పారోకి సరిగ్గా సరిపోతావు అని చెబుతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది ఒక ముఖ్య విషయం ఉంది. తాను చేస్తున్న చిన్న ఉద్యోగం గురించి గర్వంగా చెప్పుకుంటున్న శాంతికి ఆ స్టూడియోలో దానికి పది రెట్లు జీతం వస్తుందని సురేష్ చెప్పినప్పుడు ఆమె ఆశ్చరపోతుంది. ఒంటరి అమ్మాయికి ఇంత డబ్బు ఎందుకు అని ఆమె అన్నప్పుడు ఆమె గురించి వివరాలు అడుగుతాడు సురేష్. ఆమె అనాథ శరణాలయంలో పెరిగిందని, స్వెటర్లు అల్లుకుంటూ చదువుకుందని తెలుసుకుంటాడు సురేష్. అన్ని విని చివరకు నీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత నాకు చాలా నమ్మకం కలుగుతుంది నీవు పార్వతి పాత్రకు జీవం పోస్తావు అంటాడు.

ఈ వ్యక్తిగత సంభాషణలో కూడా సురేష్ ఆమెలో ఆ పారో పాత్రకు సంబంధించిన లక్షణాలను చూస్తున్నాడు తప్ప ప్రపంచంలోని కష్ట నష్టాలను కాదు. ఒక నటి ఓ పాత్రకు జీవం పోయాలంటే లోపల నుంచి ఆ పాత్రకు సంబంధించిన కొన్ని లక్షణాలు ఆమెలో ఉండి తీరాలని నమ్మే దర్శకులు గురుదత్. మరో వ్యక్తితో సాధారణ సంభాషణ జరుపుతున్నప్పుడు కూడా తన సినిమా అనే ప్రేమ్ లోనుంచి పక్కకు రాలేకపోవడం ఆయన నిబద్ధత. అయితే ఇదే నిబద్ధత సినిమా పరంగా ఎంతగా సహాయపడగలదో వ్యక్తిగతంగా అంతగా నష్టపరుస్తుంది కూడా. ఈ పరిణామాలు గురుదత్ జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి.

(తన జీవిత కథను సురేష్ సిన్హాకు చెబుతున్న శాంతి)

ఓ ఆడపిల్ల తన జీవితపు కష్టాలు చెబుతున్నప్పుడు అక్కడ కూడా ఆయనకు శాంతి అనే అమ్మాయి కాకుండా, కేవలం పారో కనిపించడం ఆయన పనిలో లీనమవుతున్న విధానాన్ని సూచిస్తుంది. ఈ టోటల్ ఇన్వాల్వ్‌మెంట్ గురుదత్ సహజ లక్షణం. అదే సురేష్ సిన్హాలో ఇక్కడ కనిపిస్తుంది. ఈ సీన్లో కుర్చీలో కూర్చున్న సురేష్, ఆయన ముందు నేలపై కూర్చున్న శాంతిల శరీర భాష వీరిద్దరి మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని సూచిస్తుంది. ఒక దేవుడు, ఓ భక్తురాలు, లేదా ఓ గురువు ఓ శిష్యురాలు అనే స్థాయిలో ఉంటుంది ఈ అతి మామూలు పరస్పర పరిచయ సంభాషణ. తాను నటించగలనని ఆమెకు నమ్మకం లేదు. కాని మళ్ళీ మళ్ళీ నువ్వు గొప్పగా పారోలా నటించగలవు అని చెబుతూ నన్ను నమ్మగలవా అని సురేష్ అన్నప్పుడు “జీవితంలో మొదటిసారి నా కన్నా మరొకరి పై నమ్మకం కలుగుతుంది” అని జవాబిస్తుంది శాంతి. పారో డైలాగు ఫైల్‌ను ఆమెకు ఇస్తాడు సురేష్. ఆ ఫైలు చూస్తూ తల వంచుకుని కూర్చున్న శాంతి, ఆమెను చూస్తున్న సురీష్, పూర్తి చీకటీలో ఓ పక్క కాస్త వెలుగుతో ఉన్న ఈ కారికేచర్ షాట్ ఈ సినిమాలో వచ్చే మరో అద్భుతం. ఈ ఒక్క షాట్ హిందీ సినీ చరిత్రలో సజీవంగా నిలిచిపోయింది. ఆ తరువాత దేవదాస్ సినిమా షూటింగ్ జరిగిందని, సురేష్ దర్శకత్వంలో శాంతి నటించిందని చెప్పడానికి కెమెరా లైట్ల మధ్య కొన్ని షాట్లు కదిలిపోతూ కనిపిస్తాయి.

(కాగజ్ కే ఫూల్ సిగ్నేచర్ షాట్ ఇది)

ఇక్కడ సీన్ మారి మళ్ళీ రేస్ కోర్సు వైపుకు వెళుతుంది. రాకేష్ గుర్రప్పందాలు ఆడుతూ ఉంటాడు. ప్రొడ్యూసర్, అతని భార్యతో కలిసి శాంతి అక్కడకు వస్తుంది. రాకీని శాంతికి పరిచయం చేస్తారు వాళ్ళు. శాంతిని ఈ ధనికుల ప్రపంచానికి పరిచయం చేయడం తమ కర్తవ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు ఆ జంట. ఇక్కడ వహీదా రెహ్మాన్‌తో కనిపించే నటి రూబీ మేయర్స్ ఉర్ఫ్ సులోచనా దేవి. ఈమె సైలెంట్ సినిమాలలో ఓ వెలుగు వెలిగిన నటి. 1973లో ఈమెకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా లభించింది. ఈ సినిమాలో ఈమెను చిన్న పాత్ర కోసం అయినా గురుదత్ కోరి తెరపైకి తీసుకువచ్చారు. సినిమాలు లేక డిప్రెషన్లో ఉన్న నటికి తన వంతుగా ఓ చిన్న పాత్ర ఇచ్చారు గురుదత్. అంతకు ముందు 1953లో గురుదత్ తీసిన ‘బాజ్’ సినిమాలో ఓ మహరాణి పాత్ర చేసారు సులోచన. ఆ పరిచయం కారణంగా ఈ తొలి సినిమాస్కోప్ సినిమాలో వచ్చిన అవకాశాన్ని ఆమె చిన్న పాత్ర అయినా సరే ఇష్టంగా ఒప్పుకుని చేసారు. అయితే ఈ గుర్రం పందాల సీన్ ఈ సినిమాకు మాత్రం అనవసరం అనిపిస్తుంది.

తరువాతి సీన్‌లో ప్రొడ్యూసర్ ఇస్తున్న పార్టీలో పూర్తి ఆధునిక వేషధారణతో అందరి మధ్యకు శాంతిని తీసుకువస్తుంది సులోచనా దేవి. హాలులో అందరితో సినిమా హీరోయిన్‌గా శాంతిని పరిచయం చేస్తాడు ప్రొడ్యూసర్. కాని వారందరి మధ్య ఇబ్బందిగా ఫీల్ అవుతుంది శాంతి. అందరి మధ్యన సురేష్ కోసం వెతుక్కుంటుంది. అలస్యంగా తన ఆలోచనలలో తానుంటూ లోపలికి వస్తాడు సురేష్. సిన్హా సాబ్ అని అతన్ని చూసి పలకరిస్తుంది శాంతి. ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు సురేష్. ఇక్కడి రా అని అధికారంగా పిలుస్తాడు. ఆమె కురులను, గోళ్ళను చూసి ఇదంతా ఏంటి అని తిడతాడు. ఈ పార్టీకి వాళ్ళు…. అని ఏదో చెప్పబోతున్న శాంతిని చూసి ఇప్పుడు పని కన్నా పార్టీలపై నీ దృష్టి ఎక్కువయిందా అని అడుగుతాడు. ఈ డాబులు నీపై ఇంత తొందరగా ప్రభావం చూపుతాయని నేను అనుకోలేదని కోపంగా తిరిగి వెళ్ళిపోతాడు. అతన్ని వెంబడించిని శాంతి వైపు తిరిగి రేపు నీకు షూటింగ్ ఉంది. పారోగా నటించాలి నువ్వు. ఒక సాధారణ భారతీయ స్త్రీలా కనిపించాలి. ఈ జుట్టూ ఈ గోళ్ళూ ఈ రంగు పది రోజులకు కాని వదలదు, ఈ వేషంలో కోతిలా ఉన్నావు నువ్వు. మంచి అమాయకమైన మొహాన్ని రంగులతో పాడు చేసావు. ఇతరుల మాట వినబోయే ముందు కనీసం నన్ను అడగవచ్చు కదా, నీ సాదారణ మొహంలో ఓ వింత అందం ఉంది. అదంతా ఇప్పుడు పాడు చేసుకున్నావు అని చాలా కోపంగా అంటాడు సురేష్. ఈ సీన్‌లో సురేష్ ముఖాన్ని సైడ్ యాంగిల్‌లో చూపిస్తూ శాంతి మొహం కెమెరా వైపుకి ఉంటుంది. సురేష్ తిట్టడంతో ముందు భయం ఆమె ముఖంలో కనిపిస్తుంది అది దుఖంలోకి మారుతుంది. చివర్లో నీ సాధారణ మొహంలో ఓ వింత అందం ఉంది అన్నప్పుడు ఆమె మొహంలో ఓ తృప్తి కనిపిస్తుంది. మూర్తి కెమెరా వహీదా మొహంలో ఇన్ని భావాలనూ ఈ ఒక్క షాట్‌లో చూపించే విధానం చాలా బావుంటుంది. కాకి హంసను అనుకరించడం చూసాను కాను హంస కాకులను అనుకరించడం మొదటి సారి చూస్తున్నా అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సురేష్. తన మెడలో నగలను అక్కడికక్కడే తీసేస్తుంది శాంతి.

ఈ సీన్ గురుదత్ జీవితంలోనుండి తీసుకున్నది అని చెబుతారు అతని మిత్రులు. ‘గౌరి’ సినిమా షూటింగ్‌లో గురుదత్ గీతాదత్‌ని నటిగా సినీ రంగానికి పరిచయం చేయాలనుకున్నారు. అన్నీ బావుంటే అది మొదటీ సెవెంటీ ఎమ్.ఎమ్. సినిమా అయి వుండేది. కాని ఒక సందర్భంలో గీతాదత్ ఇలాగే ఎక్కువ మేకప్‌తో వచ్చి గురుదత్‌తో వాదనకు దిగారని ఆ కోపంతో గురుదత్ ఆ సినిమానే నిలిపి వేసారని చెబుతారు. అదే అనుభవాన్ని ఈ సినిమాలో గురుదత్ ఇలా చూపించారని అంటారు. కథ రాసుకునేటప్పుడు గురుదత్ తన జీవితంలో అనుభవాలను సీన్లుగా మార్చుకుంటూ కథ అల్లుకునే వారని ఈ అలవాటు అతని మొదటి సినిమా రోజుల నుండే అతనికి ఉండేదని గురుదత్‌తో పని చేసిన వారు చెబుతారు.

(ఎక్కువ మేకప్పుతో వచ్చిన శాంతిని చూసి తిడుతున్న సురేష్ సిన్హా)

తరువాత సీన్లో ఔట్ డోర్ షూటింగ్‌కి వెళ్ళాలని సురేష్ సిన్హా తయారయి కారులో స్టూడియో ముందుకు వస్తాడు. రాత్రి మేకప్ అంతా తీసేసుకుని శాంతి సురేష్ ముందుకు వస్తుంది. ఇప్పుడు సరిగ్గానే ఉన్నానా అని అడుగుతుంది. సురేష్ ఒక్క రాత్రిలో ఆ జుట్టూ రింగులన్నీ ఎలా వదిలించుకున్నావు అని ఆమెను అడుగుతాడు. రాత్రి అంతా అ జుట్టుతో కుస్తీ పడ్డాను అని చెబుతుంది శాంతి. రాత్రి పడుకోలేదా అని అడిగితే నాకు పని కన్నా పార్టీలపై శ్రద్ద పెరిగిందని మీరు అన్నారు కదా అందుకే రాత్రంతా కష్టపడ్డాను అని చెబుతుంది శాంతి. రాత్రి నిన్ను చాలా తిట్టాను కదా, ఎందుకో మరి నిన్నే ఇంత చనువుగా తిడతాను నేను. ఇంతకు ముందు ఏ హీరోయిన్ను కూడా ఇలా తిట్టలేదు. వాళ్లపై విసుక్కున్నానేమో కాని ఇలా తిట్టలేదు అంటాడు సురేష్. మీరు మర్యాదస్థులు కదా, ఏ మర్యాదస్థుడు కూడా పరాయి స్త్రీలను తిట్టలేడు అంటుంది శాంతి. ఆమె జవాబుతో ఖంగు తింటాడు సురేష్.

(శాంతికి తనపై ఉన్న ప్రేమ తెలుసుకున్న మొదటి క్షణం సురేష్ సిన్హా భావాలు)

తనను సురేష్ జీవితంలో ఓ భాగంగా అనుకుంటున్న ఆమెను కొత్తగా చూస్తాడు సురేష్. పైగా మీరు నన్ను ఎంత తిట్టిగా తప్పుగా అనుకోను మీరు అక్రోట్ లాంటి వాళ్ళూ పైకి గట్టీగా ఉన్నా లోపల మృదువైన వ్యక్తులు అంటుంది శాంతి. అపరిచితులుగా మొదలయి ఈ ప్రయాణంలో పరిచయస్థులుగా, ఆత్మీయులుగా మరిన ఈ ఇద్దరు మనుషుల మనసులోని ఆనందాన్ని ఈ కారు వెనుక వస్తున్న కొందరు కాలేజీ యువతీ యువకుల ఆనందపు గీతంలో చూపిస్తారు గురుదత్. గురుదత్ సినిమాలో ఇలా బైటి వ్యక్తుల ద్వారా హీరో హీరోయిన్ల మనసులోని భావాలను వ్యక్తీకరించే విధానం ప్రతి సినిమాలో ఏదో ఓ సందర్భంలో కనిపిస్తుంది. ‘కాగజ్ కే ఫూల్’లో ఆ సందర్భం ఇక్కడ వస్తుంది.

‘సన్ సన్ సన్ వో చలీ హవా.. చుప్ చుప్ కానో మే కుచ్ కహా’ అంటూ సాగే ఈ గీతం ఆశా భోస్లే, ముహమ్మద్ రఫీల గానంలో వినిపిస్తుంది.

(సురేష్‌తో కారులో ప్రయాణీస్తున్న ఆనందంలో శాంతి)

ఈ పాట తరువాత సీన్ బీనా (సురేష్ భార్య) గదిలో మొదలవుతుంది. బొంబాయి నుండి ఓ ట్రంకాల్ వస్తుంది. రాత్రి పూట నిద్ర పాడు చేసిన ఆ ఫోన్ కాల్‌ని విసుగ్గా తీసుకుంటుంది బీనా. సురేష్‌కి యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది. అతన్ని తన దగ్గరకు పంపిస్తే తాను చూసుకుంటానని చెబుతుంది బీనా. కదిలే స్థితిలో సురేష్ లేడని తెలిసిన తరువాత అయితే నేనేమీ చేయలేను. నేనక్కడకు రాలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆమె. బొంబాయిలో ఫోన్ చేసిన సేథ్ అతని భార్య నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. శాంతి కూడా ఓ పక్కన నిలబడి ఈ మాటలు వింటూ ఉంటుంది. డాక్టర్ ఈ సమయంలో సిన్హా గారి దగ్గర ఎవరయినా ఉంటే బావుంటుంది అంటూ సరే ఓ నర్సుని ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సేథ్ అతని భార్య కూడా తమ ఇంటికి వెళూతూ శాంతిని తమతో రమ్మని పిలుస్తారు. నేను టాక్సీ మాట్లాడుకున్నాను వెళ్ళిపోతాను అని వారితో చెబుతుంది శాంతి.

అర్ధరాత్రి ఒంటి నిండా కట్లతో ఉన్న సురేష్‌కు మెలుకువ వస్తుంది. దాహం వేసి నర్సు ని పిలుస్తాడు. నర్స్ నిద్రలో ఉంటుంది. పనివాడు అన్వర్ కూడా నిద్రపోతూ ఉంటాడు. దాహం భరించలేక అలాగే నడుచుకుంటూ బైటికి వస్తాడు సురేష్. బైట కూర్చుని ఉన్న శాంతి అతనికి సహాయానికి వస్తుంది. ఆమెను నర్స్ అనుకుంటాడు సురేష్. బైట వర్షం పడుతుందా అని అడుగుతాడు. అవునన్న జవాబు విని శాంతితో పరిచయం అయిన ఆ రాత్రిని గుర్తుకు తెచ్చుకుంటాడు. అప్పుడే యాక్సిడెంట్ అయినప్పుడు శాంతి కూడా తనతో ఉందని అతనికి గుర్తుకు వస్తుంది. శాంతి ఎలా ఉందని నర్సును అడుగుతుతాడు. తాను పక్కనే ఉన్నానని, బాగానే ఉన్నానని బదులిస్తుంది శాంతి. తాగడానికి నీళ్ళు తెచ్చి ఇస్తుంది. నాకు దాహంగా ఉందని నీకెలా తెల్సు అని అడుగుతాడు సురేష్. మీరు నీళ్ళు తాగి పదమూడు గంటలు అయింది. ప్రతి రెండు గంటలకు మీరు నీళ్ళు తాగుతారని నాకు తెలుసు అని బదులిస్తుంది శాంతి. ఒక దుప్పటి తీసుకొచ్చి సురేష్‌కి కప్పుతుంది. పనివాళ్ళెక్కడ అని అడిగినప్పుడు అర్ధరాత్రి రెండు అయింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారని జవాబిస్తుంది శాంతి. చాలా రాత్రి అయింది శాంతి డ్రైవర్ని లేపి ఇంటికి వెళ్ళిపో అంటాడు సురేష్. అక్కడే ఉండాలన్న శాంతి ముఖంపై కొంత నిరాశ కనిపిస్తుంది. నేనిక్కడుండడం మీకు ఇష్టంలేదా అని ప్రశ్నిస్తుంది. నాకు అంటూ ఏదో చెప్పబోయే నా వలన నీవు ఎటువంటి అసౌకర్యానికి గురి అవడం నాకిష్టం లేదు అని చెబుతాడు సురేష్. అతని కుర్చీ పక్కన కూర్చిని శాంతి అలా అయితే నన్ను వెళ్ళమని చెప్పవద్దు అని బ్రతిమిలాడుతుంది. కాదు నీ మంచి కోసమే నీవిక్కడి నుంచి వెళ్ళాలి అని గట్టిగా బదులిస్తాడు సురేష్. శాంతి మౌనంగా వెళ్ళిపోతుంది. ఆమెను పిలుస్తూ నిలబడే ప్రయత్నంలో తూలి పడబోయిన సురేష్‌ను నర్సు వచ్చి లోపలికి తీసుకుని వెళుతుంది.

సురేష్ శాంతిల అనుబంధాన్ని చూపించే ఈ సన్నివేశంలో అక్కడ పాత్రలు మాటలాడుతున్న దాని కన్నా వారి పెదవులు పలకని భావాలు ప్రేక్షకులు అర్థం చేసుకుంటే వారిద్దరి నడుమ ఉన్న అనుబంధం లోని దగ్గరతనం అర్థం అవుతుంది. ప్రేమకు సంబంధించిన సీన్లను చిత్రీచేటప్పుడు గురుదత్ దర్శకత్వం వహించిన చాలా సీన్లలో ఒక సూపర్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇది పట్టుకోవడం, తెరపై చూపడం అందరికీ చేతకాదు. ఆయన సినిమాలలోని ఈ ప్రేమ చిత్రీకరణ మాత్రం గురుదత్ అభిమానులకు మర్చిపోలేని అనుభవం.

తరువాతి సీన్ సురేష్ కూతురు పమ్మీ స్కూల్‌లో మొదలవుతుంది. కొందరు ఆడపిల్లలు ఓ సినిమా పత్రిక చదువుతూ నవ్వుతూ ఉంటారు. క్లాసులోకి పమ్మీ వస్తుంది. మీ నాన్నగారి గురంచి ఈ మేగజీన్‌లో రాసారు అని చెప్తారు ఆ పిల్లలు. పైగా ఆ మాగజిన్‌లో శాంతి, సురేష్‌ల మధ్య ఏదో ఉన్నదని రాసిన గాసిప్ కాలమ్‌ను చదివి పమ్మీకి వినిపిస్తారు. పమ్మీ కోపంతో తండ్రిని వెనకేసుకొస్తున్నప్పుడు పిల్లలు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వలేకపోతుంది. కోపంతో పిల్లలని కొట్టడం మొదలెడుతుంది. మందలించిన టీచర్ ముందు నుంఛి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.

సీన్ మళ్ళీ స్టూడియోకి మారుతుంది. హిందీ సినిమాలలో వచ్చే అద్భుత సన్నివేశలలో ఇది ఒకటి నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు సినీ అభిమానులు. ఈ ఒక్క సీన్ ఎన్నిసార్లు చూసినా ప్రతి సారి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. చీకటిగా ఉన్న స్టూడియో తలుపు తీసుకుని చేతి కట్టుతో లోనికి వస్తాడు సురేష్. మొత్తం చీకటిగా ఉండి కేవలం తలుపు దగ్గర మాత్రమే వెలుగు కనిపిస్తూ ఉంటుంది. కెమెరా స్టూడియో పై నుండి షాట్ షూట్ చేస్తుంది. ఒంటరిగా నడుచుకుంటూ వచ్చిన సిన్హా తన డైరెక్టర్ కుర్చీలో కూర్చుంటాడు. అతనికి వెనుక కొంత దూరంలో మరో కుర్చీలో కూర్చుని మౌనంగా స్వెటర్ అల్లుకుంటూ ఉంటుంది శాంతి. క్రింద నీడిల్ పడిన చప్పుడుకి వెనుకకు తిరుగుతాడు సిన్హా. శాంతిని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. ఈ సమయంలో ఎవరూ స్టూడియోకి రారు, నువ్వింత తొందరగా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. మీరు కూడా వచ్చారు కదా అంటుంది శాంతి. అది నా అలవాటు షూటింగ్‌కి రెండు గంటల ముందే వస్తాను అన్న సురేశ్ మాటకు నాకు తెలుసు అని జవాబిస్తుంది శాంతి. అహా ఇంకేం తెలుసు నా గురించి అని అడుగుతాడు సురేష్. అన్నీ తెలుసు అని శాంతి అన్న మాటకు అందుకేనా ఆ రాత్రి తరువాత మళ్ళీ నేనెలా ఉన్నానో చూడడానికి కూడా నువ్వు రాలేదు అని అడుగుతాడు సురేష్. మీరే వద్దన్నారు కదా అంటుంది శాంతి. ఆ రాత్రి వెళ్ళిపోమ్మన్నాను, మరుసటి రోజు రావద్దని అనలేదు కదా అంటాడు సురేష్. ఎంత చక్కటి వాక్యమో ఇది. ఈ వాక్యం కోసం ఈ సీన్ చాలా సార్లు చూడడం నాకిష్టం. ప్రేమను ఇంత అద్భుతంగా కూడా వ్యక్తీకరించవచ్చని చెప్పగలిగే మరో దర్శకుడు నాకు ఇప్పటి దాకా కనపడలేదు. నేను రావాలని కోరుకున్నారా అని సంభ్రమంగా అడుగుతుంది శాంతి. ఆమెలోని ఆనందాన్ని చూసి లేచి నిలబడతాడు సురేష్. ఆమె చేతిలో అల్లుతున్న స్వెటర్‌ని చూస్తూ ఇది ఎవరి కోసం అల్లుతున్నావు అని అడుగుతాడు. ఒకరి కోసం అన్న జవాబు విని ఆడవారికా మగవారికా అని నవ్వుతూ అడుగుతాడు. మగవారికే అని బదులిస్తుంది శాంతి. ఇంతకు ముందు ఈ ప్రపంచంలో నీకు ఎవరూ లేరని అన్నావు కదా మరి ఇది ఎవరికి అని అడుగుతాడు సురేష్. అతనూ నా లాంటి వాడే. పూర్తిగా ఒంటరి అని జవాబిస్తుంది శాంతి. ఆమె మనసు తెలుసుకున్న సురేష్ అలజడితో కాస్త దూరం వెళ్ళి సిగార్ వెలిగించుకోవాలనుకుంటాడు. ఒక చేతితో సాధ్యం కాదు. పరుగెత్తుకు వచ్చి శాంతి అతని పైప్ వెలిగిస్తుంది. ఆమె నుండి కొంత దూరం వెళ్ళి సురేష్ “శాంతి నీకు తెలియదేమో, నేను వివాహితుడను” అని అంటాడు. ఆమె తెలుసు అని బదులిస్తుంది. ఇక ఏమీ చెప్పలేక వెనుతిరుగుతాడు సురేష్.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here