Site icon Sanchika

మధురమైన బాధ – గురుదత్ సినిమా 3 – బహురాణీ

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం గురుదత్ నటించిన ‘బహురాణీ’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

బెంగాలీ నవల ‘స్వయంసిద్ధ’ అధారంగా తీసిన సినిమా ‘బహురాణీ’

[dropcap]మ[/dropcap]ణిలాల్ బెనర్జీ, బెంగాలీలో రాసిన ‘స్వయంసిద్ధ’ నవల ఆధారంగా తీసిన సినిమా ‘బహురాణీ’. 1963లో వచ్చిన ఈ సినిమా కన్నా ముందుగా ఇదే కథతో తెలుగులో ‘అర్ధాంగి’ అన్న సినిమా వచ్చింది. ‘స్వయంసిద్ధ’ నవలను తెలుగులో మద్దిపట్ల సూరి అనువాదం చేసారు. 1955లో తెలుగు అనువాదం ఆధారంగా పి. పుల్లయ్య గారు ఏ.ఎన్.ఆర్., సావిత్రి, గుమ్మడి, శాంతకుమారిలతో తీసిన ‘అర్ధాంగి’ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి. తరువాత 1956లో ‘పెన్నిన్ పెరుమై’ పేరుతో ఈ సినిమాను పుల్లయ్య గారే తమిళంలో కూడా తీసారు. ఇదే సినిమాను టి. ప్రకాశరావుగారు గురుదత్, మాలా సిన్హా, లలితా పవార్, ఫిరోజ్ ఖాన్, నాజిర్ హుసేన్ లతో హిందీలో ‘బహురాణీ’గా పునఃనిర్మించారు. హిందీలో కూడా ఈ కథ విజయం సాధించింది.

మనకు కొన్ని కథలు నచ్చితే తరాలు మారుతున్నా, అదే కథను ఎన్నో సార్లు సినిమాలుగా తీసిన సందర్భాలు ఉన్నాయి. ‘స్వయంసిద్ధ’ నవల అలా ఎన్ని సార్లు సినిమాగా వచ్చిందో తెలిసితే ఆశ్చర్యం వేస్తుంది. కోడలుగా ఇంటికి వచ్చిన స్త్రీ, భర్తను కుటుంబాన్ని మార్చుకోవడం అనే విషయం అందరికీ మంచి కథావస్తువు అవుతుంది కాబోలు. ఈ నవలను భారతీయ సినిమాలో పదకొండు సార్లు తెరపై చిత్రించారు మరి. అర్ధాంగి (తెలుగు – 1955), పెన్నిన్ పెరుమై (తమిళం – 1956), మల్లమ్మన పావాడా (కన్నడ – 1969) , స్వయంసిద్ధ (బెంగాలి – 1975), జ్యోతి (హిందీ – 1981), ఎంగ చిన్న రాస(తమిళం – 1987), బేటా (హిందీ – 1982), బినాని (రాజస్థాని – 1992), అబ్బాయిగారు (తెలుగు – 1993), అన్నయ్య (కన్నడ – 1993), సంతాన్ (ఒరియా – 1998). ఇవన్నీ ‘స్వయంసిద్ధ’ ఆధారంగా తీసిన సినిమాలే. సినిమాగా తీసిన అన్ని భాషల్లో కూడా విజయం సాధించిన కథ ఇది.

హిందీ ‘బహురాణీ’ సినిమాలో నటించినందుకు మాలా సిన్హాకు ఉత్తమ నటి నామినేషన్ లభించింది. అయితే ఆ అవార్డు మాత్రం ‘బందిని’ సినిమాకు గాను నూతన్ అందుకున్నారు. బహురాణీ సినిమా కథకు వద్దాం. జమిందార్‌కు రఘు, విక్రం ఇద్దరు కొడుకులు. రఘు తల్లి చిన్నప్పుడే చనిపోతే జమిందార్ మరో వివాహం చేసుకుంటాడు. అతని భార్యగా వచ్చిన రాజేశ్వరి రఘుని నిర్లక్ష్యం చేసి తనకు పుట్టిన విక్రం ఆస్తికి వారసుడు అవ్వాలని కుట్ర పన్నుతుంది. భర్తకు తెలియకుండా రఘుకి చిన్నప్పటినుండే నల్లమందు పాలల్లో కలిపి ఇస్తుంది. దీని వలన రఘు మానసికంగా పూర్తిగా ఎదగడు. అతన్ని పిచ్చివాడని అందరూ అంటుంటారు. చిన్న తమ్ముడు విక్రం అతనిపై తరుచు చేయి చేసుకుంటూ ఉంటాడు. రఘు పిరికివాడిగా, చదువు లేకుండా ఇంట్లో ఎందుకూ పనికి రానివానిగా మిగిలిపోతాడు. అతనికి ఆ ఇంట్లో ప్రేమను పంచేది అతన్ని చిన్నప్పటినుండి పెంచిన ఆయా మాత్రమే.

ఒక రోజు విక్రం శిస్తు వసూలు కోసం ఒక గ్రామం వెళతాడు. అక్కడ అతని పొగరుబోతుతనాన్ని ఎదిరిస్తుంది పద్మ అనే ఒక అమ్మాయి. పద్మ తండ్రి వైద్యుడు. పద్మ బాగా చదువుకుంది. ఆమెని ఊరివారందరూ అభిమానిస్తారు. అమెని ఎదిరించడం సాధ్యం కాక మౌనంగా వెనక్కు వస్తాడు విక్రం. పద్మలోని ఆత్మవిశ్వాసం విక్రంతో ఆ పల్లెకు వెళ్లిన ఆ ఇంటి నౌఖరు సుఖియాను ఆకర్షిస్తుంది. ఆమె గురించి జమిందారుకు చెబుతాడు. జమిందారుకి పద్మని చూడాలనిపించి ఆమె ఇంటికి వెళతాడు. పద్మ ధైర్యం, నిజాయితీ, నిర్భీతి అతన్ని ఆకర్షిస్తాయి. ఆమెను తన కోడలిగా చేసుకోదలచానని, తన కుమారున్ని ఆమె వివాహం చేసుకుంటే తమ కుటుంబ గౌరవం పెరుగుతుంది అని పద్మ తండ్రిని అడుగుతాడు. కూతురు అదృష్టానికి సంతోషించి ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు పద్మ తండ్రి. ఇంటికి వచ్చిన జమిందారు పద్మ సంగతి భార్యకు చెబుతాడు. విక్రంకి మరో జమిందారి స్త్రీతోనే వివహం జరగాలని. పేదింటి పిల్ల తన కొడుకు భార్యగా ఆ ఇంటికి రావడం తనకిష్టం లేదని ఈ సంబంధం తిరస్కరిస్తుంది రాజేశ్వరి. తన మాట పోతుందని జమిందారు అడుగుతున్నప్పుడు అయితే రఘుకి ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి జరిపించమని చెబుతుంది. తప్పని పరిస్థితులలో జమిందారు రఘుతో పద్మ పెళ్ళి జరిపిస్తాడు. పెళ్ళి జరుగుతున్నప్పుడు రఘుని చూసిన ఆ ఊరి వాళ్ళు గుసగుసలాడుకుంటారు. పద్మ తండ్రి ఆ పెళ్ళి ఆపు చేయాలని గొడవ చేస్తాడు. అయితే పద్మ మాత్రం తన వివాహం సగం జరిగిపోయినట్లే అని తాను రఘు భార్యనని, ఆ వివాహం ఆపడం మర్యాద కాదని, తన నుదిటి రాతను తాను స్వీకరిస్తున్నానని తండ్రికి చెప్పి అత్తవారింటికి బయలుదేరుతుంది.

అత్తిల్లు చేరిన పద్మకు రఘు గురించి దాయి కొన్ని నిజాలు చెబుతుంది. ఇంటికి డాక్టరుని రానివ్వని మరిది అహంకారాన్ని, అత్తగారి అన్యాయాన్ని ఆమె గమనిస్తుంది. ఇంటిలో ఒక భాగాన్ని మూసివేసి అందులో ఉంటూ భర్తకి సపర్యలు చేస్తూ అతనికి చదువు నేర్పిస్తుంది. మామగారికి భర్తకు జరిగిన అన్యాయం తెలిసేలా చేస్తుంది. విక్రం డబ్బును దారాళంగా ఖర్చు చేస్తూ ఒక నాట్యగత్తెకు చేరువ అవుతాడు. అతనిపై రాజేశ్వరికున్న పిచ్చి ప్రేమ చూసి జమిందార్ బాధపడతాడు. ఎప్పటికన్నా పెద్ద కొడుకు కోడలే ఆమెను చేరదీస్తారని, విక్రం ఆమె అమాయకత్వాన్ని వాడుకుంటున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తాడు. రాజేశ్వరి భర్త మాట వినదు. జమిందారు మరణించబోయే ముందు ఆస్తి రఘు పేరున రాస్తాడు. ఇది తెలిసి విక్రం తండ్రి చనిపోయిన తరువాత అతని అంతక్రియలకు కూడా రాడు. అతన్ని తీసుకురావడానికి వెళ్ళిన రఘుతో పద్మ ఆ ఇంట ఉంటే తాను కాలు పెట్టనని చెబుతాడు. పద్మ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు, ఆమెతో పాటు రఘు కూడా పద్మ తండ్రి వద్దకు వెళ్ళిపోతాడు. విక్రం తాను మోహించిన చందాతో పాటు ఇంటికి తిరిగి వస్తాడు. చందా కుటుంబం కూడా అమెతో పాటు ఆ ఇల్లు చేరతారు. ఒక నాట్యగత్తెతో ఇల్లు చేరి ఆ ఇంటిని గుల్ల చేస్తున్న విక్రంను చూసి రాజేశ్వరి బాధపడుతుంది. ఇంట్లో ఉండలేక ఇంటి బైట దాయి దగ్గరకు చేరుతుంది. రఘు వ్యవసాయం చేస్తూ భార్యతో తృప్తిగా జీవిస్తూ ఉంటాడు. తల్లి పరిస్థితి తెలుసుకుని ఆమె వద్దకు వచ్చి విక్రంకు, రఘు పద్మలిద్దరు బుద్ది చెప్పి అతన్ని మార్చడం సినిమా ముగింపు.

రఘుగా గురుదత్ నటన బావుంటుంది. ఇది పూర్తిగా స్త్రీ ప్రాధాన్యత ఉన్న సినిమా. ఒక అమాయకుడిగా, మతి లేనివానిగా హిందీలో స్టార్డమ్ ఉన్న నటులు అప్పట్లో చేయడానికి సందేహించిన పాత్ర ఇది. గురుదత్ మాత్రం చాలా భాగం ఇటువంటి పాత్రలు ఎన్నుకుని చేసేవారు. ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’, ‘సౌతేలా భాయి’, ‘భరోసా’, ‘సుహాగన్’ ఇలా చాలా సినిమాలలో అమాయకమైన పాత్రలు వేశారాయన. హీరోయిక్ పాత్రలలో వారు ఎప్పుడు కనపడలేదు. ఆ పాత్రలలోని ఒంటరితనాన్ని, అసహాయతను ఆయన ఓన్ చేసుకున్నారేమో అనిపిస్తుంది వారి పాత్రలన్నీ స్టడీ చేస్తుంటే.

ఈ సినిమాలో ఎనిమిది పాటలను సాహిర్ లుధియాన్వి రాసారు. సాహిర్ ఎటువంటి కథలోనయినా తన భావజాలాన్ని చొప్పించడంలో దిట్ట. ఈ సినిమాలో కూడా సమసమాజాన్ని కోరుతూ “బనా ఐసా సమాజ్” అనే పాట ఉంటుంది. సాహిర్ నైజం తెలిసిన వారికి ఇలాంటి పాట ఈ సినిమాలో, ఇటువంటి కథ మధ్యన ఉండడం పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అతని పాటలను నిశితంగా గమనించే అభిమానులకు ఎక్కడా లొంగని సాహిర్ ఆలోచనలు ప్రతిసారి ఆనందింపజేస్తాయి. సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా పాటలు   మంచి పాటలు. సాహితీపరంగా ఉత్తమ పాటలని చెప్పవచ్చు. “ఉమ్ర్ హువా తుమ్ సే మిల్కే” అన్న డ్యూయెట్ నుంచి “ఈతల్ కె ఘల్ మే తీతల్” అనే పాట దాకా గమనిస్తే ప్రతి పాట వైరుద్యం ఉన్న పాట.  సీ రామచంద్ర లతాల కలయికలో వచ్చిన అత్యుత్తమమయిన పాటల జాబితాలో ఈ సినిమాలోని బల్మా అనాడీ మన్ భాయే అనే పాట వుంటుంది. రాగ హేమంత్‌లో కూర్చిన ఈ పాటలో లతా స్వరం తీగలాగా మెరుపుల మెలికలు తిరుగుతుంది. రాగంలోని ఒక్కో స్వరాన్ని లత స్వరం ప్రేమగా స్పృశించి ఎంతో ఆత్మీయంగా పలుకుతుంది. ఆరంభంలో రాగం, చివరలో హై పిచ్ వింటే ఎందుకని సినీ గేయ ప్రపంచంలో హిమాలయం లత అన్నది అర్ధమవుతుంది. ఈపాట అల్బేలా సినిమాలోని బల్మా బడా నాదాన్ హై పాట తో పోలిస్తే సీ రామచంద్ర లతల కలయికలో వచ్చిన పాటల గొప్పతనం తెలుస్తుంది. అల్బేలా లో అలిగిన నాయకుడిని నవ్వించాలని పాడుతుంది. బహురాణిలో అమాయకుడయిన భర్తను ఆకట్టుకోవాలని పాడుతుంది. ఈ రెండు పాటల్లో బాణీని, వాడిన వాయిద్యాలను లత గొంతు పలికిన భావాలను గమనిస్తే మన సినీ కళాకారులు సృజించిన అత్యద్భుతమయిన సున్నిత భావాల మధురీ ప్రపంచ స్వరూపం అవగతమవుతుంది. ఇదే సినిమాలో మరో హృద్యమయిన సన్నివేశంలో అతి గొప్ప పాటను సృజించాడు సీ రామచంద్ర. తొలిరాత్రి. భార్య పక్కనుంది కాబట్టి తనకు నిద్ర పట్టటంలేదంటాడు అమాయక భర్త. ఆ సమయమలో కొత్త పెళ్ళి కూతురు పసిపిల్లవాడిలాంటి భర్తకు తల్లిగా జోలపాట పాడుతూ, ఆ పాటలో తమ మనోవేదనను వ్యక్త పరుస్తుంది. అత్యద్భుతమయిన గేయ రచనకు అంతే అత్యద్భుతమయిన బాణీ కుదిరింది. భావాలను చిందించే లతా స్వరం తోడయింది. ఈ సన్నివేశం ఒక మరపురాని సన్నివేశంగా రూపుదిద్దుకుంది. మైన్ జాగూ సారి రైన్ సజన్ తుం సో జావో అంటూ ఆరంభమయ్యే ఈ పాటలో సాహిర్, సాయంత్రమ్నుండి ఉదయం వరకూ గడచే , మధురమైన కలయిక ఘదియలను నేను మేల్కొని గడుపుతాను, నువ్వు నిదురించు ప్రియతమా అనిపిస్తాడు నాయికతో. హృదయం కరిగి నీరై పోతుంది. చంద్రుడి వెన్నెల వెలుగు తగ్గింది. ఆకాశంలో తారల తళుకు తగ్గింది. పూలపాంపుపైని అందమయిన మల్లెలు వాడిపోయాయి. తెరచుకున్న పెళ్ళికూతురు భాగ్య ద్వారాలు మూసుకుపోయాయి. కళ్ళు తెరచుకుని వున్నా కణ్ణీళ్ళు కారుతున్నాయి. నేను మేల్కొని వుంటాను, ప్రియతమా, నువ్వు నిదురించు అంటుంది నాయిక. ఈ చరణా విని చెమర్చని కళ్ళుండవు. అందుకే సాహిర్, తన గేయ రచనతో సినిమాలను హిట్ చేయగలిగిన ఏకైక గేయరచయితగా సినీరంగంలో నిలిచాడు. పాటలో నాయిక పరిస్థితి, మనస్థితి, దుస్థితి సర్వం ఎద కరిగేలా ప్రదర్శించాడు సాహిర్. సాహిర్ ఏదన్నా రాయగలరు అని చెప్పడానికి ఈ సినిమా పాటలను గమనించవచ్చు.

తన కెరియర్ చివర్లో గురుదత్ దక్షిణ భారతదేశపు దర్శకులతో పని చేయడం గమనిస్తాం. తెలుగు రీమేక్‌లలో వారిని చూస్తాం. ఈ సినిమాకు మాటలు అందించిన ఇందర్ రాజ్ ఆనంద్ కథలో మెలోడ్రామాను చాలా కంట్రోల్‌గా చూపించి ప్రతి పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసారు. సవతి తల్లి రాజేశ్వరి, భర్తతో మాట్లాడుతూ రఘుని తాను ప్రేమించాలని ప్రయత్నించినా తనను సవతి తల్లిగా చూసిన పరివారం అందరూ తనలో రేగిన కసికి, కోపానికి కారణం అని ప్రస్తావించే సీన్‌లో సమస్యలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం జరిగింది. ఇది అ తరువాత, ఇదే కథతో వచ్చిన సినిమాలలో కనిపించదు. చాలా అత్మాభిమానం ఉన్న పద్మలో ఎక్కడా పొగరు అనేది కనిపించకుండా ఆమెలో స్త్రీ సహజమైన శాంతాన్ని కూడా సమపాళ్ళల్లో చూపుతూ ఆ పాత్రలో మెలోడ్రామా డామినేట్ చేయకుండా సంభాషణలు రాసారు ఇందర్ రాజ్ ఆనంద్. నిశితంగా గమనిస్తే వీరి సంభాషణలు పాత్రల చిత్రీకరణకు బలంగా మారిన వైనం చూస్తాం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించింది మార్కస్ బార్ట్లే. మాలా సిన్హాను వీరు చిత్రించిన యాంగిల్స్ అన్నీ పాత్రను బాగా ఎలివేట్ చేయగలిగాయి. మాలా సిన్హా గురుదత్ కలిసి కొన్ని మంచి సినిమాలు చేసారు. ‘ప్యాసా’ కాకుండా ‘బహురాణీ,’ ‘సుహాగన్’ సినిమాలలో ఈ జోడి కనిపిస్తుంది. గురుదత్ మరణించేటప్పటికి వీరిద్దరు కలిసి నటించిన ‘బహారే ఫిర్ భీ ఆయేగీ’ నిర్మాణంలో ఉంది. గురుదత్ చనిపోయాక ఆయన చేసిన ఆ సగం సినిమాను వదిలేసి మొత్తం సినిమాను మళ్ళీ ధర్మేంద్రతో షూట్ చేసారు. వహిదా రెహ్మాన్ తరువాత గురుదత్ సినిమాలలో వారికి జోడిగా మాలా సిన్హా ఎక్కువగా కనిపిస్తారు.

సాధారణంగా సినిమా అంటే ధీరోదాత్తమైన పాత్రలు, ఆ పాత్రల జీవితంలో జరిగిన అపూర్వ సంఘటనలు, గొప్ప ప్రేమలు కథావస్తువులుగా ఉంటాయి. అయితే నిజజీవితంలో ఇవి అసాధారణాలు. మానవ సంబంధాల మధ్య నలిగిపోతున్న అసహాయ మగ పాత్రలను సినిమాకు కథావస్తువుగా తీసుకోవడం చాలా అరుదు. అసలు పురుషులలో ఆ సున్నితత్వం, అసహాయత, జీవితాలలో ఒటమి, దాని కారణంగా కుచించుకుపోయిన వారి పరిధి, ఇవి మనం కథలుగా తెలుసుకోవడానికి ఇష్టపడని విషయాలు. కాని ప్రపంచంలో ఇటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువ. వారి పక్షాన నిలిచిన వ్యక్తిగా గురుదత్‌ను గమనించాలి. అమాయకులు, సమాజంలోని అతి తెలివి, లౌక్యాల మధ్య మసలడానికి ఇబ్బంది పడే పాత్రలు మనకు వీరి సినిమాలలో కనిపిస్తాయి. అలాంటి పాత్రలు భారతీయ సినిమాలో హీరో మెటీరియల్ కాదు. పరిస్థితులను ఎదిరించలేని అసహాయత ఆ పాత్రలలో కనిపిస్తూ ఉంటుంది. దాని వెనుక వారిలో గూడుకట్టుకున్న ప్రేమ, ఎవరినీ నొప్పించలేని మనస్తత్వం, తమను తాము స్పష్టంగా వ్యక్తపరచుకోలేని ఒంటరితనం ఉంటాయి. ఎటువంటి గడుసుదనం, బ్రతకనేర్చినతనం ఈ పాత్రలలో కనిపించదు. తమ చుట్టూ ఉన్న సమాజం తమను దాటుకుని, తోసుకుని వెళ్ళిపోతుంటే గాయపడిన హృదయాలతో ప్రేమరాహిత్యంతో బాధపడే వ్యక్తులు వీరంతా. ప్రేమను వ్యాపారంగా ఇచ్చిపుచ్చుకునే వాయనంలా చూడగల లౌక్యం తెలియని ఇటువంటి వ్యక్తులు ప్రపంచానికి ఓటమిని కౌగలించుకున్న వ్యక్తులుగానే కనిపిస్తారు. భుజబలంతోనో, బుద్ధిబలంతోనో మనుషులను కట్టిపడేయాలనే ఆలోచన ఇటువంటి మనస్తత్వం ఉన్న వారికి ఉండదు. వీళ్లు నమ్ముకునేది హృదయబలాన్నే. కాని ప్రపంచానికి చాలా విషయాలలో హృదయం అవసరం ఉండదు. అందుకే ఇటువంటి వ్యక్తులను అందరూ ఒంటరిని చేస్తారు. కాని ప్రత్యేకించి అటువంటి పాత్రలనే గురుదత్ స్వీకరించి స్క్రీన్‌పై చూపించడం వీరి సినీ ప్రస్థానంలో గమనించవలసిన విషయం. ‘బహురాణీ’ లో వీరి రఘు పాత్ర కూడా అదే కోవకు చెందినది.

ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో అమాయకంగా కనిపించే రాజ్ కపూర్ నిజజీవితంలో పక్కా వ్యాపారి. కానీ, గురుదత్ నిజ జీవితంలోని వ్యక్తిత్వానికి, సినీ వ్యక్తిత్వానికీ నడుమ చాలా పోలికలు కనిపిస్తాయి. మిస్టర్ అండ్ మిస్సెస్ 55, ఆర్ పార్ వంటి సినిమాల్లో గడుసుదనం వున్నా అమాయకత్వం, నిజాయితీలు డామినేట్ చేసే పాత్ర, ప్యాసా, కాగజ్ కే ఫూల్ లలో అమాయకత్వం, నిజాయితీ తప్ప గడుసు దనం లేని, ఒక కోణంలోంచి చూస్తే, స్వీయాత్మ హననానికి పాల్పడే నిజాయితీ వున్న పాత్రలుగా పరిణమించి బహురాణి, భరోసా, చౌధవీక చాంద్, సాహబ్ బీబీ ఔర్ గులాం  వంటి సినిమాల్లో సరిగా జీవించలేని, జీవించటం తెలియని అమాయకుడి పాత్రలలోకి పరిణమించటం చూస్తే, గురుదత్ నిజ జీవితంలోని మానసిక వ్యవస్థకు, అతని సినిమా పాత్రలు దర్పణం పడతాయనిపిస్తుంది. చివరి సినిమాల్లో ఒక మహిళ అతని శక్తి అతను గుర్తించేట్టు చేస్తుంది. అలాంటి మహిళ అతని నిజ జీవితంలో లోపించటం బహుషా గురుదత్ జీవితం అర్ధాంతరంగా ముగియటానికి తోడ్పడిందనిపిస్తుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version