మధురమైన బాధ – గురుదత్ సినిమా 4 – సి.ఐ.డి.

0
2

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించిన ‘సి.ఐ.డి’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]సి.[/dropcap]ఐ.డి. 1956లో వచ్చిన సినిమా. గురుదత్, దేవానంద్‌ల మధ్య స్నేహం ఏర్పడినాక, వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ముందు దేవానంద్ హిందీ సినిమాలోకి ప్రవేశిస్తే, ఆయన గురుదత్‌కి డైరక్టర్‌గా అవకాశం ఇస్తానన్నారు. అలాగే గురుదత్ డైరెక్టర్ అయ్యాక దేవానంద్‌తో తన సొంత బానర్‌లో సినిమా తీయాలి. మాట ఇచ్చినట్లుగానే దేవానంద్ ‘బాజీ’, ‘జాల్’ సినిమాలకు గురుదత్‌కు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అలాగే సి.ఐ.డి సినిమాకు దేవానంద్‌కు హీరో వేషం ఇచ్చారు గురుదత్. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించమని తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన రాజ్ ఖోస్లాకు అవకాశం ఇచ్చారు గురుదత్. గురుదత్ బానర్‌లో హీరోగా దేవానంద్ చేస్తూ గురుదత్ దర్శకత్వం వహించాలనే కోరిక మాత్రం దేవానంద్‌కు తీరకుండా ఉండిపోయింది. గురుదత్ తీసిన సినిమాలన్నిటిలో ఆయన కనీసం ఒక కామియో పాత్రలోనన్నా కనిపించడం జరిగింది. సి.ఐ.డి. సినిమాకు మాత్రమే ఆయన కేవలం ప్రొడ్యూసర్‌గా మిగిలిపోయారు.

గురుదత్ సినిమాలలో పాటల చిత్రీకరణ గురించి నిశితంగా పరిశీలిస్తే, వీరి పాటలు సినిమాలోని సంభాషణలకు కొనసాగింపుగా కనిపిస్తాయి. కొన్ని సార్లు పాత్రలు పాటతోనే స్క్రీన్‌పై ప్రవేశించడం కూడా జరిగింది. ఈ పంథాను పూర్తిగా అనుకరించి తన సినిమాలలో ఉపయోగించుకున్నది ఒక్క రాజ్ ఖోస్లా మాత్రమే. హిందీ సినిమాలలో పాటలు అనవసరం అనిపించే వారికి గురుదత్ సినిమాలు పాఠాలు నేర్పిస్తాయి. పాత్రల మనోభావాలను అద్భుతంగా వ్యావహారిక సంభాషణలకు కొనసాగింపుగా గురుదత్ పాటలు చిత్రించిన విధానం గమనించవలసిందే. ‘ప్యాసా, ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’, ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. రాజ్ ఖోస్లా గురుదత్ ప్రభావంతోనే తన కెరియర్ కొనసాగించారని చెప్పవచ్చు. వారి సినిమాలు ‘వో కౌన్ థీ’లో ‘లగ్ జా గలే’ పాట గుర్తుకు తెచ్చుకుంటే, అ చిత్రీకరణలో గురుదత్ కనిపించి తీరతారు. అలాగే ‘మేరా సాయా’లో టైటిల్ సాంగ్ పూర్తిగా అ పాత్ర మనసును ఆవిష్కరిస్తుంది. “మై తులసీ తేరే ఆంగన్ కీ” సినిమా టైటిల్ సాంగ్ ఆ పాత్ర చెప్పాలనుకున్నదాన్ని అద్భుతంగా పాట ద్వారా వ్యక్తపరుస్తుంది. ఇలాంటి భావాలు స్క్రీన్‌పై వాచకంలో కన్నా గానంలో అద్భుతాలు పలికిస్తాయి. ఈ స్టైల్ రాజ్ ఖోస్లా గురుదత్ వద్ద పని చేస్తూ అలవర్చుకున్నదే. చాలా తక్కువ సినిమాలు తీసినా గురుదత్‌తో పని చేసిన వారంతా వారి ప్రభావంతోనే సినీ రంగానికి కొన్ని గొప్ప సినిమాలు ఇచ్చారన్నది విస్మరించలేని సత్యం.

సి.ఐ.డి. సినిమా కథ చెబుతూ రాజ్ ఖోస్లా దేవానంద్‌పై ఒక్క పాట కూడా ఉండకూడదన్న ప్రతిపాదన పెట్టారట. అంటే వారిపై పాటలు చిత్రీకరించినా ఆయన మాత్రం ఏ మాత్రం లిప్ మూమెంట్ ఇవ్వకూడదని, డైరక్ట్‌గా ఏ పాట పాడకూడదని అతని వాదన. దేవానంద్‌కి ఇది చాలా పెద్ద పరీక్ష. అప్పట్లో దేవానంద్ రొమాంటిక్ హీరో. అతను స్క్రీన్‌పై పాడే పాటల కోసమే కాలేజీ పిల్లలు సినిమాలు చూసేవారు. రాజ్ ఖోస్లా మాత్రం సి.ఐ.డి అఫీసర్ డ్యూయెట్లు పాడడం ఏంటి అని దేవానంద్ మాటలు కొట్టిపడేసారు. గురుదత్ కూడా రాజ్ ఖోస్లాకు నచ్చజెప్పాలని ప్రయత్నించినా అయన వినలేదు. గురుదత్ సినిమా డైరక్షన్ బాధ్యతలు రాజ్ ఖోస్లాకు వదిలేశారు కాబట్టి ఏం చేయలేక ఊరుకున్నారట. అంత నిబద్ధతతో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో గురుదత్ టీం పని చేసేవారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాని దేవానంద్ అలిగారు. తాను పాట పాడకపోతే ఎలా అని బెంగ పెట్టుకున్నారట. అప్పుడు జాన్ నిసార్ అఖ్తర్‌తో “ఆంఖో హీ ఆంఖో మే” అన్న పాట రాయించి, అటు రాజ్ ఖోస్లా తెరపై సృష్టిస్తున్న సి.ఐ.డి. హీరో పాత్ర వ్యక్తిత్వానికి భంగం కలగకుండా అలాగే దేవానంద్ రొమాంటిక్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూ ఈ పాటను మాత్రమే గురుదత్ డైరెక్ట్ చేశారు. కేవలం ఒక రెండు లైన్ల పల్లవి మాత్రమే దేవానంద్ పాడతారు. మిగతాదంతా గీతాదత్ గానంతో హీరోయిన్ షకీలాపై చిత్రించారు. కాని ఒక పెద్ద రొమాంటిక్ డ్యూయెట్ హీరో పాడినట్లు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. ఇది పాత హిందీ పాటలలో చాలా పాపులర్ పాటగా ఈ రోజుకీ వినిపిస్తూ ఉంటుంది.   సినిమాలో మిగతా పాటలన్నిటిలో హీరో స్క్రీన్‌పై కనిపిస్తున్నా, రొమాంటిక్ మూడ్ మెయిన్‌టెయిన్ అవుతూనే హీరో ఏ పాట పాడకుండా ఉండడం చూస్తాం. “లేకే పెహ్లా పెహ్లా ప్యార్” పాట వీధి పాటగాళ్ళతో పాడిస్తారు రాజ్ ఖోస్లా. మిగతావన్నీ వహీదా రెహ్మాన్, జానీ వాకర్‌పై చిత్రీకరించిన పాటలే. అయితే ప్రతి పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ ఒక్క పాట మాత్రమే జాన్ నిసార్ అఖ్తర్ రాసారు.  నస్రీన్ మున్ని కబీర్ తో జరిపిన సంభాషణలో తన తండ్రి రాసిన గొప్ప పాటల జాబితా చెప్తూ జావేద్ అఖ్తర్ ఈపాటను ప్రస్తావించారు. (టాకింగ్ ఫిలంస్ అండ్ సాంగ్స్: జావేద్ అఖ్తర్ ఇన్ కన్వెర్సేషన్ విత్ నస్స్రీన్ మున్ని కబీర్) సినిమాలో గేయ రచయితగా మజ్రూహ్ సుల్తాన్ పురి పేరు మాత్రమే కనిపిస్తుంది. దీనికి ఒక కారణం వుంది. సినిమాపాటలు రాసేందుకు ఒప్పుకునేముందు మజ్రూహ్ ఒక నియమం విధిస్తాడు. సినిమాలో పాటలన్నీ అతనే రాస్తాడు. ఒకవేళ అత్యవసరమై వేరే ఎవరైనా పాట రాయాల్సివచ్చినా గేయ రచయితగా పేరు మాత్రం మజ్రూహ్ పేరే వుంటుంది. తుంసా నహీ దేఖా సినిమాలో యూన్ తో హం నే లాఖ్ హసీన్ దేఖేహై అనే పాట రాసిన తరువాత సాహిర్ సినిమానుంచి తప్పుకున్నాడు. ఆతరువాత మజ్రూహ్ మిగతా పాటలన్నీ రాశాడు. కానీ, సినిమాలో గేయ రచయితగా మజ్రూహ్ పేరే వుంటుంది. జెవెల్ థీఫ్ సినిమాలో రులాకే గయా సప్నా మేరా పాట రాసిన తరువాత శైలేంద్ర మిగతా పాటలు వ్యక్తిగత సమస్యల వల్ల రాయలేనని తప్పుకున్నాడు. తరువాత పాటలన్నీ మజ్రూహ్ రాశాడు. కానీ, సినిమాలో గేయ రచయితగా మజ్రూహ్ ఒక్కడి పేరు  కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులలో మజ్రూహ్ ఈ నియమాన్ని సడలించలేదు. షాహ్‌జహాన్, పాకీజా, ఆర్జూ(1950) సినిమాల్లోనే మజ్రూహ్ పేరు ఇతర గేయ రచయితలతో కనిపిస్తుంది. గేయ రచయితగా మజ్రూహ్ గొప్పతనం ఏమిటంటే సినిమా పాటల్లో ఎక్కడా గేయ రచయిత కనిపించడు. సినిమాలో సందర్భం, పాత్రలు, పాత్రల భావాలు తప్ప గేయ రచయిత వ్యక్తిత్వం పాటల్లో కనిపించదు. అందుకే, ఈ సినిమాలో పాటలను బాణీలకి, నటీనటుల నటనకూ గుర్తుంచుకుంటారు కానీ, గేయ రచయితను స్మరించరు. అంటే తన స్వీయ వ్యక్తిత్వాన్ని సినిమా పాటలో మిళితం చేస్తాడన్నమాట. ఇది ప్రతి పాటలో కనిపిస్తుంది. ఏయ్ దిల్ హై ముష్కిల్ హై జీనా యహాన్ పాటలో మనకు జానీవాకర్ పాత్ర కనిపిస్తుంది. సమకాలీన సమాజంలోని ద్వంద్వ ప్రవృత్తులు, అనౌచిత్యాలపై విసుర్లు కనిపిస్తాయి. కహిన్ బిల్డింగ్ కహిన్ ట్రామే కహిన్ మోటార్ కహిన్ మిల్/ మిల్తా హై యహన్ సబ్ కుచ్ ఎక్ మిల్తా నహిన్ దిల్/ఇన్సాన్ క యహాన్ నహిన్ నామోన్ నిషాన్..అంటాడు మజ్రూహ్. బిల్డింగ్ లు, ట్రాములు అన్నె వున్నాయి. లెనిదొక్క హృదయమే , మనిషన్నవాడి జాడకూడా దొరకదిక్కడ అంటాడు. బేఘర్ కో ఆవారా యహన్ కహే హస్ హస్/ ఖుద్ కాటే గలె సబ్ కో కహె ఇస్కో బిజినెస్ అంటాడు. పనిలేకుండా తిర్రిగేవాడిని ఆవారా అని వెక్కిరిస్తారు.. కానీ మనషుల గొంతులు కోసేవాడి పనిని వ్యాపారం అంటారు. అతి గొప్ప వ్యంగ్యం!!! అలాగే బూజ్ మేరా క్యా నాం రే, లేకే పహెలా పహెలా ప్యార్, కహిన్ పె నిగాహేన్ వంటి పాటల్లోనూ చక్కని భావాలను అతి సామాన్యమైన పదాలలో సామాన్యుడు సైతం ఆనందించేలా గొప్పగా రాసారు మజ్రూహ్ సుల్తాన్‌పురి, అంతే గొప్ప సంగీతాన్ని అందించారు ఓ.పి. నయ్యర్.

ఓ.పి. నయ్యర్ పాటలకు చాలా వరకు పాశ్చాత్య బాణీలను అనుసరించి ఉంటాయి. గురుదత్ కూడా పాశ్చాత్య సినిమాలను ఎక్కువగా చూసేవారు. ఆ సినిమాల ప్రభావం వారిపై చాలా ఉండేది. టెక్నికల్‌గా ఎనో ప్రయోగాలు ఆయన తన సినిమాలలో చేయడానికి పాశ్చాత్య సినిమాల స్థాయిలో భారతీయ సినిమా ఉండాలన్న వారి తపనే కారణం. “చౌదవీ కా చాంద్” పాట కలర్లో చిత్రీకరించినా, “కాగజ్ కే ఫూల్” సినిమాను మొదటి సినిమా స్కోప్ మూవీగా భారతీయ ప్రేక్షకులకు అందించినా, వీ.కే మూర్తి ఫోటోగ్రఫీలో ఆ పాశ్చాత్య టెక్నికాలిటీని చొప్పించడానికి భారతీయ సినిమా స్థాయిని పెంచడానికి ఆయన చేసిన కృషి కనిపిస్తుంది. పూర్తి స్థాయి కలర్ సినిమా తీయాలని గురుదత్ వీ.కే మూర్తిని విదేశాలలో శిక్షణ కోసం “గన్స్ ఆఫ్ నావరోన్” (1961) టీమ్‌తో పని చేయడానికి కూడా పంపారంటే సినిమాపై గురుదత్ కున్న ప్రేమ అర్థం అవుతుంది. సినిమాను ఇంత పిచ్చిగా ప్రేమించిన వ్యక్తులు సినీ రంగంలో కూడా అతి తక్కువ కనిపిస్తారు. అంతటి శిక్షణ పొందారు కాబట్టే గురుదత్ మరణించిన తరువాత ఆయన చిత్రాలు విదేశాలలో ఖ్యాతి గడించిన తరువాత, వీ.కే. మూర్తి కి 2008లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ అవార్డు పొందిన ఒకే ఒక టెక్నీషియన్ మూర్తి. ఇది గురుదత్‌కి రావలసిన అవార్డు అని ఆయన అభిమానులందరికీ తెలుసు. ‘సి.ఐ.డి.’ సినిమాలో కూడా పాశ్చాత్య ప్రెంచ్ సినిమాలలో థ్రిల్లర్ల స్థాయిలో ఫోటోగ్రఫీ ఉండడం మనం గమనిస్తాం. అలాగే ఎక్కడా భారతీయత లోపించకుండా సినిమా నడుస్తుంది.

గురుదత్ సినిమాలకు ఓ.పి. నయ్యర్ అందించిన సినీ బాణీలను గమనిస్తే, విదేశీ ట్యూన్లను భారతీయం చేయమని గురుదత్ ఆయనను ప్రోత్సహించారన్న విషయం అర్థం అవుతుంది. ఇంగ్లీషు, స్పానిష్ పాటలను ఎక్కువగా వినే అలవాటు గురుదత్‌కి ఉండేదని ఆయనతో దగ్గరగా మసలినవారు చెబుతారు. ‘బాజీ’ సినిమాలో “బాబూజీ ధీరే చల్నా” అనే పాట స్పానిష్ పాట ‘క్విజాస్ క్విజాస్’ను పోలి ఉండడం చూస్తాం. ఇప్పటి యువతరం ఈ పాటను “ఇన్ ది మూడ్ ఫర్ లవ్” అని 2000లో వచ్చిన హాంగ్‌కాంగ్ సినిమాలో విని ఉంటారు. గురుదత్‌కి చాలా ఇష్టం అయిన ఈ పాట ట్యూన్ ను “బాజీ” సినిమాలో పాటకి ఓ.పి. నయ్యర్ కంపోజ్ చేసారు. అలాగే “యె హై బొంబే మెరీ జాన్” అనే పాట అమెరికన్ ఫోక్ పాట “ఓ మై డార్లింగ్ క్లెమెంటైన్” బాణీలో సాగుతుంది. హిందీలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచిపోయిన ఈ పాట నాగరికత ముసుగులో మనిషి సాగిస్తున్న స్వార్థపూరిత జీవితాన్ని చాలా గొప్పగా చిత్రీకరిస్తుంది. గీతా దత్, మొహమ్మద్ రఫీలు పాడిన ఈ పాట ఎప్పటికీ మరచిపోలేని గీతం.

“బూజ్ మెరా క్యా నామ్ రే” అనే శంషాద్ బేగం గీతం భారతీయ జానపద శైలిలో సాగే చక్కని పాట. ఇక “కహీ పే నిగాహే” అనే మరో శంషాద్ గీతం వహిదా రెహ్మన్‌పై చిత్రించిన హిట్ సాంగ్. హీరోను కాపాడే వాంప్‌గా వహీదా ఇందులో కనిపిస్తుంది. ఇది ఆమె మొదటి చిత్రం. రోజులు మారేయి సినిమాలో ఏరువాకా సాగారో పాటచూసి ముగ్ధుడయ్యాడు గురుదత్.ఆమెను ముంబాయి పిలిచాడు. హైదరాబాద్‌లో ‘మిస్సమ్మ’ సినిమా గురించి విని అది చూడాలని వచ్చిన గురుదత్ వహిదా రెహమాన్‌ను ఒక డైరెక్టర్ ఆఫీస్‌లో చూడడం ఆమెను తన ప్రొడక్షన్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో హీరోయిన్‌గా తీసుకోవడం జరిగింది. ఆమె పేరును మార్చాలని ప్రయత్నిస్తే వహిదా ఒప్పుకోలేదట. పదహారేళ్ళ వయసులోనే ఆమెలో తొంగి చూసే ఈ ఆత్మ విశ్వాసం గురుదత్‌ని ఆకర్షించింది. తరువాత సి.ఐ.డి. సినిమాలో తన దుస్తులు నచ్చలేదని, సభ్యతగా లేవని ఆమె రాజ్ ఖోస్లాతో వాదనకు దిగారు. ఆమె మొండి పట్టుదల ఎవ్వరికీ నచ్చలేదు. ఒక్క గురుదత్ మాత్రమే ఆమె కోసం ఆ దుస్తులను మరోసారి డిజైన్ చేయించారు. సభ్యతగా ఉండాలని ఆమె చేస్తున్న ప్రయత్నంలో ఆత్మవిశ్వాసం ఉందని నమ్మి ఆమెకు అండగా నిలిచారు గురుదత్. అయితే మొదటి సినిమా నుండే ఆమె ప్రభావంలో ఆయన ఎంతలా పడిపోయారో చూసినవారు మాత్రం ఆశ్చర్యపోయరట. కాని ఇతరులు చెప్పేదానిలో లాజిక్ ఉంటే వారిని సమర్థించడం గురుదత్ నైజం. అబ్రర్ అల్వీ విషయంలో కూడా అలాంటి తోడ్పాటే ఆయన ఎన్నో సార్లు ఇచ్చారు. ‘సి.ఐ.డి.’ సినిమా దర్శకత్వంలో రాజ్ ఖోస్లాకు అంతటి స్వేచ్చనే ఇవ్వడం గమనిస్తాం. తన అనుకున్నవారిని అంతగా సమర్ధించడం ఆయన నైజం. ‘సి.ఐ.డి.’ 1956 సంవత్సరానికి అతి పెద్ద కమర్షియల్ హిట్ అయిన సందర్భంలో గురుదత్ రాజ్ ఖోస్లా కు ఖరీదయిన ఫారిన్ కార్ బహుకరించారట. అంతగా తన టీంను ఆయన ప్రేమించారు. అయితే అలాంటి ఆదరణే తన విషయంలో ఆశించి ఆయన భంగపడడం కూడా ఆయన డిప్రెషన్‌కు కారణం అన్నది గురుదత్ జీవితపు అంశాలని గమనిస్తే అర్థం అవుతుంది.

ఈ సినిమాలో “జాతా కహా హై దివానే” అనే గీతా దత్ పాట ఒకటి ఉంటుంది. వహీదా రెహ్మాన్‌పై చిత్రించిన ఆ పాటలో ‘ఫిఫి’ అన్న ఫ్రెంచ్ పదం వస్తుంది. అందుకని సెన్సార్ బోర్డు ఈ పాట వల్గర్‌గా ఉందని దాన్ని బాన్ చేసారట. ‘ఫిఫి’ అంటే ప్రేమ లేదా స్నేహం అన్న అర్థం వస్తుంది. పంజరంలో ఉన్న పక్షులు, పిల్లలపై చూపే  ప్రేమగా కూడ ఫ్రెంచ్ భాషలో అర్థం వస్తుంది. ఈ పాటకు ముందు వహిదా, దేవానంద్‌ల మధ్య జరిగే సంభాషణలో పంజరంలోని పక్షి ప్రసక్తి వస్తుంది కాబట్టి ఆ సంభాషణలకు కొనసాగింపుగా ఈ పాట అనుకోవచ్చు. కాని ఒక స్త్రీ, తన హొయలతో ఈ పాట పాడుతూ సి.ఐ.డి. ఆఫీసరును లోబరచుకోవాలనే ప్రయత్నం అప్పట్లో వల్గర్‌గా సెన్సార్ బోర్డు భావించి, ఆ పాట సినిమాలో తీసేయించింది. ఇప్పుడు “ఊ అంటావా మామా”, “షీలా కీ జవానీ” లతో ప్రేక్షకులను రంజింపజేయడానికి సెన్సార్ అనుమతిస్తుంది మరి. ఇది బహుశా మనం సాధించిన ప్రగతికి గుర్తు కాబోలు.

కొన్నేళ్ళకు మళ్ళీ ‘సి.ఐ.డి.’ రిలీజ్ అయినప్పుడు ఆ పాట మళ్ళీ సినిమాలో చేర్చారు అంటారు. కాని ఆ వీడియో ఇప్పుడు లభ్యం అవట్లేదు. ఇప్పటికీ గీతా దత్ పాపులర్ పాటల్లో మాత్రం అది వినిపిస్తుంది. ఈ పాట సినీ ప్రపంచంలో ఎంత పాపులర్ అంటే 2015 లో వచ్చిన “బాంబే వెల్వెట్” అనే సినిమాలో ఇదే పాటను క్లబ్ సాంగ్‌గా హీరోయిన్ అనుష్కా శర్మపై చిత్రీకరించారు. దీన్ని ఈ సినిమాలో సుమన్ శ్రీధర్ అనే గాయని పాడారు.

సినిమా కథకు వస్తే ఒక నిజాయితీ అయిన పత్రికా ఎడిటర్, నగరంలోని ఒక ప్రముఖ వ్యక్తి నిజస్వరూపాన్ని బైటపెట్టే ప్రయత్నంలో హత్యకు గురి అవుతాడు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సి.ఐ.డి. ఇన్‌స్పెక్టర్ శేఖర్‌కు ఆయన చెప్పిన కొన్ని నిముషాలలోనే మరణిస్తాడు. అతన్ని కలవాలని వచ్చిన శేఖర్ లిప్ట్‌లో అతన్ని హత్య చేసిన వ్యక్తికి ఎదురవుతాడు. హత్య జరిగిన సమయంలో ఆ ఆఫీస్‍లో దొంగతనానికి వచ్చిన ఒక చిన్న దొంగ మాస్టర్ హంతకుడ్ని చూస్తాడు. అతన్ని గుర్తించి అతను అరెస్టు అవడానికి సహయపడతాడు. అయితే దీనికంతకూ కారణమయిన ఆ పెద్దమనిషి శేఖర్‌ను కేసునుండి తప్పించడానికి కామిని అనే అందగత్తెను ఉపయోగిస్తాడు. శేఖర్ ఆమె ఇవ్వచూపిన లంచానికి ఒప్పుకోడు. కామినీ తాను ప్రేమించిన రేఖ స్నేహితురాలని తెలుసుకుని ఆమెను వెంబడిస్తాడు. ఇది తెలిసి ఆ పెద్ద తలకాయ ఎడిటర్‌ని హత్య చేసి జైలులో ఉన్న హంతకున్ని హతమార్చి ఆ నేరం శేఖర్ పైకి వచ్చేలా ప్లాన్ చేస్తాడు. చివరకు శేఖర్ ఎలా తనను తాను నిర్దోషిగా నిరూపించుకున్నాడన్నది సినిమా కథ. అప్పట్లో వచ్చే పాశ్చాత్య ధిల్లర్స్ బాణీలో ఉండి, హిందీలో వినూత్నమైన కథనంతో, చక్కని పాటలలో అలరించిన ఈ సినిమా చాలా పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తీసిన 24 సంవత్సరాలకు రాజ్ ఖోస్లా అమితాబ్, శతృఘన్ సిన్హాలతో ‘దోస్తానా’ అనే సినిమా 1980లో తీసారు. జైలులో ఇలా ఖైదీ హత్య జరిగి హీరో ముద్దాయిగా మారడం అన్న పాయింట్ దోస్తానాలో కూడా ఆయన ఉపయోగించుకోవడం చూస్తాం. ‘సి.ఐ.డి.’ సినిమా చాలా మంది దర్శకులకు ప్రేరణ అందించిన ధ్రిల్లర్‌గా హిందీ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ మంచి హిందీ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ లలో ఈ సినిమా కనిపిస్తుంది.

సి.ఐ.డి. రాజ్ ఖోస్లా డైరెక్ట్ చేసిన రెండవ సినిమా. దీనికి ముందు గీతా బాలీ, దేవానంద్ లతో ఆయన 1955లో ‘మిలాప్’ అనే సినిమా తీసారు. కాని అది విజయం సాధించలేదు. గాయకుడవ్వాలని రాజ్ ఖోస్లా ముంబాయి చేరుకున్నాడు. కానీ గురుదత్ దగ్గర సహాయ దర్శకుడయ్యాడు. బాజి, జాల్, బాజ్ వంటి సినిమాల్లో గురుదత్ వద్ద పనిచేశాడు. ఆర్ పార్‌లో సగం సినిమా పూర్తయ్యేవరకూ గురుదత్‌తో వున్నాడు కానీ, జాల్ నిర్మాత సతంత్రంగా దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వటంతో ఆర్ పార్ వదలి మిలాప్ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవ్ ఆనంద్ , గీతాబాలి నటించిన ఆ సినిమా పరాజయం పాలయింది. దాంతో రాజ్ ఖోస్లా కేరీర్ అయిపోయిందనుకున్నారు. ఇది తెలిసి కూడా మరుసటి సంవత్సరం తాను నిర్మాతగా వ్యవహరిస్తూ గురుదత్ ‘సి.ఐ.డి.’ సినిమాకు దర్శకుడిగా రాజ్ ఖోస్లాకు అవకాశం ఇచ్చారు.  గురుదత్ తాను నిర్మించే సినిమా దర్శకత్వ బాధ్యతను రాజ్ ఖోస్లా కు అప్పగించి అతని ప్రతిభపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆర్టిస్ట్‌కు హిట్, ఫెయిల్ అన్న పదాలు వాడకూడదని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. ‘’సి.ఐ.డి.’ సినిమా రాజ్ ఖోస్లాను దర్శకుడిగా హిందీ సినిమాలలో ఎస్టాబ్లిష్ చేసిన సినిమా. ఆ తరువాత రెండు దశాబ్దాల దాకా ఆయన సక్సెస్‌లు అందిస్తూనే ముందుకు సాగారు.

ఈ సినిమాకు కథ అందించింది ఇందర్ రాజ్ ఆనంద్. పృథ్వీ థియేటర్స్‌తో తన కెరిర్ ప్రారంభించిన ఇందర్ రాజ్ ఆనంద్, రాజ్ కపూర్ సినిమాలెన్నిటికో పని చేసారు. వీరి కుమారుడు టిన్ను ఆనంద్ కూడా హిందీ సినిమాలలో మంచి నటుడిగా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కమల్ హాసన్ నటించిన ‘నాయకన్’ సినిమాలో మతి లేని కుర్రాడిగా, చివర్లో కమల్‌ని హత్య చేసేవాడిగా ఆయన చాలా మందికి గుర్తుండిపోయారు. ఇందర్ రాజ్ ఆనంద్ మనవడు సిద్దార్ధ్ ఆనంద్ కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‍గా షకీలా నటించారు. గురుదత్ సంస్థతో ఇది వారికి రెండవ సినిమా. వీరి అసలు పేరు బాద్షాహ్ బేగం. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలలోని రాచరికపు కుటుంబాలతో వీరికి బంధుత్వం ఉంది. రాచరికరపు గొడవలు హత్యలకు కలత చెందిన వీరి తండ్రి తన ముగ్గురు పిల్లలను తీసుకుని బొంబాయి చేరారు. తండ్రి మరణం తరువాత పెళ్ళి చేసుకోకుండా మిగిలిపోయిన మేనత్త వద్ద తన ఇద్దరు అక్క చెల్లెళ్లతో వీరు పెరిగారు. అప్పట్లో సినీ ప్రపంచంలో గొప్ప పేరున్న కర్దార్ గారి ప్రేరణతో వీరు సినిమాలలోకి వచ్చారు. గురుదత్ సినిమాలలో కమెడియన్‍గా చేసే జానీ వాకర్‌ని వీరి చెల్లెలు ‘నూర్జహాన్’ వివాహం చేసుకున్నారు. దాదాపు యాభై సినిమాలకు హీరోయిన్ గా పని చేసారు షకీలా.

ఈ సినిమాలో మిగతా పాత్రలలో కె.ఎన్. సింఘ్, జానీ వాకర్, మెహమూద్ కనిపిస్తారు. ఈ సినిమాలలో నృత్యాలను జొహ్ర సైగల్ కంపోజ్ చేసారు. జర్మనీ లోని మేరీ విగ్మెన్స్ బాలెట్ స్కూల్‌లో నాట్య శిక్షణ పొందిన మొదటి భారతీయురాలు ఆమె. అక్కడ ఉదయ్ శంకర్ గారితో జరిగిన పరిచయంతో వారి ట్రూప్‌లో చేరారు. ఉదయ్ శంకర్ వద్దనే గురుదత్ కొంత కాలం డాన్స్ నేర్చుకున్నారు. అల్మోరాలో ఉదయ్ శంకర్ స్కూల్‌లో జొహ్రా అధ్యాపకురాలిగా కూడా పని చేశారు. ఐ.పీ.టీ.ఏ.తో గొప్ప అనుబంధం ఉన్న వీరు థియేటర్‌ని ప్రేమించేవారు. డాన్స్‌తో పాటు నటిగా ఎన్నో పాత్రలు వేసారామే. పృథ్వీ థియేటర్స్‌తో మొదలుపెట్టి ఆనాటి పృథ్వీరాజ్ కపూర్ నుంచి నేటి రణధీర్ కపూర్ దాకా నాలుగు తరాల నటులతో పని చేసారామె. సి.ఐ.డి. సినిమాతో వహీదా రెహ్మన్ హిందీ సిని గీతాలకు మొదటి కొరియోగ్రాఫర్ అయ్యారు జొహ్రా. భారత ప్రభుత్వం తరువాత కళా రంగానికి వీరు అందించిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో సత్కరించింది.

సీఐడీ సినిమా 1950-60ల నడుమ అధికంగా తయారయిన అర్బన్ క్రైం సినిమా. హాలీవుడ్ ఫిల్మ్ నాయిర్ సినిమాల పంథాకు, హిందీ సినిమా ప్రత్యేకతలను జోడించి నిర్మించిన సినిమాలన్నిటిలోకీ అత్యుత్తమమైన సినిమా. సస్పెన్స్, రొమాన్సులను ఒకదానితో ఒకటి అతి చక్కగా ముడిపెట్టి, పాత్రల వ్యక్తిత్వాలను తీర్చిదిద్ది, రొమాన్స్ వేరు సస్పెన్స్ వేరు అన్న భావన కలగనీయకుండా అతిచక్కని స్క్రీన్ ప్లేతో ఉన్న సినిమా సిఐడి. వీకే మూర్తి కెమేరా ఈ సినిమాలో చీకటి దారులను, వర్షంతో తడిసిన గల్లీలను, వెలుగు నీడలను ఉత్కంఠ కలిగే రీతిలో చూపిస్తూ, ముంబాయి నగరాన్ని కూడా సినిమాలో ఒక ప్రధాన పాత్రను చేస్తుంది. ఇందుకు ఏయ్ దిల్ హై ముష్కిల్ పాట భూమికను ఏర్పాటు చేస్తుంది.

సి.ఐ.డి. సినిమాకు కాస్టూమ్ డిజైనర్‌గా పని చేసిన వారు భానుమతి, వీరిని అందరూ భాను అత్తయ్య అని పిలుస్తారు. ‘గాంధీ’ సినిమాకు కాస్టూమ్స్ డిజైన్ చేసినందుకు 1982లో ఆస్కార్ అందుకున్న మొదటి భారతీయురలు భానుమతి. ‘సి.ఐ.డి.’ సినిమా కాస్టూమ్ డిజైనర్‌గా వీరికి మొదటి సినిమా. వీరి ప్రతిభను గుర్తించి గురుదత్ వీరికిచ్చిన అవకాశం ఇది. గురుదత్ టీంలో ఒక సభ్యురాలిగా ఈ సినిమా నుండి వారు చేరారు. ‘ప్యాసా’, ‘చౌదవీ కా చాంద్’, ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’ సినిమాలకు కూడా వీరే పని చేసారు. రెండు సార్లు నేషనల్ అవార్డులు కూడా ‘లేకిన్’ (1991) సినిమాకు, ‘లగాన్’ (2002) సినిమాకు గాను అందుకున్నారు ఈమె. 2012 లో తనకొచ్చిన అకాడమీ అవార్డుని తన తరువాత కుటుంబీకులు జాగ్రత్త పరచలేరని చెబుతూ ఆమె గౌరవంగా ఆ అవార్డుని అకాడమీకి తిరిగి అందజేయడం విషాదం. గురుదత్ తీర్చిన మరో కళాకారిణిగా ఆస్కార్ వరకు వెళ్ళగలిగిన వ్యక్తి భానుమతి. గురుదత్ ఫిలింస్ కళా ప్రపంచానికి అందించిన మరో ఆణిముత్యం ఆమె.

ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన వారు ప్రమోద్ చక్రవర్తి, భప్పీ సోనీ. ప్రమోద్ చక్రవర్తి తరువాత పూర్తి స్థాయి డైరెక్టర్‌గా మంచి సినిమాలు తీసారు. డైరక్టర్‍గా వీరి మొదటి సినిమా 12 O Clock లో గురుదత్ హీరో అవడం గమనించవలసిన విషయం. భప్పీ సోని రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు రచయితగా పని చేసి తరువాత దర్శకుడిగా స్థిరపడ్డారు. ఇంత మంది హేమాహేమీలని మొదటిసారి సమీకరించి అవకాశం ఇచ్చి వారి కెరీర్‌ను నిర్మించుకోవడానికి సిద్ధపడిన గురుదత్ నిర్మాతగా రిస్క్ తీసుకుని చేసిన సినిమా ‘సి.ఐ.డి.’. ఇది వహిదా రెహ్మాన్ మొదటి సినిమా. తరువాత ఆమె భారత దేశంలోనే గొప్ప నటిగా పేరు సంపాదించుకున్నారు. రాజ్ ఖోస్లాకు మొదటి ఫ్లాప్ తరువాత దర్శకుడిగా వచ్చిన మొదటి అవకాశం. ఇది వారిని దర్శకుడిగా నిలబెట్టింది. ఆస్కార్ అవార్డు పొందిన భానుమతికి కాస్టూం డిజైనర్‌గా మొదటి అవకాశం ఇచ్చిన సినిమా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోద్ చక్రవర్తికి మొదటి హిట్. ఈ హిట్‌తో వారు దర్శకుడిగా పరిణామం చెందారు. గురుదత్ భారతీయ సినిమాకు అందించిన దిగ్గజాల సినీ ప్రయాణం ‘సి.ఐ.డి.’ సినిమాతో మొదలయిందని గమనించాలి. భారతీయ సినిమాకు గురుదత్ కాంట్రిబ్యూట్ చేసిన విధానం ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక వర్గం కెరియర్ లను గమనించి తెలుసుకోవచ్చు.

సీఐడీ ఘన విజయం తరువాత గురుదత్ మరో సినిమాకు దర్శకత్వం వహించమని రాజ్ ఖోస్లాను కోరాడు. కానీ అందుకు రాజ్ ఖోస్లా నిరాకరించాడు. ” I am a small plant and I can’t grow under a big tree”  అని తన కెరీర్‌ను గురుదత్ నీడనుంచి వెలుపలకు తెచ్చి, తనదైన పద్ధతిలో ముందుకు సాగాడు. అయినా వారిద్దరి సంబంధం చివరివరకూ కొనసాగింది. ఇది గురుదత్ వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తుంది. గీతాదత్ తన సినిమాల్లోనే పాడాలని నియమం విధించాడు గురుదత్. కానీ, ఇతర కళాకారులకు ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇవ్వటమేకాకుండా తమ కేరీర్ తాము నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చాడు. గురుదత్ వ్యక్తిత్వంలో విశ్లేషించాల్సిన అంశం ఇది. ఈ వ్యక్తిత్వం ప్యాసా సినిమాలో స్పష్టమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here