మధురమైన బాధ – గురుదత్ సినిమా 5 – మిస్టర్ అండ్ మిసెస్ 55

2
4

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]‘మి[/dropcap]స్టర్ అండ్ మిసెస్ 55’ గురుదత్ చాలా రొమాంటిక్‌గా కనిపించే కామెడీ చిత్రం. గురుదత్ ఈ సినిమాలో ఉన్నంత అందంగా, చిలిపిగా, చలాకిగా మరే సినిమాలో కనిపించరు. అందుకే వారి అభిమానులు ఈ సినిమాను మర్చిపోలేరు. మధుబాలను సినిమా రంగంలో టాప్‌కు తీసుకెళ్ళిన సినిమా కూడా ఇదే. 1955 లోనే రిలీజ్ అయిన ఈ సినిమా హిందీలో మంచి క్లాసిక్ సినిమాల సరసన ఇప్పటికీ నిలుస్తుంది. ఈ సినిమాలో నటించడమే కాదు, గురుదత్ దీనికి దర్శకుడు, నిర్మాత కూడా. అంతకు ముందు ఆయన తీసిన సినిమాల కన్నా టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఈ సినిమాతో ఆయనకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఒక మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకర్‌గా ఆయన ఈ సినిమాతో నిలదొక్కుకున్నారన్నది అర్థం అవుతుంది. ఈ సినిమాలో గురుదత్ పాత్ర పేరు ప్రీతం కుమార్. అతనొక కార్టూనిస్ట్. ఈ సినిమాలో చూపించిన కార్టూన్లన్నీ ఆర్.కె.లక్ష్మణ్ గారివి. క్వాలిటీకి ఎక్కడా తలవంచని గురుదత్ తన పాత్రకు ఆర్.కె. గారి కార్టూన్లను తీసుకోవడం అతనిలోని పర్ఫెక్షనిజానికి, కార్టూన్ల ప్రపంచంలో ఆర్.కె. గారికున్న పేరుకి నిదర్శనం. 1955 సమయానికి ఆర్.కె. లక్ష్మణ్ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లో పని చేస్తున్నారు. అంతకు ముందు బొంబాయ్ లోని ‘ది ఫ్రీ ప్రెస్ జర్నల్’ అనే పత్రికలో బాల్ థాక్రేతో కలిసి కార్టూనిస్ట్ గానే పని చేసారాయన. ఈ సినిమాకు అబ్రార్ అల్వి రాసిన నాటకం Modern Marriage  ఆధారం.

‘మిస్టర్ అండ్ మిసెస్ 55’లో గురుదత్ నటన, దర్శకత్వపు ప్రతిభ పూర్తిగా గుబాళిస్తాయి. ఆయన పాటలను చిత్రీంచే విధానంలో ఒక ప్రత్యేకమైన బాణీ ఉంటుంది.   గురుదత్ సినిమాలో పాటలు కథకు కొనసాగింపుగా ఉంటాయి. పాత్రల సంభాషణకు కూడా ఇవి కంటిన్యుటీని తీసుకొస్తాయి. ఈ సినిమాలో హీరో కనిపించిన మొదటి రెండు సీన్లలో అతనికి మాటలుండవు. అనిత అనే ఒక ధనవంతుని కూతురుని టెన్నిస్ స్టేడియంలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు ప్రీతం. ఆ అమ్మయిని ఆరాధనగా చూస్తూ ఉండగానే ఆమె వెళ్ళిపోతుంది. నడుచుకుంటూ తన స్నేహితుడు జానీని కలుస్తాడు. అతని ప్రశ్నకి జవాబుగా పాటను అందుకుంటాడు ప్రీతం. ఇక్కడే స్క్రిప్ట్ రచయితగా అబ్రార్ అల్వి ప్రవేశంతో గురుదత్ సినిమాలలో, దృశ్య సృష్టీకరణలో వచ్చిన తేడా తెలుస్తుంది. గురుదత్ కు అబ్రార్ అల్వి కి పరిచయం గమ్మత్తుగా జరిగింది. 1953లో బాజ్ సినిమా షూటింగ్ సమయంలో గురుదత్ ఒక సీన్ సంతృప్తికరంగా రావటంలేదు. ఆ సమయంలో అక్కడౌన్న అబ్రార్ అల్వి కొన్ని సూచనలు చేశాడు. సన్నివేశ సృష్టీకరణలో అల్వి ప్రతిభను పసికట్టిన గురుదత్ అతడిని తన సినీ నిర్మాణ సంస్థలో శాశ్వత సభ్యుడిని చేసుకున్నాడు. మధుబాల గురుదత్‌ల పరిచయ దృశ్యం తరువాత అనేక సినిమాల్లో కాపీ కొట్టారు.( అనాడి సినిమాలో నూతన్ గోడ దూకేముందు చెప్పులు విసుర్తుంది. తరువాత తను దూకుతుంది. రాజ్ కపూర్ అక్కడే నిలబడి చూస్తూంటాడు. అంతకుముందు సైకిల్ ఆక్సిడెంట్‌ద్వారా పరిచయమవుతుంది. ). ముందుగా మీద చెప్పులు పడటం, ఆపై కాళ్ళు కనబడటం, మనిషి క్రిందకు దూకటం..ఆమెని గురుదత్ ముగ్దుడయి చూడటం , ఇక ఆమెనే చూస్తూండటం, ముఖ్యంగా గురుదత్ ముక్కుకు దెబ్బతగిలిందని చూపించినప్పుడు మధుబాల ముఖంలో కనిపించిన భావన..ఆ దృశ్యాన్ని మరపురాని దృశ్యంగా మలుస్తాయి. గురుదత్ తననే తదేకంగా చూస్తున్నా మాచ్ నుంచి దృష్టి మరల్చకుండా మధుబాల ఎంజాయ్ చేయటం..ఒకటేమిటి.. ప్రతి క్షణం, ప్రతి ఫ్రేం, నటీనటుల హావభావాలు, ఆ దృశ్యాన్ని మరపురానిదిగానే కాదు, తలచుకుంటే, పెదవులపై చిరునవ్వు నిలుపుతుంది.  ఈ సన్నివేశం నేపథ్యంలో వినిపించే బాణీ తరువాత సీఐడీ సినిమాలో ఏ దిల్ హై ముష్కిల్ పాటగా వినిపిస్తుంది.  ఇక గురుదత్ పాత్ర మంత్రదష్టుడిలా అలానే వుండి..హఠాత్తుగా అజీ దిల్ పర్ హువా ఐస జాదూ….అని పాట అందుకోవటం గొప్ప ఎఫెక్ట్‌నిస్తుంది.  హీరో మొదటి డైలాగ్ పాట అవడం, కథ అక్కడి నుండి వేగంగా పరిగెత్తడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అలాగే కమెడియన్ జానీ వాకర్ కూడా మరో సీన్‌లో ఫోన్ రిసీవర్ ఎత్తి మాటకు బదులు పాట ఎత్తుకుంటాడు. చాలా గొప్పగా పాట మొదలవుతుంది. ప్రతి సినిమాలో గురుదత్ పాటను మొదలుపెట్టే పద్ధతి చాలా అందంగా ఉంటుంది. అది ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది. చిన్న చిన్న విషయాలతో ఆ చిత్రీకరణకు ఒక కళాత్మకతను జోడించడం గురుదత్ గొప్పతనం.

ఇక గురుదత్ ఇతర సినిమాలలో అతని కళ్ళల్లో ఒక బాధ, ఒంటరితనం వెన్నంటే ఉంటాయి. కాని ఈ సినిమాలో అతని కళ్ళనుండి ప్రేమ ప్రసరిస్తూ ఉంటుంది. అనితను చూసినప్పుడల్లా గురుదత్ కళ్లల్లో కనిపించే ఆ మెరుపు అతనికి ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తూనే ఉంటుంది. హీరో హీరోయిన్లకి ఇక్కడ ప్రేమకు సంబంధించి ప్రత్యేకమైన డైలాగులు ఉండవు. అనిత పూర్తిగా అమాయకురాలు, ప్రీతం కళ్లలో తన మీద ఉన్న ప్రేమ ఆమె అర్థం చేసుకునే స్థితిలో ఉండదు. కాని ఆమె దగ్గరకు రాగానే అతను కరిగిపోతాడు. ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్దమే అన్నంతగా ఆమెకు లొంగిపోతాడు. తన మనసులో ఆమె పట్ల ఉన్న ఇష్టాన్ని తన కళ్ళతో అద్భుతంగా పలికిస్తారు గురుదత్.

అనిత తండ్రి మరణానికి ముందు ఆమెను కోట్ల ఆస్తికి వారసురాలిని చేస్తాడు. కాని ఆ ఆస్తి ఆమె వివాహం అయిన తరువాతె ఆమెకు చెందాలనే ఒక షరతు విధిస్తాడు. అనిత మేనత్త సీతాదేవి పురుష ద్వేషి. వివాహం స్త్రీ స్వాతంత్ర్యాన్ని హరిస్తుందని నమ్ముతుంది. ఆర్థికంగా బలవంతులైన స్త్రీలకు వివాహం అవసరం లేదన్నది ఆమె వాదన. ఆమెకు అనిత అంటే ఇష్టమే. కాని వివాహం అనే చట్రంలో ఆమె మిగిలిపోవడం సీతాదేవికి ఇష్టం ఉండదు. అనితకు అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడే రమేశ్‌పై క్రష్ ఉంటుంది. అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆమె కోరిక. కాని రమేశ్ ఆమెను పట్టించుకోడు. రమేశ్ ఆడుతున్న టెన్నిస్ మాచ్ దొంగచాటుగా చూస్తున్నప్పుడే మొదటిసారి ఆమెను ప్రీతం చూస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. తండ్రి వీలునామా విషయం తెలుసుకుని అనిత రమేశ్‌ని పెళ్ళిచేసుకుందాం అని అడుగుతుంది. కాని రమేశ్ ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం లేదని చెబుతాడు. ఆమెకు ఒక ఉత్తరం ఇవ్వమని తన జర్నలిస్ట్ మిత్రుడైన జానీని పంపిస్తాడు. అనిత రమేశ్‌ని సినిమా థియేటర్‌కి రమ్మని పిలుస్తుంది. అక్కడకి తాను వెళ్ళకుండా ఉత్తరం ఇచ్చి జానీని వెళ్ళమని పంపుతాడు రమేశ్. జానీ ఆ పని ప్రీతంకు అప్పజెప్పుతాడు. అక్కడ మరోసారి ప్రీతం అనితను చూస్తాడు.

ఉద్యోగం కోసం ప్రతికాఫీసు చుట్టూ తిరుగుతున్న ప్రీతంకు ప్రతి సారి ఖాళీలు లేవన్న జవాబే వస్తుంది. అతను ఎడిటర్ దగ్గర ఉన్నప్పుడే ఒకసారి సీతాదేవి ఎడిటర్‌కు ఫోన్ చేసి తన దగ్గర ఒక యువకునికి పని ఉందని, ఎవరైనా ఉంటే చూడమని చెబుతుంది. ఎడిటర్ ఆమె దగ్గరకు ప్రీతంను పంపిస్తాడు. ప్రీతం నిరుద్యోగం, పేదరికం గమనించిన సీతాదేవి, అతను తన మేనకోడలిని రిజిస్టారాఫీసులో వివాహం చేసుకుని తమకు కావలసినప్పుడు విడాకులు ఇవ్వాలని, వివాహం జరిగిన రోజు నుండీ తన మేనకోడలికి దూరంగానే ఉండాలని, ఈ షరతులు ఒప్పుకుంటే నెలకు రెండు వందల యాభై జీతంగా ఇస్తానని చెబుతుంది. ఆమె అహంకారం చూసి కోపంతో వెళ్ళిపోతున్న ప్రీతం వెనక గోడ మీద అనిత ఫోటో చూస్తాడు. తాను వివాహం చేసుకోవలసింది ఆమెనే అని తెలుసుకుని వెంటనే ఒప్పుకుంటాడు.

ఇక ఇలా అతనితో వివాహం జరిగాక అనిత అతన్ని ద్వేషించడం మొదలెడుతుంది. డబ్బు కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడని అతన్ని చులకన భావంతో చూస్తుంది. ఆమెను కలిసి విషయం వివరించే అవకాశం సీతాదేవి ప్రీతంకు ఇవ్వదు. ఇక తప్పక ఒక రోజు డ్రైవర్‌గా అనితను కిడ్నాప్ చేసి తన అన్న ఇంటికి తీసుకువెళతాడు ప్రీతం. అక్కడ సాధారణ స్త్రీగా ఇంటి పనులతో గృహిణీగా ఆనందంగా ఉన్న ప్రీతం వదినను  చూసి ఆశ్చర్యపోతుంది అనిత. డబ్బు లేని ఒక స్త్రీ ముఖంలో ఇంత ప్రశాంతతను చూసి ఆశ్చర్యపోతుంది. స్త్రీకి గృహిణిగా దొరికే తృప్తి మరెక్కడా దొరకదని ప్రీతం వదిన అనితకు వివరిస్తుంది. మొదటి సారి ఆలోచనలలో పడుతుంది అనిత. కాని మేనత్త ప్రభావం నుండి బైటకు రాలేకపోతుంది. అనిత మనసు మారదని తెలుసుకుని ప్రీతమ్ ఆమెకు విడాకులివ్వడానికి ఒప్పుకోవడం, చివరకి అతనికి తన మీద ఉన్న ప్రేమను ఆమె అర్థం చేసుకోవడం, అతను తిరిగి ఇచ్చిన డబ్బు ద్వారా ఈ వివాహం అతను కేవలం అనితను కోరి మాత్రమే చేసుకున్నాడని అనితకి తెలియడం, ఆమె అతని దగ్గరకు వెళ్ళడం సినిమా ముగింపు.

కథా పరంగా నాకు ఈ సినిమా పట్ల కొన్ని అభ్యంతరాలున్నాయి. స్త్రీని భర్త కొట్టడాన్ని కూడా ప్రేమగా తీసుకోవాలని ప్రీతం వదిన అనితకు బోధించడం, ఎక్కువమంది పిల్లలు అదృష్టమన్నట్లుగా మాట్లడడం నేను వ్యక్తిగతంగా అంగీకరించలేని విషయం. గురుదత్ సినిమాలలో స్త్రీ పట్ల ఆయనకున్న ప్రోగ్రెసివ్ భావజాలం ఇందులో కనిపించదు. ఈ ఒక్క సీన్ తప్పించి సినిమాలో గురుదత్ వ్యక్తిత్వం ఎక్కడా పురుషాహంకారంతో కనిపించదు. అనిత అభిప్రాయాలను ప్రతి నిముషం గౌరవిస్తూనే ఉంటాడు. ఆమె అనుమతి, ఇష్టం లేకుండా వివాహ బంధం సాగించలేనని స్పష్టం చేస్తాడు. వివాహం కన్నా ప్రేమ అన్న భావం తనకు ముఖ్యం అని, వివాహంతో వచ్చే హక్కు కన్నా, ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ, ఒకరి పట్ల మరొకరికి ఉండవలసిన నమ్మకం భార్యాభర్తల మధ్య ముఖ్యమనే అతని నమ్మకం. అనిత పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టే, విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన తరువాత అమె అందరి ముందు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోకూడదని, తానే ఒక వ్యసనపరుడినని సాక్ష్యాన్ని సృష్టించి దాని ద్వారా అనితకు విడాకులు సులువుగా మంజూరు కావడానికి సహయపడతాడు. ఈ మంచితనం, ప్రేమను అనుభవించిన తరువాతే అనిత అతన్ని కోరుకుంటుంది. కేవలం తాళి కట్టాడన్న కంపల్షన్‌తో అతనికి భార్యగా ఉండిపోవాలనుకోదు. ఇంత ఆధునికంగా మలిచిన పాత్రల మధ్య ఆ వదినా, మరదళ్ల సీన్లో సంభాషణ అంతగా అతకదు. ఇప్పటికి, అప్పటికీ, ఎప్పటికీ, కూడా ఈ స్థాయి సినిమాకి సరిపోని సీన్ అది. సూడో ఫెమినిజాన్ని ప్రశ్నించిన సినిమా అయినా, స్త్రీల జీవితాలను మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడవల్సిన ప్రోగ్రెసివ్ ఫెమినిజాన్ని కాస్త దెబ్బ తీసిన సినిమా ఇది అని నిష్పక్షపాతంగా చెప్పుకోవాలి. ఈ రెంటి మధ్య ఎప్పుడూ ఉండే భేదాన్నిపాత్రల పరంగా చూపిస్తే బావుండేది. కాని అప్పట్లో సినీ కథలు ఆ కోణంతో కమర్షియల్ సినిమాలలో కనిపించవు. కానీ, ఈ సినిమా 1950ల నాటిదనీ, అప్పటి మనస్తత్వాలు, పరిస్థితులను దృష్టిలో వుంచుకుంటే సినిమాలోని అభ్యంతరకర పరిస్థితులు అవగాహనకువస్తాయి. అయితే, ఆధునిక సమాజంలో ప్రతి చిన్న విషయానికీ మనుషులు విడిపోవటం, అసహనం అలంకారం అవటం గమనిస్తే, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అన్నవి స్త్రీకయినా పురుషుడికయినా ఆవశ్యకమని, గృహిణి అయినా, ఉద్యోగిని అయినా స్త్రీ వ్యక్తిత్వమే ఆమెకు అసలయిన ఆభరణం అనీ అనిపిస్తుంది. సినిమా మొదటి దృశ్యంలోనే విడాకుల చట్టం ప్రస్తావన రావటం, ఆవెంటనే ధనిక మహిళామండలి వారు స్త్రీ ఆత్మగౌరవం, ఫెమినిజం గురించి మాట్లాడటం సినిమా దృష్టిని స్పష్టం చేస్తుంది. విడాకుల చట్టంపై వ్యంగ్యవిసురు ఈ సినిమా. ఈ సినిమా పోస్టర్ రెండు భాగాలుగా విభాజితమై వుంటుంది. ఒక భాగంలో ఆధునిక దుస్తుల్లో వున్న నాయిక షూలు హీరో సరిచేస్తూంటాడు. రెండో భాగంలో చీర కట్టిన నాయిక, హీరో పాదాభివందనం చేస్తూంటుంది. అంటే ప్రధానంగా పాశ్చాత్య ప్రభావం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని, సాంప్రదాయిక విలువల్లోని సహనం మానవ సంబంధాలను నిలుపుతుందనీ, విడాకుల చట్టం దుర్వినియోగాన్ని ప్రదర్శించటమేకాదు, విడాకులు పై స్థాయి మహిళల అహంకారపు ఆటలకు పనికొస్తుందని చూపించటం ఈ సినిమా ఉద్దేశం అనీ స్పష్టమవుతుంది. ఈ సందర్భంలో గుండమ్మ కథ సినిమాను స్మరించుకోవాల్సివుంటుంది. ఆ సినిమాలో కూడా పలు సందర్భాలు, సంభాషణలు ఈనాడు అభ్యంతరకరంగా వుంటాయి. అలాగే లేచింది మహిళాలోకం పాటలో విడాకు చట్టం తెచ్చారు అనటంలోని వ్యంగ్యాన్ని గమనిస్తే, ఆ కాలంలో విడాకుల చట్టం పట్ల సమాజం స్పందనను విశ్లేషించవచ్చు.

గురుదత్ నటన గురించి వస్తే, ఇందులో మధుబాలతో ఒక డ్యూయెట్ ఉంటుంది. ‘ఉధర్ తుమ్ హసీన్ హో ఇధర్ దిల్ జవాన్  హై’ అన్న పల్లవితో సాగే ఈ పాట హిందీ యుగళ గీతాలలో ఒక గొప్ప సృష్టి. హీరోయిన్ పై గదిలో ఉంటుంది. హీరో క్రింద ఉంటాడు. వారి ఆర్థిక స్థాయిని సూచించే విధంగా వారు ఆ ఆ స్థానాలలో నిలబడి ఉంటాడు. అనితపై ఎంతో ప్రేమతో ప్రీతం ఆమెకు తన మనను తెలుపుకోవాలనుకుంటాడు. అతని స్థాయి అతన్ని పైకి చేరనివ్వదు. పైగా తనంటే ఆమెకు కోపం. తన ప్రేమ అర్థం చేసుకొమ్మని ఆమెను అర్ధిస్తాడు. ఆమెకు ఆ మెట్లు దిగి అతని వద్దకు రావాలనే ఉంటుంది. కాని ఆమెలోని అనుమానాలు, భయాలు, ఆమె పెరిగిన వాతావరణం ఆమెను ఒక గుంజాటనలో పడేస్తాయి. కాని అతని మనసు అతని నోటనే విని ఆమె ఆ ప్రేమకు కరిగిపోతుంది. కొన్ని మెట్లు దిగుతుంది, మధ్యలో ఆగిపోతుంది. అతను ఆమెను అందుకోవాలనుకుంటాడు. ఆమె అనుమతికై ఎదురు చూస్తుంటాడు. ఆమె అంగీకారం లేకుండా ఆమె వద్దకు వెళ్ళలేడు. ఆమె అతను వివాహం చేసుకున్న భార్యే. కాని ఆమె అంగీకరించని వివాహాన్ని హక్కుగా అతను చూడలేడు. ఈ గుంజాటన మధ్య వారి మనసులలోని వేదను మజ్రూహ్ సుల్తాన్‌పురి అధ్బుతంగా పదాలలో కూరిస్తే అంతే మధురమైన సంగీతాన్ని సమకూర్చారు ఓ.పీ. నయ్యర్.

‘మెరే ఘర్ మె ఆయీ హుయీ హై బహార్, కయామత్ హై ఫిర్ భీ కరూ ఇంతజార్’ అంటూ వివాహంతో ఆమెను పొందినా, పూర్తిగా ఆమెను తనదానిగా చేసుకోలేక, ఆ క్షణం కోసం ఎదురుచూడడంలోని బాధను ఇక్కడ గురుదత్ ప్రీతంగా తన ముఖంలో చూపిస్తాడు. అరక్షణం పాటు అతనిపై ఫోకస్ చేసిన షాట్లో కెమెరా అతని ముఖం పై భాగాన్నే చూపిస్తుంది. ముఖం క్రింది భాగం చెట్ల నీడలో కనిపించదు. అప్పుడు అతని నుదుటిపై పడ్డ ఆ ముడతలు అతనిలోని సంఘర్షణను ప్రకటిస్తాయి. ఆ ఒక్క అరక్షణం షాట్ ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళుతుంది. ‘సులగతీ హై తారోకి పర్చాయియాన్, బురీ హై ముహబ్బత్ కీ తన్హాయియా’ అన్న వాక్యం దగ్గర కూడా చెట్ల మధ్య వెలుగు నీడల దోబూచులాట అతని ముఖంపై ఉండగా ముహబ్బత్ కీ తన్హాయియా అన్న వాక్యం దగ్గర అతని పెదవులపై ఒక మందహాసం అందంగా ఉంటుంది. అసలు గురుదత్ సినిమాలలోనే ఈ వెలుగు నీడల దోబూచులాట ముఖంపై చాలా సహజంగా కనిపిస్తుంది. అది సినిమాటోగ్రఫర్ వీ.కే. మూర్తి గొప్పతనం. కొన్ని మెట్లు దిగివచ్చిన మధుబాలను చూసి ‘తరస్తాహూ మై ఐసె దిల్దార్కో జొ దిల్ మే బసాలే మెరే ప్యార్ కో’ అంటూ కొన్ని మెట్లు పైకి ఎక్కుతాడు గురుదత్. ఈ వాక్యం దగ్గర కనురెప్పలు మూసి అతనిచ్చే ఎక్స్‌ప్రెషన్ అతని మనసును, సిన్సియారిటీని వ్యక్తపరుస్తుంది. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన షాట్ ఇది. పాట చివరికి వచ్చే సరికి కొన్ని మెట్లు దిగి క్రిందకు వచ్చిన అనిత, ఆమెను అందుకోవడానికి పైకి వచ్చిన ప్రీతం. ఆమెను ముట్టుకోకుండా చేయి అక్కడున్న స్తంభానికి ఆన్చి ఆమెను కదలకుండా బంధించిన ప్రీతం…ఈ పాట చిత్రీకరణ మొత్తం సినిమా కథను చెబుతుంది.  ప్రీతం ఆన్ మిలో పాటను వాడుకున్న విధానం అద్భుతం. గీతాదత్ స్వరంలో గుండెనుపిండేసే విరహవేదనతో వచ్చేపాట నాయిక మనస్సులోని భావాలను తెలుపుతుంది. కానీ, సీతాదేవి వచ్చి రేడియో కట్టేస్తుంది. ప్రతీకాత్మకంగా ఇది నాయిక పరిస్థితిని సూచిస్తుంది. అదే సమయానికి హీరో రేడియోలో అదే పాట వింటూంటాడు. ఆపాట అతని మనోభావాలకు దర్పణం పడుతుంది. తేడా, రేడియో ఆర్పేవారుండరు. అద్భుతమయిన సన్నివేశ సృష్టీకరణ ఇది. 1971లో సీమా అనే సినిమాలో రేడియోలో రఫీ స్వరంలో జబ్ భి యే దిల్ ఉదాస్ హోతా హై అనే పాట వస్తుంటుంది. వేర్వేరుగా కబీర్ బేడి, సిమి గరేవాల్ లు అదే పాట వింటూంటారు. ఇద్దరి మనస్సుల్లో భావాలను ఆ పాట ప్రతిబింబిస్తుంది. ఇలా, తరువాత అనేక సినిమాల్లో ఈ సినిమా ప్రభావాన్ని చూడవచ్చు.

సాధారణంగా మన సినిమాల్లో హాస్యం అంటే వంకర టికర వేషాలు, లాజిక్‌కు అందని అంశాలుంటాయి. కానీ, ఈ సినిమా అప్పటి ఆనవాయితీకి భిన్నంగా చమత్కారమయిన సంభాషణలతో, చక్కని సన్నివేశ సృష్టీకరణతో సాగుతుంది. ఈ సినిమాలో సంభాషణలు పరిమితంగా వున్నా, విట్టీగా వుండటమేకాదు, అత్యంత అర్థవంతంగా వుంటాయి. ముఖ్యంగా ప్రీతం, సీతాదేవి బొమ్మను కొరడా పట్టుకున్న రోమన్ రథిగా, తననూ అనితనూ గుర్రాలుగా కార్టూన్ గీసిన సన్నివేశంలో జీ హాన్ అన్న మాట గురుదత్ పలికిన ప్రతిసారీ ఒక భిన్నమైన అర్ధం స్ఫురించేట్టు సన్నివేశాన్ని రూపొందించిన విధానం అద్భుతం. ప్రతి సంభాషణ కథను ముందుకు జరపటం గమనార్హం. నువ్వెంత నీచుడివంటే మంచివారెవరూ నీతో మాట్లాడరు. ఇకపై మా లాయర్ నీతో మాట్లాడతారంటే, సమాధానంగా గురుదత్ అయితే మీ లాయర్ మంచివాడుకాదన్నమాట అంటాడు. సినిమానిండా ఇలాంటి విట్టీ సంభాషణలు అలరిస్తాయి.

గురుదత్ సినిమాలలోని చాలా పాటలలో ప్రేమికురాలు ఎన్నో మెట్ల పైన ఎత్తులో ఉన్నట్లు, తన ప్రేమ కోసం ఆమె దిగి రావాలన్న భావంతో క్రింద నిలబడిన ప్రేమికుడి బాధను హీరోలలో చూస్తాం. ‘జాల్’ సినిమాలో ‘యే రాత్ యే చాందినీ ఫిర్ కహా’ పాట చిత్రీకరణ గమనించండి. ఇంటి పై వరండాలో నిలబడిన గీతా బాలి. గిటార్‌తో క్రింద నుంచుని పాడుతున్న దేవ ఆనంద్. అన్ని మెట్లు దాటి అతన్ని చేరుతుంది ఆమె. అలాగే ‘ప్యాసా’ లోని డ్రీం సాంగ్‌లో చందమామ నుండి ఎన్నో మెట్లు దిగి వచ్చి హీరోతో ప్రేమను నడిపి చివరికి అతన్ని ఒదిలి అన్ని మెట్లు ఎక్కి అదే చంద్రుడిని చేరిన హీరోయిన్. నిశితంగా గమనిస్తే ఈ మెట్లను సమాజ స్థాయిగా, మనసు, కుటుంబం ఏర్పర్చిన బంధనాలకు ప్రతీకలుగా గురుదత్ ఉపయోగించుకున్న విధానం కనిపిస్తుంది. అసలు తనను ప్రేమించి అన్నిటిని వదులుకుని తన కోసం అంత సమర్పణ భావంతో ప్రేమికురాలు రావాలన్న భావన గురుదత్ వ్యక్తిగతమైన కోరిక ఏమో అనిపిస్తుంది కొన్ని సార్లు. స్త్రీని ఒక ఉన్నత స్థానంలో ఊహించుకుని, ఆమెను దేవతగా ఆరాధించి, తన సర్వం ఆమెకు సమర్పించి, సంపూర్ణంగా తనని తాను మరచిపోయే ప్రేమ గురుదత్ ఆశించే ప్రేమ అన్నది అతని సినిమాల్లో నాయికను నాయకుడు ప్రేమించే విధానంలో తెలుస్తుంది. ఇలా సంపూర్ణంగా సమర్పించుకోవటం ఆరంభ సినిమాల్లో అంతర్లీనంగా వున్నా, వహీదా రహెమాన్ పరిచయంతో స్పష్టమయింది. ఇందుకు పరాకాష్ట, చౌదవీక చాంద్ హో పాట చిత్రీకరణ! అయితే, అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో అన్న భావనతో పాటూ ఆమెకూడా తనకు సంపూర్ణంగా సమర్పితమవ్వాలన్న భావన గురుదత్‌లో వుండేదనిపిస్తుంది.  ముఖ్యంగా ప్యాసా, కాగజ్ కే ఫూల్ సినిమాల్లో వహీదా పాత్ర ప్రదర్శించే అంకిత భావన ఈ ఆలోచనకు బలం ఇస్తుంది.

ఈ సినిమాలో పాటలన్నిటీని మజ్రూహ్ సుల్తాన్‌పురి రాశారు. ఓ.పీ. నయ్యర్ సంగీతం అందించారు. ఓ.పీ. నయ్యర్ మొదట సంగీతాన్ని అందించిన పాట “ప్రీతం ఆన్ మిలో” ఇది ఒక ప్రైవేట్ సాంగ్‌గా సీ. హెచ్ ఆత్మా గొంతులో చాలా పాపులర్ అయ్యింది. దీన్ని ఈ సినిమాకు మళ్ళీ గీతాదత్ చేత పాడించారు ఓ.పీ. నయ్యర్.

గురుదత్ ప్రతి సినిమాలో ఒక పాటను అయినా ప్రత్యేకంగా విదేశీ బాణీల ప్రేరణతో కంపోజ్ చేయించుకునేవారు. ఓ.పీ. నయ్యర్ కూడా ఈ ప్రక్రియను చాలా ఇష్టపడేవారు. ఈయన సినిమాకు అందించిన ట్యూన్లు విదేశీయులను తరువాత చాలా ఆకట్టుకునేవి. ఈ సినిమా పాటలన్నిటిపై అంతోన్ కారా పాట ది థర్డ్ మాన్ ( The Third Man)  ప్రభావం సష్టంగా తెలుస్తుంది.  అందరు ఆశ్చర్యపోయే ఒక విషయం ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటకు సంబంధించింది. ఇందులో “నీలే ఆస్మానే” అన్న పాట గీతాదత్ పాడారు. దాని మ్యూజిక్‌ను   రాపర్లుగా పేరు పొందిన ఈ తరం పాటగాళ్లు 2 chainz, 42 Dugg తమ ఆల్బం Million Dollars’ Worth of Gameకు బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టుకున్నారన్నది చాలా కొద్ది మందికి తెల్సు. అలనాటి ఆణిముత్యాలు నేటి తరం భారతీయులనెందర్ని కదిలిస్తున్నాయో తెలీదు కాని కొందరు పాశ్చాత్య సంగీతకారులను ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

ఓ.పీ.నయ్యరును గురుదత్‌కి మొదట పరిచయం చేసింది గీతా దత్. ఓ.పీ నయ్యర్ సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి సహయపడింది గురుదత్. అయితే గురుదత్ మరణించిన రాత్రి రాజ్ కపూర్‌తో ఆఖరి సారి మాట్లాడారట. వెంటనే రాజ్ కపూర్ ఓ.పీ. నయ్యర్ ఇంటికి ఫోన్ చేసి గురు దత్ తనతో మాట్లాడారని, అతని పరిస్థితి ఏమీ బావోలేదని, ఎందుకో ఓ.పీ. నయ్యర్‌తో మాట్లాడాలని తపన పడుతున్నాడని, ఓ.పీ ఇంటికి వస్తే వెంటనే గురుదత్‌కి ఫోన్ చేయించమని చెప్పార్ట. ఓ.పీ. నయ్యర్ ఇంటికి వచ్చాక భార్య అతనికీ విషయం చెప్పింది. అప్పుడు ఓ.పీ. నయ్యర్ గురుదత్ నటిస్తున్న “బహారే ఫిర్ భీ ఆయేగీ” సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అలిసి పోయి ఇంటికి వచ్చిన్ నయ్యర్ మరుసటి రోజు ఎలాగూ గురుదత్‌ని కలవాలి కాబట్టి ఇప్పుడు ఫోన్ ఎందుకని అతనికి ఫోన్ చేయలేదట. ప్రొద్దున్నే లేచి గురు దత్ ఇంటికి వెళ్ళేసరికి అతను మరణించాడని అబ్రర్ అల్వీ భోరుమని ఏడుస్తూ చెప్పాడట. ఆ షాక్‌లో నయ్యర్ గురుదత్ మరణానికి తానూ కారణమనే గిల్ట్‌కి గురయ్యారు. అక్కడే కోపంతో గీతా దత్ వహీదాలను పట్టుకుని దులిపేసారట. ఓ.పీ. నయ్యర్ మరణానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఈ సంఘటన తనని ఇంకా వెంటాడుతుందని, తనని కష్టకాలంలో ఆదుకున్న గురుదత్ చివరి క్షణాలలో తనతో మాట్లాడాలని కోరుకున్నా తాను అతన్ని నిర్లక్ష్యం చేసానని చెప్పుకునేవారు.

అలాగే ఆశా భోస్లేతో పీకలలోతు ప్రేమలో ఉండి, ఆమె అంక్షలను ఓ.పీ. నయ్యర్ శిరసావహిస్తున్న సమయంలో గీతదత్ చాలా కష్టకాలంలో ఉంది. తననెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని, తనకు పని అవసరమని ఓ.పీ నయ్యర్‌కు ఫోన్ చేసి ఆమె అడిగినప్పుడు ఆశా మత్తులో ఆమెకు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేయడం తన జీవితంలో తాను ప్రేమ మత్తులో చేసిన మరో తప్పని ఓ.పీ. నయ్యర్ చాలా సందర్భాలలో చెప్పేవారట. ఆ దంపతులిద్దరికీ తాను అన్యాయం చేసాననే ఆయన అఖరి రోజుల్లో వాపోయేవారట. ఇవి సినీ సంబంధాల వెనుక ఉన్న నిజాలు.

ఈ సినిమాలో సీతాదేవిగా నటించిన లలితా పవర్ నటనను విస్మరించలేం. ఆ పాత్ర మరొకరి వల్ల కాదన్నంత గొప్పగా నటించారు ఆమె. ఈ సినిమాకు హీరోయిన్‌గా ముందు ‘ఆర్ పార్’ సినిమాలో నటించిన శ్యామాను అనుకున్నారు గురుదత్. ఆమె ఎక్కువ పారితోషకం అడిగేసరికి ఆయన వైజయంతీమాలను తన సినిమాలో నటించమని అడిగారు. వైజయంతిమాలకి డేట్స్ కుదర్లేదు. తరువాత ఆ పాత్ర మధుబాలకు వెళ్ళింది. వైజయంతిమాల ఈ సినిమాను వదులుకోవడం తన కెరియర్‌లో అనుకోకుండా జరిగిన తప్పిదం అని కొన్ని ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు కూడా.

జానీ వాకర్‌కి ప్రత్యేకంగా ఒక పాట పెట్టడం గురుదత్ సినిమాల్లో తప్పకుండా జరిగేది. ఈ సినిమాలో అతనిపై చిత్రించిన ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’ చాలా పెద్ద హిట్ సాంగ్. రఫీ గీతాదత్ గొంతుల్లో హుషారుగా సాగే ఈ పాటలో నటించిన నటి యాస్మిన్. ఈవిడ అసలు పేరు వినీతా భట్. గురుదత్, జానీ వాకర్లు ఒక హోటల్‌లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న వినీతాను చూసి ఆమెకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. దీని తరువాత ఒక ఇంగ్లీషు సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చి ఆ సినిమా మేకప్ మాన్ జిమ్మి వీనింగ్‌ను వివాహం చేసుకుని తెరమరుగయి పోయారు. హిందీలో ఆమె నటించిన ఒకే ఒక సినిమా ఇది. కాని ఇప్పటికీ ఈ పాట నెట్‌లో చూస్తున్న వారు వీరి గురించి కనుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంత కట్టిపడేసే అందం ఆమెది. గురుదత్ తన సినిమాలలో నటులను మార్చడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. అందరూ కలిసి మెలిసి ఒక జట్టుగా పని చేసేవారు ఆయన బానర్‌లో. అందుకే తన స్టూడియోతో సంబంధం ఉన్న వారందరి కోసం పాత్రలు సృష్టించేవారు ఆయన. అలా తాను సినీ రంగానికి పరిచయం చేసిన కుమ్ కుమ్‌కు ఒక పాత్ర తప్పకుండా ఇచ్చేవారు. ఈ సినిమాలో ప్రీతమ్ వదిన పాత్రలో కుమ్ కుమ్ కనిపిస్తారు. గొప్ప కథక్ డాన్సర్ ఆమె.

ఇందులో ‘ఠండీ హవా కాలి ఘటా’ అనే పాట కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు సినీ విశ్లేషకులు. బొంబాయి లోని ప్రసిద్ధ స్విమింగ్ పూల్‌లో చిత్రించిన పాట ఇది. అప్పట్లో చాలా ఆధునికంగా తీసిన పాటగా దీన్ని చెబుతారు. సినిమాలో కీలకమైన సన్నివేశం, ప్రీతం నేరాన్ని తనపై వేసుకుని సీతదేవిని వదలి వస్తున్నప్పుడు ‘మెరి దునియా లుట్ రహి థి’ అన్న  కవ్వాలి పాట వినిపిస్తుంది. వెలుగునీడల్లో గురుదత్ ముఖంపై ఒక బాధ, నిర్లిప్తత, వ్యంగ్యంతో కూడిన నవ్వుంటుంది. సినిమా మూడ్ మార్చే షాట్ అది. ఇప్పుడిది చూడగానే, మనకు ప్యాసా, కాగజ్ కే ఫూల్ సినిమాల్లోని తీవ్రమైన వేదనలో పెదవులపై ఒక నిరసన, వ్యంగ్యం వున్న గురుదత్ గుర్తుకువస్తాడు.  ‘మెరి దునియా లుట్ రహి థి’ అన్న ఖవ్వాలి కూడా చాలా మంది ఇష్టపడే కంపోజిషన్. ప్రీతం బాధను హృద్యంగా వినిపించే ఖవ్వాలి ఇది. దీని చిత్రీక్రరణలో కూడా క్లోజ్ అప్ షాట్లలో వీ.కే. మూర్తి పనితనం కనిపిస్తుంది. గురుదత్‌పై తీసిన ఈ షాట్లన్నీ కూడా గొప్ప కవిత్వానికి సరిపోయే అనుభూతిని ఇస్తాయి.  ఈ సినిమా విడుదలయినప్పుడు సినిమాను సమీక్షిస్తూ ఫిల్మ్ ఫేర్ పత్రిక   A thoroughly  delightful, honey and cream social comedy. Mr and Mrs 55 is a model of film craft and has gripping interest for every class of cine goer అని రాసింది.

వంద గొప్ప హిందీ  సినిమాల లిస్ట్‌లో ఇప్పటికీ 57వ స్థానంలో ఉండే ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ గురుదత్ సినిమాలలో ఒక పెద్ద హిట్ సినిమాగా నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here