Site icon Sanchika

మధురమైన బాధ – గురుదత్ సినిమా 6 – ఆర్ పార్

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ఆర్ పార్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]‘ఆ[/dropcap]ర్ పార్’ 1954లో వచ్చిన సినిమా. గురుదత్ దీనికి నిర్మాత, దర్శకులు, నటులు కూడా. ‘ఆర్ పార్’ సినిమా హిందీ సినిమా చరిత్రలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన సినిమా. గురుదత్ చాలా తక్కువ సినిమాలు తీసినా సినిమా రంగాన్ని ప్రభావితం చేసే సినిమాలు తీసారన్నది వారి సినిమాలను సమగ్రంగా విశ్లేషిస్తున్నప్పుడు గమనించవచ్చు. 1954కి ముందు తీసిన సినిమాలను గమనిస్తే ఆ సినిమాలలో పాత్రలన్నీ కూడా ఒక ప్రామాణిక భాషను మాట్లాడడం గమనిస్తాం. ‘ఆర్ పార్’ సినిమా బొంబాయి నగర నేపథ్యంలో నడుస్తుంది. బొంబాయి అంటేనే మన దేశంలో మొదటి కాస్మొపాలిటన్ నగరం, భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు కలిసి ఒక చోట జీవించే నగరం అది. అలాంటప్పుడు అక్కడి వారందరి భాష, యాస ఒకటే ఎలా అవుతాయి.

ఈ లాజిక్‌ను అనుసరించే, ఈ సినిమాలో మొట్టమొదటిసారి పాత్రలను వారి ప్రాంతాల బట్టి, వేరు వేరు యాసలతో మాట్లాడించే ప్రయత్నం చేసారు దర్శకులు. పాత్రల ఆర్థిక, సామాజిక స్థాయి బట్టి కూడా భాష మారుతూ ఉంటుంది. ఒకరు పంజాబీ యాసలో, మరొకరు ఉర్దూ ప్రభావిత హిందీని, ఒకరు పార్సీ పదాలతో కలిసిన హిందీని ,వీధులలో జీవించే వాళ్ళు, ప్రత్యేకమైన బొంబాయి యాసను మాట్లాడడం గమనిస్తాం. ఇన్ని రకాల యాసలు, అన్ని రకాల పాత్రలతో మాట్లాడిన మొదటి హిందీ సినిమా ‘ఆర్ పార్’. ఈ సినిమా నుండే పాత్రలను అనుసరించి భాషను, డైలాగులను సినిమాలకు రాయడం మొదలయ్యింది.

తన కెరియర్ మొదట్లో గురుదత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోలను సృష్టించడంలో ఆసక్తి చూపించారు. ఫ్రెంచ్ నౌర్ ప్రభవంతో సినిమాలు తీసిన మొదటి భారతీయ దర్శకుడు ఈయన. ఇక్బాల్  మసూద్ అనే ఒక ఫిలిం క్రిటిక్ యాభైవ దశకాన్ని ప్రభావితం చేసిన నలుగురు దర్శకుల గురించి ప్రస్తావిస్తారు. వారు మెహబూబ్ ఖాన్, బిమల్ రాయ్, గురుదత్, రాజ్ కపూర్. ఈ నలుగురు దర్శకుల బాణీ వేరయినా సినిమాలో వీరు చూపించిన కామన్ పాయింట్ ఒకటే. అది అంతరించి పోతున్న మానవత్వం. దేశంలోని పేదరికం, ఆర్థిక అసమానతల ప్రభావంతో వీరు సినీ పాత్రలను సృష్టించారు. అలాగే ఈ నలుగురూ భారతీయ సాంప్రదాయాలకు దూరం కాకుండా సినిమాలు తీసారు. అలాగే మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వినోదానికి పెద్ద పీట వేస్తూ సినిమాలు నిర్మించారు. ఈ నలుగురు దర్శకులు కూడా నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులను, నేరస్థులను తమ కథా వస్తువుగా తీసుకున్నారు. సిస్టమ్‌ను వ్యతిరేకించిన పాత్రలనే సృష్టించారు. ఆంటీ-హీరోలకు పెద్ద పీట వేసారు. ఎక్కడా సిస్టంతో పాటు నడవరు వీరి హీరోలు, సిస్టంతో ఒక నిరంతర యుద్ధం చేస్తూ ఉంటారు. రాజ్ కపూర్ ‘ఆవారా’, గురుదత్ ‘బాజ్’, ‘జాల్’, ‘ఆర్ పార్’, మెహబూబ్ ఖాన్ ‘మదర్ ఇండియా’ లోని పాత్రలు ఈ కోవకు చెందినవే, అయితే ఆ నేరస్థులు చేసే నేరం వెనుక ఉన్న సామాజిక కారణాలను వెతకమని చెప్పేవి వారి సినిమాలు.

రాజ్ కపూర్ ‘అవారా’లో సమాజం నేరస్థులను తయారు చేస్తుందని చెప్తారు. విజయ ఆనంద్ లాంటి దర్శకులు నేరస్థుల పరిస్థితుల వైపు ప్రేక్షకుల దృష్టి మరల్చే సినిమాలు తీసారు. దీనికి ఉదాహరణ ‘కాలా బజార్’. అయితే గురుదత్ వీరందరి కంటే ఇంకాస్త ముందుకు వెళుతూ బోల్డ్‌గా తన పాత్రలను చూపించారు. గురుదత్ సినిమాలో యాంటీ-హీరోలు తమ జీవితాలకు బాధపడరు, తమ ప్రవర్తనకు సిగ్గు పడరు. రాజ్ కపూర్ సినిమాలలో యాంటీ-హీరోలుగా నిత్యం అపరాధ భావంతో కుచించుకుపోరు. ‘జాల్’ లో దేవ్ ఆనంద్ పాత్రను గమనిస్తే అతనో దుర్మార్గుడు, దానికి పరిస్థితుల కారణం అనో ఇంకేదో అనో సానూభూతి సంపాదించే ప్రయత్నం చేయరు గురుదత్. ఇలాంటి వారు ఉంటారన్నది నిజం. ఆ నిజాన్ని అంతే పచ్చిగా చూపిస్తారు. ‘జాల్’ లో దేవ్ ఆనంద్ పాత్ర లాంటిది అంతకు ముందు హిందీ సినిమాలో మనకు కనిపించదు. జర్మన్ సినిమాలలోని ఎక్స్‌ప్రెషనిజంని ప్రెంచ్ నౌర్‌ని కలిపి తన పాత్రలను భారతీయం చేసిన మొదటి దర్శకుడు గురు దత్.

గురు దత్ సినిమాలలో గమనించవలసిన మరో విషయం ఇంటికన్నా వీధి పై ఆ పాత్రల మమకారం. వీరి పాత్రలు ఇంటికి అంటుకుపోయి సౌకర్యవంతమైన జీవితం జీవిస్తూ కనిపించరు. వీరి సినిమాలో ‘వీధి’ అంటే సమాజం ఎక్కువగా కనిపిస్తుంది. ‘ఆర్ పార్’, కావచ్చు ‘బాజీ’ కావచ్చు ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ కావచ్చు. హీరో ఎక్కువగా వీధిలో కనిపిస్తాడు. ఒక ఇంట్లో సురక్షితమైన జీవితం మధ్య ఉండరు వారంతా, ఇక్కడ వీధి సమాజానికి ప్రతీక, సమాజంలో ఒకడిగా గుంపుతో ఉంటారు గురుదత్ హీరోలు. ఆ ఎక్స్‌ప్రెషనిజం ‘ప్యాసా’ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా ఎలివేట్ అయి కనిపిస్తుంది. ఆ వీధిలో ఒకరిగా సంచరిస్తున ఒంటరి వాళ్ళు అందరూ. తమదనే చోటు లేని వ్యక్తులు, ఆ చోటు కోసం తపించి పోయే ఆర్తులు ఆయన పాత్రలన్నీ కూడా. తన హీరోలను సృష్టించేటప్పుడు రాజ్ కపూర్ వారిలో అమాయకత్వాన్ని అసహాయతను చూపిస్తే, గురుదత్ హీరోలు సమాజంలోని అన్యాయాన్ని, దానిని ఎదుర్కుంటూ గట్టిపడిపోయే మనుషులుగా కనిపిస్తారు. ఇది వీరి సినీ హీరో పాత్రలన్నిటినీ పరిశీలిస్తే అర్థం అవుతుంది. ‘ఆర్ పార్’, ‘బాజీ’, ‘జాల్’ లో గురుదత్ హీరోలు తమలోని ఆ నేర ప్రవృత్తిని సమాజంపై తిరుగుబాటుగా చూపిస్తూ చివర్లో మాత్రం వారికి పాజిటివ్‌గా బ్రతికే అవకాశం కల్పిస్తారు గురుదత్, కాని ‘ప్యాసా’ దగ్గరకు వచ్చే సరికి ఆ హీరో మళ్ళీ సాధారణ స్థితికి రాలేని మనఃస్థితికి చేరుకుంటాడు. అదే అతను సమాజాన్ని త్యజించి వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. అదే స్వభావం ‘కాగజ్ కె ఫూల్’ లో సురేష్ పాత్రలోనూ చూస్తాం. చివరికి గురు దత్ జీవితంలోనూ అదే కనిపిస్తుంది.

‘జాల్’ సినిమాలో తన తప్పుడు జీవితాన్ని దర్జాగా జీవించే హీరో లాగానే ‘ఆర్ పార్’ లో షకీలా పాత్రను మలిచారు గురు దత్. అప్పటి దాకా వాంప్ లకి ప్రధాన పాత్ర ఏ సినిమాలోనూ లబించలేదు. గురు దత్ సినిమాలో షకీలా పాత్ర అప్పటి స్త్రీ పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె ఒక బార్‌లో డాన్సర్. స్మగ్లింగ్ కార్యకలాపాలలో ఇష్టపూర్వకంగా పాల్గొంటుంది. టాక్సీ నడిపించే కాలూని ప్రేమిస్తుంది. అతన్ని తన వానిగా చేసుకోవాలనుకుంటుంది. కాని చివర్లో కాలూ తనకు దక్కడని తెలిసి తనను తాను పోలీసుల నుండి కాపాడుకోవడానికి కాలు, ఆతని ప్రియురాలు నిక్కిపై కాల్పులు కూడా జరుపుతుంది. తన జీవితం ఆమెకు ముఖ్యం. త్యాగం, దయ, ప్రేమ అంటూ తనకు హానీ చేసుకోవడానికి ఆమె ఇష్టపడదు. అలాగే తన నేర ప్రవృత్తి పట్ల ఆమెకేమీ పశ్చాత్తాపం ఉండదు. ఈ సమాజంలో బ్రతకడానికి ఆమెకు దొరికిన దారి అది. అలాగే బ్రతుకుతుంది. నీతిమంతుళ్లను చూసి సిగ్గుతో, అనుక్షణం అపరాధభావంతో జీవించదు. ఇలాంటి పాత్రలను సృష్టించి సొసైటీ పట్ల తన ప్రాక్టికల్ ధోరణులు చూపించారు గురు దత్. ఆమె ఎంతగా ఆ జీవితానికి అలవాటు పడిందంటే ఏ మంచీ ఆమెను మార్చలేదు. అది సాధ్యం కాదు కూడా. అంతగా సమాజం అనే సుడిగుండం మనిషిని తనలోకి లాగేసుకుంటుంది. ఇవే షేడ్స్ మనకు ‘సి.ఐ.డి’ సినిమాలో వహీదా రెహ్మాన్ పాత్రలో కొంత వరకు కనిపిస్తాయి. ఇలాంటి సమాజం చెక్కిన కఠినమైన వ్యక్తిత్వాలను గురు దత్ తన కెరియర్ మొదట్లో క్రిమినల్ పాత్రలుగా చిత్రిస్తూ, ఆ లక్షణాలను అలాగే ఉంచుతూ సెల్ప్ డిస్ట్రెక్టివ్ పాత్రల దిశగా ప్రయాణించడం ‘ఆర్ పార్’ సినిమా విశ్లేషణలో గమనించవలసిన విషయం.

‘ఆర్ పార్’ లో హీరో కాలు. మొదటీ సీన్ జైల్లోనే మొదలవుతుంది. రాష్ డ్రైవింగ్ కారణంగా అరెస్ట్ అయి సత్ప్రవర్తన కారణంగా రెండు నెలల ముందు విడుదల అవుతాడు కాలు. జైలులో తోటి ఖైదీ ఒక కోడ్‌లో ఉన్న సమాచారాన్ని ఒక బార్‌లో బాస్ అనబడే వ్యక్తికి చెప్పమని కాలుని అభ్యర్ధిస్తాడు. కాలూ బైటికి వచ్చాక అతనికి ఉండడానికి చోటు దొరకదు. అక్క అతని బాగు కోరుకునే వ్యక్తే అయినా ఆ ఇంట బావ ఉండనివ్వడు. ఫుట్‌పాత్ మీద ఉండవలసి వస్తుంది. అతను జైలుకి వెళ్ళి వచ్చాడని ఎక్కడా పని దొరకదు. కష్టం మీద ఒక గారేజీలో పని దొరుకుతుంది. ఆ గారేజ్ ఓనరు కూతురు నిక్కిని అతను ప్రేమిస్తాడు. కాని జైలు నుండి విడుదల అయి వచ్చాడని అతన్ని పనిలోంచి తీసి వేస్తాడు ఓనర్. అతని జైలు మిత్రుని సందేశం విన్న బాస్ అతనికి ఒక టాక్సీ ఇప్పించి తమ దగ్గర పనికి పెట్టుకుంటాడు. వారి స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఈ టాక్సీ ఉపయోగించుకుంటాడు. నిక్కి తండ్రి తమ వివాహానికి ఒప్పుకోడు కాబట్టి ఆమెను తనతో అర్ధరాత్రి వచ్చేయమని అడుగుతాడు కాలు. నిక్కి తప్పు ఒప్పు గుంజాటనలో పడి భయం భయంగా చివరకు ఆలస్యంగా కాలు చెప్పిన చోటుకు చేరుకుంటుంది. అప్పటికే ఆమె తనతో ఇక రాదని నిశ్చయించుకుని అప్పటి దాకా ఆమె కోసం ఎదురు చూసిన కాలు వెళ్ళిపోతాడు. చివరకు ప్రేమికులు కలవడం, స్మగ్లర్లు పోలీసులకు చిక్కడం సినిమా ముగింపు.

ఈ సినిమా సంభాషణలు ఒక ట్రెండ్ సృష్టిస్తే, పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసిన ఈ పాటలకు ఓ.పీ. నయ్యర్ సంగీతం సమకూర్చారు. ఓ.పీ. నయ్యర్ దీనికన్నా ముందు ‘బాజ్’ సినిమాకు సంగీతం అందించారు. అది ప్లాప్ అయ్యింది. ఆయనకు ఇస్తానన్న డబ్బు కూడా గురుదత్ ఇవ్వలేకపోయారు. తనకు డబ్బు ఇవ్వమని అడగడానికి ఓ.పీ. గురు దత్ ఇంటికి వెళితే ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగింది. హోటల్‌లో భార్యా కూతురుతో ఉన్న ఓ.పీ.కి హోటల్ రూమ్ ఖాళీ చేయడానికి కూడ డబ్బు లేదు. గురు దత్ దగ్గరా డబ్బు లేదు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు, డిస్ట్రిబ్యూటర్ కే.కే. కపూర్ అక్కడకు వచ్చారు. కొంత డబ్బు ఇచ్చి ఓ.పీ.ని ముందు హోటల్ బిల్ కట్టమని చెప్పి మరునాడు మళ్ళీ అక్కడికే రమ్మని చెప్పి పంపించారు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన ఓ.పీ.ని గురుదత్ ప్రేమగా పలకరించి అతని చేతిలో కొంత డబ్బు పెట్టి, తన మరో సినిమాకు సంగీత దర్శకత్వం చేయమని, ఇది తమ ఇద్దరికీ పరీక్ష అని ఆర్ లేదా పార్ అని సినిమా హిట్ అయితే ఇద్దరం నిలదొక్కుకుంటాం, లేదా ఇదే మన చివరి ప్రయత్నం అని చెబుతూ, అంతకు ముందు ఫేయిల్ అయిన సినిమాకు దీనికి రెంటికీ డబ్బు నెలనెలా ఇస్తానని ఇక ఈ సినిమా విజయం మీదే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని తాడో పేడో(ఆర్ – పార్) తేల్చుకుందాం అని చెప్పారట. అలా అదే సినిమా పేరుగా నిర్ణయించి ఈ సినిమా మొదలెట్టారు గురుదత్. ‘ఆర్ పార్’ అతి పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ప్రజలకు ఎంతో నచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఓ.పీ. గురుదత్ ఇద్దరూ సినీ రంగాన్ని కొన్ని సంవత్సరాలు శాసించారు.

సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుంటాయి. శంషాద్ బేగం పాడిన ‘కభీ ఆర్ కభీ పార్’ పాట ఈ రోజుకు ఎన్నో రీమిక్సులతో మనముందుకు వస్తుంది. ఈ పాటతో సినీ రంగ ప్రవేశం చేసారు కుమ్ కుమ్. ‘మొహబ్బత్ కర్లో జీ భర్లో’ అనే పాటలో సుమన్ కళ్యాణ్‌పూర్ కూడా గొంతు కలిపారు. ఓ.పీ. నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన ఒకే ఒక పాట ఇది. ఓ.పీ నయ్యర్‌కి లతకు మధ్య వైరం ఉండేది. లత లేకుండా తాను పాటలకు సంగీతం ఇస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసారు ఓ పీ. సుమన్ కళ్యాణ్‌పూర్ గొంతు లతను పోలి ఉండేది. ఆమెతో పాడిస్తే లత గొంతు పై మోజుతో, తన అహం తృప్తి కోసం సుమన్ కళ్యాణ్‌పూర్‌చే ఓ.పీ. పాడిస్తున్నారని ఇతరులు అంటారని ఓ.పీ. ఈ పాట తరువాత మరే పాటను ఆమెతో పాడించలేదు. లతా మంగేష్కర్ గొంతును పోలి ఉండడం వలన సుమన్ కళ్యాణ్‌పూర్ చాలా అవకాశాలను ఇలా పోగొట్టుకున్నారట. ఇక బాబూజీ ధీరే చల్నా పాట పల్లవి స్పానిష్ పాట్ క్విజాజ్ కిజాజ్ ప్రభావంతో తయారయ్యింది. గురుదత్ ఈ పాటను ఇష్టపడి ఓ.పీ.కి అది వినిపించే ఆ పద్ధతిలో బాణీ కట్టించుకున్నారట. ఎన్నో ఇంటర్నేషనల్ రీ-మిక్స్‌లు అయిన పాట ఇది. ఈ పాటను ‘సలాం ఎ ఇష్క్’ అన్న సినిమాలో మరో సారి కొత్త తరం దర్శకులు ఉపయోగించుకున్నారు కూడా.

పాటల దగ్గరకు వచ్చే సరికి అవి సాధారణ ప్రజలకు చేరువ అవ్వాలి కాని గ్రామర్ కొన్ని సార్లు పట్టించుకోనవసరం లేదంటూ అప్పటి దాకా వస్తున్న పాటల ట్రెండ్‌ను మార్చారు గురుదత్. ఈ సినిమాలో ‘సున్ సున్ సున్ సున్ జాలిమా’ అనే ఒక డ్యూయెట్ ఉంది. సున్ సున్ అన్నది వ్యాకరణ పరంగా చూస్తే తప్పు, సునో సునో అని రావాలి, మజ్రూహ్ అలాగే ఈ పాటను రాసారు కూడా, ట్యూన్ దగ్గర అనుకున్న ఎఫెక్ట్ రాకపోవడంతో గురుదత్ సినిమాలో   ఈ పాట పాడే కాలు చదువు రాని వాడు. ఇక్కడ భావం ముఖ్యం కాని వ్యాకరణం కాదని ‘సున్ సున్ సున్ సున్ జాలిమా’గా ఆ మొదటి వాక్యాన్ని మార్చుకున్నారట. ఇది అప్పట్లో చాలా హిట్ అయిన డ్యూయెట్. ఇంతగా వ్యాకరణ దోషాలతో ప్రజల మధ్యకు వచ్చిన మొదటి పాపులర్ పాట కూడా ఇదే. అలాగే మధ్య ప్రదేశ్ ప్రాంతపు హిందీ మాట్లాడతాడు కాలు. అతని డైలాగులన్నీ ఇదే యాసలో ఉంటాయి. యార్ అంటూ స్నేహితుడ్ని సాంఘిక సినిమాలలో సంబోధించడం ఈ సినిమా తోనే మొదలయింది. బొంబాయి వీధి భాషకు సినిమాలో చోటు కూడా మొట్టమొదట దొరికింది ఈ సినిమాలోనే. సినిమాలో క్లబ్ డాన్సర్‌గా చేసిన షకీలా పేరు ప్రస్తావన సినిమాలో ఎక్కడా ఉండదు. ఒక పాత్రకు పేరు లేకుండా సినిమా అంతా నడిపించడం ‘ఆర్ పార్’ లోనే చూస్తాం. పార్సీ హిందీతో రుస్తుం, పంజాబీ పల్లెయాసతో లాలాజీ , బొంబాయి భాషతో ఇలాయిచీ ఇలా భాష పై పరిశోధన చేయగలిగినన్ని యాసలు, ప్రాసలతో ఈ సినిమాలో పాత్రల మధ్య డైలాగులుంటాయి. వీటిని అలా తీర్చారు అబ్రర్ అల్వీ. ఈ సినిమాతో ఆయన గురుదత్ సినిమాలకు ఆస్థాన రచయితగా స్థిరపడిపోయారు. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా గురుదత్ సోదరుడు ఆత్మారాం పని చేసారు.

ఆర్ పార్ సినిమాకు డ్రైవ్ ఎ క్రూకెడ్ రోడ్ అనే సినిమా ప్రేరణ. ఆరంభంలో ఈ సినిమాకు బీఎంటీ 112 అని పేరు పెట్టారు. తరువాత ఆర్ పార్ గా మార్చారు. ఆరంభంలో గీతాబాలిని నాయికగా అనుకున్నారు. కానీ, వారిద్దరి కలయికలో వచ్చిన బాజ్ విఫలమవటంతో గీతాబాలి నటించటంతోపాటూ సినిమా నిర్మించటంనుంచీ తప్పుకుంది. దాంతో గురుదత్ స్వంత నిర్మాణ సంస్థను స్థాపించాడు. దీనికి ముందు వచ్చిన ‘బాజ్’ సినిమా ఫెయిల్ అవడంతో ఈ సినిమాలో గురుదత్ కాకుండా షమ్మీ కపూర్ నటిస్తే బావుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ భావించారట.  షమ్మికపూర్ గురుదత్ మంచి స్నేహితులు. గురుదత్  నటించిన భాగం రషెస్ చూసిన షమ్మికపూర్ ఈ పాత్రకు గురుదత్ సరిపోతాడని భావించాడు. దాంతో తనకు డేట్స్ లేవని చెప్పాడు.  షమ్మికపూర్  డేట్లు లేవనటంతో  గురుదత్‌కు  నటించక తప్పలేదట. ఈ సినిమాలో చాలా భాగం ఔట్ డోర్‌లో షూట్ చేసారు. అప్పట్లో స్టూడియో పద్దతి ఎక్కువగా ఉండేది. అందువలన ఈ ఔట్ డోర్ షాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో సినీ విశ్లేషకులు. కాలూ పని చేసే గారజ్ కూడా అప్పట్లో బోంబాయిలోని ఒక ప్రఖ్యాత గారేజ్ అట. సెట్లు లేకుండా నిజం చోట్లకు వెళ్ళి సినిమా తీయడం అప్పట్లో ఒక పెద్ద ప్రయోగం. రుస్తుం పాత్రలో జానీ వాకర్ నటిస్తే అతని ప్రేయసిగా నూర్ నటించారు. ఈమె నటి షకీలా సోదరి. ఈ సినిమాలో నటించిన జానీ వాకర్‌ని ప్రేమించి తరువాత వీరు వివాహం చేసుకున్నారు.

‘ఆర్ పార్’ సినిమాతో గురుదత్ పూర్తి స్థాయి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వారి పాటల చిత్రీకరణను గమనిస్తే ఆ పాత్రల స్వభావానికి అనుగుణంగా, సీన్ వాతావరణం చెడిపోకుండా పాటను చిత్రించడం గమనించవచ్చు. కార్ గారేజ్‌లో ‘సున్ సున్ సున్ సున్ జాలిమా’ పాట చిత్రించిన విధానం చూడండి. కార్ చుట్టూ తిరుగుతూ హీరో హీరోయిన్లు పాడే ఆ పాట ఆ పాత్రల స్వభావాన్ని ఎంత బాగా చూపిస్తుంది. అలాగే ‘ఏ లో మై హారీ పీయా’ పాట కారులోనే మొత్తం షూట్ చేసారు. ‘కభీ ఆర్ కభీ పార్’ అపార్ట్‌మెంట్ కడుతున్న కూలీలు పని చేస్తుండగా చిత్రీకరించిన పాట. ఆ పాటలో సాహిత్యం, భాష కూడ పాడేవారి వర్గాన్ని, స్థాయిని సూచించేటట్లు జాగ్రత్తపడ్డారు గురుదత్.

పూర్తి ట్రాజెడీకి గురుదత్ మరలబోయే ముందుగా ఆయన తీసిన కామెడీలలో ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రస్తావించడానికి కారణం, ఈ సినిమా సంగీతం, సంభాషణలు, వీ.కే. మూర్తి ఫోటోగ్రఫీ. ఔట్ డోర్ షూటింగ్లు, మరీ ప్రత్యేకంగా మానసిక  విశ్లేషణ చేయదగ్గ స్థాయిలో తీర్చబడిన పాత్రలు. ఈ సినిమాలోని షకీలా పాత్ర ఆ తరువాత ఎన్నో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్త్రీ పాత్రలకు నాంది అయింది. ఇలా అన్ని రకాలుగానూ ట్రెండ్ సెటర్‌గా స్థిరపడిన గురు దత్ సినిమా ‘ఆర్ పార్’ గురుదత్ సినీ రంగ ప్రారంభంలోనే చేసిన ఒక గొప్ప ప్రయోగం.

Exit mobile version