వైవిధ్య కథల కదంబం – మధువనం

0
2

[dropcap]శ్రీ[/dropcap]మతి ఉప్పలూరి మధుపత్ర శైలజ రచించిన ‘మధువనం’ కథాసంపుటిలో 22 కథలున్నాయి. ఇందులోని 15 కథలకు బహుమతులు రావడం విశేషం.

“నేడు సమాజంలో వచ్చిన మార్పులను, సమస్యలను ఈ సంపుటి లోని కథల ఇతివృత్తంగా ప్రస్తావిస్తూ, వాటికి నాకు తోచిన పరిష్కారాలను కూడా సూచించటం జరిగింది” అన్నారు రచయిత్రి తమ ముందుమాటలో.

“శైలజ కథలు ఏవో టైం పాస్ బటానీలు కావు. ప్రతి కథ వెనుక రచయిత్రిదైన సోషల్ కమిట్‍మెంట్ వుంది” అని వ్యాఖ్యానించారు శ్రీ పాణ్యం దత్తశర్మ. “ఇందులోని కథలన్నీ సాదాసీదా కథలు మాత్రం కావు. సామాజిక సమస్యలను ఆవిష్కరించిన కథలు” అని పేర్కొన్నారు శ్రీ సిహెచ్ శివరామ ప్రసాద్ (వాణిశ్రీ).

***

రాజకీయ నాయకులు సామాన్య కల్పించిన అపోహలు ఆత్మీయులైన రెండు ప్రాంతాల కుటుంబాలపై ఎలా ప్రభావం చేశాయో ‘స్నేహానికన్న మిన్న..’ కథ చెబుతుంది. ఆంధ్ర ప్రాంతం మిత్రుడిపై తాను మోపిన ఆరోపణలను పరాయి దేశంలో తాను ఎదుర్కున్నప్పుడు చందు మనసులోని దురభిప్రాయం తొలగిపోతుంది. మనమంతా ఒక్కటే, మానవత్వం నిండిన మనుషులమని గ్రహిస్తాడు.

తండ్రి ఇంట్లోంచి తరిమేసిన జననిని శివశంకరం అనే ఓ రైల్వే కానిస్టేబుల్ ఆదరిస్తాడు. అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసే అలవాటు ఉన్న ఉత్తమ వ్యక్తి శివశంకరం. చదువులోని రాణించి, ఉత్తమ సంస్కారం అలవర్చుకున్న జననికి ఓ సభలో అందరికీ పరిచయం చేస్తాడు. టివిలో ఆ కార్యక్రమం చూసిన సొంత తండ్రి కంట నీరు కారుతుంది. ‘కానిస్టేబుల్ కూతురు’ మనసును తాకే కథ.

కరోనా అందరిపై ప్రభావం చూపినట్టే, ఓ పేద పూజారి జీవితంపై కూడా చూపుతుంది. కరోనా ప్రభావానికి గురై, ఆదాయం లేక భిక్షాటనకి దిగుతాడో పూజారి ‘గుడిగంట మ్రోగని వేళ..’ కథలో. అయితే సహృదయుడైన ఓ టివి ఛానెల్ అధిపతి రవిప్రసాద్ దృష్టిలో ఈ వార్త పడి, ఆ పూజారికి సాయం చేయడానికి ముందుకు రావడమే కాకుండా – ఆ కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఇతర ఆలయాల పూజారుల కోసం కూడా ఒక నిధి ఏర్పాటు చేస్తాడు. ఆ పూజారికి వ్యక్తిగత సహాయం చేయబోతే, తనకన్నా పేదవారు చాలామంది అలమటిస్తున్నారని వారికి మేలు చేయమని కోరుతాడు.

బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన శ్రీకాంత్‌కి పెళ్ళి చేయలనుకుంటారు తల్లిదండ్రులు. అయితే వారి ఆకాంక్షలకి భిన్నంగా అమెరికాలో మౌనిక అనే అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్తాడు. తండ్రి  అంగీకరించినా, తల్లి ఒప్పుకోదు. చివరికి ఇరువైపులా పెద్దలు ఆమోదం తెలుపుతారు. కానీ ఒక ప్రమాదంలో వికలాంగురాలవుతుంది మౌనిక. ఆమె సంసార జీవితానికి పనికిరాదని తెలిసినా, ఆమెనే పెళ్ళి చేసుకుంటాడు శ్రీకాంత్. శారీరకంగా కాస్త కోలుకుని, మానసికంగా ఊరట చెందుతుంది మౌనిక. ఓ సంస్థ నిర్వహించిన పోటీలో ఉత్తమ జంటగా ఎంపికవుతారు శ్రీకాంత్, మౌనిక. కొడుకు చేసిన పని వల్ల శ్రీకాంత్ తల్లిదండ్రులలో ‘పుత్రోత్సాహం’ కలుగుతుంది.

‘ఎంత ఘాటు ప్రేమయో!’ కథ నవ్విస్తుంది. చెణుకులు విసురుతుంది. ఆధునిక పోకటల మీద సెటైర్ ఈ కథ.

‘మందు తెచ్చిన మార్పు’ కథ తాగుడికి బానిస అయిన సాంబయ్య అనే వ్యక్తిలో మార్పు తేవడానికి అతని కుటుంబం చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది. తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అపోహపడి తన భార్య మీద, బావమరిది మీద  పోలీసులకి ఫిర్యాదు చేసిన సాంబయ్య నిజం తెలిసి ఆత్మవిమర్శ చేసుకుంటాడు.

శ్రీ దామోదరం సంజీవయ్య గారి జీవితాన్ని స్పర్శిస్తూ అల్లిన కథ ‘పూరింటి నుండి పార్లమెంట్ దాకా..’. నేటి రాజకీయ నాయకులు ఆయన జీవితంలో నుంచి గ్రహించాల్సిన అంశాలను రచయిత్రి తెలిపారు.

ప్రమాదంలో పడుతున్న తెలుగు భాషను రక్షించుకునేందుకు శ్రీనాథ్ అనే విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నాన్ని ‘తెలుగును వెలిగిద్దాం’ కథ చెబుతుంది. శ్రీనాథ్ ఆశయానికి ఆయన మిత్రులు చేయూత నివ్వాలని నిర్ణయించుకుంటారు.

అమ్మ కష్టం తెలుసుకుని, తల్లికి సాయం చేయాలనుకున్న చిన్నారి గోపిని శంకరం మాస్టారు ప్రోత్సహించిన వైనాన్ని ‘అమ్మ కోసం’ కథ చెబుతుంది.

రాష్‌గా కారు నడిపి ఓ ప్రమాదానికి కారణమవుతుంది సుష్మ. పోలీసులు వచ్చి కారులో ఉన్న అమ్మాయిలందరినీ స్టేషన్‌కి తీసుకువెళ్తారు. సుష్మని గుర్తుపట్టిన ఓ కానిస్టేబుల్ ఆమె ఎవరో సి.ఐ.కి చెప్తాడు. గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని తెలిసాకా, వారి వైద్యానికి ఏర్పాట్లు చేసి సుష్మకి శిక్ష విధిస్తాడు ఆమె తండ్రి. అదేం శిక్షో, ఆమెలో కలిగిన నిజమైన పశ్చాత్తాపాన్ని ‘పరివర్తన’ కథ చెబుతుంది.

ఓ అంతర్జాతీయ చిత్రకళా పోటీలో భారత ప్రతినిధిగా పాల్గొంటాడు దివాకర్. పేదరికం అన్న అంశంగా చిత్రించబడిన పెయింటింగ్‌కి ప్రథమ బహుమతి పొందుతాడు. శాన్‌ఫ్రాన్సిస్కో లోని ఓ ప్రసిద్ధ ఆడిటోరియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ‘దేవుడయ్య’ అనే వ్యక్తి సహృదయతని వెల్లడిస్తాడు దివాకర్. ఆ పోటీలో గెలిచిన బహుమతిని దేవుడయ్యకి అందించి దాన్ని సద్వినియోగం చేయమంటాడు. ‘పేదింటి పెన్నిధి’ హృద్యమైన కథ.

పల్లెటూరి బ్రాంచిలో ఉద్యోగం వచ్చినందుకు విసుక్కున్న అశోక్‌కి తల్లి భారతి నచ్చజెపుతుంది. చేసేదేం లేక శివాజీపురం అనే ఆ ఊరికి బయల్దేరుతాడు. అక్కడ బస్ దిగిన అతనికి శేఖర్ అనే అదే బ్యాంకులో పని చేసే ఉద్యోగి పరిచయం అవుతాడు. శేఖర్ ద్వారా ఆ బ్యాంకు విశిష్టత తెలుసుకుని, ఊరి ప్రజల ఆదరణ అర్థం చేసుకున్న అశోక్ ఆ ఊరి వాళ్ళు చేసున్న మంచిపనిలో తానూ భాగం కావాలనుకుంటాడు. ‘గురువారం’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.

ఊర్లో ఉన్న పొలం కరువు  బారిన పడి బీడుగా మారితో – కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తోటివారితో పాటుగా బెంగుళూరు నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఊరికి పనికి వెడతాడు చెన్నప్ప. అక్కడా పొలాలు, పశువులని చూసుకునే పనే కాబట్టి అతనికి ఇబ్బంది ఏమీ కలుగదు. కానీ రాత్రుళ్లు తమ ఊరు, ఇల్లు, కొడుకు గుర్తొచ్చి బాధపడ్తాడు. అక్కడ ఊర్లో చెన్నప్ప తల్లిదండ్రులు కూడా ఈ సంకట స్థితి పట్ల బాధపడుతూంటారు. అయితే చేస్తున్న పని కూడా పోవడంతో మరో చోట ప్రయత్నించి అక్కడా ఉండలేక ఇంటికి వచ్చేస్తాడు. అతని కోసమే చూస్తున్న కుటుంబ సభ్యులు ఆనందిస్తారు. ఏ ఇబ్బందైనా అందరం కలిసి ఇక్కడే ఎదుర్కుందాం, కష్టపడి బతుకుదాం అని నిర్ణయించుకుంటారు. కళ్ళు చెమరించే కథ ‘మట్టి మిద్దె’.

పాత్రికేయ వృత్తిలో కొత్తగా అడుగుపెట్టిన మధుకర్‌కి ఓ విషయం తెలుస్తుంది. కాటికాపరిగా ఓ మహిళని పనిచేస్తోందని తెలిసి ఆ కథనాన్ని కవర్ చేయాలని అనుకుంటాడు. ఆమెని కలవాలని వెళ్ళి – ఆమె తన చిన్నాన్నతో చెప్తున్న మాటలని విని ఆమె ఔన్నత్యాన్ని గ్రహించి వెనుతిరుగుతాడు. తాను చేస్తున్న పనులే తన పిల్లలను మంచిదారిలో నిలుపుతాయనే ఆమె నమ్మకాన్ని ‘జీవన పోరాటం’ కథ స్పష్టం చేస్తుంది.

గతం గురించి ఆలోచిస్తే బాధే మిగులుతుంది, వర్తమానంలో జీవిస్తే ఆనందం ఉంటుందని చెప్పే కథ ‘చెదరని బంధం’. అవయవదానం గొప్పదనాన్ని చాటిన కథ ఇది.

ఆరేళ్ళ పాటు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న కొడుకు – తల్లికి అనారోగ్యమని తెలిసి ఇండియాకి బయల్దేరుతాడు. ఢిల్లీ ఎయిర్‍పోర్ట్‌లో స్క్రీనింగ్‍లో తెలియకపోయినా, హైదరాబాదు విమానాశ్రయంలో అతనికి కరోనా పాజిటివ్ అని తేలి, క్వారెంటైన్‍లో ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతనిలో చెలరేగిన భావ సంఘర్షణకి అద్దం పట్టిన కథ ‘కనువిప్పు’. ఓ చిన్న పాప మాటలు అతను చేయాలనుకున్న పొరపాటు పనిని నిలువరిస్తాయి. ఆసక్తిగా చదివించే కథ ఇది.

మంచి మనసులు ఉన్న మనుషుల కథ ‘మాతృదేవో భవ’. మగపిల్లలు మాత్రమే కావాలనుకుని, ఆడపిల్లలను వద్దనుకునే వారి స్వభావాలను అత్యంత సహజంగా వ్యక్తం చేసింది ఈ కథ.

‘కథతో పాదయాత్ర’ పేరిట విజయనగరం నుండి శ్రీకాకుళం లోని కథానిలయం వరకు జరిగిన సాహితీ యాత్ర పై అల్లిన కథ ‘ఆ కళ్ళు’. ఈ పాదయాత్ర ఓ రచయితలో మంచి మార్పుకు కారణమవుతుంది.

తమ తండ్రి ‘మూడో కోరిక’ ఏమిటో తెలుసుకున్న పిల్లలు ఆ కోరికని తీర్చడానికి ఏం చేసారో ఈ కథలో చదవాలి. కుటుంబ సభ్యుల ఆప్యాయతానురాగాలకు అద్దం పట్టిన కథ ఇది. ఆ మూడో కోరిక ఆయన కోరిన రెండు కోరికలకి భిన్నమైనది, గొప్పది అని తెలుస్తుంది.

విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటైజేషన్ నేపథ్యంలో అల్లిన కథ ‘ప్రేరణ’. విశాఖలో స్టీలు ప్లాంట్ ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితులు, ఆనాటి పెద్దల పోరాటాలను రచయిత్రి వెల్లడిస్తారు. స్టీలు ప్లాంటుని కాపాడుకోవడానికి సందీప్ అనే యువకుడు చేసిన ప్రయత్నాన్ని ఈ కథ చెబుతుంది.

‘రాములోరి కుర్చీ’ ఉన్నతాశయాలు కల దేవమ్మ కథ. తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి దేవమ్మ చేసిన కృషిని ఈ కథ చెప్తుంది. ఓ మారుమూల పల్లెలో జరిగిన యథార్థ సంఘటనను కథగా మలిచారు రచయిత్రి. ఈ కథ కన్నడంలోకి అనువాదమయింది.

శ్మశానాన్నే ఇల్లుగా మార్చుకుని కాటికాపరి వృత్తినే జీవనోపాధిగా మార్చుకుని – తోటివారికి తనకి వీలైన సాయం చేసే రామన్న కథ ‘శ్మశానే వసంతం..’. చివర్లో చక్కని సందేశమిస్తుంది ఈ కథ.

~

సరళమైన వాక్యాలతో, అలతి పదాలతో అల్లిన చక్కని కథలు ఇవి.

సమాజంలోని పలువర్గాల వారు ఎదుర్కుంటున్న సమస్యలను గుర్తించి – తమ కథలలో పాత్రలుగా మార్చి – ఆయా సమస్యలను అందరి దృష్టికి తెచ్చి – యోగ్యమైనవని తను అనుకున్న పరిష్కారాలు సూచించారు రచయిత్రి.

చదవాల్సిన కథాసంపుటి ‘మధువనం’.

***

మధువనం (కథాసంపుటి)
రచన: ఉప్పలూరి మధుపత్ర శైలజ
ప్రచురణ: కస్తూరి విజయం ప్రచురణలు
పేజీలు: 146
వెల: ₹ 260/-
ప్రతులకు: Amazon, flipkart, Google Play, ebooks, Rakuten and KOBO
https://www.amazon.in/MadhuVanam-KathaSamputi-Uppaluri-Madhupatra-Sailaja/dp/8196056273

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here