తెలంగాణ రచయిత్రుల సాహిత్య ప్రస్థానంలో మాదిరెడ్డి సులోచన ఒక మైలురాయి. ఆచార్య పి. యశోదారెడ్డి తరువాత తెలంగాణ పలుకుబడి, తెలంగాణ స్థానీయతను మాదిరెడ్డి రచనల్లో మాత్రమే చూడగలం. మహబూబ్‌నగర్ జిల్లా శంషాబాద్‌లో 26 అక్టోబర్ 1935లో మాదిరెడ్డి సులోచన ఒక భూస్వామ్య కుటుంబంలో మామిడి రామకృష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు.
ఆ రోజుల్లో దొరలు, దేశ్‌ముఖ్‌ల ఇళ్ళల్లోని ఆడపిల్లలు ఘోషా పాటించడం వల్ల సులోచనగారు ప్రాథమిక విద్యను ఇంట్లోనే పూర్తి చేసుకున్నారు. కొంతకాలం ఆర్యసమాజ్ గురుకుల పాఠశాల, బేగంపేటలో చదువుకుని మెట్రిక్యులేషన్ పాసయ్యారు. రాజబహాదూర్ వెంకట్రామిరెడ్డి కళాశాల, నారాయణగూడలో బి.ఎస్సీ. డిగ్రీ చదివారు. భువనగిరి, నల్గొండ జిల్లా వాస్తవ్యులైన మాదిరెడ్డి రామచంద్రారెడ్డిగారితో 1952లో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.యిడి. ఎం.ఎ., ఎం.యి.డి పూర్తి చేశారు. తర్వాత మాదిరెడ్డి సులోచన ఉపాధ్యాయవృత్తిలో చేరి 1971 వరకు సుమారు పది సంవత్సరాలు కెమిస్ట్రీ ఉపాధ్యాయినిగా సెయింట్ జాన్స్ హైస్కూలులో పనిచేశారు. బోధనను తన వృత్తిగానే కాక ప్రవృత్తిగా కూడా మలచుకున్న ఉత్తమ ఉపాధ్యాయిని. భర్తతో పాటు ఇథియోపియా, జాంబియా దేశాలకు వెళ్ళి అక్కడ కూడా కొంతకాలం ఉపాధ్యాయినిగా పనిచేశారు.
1962లో మాదిరెడ్డి సులోచన బాలసాహిత్యంతో తన రచనా జీవితాన్ని ప్రారంభించారు. 1965లో వెలువడిన “జీవనయాత్ర” ఆమె మొదటి నవల. ఆమె మొత్తం ఎన్ని నవలలు రాశారో ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ, ప్రచురణకర్తలు ఇచ్చిన జాబితా ప్రకారం ఆమె 72 నవలలు రాసినట్లుగా తెలుస్తోంది. ఇందులో పది నవలలు సినిమాలుగా తీయబడ్డాయి. ఇవి గాక 12 నాటికలు, సంపాదకులు సేకరించిన 67 కథలు వున్నాయి. వారి నవలలు ప్రచురించిన నవభారత్ బుక్ హౌస్ వారే మాదిరెడ్డి రాసిన ‘అక్కయ్య చెప్పిన కథలు’, మరో కథాసంపుటాన్ని (పేరు జ్ఞాపకం రావడం లేదు) వెలువరించారు. ఈ సంపుటాలు ఇప్పుడు అలభ్యం. అందుకని మళ్ళీ మొదటినుంచి అన్వేషించి, ఎంతో శ్రమించి, సంగిశెట్టి శ్రీనివాస్ 67 కథలను వెలికితీయగలిగాడు. అందులోంచి ఇరవై కథలను ఎంపిక చేసి, మళ్ళీ కొత్తగా ‘మాదిరెడ్డి సులోచన కథలు’ పేరిట డా. కె. విద్యావతి, సంగిశెట్టి శ్రీనివాస్‌ల సంపాదకత్వంలో వెలువరించడం అభినందించదగ్గ విషయం.
1970వ దశకంలో ఆఫ్రికాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. పాశ్చాత్య దేశాల నుంచి నిపుణులను రప్పించడం కంటే, భారత్ లాంటి దేశాల నుంచి వారిని ఆహ్వానించడం మంచిదని తలచడంతో మనవారికి ఉద్యోగావకాశాలు భారీగా ఏర్పడ్డాయి. అలా నైజీరియాలో ఉపాధ్యాయులు కావాలని అడ్వర్టైజ్‌మెంట్ రావడం, రచయిత్రి అప్లయ్ చేసుకోవడం, దాని ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్ళడంతో “తాడి క్రింద పాలు” కథ ప్రారంభమవుతుంది. నగరంలో పనిబడి ఎప్పుడు బడితే అప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టే బంధువులు, స్నేహితుల ప్రవర్తనతో విసిగిపోయిన రచయిత్రి తన స్నేహితుడైన శర్మ ఇంట్లో కాకుండా హోటల్లో దిగుతుంది. అక్కడ పరిచయమైన రమాకాంత్ సహాయంతో అన్ని పనులు ముగించుకున్నప్పటికీ, అతని వల్ల ఆమె లేనిపోని అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. తీరా విచారిస్తే, అతను చిన్నప్పుడు విచ్చలవిడిగా తిరిగిన స్త్రీలోలుడనీ, అనారోగ్యంతో ఇప్పుడు మంచివాడినా మారినప్పటికీ లోకం గుర్తించదు. అందువల్ల అతనితో కనిపించిన రచయిత్రిని రమాకాంత్ ఇంట్లోవాళ్ళు, బయటివాళ్ళు స్వైరిణిగా భ్రమపడ్డారని గుర్తిస్తుంది. తాడి చెట్టు క్రింద పాలు తాగినా, దాన్ని కల్లుగానే భావించే లోకరీతిని ఈ కథ తెలియజేస్తుంది.
“అసూయ” కథలో ఉద్యోగరీత్యా కెన్యా వెళ్ళాల్సిరావడంతో నాయకుడు నైరోబిలో దిగి హోటల్లో బస చేస్తాడు. అక్కడ భారతీయులకు సహాయం చేసే తెలుగువారైన అన్నాచెల్లెళ్ళు అతడ్ని ఒక ఆత్మీయుడిలా చూసుకుంటారు. వాళ్ళ సహాయం తీసుకున్న వాళ్ళలో గుజరాతీలు, దక్షిణాదివాళ్ళు కూడా వుంటారు. ఈ దక్షిణాదివాళ్ళు గుజరాతీల మీద, ఆ అన్నాచెల్లెళ్ళ మీద చేసిన దుష్ప్రచారాన్ని నమ్మిన నాయకుడు, తర్వాత నిజం తెలుసుకుని వారి ఓర్వలేనితనాన్ని గురించి తెలుసుకుంటాడు. అసూయ ముందు పుట్టి ఆడవారు తరువాత పుట్టారు అంటారు గాని, నిజంగా ఆలోచిస్తే అసూయకు ఆడా, మగ అనే భేదం లేదు. మనకు అందనివి ఎదుటివాడు అనుభవిస్తే అసూయ. డబ్బు, హోదా, పదవిని చూస్తే అసూయ. ఆత్మవిశ్వాసం, అధికులైన స్త్రీలను చూస్తే చాలామందికి అసూయ. అసూయ వల్ల వాళ్ళు చెడిపోయేందేమీ లేదు. ఎవరి అసూయలో వారే దగ్ధమవుతారని ఈ కథ తెలియజేస్తుంది.
ఇథియోపియాలోని అడిస్ అబాబా అనే కొత్త ప్రదేశంలో డ్రైవింగ్ సరిగా రాని యువతులు, తమ భర్తలను ఆశ్చర్యపరుద్దామని చీకట్లో, కారులో వెళ్ళి చేసిన సాహసాలను “మరపురాని క్షణాలు”లో చిత్రీకరించారు. టెహరాన్ నుండి బీరూట్‌కు వచ్చిన ఆనంద్ అక్కడి పర్షియా స్త్రీల మోహంలో పడతాడు. “కోరల్ బీచిలో కొన్ని క్షణాలు” తనతో గడిపిన అందమైన స్త్రీ, ఎప్పుడో పదేళ్ళక్రితం చనిపోయిన అమ్మాయి తాలూకు ప్రేతం అని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఉత్కంఠను పోషించిన హార్రర్ కథ ఇది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులను, తిరిగి భారత్‌కు రావాలనీ, భారీగా పెట్టుబడులు పెట్టాలని, తమ సేవలను దేశానికి అందజేసి దేశ పురోభివృద్ధిలో పాలుపంచుకోవాలని మన నాయకులు సందేశాలిస్తూంటారు. అది నమ్మి మాతృదేశంపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని, కన్నతల్లి ఒడిలోకి వెళుతున్నామనే సంతోషంతో వచ్చినవారికి మాతృదేశం సవతితల్లిలా దర్శనమిస్తుంది ఆ దంపతులకు. ఆ దంపతులు విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ప్రభుత్వం నుండి వీసా పొంది వెళతారు. తిరిగి వచ్చిం తర్వాత డ్యూటీలో చేరడానికి ఎన్ని అడ్డంకులు. ఈ రెడ్ టేపిజం – బ్యూరోక్రసీ చూసి ‘ఇదీ భారతం’ అని క్రుంగిపోతారు. ఈ కథలన్నీ రచయిత్రి చేసిన విదేశీ పర్యటనల నేపథ్యంలో రూపొందినవి.
ప్రభుత్వ సంస్థలలో… ముఖ్యంగా రైల్వేలలో చోటు చేసుకుంటున్న అవినీతి, లంచగొండితనాన్ని ఎత్తి చూపిన కథ “సిన్సియారిటీ ఖరీదు”. న్యాయాన్ని, నిజానిజాలను పక్కనబెట్టి తమ జేబు నింపుకోవడానికి అధికారులు ఎలా ప్రయత్నిస్తారో ఈ కథలో వివరించారు. అలాగే విద్యాశాఖలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం – అలసత్వాన్ని ‘ఇదీ భారతం’ కథలో తెలియజేశారు. ఈ కథలో ఏదో కాలేజీలో టెంపరరీ ట్యూటర్ పోస్టు ఖాళీగా వుందని తెలిసి రచయిత్రి అప్లయ్ చేస్తుంది. తీరా ఆ ఇంటర్వ్యూలో నెగ్గిన తర్వాత అప్పాయింట్‌మెంట్ రాకుండా ఎన్నో రాజకీయాలు నడుస్తాయి. ప్రతిభ వున్నవాళ్ళను వదిలేసి రికమండేషన్ కాండిడేట్లను, లంచం ఇచ్చినవాళ్ళను తీసేసుకుంటుంటే, దేశం ఎక్కడికి పోతుందని వాపోతారు. ఈ రెండు కథలు దేశంలో వ్యాపిస్తున్న అవినీతి – లంచగొండితనాన్ని తెలియజేస్తాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలు అందర్నీ సమానంగా పెంచాలి. పిల్లల పట్ల పక్షపాతం చూపిస్తే, ఆ పసి హృదయాలు బాధపడతాయి. వాళ్ళలో అసూయాద్వేషాలు పెరిగి శత్రువుల్లా తయారయ్యే ప్రమాదముందని ‘తప్పునాదా’ కథ హెచ్చరిస్తుంది. ‘హక్కు’ కథలో ఉన్న ముగ్గురు కొడుకులు తండ్రిని వదిలి దూరంగా ఉద్యోగాలలో స్థిరపడతారు. తండ్రి పట్ల అభిమానంతో కూతురు దేవయాని ఎన్ని సేవలు చేసినా, ఆ తండ్రి కూతుర్ని పట్టించుకోడు సరికదా అవకాశవాదులైన కొడుకుల గొప్పదనాన్ని చెప్పుకుని మురిసిపోతుంటాడు. తన శ్రమని, త్యాగాన్ని గుర్తించని ఆ తండ్రి – కొడుకులకు తన పట్ల కనీస సానుభూతి కూడా లేదని తెలుసుకున్నాకా, ఆమెలో మనుషుల పట్ల విరక్తి ఏర్పడుతుంది. ఇల్లరికపుటల్లుడిగా వచ్చిన చంద్రశేఖరం భార్య చనిపోవదంతో పిల్లల్ని వదిలి ఇల్లు విడిచి వెళ్ళిపోతాడన్న భయంతో అత్తగారు సరితను తెచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తుంది. తన ముందు సరితను కన్నకూతురిలా చూస్తుందని అనుకున్న చంద్రశేఖరంకు తన చాటున ఆమెను పనిమనిషికన్నా హీనంగా చూస్తూ హింసిస్తుందని తెలుసుకుంటాడు. ఆమె కూతురుకి దొరకని సుఖం తన కళ్ళముందే సరిత అనుభవించడం ఆమె సహించలేకపోతుంది. సరితను వెళ్ళగొడితే పిల్లలను బాగా చూసుకునేవారు దొరకరు. కాబట్టి సరితను వదులుకోలేకపోతోందని చంద్రశేఖరం విశ్లేషించుకుంటాడు. ఏమీ తెలియనట్టుగా ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఆమెకు దూరంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటాడు. ఇది “ఓ తల్లి కథ” అయితే, “ఇల్లరికటల్లుడు” కథ మరొకటి. ఒక ధనవంతుల ఇంటికి ఇల్లరికపుటల్లుడిగా వెళ్ళిన లక్ష్మీపతి ఎన్నో అవమానాల మధ్య బ్రతుకుతున్నాడో, ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో చివరకు గాని మనం తెలుసుకోలేకపోతాం. అయినవారికి దూరంగా ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసుకుని హాయిగా బతికేయాలని వెళ్ళిపోతాడు. ఇల్లరికపు అల్లుళ్ళ ఇబ్బందులను, కష్టాలను ఈ రెండు కథల ద్వారా తెలుసుకోవచ్చు.
చిన్ననాటి స్నేహితురాలైన రాధ, పై చదువుల కోసం అమెరికా వెళ్ళివస్తుంది. ఆమె పెండ్లి పిలుపుతో ఎంతో ఉప్పొంగిపోయిన క్రాంతి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది. రాధలో మునుపటి స్నేహం బదులుగా ఎక్కడాలేని భేషజం కనిపిస్తుంది. దాంతో ఆమెకు ధనవంతురాలి తత్త్వమేమిటో తెలిసివస్తుంది. కానుక అంటే కలకాలం వారి అభిమానాన్ని గుర్తుకుతెచ్చేది. దాన్ని ఖరీదుగట్టడమంటే వారి అభిమానాన్ని ఖరీదు కట్టడమే. కానుకకు విలువ కట్టారు, కానీ అంత దూరం నుండి వచ్చిన ప్రేమానురాగాలకు విలువ కట్టగలరా? వేషభాషలు మారినా, మారనిది ఇరుకైన హృదయమేమో! సంస్కారం, సహృదయత లేని చదువులు ఎందుకో అని క్రాంతి బాధ పడడం ‘కానుక’లో కనిపిస్తుంది. అన్యోనంగా కలిసి బ్రతుకున్న అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి పెళ్ళి చేసుకుంటారు. ఆరు సంవత్సరాలైనా సారథి భార్య జయ సంతానవతి కాలేకపోతుంది. కాని తమ్ముని భార్య రాధ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. జయకు పిల్లలంటే విపరీతమైన ప్రేమ వుండడంతో, వాళ్ళను ప్రేమగా చూసుకుంటుంది. ఆధునిక భావాలు, పంతం కల్గిన రాధ, పిల్లల పట్ల జయ చేసే పనులన్నింటినీ తప్పుపడుతూ అవమానిస్తుంటుంది. ఇది చూడలేని అన్న దూరప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేసుకుని జయను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆమె పోయిన తర్వాతే ఆమె లేని లోటు రాధకు తెలిసివస్తుంది. చివరకు జయ గర్బవతి అయి పురిటిలో మగపిల్లాడ్ని కని చనిపోతుంది. పాపపరిహారంగా ఆ తల్లిలేని పిల్లవాడిని పెంచడానికి రాధ నిశ్చయించుకోవడం “కోరిక తీరిన వేళ”లో చూడవచ్చు. పుట్టింటివాళ్ళొస్తే ప్రేమలు, ఘనమైన ఆతిథ్యాలు జరిపే భార్య – అత్తింటివాళ్ళు వస్తే ఈసడించుకోడం, అవమానించి పంపడం చూసిన భర్త ఆమెకి ఎలా బుద్ధి చెప్పాడో “యుగళగీతం” చదివి తెలుసుకోవాల్సిందే. ఈ మూడు కథలు ఆడవాళ్ళ మనస్తత్వాలను తెలియజేస్తాయి.
ధనవంతుడు, పెద్ద ఆఫీసర్ రామచంద్రమూర్తి పెద్ద అమ్మాయి పెళ్ళికి వచ్చిన రాజా – వాడు వ్యసనపరుడనీ, రాత్రిళ్ళు రోడ్ల మీద ఒంటరిగా కనిపించే యువతుల్ని వేటాడే దుర్మార్గుడనీ గుర్తించి బిత్తరపోతాడు. “పాపం పసివాడు” ఇక “పంజరం విడిచిన పక్షి”లో ధనవంతుడు, విలాస పురుషుడు, శాడిస్టు అయిన శ్రీపతి తన భార్య హేమను హింసిస్తుంటే చూడలేక వాళ్ళ ట్యూషన్ మేస్టారు ఆనంద్, అయ్య చెర నుంచి ఆమెను తప్పించి వివాహం చేసుకుంటాడు. అందరి అవమానాల నుండి తప్పించుకోవడానికి ఆనంద్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని దూరంగా వెళ్ళిపోతాడు. తాత్కాలిక ఆవేశంలో, ఆకర్షణను ప్రేమ అనుకుని జగన్‌ను ప్రేమించిన సమత అతడు అవకాశవాది, మోసగాడు, బ్లాక్‌మెయిలర్ అని గుర్తించి, వాడ్ని తిరస్కరించి తన తప్పును సరిదిద్దుకుంటుంది. “ఆణిఁకాడు” అంటే మర్మమెరిగినవాడు, మోసగాడు అని పద చర్చ చేస్తూనే ఈ కథకు అదే పేరు పెట్టడం ఔచిత్యవంతంగా వుంది. స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, హక్కుల పోరాటం పేరిట పురుషద్వేషిగా మారిన “హరిప్రియ” వదిన వల్ల తన అన్నయ్య పడిన బాధలు చూసి స్త్రీల పట్ల విరక్తి చెందిన హరి – ప్రత్యర్థుల్లా పరిచయమై, చివరకు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్ళి ఎలా చేసుకున్నారో తెలుసుకోవాలంటే “హరిప్రియ” కథ చదవాల్సిందే. మొత్తానికి లోకంలో స్త్రీ వల్ల పురుషుడికి, పురుషుడి వల్ల స్త్రీకి కష్టసుఖాలు ఏర్పడుతాయి. అది అర్థం చేసుకుంటే బాధే లేదు. ఒకరి తప్పులనే బూతద్దంలో చూస్తేనే సమస్య అని హరిప్రియ చివరకు గాని తెలుసుకోలేకపోతుంది. “శోభాదేవి” ధనవంతుల అమ్మాయి. అయినా చదువులో ఫస్టు. మంచి వక్త. ఆధునిక భావాలు కల స్త్రీ. సోషలిజంపై విపరీతమైన మక్కువ పెంచుకుంటుంది. పెళ్ళయిన తర్వాత అత్తామామలు సొంతకూతురిలా చూసుకున్నప్పటికీ, సోషలిజం పేరిట పనివాళ్ళకు భూములు ఇచ్చి మంచి చెయ్యబోతే, అది వికటించి ఆమె నిందలపాలవుతుంది. అపాత్రదానం పనికిరాదని, ఎవరికివారు కష్టపడి బ్రతికితేనే డబ్బు విలువ తెలుస్తుందని ఆమె గుర్తిస్తుంది.
ఇందులోని మొదటి నాలుగు కథలలో దుర్మార్గులు, మోసగాళ్ళు, ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడే మగవాళ్ళు కనిపిస్తారు. చివరి మూడు కథల్లో ఆడవాళ్ళ ఆత్మవిశ్వాసాన్నీ, కర్తవ్యదీక్షను వివరిస్తాయి. చాలా కథల్లో సమస్యలను పరిష్కరించడానికి బదులుగా నాయకులు ఆ సమస్యలకు దూరంగా వుండటానికి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. ఖచ్చితమైన లేదా సరియైన పరిష్కారం తీసుకుంటే కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది. అందుకని కొంతకాలం దూరంగా ఉంటేనే, ఆయా కుటుంబీకులు తాము చేసిన తప్పిదాలను గుర్తించి, తమను తాము సరిదిద్దుకునే అవకాశముందని రచయిత్రి భావించడం వల్ల, అలాంటి మార్పులను చేసి ఉండవచ్చని ఊహించడానికి అవకాశముంది.
తెలుగులో విస్తృతంగా, అతి వేగంగా, వైవిధ్యభరితంగా రాయడంలో మాదిరెడ్డి సులోచనకు సాటి ఎవరూ లేరు. ప్రధానంఆ ఆమె నవలా రచయిత్రి. అమె నవలలలో అత్యధిక భాగం సీరియల్స్‌గా వచ్చినవే. ఒకేసారి రెండు, మూడు పత్రికలలో సీరియల్స్ రాసేవారు. కొత్త పత్రికలు ఆమె సీరియల్‌తోనే ప్రారంభమయ్యేవి. పత్రికల ప్రత్యేక సంచికల కోసమే ఎక్కువగా కథలు రాయడం జరిగింది. కొన్నిసార్లు నవలలు రాయలేని పత్రికలకు కథలతో సరిపుచ్చేవారు. అందుకే వారి కథలు, నవలలతో పోల్చి చూస్తే తక్కువే అని చెప్పాలి. అప్పట్లో కథాసంకలనాలను పట్టించుకోకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి. కేవలం 18 ఏళ్ళ కాలంలోనే, సమకాలీనులను అధిగమించి అత్యధిక రచనలు చేసిన రచయిత్రిగా రికార్డు సృష్టించారనడంలో ఎలాంటి సందేహం లేదు. దురదృష్టవశాత్తు వారు 1983 ఫిబ్రవరిలో వారి స్వంత ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి, మృతి చెందారు. వారి మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరనిలోటుగానే మిగిలిపోయింది.
– కె.పి. అశోక్ కుమార్