[dropcap]29[/dropcap] ఆగస్ట్ 2024న, మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖవారి ఆధ్వర్యంలో మెరీనా క్యాంపస్, రజతోత్సవ ఆడిటోరియంలో, ప్రముఖ కవి, రచయిత, తిరు టి. ఆర్. సుబ్రహ్మణ్య శర్మ (శ్రీ లక్ష్మీప్రియ) గారి సాహిత్యంపై జాతీయ సెమినార్ జరిగింది.
దీనిలో ప్రముఖ రచయిత, శ్రీపాణ్యం దత్తశర్మ, వారి మిత్రులు డా. జెట్టి యల్లమంద పాల్గొని, పత్రసమర్పణ చేశారు. పాణ్యం దత్తశర్మగారు, శర్మగారి ఆంగ్ల రచన ‘The First Book of Apologues’ పై తమ ఆంగ్ల పరిశోధనా పత్రాన్ని; డా. యల్లమంద, శర్మగారి ‘నారద భక్తి సూత్రములపై వ్యాఖ్యానం’ పై తమ తెలుగు పరిశోధనాపత్రాన్ని సమర్పించారు.
మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డా. విస్తాలి శంకరరావుగారు వీరిరువురిని కండువా, ప్రశంసాపత్రముతో ఘనంగా సత్కరించారు.
శ్రీ TRS శర్మగారు త్రిభాషా కోవిదులు. తెలుగు, తమిళ, ఆంగ్లభాషలలో శతాధిక రచనలు చేశారు. మూడు భాషలలో, వారి సాహిత్యంపై పరిశోధనా పత్రాలు వివిధ రీసెర్చి విద్యార్థులు, ఆచార్యులు, కవులు, పండితులు సమర్పించారు. ఆంగ్లంతో పరిశోధనాపత్రాన్ని సమర్పించిన వారు శ్రీ పాణ్యం దత్తశర్మ గారొక్కరే. డా. పాండురంగం కాళియప్ప అతిథులకు స్వాగతం పలికారు. HOD డా. విస్తాలి శంకరరావు గారు సభాధ్యక్షులు. విశ్వర్షి డా. వాసిలి వసంతకుమార్ కీలకోపన్యాసం చేశారు.
ప్రముఖ పండితులు కీ.శే. తిరుమల రామచంద్ర గారి కుమార్తె డా. తిరుమల ఆముక్తమాల్యద, డా. మామిడి మురళి, డా. పట్టపు శివకుమార్, డా. మాదా శంకరబాబు, 4 సమావేశాలకు వరుసగా అధ్యక్షత వహించారు. ‘జనని’ సాంస్కృతిక సంస్థ చెన్నై, అధ్యక్షులు గోటిమెట్ల చెన్నయ్యగారు హాజరైనారు.
తెలుగు మాతృభాషా దినోత్సవం నాడు సాగర తీరాన ఆ విధంగా భాషా పరిమళం వ్యాపించింది.