బాగ నున్నవాడు బ్రాందియు, విస్కీయు
కలిమిలేనివాడు కల్లు సార
త్రాగ సాగినారు తమకాన మద్యమున్
మందబుద్ధులౌచు మనుజగణము. (8)
పార్టీలకంచును, పైరవీల కటంచు
విందుల కంచును వింతరీతి
మర్యాద కంచును, మమకారమున కంచు
దర్జాలకంచును దౌష్ట్యవృత్తి
పండగకంచును, బాంధవ్యమునకంచు
అంతస్తుల కటంచు నథమ ఫణితి
బాధ పోవుట కంచు, ప్రహ్లాదమునకంచు
సరదాకటంచును, సహజలీల
మనుజులందున నెక్కువమంది కరము
మత్తుగల్గించు మద్యమున్ మరల మరల
విరివిగా ద్రాగి యెంతయో ప్రీతితోడ
కాలచక్రంబు ద్రోయుచు గడుపుచుండ్రి. (9)
సార గైకొనినను సంస్కారమును బోవు
కల్లు ద్రాగ బోవు గౌరవంబు
బీరు, విస్కి గ్రోల పెద్దెరికముబోవు
బ్రాంది పుచ్చుకొనగ పరువుపోవు. (10)
సరదా కంచును మొదలయి
సరసత్వమడంగ జేసి, జవసత్త్వములన్
తరుగంగ జేసి మద్యము
నరజాతిని పిప్పిజేసి నాశము జేయున్. (11)
ఆహ్లాదమునుబోవు, నాయుష్యమును బోవు
సౌందర్యమును బోవు, శక్తిబోవు
మంచితనము బోవు, మాననీయత బోవు
నీతిరీతులు బోవు, ఖ్యాతిబోవు
ఆర్జితంబును బోవు, నూర్జితత్వముబోవు
ముదుసలులిచ్చిన మూటబోవు
ఆస్తిపాస్తులు బోవు, ఔన్నత్యమును బోవు
పెత్తనమునుబోవు, పేరుబోవు
మాట విలువయు బోవును జేటు కలుగు
సమత మమతలు బోవును సారముడుగు
జ్ఞానమడుగంటు కడు దురాచారమబ్బు
మద్యపానంబు జేసెడి మనుజులకును. (12)
నలుగురు జూచి నవ్వగను నర్తన జేయ దరిద్రభూతమున్
పలువిధమైన మాటలతో బందుగులెల్లరు గేలిసేయగా
తలయొక రీతి నీచముగ ధారుణిలో జనులెల్ల బల్కగా
చెలువమునైన దేహమును చిక్కగజేయును మద్యపానమున్. (13)
ఇల్లు గుల్లగనౌను యొళ్ళు గుల్లగనౌను
మాన్యాలు మడులెల్ల మాయమౌను
బంగారు వస్తువు లంగడి పాలౌను
వంతలుంగలుగును వాసి తొలగు
మేడలున్మిద్దెలు కాడు బీడయిపోవు
పాడిగేడెలుపోవు పంట పోవు
తిన తిండి కరవుగు దీనత్వము చెలంగు
నిలువనీడయుబోవు నిగ్గుబోవు
తిరిపమెతెడి స్థితి కల్గు కరముగాను
తెలివితేటలునుడుగును తీరుమారు
దైన్యమబ్బును తరుగును ధైర్యగుణము
మద్యపానంబుజేసెడి మనుజులకును. (14)