మహితమై యలరారు మంజుల గాత్రాన
చురుకుదనము పోవు శోష వచ్చు
అంతరించసాగునాలోచనాశక్తి
ధారణశక్తి యందరిగిపోవు
సరసత్వమడుగంటు విరసత్వముదయించు
శాంతగుణము పోవు శక్తిదూలు
నిశ్చలత్వము వంగు నిర్మలత్వము క్రుంగు
తొందరపాటది తోచసాగు
కాయమందుననుండెడి కాంతి తరుగు
తామస గుణంబు హెచ్చును దౌష్ట్యమబ్బు
నోటి రుచి పోవు తీవ్రపు చేటుగలుగు
మధువు సేవించుచుండెడి మనుజులకును. (15)
మధురముగ మాటలాడెడి విధముపోయి
పరుష పదజాలముల తోడ కరకుగాను
పలుకుచుండెడి తీరును వసుధ గలుగు
మద్యమును గ్రోలు చుండెడి మానవులకు. (16)
తనువు శుష్కించును త్రాణయుండల్లును
జీర్ణశక్తియుబోవు పూర్ణముగను
రక్తము క్షీణించు రక్త రక్తిమపోవు
నరముల బిగువది తరుగసాగు
ఉదరకోశపు రోగముప్పతిల్లగసాగు
గుండెజబ్బు మిగుల కూడుకొనును
శ్వాసావయములు నాశమొందగసాగు
క్యాన్సరు వ్యాధిచే కాయముడుగు
నరములవి గుంజుచుండగ నరుని కరము
మంచముంబట్టు తీరుతో మ్రగ్గజేసి
దీననీయపు స్థితికినిదెచ్చునట్టి
మద్యపానంబు జగతికి మాన్యమగునె? (17)
తనను నమ్ముకొనిన తనవారి యాశలన్
పుట్టిని నట్టేట ముంచివైచి
అభివృద్ధి నందగ నారాటపడుచుండు
చిన్నపిల్లల కెల్ల చేటుజేసి
ఉద్వాహ మందగ నుబలాటపడుచుండు
కూతుళ్ల కోర్కెల గూలనేసి
ఐదవతనమును ననునిత్యమునుగోరు
ఇల్లాలి బ్రతుకును త్రెళ్లనేసి
వంశమర్యాద లెల్లనువార్ది గలిపి
మనమునందున బాధ్యత మరచిపోయి
పవలురాత్రిళ్లు త్రాగెడెయవని నరుడు
ఏమి పొందంగ జూచునో యెఱుగలేము? (18)
సురలు త్రాగిరంచు నరులును మద్యమున్
గ్రోలబూనుటందు మేలు కలదె?
“శివుడు మ్రింగె”నంచు, చేదైన విషమును
పుచ్చుకొనగ జనులు చచ్చిపోరె? (19)
ఆయురారోగ్యములకును హానిగూర్చి
చావునకు దగ్గఱగజేర్చి జనులనెల్ల
సమయజేసెడి దుష్టంపు జాడ్యమైన
మద్యపానంబు మానుట మంచిదగును. (20)
సంఘ చట్రంబును చతికిలబడవేయు
మద్యంబు మానుట మంచిదగును
శక్తి సామర్థ్యాల సన్నగిల్ల జేయు
మద్యంబు మానుట మంచిదగును
అర్థనాశముజేసి యగచాట్లు కల్గించు
మద్యంబు మానుట మంచిదగును
పరువు ప్రతిష్ఠల బండల పాల్జేయు
మద్యంబు మానుట మంచిదగును
మాన్యతను, మంచితనమును, మమత వీడి
దుష్ప్రవర్తకులగునట్లు దురితములను
పరగజేయించి బాధల పాలుజేయు
మద్యపానంబు మానుడో మనుజులార! (21)