[box type=’note’ fontsize=’16’] “నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన‘ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది రెండవ ఖండిక ‘మద్యపానము‘. [/box]
[dropcap]మ[/dropcap]ద్యపానము – ‘నీలి నీడలు” ఖండకావ్యంలోని రెండవ ఖండిక.
భారతమాత బిడ్డలగు భాగ్యముగల్గుట పూర్వజన్మ సం
స్కారమటంచు సంతసము సంస్తుతిజేయుచు ధీ విశాలురై
కోరుచునుండ భూప్రజలు కూరిమినీ భరతోర్వియందునన్
భారతపుత్రులేమొ మధుపానముచే నరాగారుచుండిరే? (1)
దేశగౌరవంబు నాశంబు జేయగ
మాతృదేవి కీర్తి మంటగలుప
ఏల భారతీయులీ హీనమైనట్టి
మద్యపానమునకు మరలుకొనిరో? (2)
సుధను వేగబొంది సురలు మోదంబంద
అది లభించనట్టి యసురవరలు
సురను బాగ త్రాగి సోలిపోసాగగ
అదియె మార్గమయ్యెయవని ప్రజకు. (3)
మత్తు గల్పించి మనుజుని చిత్తుజేసి
మందమతిజేసి మానంబు మంటగలుపు
మద్యమును త్రాగరాదని మహిత యశుడు
నైన శుక్రుడు శాసించెనంచు వినమె! (4)
దానవనాథులందరును ధారుణినేలిన రాజసంతతుల్
మానిత రీతి ద్రాగిరని మంచికి చెడ్డకు భేదమెంచకన్
మానవులీ యుగంబున మత్తును గోరుచుద్రావి మద్యమున్
కాచు, కష్టముల నెన్నియొ పొందుచు నుండిరి ద్ధరన్. (5)
అన్ని తెలిసి తెలిసి యవివేక తిమిరాన
మనుజులంత వింత మధువు ద్రావి
మమత మానవతలన్ మహిలోన వీడియు
అథములౌచు మిగుల నార్చుచుండ్రి. (6)
తాటి యీత కల్లు, ద్రాక్షసవంబును
సార, నీర, వైను, స్కాచు, విస్కి
రమ్ము, జిన్ను, బీరు, బ్రాందీల జెప్పరే
మత్తునిచ్చునట్టి మద్యమనుచు. (7)
బాగ నున్నవాడు బ్రాందియు, విస్కీయు
కలిమిలేనివాడు కల్లు సార
త్రాగ సాగినారు తమకాన మద్యమున్
మందబుద్ధులౌచు మనుజగణము. (8)
పార్టీలకంచును, పైరవీల కటంచు
విందుల కంచును వింతరీతి
మర్యాద కంచును, మమకారమున కంచు
దర్జాలకంచును దౌష్ట్యవృత్తి
పండగకంచును, బాంధవ్యమునకంచు
అంతస్తుల కటంచు నథమ ఫణితి
బాధ పోవుట కంచు, ప్రహ్లాదమునకంచు
సరదాకటంచును, సహజలీల
మనుజులందున నెక్కువమంది కరము
మత్తుగల్గించు మద్యమున్ మరల మరల
విరివిగా ద్రాగి యెంతయో ప్రీతితోడ
కాలచక్రంబు ద్రోయుచు గడుపుచుండ్రి. (9)
సార గైకొనినను సంస్కారమును బోవు
కల్లు ద్రాగ బోవు గౌరవంబు
బీరు, విస్కి గ్రోల పెద్దెరికముబోవు
బ్రాంది పుచ్చుకొనగ పరువుపోవు. (10)
సరదా కంచును మొదలయి
సరసత్వమడంగ జేసి, జవసత్త్వములన్
తరుగంగ జేసి మద్యము
నరజాతిని పిప్పిజేసి నాశము జేయున్. (11)
ఆహ్లాదమునుబోవు, నాయుష్యమును బోవు
సౌందర్యమును బోవు, శక్తిబోవు
మంచితనము బోవు, మాననీయత బోవు
నీతిరీతులు బోవు, ఖ్యాతిబోవు
ఆర్జితంబును బోవు, నూర్జితత్వముబోవు
ముదుసలులిచ్చిన మూటబోవు
ఆస్తిపాస్తులు బోవు, ఔన్నత్యమును బోవు
పెత్తనమునుబోవు, పేరుబోవు
మాట విలువయు బోవును జేటు కలుగు
సమత మమతలు బోవును సారముడుగు
జ్ఞానమడుగంటు కడు దురాచారమబ్బు
మద్యపానంబు జేసెడి మనుజులకును. (12)
నలుగురు జూచి నవ్వగను నర్తన జేయ దరిద్రభూతమున్
పలువిధమైన మాటలతో బందుగులెల్లరు గేలిసేయగా
తలయొక రీతి నీచముగ ధారుణిలో జనులెల్ల బల్కగా
చెలువమునైన దేహమును చిక్కగజేయును మద్యపానమున్. (13)
ఇల్లు గుల్లగనౌను యొళ్ళు గుల్లగనౌను
మాన్యాలు మడులెల్ల మాయమౌను
బంగారు వస్తువు లంగడి పాలౌను
వంతలుంగలుగును వాసి తొలగు
మేడలున్మిద్దెలు కాడు బీడయిపోవు
పాడిగేడెలుపోవు పంట పోవు
తిన తిండి కరవుగు దీనత్వము చెలంగు
నిలువనీడయుబోవు నిగ్గుబోవు
తిరిపమెతెడి స్థితి కల్గు కరముగాను
తెలివితేటలునుడుగును తీరుమారు
దైన్యమబ్బును తరుగును ధైర్యగుణము
మద్యపానంబుజేసెడి మనుజులకును. (14)
మహితమై యలరారు మంజుల గాత్రాన
చురుకుదనము పోవు శోష వచ్చు
అంతరించసాగునాలోచనాశక్తి
ధారణశక్తి యందరిగిపోవు
సరసత్వమడుగంటు విరసత్వముదయించు
శాంతగుణము పోవు శక్తిదూలు
నిశ్చలత్వము వంగు నిర్మలత్వము క్రుంగు
తొందరపాటది తోచసాగు
కాయమందుననుండెడి కాంతి తరుగు
తామస గుణంబు హెచ్చును దౌష్ట్యమబ్బు
నోటి రుచి పోవు తీవ్రపు చేటుగలుగు
మధువు సేవించుచుండెడి మనుజులకును. (15)
మధురముగ మాటలాడెడి విధముపోయి
పరుష పదజాలముల తోడ కరకుగాను
పలుకుచుండెడి తీరును వసుధ గలుగు
మద్యమును గ్రోలు చుండెడి మానవులకు. (16)
తనువు శుష్కించును త్రాణయుండల్లును
జీర్ణశక్తియుబోవు పూర్ణముగను
రక్తము క్షీణించు రక్త రక్తిమపోవు
నరముల బిగువది తరుగసాగు
ఉదరకోశపు రోగముప్పతిల్లగసాగు
గుండెజబ్బు మిగుల కూడుకొనును
శ్వాసావయములు నాశమొందగసాగు
క్యాన్సరు వ్యాధిచే కాయముడుగు
నరములవి గుంజుచుండగ నరుని కరము
మంచముంబట్టు తీరుతో మ్రగ్గజేసి
దీననీయపు స్థితికినిదెచ్చునట్టి
మద్యపానంబు జగతికి మాన్యమగునె? (17)
తనను నమ్ముకొనిన తనవారి యాశలన్
పుట్టిని నట్టేట ముంచివైచి
అభివృద్ధి నందగ నారాటపడుచుండు
చిన్నపిల్లల కెల్ల చేటుజేసి
ఉద్వాహ మందగ నుబలాటపడుచుండు
కూతుళ్ల కోర్కెల గూలనేసి
ఐదవతనమును ననునిత్యమునుగోరు
ఇల్లాలి బ్రతుకును త్రెళ్లనేసి
వంశమర్యాద లెల్లనువార్ది గలిపి
మనమునందున బాధ్యత మరచిపోయి
పవలురాత్రిళ్లు త్రాగెడెయవని నరుడు
ఏమి పొందంగ జూచునో యెఱుగలేము? (18)
సురలు త్రాగిరంచు నరులును మద్యమున్
గ్రోలబూనుటందు మేలు కలదె?
“శివుడు మ్రింగె”నంచు, చేదైన విషమును
పుచ్చుకొనగ జనులు చచ్చిపోరె? (19)
ఆయురారోగ్యములకును హానిగూర్చి
చావునకు దగ్గఱగజేర్చి జనులనెల్ల
సమయజేసెడి దుష్టంపు జాడ్యమైన
మద్యపానంబు మానుట మంచిదగును. (20)
సంఘ చట్రంబును చతికిలబడవేయు
మద్యంబు మానుట మంచిదగును
శక్తి సామర్థ్యాల సన్నగిల్ల జేయు
మద్యంబు మానుట మంచిదగును
అర్థనాశముజేసి యగచాట్లు కల్గించు
మద్యంబు మానుట మంచిదగును
పరువు ప్రతిష్ఠల బండల పాల్జేయు
మద్యంబు మానుట మంచిదగును
మాన్యతను, మంచితనమును, మమత వీడి
దుష్ప్రవర్తకులగునట్లు దురితములను
పరగజేయించి బాధల పాలుజేయు
మద్యపానంబు మానుడో మనుజులార! (21)