[dropcap]అ[/dropcap]దేం హటాత్తుగా రాదు
మెల్లమెల్లగా నీకు అలవాటవుతూనే వస్తుంది
నల్లటి దుబ్బులో ఓ వెండిపోగై మెరుస్తుంది
పీకి పీకనొక్కినా అడుగంటా కత్తిరించినా
మళ్ళీ మొలకెత్తి తలెత్తి వెక్కిరిస్తుంది
రంగుల హంగులతో కప్పెట్టజూసినా
ఆ పక్కనుంచో ఈ పక్కనుంచో
వంగి వంగి చిలిపిగా తొంగి చూస్తుంది
మరుసటి వారానికల్లా మొదళ్ళలో
తెల్లదనపు వెండిరంగువెల్ల మళ్ళీవేస్తుంది
సలహాల శ్రవాణానికీ పఠనానికీ
సమయం కనిపించకుండా ఖర్చవుతూంటుంది
వంటింటి చిట్కాలు
వైద్యుల మందుమాకులు
ఉషారుగానే మొదట్లో ప్రభావం చూపి
ఉసూరుమంటూ చివరకు జెండా ఎత్తేస్తాయి
ఆందోళనతో మొదలైన ఆవేశపుపోరాటం
నిర్వేదపు ముంగిట్లో ఓడిపోయి
నిస్సత్తువతో సంధి చేసుకుంటుంది
నేనొక మినహాయింపునన్న అహంకారం
ప్రకృతి నియమాలకు నిబంధనలకు
రాయకూడని ఒప్పుదల చీటీ రాసిస్తుంది
నలుపైన సుదూరగతం
తెలుపులోకి క్రమక్రమంగా జారిపోతే
తెలుపులో వెలిగిన నిన్నటి నిబ్బరం
కాలపు మలుపుల్లో కొద్దికొద్దిగా రాలిపోతుంటే
వయసు నియమాలను, మనసు
వినయంగా, విధేయంగా మన్నిస్తూ
వెలిసిపోయిన ఓ వెర్రినవ్వు విసిరేస్తుంది
నెలవారీ ఖర్చుల ఖాతాలోంచి
తలనూనె తనకుతానే తప్పుకుంటుంది
ముసిముసిగా నవ్వుకుంటూ ఫేస్పౌడర్
తన వాటా భారీగా పెంచేసుకుంటుంది
అవును…
ఇక పూటపూటకూ పూసుకోవాల్సిందేగా
ఫేస్ పౌడర్, మెడనుంచి నడినెత్తిదాకా
ఇదే కదా…!
ఏ పగవానికి కూడా రాకూడని
మగవాని ప్రాప్తం!!