Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-20: మాఘమాసం ముచ్చట్లు..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య మా చుట్టాలు, స్నేహితులు చాలామంది వాళ్ళ చుట్టాలిళ్ళల్లో పెళ్ళిళ్ళకని అమెరికా వెళ్ళొచ్చేరు. వచ్చాక ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కటిగా కనిపించింది. ఈ సంగతులన్నీ ఇండియానుంచి అమెరికా కేవలం పెళ్ళికోసం వెళ్ళొచ్చినవారివే. అక్కడే స్థిరపడిన భారతీయ అమెరికన్లు మరోవిధంగా భావించరని ఆశిస్తాను.

మా కమలం పిన్ని తన మనవడి పెళ్ళికని వెళ్ళింది. ఆవిడ కథనం ఇలా ఉంది.

“ఎంత బాగా చేసేడనుకున్నావే పెళ్ళీ మావాడూ.. మన రూపాయల్లో రెండు కోట్లయిందిట. పురోహితుణ్ణి కూడా ఇక్కడినుంచే పిలిపించుకున్నాడు. అన్నీ శాస్త్రోక్తంగా చేయించేడనుకో.. ఇక్కడ కూడా అంత పధ్ధతిగా అవటం లేదనుకో..” అంటూ మొదలెట్టి పట్టుచీరలకి ఎంతెంత భారీ జరీ బోర్డరులున్నాయో, ఎన్నిరకాల నగలు ఎన్నిసార్లు మార్చారో, తనకీ బాబాయికీ ఎంత ఖరీదైన పట్టుబట్టలు పెట్టాడో లాంటివన్నీ చెప్పుకొచ్చింది. ఆ శాస్త్రాలేంటో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నవాళ్లకీ, వాళ్ళ అమ్మానాన్నలకే తెలీటంలేదు. మరి అక్కడ అంత శాస్త్రీయంగా జరిపించేడంటే గొప్పే కదా అనుకున్నాను.

మా ఫ్రెండ్ మాధవి కూడా వాళ్ల మేనకోడలి పెళ్లంటే వెళ్ళింది.

“అక్కడంతా ఎంత పధ్ధతనుకున్నావూ! ఎంత మందొస్తారో ముందే చెప్పాలిట. అప్పుడు పెళ్ళివారు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారుట. ఇక్కడిలాగే ఇంకా చెప్పాల్సొస్తే ఇక్కడికన్నా ఎక్కువగానే చేసేరనుకో. పెళ్ళికి ముందు సంగీత్, మెహందీ భలే చేసేరు. అక్కడున్న మా వదిన ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద జరీ బోర్డర్లున్నపట్టుచీరలు కట్టుకుని, టెంపుల్ జ్యూయలరీ పెట్టుకుని, వీళ్ళకన్న సంతోషపడిపోయేరనుకో పెళ్ళిలో. అందరూ తలో పనీ కల్పించుకుని మా వదినకి సాయం చేసేరు. పెళ్ళికొడుకు ఇటాలియన్. అయినా కూడా వీళ్ళు చెప్పినట్టు ఎంచక్క కూర్చుని కల్యాణంబొట్టు, బుగ్గనచుక్కా పెట్టించుకున్నాడు” అంటూ మధ్యలో కిసుక్కున నవ్వింది.

“ఎందుకే ఆ నవ్వూ!” అంటే

“జీలకర్ర, బెల్లం పురోహితుడు ఆ అబ్బాయి చేతికిచ్చి, నెత్తిమీద పెట్టమంటే ఆ పిల్లాడు పక్కనే వున్న అత్తగారి నెత్తిమీద పెట్టేసేడు” అంటూ నవ్వాపుకుందుకు కొంగుతో నోటికడ్డం పెట్టుకుంది.

ఇదంతా వింటున్న ఇంకో ఫ్రెండ్ నిర్మల, “అదింకా నయమే. నేనూ మా కజినింట్లో పెళ్ళికెళ్ళాను కదా.. ఆ పిల్లావాళ్ళూ పంజాబీలులే.. అప్పుడు పెళ్ళికూతురి తల్లి చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి, పురోహితుడికి ఇమ్మంటే ఈవిడ దాన్ని ఆ పురోహితుడి నెత్తిమీదే పెట్టిందిట..” అంది.

మాధవి మళ్ళీ అందుకుంటూ, “అదేంటో, తలంబ్రాలు పోసుకొమ్మంటే పెళ్ళికొడుకూ పెళ్ళికూతురూ ఒకళ్ళ మొఖాన ఇంకోరు కొట్టుకుంటూ వాటితో ఆడుకున్నారు తెల్సా!” అంది.

“సర్లే, మా కజిన్ కూతురి పెళ్ళికి ఇక్కణ్ణించి పనికట్టుకుని కర్పూరం దండలు తెప్పించుకుంది. అవేసుకుని ఆ ఘాటుకి పెళ్ళికొడుకు ఒకటే తుమ్మడం” నిర్మల ఉవాచ.

 “మా మేనకోడలి పెళ్ళిలో సరిగ్గా పెళ్ళి టైమ్‌లో ఏమైందో తెల్సా! మంగళసూత్రాలు కనిపించలేదు. మా వదిన ఇక్కడినుంచొచ్చిన వాళ్ల అక్కయ్య చేతికిచ్చానంటుంది. వాళ్ళక్కయ్యేమో మీ ఫ్రెండ్‌కి ఇచ్చానంటుంది. ఏ ఫ్రెండో పేరు తెలీదాయె. అప్పుడే చూసిందేమో ఆ అక్కయ్యకి మొహాలు గుర్తుండవాయె.. ఇక్కడందరూ ఒకలాగే ఉన్నారే జుట్లు విరబోసుకునీ, ఎవరని చూపించనూ! అంటుంది సాగదీస్తూ. అక్కడందరూ ఫ్రెండ్సేగా.. ఎవరినని అడుగుతుందీ. ఆఖరికి ఈ విషయం మా వదిన తనకి బాగా జిగ్రీ దోస్తైనావిడకి చెపితే, ఆవిడ ఒక్కొక్కరిదగ్గరికీ వెళ్ళి తెలివిగా మాట్లాడి ఎవరి కిచ్చిందో కనుక్కుంది. ఆవిడెవరోకానీ అది పెళ్ళికొడుకు తల్లి చేతిలో అయితే జాగ్రత్తగా ఉంటుందని ఆ ఇటాలియన్ ఆవిడ చేతికిచ్చి, మాట అర్ధంకాదని పెళ్ళికూతురివైపు చూపించి, మెడచుట్టూ దాన్ని తిప్పి వెనకాల ముడేసుకోవాలని చూపించిందిట. పాపం ఆవిడ సిన్సియర్‌గా పెళ్ళికూతురి దగ్గరికెళ్ళి ఆ పిల్ల మెడలో దాన్ని వేసి, వెనకాల ముడేసేసిందిట. ఏమైందో తెల్సుకునేలోపే జరిగిపోయిందిదంతానూ. ఆ ముడి గట్టి ముడి పడిపోయి ఆ పెళ్ళికూతురికి ఇప్పడం రాక అలాగే ఉంచేసుకుందిట. ఆ ముడి విప్పడం, మళ్ళీ పెళ్ళికొడుకుచేత కట్టించడం పెద్ద ఫార్సులా అయిందనుకో..” అంది మాధవి.

నిర్మల మళ్ళీ అందుకుంది. “మా కజినింట్లో పెళ్ళయేక బిందెలో ఉంగరం, మట్టెలూ వేసి ఇద్దరిచేతా తీయిస్తారు కదా! అది ముందు చెయ్యడం మర్చిపోయేరు. మట్టెలు పెట్టేసేక మొదలెట్టేరు. అప్పుడు పెళ్ళికూతురి కాలికి పెట్టిన మట్టెలు తీసి బిందెలో వెయ్యమని ఒకళ్ళూ, పెట్టిన మట్టెలు తియ్యకూడదని ఇంకోళ్ళూ మహ గొప్పగా వాదించుకున్నార్లే.”

“మరేం చేసేరూ!” ఆత్రంగా అడిగేను నేను.

“సెంటిమెంటు మీద కొడితే మట్టెలు ఎవరు తీస్తారూ! అందుకని ఆ పిల్ల చేతి బంగారం ఉంగరంతోపాటు, ఆ పిల్లాడి డైమండ్ రింగ్ వేసేరు బిందెలో.”

“హమ్మయ్య..” అని మట్టెలు తియ్యలేదుకదా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకోబోతుంటే

“బిందెలోవి ఇద్దరూ తీసేసేక వాటిని వాళ్ళు వేళ్ళకి పట్టుకోవాలి కదా! పెట్టుకోలేదు. గట్టిగా అడిగితే ఎవరికో ఇచ్చేం అంటారు. ఎవరో చెప్పలేరు. ఈ లోపల పనైపోయిందికదాని అక్కడ పేరంటాళ్ళు ఆ బిందెలో ఉన్న నీళ్ళని కాస్త ఎత్తుగా ఉన్న కొండలాంటిదాని మీదకెక్కి, అక్కడి చెట్లలో పోసేసేరు.”

“అయ్యో.. ఉంగరాలు పోయేయా!” నేనూ మాధవీ ఒక్కసారే అడిగాం.

“అదే మరి. అవి బిందెలో ఉన్నాయో తెలీదు. వీళ్ళెక్కడైనా పెట్టేరో తెలీదు. అసలే రాత్రి. గార్డెన్‌లో జరిగేయి ఇవన్నీ. ఆ చీకట్లో ఎక్కడని వెతుకుతారూ! అక్కడికీ మా కజినూ, వాళ్ల ఫ్రెండూ అలాగే పాక్కుంటూ, డేక్కుంటూ ఆ చెట్ల చుట్టూ పొదల చుట్టూ తెగ వెతికేరు. ఇంతకీ అవెక్కడున్నాయో తెల్సా!”

“ఎక్కడున్నాయీ!” ఇద్దరం ఆత్రంగా ఒక్కసారే అడిగాం.

“అదృష్టవంతులు కనక పెళ్ళిమంటపంలో ఆ పువ్వుల మధ్యలో ఆ పిల్లదీ, ఏదో చెట్టు మొదట్లో ఆ పిల్లాడి డైమండ్ రింగూ దొరికేయి.” నేనూ, మాధవీ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం.

మాధవి మళ్ళీ అందుకుంది. “ఇంకో విషయం తెల్సా మీకూ..!” అంటూ.

మేం ఆత్రంగా ముందుకి వంగాం. “అసలు జీలకర్ర, బెల్లం నెత్తి మీద ఎందుకు పెడతారూ?” అనడిగింది.

“అది బ్రహ్మస్థానం కనకా, సుముహూర్తంలో ఇద్దరూ ఒకరి నెత్తిమీద ఒకరు పెట్టుకుంటే వాటివల్ల వచ్చే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇద్దరిలోనూ పాజిటివె వైబ్రేషన్స్ కలిగి, ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుందని..” నేను నాకున్న జ్ఞానాన్నంతా ఒలకబోసేసేను.

“అవునా! ఈ మధ్య అలా చెయ్యటం లేదు. రెండు తమలపాకుల మధ్యలో ఆ జీలకర్ర, బెల్లం ముద్ద పెట్టి, దానిని నెత్తి మీద పెడుతున్నారు. ఒకవైపయితే ఆ జిగురు వీళ్ళ చేతికి అంటుకోకుండా అనుకోవచ్చు. మరి నెత్తిమీద తగిలేవైపు అలా తమలపాకు అడ్దం ఎందుకు పెడుతున్నారంటే, ఆ పిల్ల హెయిర్ స్టయిల్ పాడవకుండా ఉండడానికిట.”

“ఏవిటీ! హెయిర్ స్టయిల్ అంటే జుట్టిప్పుక్కూర్చోడమే కదా! అదేం పాడౌతుందీ!” అన్నాన్నేను, ఇంక అది పెట్టడం కూడా ఎందుకు అనుకుంటూ.. ఈమధ్య ఇండియాలో జరిగిన రెండు మూడు పెళ్ళిళ్ళలో అమ్మాయిలు అలా జుట్టు విరబోసుకోడం చూసేన్నేను.

“అలా గట్టిగా అనకు. వాళ్ళు పోట్లాటకొస్తారు. ఎంత గజిబిజిగా జుట్టు విరబోస్తే అంత గొప్ప హెయిర్ స్టయిల్ ఈ రోజుల్లో. అంతే కాదు. ఈమధ్య వధూవరులని ఆశీర్వదించడానికి అక్కడ అక్షింతలు కూడా ఉండట్లేదు. అక్షింతలేస్తే అవి దులుపుకుంటుంటే కూడా హెయిర్ స్టయిల్ పాడైపోతుందని..”

“నారాయణా…” అనుకోబోయి ఆగిపోయాను. ఏమో అలా అంటే ఆ తప్పుమాట ఎందుకు మాట్లాడేవంటారోనని.

Exit mobile version