‘మహా మనీషి’ నటసామ్రాజ్ఞి సావిత్రి

7
3

[box type=’note’ fontsize=’16’] ది. 26-12-2020 శ్రీమతి సావిత్రి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]’మ[/dropcap]హానటీ! మహానటీ! మహానటీ! మహానటీ!’…. అవును ఆమే మహానటి. ప్రత్యామ్నాయం లేని మహానటి. తెలుగు సినిమా నటీమణులలో మహోన్నత శిఖరం.

ముఖకవళికలు, కంటిచూపు, పెదాల విరుపుల మెరుపులతోనే నవరసాలను ప్రదర్శించడంలో దిట్ట. తెలుగు చిత్ర (విచిత్ర) సీమలో ఆమె ప్రతిభ అద్వితీయం, అనిర్వచనీయం, అపూర్వం, అబ్బురం. నటి మాత్రమే కాదు, నిర్మాత, దర్శకురాలు, గాయని కూడా!

ఆ మహానటి సావిత్రి 1937వ సంవత్సరం డిశంబర్ 6వ తేదీన నాటి (మదరాసు ప్రెసిడెన్సీ) నేటి గుంటూరు జిల్లాలోని చిర్రావూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నిశ్శంకర సుభద్రమ్మ, గురవయ్యలు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో పెద్దమ్మ దుర్గాంబ, పెదతండ్రి కొమ్మారెడ్డి వెంకట్రామయ్య సంరక్షణలో విజయవాడలోనే శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి గారి వద్ద శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించారు. స్థానిక నాటక కంపెనీలలో చేరి నాటకాలలో నటించారు. ఈమె రంగస్థల నృత్యకళాకారిణిగా శ్రీ పృధ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం ఈమె రంగస్థల నటజీవితంలో అపురూప అనుభవం.

ప్రముఖ తమిళచలన చిత్ర కథానాయకుడు శ్రీ జెమినీగణేశన్‌ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె వున్నారు.

పెదతండ్రి ప్రోత్సాహంతో సినిమాలలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. 1950వ సంవత్సరంలో ‘సంసారం’ చిత్రంలో చిన్న పాత్రలో నటించి సినీరంగంలో ప్రవేశించారు.

ఆ తరువాత ‘బ్రతుకు తెరువు’లో ముగ్ధగా, ‘దేవదాసు’లో ప్రేయసిగా, వృద్ధుని వివాహమాడిన అభాగినిగా నటించి పార్వతి పాత్రలో ‘నభూతో నభవిష్యత్’గా పేరు తెచ్చుకున్నారు. ‘చరణదాసి’లో ఆధునిక యువతిగా, ‘పరివర్తన’లో అహంకారి జమీందారును మంచిమనిషిగా మార్చిన నాయికగా నటించి మెప్పించారు.

‘అర్థాంగి’, ‘ప్రాణమిత్రులు’ చిత్రాలలో భర్తకు చదువు నేర్పిన భార్యగా, ‘ఆత్మబంధువు’లో ‘చదువురాని వాడవని దిగులు చెందకు’ అని నాయకుని ఓదార్చే పాత్రలోను అద్వితీయంగా నటించి మెప్పించారు.

బాల్యవివాహం చేసుకున్న బావే ప్రేమికుడని తెలియక మధనపడిన యువతిగా ‘మాంగల్యబలం’లో, దాంపత్య జీవితానికి అనర్హుడైన భర్త తనకు పునర్వివాహం చేయబోయే తరుణంలో ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళగా ‘సుమంగళి’ చిత్రంలో జీవించారు.

ప్రియుడిని త్యాగం చేసిన కథానాయిక పాత్రలలో ‘మంచి మనసులు’, ‘వెలుగునీడలు’ చిత్రాలలో నటిస్తే/త్యాగానికి సిద్ధపడిన పాత్రలో ‘ఆరాధన’లో నటించారు.

‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంలో అనుమానపు భర్తకు/సోదరుడిలా భావించి, అభిమానించిన వ్యక్తికి మధ్య నలిగిన యువతిగా ఈమె నటన అనితర సాధ్యం.

తాగుబోతు, వేశ్యాలోలుడయిన భర్తను మార్చడం కోసం మద్యం తాగి, వేశ్యగా అలంకరించుకున్న భార్యగా ‘మనుషులు-మమతలు’ సినిమాలో జీవించారు.

‘కలసి వుంటే కలదు సుఖం’, ‘నమ్మినబంటు’, ‘కుటుంబ గౌరవం’ చిత్రాలలో మన కళ్ళముందు పల్లెపడుచును నిలబెట్టారు.

‘రక్తసంబంధం’, ‘తోబుట్టువులు’, ‘పరివర్తన’ (అక్కినేని సోదరి), చిత్రాలలో సోదర సోదరీ బాంధవ్యానికి ప్రతీక అయిన పాత్రలలో ఆమె నటన మనకీ అటువంటి అక్కాచెల్లెళ్ళు వుంటే బాగుండనిపిస్తుంది.

ఇక గురజాడ వారి ‘కన్యాశుల్కం’లోని మధురవాణి చేసే అల్లరి పనులకు, ఆగడాలకు వీరి నటన పరాకాష్టకు చేరుకుంది.

పౌరాణిక చిత్రాలకు వీరి నటన వన్నెచిన్నెలు చేకూర్చింది. ‘మాయాబజార్’ చిత్రంలో ముగ్ధగా కనిపించే శశిరేఖకు, అసమదీయులను అదిలించి బెదిరించే మాయాశశిరేఖకు గల తేడాని సావిత్రి గాక ఎవరు ప్రదర్శించగలరు? ‘పాండవ వనవాసం’, ‘నర్తనశాల’ చిత్రాలలో దుర్యోధన సతి భానుమతిగా నటించి మెప్పించారు.

‘దీపావళి’ చిత్రంలో నరకునితో యుద్ధానికి బయలుదేరే సమయంలో ‘సరియా! మాతో సమరాన నిలువగలరా!’ పాటలో ఒక కంట ప్రేమతో శ్రీకృష్ణుని, మరోకంట కోపానలంతో నరకుని చూసిన చూపులను ఎలా మర్చిపోతాం?

మలిదశలో ‘వరకట్నం’, ‘దేశోద్ధారకులు’, ‘తల్లిదండ్రులు’, ‘పుట్టినిల్లు – మెట్టినిల్లు’, ‘మరో ప్రపంచం’ వంటి చిత్రాలలో వైవిధ్యభరితమైన తన సహజశైలిలో నటించారు.

నిర్మాతగా ‘చిన్నారి పాపలు’ సినిమాని మొత్తం స్త్రీలనే ముఖ్య బాధ్యులుగా కలసిమెలసి నిర్మించారు. అవార్డులు దక్కాయి కాని ఆర్థిక నష్టం మొదలయింది. తెలుగులో అఖండ విజయం సాధించిన ‘మూగ మనసులు’ చిత్రాన్ని తమిళంలో నిర్మించి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇంకా ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

‘నవరాత్రి’ చిత్రంలో స్వయంగా అమరగాయకుడు ఘంటసాల వారితో కలిసి ‘వీధిభాగవతం’ను ఆలపించారు. ఘంటసాల వారు ‘మాయాబజార్’లో మాయాశశిరేఖకు గాత్రదానం చేయడం ఓ విశేషం. తెలుగు చలనచిత్ర గీతాలను సుసంపన్నం చేసిన ప్రముఖ గాయనీమణులు ఎ.పి. కోమల, శూలమంగళం రాజ్యలక్ష్మి, యం.యల్.వసంతకుమారి, రాధా జయలక్ష్మి, గాన సరస్వతి, పి. లీల, జిక్కి, పి.సుశీల, యస్.జానకి, కె.రాణి, కె. జమునారాణి, రావు బాలసరస్వతీదేవి, యల్.ఆర్. ఈశ్వరి మొదలైన వారందరూ మహానటికి గాత్రదానం చేసి, ఆమె విజయానికి దోహదం చేశారు.

సావిత్రిగారి అభినయం – గాయనీమణుల గంధర్వగానానికి తగినట్లుండడం అద్భుతం. కాలానుగుణంగా చిత్ర రంగానికి పరిచయమైన ఇంతమంది గాయనీమణులు ఒక మహానటికి స్వరదానం చేయడం అసాధారణం. ఆ అదృష్టం మహానటికే దక్కింది.

వీరు సన్నిహితులు, ఆపన్నుల కోసం ధనాన్ని, ఆస్తిని, బంగారాన్ని లెక్కలేకుండా దానం చేసేవారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా పరిపాలన చేస్తున్న సమయంలో ఆయనను కలిశారు సావిత్రి. అపుడు తన ఒంటిమీద బంగారం మొత్తం ప్రధానమంత్రి సహాయనిధికి సమర్పించారు.

కాని వీరు కష్టాలలో ఉన్నపుడు ఎవరూ ఆదుకోలేదు. అధునాతన భవంతి నుండి అతి చిన్న ఇంటికి నివాసం మారినా అడిగినవారికి సాయం చేశారనడానికి మనకి కొన్ని ఉదాహరణలు కనిపిస్తాయి.

స్వర్గీయ దాసరి నారాయణరావు వీరి పట్ల గల ప్రత్యేక అభిమానంతో ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’, ‘రామాయణంలో పిడకల వేట’, ‘గోరింటాకు’ వంటి చిత్రాలలో నటించే అవకాశం కల్పించారు.

‘చివరకు మిగిలేది’ సినిమా నటనకు ‘రాష్ట్రపతి పురస్కారాన్ని, ‘చిన్నారి పాపలు’ చిత్ర దర్శకురాలిగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కారాన్ని’ అందుకున్నారు.

ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వీరిని అనారోగ్యానికి గురిచేశాయి. రక్తపోటు, మధుమేహం వ్యాధులకు తోడు కండరాలు కుంచించుకుపోయే “MUSCULAR DYSTROPHY” వ్యాధితో బాధ అనుభవించారు. భర్త నిరాదరణ మరింత క్రుంగదీసింది. సాయమందుకున్న ఆప్తులందరూ దూరమయ్యారు.

1980 మే నెల 10వ తేదీన కోమాలోకి వెళ్ళిపోయారు. సుమారు సంవత్సరము ఏడు నెలల తరువాత 1981 డిసెంబరు 26వ తేదీన మరణించారు.

ఈ విధంగా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినిమా జీవితంలో వివిధ పాత్రలను పోషించి జీవించిన సావిత్రి నిజజీవితంలో నటించలేక ఓడిపోయారు. ఆమె జీవితం తరువాత తరం నటీమణులకు గుణపాఠాలు నేర్పింది.

వీరి జ్ఞాపకార్థం 2011వ సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన స్టాంపుల ప్రదర్శనలో రూ.5.00ల విలువగల స్టాంపు విడుదలయింది. ఫిబ్రవరి 13వ తేదీన “LEGENDARY HEROINES OF INDIA” శీర్షికన 6గురు భారతీయ నటీమణులతో విడుదలయిన ‘మీనియేచర్ షీట్’లో ఈ స్టాంపుకు స్థానం కల్పించి, గౌరవించింది భారత ప్రభుత్వ తపాలశాఖ.

మహానటి, కలైమామణి సావిత్రి వర్థంతి ది.26-12-2020 సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here