మహాభారతంలో శల్యుడు

1
2

[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘మహాభారతంలో శల్యుడు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]శ[/dropcap]ల్యుడు మద్రదేశాధిపతి. పాండురాజు భార్య మాద్రికి స్వయనా సోదరుడు. పాండవులకు మేనమామ. మొదటిసారిగా భారతంలో ద్రౌపదీ స్వయంవరంలో కనిపిస్తాడు. అర్జునుడు బ్రాహ్మణవేషంలో మత్స్య యంత్రాన్ని కొట్టడం, ద్రౌపది అతనిని వరించడం.. దానిని సహించని క్షత్రియులందరూ మత్సరించి అర్జునునితో కయ్యానికి దిగిన సమయంలో శల్యుడు కూడా భీమునితో పోరాడి పరాజితుడౌతాడు. తదుపరి రాజసూయయాగ సందర్భంలో నకులుడు పశ్చిమ దిగ్విజయ యాత్రకు వెళ్ళిన సమయంలో తన మేనమామను సందర్శించడం.. శల్యుడు కూడా కట్న కానుకలు ఘనంగా ఇచ్చి పంపడం కనిపిస్తుంది. తదుపరి మనకు ఉద్యోగపర్వంలోనే కనిపిస్తాడు.

శల్యుడు బలశాలియే కాక గదాయుద్ధంలో నేర్పరి. రథఛోదనలో ప్రావీణ్యం కలిగినవాడు. ఇది అతనికి బలం.. కాగా పొగడ్తలకు ఉబ్బిపోయే బలహీనత కూడా అతనిలో ఉన్నది. కౌరవ దురాగతాలు తెలిసి.. కౌరవ పాండవుల మధ్య యుద్ధం అనివార్యం అయిన సందర్భంలో పాండవులకు సహాయపడాలని భావించి ససైన్యంగా పాండవులు విడిది చేసిన ఉపప్లావ్యానికి బయలుదేరాడు. శల్యుని బలపరాక్రమాలు తెలిసిన దుర్యోధనుడు, శల్యుడు పాండవులతో చేరితే తన విజయం కష్టమౌతుందనే భావనతో అతడిని వారి నుండి వేరుచేసేందుకు పన్నాగం పన్నాడు. పొగడ్తలకు పొంగిపోవడం, విందుభోజనానికి, మదిరాపానానికి లొంగిపోవడం శల్యుని బలహీనతగా గుర్తించి.. అతని స్వభావాన్ని, అలవాట్లను, తన కార్యసాధనకు ప్రాతిపదికగా తీసుకోవాలని భావించిన దుర్యోధనుడు తాను చాటుగా ఉండి శల్యుడు వచ్చే మార్గంలో అంతటా పందిళ్ళు వేయించాడు.. భోజన సదుపాయాలను సమకూర్చాడు. విశ్రాంతి మండపాలను ఏర్పరచాడు.. అడుగడుగునా తనకందుతున్న ఈ మర్యాదలను చూచి అవన్నీ తనకై ధర్మరాజే సమకూర్చుతున్నాడని ఊహించుకొని ఆనందపరవశుడైన శల్యుడు.. ఈ సదుపాయాలను సమకూర్చుతున్న వారిని తన ఎదుట హాజరుపరచవలసిందిగా పరివారాన్ని ఆదేశిస్తాడు. సమయం కోసం నిరీక్షిస్తున్న దుర్యోధనుడు సభక్తికంగా శల్యుని గాంచి నమస్కరించి అభయం కోరాడు. వచ్చినది దుర్యోధనుడని తెలిసినా ఆనందాతిశయంతో ఉన్న శల్యుడు అతనిని కౌగిలించుకొని.. సాదరంగా నీకేమి కావలయునో కోరుకొమ్మని.. అంటాడు. దానికి దుర్యోధనుడు.. మామా నీకు మేము పాండవులు ఒక్క రూపే కాబట్టి కురుపాండవ సంగ్రామంలో మా పక్షాన మా సైన్యాన్ని నడిపించి మాకు విజయాన్ని ప్రసాదించు.. అంటూ అంజలించి ప్రార్థిస్తాడు.

అప్పుడు కాని శల్యునికి తన ఆనందానికి తాను చెల్లిస్తున్న మూల్యం ఎంత అనేది అవగాహన కుదరలేదు. తాను ఇప్పుడు యుద్ధం చేయవలసింది తన మేనల్లుండ్ల పైన.. ఆ మత్తు దిగిపోయింది. తాను చేయదలుచుకున్నది ఒకటి..  జరిగింది ఒకటి.. మాట ఇచ్చాడు కాబట్టి వెనుకకు పోయే అవకాశం లేదు. అందుకే సరే అంటూ.. ఒక్కసారి ఉపప్లావ్యంలో పాండవులను దర్శించి వస్తానని చెప్పి దుర్యోధనుని అనుమతితో ఉపప్లావ్యానికి వెళతాడు.

ఒక ప్రయోజనాన్ని ఆశించి.. సంబంధిత అధికారి లేదా నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు అవసరార్థులు పలువిధాలుగా ప్రయత్నిస్తుంటారు. వెళ్ళేప్పుడే సంబంధిత వ్యక్తి స్వభావాన్ని అలవాట్లను, బలహీనతలను గురించి ఆరాతీస్తారు.. దానికి తగిన వ్యూహంతో పనిచేయించుకోవాలనుకునే వ్యక్తి ముందుకు సాగుతాడు. సాధారణంగా ముఖస్తుతికి, ఊహించని మర్యాదలకు లొంగిపోవడం మానవనైజం. అవి రెండూ మనసుకు హాయినిస్తాయి. సంతోషమయ లోకాలలో విహరింపచేస్తాయి. పరిమితులను అధిగమించకుండా వాటిని ఆస్వాదించగలిగితే అవి సత్ఫలితాన్నిస్తాయి. నిజానికి ముఖస్తుతి అనేది.. మాటకు సంబంధించింది కాగా మర్యాద అనేది.. క్రియాత్మకమైనది. ముఖస్తుతి చేసే వ్యక్తి ఎప్పుడూ ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేస్తాడు. దానికి గురైన వ్యక్తికీ అది తెలుసు. అయినా అది ఇచ్చే మత్తు ముందు విచక్షణాయుత ‘తెలివి’ ప్రక్కకు పోతుంది. దానికి లోబడిన వ్యక్తి తప్పటడుగు వేసే ప్రమాదం ఉన్నది. దానికి విందుభోజనాలు, మదిరాపానం కలుస్తే ప్రయోజనాన్ని విడిచిపెట్టి లక్ష్యానికి దూరంగా జరుగుతాడు. శల్యుడలా లొంగిపోయే వ్యక్తిత్వం కలిగినవాడు. దుర్యోధనుని వ్యూహం ఇక్కడ బాగా పనిచేసింది. పాండవులనుండి శల్యుడిని వేరుచేయగలిగాడు.

దుర్యోధనుని వీడ్కొని శల్యుడు పాండవులను కలిసేందుకు ఉపప్లావ్యాన్ని చేరాడు. ఈ విషయమంతా గూఢచారుల వల్ల ముందే తెలుసుకున్న ధర్మరాజు ఆలోచించాడు.. తన మనసులో ప్రతివ్యూహం నిశ్చితమయింది. శల్యునికి తమ్ములు, ద్రౌపది, పరివారంతో సహా ఎదురువెళ్లాడు. సభక్తికంగా అర్ఘ్యపాద్యాదులనిచ్చి అర్చించాడు. ఉన్నతమైన ఉచితాసనంపై కూర్చుండపెట్టి కుశలప్రశ్నలు వేసాడు. ధర్మరాజు ఆదరాభిమానాలకు సంతుష్టుడైన శల్యుడు.. తాను వస్తున్న మార్గంలో జరిగిన విషయాన్ని, దుర్యోధనునికి ఇచ్చిన మాటను గూర్చి చెప్పాడు.

ధర్మరాజు రాజనీతిని బాగా ఒంట బట్టించుకున్నవాడు. దూరదృష్టి కలిగినవాడు. పరేంగితజ్ఞుడు.. కాబట్టి జరిగిన దానికి మామను తప్పనలేదు, ఆక్షేపించలేదు. దుర్యోధనుని వద్ద ముఖస్తుతికి మర్యాదలకు త్రోవతప్పిన మామను అదే దారిలో తనకనుకూలంగా మలుచుకోవాలని భావించాడు. అత్యంత ఆదరంతో. మితహిత సత్యవాక్యములతో ముచ్చటిస్తూ.. మామా.. జరిగినదానికి చింతించవలసిన అవసరంలేదు.. ఇప్పుడు మాకు మేలుగా ఒక వరం ఇవ్వండి అంటూ సాగిలపడ్డాడు. దానితో శల్యుడు.. పూర్తిగా ధర్మజుని వశవర్తియయ్యాడు. నీ ప్రక్కన యుద్ధం చేయడం తప్ప.. నీవేది కోరినా ఇస్తానన్నాడు.

మామా! దుర్యోధనుడు అర్జునునికి ప్రతి వీరుడు కర్ణుడని భావిస్తున్నాడు. అర్జున సారథ్యానికి కృష్ణస్వామి ఉన్నాడు. కాబట్టి కృష్ణ సారధ్యానికి దీటుగా సారథ్యం చేయగలిగిన వాడివి ఇప్పుడు కౌరవ పక్షంలో నీవు మాత్రమే.. కాబట్టి నిన్ను కర్ణ సారథ్యానికి నియమిస్తారు. యుద్ధ సమయంలో కర్ణునికి సారథిగా కర్ణుని మనసును వికలం చేయాలి.. అది చేయదగిన పని కాదని భావించక ఆ వరం ఇమ్మన్నాడు.. ధర్మరాజు వినయానికి, భక్తికి, మర్యాదలకు పొంగిపోయిన శల్యుడు సరేనన్నాడు. అంతేకాదు.. మహానుభావా! అంటూ శల్యుని సంబోధిస్తూ.. అడిగి మరీ నహుషోపాఖ్యానం విన్నాడు, ధర్మరాజు. ఆ ఉపాఖ్యానం తనకు తెలిసినదే అయినా మళ్ళీ శ్రద్ధగా శల్యుని నోట వినడం.. ఎదుటి వ్యక్తిని పెద్దచేసి అతని మనసును గెలువడంలో భాగమే. ఈ వశీకరణ మంత్రం శల్యుని పట్ల బాగా పనిచేసింది. విందుభోజనం పెట్టి సాదరంగా సాగనంపుతూ.. యుద్ధ సమయంలో మాకిచ్చిన మాటను మరవవద్దని వేడుకున్నాడు. మనసొకరికీ మనువొకరికీ అన్నట్లుగా పాండవ పక్షానికి మనసును.. శరీరాన్ని కౌరవపక్షానికి అంకితం చేసుకున్న శల్యుడు కౌరవ శిబిరం చేరుకున్నాడు.

ఇక్కడ శల్యుని అంతరంగాన్ని ఆవిష్కరించుకోవాలి. శల్యుడు వృత్తిరీత్యా ఒక దేశానికి రాజు. కాని ప్రవృత్తి రథసారథ్యం చేయడం. అశ్వహృదయ విద్యను ఆపోశన పట్టినవాడు. రథ సారథ్య విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ కాలంలో అతనితో సమానంగా సారథ్యం చేయగలిగిన వాడు.. కృష్ణుడు మాత్రమే. తనకు సారథ్యం ప్రవృత్తియే అయినా ఎవరికి పడితే వారికి సారథ్యం చేయడానికి అభిజాత్యాహంకారం అడ్డుపడుతుంది. ఇప్పుడు అయాచితంగా అవకాశం వచ్చింది. అర్జునుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విలుకాడు. అతనికి సరిజోడు కర్ణుడుగా ప్రాచుర్యాన్ని పొందాడు. కౌరవులు కూడా దానిని విశ్వసిస్తున్నారు. తనకు ప్రతిగా ఉన్న కృష్ణుడు అర్జునునికి సారథిగా ఉన్నాడు. తనకు అక్కడ అవకాశం లేదు. కర్ణునికి సారథిగా ఉంటే.. కృష్ణసారథ్యానికి దీటుగా తన నైపుణ్యాన్ని చూపవచ్చు.. అర్జునుని పరాక్రమాన్నీ నిలువరించవచ్చు. నిజానికి కర్ణుడు సూతపుత్రుడని.. పాండవుల దురవస్థకు కర్ణుడే కారణమని అతనిపై ద్వేషాన్ని పెంచుకున్నవాడు కాని తన కోరిక తీరాలి అంటే కర్ణ రథసారథ్యాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి. తన ప్రతిభాపాటవాలను చూపి కృష్ణ సారథ్యం కన్నా తన సారథ్యమే మిన్నయని నిరూపించుకోవాలి అంటే తప్పని సరిగా కర్ణుని సారథిగా మారాలి.. అందుకే ఒప్పుకున్నాడు. అందుకే భీష్ముడొకచోట దుర్యోధనునితో  శల్యుని గురించి చెపుతూ.. “వాసుదేవుతోడి యీసున శల్యుడు అల్లురను విడిచి నిన్ను కూడాడు” అని అంటాడు. దీనితో శల్యునికి కూడా ఉభయపక్షాలకు తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా అయింది.

యుద్ధంలో ఎప్పుడైతే తనను దుర్యోధనుడు.. కర్ణునికి సారథ్యం చేయమని అడిగాడో.. అప్పుడు అతని అహంకారం నిద్రలేచింది. “సూతజు దొరఁజేసి సారథ్యంబునకు జొరఁజాల.. నింత నీచపు పనికి నన్ను బంప నీకుఁ దగునా” అంటూ నిష్ఠురంగా పలుకుతూ సభనుండి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కార్యార్థియైన దుర్యోధనుడు.. శల్యుని స్వభావాన్ని తెలిసినవాడు కాబట్టి “సప్రణయ బహుమానంబునం జని నిలువరించి సాంత్వన స్వరంబున” అతనిని పొగిడి సారథ్యానికి ఒప్పిస్తాడు. అంతేకాదు, అశ్వహృదయ విద్య తెలిసిన వారిలో కృష్ణునికన్నా నీవే అధికుడవు. కృష్ణునికి ప్రతిగా రథాన్ని నడపడం నీకు తక్క మరెవరికీ సాధ్యపడదు, అంటాడు. కృష్ణుని కన్నా తానే మిన్నయన్న మాటలకు పొంగిపోయిన శల్యుడు సమ్మతించి.. అధిపా! ఓ దుర్యోధన మహారాజా! నన్ను కృష్ణుని కన్నా గొప్పవానిగా ఈ రాజేంద్రుల సన్నిధిలో, వారంతా వినగా పొగిడినావు.. నా గౌరవం హెచ్చించావు. కాబట్టి “విమల యశోనిధియైన కర్ణునికి” రథ సారథ్యం చేస్తాను.. అంటాడు.

ఎదుటి వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ముఖస్తుతి ఉత్తమమైన ఉపకరణంగా పనికి వస్తుంది. Flattery is a delicious food for fools yet now and then wise persons also desires to taste it అంటారు. అయితే దానికీ కాలపరిమితి ఉంటుంది. కారణమేదైనా శల్యుడు కర్ణసారథ్యానికి ఒప్పుకున్నాడు కాని కర్ణుడు సూతసుతుడనే భావనను విడవలేకపోయాడు. యుధ్ధరంగంలో నొగలెక్కగానే శల్యుడు స్వాతిశయాన్ని ప్రదర్శించాడు.. కర్ణుడూ తక్కువ తినలేదు.. తను ఆత్మస్తుతిని చేసుకున్నాడు. శల్యుడు పరస్తుతి చేసాడు.. అర్జునుని పరాక్రమాన్ని వర్ణించాడు. పలు విధాలుగా కర్ణుని తగ్గిస్తూ.. అర్జునుని పొగుడుతూ మాట్లాడాడు. ఇరువురి మధ్య సమన్వయం లోపించింది.. సమగ్రత దెబ్బతిన్నది. సహకారాల స్థానంలో పరస్పర నిందారోపణలు నిలిచాయి. దుర్యోధనుని ఎంగిలి మెతుకులు ఆరగించే కాకివని నిందించాడు శల్యుడు. కర్ణుడూ శల్యుని నిందించాడు. చివరగా ఆ యుద్ధంలో కర్ణుడు మరణించాడు.. శూన్యరథంతో దుర్యోధనుని చేరిన శల్యుడు మాత్రం నిజాయితీతో కర్ణుని పరాక్రమాన్ని పొగడడం కనిపిస్తుంది.

దీని వల్ల మనం నేర్చుకోవలసిన సార్వకాలిక పాఠం ఉన్నది. తానెవరి వద్దనయితే పనిచేస్తున్నాడో అతని కన్నా నేను ఎక్కువ అనే ఆధిక్యతా భావన కలిగిన వారికి అత్యంత ముఖ్యమైన పనులను ఎప్పుడూ అప్పగించవద్దు. అలాగే ముఖస్తుతులకు లొంగిపోయే మనుషులను వారెంత సమర్ధులైనా వారిని దరిచేర నీయకపోవడం ఉత్తమం.. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు మనస్పూర్తిగా ఆ పనులను నిర్వహించరు. ముఖస్తుతికి లొంగిపోవడం.. మర్యాదలకు వ్యక్తిత్వాలను అమ్ముకోవడం వల్ల వారు తమ మార్గాన్ని తప్పడమే కాక, చిత్తశుద్ధిని కోల్పోతారు. ముఖస్తుతితో ఎదుటి వారిని మెప్పించాము అనుకునే వారు గ్రహించాల్సింది.. ఆ మత్తు దిగిపోయాక ఎదుటివారు.. తమ స్వభావానికి తగిన విధంగా మారిపోతారే కాని వారి క్షేమం కోరి నిజాయితీతో పనిచేయరు. దానితో వారు అపజయం పాల్గావడమే కాక సంస్థను కూడా నిర్వీర్యం చేస్తారు. ఈ వాస్తవం మనకు శల్యుని పాత్రలో కనిపిస్తుంది.

అర్జునుని రథ సారథ్యాన్ని కృష్ణుడు అంతఃకరణ శుద్ధితో.. ఆత్మీయతా భావనతో నిర్వహిస్తే.. కర్ణుని రథసారథ్యాన్ని శల్యుడు.. అభిజాత్య గర్వంతో.. తృణీకరణ భావనతో, ఆధిక్యతాభావనతో నిర్వహించాడు.

కర్ణుని మరణం తదుపరి.. దుర్యోధనుడు.. శల్యుని సర్వ సైన్యాధిపతిగా నియమించాడు.. కౌరవ సర్వ సైన్యాధిపత్యానికి తానే తగిన వాడిననే భావనలో ఉన్న శల్యుడు కూడా ఆ  బాధ్యతను సంతోషంగా స్వికరించాడు. దానికి కారణం.. ఒకటి అర్జున సాత్యకిల పరాక్రమంపై అయిష్టత.. గదాయుద్ధంలో భీముడు తనకు ప్రత్యర్థి అనే భావన.. భీమునితో గదాయుద్ధం చేసి మెప్పించవచ్చనే ఆలోచన.. కృష్ణునిపై అకారణ ద్వేషం.. చివరగా ఆ యుద్ధంలో ధర్మరాజు చేతిలో మరణిస్తాడు.. శల్యుడు.

మహాభారతంలో శల్యుడు మరణించి యుండవచ్చు కాని.. ఈనాటి భారతంలో ఎందరో శల్యులు మన చుట్టూరా ఉన్నారు. మనతో ఉంటూనే మన ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసే వారిని శల్యసారథ్యం చేయకు.. అనడం వింటూనే ఉంటాము.

ఈ రోజులలో ఎన్నికల సమయంలో లేదా వ్యావహారిక నిర్వహణలో ఇరుపక్షాల వారూ విందు సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాము. ఒక పక్షం నుండి మరొక పక్షనికి మార్చడానికి అవసరమైన వారిని సత్కరించడం, సహజంగా జరుగుతున్నది. దానికి ప్రత్యర్థి బలగంలో తనకు ధీటైన వాడు ఉన్నాడంటే తన ఆధిపత్యాన్ని చూపాలనుకునే మానసిక స్థితిని కలిగిన వారు త్వరగా స్పందిస్తారు. అయితే అలాంటి వారిని గుర్తించడం.. ఆ మార్గంలో వారిని ప్రలోభ పెట్టగలిగిన సామర్థ్యాన్ని సంతరించుకున్న వారే విజయసాధకులౌతారు.

పొగడ్తలకు, మర్యాదలకు, విందుభోజనాలకు, బహుమానాలకు పొంగిపోయే వ్యక్తుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ఎదుటివారి అవసరాలను గుర్తించడం వారి అవసరాలను వారు అడగక పూర్వమే తీర్చడం.. నిరంతరం ఆత్మీయతను పంచడం లేదా కనీసం నటించడం చాతనైన వ్యక్తి కార్యసాధకుడు ఔతాడు. అలా ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులనుండి ఎలా దూరంగా ఉండాలో తెలుసుకోవడం ఒక కళ. దానిని అభ్యసిస్తే.. మన స్థానాన్ని మనం కాపాడుకోగలం.

Assertiveness is not Aggressiveness అన్నారు.. దానిని గుర్తించాలి, ఆదరించాలి.. విజయసాధకులు కావాలి.. Don’t say yes when you want to say NO.

నమస్సులతో సెలవు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here