మహాప్రవాహం!-1

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]లవారుజాము. టయం నాలుగు గంటలవుతుండవచ్చును. ఇంటిముందు నులక మంచం మీద పడుకుని ఉన్న కొండారెడ్డి నిద్రలేచినాడు. ఇంటి ముందున్న యాప శెట్టు మింద కాపురముండుకున్న పచ్చులన్నీ రకరకాల కూతలతో సందడి జేయబట్నాయి. లెక్కలిప్పుకోని కూటి కోసరము ఆకాశంలోనికి ఎగిరిపోబట్నాయి. కొన్ని తల్లిపచ్చులు గూళ్లలనున్న పిల్లలకు జాగ్రత్తలు సెప్పినాయి. పది నిమిసాల్లో యాపసెట్టు మింద అలజడి తగ్గినాది.

తూరుపు దిక్కున, ఈరన్నగట్టు ఎనకాతల, అంబరం తెలుపురంగుకు తిరుక్కోబట్టింది. కొండారెడ్డి మంచం మీన్నించి లేచి నిలబడి తూరుపుకు దండం బెట్టినాడు. ఆ మన్సి నోటెంబడి సూర్యదేవుని మింద ఒక శ్లోకం వచ్చినది. సూర్యాష్టకంలోనిదా శ్లోకం. గొంతెత్తి భూపాల రాగములో ఇట్టా పాడినాడు కొండారెడ్డి.

“ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!”

నులకమంచాన్ని లేపి నిలబెట్టి, దాని మింద పరుచుకున్న బొంతను నాలుగు మడత లేసినాడు కొండారెడ్డి. మీద కప్పుకున్నేకి పెట్టుకున్న జాడును ఇదిలించి, భుజాన ఏసుకున్నాడు. నులకమంచాన్ని చంకలో పెట్టుకుని లోపలికి నడిసినాడు.

కొండారెడ్డి యిల్లు ఐదంకణాలది. ముందు రెండు గాడిపాడులుండాయి. ఒక పక్కన రెండు గిత్తలు పడుకోనుండాయి. ఇంకో పక్కన ఒక ఆవు, పెయ్యదూడ ఉండాయి. కొండారెడ్డి గాడిపాండ్ల నానుకుని ఉన్న అరుగుల మందికి ఐచారు త్యాపలు (మెట్లు) ఎక్కి బోయి మంచం గోడకానించి, పట్టె మింద బొంత, జాడు(గొంగడి) ఏసి కిందికి వచ్చినాడు.

కొండారెడ్డిని జూసి గిత్తలు తీసి నిలబడుకోనుండాయి. వాటి దగ్గరకు బోయి పయ్యి అంతా నిమిరినాడు. ఒక గిత్త ప్రేమగా తన గరుకు నాలికతో ఆ యప్ప మొకాన్ని నాకబట్టింది.

‘తూ నీయమ్మ! నన్ను పొద్దున జూస్తే నీకిదే పని!” అని మురిపెంగా దాన్ని కసిరిచ్చుకున్నాడు.

ఒక పక్కన పేర్చి ఉన్న జొన్న చొప్ప నాలుగు కట్టలు తీసుకుని తుమ్మమొద్దు మీద ఎరుకల కొడవలితో దాన్ని నాలుగు తుంటలు జేసి, గాడిపాట్లో ఏసినాడు. గిత్తలు ఆత్రంగా అవిట్ని తినబట్నాయి.

‘నా దగ్గరికి రాలేదేమి ఈ నా బట్ట’ అన్నట్టుగా సూస్తా ఉండాది గోపెమ్మ. కొండారెడ్డి ఆవు దగ్గరికి బోయి; తోకవైపు చేయి బెట్టి కండ్ల కద్దుకున్నాడు. అవును గూడ్క పయ్యంతా నిమిరినాడు. ఆవు అరమోడ్పు కండ్లతో ఆ యప్ప చేతి స్పర్శ సుఖాన్ని అనుబగించింది. ఆవు ముందర గాడిపాట్లో గూడ చొప్పదంట్లు నరికి ఏసినాడు.

కొండారెడ్డి పెండ్లాము నాగరత్నమ్మ కంచుగిన్నె పట్టుకుని ఇంట్లోంచి వచ్చినాది. మొగున్ని జూసి నవ్వి నాదాయమ్మ. “లేస్తివా? దూడనిడ్సు మళ్ల!” అన్నాది.

కొండారెడ్డి పెయ్యదూడ మెడకున్నమోకు ముడి నిప్పంగనే అది ఒక్క ఉదుట్ను బోయి వాండ్లమ్మ పొదుగుతూ తలదూర్చినాది. పొదుగును కుమ్ముకుంటా పాలు తాగుతున్నాది.

ఆవు పొదుగును పూర్తిగా చేపింది. నాలుగు చన్నులూ ఉబ్బి, మూడింతలైనాయి. కుండంత పొదుగును చూసి మొగుతూ పెండ్లాలు ముకాలు ‘ఇంత’ చేసుకున్నారు.

“ఏమ్మే, ఆవుకూ దూడకూ దిష్టి తియ్యి అనిక్కి! నా దిష్టి తగిలేటట్టునాది!” అన్నాడు రెడ్డి.

“నిజవేనయ్యోయ్! గోపెమ్మ తల్లి సల్లగుంటే గద, మన బతుకులు సల్లగుంటాయి! అట్టా సూస్తా నిలబడినా వేంది? దూత మొత్తం పాలు తాగేస్తాది. పిలగాండ్లకు రోన్నన్నా పిండుకుంటా. ఇంక పక్కకు జవురు దూడను!” అనింది నాగరత్నమ్మ.

దూడ పెయ్యినంతా, తన ప్రేమనంతా రంగరించి నాకుతోంది ఆవు. అయిష్టంగానే దూడ మెడ పట్టుకోని పక్కకు తోలుకునొచ్చినాడు. కట్టు గొయ్యకు కట్టేసినాడు.

నాగరత్నమ్మ ఆవు పొదుగు కాడ గొంతుకు కూర్చున్నాది. కంచుగిన్నెని నీళ్లతో నురగతో నిండిన చన్నులను, పొదుగును శుభ్రంగా కడిగినాది. చీరకొంగుతో తుడిచి, పాలు పిండడం మొదులుబెట్నాది.

సుయ్యి, సుయ్యిమనే సప్పుడుతో పాలదారలు గిన్నెలో బడుతున్నాయి. ఐదారు నిమిషాల లోనే గిన్నె నిండిపోయినాది.

“ఇంక సాలు రామ్మే! దూడకుండాల గదా!” అన్నాడు మొగుడు.

“వాండ్లమ్మ శానా తెలివైనది లేయ్యో! మళ్లీ దూడ కోసరము శేపుకుంటాదిలే!” అన్నాది పెండ్లాము.

కంచుగిన్నె పై బాగాన పాల నురగ ఒక శికరం మాదిరి గట్టినాది. దాని మింద చీరకొంగు కప్పుకుని లోపలికి బోయింది నాగరత్నమ్మ. పోతాపోతా, మొగునితో

“బెరీన మొగం కడుక్కుని రా! గెడం కట్టుకోని సుంకులమ్మ గుడి సేను గుంటక తోలాల అని చెబ్తివి గదా!” అన్నాది.

“ఔ. వచ్చుండాపా. నీవు పొయ్యెలిగించి పాలు గాచేటప్పటికి రానూ?” అంటూ యాపశెట్టుకొమ్మ ఒకటి యిరిసి, పలుదోముపుల్ల తీసుకున్నాడు. దాన్ని నములుతూ, గాడిపాడు దగ్గరి గాబు లోని నీల్లు సత్తు చెంబుతో తీస్కోని మొగం కడిగినాడు. పుల్లను నడిమికి శీలి నాలిక గీసినాడు. రెండు వేళ్ళు గొంతులో జొనిపి లోపలి ‘గల్ల’ అంతా బయటికి దీసినాడు. గళ్ల తువ్వాలతో ముఖం తుడుసుకొని లోపలికి బోయినాడు.

అరుగుల ఎనక పెద్ద పడసాల. ఒక మూలన వడ్లు, కందుల గోనెసంచులు ఒకదాని మింద ఒకటి పేర్చిపెట్నారు. పడసాల దాటిన తర్వాత రెండువైపులా రెండు పెద్ద గదులుండాయి. ఒకదాంట్లో పట్టి మంచం మింద కొండారెడ్డి పిల్లలు ముగ్గురు పడుకోనుండారు.

గదిలోకి బోయి చూసినాడు. అదమర్సి నిద్రబోతుండారు పిల్లలు. ఇంటెనక వారపాగు దించి ఉంది. అదే వంటయిల్లు, ఆడనే బోజనాలు. ఎనక దొడ్డి. దొడ్లో ఒక మూల గిలక బాయుంది. ఇంకోమూల కక్కసుదొడ్డి.

దొడ్డికి బోయివచ్చినాడు కొండారెడ్డి. నేరుగా బాయి దగ్గరికి బోయి నాలుగు బక్కెట్లు నీళ్లు తోడుకుని తొట్టిలో బోసుకున్నాడు. బాయి సుట్టు, నున్నగా సిమెంటుతో చప్టా జేయించి ఉండారు. పెరట్లో కొన్ని చెండుపూల మొక్కలు, ఒక నందివర్ధనం చెట్టు, ఒక తెల్ల గన్నేరు చెట్టు ఉండాయి. ఈ బాయికాడ వాడిన నీళ్లు చిన్న కాలువ గుండా చెట్లపాదులలోకి బోతాయి.

తొట్టికాడ ఉన్న చిన్న రాయి మీద గూసోని, తానం జేసినాడు కొండా రెడ్డి. లైప్‍బాయి సబ్బుతో పెయ్యంతా రుద్దుకున్నాడు. వారపాగు నానుకొని ఉన్న తాళ్ళ మింద ఆరేసిన పైపంచతో ఒళ్లంతా తుడుచుకున్నాడు. ఎమ్మిగనూరు చేనేత పంచెను అడ్డ పంచగా కట్టుకున్నాడు.

వంటింట్లో ఒక మూలగా దేవుని గూడుంది. నాగరత్నమ్మ అప్పటికే తానం చేసి దేవుని కాడ దీపారాధన జేసింది. గూట్లో ఎంకటేసులు, నర్సిమ్మసామి, గణపతి, పార్వతీ పరమేశుల పటాలున్నాయి. కొండారెడ్డి పెరట్లోంచి నాలుగు నందివర్ధనాలు, నాలుగు తెల్లగన్నేరు పూలు కోసుకొని తెంపుకోని వచ్చి పటాల దగ్గర పెట్టినాడు. కండ్లు మూసుకొని కొన్ని శ్లోకాలు చదువుకున్నాడు. గూట్లో చిన్న ఇత్తడి ప్లేట్లో నైవేద్యంగా పెట్టిన కలకండ తుంటనొకదాన్ని కండ్లకద్దుకుని నోట్లో ఏసుకున్నాడు.

పడసాలలో గోడకు కొండారెడ్డి తల్లిదండ్రుల పోటోలుండాయి. లింగారెడ్డి, ఆదిలచ్చమ్మలవి. వాండ్లకు గూడ దండం బెట్టుకొని బయట అరుగు మింద ఉన్న చెక్క బెంచీలో కూర్చున్నాడు.

నాగరత్నమ్మ పెద్ద ఇత్తడిగ్లాసులో బెల్లంకాపీ తెచ్చి మొగునికిచ్చింది.

“నీవు గూడు దెచ్చుకోపోమ్మీ” అన్నాడు

“నేను మల్ల దాగుతా లేయ్యా!” అన్నదామె.

కాపీ తాగి, మెచ్చుకోలుగా బారియవైపు జూసినాడు కొండారెడ్డి.

“కాపీ జెయ్యాలంటే నీవేమ్మీ!” అని అంటే

“అంతా మన గోపెమ్మెతల్లి పాల మగిమ లేయ్యా, నాదేముండాది?” అన్నదామె.

“సరే గాని సద్దిమూట గట్టినావా లేదా?”

“ఎప్పుడో ఐపాయెగదా!”

“ఏం బెట్టినావో దాన్లోకి?”

“కొర్రబియ్యం అన్నం, బుడ్డల (వేరుశనగ) ఊరుమిండి!”

“శబాస్! త్యాపో మల్ల”

దండెం మీద నుండి సైను గుడ్డతో కుట్టిన చేతుల బనియను ఏసుకున్నాడు కొండారెడ్డి. మీద తువ్వాల. గాడిపాడి దగ్గరికిబోయి గిత్తల్నిప్పినాడు. అవి జొన్నదంట్లు పూర్తిగా తిన్నాయి. రెండు గిత్తలూ నీల్లు తాగనీకె గాబు దగ్గరికి బోయినాయి. పక్కనే చట్టిలో నానబెట్టిన బుడ్డలచెక్క (వేరుశనగనూనె తీయగా కేకుల రూపంలో వచ్చే పిప్పి)ను చేత్తో దీసి గాబులు నీళ్లలో కలిపినాడు. అందువల్ల నీళ్లకు ఎక్కడ లేని రుచి వస్తాది. గిత్తలు ఇష్టంగా నీళ్లు తాగబట్నాయి. ఒకటి నీళ్లు తాగకుండా ముట్టె గాబు అడుక్కుబెట్టి, ఊపిరి బిగబట్టి అడుగున పేరుకున్న పిండిని తినడానికి ప్రయత్నించడం చేస్తుంది.

“ఈన్నే అతిక ప్రసంగం అంటారు” అంటా దాని మీద చేత్తో ఒక్క దెబ్బ వేసినాడు కొండారెడ్డి.

గాడిపాడు మీద ఉన్న అటక మీద నుండి గుంటక దింపినాడు; కాడిమాను తోసా. రెండూ మోసుకొని బయటపెట్టినాడు. “ట్టట్టొట్టో” అని నాలుకతో సప్పుడు సేయంగనే రెండుగిత్తలూ బయటకొచ్చినాయి. వాటి మెడల మింద కాడిమాను మోపి, గుంటకను మోకుతో దానికి కట్టేసినాడు. గుంటక కున్న నాటు కట్టెలు నేలకు జీరాడుతూండాయి.

నాగరత్నమ్మ సద్దిమూట తెచ్చి మొగునికిచ్చింది.

“ఎదుర్రామ్మే” అన్నాడు. ఆమె చీర సర్దుకుని కాడి ముందుకొచ్చి, గిత్తలు కదిల్నాక పక్కకు జరిగింది. ములుగర్ర చేతబట్టి సుంకులమ్మ గుడి సేను దిక్కు నడవబట్నాడు.

***

సుమారు రెండు మైళ్ల దూరముంది సేను. మధ్యలో వంక దాటాల. సేనుకాడికి చేరుకొనేతలికి ఆరయ్యింది. సూర్య బగమానుడు ఈరన్న గట్టు మీదికి ఎగబాకి, ఎర్రగా కమలాపండు మాదిరి మెరుస్తాండాడు. కాని ఆయన్ను కండ్లతో సూడనీకె ఇంకా వీలయితుండాది. ఎందుకంటే ఆయన ఇంకా తీచ్నంగా లేడు మరి!

గిత్తలు సేని గట్టునున్న తుమ్మసెట్టు కిందికి బోయి నిలబడినాయి. కొండారెడ్డి, పక్కనే ఉన్న సుంకులమ్మ దేవళంలోనికి బోయి అమ్మవారికి దండం బెట్టుకున్నాడు. గర్భగుడి తలుపులు బీగం వేసినా, అవి కటాంజనము (గ్రిల్) తో చేసినందువలన తల్లి బాగా కన్పడుతుంది.

నాలుగు రోజుల క్రిందట్నే పదునువాన గురిసింది. సేనంతా దున్నిపెట్టుకు నానుండాడు రెడ్డి. మళ్లీ మొన్న వాన కురిసినాది. నాగేటి చాళ్లు బాగా నీళ్లు తాగి ఆరినాయి. ఈ రోజు గుంటకతో పాపనం (దున్నబడిన భూమిని సమతలంగా జేయడం) జెయ్యాల.

గుంటకను కాడి మీన్నించి దించినాడు. అడుగు వ్యాసమున్న తుమ్మ మొద్దు, ఐదడుగుల పొడుగున్నది. దానిని నైసుగా చెక్కినాడు ఆచారి రామబ్రెమ్మం. దాని మద్దెన రొండు బెజ్జాలు వేసి, పదడుగుల పొడుగున్న నాట కట్టెలు బిగించినారు. వాటి చివరలను కాడిమానుకు మోకుతో బిగించుకున్నాడు. గుంటకకు క్రింద బిగించిన ఇనుప బ్లేడు రెండించిల వెడల్పు ఉండి పావు ఇంచీ మందం కంటే తక్కువ ఉంది. దాని అంచు కొశ్శగా (వాడిగా) ఉంది, సరిగ్గా నేలమీద ఆనుకునింది.

సరిగ్గా ఐదెకరాలకు ఇరవై సెంట్లు తక్కువుంటాది సంకులమ్మ గుడి సేను. కొండారెడ్డి నాయన అంగారెడ్డి చచ్చిపోయినంక ఊరి పెద్దమనుసులు జేసిన జాగ పరిష్కారంలో భూమిని ముగ్గురన్నదమ్ములకు పంచినారు. కొండారెడ్డి బాగానికి ఈ సేను, ఈరన్నగట్టు కవతల సెరువు కింద ముప్పావెకరా వరిమడి వచ్చినాయి. వాండ్లకు ఒక్కగానొక్క సెల్లెలు యశోదకు స్త్రీదనం కింద చెరుకులపాడుకు బోయే దారిలో ఒకటిన్నర ఎకరం నల్ల ర్యాగడిపొలం ఇచ్చినారు. ఆయమ్మిని బేతంచెర్ల కిచ్చినారు. ఆ యమ్మ పెనిమిటి రాగవ రెడ్డి ఆ ఊర్లో పాలీషు బండల యాపారం జేస్తాడు. వాండ్లకు ఒకే బిడ్డ. బాగ్యలచ్మి. ఆ పొలం గూడ కొండారెడ్డి సాగు తీసి, పలసాయం సెల్లెలి కిస్తాంటాడు.

కొండారెడ్డి అందరి కంటె పెద్దోడు. లింగారెడ్డి బ్రతికుకున్నంత వరకు అందరూ కలిసే ఉండేటోల్లు. తర్వాత ఎడిగల (విడి) బోయినారు. ఇల్లు ఈయన దీసుకుని, తమ్ముండ్లకు లెక్క గట్టిచ్చినాడు. వాండ్లిద్దరూ రైతులే. ఎవురి సంసారాలు వాండ్లవి.

గట్టు కాడినుంచి నిలువుగా గుంటక పాపనం చేయబట్నాడు కొండారెడ్డి. గుంటక నొగల మీద ఒక పెద్దరాయి పెట్టి, మేడి తోక మీన చెయ్యి ఒత్తి పట్టి రెండు సాళ్లు పాసినాడు. భూమి సరిగ్గా తెగటంల్యా.

‘దీనమ్మ! బ్లేడు వాడి తగ్గినట్టుందిదే! ఇయ్యాల సాయంత్రం సరి పిచ్చాల!’ అనుకున్నాడు. సలిపిచ్చడం అంటే బ్లేడును కొలిమితో కాలిచ్చి, సమ్మెటతో కొట్టి, అంచును వాడిగా చేయించడమన్నమాట.

‘ఇట్టగాదు తియ్’ అనుకున్నాడు కొండారెడ్డి. రాయిని దీసిపారేసి, తానే నొగల మీద ఎక్కి నిలబడినాడు. చేతిలో గిత్తల పగ్గాలు తప్ప బ్యాలెన్సు జేసుకోనీకి ఏమిలేదు. బరువెక్కడం వలన బ్లేడు లోతుగా భూమిని తెంపసాగింది. గిత్తల వేగం తగ్గిందని గ్రయించి ముల్లు కర్రతో వాటి మక్కుల మీద పొడుస్తూ వాటిని ఉశారిచ్చినాడు. ఒక్కసారి మక్కు సురుక్కుమనగానే గిత్తల కర్తమయినాది, నిదానబడితే పొడుస్తాడని. కేవలం ములు గర్రతో అదిలిస్తేనే అవి వేగం పెంచుకోబట్నాయి.

నాగేటి చాళ్లను సమంగా పరుస్తూ గుంటక సాగుతుంది. మూడునాలుగు సాళ్లకొకసారి అపి, గుంటక బ్లేడుకు అంటుకున్న గడ్డి, పదును మట్టిలను కొడవలితో గీరేస్తున్నాడు. సూర్యుడు నాలుగు బారలు ఎగబారి తేరిపార సూడడానికి అలవి గాకుండా ఎలుగుతున్నాడు.

రెండు పర్లాంగుల దూరంలో రైలు కట్టు ఉంది. అది సుంకులమ్మ గుడి దగ్గర వంపు తిరిగి, వంక మీద కట్టిన బ్రిడ్జి గరెండాలు (ఇనుప వంతెన) మీదుగా టేసను లోకిపోతాది. దూరంగా రైలు కూత యినపడినాది కొండారెడ్డికి. కొంచేపటికి కర్నూలు నుంచి దోన్‍కు బొయ్యే ప్యాసింజరు రైలు పొగలు కక్కుకుంటా, ధన ధన శబ్దం చేసుకుంటా వచ్చినాది. అది మలుపు తిరుగుతాంటే, కాడినాపి, తదేకంగా దాన్నే చూసుకుంటా ఉండిపోయినాడు రెడ్డి, గరెండాలు మీన పోయేటప్పుడు రైలు చేసే శబ్దము శానా యిష్టం అయప్పకు. శానా లయబద్ధంగా ఉంటాదది. దానికి తగినట్టుగా తలకాయ ఊపుతూ ఆనందించినాడు.

‘డోను లోకలొచ్చినాదంటే అంబటి పొద్దయినట్టే గద!’ అనుకున్నాడు కొండారెడ్డి. గిత్తలను తుమ్మమాను కింద నీడకు నిలబెట్నాడు. ఎండకు అవి వగరుచ్చుండాయి.

కాడిమాను దింపినాడు. చెట్టుకొమ్మకు కట్టిన సద్ది మూట దీసుకున్నాడు. సుంకులమ్మగుడి కాడ ఉన్న బోరింగులో కొట్టి, తన దగ్గరున్న సిల్వరు చెంబుతో నీళ్లు పట్టుకున్నాడు. గుడి బయట చిన్న మంటపం, పక్కన జమ్మిచెట్టు పెద్దది ఉన్నాయి. అమ్మవారికి బలియిచ్చిన మేకలు, గొర్రెల కాళ్లు ఆ చెట్టు కొమ్మలకు వేలాడుతూండాయి.

మంటపం నేలను తువ్యాలతో దులిపి, కూచున్నాడు. సద్దిమూట ఇప్పంగనే కమ్మని కొర్రన్నం, బుడ్డల ఊరుమిండి వాసన ఆ యప్ప ముక్కుకు సోకింది. నోట్లో నీళ్లు ఊరుతుండగా, అన్నం ఊరుమిండి కలిపి, మొదటిముద్ద కండ్ల కద్దుకుని తినబట్నాడు. ఎక్కడినుంచి వచ్చినాదో ఒక ఊరకుక్క. ఆ యప్ప దగ్గరికి వచ్చి తోకనాడించబట్నాది. దానికి ఒక పిడచ బెట్నాడు.

సద్ది తిని, నీళ్లు తాగి, త్రేన్చినాడు. పావుగంటపాటు తంబాని కానుకుని కూసున్నాడు. కడుపు నిండినాదేమో, ఆ యప్పనోటి నుండి హరిచ్చంద్ర నాటకం దాని ఒక పజ్యం రాబట్నది.

“మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్

నా యిల్లాలని నా కుమారుడని..”

కొండారెడ్డి మంచి పాటగాడు. కల్యాణిరాగంలో ఆ యప్ప పద్యమంతా పాడి, చివర్న గమకాలు పలికిస్తూ రాగం దీసినాడు శానా సేపు. గిత్తలు, ఊరకుక్కలు గూడ్క పద్యాన్ని శ్రద్దగా యిన్నాయి.

‘పద్యాలు పాడుకుంట కూసుంటే పని తేలెదెట్టరా కొండారెడ్డి!’ అనుకుని నవ్వుకుని లేసినాడు. మళ్లా గిత్తల కాడికి బోయి వాటి మెడల మీద కాడి మోపి గుంటక పోయడం సాగించినాడు.

సూర్యుడు నడినెత్తికి కొంచెం, అంటే బారెడు తక్కువుండాడు. ‘అంటే పదకొండు దాటింటాది’ అనుకున్నాడు. ‘గిత్తలకు దూపకయితాది. ఇంగ సాలిస్తే బాగు’ అనుకొని, మోకు యిప్పి, గుంటక కాడి మీద గట్టినాడు. ఇంటికి పోతుండామని గిత్తలకర్తమయినాది. శాన ఉశార్న నడవబట్నాయి. వాటి తేజు (వేగం) నందుకోలేక కొండారెడ్డి ఎనకబడి పోయాడు. అవి వంకతో నీల్లల్లు దిగంగనే.

“ఏ.. ప్ప! ఏ.. ప్ప! ట్టొ, ట్టొ, ట్టొ” అని ఎనకనించి అరిచినాడు. టక్కున నిలబడి పోయినాయవి. కొండారెడ్డి చెప్పులిడిసి ఇసుకలో ఒక సోట బెట్టి నీల్లలో దిగి గిత్తలకు తానం బోయడం మొదలు బెట్నాడు. ఒకదాని తర్వాత ఒకటిని, వాటి పెయ్యి మింద సిల్వరు చెంబుతో నీల్లు బోస్తూ, చేత్తో రుద్దబట్నాడు. గజ్జల్లో శుబ్రం చేయించు కొనేటప్పుడు వాటికి ఆయిగా ఉందేమో, కండ్లు అరమూసుకొని ఉండాయి. దాపటిగిత్త మాత్తరం మొకం మీద నీల్లు పోయనియ్యదు. తల యిదిలిస్తాది.

“చ్చొచ్చొచ్చొ” అని దానికి నచ్చచెబుతూ ముకం కలిగినాడు. తానం అయినంక అవి నీల్ల లోంచి బయట కొచ్చి నిలబడినాయి. బుజం మీదున్న తువ్వాల తీసి వాటి పెయ్యి మీదున్న తడిని అద్దేసినాడు.

గిత్తలు ఎండలో తల తల మెరుసుస్తూండాయి. ఒకటి పశది (తెల్లని తెలుపు), ఇంకొకటి బట్టది (గోధుమ, తెలుపు పొడల మిశ్రమం). వాటిని అపురూపంగ జూసుకున్నాడు కొండారెడ్డి.

ఆ యప్ప ఇల్లు జేరేతలికి పన్నెండున్నరాయ. గిత్తలను గాడిపాడు కాడ కట్టేసి, వాటికి జల్ల (గంప) లో, పెరట్లోని చిన్న వామిలో నుండి ఎండు వరిగడ్డి, బుడ్డల దూసుకొని వచ్చినాడు. వేరుశనగ పంట వచ్చింతర్వాత ఆ మొక్కలను ఎండబెట్టి, వరిగడ్డి ఒక వర్స, అది ఒక వర్స వామి ఏస్తారు. ఉట్టి వరిగడ్డిని పసరాలు అంతగా తినవు. ఈ బుడ్డల కట్టె కలిపి పెడితే ఇష్టంగా తింటాయి.

కొండారెడ్డి జల్లను గాడిపాడ్లో వంపకుండానే, బట్టగిత్త దాంట్లో మూతి బెట్టి కింద పడేసింది!

“నీ తొక్కులాట సల్లగుండ! రొంచేపు నిలబడలేవే?” అని దాన్ని విసుక్కున్నాడు.

గాబు దగ్గర కాలుసేతులు కడుక్కొన్నాడు ఆ యప్ప. నాగరత్నమ్మ బయటకు వచ్చి మొగున్ని చూసి నవ్వింది.

‘ఈ యమ్మికి తమాము (ఎల్లప్పుడు) నవ్వు మొగమే! ఒక సిరాకు గాని, సీదర గాని తెలియదు’ అనుకున్నాడు పెనిమిటి.

“వస్తివా, ఐపాయనా, ఇంకా ఉండాదా?” అని అడిగినాదా యమ్మ.

“సగానికి పైగా అయిండ్ల్యా . రేపు అంబటి పొద్దుకే అయిపోతాందితే!” అన్నాడు. “పిల్లలు బడి కాడ నుండి ఇంకా రాల్యా?” అనడిగితే

“ఒంటిగంటకు గదా బోజనం బెల్లు కొట్టేది?” అన్నదా యిల్లాలు. “నీకు పెడ్తాపా! ఆకలయితుండాదేమో!”

‘యాల్యా! (ఏం లేదు). కొర్రన్నం మచ్చుగ (దండిగ) బెట్నావుగదా ! పిల్లండ్లను రానీ! అందురం తిందాం”

ఈ లోపల పిల్లలు ముగ్గురూ వచ్చినారు. ఒక ఆడపిల్ల, ఇద్దరు కొడుకులు. పిల్ల తొమ్మిది చదువుతోంది. పిలోండ్లు ఒకడు ఏడు, ఒకడు ఐదు.

పొద్దున్నుంచి నాయిన గనపడక ఉంటారేమో, ముగ్గురూ ఆ యప్పను జుట్టుకున్నారు.

“పాండి, కాల్లుసేతులు కడుక్కొని రాండి! అన్నం తిందాము” అన్నాడు.

వంటగది వారపాగు క్రింద ఐదుమంది కూర్చున్నారు. తలా ఒక జొన్నరొట్టె ఏసింది సిల్వరి తట్టలలో. గోగాకు పప్పు ఏసినాది. తానూ పెట్టుకున్నాది. తర్వాత వరి అన్నం, దాంట్లోకి చారు, చివర్నమజ్జిగ బోసుకొని తిన్నారందరూ. పిల్లలు మల్లా బడికి బోయినారు. నాగరత్నమ్మ బాయికాడ గిన్నెలు తోముకుంటాంది. కొండారెడ్డి అరుగుమీద నులక మంచం వాల్చుకుని బొంత నెత్తి కింద చెట్టుకుని కుంచేపు కునుకు తీయబట్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here