[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[డోన్‍లో మళిగె కోసం వెళ్ళిన సంజన్న గౌడు తన ఊరాయన రామగిరిని కలుస్తాడు. మళిగె దొరికేవరకూ తమతోనే ఉండమంటాడు రామగిరి. ఆయన భార్య సంజన్నని ఆదరంగా పలకరిస్తుంది. మర్నాడు నుంచి మళిగె కోసం వెతకడం మొదలుపెడతారు. బేతంచర్ల రోడ్డులో ఒక మళిగె చూస్తారు. సంజన్నకీ, రామగిరికీ నచ్చుతుంది. వ్యాపారానికి అనువుగా ఉంటుందని అనుకుంటారు. యజమానిని కలిసి అద్దె మాట్లాడుకుని, అడ్వాన్సు ఇచ్చేస్తాడు సంజన్న. బొమ్మెరెడ్డిపల్లిలో వడ్లాయన రామబ్రమ్మం ఇంటి ముందు కూర్చుని ఆలోచనలో పడతాడు. ఈ మధ్య కాలంలో రైతులకు సాగు లేక, ఆయనకి పనులు రావడం లేదు, ఆదాయమూ ఉండడం లేదు. అటుగా వెళ్తున్న కంబగిరిరెడ్డి తనని పలకరించకుండా వెళ్తుంటే, అతన్ని ఆపి, పలకరించకుండా వెళ్ళిపోతున్నావేం అని అడుగుతాడు. ఏదో ఆలోచనలో ఉన్నాను, గమనించలేదని అతనంటాడు. తన బాధలు చెప్పుకుంటాడు. కర్నూలు వెళ్ళిపోయి, అక్కడ కోళ్ళ ఫారం పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్తాడు. రైతులందరూ సేద్యాలు మానేస్తే తనలాంటివాళ్ళు బ్రతకడమెలా అంటాడు వడ్లాయన. వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు కంబగిరిరెడ్డి. తమ కొడుకు వీరబ్రహ్మం గురించి భార్య సిద్ధమ్మతో మాట్లాడుతాడు. ఈలోపు వీరబ్రహ్మం ఇంటికొస్తాడు. ముగ్గురు అన్నం తిని తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ఆదోని లో తన నేస్తంతో కలిసి వండ్రంగి పనిలో చేరుతానని చెప్తాడు వీరబ్రహ్మం. మొదట వద్దాన్నా, చివరికి ఒప్పుకుంటాడు రామబ్రహ్మం. ఇక చదవండి.]
[dropcap]మం[/dropcap]గలి శరబయ్య గుడ్క కాలానికి అనుగునంగా వచ్చే మార్పులకు బలయినోడే. రెండు మూడేండ్లుగా ఊళ్లోన రెండు మూడు మంగలిశాపులు బెట్నారు. ఒకటి అయివే మింద, ఒకటి పెద్దీదిలో, ఇంకోటి కమ్మరిసాల కాడ. బంకుల మాదిరి శెక్క తోని కట్టించుకోని, రెండు చెక్క కురిసీలు, ముందల పెద్ద అద్దము, బ్రష్టులు, సబ్బులు, వాసననూనెలు అన్నీ బెట్టినారు.
శరబయ్యను ఎవురూ పిల్పడంలా. రుక్మాంగద రెడ్డి మాదిరి పెద్దింటోల్లు మాత్రం మంగలి శాపులకు బోరు. వాండ్లు యిండ్లకే మంగలేడు రావాల. ఆకిరికి కమ్మరిసాల కాడ ఉన్న శాపులోన పనికి కుదురుకున్నాడు శరబయ్య.
తానే సొంతంగ శాపు పెట్టుకుందామంటే మిడిమ్యాలపు పెట్టుబడి గావాల. ఈ యప్పకాడ అంత దుడ్డు యాడుంది? శాపాయన శరబయ్యకు దూరపు సుట్టమే! ఆ యప్ప పేరు తిక్కయ్య. వాండ్లది తొగర్చేడు. టౌనులో శాపు పెట్టుకోల్యాక బొమ్మిరెడ్డిపల్లెలో పెట్టుకున్నాడు.
సొతంత్రంగా బతికిన మనిసికి ఇంకా సోట కూలి పని జెయ్యాలంటే పానాని కొస్తాది. కానీ మరి తిండి దినాల గదా! పోయి తిక్కయ్యను గలిసినాడు. ఆ యప్ప అప్పుడు ఎవురికో గడ్డం చేచ్చాండాడు. శరబయ్యను జూసి, “రా మామా! శాన్నాల్లకు!” అంటూ లోనకు బిల్సినాడు. ఆ శాపు బంకుగాదు. శెట్టిగారిది పాత కొట్టది. దాన్ని బాగు చేపిచ్చు కున్నాడు తిక్కయ్య. లోపల ఆసాములు కూసోనీకె బెంచీ ఏసి ఉన్నాది. గోడలకు సినిమాల వాలుపోస్టర్లు కరిపించి ఉండాయి.
శరబయ్య పోయి బెంచీ మింద గూసున్నాడు. గడ్డం జేసి పంపించి, తిక్కయ్య వచ్చి పక్కన గూసున్నాడు.
“మా యత్త, మా సిన్న బావమరిది బాగుండా రా మామా!” అనడిగినాడు. శరబయ్య నోటెంట ఒక పెద్ద నిశ్వాసం ఎలబారినాది. “నీకు తెలియని బాగారా తిక్కయ్యా!” అన్నాడు. “మీ శాపులు బెట్నంక నన్ను పిలిసి పని చేయించుకొనేటోల్లు తగ్గిపోయినారు గద! బొత్తిగా జరుగుబాటు గావడం ల్యా. ‘సరే మనోడు ఉండాడు గదా యేదో ఒక దావ జూపిస్తాడు లే’ అని నీ దగ్గరికి పారొస్తి.”
“నాకాడనే పని తక్కువుండాది మామా! ఇంత చిన్నూర్లో ముందు శాపులాయ” అన్నాడు తిక్కయ్య.
“అట్టునగాకురా. నీ కాడయితే కులపోనివి గాబట్టి మర్యాద నిలబెట్టుకోవచ్చనని వచ్చినా.”
తిక్కయ్య కుంచేపు ఆలోశన చేసినాడు. ఆనక అన్నాడు.
“సరే మామా! నీవు యింతగా అడుగుతూండావు గనక తప్పేదేముంది. కానీ, నెలజీతం ఇయ్యనీకె నా తరం గాదు. పొద్దుగాల ఆరు గంటలకు వాడుకున్నందుకు శాపుకొచ్చేయి. నాకు గాక ఎక్కువయినోల్లకు నీవు జేసుకో. నా శాపు వాడుకున్నందుకు నీ కొచ్చే దాంట్లో నాకు సగమియ్యాల. నీకు సమ్మతమైతే రేపట్నుంచీ రా”
గుడ్డి కన్నోని కంటే మెల్లకన్నోడు మేలన్నట్టు ఈ పద్దతి బాగుందనిపించినాది శరబయ్యకు.
“అట్నే జేచ్చా లేరా” అని ఎలబారినాడు యింటికి.
కొడుకు మాదవకు సదువబ్బల్యా. పదహారేండ్లుచ్చిండాయి ముడ్డి కిందికి. యా పనీ జెయ్యడు. ఎంట దీస్కపోయి కుల వృత్తి నేర్పించినాడు కొంతవరకు. అదీ యిండ్ల కాడికి బోయి జేయాలంటే శానా యిబ్బంది గుంటది వానికి. వాండ్లమ్మ రామక్క పాపం నాలుగిండ్లల్లోన అంట్లు తోముతాది. కూలిపనికి పోతాది.
తిక్కయ్య శాపు లోన పని చెయ్యనీకె రేపటినుంచి బోతాండానని పెండ్లాము రామక్క తోని జెప్పినాడు శరబయ్య. “తిక్కయ్య బ్యారాలు (బేరాలు) ఎన్నని? నీకిచ్చేవి ఎన్నని? యాదయినా పద్దతి అనుకున్నారా?” అనడిగినాది రామక్క
“అడుక్కునేటోనికి అక్కుల్యాడుంటాయమ్మే! పొద్దునించి మాపటివరకు శాపు కాడ సూపెట్టుకోని ఉంటే మన కొచ్చినవి, ఇచ్చినవి జేసుకోవడమే. దాంట్లో సగము తిక్కయ్య కియ్యాల.”
“మల్లా అదేంది?
“ఆ యప్ప శాపును మనము వాడుకుంటాము గదమ్మే. అందుకు!”
“కాన్లే, యాది ప్రాప్తమో అదే దక్కుతాది మనకి.” అని ఏదాంతం జెప్పి లోనికి బోయినాది రామక్క.
కొడుకు మాదవ ఈదిలొంచి లోన కొచ్చినాడు. నాయినను జూసి పల్కరించకుండా లోనకు బోయినాడు. అమ్మ కాడికి బోయి ఏదో గుస గుస చెప్పినాడు.
ఇంతలో శరబయ్య తమ్ముడు సుంకన్న వచ్చినాడు. వచ్చి అన్న పక్కన గూసున్నాడు లోపట్నంచి రామక్క వచ్చి మరిదిని పలకరించినాది. మాదవ గూడ్క వచ్చి సిన్నాయనను జూసి నగినాడు.
“ఏ నాయినా, మరదలు, బిడ్డ బాగుండారా?” అని అడిగినాడు శరబయ్య.
“అంతా బాగుండాము అన్నయ్యా, నీకు తెలియని బాగు ఏముండాది?” అన్నాడు సుంకన్న.
కుంచేపుండి “అన్నయ్యా, ఎట్ట జెప్పాలో అర్థం గావడంలా..” అని తారట్లాడుతుంటే “సెప్పు నాయినా, దాందేముంది” అన్నాడు అన్న.
“ఈ బ్యాండు మ్యాలాలోండ్లు వచ్చినంక మన సన్నాయి మ్యాలానికి ఇలవ తగ్గిపాయ. నీ ఎంబడి వచ్చి డోలు వాయిస్తాంటి. కూలిపనులకు బోతాంటి. అవీ తగ్గిపాయ. ఎట్ట బతకాలో దిక్కు తోసడంల్యా అన్నా” అన్నాడు సుంకన్న. ఆ యప్ప గొంతులోన దుక్కం గరగరలాడినాది.
రామక్క కల్పించుకుని, “మీ యన్న పరిసతి గుడ్క అట్లనే ఉండి లేయ్యా! ఈదులంబడి దిరిగి పని చేసుకునే దినాలు రాను రాను తగ్గిపాయ. అందుకే తిక్కయ్య శాపులో సెరి సగం పద్దతి కింద పనికి గుదురుకున్నాడు. నేను ఇల్లు జరపడం కోసరము పాశిపనులు జెయ్యబడ్తి.” అనింది.
“మా మాదవ సరైనోడై ఉంటే యింత బాద ఉండేది కాదురా!” అన్నాడు అన్న. మాదవ నాయిన వైపు కొర కొర సూడబట్నాడు.
సుంకన్న అన్నాడు. “అన్నా, కాల్వబుగ్గ రామలింగేశ్వర సామి దేవస్తానం ఉండాదిగదా! నా బార్య తమ్ముడు చంద్రయ్య ఆడ సన్నాయి వాయిస్తాడు. వాండ్ల డోలు వాయిద్దకాడు మొన్న సచ్చిపొయినాడంట. నన్ను రమ్మని బిలుస్తాండాడు. పొద్దునా సాయింత్రం సామికి మేలు కొలుపు పవలింపులకు, కార్తీకమాసం, శివరాత్రి మాదిరి పండగలకు తిర్నాలలకు వాయించాలంట. వీరే సోట యాడ గూడ్క వాయించగూడ్దంట.
నెలకు నూట ఎనభైరూపాయల జీతము ఇస్తారంట. దేవుళంలో పెసాదం చిత్రాన్నం, పెరుగన్నం, పొంగలి లాంటివి చేస్తే సన్నాయి మేలగాల్లకు బాగముంటదంట్. కల్యాన కట్ట కాడ మాత్రం ఏరే మంగల్లు పని జేస్తారంట. ఊరిడిసి కాలవ బుగ్గకుపోదామను కుంటాండా! మంచిదే గదా!”
“శానా మంచిది నాయినా,” అన్నాడు శరబయ్య. “సీకుసింతా లేకుండా ఆయిగ నెలజీతం వస్తాదంటే అంత కంటే మంచిదేముంటాది. మరి అక్కడ ఉండనీకె..?”
“ఆడ పెద్ద ఊరేమీ లేదు, దేవస్తానం తప్ప. పక్కన సోమయాజుల పల్లెలో యాదన్న కొట్టిడో, గుడిసో బాడిక్కు దీసుకోని ఉండాల. నీ మరదలికి గుడ్క దేవళంలో కసువూడ్సే పని దొరకతాదంటుంటాడు మా సెంద్రయ్య!”
“అట్టగిన ఐతే శానా బాగుంటాది. నీ బిడ్డ యింకా సిన్నపిల్లే కాబట్టి పరవాల్యా”
కుంచేపు అందరూ గమ్మునుండారు. తర్వాత సుంకన్న సన్న గొంతుతో అన్నాడు.
“ఈ యిల్లు మనిద్దరి పేరు మింద ఉండాదిగదా! ఇంగ నేను ఈడ ఉండేదేమి లేదు. యింతవరకు నేను దీంట్లో బాగం అడగల్యా. నా మటుకు నేను నా కుటుంబంతో బాడిక్కు ఒక కొట్టడి దీసుకోని ఉంటి. కాలవబుగ్గకు బోయి నిలదొక్కుకునేవరకు నాకు దుడ్డు అవసరమయితాది. నీ మరదలికి దేవళంలో పని దొరక్కపోయినా, సోమయాజుల పల్లెలోనైన సిన్న బీడీ బంకు పెట్టిద్దాము ఆ యమ్మి తోని అన్న ఆలోశన కూడ ఉండాది. సోమయాజుల పల్లె నంద్యాల అయివే లోనే గద ఉంటాంది!
కాబట్టి ఈ యిల్లు అమ్మి నా భాగం నాకిచ్చినా సరే. లేదా నీవే పెట్టుకుని నా బాగానికి ఇలవ కట్టిచ్చినా సరే! ఇంక బొమ్మిరెడ్డిపల్లెకూ నాకూ రునం దీరిపోతుండాది. ఇట్లా నిన్నడగాల్సి వచ్చినందుకు నా పానం సిగ్గుతో చచ్చిపోతూండాది. నన్ను సెమించు అన్నా, నన్ను సెమించు వదినే” అని వలవల ఏడ్సబట్నాడు సుంకన్న.
రామక్క మాట పలుకు లేకుండా చూస్తాన్నాది. శరబయ్యకు యిసయం తలకాయకి యింకడానికి రెండు నిముసాలు పట్టింది.
“యిప్పటికిప్పుడు యిల్లమ్ముకోవాలంటే ఎట్టరా నాయినా, తిన్నా, తినకపోయినా నెత్తిమంద యింత గూడుందిగదా అని నిబ్బరంగుండె. అమ్మకుండా నీ బాగం నీకి య్యనీకె నాకంత స్తోమత యాడిది?”
మాదవ అన్నాడు. “నాయినా, సిన్నాయన చెప్పిన దాంట్లో నాయముండాది. ఇంతవరకు ఆ యప్ప, ఇంటిని మనకే వదిలేసినాడు. ఇప్పుడు బతకనీకె ఊరిడిసిపెట్టి పోతాండాడు. ఇప్పుడయినా ఏదో ఒక సెటిల్మెంటు చేసి పంపిస్తెనే ఇద్దరికీ బాగుంటాది’’
“రెండ్రూపాయలు సంపాచ్చలేవుగాని, సెటిల్మెంటు జేచ్చాడంట సెటిల్మెంటు!” అన్నాది రామక్క.
“నీవట్లా అంటావని నాకు దెలుసు లేమ్మా్! యింతవరకు నేనూ ఏమి పట్టించుకోని మాట నిజమే!, నాయిన, అమ్మ ఉండారులే, నాకేంది? అనే ధైర్యముతో తిరుగుతాంటి. ఇప్పుడు సిన్నాయన మాట యిన్నంక నాకూ ఒక ఆలోశన వచ్చినాది. శానా రోజుల్నించి ఉండాదిలే ఈ కయాస!” అన్నాడు మాదవ.
“వెల్దుర్తి ఈ మజ్జన బాగా పెరుగుతాండాది. నే నేస్తుడు చలమేశ్వర్ అని ఉంటాడు. వానిది గుంటుపల్లె. వాడు వెల్దుర్తిలోనే పోలీసు టేసను ఎదురుగ ఒక ఓటలు నడుపుతాండాడు. దాని పక్కన ఒక మలిగె కాలీ ఐందంట. వెల్దుర్తిలో చెప్పల శాపులు లేవంట. శెప్పులు గొనుక్కోవాలంటే డోనుకు గాని, కోడుమూరికి గాని బోవాల్సిందేనంట. ఆ మలిగె దీసుకోని శెప్పుల షాపు పెట్టుకుంటే బాగుంటాదని, నన్ను రమ్మని, వాడు గూడ్క తోడుగా ఉంటానని పిలుస్తాండాడు. మనం సగం బెట్టుకున్నా, సగం బ్యాంకోల్లు లోనిస్తారంట.”
“మన యిల్లు అమ్మితే వచ్చే డబ్బులు నాకిస్తే నేను ఆ మలిగె తీసుకుని శాపు పెట్టుకుంటా. నేను స్తిరపడింతవరకు నీవు, నాయిన, ఎట్లో తనకలాడండి. తర్వాత అందురుం వెల్దుర్తిలో ఉండొచ్చు. నా జీవితం బాగు పడనీకి ఇదీ మంచి అదును” అని ముగించినాడు
“ పిల్లడు జెప్పింది గూడ్క బాగానే ఉండ్ల్యా” అన్నాడు సుంకన్న.
శరబయ్య, రామక్క గుడ్క ఆలోశన చేసినారు.
“మన యిల్లు అమ్మితే ఎంత రావచ్చును?” అన్నాడు మాదవ.
“అంతా కలిసి మూడంకణాలకు తక్కువే. పాత మిద్దె. ఏమయినా స్తలానికే ఇలువ” అన్నాడు శరబయ్య.
“ఊరిడిసి పోయేటోల్ల యిండ్లు కొనుక్కోడానికి రుక్మాంగద రెడ్డి రడీగ ఉండాడు గద! మన వడ్లాయిన గుడ్క యిల్లు అమ్ముతాండాడంట. అది మన దాని కంటే కొంచెం పెద్దది. ఇరవై ఎనిమిదివేలకు శెట్టి కొనుక్కుంటానన్నాడంట. మన దానికి ఇరవై మూడున్నా వచ్చాది” అన్నాడు సుంకన్న.
“మనందరం బాగుపడనీకె దేవుడే ఈ ఆలోశన ఇచ్చినాడేమో? కానీ, ఎన్నాల్లు ఈ దేవులాట! మనమంటే ముసిలాల్లం. పిల్లలు నిలదొక్కుకోవాల గద!” అన్నాది రామక్క.
మాదవ మొగంలో ఒక ఎలుగు కనబడినాది! సుంకన్న అన్నకూ వదినెకూ కాల్లకు మొక్కి ఎలబార్నాడు. కాలం రెండు కుటుమానాలను తన వెంట తీసుకుబోతూన్నాది!
***
మాదిగ గేరిలో దావీదు పైటాల బువ్వదింటాన్నాడు. కొర్రబియ్యం ఉడికించిన గంజిలో ఉప్పుకల్లు, పచ్చి మిరపకాయ, ఉల్లిగడ్డ నంచుకుని తింటున్నాడు అనడం కంటె తాగతున్నాడనడము బాగుంటాది. పెండ్లాము మార్తమ్మ గుడ్క తన తల్లె (ప్లేటు) లో గంజి బోస్కోని తాగబట్నాది. వాండ్లిద్దరు గనమైన తిండి తిని శానా రోజులైనాది.
ఇద్దురూ బువ్వ తాగి ఇంటి బయట కూసున్నారు. మాదిగ గేరి కవతలనే మాల గేరి. మాల కృన్నదాసు దోవన బోతా వీండ్లను జూసి దాపు కొచ్చినాడు.
“ఏంది దావీదన్నా, శానా పురసత్తుగ గూసానుండారే నీవు మా వదినే” అని అడిగినాడు నగుతా.
“పురసత్తు గాక ఏముందిలే దాసూ, దమ్మిడీ ఆదాయం లేకపాయ, గడియ పురసత్తు లేకపాయ.. అని, ఇప్పుడే బువ్వ తాగినాము. పైటాల వరకు అనుకల రంగసామి జొన్న శేన్లో కలుపు తీయనీకె బోయి ఇప్పుడే వస్తిమి. ఎంతో బంగపోతే గాని ఆ యప్ప పనిచ్చినాడు గాదు. కూలి దుడ్డు గుడ్క అంతా యియ్యలేదు. జరగక ఆ యప్ప కాడ రెండు నూరులు అప్పు చేసింటిమి. ముక్కాలు బాగం కూలీ అప్పు లోకి శెల్లు ఏసుకున్నాడు” అన్నాడు దావీదు
“కుంటి సుబ్బాడ్డి కాడ జీతానికున్ననాల్లు నీకు యా యదారు లేకపోయె, శానా శాకిరి జేపిచ్చుకున్నా నిన్ను బాగానే జూసుకొనేటోడు సుబ్బాడ్డి” అన్నాడు దాసు.
“ఔ రా దాసూ! సేద్దాలు గిట్టుబాటు గాకపోతే ఆ యప్పేమి జేస్తాడు పాపం. శానామంది రైతుల మాదిరే ఆ యప్ప గుడ్క జీతగాల్లను మాన్పించినాడు. ట్రాకటరుకు బాడిగిచ్చి సేద్దం జేయించుకోవడం మొదులుబెట్నాడు. మానుబావుడు బట్టి, నా జీతం అవది ఇంకా మూడు నెల్లున్నా, నన్ను మానిపిస్తున్నందుకు ఎంత బాదపడినాడనుకున్నావు. ఆ మూడు నెల్లకు గుడ్క లెక్కగట్టి ఇచ్చేసినాడు. ఆ దుడ్డు తోనే బండి ఇగ్గుకొస్తాండాము నాయినా. యాదయనా కూలీ దొరికితే పోతాండాము. ఏదో నెత్తిమింద ఈ పాత మిద్దె ఉండాది గాబట్టి సరిపాయ.”
“ఒక్క పదేండ్లలో కాలం ఊరిని ఎట్టా మార్చేసినాదో చూస్తివా అన్నా! మీరే గాదు అందరి పరిసీతి అట్టే ఉండాది లే! మా మాలోల్లు గుడ్క శానామంది ఊరిడిసి పట్నాలెంట బతకనీకె బోయిరి” అన్నాడు దాసు
“మా రెడ్డెమ్మ గుడ్క శానా మంచిది దాసూ. తమాము తిట్టుకుంటనే ఉండేది నన్ను. యింటికి మాపటేల పోయేటయిమయినా యాదో ఒక పని కరిపిచ్చేది, అప్పుడు ఆ మా తల్లిని తిట్టుకొనేటోన్ని. పైటాలకు సద్ది గట్టిచ్చినాదంటే, కడుపార తినేటట్లు కట్టిచ్చేది. ఆ యమ్మ సల్లగుండాల” అన్నాడు దావీదు.
తాము మునుపు పనిచేసిన కామందులను తల్సుకొని జీతగాండ్లు మెచ్చుకుంటున్నారంటే ఆ కామందుల జన్మ దన్యము గదా! ఎవురో ఒకరో యిద్దరో తప్ప రైతులందరు జీతగాండ్లను ఇంటి మనుషుల మాదిరి జూసుకోనేటోల్లు!
“సరే అన్నా, పోయస్తమల్ల!” అని ఎలబారిపోయినాడు దాసు.
“మాయమ్మ మన కాడికి రాక మూడు నెల్లు గాల్యామ్మే” అని పెండ్లాన్నడిగినాడు దావీదు.
“నివ్వు రెడ్డి కాడ జీతం మానెయ్యక ముందొచ్చిపోయినాది మన మేరమ్మ. ‘మల్ల పెద్ద పరీచ్చలయ్యేంత వరకు రానమ్మా’ అని శెప్పేపోయినాది.”
ఇద్దురూ బిడ్డనుమతికి దెచ్చుకోని బాదపడినారు.
“ఇంతవరకు రెడ్డి కాడ కొలువుండె. ఏదో గవుర్మెంటు పున్నెమా అని దాని సదువు మనకు బారం గాల్యా. పన్నెండు దాటే దనుక బాగనే ఇగ్గుకొచ్చింది. కోడుమూర్లో పన్నెండు వరకే గద ఉండేది. మల్ల డిగ్రీలో జేరనీకె ఆదోనికి బాయె. ఇంకో సంవత్సరం సమచ్చరం బోతే అది గూడ్క అయిపోతాది. అప్పుడు యాదన్న గవుర్మెంటు ఉద్యోగం వస్తే దాని బతుకు అది బతుకుతాది. మంచి పిల్లన్ని జూసి మనువు జెయ్యాల. మన రెండు పొట్టలకు కూలో నాలో జేసుకుని తెచ్చుకునేది సాలదా ఏంది?” అన్నాడు దావీదు.
“అంతే మల్ల! దాని బతుకు సల్లగుంటే సాలు!” అనింది మార్తమ్మ.
బిడ్డ ఉజ్జోగం జేసినా, దాని సంపాదన మింద బతకగూడదనే పెద్ద బుద్ది వాండ్లది.
ఇంతలో పోస్టాయన ఒక కారటు దెచ్చి వాండ్లకిచ్చినాడు. “నాయిన్నాయిన! కుంచెం సదివి పెట్టు. నీకు పున్నెముంటాది” అని అడిగితే ఆ యప్ప కారటు సదివి, ‘మీ బిడ్డ పరీచ్చలు ఈ నెలాకరికి ఐపోతాయంట. ఎంటనీ ఎలబారి వస్తాన’ని రాసిందని చెప్పినాడు.
అమ్మా, నాయినీల ముకాలు పొద్దుతిరుగుడు పువ్వుల మాదిరి యింతయినాయి.
“నెలకరంటే ఇంకా ఎన్ని దినాలుందయ్యా” అని పోస్టాయనను అడిగినారు.
“అబ్బో! యింకా యాడ! ఇరవై దినాలుండ్ల్యా” అన్నాడా యప్ప.
“ఇంకా ఇరవై దినాలా!” అని ఎదారు బడినారిద్దరూ.
ఆ యిరవై రోజులూ ఆలూ మొగుడూ శానా కస్టపడినారు. దొరికిన కాడికల్లా కూలిపనికి బోయినారు. దావీదుకు గెతం కొట్టనీకె గుడ్క బాగా వచ్చును. నాలుగు రోజులు కొండారెడ్డి సేనులో దుక్కి దున్ననీకె బిలిసినాడు. ఆ యప్ప ఒక్కడే బొమ్మిరెడ్డి పల్లెలో ఇంకా గిత్తలు అమ్మకోకుండా ఉండేది. కొండారెడ్డికి గుడ్క సేద్దం కలిసి రావడం లేదు గాని, బోరు ఏసుకున్నంక ఎట్టో గుంజకొస్తున్నాడు. నాలుగు రోజులు దుక్కి న్నినందుకు నాలుగు ముపైలు నూటిరవై యిచ్చినాడు కొండారెడ్డి. ఆ నాల్రోజులూ పైటాలసద్ది కూడ కట్టిచ్చినారు.
బిడ్డకే లోటు రాకుండా చూసుకోవల్లని వాండ్ల ఆరాటము. ఐదు కేజీల వరి బియ్యము, కేజి కంది బ్యాడలు, కేజీ నూనె, ఉర్లగడ్డలు, ఉప్పమా నూక, గోదుమపిండీ అన్నీ తెచ్చి పెట్టుకున్నారు.
రేపే ఆ యమ్మవచ్చేది. ఆదోని నుండి ఎమ్మిగనూరు మిందుగా కోడుమూరికి వచ్చి, ఆడ ఉళిందకొండ బస్సెక్కాల. కర్నూలు మింద గూడ్క రావచ్చిగాని, శార్జి ఎక్కువైతాది. ఉళిందకొండ నుంచి వచ్చే బస్సు బొమ్మిరెడ్డిపల్లె కొచ్చిటాలకు పదిన్నరయితాది.
పొద్దున్నే పావు లీటరు పాలు, శేరు (200 గ్రా) శక్కెర, కాపీ పొడి తెచ్చి పెట్టుకున్నారు. పది నుంచీ బస్టాండు కాడబోయి గూసున్నారు. ఉల్లిగడ్డ లేసి ఉప్పమా చేసి, నంచుకొనీకె పుట్నాల పొడి చేసింది మార్తమ్మ. ఉప్పమా ఏడిగా ఉండనీకె, మూకుడు పొయ్యి మిందే బెట్టి, కట్టెలు తీసేసి, నిప్పులు కొన్ని ఆర్పకుండా ఉంచింది.
పది ముక్కాలుకు బస్సొచ్చింది. కొంతమంది దిగినంక మేరీ దిగింది. అమ్మనూ నాయిననూ చూసి శామంతి పువ్వు యిరిసినట్టు నవ్వింది. బిడ్డను కండ్ల నిండా చూసుకున్నారిద్దరూ. రెండు చేతుల్లో ఇద్దర్ని కరుసుకున్నాది. శామన శాయ ఐనా మంచి కళ గల పిల్ల మేరీ. ఆ యమ్మికి కండ్లే అందం. శానా పెద్ద కండ్లు.
“అంతా మాయమ్మ పోలిక” అంటాడు దావీదు.
లేత నీలం రంగు చీర కట్టుకున్నది. నలుపు రంగు జాకెట్టు తొడిగినాది. ఒక చేతికి గడియారం ఉండాది. ఒక చేతికి మట్టిగాజులు ఎర్రవి ఏసుకునుండాది. నుదుట్న ఎర్ర రంగు బొట్టు బిల్ల దోసగింజ మాదిరున్నది పెట్టుకున్నాది. ఆ యమ్మ జడ శానా పెద్దది. గోదుమీరంగు అవాయి చెప్పులు ఏసుకున్నాది. ఒక జిప్పు బ్యాగు చేతిలో మోస్తున్నాది.
“ఆ సంచి ఇట్లా ఇయ్యమ్మే” అన్నాడు దావీదు, బిడ్డ పక్క అభిమానంగ జూస్తూ. “వద్దు నాయినా, అంత బరువేమీ లేదులే” అనిందా పిల్ల.
దావంబడి శానామంది దావీదు బిడ్డనే జూడబట్నారు. మార్తమ్మ ‘పిల్లకు దిట్టి దగిలేట్టుంది. ఎవురిదో ఎందుకు నా దిట్టే తగులుతాదేమో!’ అనుకున్నాది.
ముగ్గురూ యింటి కాడికొచ్చినారు. బ్యాగు లోపల పెట్టింది మేరీ! దాంట్లోంచి ఒక చార్మినార్ సిగిరెట్టు పెట్టి, ఒక గళ్లు తువ్వాల, ఒక కద్దరు పంచ, ఒక బనియను తీసి నాయిన కిచ్చినాది. అమ్మకు ఒక నేత చీర, రవికె గుడ్డ, మంచివి రెండు టీ లోటాలు తీసిచ్చినది. “మా యమ్మే, మా తల్లే!” అంటూ సంబరంగ అవిట్ని జూసుకొని మురిసిపోయినారు తల్లీ తండ్రీ. బ్యాగులోంచి ఒక పరుసు దీసి దాంట్లోంచి నూర్రూపాయల కాయితాలు రెండు తీసి నాయిన కిచ్చినాది.
“నాయినా, మా కాలేజీలో ప్రతి సంవత్సరం అందరి కంటే ఎక్కువ మార్కులు దెచ్చుకొన్నవాళ్ళకు ఐదువందల రూపాయలు మెరిట్ స్కాలర్‌షిప్ యిస్తారు. పరీక్షల తర్వాత వచ్చే ‘కాలేజ్ డే’ రోజు ఇస్తారు. ఆదోనిలో టి.జి.ఎల్. ఇండస్ట్రీస్ అని ఉంది. ఆ కంపెనీ చాలా పెద్దది. వాండ్లే ఈ మెరిట్ స్కాలర్‌షిప్ ఇచ్చేది.” అని చెప్పింది. ఆ పిల్ల కండ్లల్లో ఆత్మవిశ్వాసం. చదువుకోవడం వల్ల ఆ యమ్మి మాట్లాడే భాష కూడ మారిపోయింది.
(ఇంకా ఉంది)