మహాప్రవాహం!-12

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పరీక్షలయి ఇంటికి వచ్చిన కూతురు మేరీతో కొన్ని రోజులు హాయిగా గడుపుతారు దావీదు, మార్తమ్మ. తండ్రి పనికి వెళ్ళకపోడాన్ని గమనించిన మేరీ అడిగితే, సేద్యం గిట్టుబాటు కాక సుబ్బారెడ్డి జీతగాళ్లని మాన్పించాడని అంటాడు.మరి డబ్బెలా అంటే, పని దొరికినప్పుడు కూలీకి వెళ్తున్నామని చెప్తాడు. మేరీ బాధ పడుతుంది. తను బి.ఇడి. పూర్తి చేసి రెండేళ్ళలో ఉద్యోగం తెచ్చుకుంటాననీ, తర్వాత అమ్మానాన్నలని తనతో తీసుకువెళ్తానని అంటుంది, నాల్రోజులు ఉండి వెళ్ళిపోతుంది మేరీ. పద్మనాభయ్య కాఫీ తాగి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. ఈ పదేళ్ళ కాలం ఆయన కుటుంబాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఇది వరకులా ముహూర్తాలకి, మంచి రోజులకీ ఎవరూ రావడం లేదు. ఇంతలో కొండారెడ్డి వచ్చి ఆయనకు నమస్కరిస్తాడు. వేరుశనగ పంట అమ్మితే వచ్చిన డబ్బులలో ఖర్చులకు పోను మిగతా సొమ్ము ఆయన చేతిలో పెడతాడు. తానిక ఆయన పొలంలో సేద్యం చేయలేనని, తనని క్షమించమని వేడుకుంటాడు. మరేం చేద్దామని స్వామి అడిగితే, గుత్తకు ఇచ్చేయమని సలహా చెప్తాడు. నువ్వే చూడు ఎవరైనా మంచివాళ్ళని అని ఆయనంటాడు. మరోసారి దండం పెట్టి వెళ్ళిపోతాడు కొండారెడ్డి. ఏమిటిలా చేశాడు కొండారెడ్డి అని మీనాక్షమ్మ బాధపడుతుంది. వాళ్ళిద్దరూ అనంతపురంలో డిగ్రీ మూడో సంవత్సర చదువుతున్న కొడుకు కేదారని తలచుకుంటారు. కేదారకి ఏదైనా ఉద్యోగం వస్తే, తమ జీవితాలు గట్టెక్కుతాయి అని అనుకుంటారు. అనంతపురంలో ఉండే తమ్ముడి వరసయ్యే పుండరీకాక్షయ్య షష్టిపూర్తి చేసుకుంటూ, అన్నా వదినలని ఆహ్వానిస్తాడు. కేదారని కూడా చూడొచ్చని దంపతులిద్దరూ బయల్దేరి వస్తారు. కేదార బస్ స్టాండుకు వచ్చి అమ్మానాన్నల్ని బాబాయి ఇంటికి తీసుకువెళ్తాడు. వేడుక పూర్తయ్యాక, ఓ రోజున ఇక ఆ పల్లెటూరులో ఉండవద్దనీ, అనంతపురం వచ్చేయమని గట్టిగా చెప్పి పద్మనాభయ్యని ఒప్పిస్తాడు పుండరీకాక్షయ్య. కొడుకు భవిష్యత్తు కోసం అంగీకరిస్తాడు స్వామి. ఇక చదవండి.]

[dropcap]ఖా[/dropcap]జాహుసేను పుల్లగుమ్మికి రామల్లకోటకు మధ్యని అరటితోట కాడ ఉండాడు. ఆ యప్ప పొద్దున రాగంబలి తాగి వచ్చినాడు. సద్ది తెచ్చుకోల్యా. కడుపులోన సరసర కాలిపోతాండాది. అరటి తోటాయన రాంబూపాల రెడ్డి “పైటాల బువ్వ దిని వస్తా, వచ్చినంక గ్యెలలు కొట్టిపిచ్చిస్తా అజరత్!” అని చెప్పి పోయినోడు మూడయితున్నా ఇంకా రాల్యా.

తాను గుడ్క ఏమన్న తింటేగాని పానం నిలబడేట్టు లేదు తియ్ అని ఖాజాహుసేను సైకిలెక్కినాడు. అది గూడ్క, ఆ యప్ప మాదిరే ముసిలిదైపోయింది. సుమారు పద్ముడేండ్ల నుంచి దాని తొక్కుతూనే ఉండాడు.

ఏడెనిమిదేండ్ల కిందటి మాదిరి పైలోన శగితి లేదు. ఇప్పుడు ముందుగాల ఎనకాల అరటిగ్యెలలు కట్టుకోని తొక్కలేక పోతాంతాడు. వెల్దుర్తి వరకు యాదయిన ఎద్దుల బండో ట్రాకటరో దొరికితే వాండ్లను బంగపోయి గ్యెలలు ఏసుకోని వస్తాడు. మల్లా వెల్దుర్తి నుంచి బొమ్మిరెడ్డి పల్లెకు ఒక పయానముండాది గద.

అన్ని దరలు మీడ మ్మాలంగ బెరిగినాయి. పదేండ్ల కిందట ఏడెనిమిది రూపాయలున్న అరటి గ్యెల ఇయ్యాల ముపై రూపాయలు పైనే పలుకుతుండాది. రైతులకు గుడ్క కరెంటు చార్జీలు, ఎరువులు, కూలీల కర్చులు పెరిగి ఎకరం తోటకు నూర్లు నూర్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తాండాది.

రామల్లకోట దాటినంక రెండు మైల్లకు నరసాపురం మెట్ట అని ఒక బస్టాండుండాది. దాన్ని కుండల నర్సాపురం అని గుడ్క అంటారు. ఎందుకంటే ఆ వూరంతా కుమ్మరోల్లే, కుండలు, దాకలు, మూకుల్లు దాకలు, బానలు, పొయ్యిలు, సమస్తము జేసేటోల్లు ఆ వూర్లోన ఉండారు. సుట్టుపక్కల ప్రతి ఊర్లోన ఒక్కరోజు సంత జరుగుతాది. కుండలన్నీ బండి జల్ల మంద ఇంతెత్తున పేరుకోని, పడిపోకుండ తాల్లు కట్టుకోని సంతలకు బోయి అవిట్ని అమ్ముకోని వస్తారు కుమ్మరోల్లు.

ఈ మజ్జన పల్లెల్లో గూడ్క మట్టిపాత్రలు వాడుక బాగా తగ్గించినారు జనము. ఆ మాత్రం ఉన్నాల్లు టిలు పాత్రలు, లేనోలు గూడ్క సిలవరి పాత్రలు వాడబట్నారు.

రెండుమూడేండ్లాయె పిలేస్టుకు చెంబులు, బక్కెట్లు, బిందెలు వస్తోండాయి. అవి శాన అల్కాగ (తేలిక) ఉంటాయి మోయనికె. శ్యానా సులుబము. అవిటివల్ల గుడ్క కుమ్మరోల్ల బతుకుతెరువు ఆగమయినాది. కుండలు చేసే మన్ను మునుపు ఊరికే దొరికేది. ఇప్పుడల్లా కాదు. గవుర్మెంటు మన్ను దిబ్బలను గూడ్క ప్రతియేడు యాలం ఏస్తాది. దాన్ని పాడుకొన్నోల్ల దగ్గరికి బోయి కుమ్మరోల్లు బండికి ఇంతని ల్యాకపోతే ట్రాకటరు తొట్టెకింతని కొనుక్కోవల్ల. దాంతో బాటు కుండలు కుమ్ములో కాల్చనీకె పిడకలు గావాల. అవిటికి కావాల్సిన పసరాల మ్యాతను గుడ్క కొనుక్కోవాల. అందుకే ఏడెనిమిదేండ్ల కిందట మూడు నాలుగు రూపాయలకు దొరుకతాండే పెద్దశాకలి బాన ఇయ్యాల నలభై రూపాయలగ్గాని రాదు.

ఖాజాహుసేను సైకిలు తొక్కుకుంట నర్యాపురం మెట్ట కాడికి చేరుకున్నాడు. ఆడ రోడ్డు రెండుగా శీలతాది. నేరుగ బోయేది రామల్లకోటకు, పుల్లగుమ్మి, కపిగొట్లు, నన్నూరు ఎందుగా కర్నూలు బోతాది. కుడిపక్కకు మల్లితే నర్సాపురం మీదుగా బేతంచెర్లకు బోతాది. రెండూ కచ్చా రోడ్లే. తార్రోడ్డు ఏస్తామని ఏండ్ల కాడి నుంచి సెప్తాండారు గానీ ఏసినోల్లెవలు?

మెట్టకాడ శిన్న కొట్టం ఓటలుండాది. దాన్లోన టిపను, కాపీ, టీ లు దొరకతాయి. కొట్టం ముందు అరుగు మింద బీడీలు, సిగిరెట్లు, వక్కపొడి పొట్లాలు, సొంగలు (గోల్డఫింగర్స్), బిసికేటు పొట్లాలు, బన్నులు అమ్మ అంగడి గుడ్క ఉండాది. అటేపు పుల్లగుమ్మి వరకు, ఇటీపు రామల్లకోట వరకు ఇదే ఓటలు.

బయట అవుత్‌కాన (నీళ్లతొట్టి) కాడ కాలుసీతులు ముకం కడుక్కున్నాడు ఖాజాహుసేను. భుజం మీదున్న ఎర్ర తువ్వాల తోన తుడుసుకున్నంక ఆ యప్ప పానానికి ఆయిగా అనిపించినాది. కొట్టం లోపలికి బాయి, చేతంచెర్ల నాప బండలతో ఏసిన చిన్న అరుగుల మింద ఒక సోట గూసున్నాడు.

ఓటలాయన ఇరూపాచ్చయ్య (విరూపాక్ష) వచ్చి, నోరంతా తెరించి నగుతా, “ఏం సాయిబూ, ఈ మధ్య రావడం ల్యా?” అనడిగినాడు. ఆ యప్పది బుక్కాపురం. జంగమోల్లు. శంకం ఊదుకుంట జంగమదేవర ఏసం ఏసుకొని ఊరూర తిరిగేటోల్లు. దాంతో జరుగుబాటు కావడంల్యా అని ఈడ ఓటలు పెట్టుకున్నాడు. ఆయన పెండ్లాము శాంతమ్మ. ఓటల్లో ఇద్దరూ పని చేసుకుంటారు. “పోయిన వారమేగదా వచ్చిపోతి!” అన్నాడు ఖాజ. “అక్కా, ఒక గలాసు మంచి నీల్లియ్యమ్మే!” అన్నాడు.

శాంతమ్మ ఆ యప్పకు సత్తు గలాసుతో నీల్లు దెచ్చిచ్చినది. “బాగుండావా ఉసేనూ?” అని ఇశారిచ్చినాది.

“తిననీకె ఏముండాది సామీ?” అనడిగినాడు.

“ఉగ్గాని బజ్జీ ఉండాది, పొద్దున వేసిన పూరీ గుడ్క ఉండాది. ఇంకొంచేపు తాలితే దోసె ఏస్తాము” అన్నాడు ఇరూపాచ్చ.

“పూరీ పిలేటు యియ్యి మల్ల”

ఓటలాయన సత్తు ప్లేటు మింద ఇస్తరాకు సింపి (ముక్క) ఏసి రెండు పూరీలు, బొంబాయి చట్ని ఏసుకొని వచ్చినాడు.

“ఏమనుకోగాకు, ఈ రెండే ఉండాయి” అన్నాడు.

ఖాజా ఉసేను తినబట్నాడు. “పొద్దున తీసిన వంటివి. అయినా మెత్తగా బాగుండాయి సామి పూరీలు!” అని మెచ్చుకున్నాడు

“మేం కర్నూలు, డోను ఆ మాదిరి మైదాపిండి కలపము సాయిబూ, గోదుమలు దెచ్చుకోని గిర్ని అడిచ్చుకుంటాం. రేపు తిన్నా బాగుంటాయి మా కాడ! వచ్చినోల్లకు మర్సటి రోజు పెట్టంలేగాని, మిగిలితే మేం తింటాం ఎప్పుడన్న!” అన్నాడు ఇరూపాచ్చ.

“దీనమ్మ పాడు పొట్ట! సరిపోల్యా!” అన్నాడు ఉసేను.

“ఉగ్గాని బజ్జీ తిను! సరిపోతాది!”

లోపల్నుంచి శాంతమ్మ అరిసినాది. “తురకాయప్పను కుంచేపుండమను. పెనం కాలుతాండాది. దోసె బోచ్చా”

“అయితే ఏడిగ దోసె దిందువులేప్పా” అని లోపలికి బోయినాడు. ఐదు నిమిసాల తర్వాత సుయ్యిమని దోసె పెనం మింద బోసిన సప్పుడు ఇనపడినాది. కుంచేపటికి తట్టలో రెండు దోసెలు పెట్టుకొని వచ్చినాడు.

ఖాఖ్రా దోసెను తుంచుకోబోయి, “దీనమ్మ! కాల్తాంది!” అని ఏలును ఉఫ్ ఉఫ్ మని ఊదుకున్నాడు. రెండు తుంటలు దిని “ఏంది సామీ? ఇది ఉద్ది దోసె గాదా ఏంది?” అనడిగినాడు.

“ఉద్దిపింది (మినపపిండి) రీతికి రుబ్బుకొని పెట్టుకుంటాము. అది పొద్దున్న దోసెలు పోస్తాము. పుట్నాల శట్ని గుడ్క చేస్తాము. సాయంత్రం నాలుగు నుంచి ఈ దోసెలే. వరిపిండి, శనగపిండి, మైదాపిండి, కొంచెం బొంబాయి నూక, పుల్ల మజ్జిగ కలిపి, పోస్తాము, పిండిలోనే కారము, ఉప్పు, జీలకర్ర, ఉల్లిగడ్డలు సన్నగా కోసిఏస్తాము. దీనికి శట్నీ ఉండదు సాయిబూ!”

“ఇవి గుడ్క శానా బాగుండాయిలే సామీ! శానా ఆకలయితుండె. ఇయ్యాల సద్ది దెచ్చుకోల్యా.”

“అయ్యో, ముందైన చెప్పకపోతివి. బోజనం ల్యాకుండ పనెట్టా జేస్తామప్పా. మద్యాన్నం మేము జేసుకొన్న అన్నం, శిలుకముక్కాకు పప్పు ఉండెనే. అయ్యో, పోనీ రెండు పిడచలు తింటావా సాయిబూ” అన్నాడు ఇరూపాచ్చ.

“ఆ మాటంటివి అంతే సాలు సామి! కడుపు నిండిపోయినాది నీ పున్నెమాని”

“నేనేమి ఊరికే పెడుతుంటినా ఏమప్పా. పాడు కాలాలు కారబోకీ తినే తిండిని అమ్ముకుంటామని యానాడయిన అనుకుంటిమా? సరే లే కాపీ నా, టీ తాగాతావా?”

“టీనే యియ్యి సామి!”

టీ తాగి ఓటలాయినకు ఆయన పెండ్లానికి డబ్బులిచ్చి, పోయొస్తానని చెప్పి బయటకు వచ్చినాడు ఖాజా. పుల్లగుమ్మి పక్కనుంచి కాలీదీ కుండల బండి వచ్చి ఓటలు ముందు నిలబడినాది. నొగలమీంచి కిందికి దూకినాడు కుమ్మరాయన.

“ఏం సాయిబూ రాంభూపాలరెడ్డి తోట కొచ్చింటివా?” అనడిగినాడు.

“ఔ అంజనప్పా, కుండ లేసుకుని ఏ సంతకు పోయింటివి?”

“లొద్దిపల్లె సంతకు బోయింటి లే”

“కుండలన్నీ అమ్ముడుపోయి నట్టుండాయే?”

“శెప్పుకుంటే సిగ్గుబోతాది ఖాజా! మిగిలినవి ఎనక్కు తీసుకురాల్యాక దర తగ్గించి అమ్ముకోవాల్సొచ్చె. తూ, దీనమ్మ యాపారం!” అన్నాడు అంజనప్ప.

“ఇంగ ఊరికేనా?”

“ల్యా. వెల్దుర్తికి బోవాల. ఆడ మా ఊరి సర్వోత్తమ రెడ్డివి పాస్పేటు సంచులుండాయంట. ఏస్కురమ్మని చెప్పినాడాయప్ప, త్యానంటే గమ్మునుంటారా రెడ్లు?”

ఖాజా హుసేను ముకం ఇచుకున్నాది. “అయితే కుమ్మరాయనా నావి భూపాలరెడ్డి తోట కాడ ఇరవై గ్యెలలు అయితాయి. తీస్కపోదామా, నీకు పున్నిముంటాది!”

“పున్నమేముందిలే సాయిౠ, బండి కాలీ గానే ఉండాది గద! నేను ఇరుపాచ్చ కాడ యాదయినా తిని, టీ తాగి తోట కాడికి వస్తాపా. నీవు బోయి గ్యెలలు దింపించుకుంటూండు”

“నెత్తిన పాలు బోస్తివప్పా” అని సైకిలెక్కి తోట కాడికి బోయినాడు ఖాజా. రాంబూపాలరెడ్డి అప్పటికి వచ్చి ఉన్నాడు. రెడ్డికి సలాం చేసినాడు.

“ఏంరా సాయిబూ …. నిండినాదా రా? కొంప ములిగినట్టు అప్పుడే యాడికి బోయినావు?” అన్నాడు రెడ్డి. ఎమ్మెల్నే అంచు పంచి, తెల్లని ఖద్దరు అంగీ ఏసుకొని, కండ్లకు నల్ల కండ్లదాలు పెట్టుకున్నాడు. కాల్లకు నల్లని బాటా చెప్పులు మెరుస్తాండాయి. మెల్లో పులిగోరు గొలుసు, చేతికి గోల్డు చెయినున్న గడియారం.

“రెడ్డీ, సద్ది తెచ్చుకోల్యా, టిపనన్నా జేస్తామని నర్సాపురం మెట్ట కాడికి బోయినా!” అన్నాడు వినయంగా ఖాజా.

“ఓర్నీపాసుగూల, సెప్పింటే నాతో బాటు ఇంటికి దీస్కపోయేవాన్ని గదరా. ఇంత తిని వస్తుంటిమి ఇద్దరం!”

“అంత మాటన్నావు అంతే సాలు నాయినా!” అన్నాడు ఖాజా.

“నీవి గ్యెలలు దింపుతాండారు. కుమ్ముకు సరిపోయేవి పజ్జెనిమిది అయితాయి. ఎట్లా తీసుకుపోతావు మల్ల!”

కుమ్మరాయన అంజనప్ప వెల్దుర్తికి బోతండాడనీ, తీస్కబోతా లెమ్మన్నాడనీ చెప్పినాడు.

“శాసా ఏండ్లనుంచి నీకు నా కాడ వర్తనుండింది గాబట్టి ఇస్తాండా తురకాయనా! మొత్తం గ్యెలలన్నీ దింపి మా ట్రాకటరు లోనే కర్నూలు అన్వర్ మండీకి తోల్తన్నాము. మాకదే మంచిది. మీ చిల్లర బేరగాండ్లు గ్యెలలు దీస్కపోతారు. దర తగ్గించమంటారు. డబ్బులు మల్లా ఇస్తామంటారు. ఇదంతా అగత్యముందారా మాకు?” అని ఇసుక్కున్నాడు రెడ్డి. ఖాజా కంటె పెద్దోడయినా పోసన వలన, మంచి దిట్టంగా ఉండాడు.

“మీలాంటోల్లు దయ జూపకపోతే ఎట్టా నాయినా మాలాంటోల్లు బతికేది? కర్నూలుకు బోయి తెచ్చుకొనేది మాతోన అయితాదా? నీకు అల్లా సల్లగా సూస్తాడులే రెడ్డి!” అన్నాడు ఖాజా. రెడ్డి చెప్పిన ప్రతి మాటా నిజమని తెలుసు ఆ యప్పకు. కేవలం తమ లాంటోల్ల పొట్ట కొట్టగూడ్దనీ కొన్ని గ్యెలలు ఇస్తాడు. ‘మాట కరుకే గాని రాంబూపాల రెడ్డిది మనుసు మంచిది’ అనుకున్నాడు. ‘ల్యాకపోతే, మా యింటికి అన్నానికి నాతో బాటు వచ్చిండాల్సింద’ని ఎందుకంటాడు?

జీతగాండ్లతో బాటు అరటి గ్యెలలు తోట బయట గెనం మీదికి మోసుకున్నాడు ఖాజా. ఈలోపల అంజనప్ప గుడ్క వచ్చినాడు. “నాయినా, మూడు నూర్లుండాయి నా కాడ. మిగతా రెండు నూర్ల నలభై ఈసారి వచ్చినప్పుడిస్తా. దయ సూడు” అని మూడు నూరు కాయితాలు రెడ్డి సేతిలో బెట్నాడు.

“యానాడు నాకు మొత్తం దుడ్డు చూప్తా జేసినావు గనక! కానీ పో! యింక శానా దినాలు నీకు గ్యెలలు ఇయ్యనీకె గుడ్క కుదిరేట్టు లేదు. అన్వర్ బయ్య, రెండు మూడు తూర్లకు గలిపి ఒకేసారి గ్యెలలు దింపితే. లారీ బంపిచ్చానంటాడాడు. ఆ పని మందే ఉండాము. సరేలే పోయిరా!” అని తన మోటారుసైకిలెక్కి ఎల్లి పోయినాడు రాంబూపాల రెడ్డి.

ఖాజా హుసేను గుండె గుబేలుమన్నాది! అదే జరిగితే తన కత ఏమైతాది అనుకుంటూ నిలబడి పోయినాడు.

“య్యెవ్ తురకాయనా, ఎప్పుడో జరిగే దానికి ఇప్పటినుంచి ఎదారు బెట్టుకుంటే ఎట్లా? గ్యెలలు ఎక్కించు బండ్లోకి. ఎలబార్దాము!’’ అని అంజనప్ప అరిచినాడు

గ్యెలలన్నీ బండి లోన సర్దేసారు. జీతగాండ్లకు వక్కాకు డబ్బులు యిచ్చినాడు ఖాజా. సైకిలు స్టాండు తీస్తుంటే కుమ్మరాయన అన్నాడు – “ఇప్పుడా సైకిలేం తొక్కుతావు గాని, గ్యెలల మంద ఒక గోనె పట్ట ఏసి, దాని మింద పెట్టు దాన్ని. నీవు గుడ్క ముందుకొచ్చి నా దగ్గర కూర్చో. స్తలముండాది.”

అంజనప్ప పక్క కండ్ల నిండా ఎంతో ‘ఇది’ ని నింపుకొని చూసినాడు ఖాజా. ఎద్దుల బండి వెల్దుర్తి వైపు బయలుదేరింది.

వెల్దుర్తిలో గ్వెలలను దింపుకున్నాడు. “అంజనప్పా, ఎంతియ్యమంటావు?” అనడిగినాడు.

“ఎంతో రోంత యియ్యి సాయిబూ, దీంతోనే బతుకుతుండామా ఏంది?” అన్నాడా యప్ప.

ఇరవై రూపాయలు తీసి అంజనప్ప చేతిలో బెట్నాడు ఖాజా. “నీవు జేసిం దానికి ఎక్కువే యియ్యాలగాని..” అంటూ నట్టుతూంటే

“సాల్లేప్పా, పెతిదానికే యిట్లా ఇదయిపోతా ఉంటే ఎట్టా బతుకుతావు సాయిబూ!” అని, డబ్బులు తీసుకోని ఎలబార్నాడు కుమ్మరాయన. అప్పటికి చీకటి బడినది. బొమ్మరెడ్డిపల్లె పక్క యవయినా బండ్లు గాని, ట్రాక్టర్లు గాని పోతాండేయోమోనని కుంచేపు చూసినాడు. ఆకరికి ఒక బండి దొరికినాది. అది అలుగుండుకు బోతుంది. దాంట్లో తాటి మానును రీపర్లు కోసి ఏసుకోని బోతాండాడు ఒకాయన.

ఖాజా ఆ బండి నిలబెట్టి, “ఈ అరటి గ్యెలలు బొమ్మిరెడ్డి పల్లెకి దీస్కపోవాలి” అని అడిగినాడు. అందరు అంజనప్ప మాదిరి మంచి మనుసులు ఉంటే, ఈ పెపంచం ఇట్లా ఎట్టుంటాది. ఆ యప్ప నలభై రూపాయలడిగినాడు. కొంచెం తగ్గించమని బంగ పోయినా కరునించలేదు.

‘దయ్యం బట్టినపుడే సెప్పుతోన గొట్టనీకె కుదురాతాది’ అనుకునే రకము ఆ యప్ప.

“సరేన్నా ఇస్తాగాని, వంకగడ్డన నాడి కుమ్ముకొట్టిది ఉంది. ఆడ దింపిపో. నీకు పున్యముంటాది” అని అడిగితే ఒప్పుకున్నాడు.

కొట్టిడి కాడ గ్యెలల్ను దించి లోపలబెట్టి ఆ యప్ప ఇల్లు చేరుకునేటప్పటికి మునిమాపు యాలయితూంది. ఫాతింబీ ఆ యప్ప ఇంకా రాలేదేమని ఇంటి ముందే నిలబడి చూస్తాంది.

“ఏంది యింత దేర్ అయినాది?” అనడిగింది. ఆ యమ్మ మొగంలో శింత దీరింది మొగున్ని చూసి.

“రెడ్డి బోయనానికి బాయ. నేను గుడ్క నర్సాపురం మెట్ట కాడ టిపిను జేసి, ఒక కుమ్మరాయని బండ్లో, గ్యెలలెక్కిచ్చుకోని, మల్లా వెల్దుర్తిలో ఇంక బండి దొరికేటాలకు ఈ యాలయినాది” అన్నాడు.

“పా, బెరీన కాలుసేతులు కడుక్కోని రా, బువ్వ తిందాము” అన్నాదాయమ్మ

ఇద్దరూ వారపాగులోన కూచున్నారు. ఫాతింబీ మొగుని తల్లెలో వరన్నం బెట్టింది. సిలవరి దాక లోంచి శాపల పులుసు దాని మింద బోసింది. “ఇయ్యాల బడేమియా బయ్యా శాపలు పంపించినాడు. వాండ్ల బేటా మస్తాను తెచ్చినాడంట. నీ కిష్టమని చేసినా, తిను. మజ్జానం గూడ్క భోజనం లేదియ్యాల” అనింది.

తాను గుడ్క తన తల్లెలో అన్నం పెట్టుకోని, పులుసు పోసుకున్నాది.

“ఏందియ్యాల వరిబియ్యం చేసినావు?” అన్నాడు. మొగుని మొగంలో రోస్ని ఏ మాత్రం ల్యాకపోవడం ఆ యమ్మకు బాద కలిగించింది. శాపల పులుసు జూసి శానా సంతోసపడి తింటాడనుకుంటే, గమ్మునుండాడు!

“నీకు యాది లేదా! ఇయ్యాల మన నిక్కా జరిగిన దినం. సరిగ్గా రంజాను పండక్కు వారం దినాల మందల. ఈయాల పనికి పోగాకు అని చెబ్దామనుకుంటి. మల్లా ఏమన్నా అంటావేమోనని గమ్మునుంటి.”

తమ పెండ్లి రోజును తల్సుకొని ఫాతింబీ ముకం ఇచ్చుకున్నాది. ఖాజా ముకం గుడ్క మబ్బు తీసిన చందమామ మాధిరి అయినాది. బార్య చెయిు పట్టుకొని, “బీస్ సాల్ గడిసిపాయ అప్పుడే!” అన్నాడు. ఆ యమ్మ మొగుని దగ్గరగా జరిగినాది. బీబీ ముకం అంతా తడిమినాడు.

“నిన్ను యానాడు సుకపెట్టలేకపోతి” అన్నాడు.

“నాకేం తక్కువయినాది? దౌలత్ కంటె ప్యార్ ముక్యం. నీ దిల్ నాకు తెలుసు” అన్నాది బూబమ్మ. ఆ యమ్మ మొగంలో శరమ్!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here