మహాప్రవాహం!-15

0
1

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొండారెడ్డి తన సేనులో మిరపతోటకి నీళ్ళు పెడుతుంటే కరెంట్ పోతుంది. పొద్దున్నుంచీ కరెంటు లేదని సాయంత్రం వచ్చి నీళ్ఫు పెడతాడు. మిరపతోట అరెకరమే తడుస్తుంది. చీకటిపడేలోపు మిరపతోట నానితే, మర్నాడు టమేటా తోట తడుపుకోవచ్చు అనుకుంటాడు. కానీ కరెంటు పోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు. బోరు దగ్గర మోటర్ కోసం వేసిన షెడ్డుకోకి వెళ్ళి చూస్తే, చెక్క మీద అమర్చిన స్టార్టర్, మూడు ఫ్యూజులు ఉన్న చోటు పెట్టిన మూడు ఇరవైఐదు క్యాండిల్ బల్బులను చూస్తాడు. ఆ మూడు వెలిగితేనే మోటరు నడపాలి. ఏ ఒక్క బల్బ్ వెలగకపోయినా, మోటర్ ఆపేయాలి. లేపోతే మోటర్ పాడయిపోతుంది. కాసేపు నడుం వాలుస్తాడు కొండారెడ్డి. కరెంటు వస్తే బాగుండనుకుంటాడు. పొద్దు నీరెండకి తిరుగుతుంది. డోన్ నుంచి కర్నూలు పోయే లోకల్ రైలు వెళ్తూంటే దాన్ని కాసేపు చూస్తాడు. తర్వాత సూర్యుడిని చూస్తాడు. ఇంకొత సేపు చూసి, ఇక కరెంటు రాదనుకుని, ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే అప్పుడు కరెంట్ వస్తుంది. ఇప్పుడొచ్చి ఏం లాభం అనుకుంటాడు. మర్నాడు యల్లసామిని తోడు తెచ్చుకుని రాత్రి టార్చ్ లైటు వెలుగులోనైనా పంటలకి నీళ్లు పెట్టాలని నిశ్చయించుకుంటాడు. ఇంటికి చేరేసరికి వీధుల్లో దీపాలు వెలుగుతాయి. కాళ్ళూ చేతులూ కడుక్కుని లోపలికి వెళ్తాడు. భర్తకి టీ చేసి ఇస్తుంది నాగరత్నమ్మ. టీ తాగి బయటికొచ్చి యల్లసామిని కలిసి మర్నాడు తన పొలంలో నీళ్ళు పెట్టడానికి వస్తావా అని అడిగితే వస్తానంటాడతను. ఎనిమిది గంటలకి ఇల్లు చేరుతాడు కొండారెడ్డి. కూతురు సుజాత డోనులో బంధువుల ఇంట్లో ఉండి ఇంటర్ రెండో సంవత్సరం చదువూతూంటుంది. పెద్ద కొడుకు లింగారెడ్డికి చదువు మీద పెద్ద ఇష్టం లేదు. టెన్త్ పాసవుతాడో లేదోనని కొండారెడ్డికి సందేహం. చిన్న కొడుకు కంబిరెడ్డి మాత్రం బాగా చదువుతాడు. కొడుకులిద్దరూ ట్యూషన్ నుంచి వచ్చాక, తిందామని ఆగుతారు భార్యాభర్తలు. తనకి పది రూపాయలు కావాలని కంపాస్ బాక్స్ కొనుక్కోవాలని చెప్తాడు కంబిరెడ్డి. కాసేపు వాడిని ఉడికించి, ఇస్తానులే అంటాడు తండ్రి. అందరూ అన్నాలు తింటారు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]ర్సటి దినం గుడ్క కరంటు సతాయించినాది. పోవడం, రావడం. నీల్లు మెయిను కాలవ ఎంబడి పారీపారగానే కరంటు బోతున్నాది. మొత్తానికి సాయంత్రానికి మిరపతోట తడిసినాది. ఇంక అర్దెకరా టమేట తోట నిలబడిపోయినాది.

ఇంటికి బోయి అన్నం తిని, ఎల్లసామిని దీసుకోని మల్లా సేను కాడికొచ్చినాడు కొండారెడ్డి. నాలుగు బ్యాటరీలు పట్టే ‘ఎవరెడి’ టార్చిలెటు తెచ్చుకున్నారు. రాత్రి పదిగంటలకు మోటరేసినారు. కొండారెడ్డి టార్చి ఎలుగు సూపిస్తాంటే ఎల్లసామి మడవలు తిప్పుతాండాడు సలికె తోని.

పదకొండుకు బెంగులూరు నుంచి సికిందరాబాదుకు బొయ్యే ఎక్స్‌ప్రెస్సు రైలు శానా స్పీడుగ ఎల్లిపోయినాది. అది డోనిడిస్తే కర్నూలు దాంక నిలబడదు. మల్లోకి నీల్లిడిసి ఇద్దరూ రైలును చూస్తూ నిలబడినారు. లోకలు కంటే అది శానా పొడుగున్నాది. రేత్తిరి సీకట్లో ప్రతి పెట్టెలో లైట్లేసుకోని అది పోతాంటే దీపాల తోరణం మాదిరున్నాది.

“రైలు బండికున్న కతే ఏరు గద మామా!” అన్నాడు యల్లసామి. “యాడ బెంగులూరు యాడ అయిదరాబాదు? ఒక పొగులు ఒక రాత్రి పెయనము! మామా! దీనికి శార్జి గుడ్క శానా ఎక్కువంట గద!”

“అవునంటరా. ఎంతయితే మన కెందుకు? మనమేమన్నా దాంట్లో ఎక్కుతామా సస్తామా?” అన్నాడు కొండారెడ్డి.

యల్లసామి నగినాడు. “నిజమే మామా!” అన్నాడు.

మల్లా కాలవ నీల్లు రావడం నిలబడి పోయింది.

“మామా! కరెంటు మల్ల బోయింది.”

“ఇయ్యాల తెల్లవార్లు ఈడే ఉండి ఈ టమేట తోట తడిపితేగాని ఇంటికి బొయ్యేది లేదు రోయ్” అన్నాడు కొండరెడ్డి.

అర్ధరాత్రి దాటినంక మల్లా కరెంటు వచ్చింది. కాచిగూడ నుంచి తిరుపతికి బోయ్యే ఎంకటాద్రి బండి ఎల్లి పోయినాది. సిగ్గనలు పడలేదేమో పది నిమిశాలు నిలబడినాది. మలుపు కాడ పెనుబాము మెలిక దిరిగినట్టు కనపడినాది.

“ఏంది ఇట్ట నిలబడి పోయినాది?” అన్నాడు యల్లసామి.

“యాదన్నా గుడీసు (గూడ్స్) బండి క్రాసింగు ఉండాదేమో” అన్నాడు రెడ్డి.

కుంచీపటికి కూతేసి కదిలినాది ఎంకటాద్రి. అది మలుపు తిరిగి గరెండాలు బిర్జి మీద పోతుంటే పెద్ద కొండ శిలువ మాదిరి ఉండాది.

మొత్తానికి రెండు గంటల కంతా టమేట సేను తడిసినాది. శెడ్డుకు బీగం ఏసుకోని ఇద్దరూ ఇండ్లకు ఎలబార్నారు.

“మామా! ఈ బోర్లు వచ్చేంత వరకు ఆకాశం పక్క, వాన పడతాదా లేదా అని సూచ్చాంటిమి. ఇప్పుడేమో శానా సులువయినాదనుకుంటే, దీనెమ్మ ఈ కరంటు సతాయించబట్నాది. ఇదెప్పుడు బోతాదో తెలియదు, ఎప్పుడొస్తాదో తెలియదు. దీని కోసరం సూడనీకెనే సరిపోతుండ్ల్యా” అన్నాడు యల్లసామి.

కొండారెడ్డి అన్నాడు – “ఒరేయ్ ఒకటి సెప్తా యిను. ఏ కాలానికున్న కష్టాలు ఆ కాలానికుంటాయి. వానలు మీద ఆధారపడకుండా పంటలు పండిచ్చుకుంటుండాం కాని కరంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు, ఇవన్నీ తప్పదు గదా! ‘ఎంత కంతే ఎంకటలచ్మి’ అనీ!”

యల్లసామి నగినాడు. “బోర్లు నీల్లుండాలన్నా వానలు కురవాల్సిందే గద మామోయ్!” అన్నాడు.

“ద్యానికైనా ప్రకృతి దయ దలిస్తేనే రా, మనిసి మనగలిగేది. అది మరిసి ఇర్ర ఈగితే బోల్ల పడక తప్పదు” అన్నాడు కొండారెడ్డి. ఇద్దరూ ఊరు మొగదలకొచ్చినారు.

“సర్లే, ఇంటికి పో. రేపు పొద్దుగాల యింటి కాడి కొచ్చి నీ కూలి దుడ్డు తీస్కపో!”

“అట్నేలే మామా!” అని యల్లసామి ఎల్లి పోయినాడు.

కాలం ఎన్నో మార్పులు తీసుకొస్తాది. అందులో మంచీ ఉంటాది, సెడ్డా ఉంటాది. మంచితో బాటు కొత్త సమస్యలూ పుట్టుకోని వస్తాయి. అన్నీ బరించుకుంటా ముందుకు పోవడమే మనిసి పని!

***

గోవిందరాజులు సెట్టికి సంచకారం (అడ్వాన్సు) ఇచ్చిన తర్వాత బొమ్మిరెడ్డి పల్లెకు బోయినాడు సంజన్న గౌడు. పెండ్లాము యిమలమ్మ తోనీ ఇసయమంతా సెప్పినాడు. ఆ యమ్మి ఇలా అనింది  – “సుంకులమ్మ తల్లి దయతోని అంతా బాగా జరగతాది లేయ్యా! యాపారం ఒక తావ కొచ్చే వరకు మరి ఆ మ్యాదరాయన.. ఆ యప్ప పేరేందో అంటివి?” అంటూ ఆపింది.

“రామగిరి. ఆ యప్ప పెండ్లాము అనంతమ్మ”

“ఆఁ. ఆ రామగిరి వాండ్లింట్లోనే ఉంటావా మల్లా. వాండ్లకు మన తోని యిబ్బందేమో  అలోచన తీసినావా?” అంది.

“నేను అదే మాటంటే ఆ యప్పతో ఏం కాదు ఉండాల్సిందే అంటాడు. అనంతమ్మ పిన్నమ్మ గుడ్క శానా బాగా సూసుకున్నాది. మ్మేవ్! నాకేమని పిస్తోందంటే, కొనా మొదులు ఒక మనిసిని బరించడం అంత సులబం కాదు. వాండ్లు గుడ్క పాపం యాదో సిన్న ఒటేలు పెట్టుకోని బతకతాండారు. ఉన్న ఒక్క బిడ్లకు పెండ్లి జేసినారు. మనకు గుడ్క కర్చులు తగ్గుతాయి కాబట్టి నెలకింతని వాండ్లకు ఇద్దాము. ఊరికే తింటాండామే అన్న ఎదారు మనకూ ఉండదప్పుడు.” అన్నాడు సంజన్న.

“ఈ ఆలోశన బాగుంది. అట్నే జేద్దామయితే.”

“మూడు నాలుగు నెలలోన యాపారం ఒక దావ కొచ్చినంక యాదయినా శిన్న యిల్లు బాడిక్కి దీసుకుంటా. నిన్నూ ప్రదీవునూ దీస్కపోతా. వాన్ని మంచి ప్రయివేటు స్కూలులోన జేరిపిద్దాము. అప్పుడు యిల్లు గుడ్క బ్యారం పెట్టి అమ్మితే పాయ. మొరుసు సేను మూడెకరాలు మటుకు ఎవరికైనా గుత్తకియ్యాల. గుత్తలకు సేను దీసుకోనీకె రైతులు ఎనకాడుతాండారు. సేద్దెం జేసెటోల్ల కంటె గుత్తలకిచ్చెటోండ్లు ఎక్కువైతుండారు మల్ల. వచ్చిన కాడికి వస్తాది. ల్యాకపోతే బీడుబడిపోతాది.”

ఇదంతా పెండ్లానికి చెబుతాంటే సంజన్నకు మనుసులో శానా గుబులుగా ఉండాది. ఆ గుబులంతా ఆ యమ్మకు ఆ యప్ప మొగంలో కనబడబట్నాది. ఇమలమ్మ ఇట్లా అనింది –

“ఎందుకయ్యా అట్టా మనేద బడతావు? మంచికో సెడ్డకో ఒక తెగింపు జేస్తన్నాము. ఈడ ఏ మాత్రం బతుకు తెరువుండిన్నా ఊరిడిసి ఎందుకు బోతాము? ఉన్న ఒక్కగానొక్క పిల్లన్ని బాగా సదివిచ్చుకోని, వాని జీవితం ఒక దావకు త్యావాల గదా! ధైర్యంగా ఉండు. అంతా మనకు మంచే జరుగుతాది.”

ఆ యమ్మ మాటలతో సంజన్న గౌడుకు కుంచెం మనసు నిమ్మలపడినాది. వీండ్లిద్దరి మాటలు కొడుకు ప్రదీపు యింటున్నాడు. నాయినతో ఇట్లా అన్నాడు –

“అయితే నాయినా, నేను ఎనిమిది డోనులో సదవాల్నా?”

“అవును రా. నీ ఏడు పరీచ్చలు ఇంకా ఐదారు నెలలుంటాయి కదా! ఈ లోపల నేను ఆడ అంతా సంతరిచ్చుకోని, నిన్నూ అమ్మనూ దీస్కపోతా”

“అది మన ఊరి కంటే పెద్దదా?”

“శానా పెద్దదిరా ప్రదీపూ! అయివే మింద ఉండాది. పెద్ద రైలు టేసనుండాది. జనసను అంటారు. శానా రైల్లు వస్తాపోతా ఉంటాయి. రెండు రైలు గేట్లుండాయి ఊరి మధ్యన. మనం ఈ ఊరిడిసి పెట్టి డోనుకు బోతాంది నీ కోసరమే రా నాయినా. నీవు బాగా సదువుకోవాల. నేను మీ యమ్మ మా ఆశలన్న నీ మిందనే బెట్టుకుని ఉండాము.”

ఆ పిల్లని కండ్లల్లో ఒక ఎలుగు! “బాగ సదువుకుంటాలే నాయినా!” అన్నాడు వాడు.

“అద్దీ మొగోని మాట! పలాన సంజన్న గౌడు కొడుకు ప్రదీపు అంటే అందురు మెచ్చుకొనేటట్టుండాల!” అన్నాడా తండ్రి. ఆ యప్ప మొగంలో కొడుకు మిందున్న నమ్మకమంతా కనిపిచ్చినాది.

“నాయిన శానా ఎదారు బెట్కోని ఉండాడు రా ప్రదీపూ! నీవు గన బాగా సదువుకోని మంచి ఉద్యోగస్తునివైతే అదే సాలు!” అనింది తల్లి. “పాండి, బువ్వ తిందాము” అంది.

మొగుని కిష్టమని చపాతీ, ఉర్ల గడ్డల కుర్మా చేసినాది ఇమలమ్మ. కొంచెం వరన్నం గుడ్క వండినాది. పొద్దున మిగిలిన గోగాకు పప్పు ఉండాది. ముగ్గురూ బువ్వ దిన్నారు. ప్రదీపు తప్ప ఇద్దరూ రాత్రి నిద్రపోల్యా. వచ్చే కాలం ఎట్టుంటాదో అనే ఆలోశన మనసులను తొలుస్తాంటే, ‘ఏం కాదు లే’ అన్న బరోసా తెలుస్తాంటే, యా తెల్లవారు జామునో నిద్రకొరిగినారు సంజన్న, యిమలమ్మ.

పొద్దున్న టీ తాగి ఊర్లోకి ఎలబార్నాడు. కొండారెడ్డినీ, కుంటి సుబ్బారెడ్డిని, బడే మియాను, సరెడ్డి అనుమంత రెడ్డినీ గలిసి మెరుసు సేను గుత్తకిస్తాననీ, ఎవుర్నయినా సూడమనీ అడిగినాడు. అంతవరకు బాడిక్కి మాట్టాడుకోని, కూలీలను బెట్టుకోని, జొన్న, కంది, మినుములు పెసలు ఇట్లాంటివి పండించేటోడు. వానలు బాగ పడితే ఎంతో కొంత పండేది. ల్యాకపోతే ఎండేది.

సరెడ్డి అనుమంతరెడ్డి యింటి కాడ గూసొని మాట్లాడతాంటే మాల దాసప్ప ఆ దోవనే బోతుండాడు. అనుమంతరెడ్డి ఆ యప్పను అరిసి పిలిసినాడు.. దాసప్ప వచ్చి అరుగు కింద నిలబడి రెడ్డికీ, సంజన్నకూ దండం బెట్టినాడు. రెడ్డి అన్నాడు “రా రా దాసప్పా. పైకి రా పరవాల్యా వచ్చి కూసో”. దాసప్ప వచ్చి గూసున్నాడు. ఇంతకు ముందున్నంత కుల పట్టింపు లేదు, శాన మటుకు తగ్గినాది.

రైతుల్లో శానామంది ఊరిడిసి పోతాంటే సేద్దెం పనులకు మాల మాదిగోల్లే మిగిలినారు. వాండ్లల్లో గుడ్క దాసప్ప, ఎరుకలోల్ల మారెన్న, బీరప్ప ఇట్లాంటోల్లంతా కూలి పనులు చేసుకుంటూనే, సేన్లను గుత్తకు తీసుకుంటా ఉన్నారని అనుమంతరెడ్డికి తెలుసు.

“ఒరే దాసప్పా, మన సంజన్న గౌడు డోను జేరతాండాడు. ఆడ ఒక వైను శాపు పెట్టుకుంటాండాడు. ఈ యప్ప తాటివనం రుక్మాంగద రెడ్డి కొనుక్కున్నాడు. ఈరన్న గట్టు కవతల ఈనకు మూడెకరాలు మొరుసు సేనుండాది తెలుసు గదా నీకు? అదీ గుత్తకియ్యనీకె సూస్తాండాడు. నీవేమైన తీస్కుంటావేమోనని అడగనీకె బిల్చినా” అన్నాడు.

ఒక్క చనం ఆలోశన జేసి దాసప్ప అన్నాడు – “నీకు తెలియని దేముండాది రెడ్డి. అది మెట్ట శేను. యా సంమచ్చరం పండుతాదో యా సంమచ్చరం ఎండుతాదో తెలియదు. నాకా ఎద్దులు లేవు. బాడిక్కి గెడాలు దెచ్చుకొని, కూలీలు బెట్టుకోని సేద్ధం చేసుకోవాల. ట్రాకటరు బాడిక్కి దెచ్చుకోనీకె నాతోన యాడవుతాది? మన మానుకింది మద్దయ్య కాడే దున్నల జత ఉండాది. ఆ యప్పే ఈ మజ్జన గొల్ల మద్దిలేటి శేను రెండెకరాల ఎర్రన్యాల గుత్తకు దీసుకొనుండాడు. గెడం సీతులో ఉండాది కాబట్టి ఆ యప్ప కొడుకు ఓబులేసు గుడ్క ఎడిగల బోకుండా నాయిన కాడనే ఉండాడు గాబట్టి, ఏమన్న దీసుకుంటే మానుకింది మద్దయ్యే దీసుకోవాల. ఒక తూరి అడిగి సూడండి, ఏమంటాడో!”

అనుమంత రెడ్డి సంజన్న దిక్కు జూసి తలూపినాడు.

“సరే లేరా! మంచిమాట చెప్పినావు. నీవు పోయిరా” అన్నాడు. దాసప్ప ఎలిపోయినంక సంజన్నతో అన్నాడు.

“ఒక తూరి పోయి మాట్టాడు. ఒక్క మాట మనుసులో బెట్టుకో. గుత్త దుడ్డు మింద ఆశపడకు. సేను బీడు గాకుండా, సేసెటోడు దొరికితే శాన”

“నిజమే మామా! పొయ్యి అడుగుతా! నివ్వు గుడ్క వస్తే బాగుంటాది”

“నేనా? వద్దులేప్పా! ఆ మద్దయ్యకు గోరోజనం ఎక్కువ. వాడేదో అని, నేనేదో అని అసలుకే మోసం వచ్చినా వస్తాది. నీవు పోయి మాట్లాడుకో”

“సరేలే మామా, పోయొస్తా మల్ల!”

సంజన్న గౌడు మానుకింద మద్దయ్య ఇంటి కాడికి పోయేటాలకు అంబటి పొద్దయితాంది. ఇంటి బయట ఓబులేసు దున్నపోతులకు మ్యాత ఏస్తాండాడు. సంజన్నను జాసి నగుతా, “ఏంది బావ దావ తప్పి మా యింటికొచ్చె!” అన్నాడు.

సంజన్న గౌడు నవ్వి, “దావ తప్పలేదు లేరా, అదే పనిగ వచ్చినా! “ అన్నాడు.

“రా బావా” అని, పడసాలలో నులకమంచం మింద జాడు వేసి కూసోబెట్టినాడు. లోపల వారపాగు లోనుంచి మద్దయ్య తువ్వాలతో మూతి తుడుసుకుంట వచ్చి, సంజన్నను జూసి నవ్వినాడు.

“ఈడిగోల్లకు అనుకలోల్లతో ఏం పని బడిందబ్బా!” అని సంజన్న పక్కన మంచం మింద గూసున్నాడు.

ఓబులేసు లోనకి బోయి పెండ్లానికి యాదో చెప్పినాడు. ఆ యమ్మి టీలు గలాసుతో మజ్జిగ దీసుకొచ్చి సంజన్నకిచ్చింది.

“కోడలా మామా!” అనడిగినాడు.

“ఔ గౌడు!” అన్నాడు మద్దయ్య.

“ఈ యమ్మి పుట్టిల్లు యా ఊరో?”

“సుంకేసుల. కాని ఈ యమ్మి అమ్మ నాయినా సి.బెళగల్‌లో ఉంటారు. మా షడ్కునికి (వియ్యంకునికి) ఒక కట్టెల డిపో ఉండాది. మాన్లు కొని, రంపం మిసిను మింద రేపర్లు కోసి కలప అమ్ముతాడు. అంచులు, ఇరిగిన తుంటలు గుడ్క పొయ్యి కిందికి అమ్ముతాడు. సిన్నదే.”

సంజన్న మజ్జిగ తాగుతాంటే మద్దయ్య కోడలు నిలబడింది. ఆ యమ్మి పేరు ‘కాలింది’ అని ఓబులేసు చెప్పినాడు.

సంజన్న అయోమయంగా సూస్తాంటే ఆ యమ్మి నవ్వి అనింది – “సిన్నాయనా, ‘కాళింది’ కిస్న పరమాత్మ ఎనిమిదిమంది బార్యలలో ఒకరి పేరు. శానామందికి ‘ళ’ పలకనీకె రాక ‘కాలింది’ అంటారు. ఏందో కాలిపోయినట్టు!”

సంజన్న గౌడు గుడ్క నవ్వినాడు. “ఎంత మంచి పేరు పెట్నాడమ్మా మీ నాయిన నీకు!” అన్నాడు.

“మా నాయిన ఐదు వరకు సదివినాడు. నన్ను గుడ్క ఏడు వరకు సదివిచ్చినాడు. భారతం భాగవతం, రామాయణం బాగా సదివినాడు.” అన్నదా యమ్మి గర్వముగా. వాండ్ల నాయనను తచ్లుకోని ఆ యమ్మి మొగత ఒక ‘కల’ వచ్చినది. ఆడబిడ్డలకు ఎట్టయినాగాని నాయినంటే మమకారము మల్ల!.

“మీ ప్రదీపూ, మా వాడు బాస్కరూ ఒకే క్లాసు సిన్నాయనా” అనింది మల్ల.

“అట్టనా తల్లీ! మా వాని కోసరమే ఈ ఇదంతా!” అన్నాడు.

“మావాన్ని గుడ్క యాదన్న టౌనులో సదివించాలని మా యింటాయనకు చెప్తూనే ఉంటా. వాండ్ల నాయినను అమ్మను యిడిసి పెట్టి యాడికీ రానంటాడు.”

“ఈ కాలంలో గుడ్క ఇట్టాంటి కొడుకులుండబట్టే దర్మం ఆ మాత్రం నిలబడినాది. మొగుని మాట మీరకుండా నివ్వు గుడ్క అత్తను మామను సూపెట్టుకోని ఉండావు సూడు! అది గొప్ప యిసయం తల్లీ” అన్నాడు సంజన్న.

కోడలు మొగం ఈ మాటలకు యిచ్చుకున్నాది. మజ్జిగ గలాసు తీసుకోని లోపలికి ఎల్లిపోయినాది.

“ఏమి అల్లుడూ! ఈ మధ్య నివ్వు ఉర్లో లేవంట, డోను జేరెనీకె జూస్తన్నావని ఊర్లో చెప్పుకుంటాండారు” అన్నాడు మద్దయ్య.

“ఔ మామా! ఆడ ఒక వైను శాపు పెడుతాండా. తాటి కల్లు యాపారం తగ్గిపాయ. తాటివనం రుక్మాంగద రెడ్డికి అమ్మేస్తి. ఇనే ఉంటావులే. నాది ఈరన్నగట్టు కవతల మూడెకరాల మొరుసు సేనుండాది గద! దాన్ని నీవే ఎట్టయినా గుత్తకు దీసుకోని పున్నెంగట్టు కోవాల. అదీ అడగనీకె వస్తి.”

“నీకు తెలియని దేముంది అల్లుడూ! కొడుకు నా కాడ ఉండాడు, సొంత గ్యెడముండాది. ఏదో ఇగ్గుకొస్తాండా! నీవు యింతగా అడుగుతాండావు కాబట్టి నీ శేను గుత్తకు సేస్తా. కానీ గుత్త యింతని నివ్వు పట్టుబడితే యియ్యలేను. దేవుని దయవల్ల పంట పండితే నీకూ కొదవ ల్యాకుండా ఎంతో కొంత ఇస్తా. నాకే కర్చులు గిట్టుబాటు గాలేదనుకో, శేతులెత్తేస్తా. ముందే సెబుతున్నా సూసుకోమల్ల!”

మద్దయ్య చెప్పింది నిష్టూరంగ ఉన్నా అందులో నిజముండాదని సంజన్నకు తెలుసు. శేను బీడు బడకుండా సేద్దం జరుగుతుంది. ఏమాత్రం పంట చేతికొచ్చినా మద్దయ్య తనకు ఎంతో కొంత యిస్తాడు.

“సరే మామా! నీవు ఎట్ట జెపితే అట్ట! కానీయి మరి!” అన్నాడు.

“అదీ మొగోని మాట! నీవేం ఎదారు పెట్టుకోగాకు. నీ సేను బాగా చూసుకుంటాములే బావా!” అన్నాడు ఓబులేసు.

మనసులోని బరువంతా తీరినట్టనిపించింది సంజన్నకు. వాండ్లిద్దరికీ చెప్పి యింటికి ఎలబార్నాడు.

కొడుకు పొద్దున సద్దన్నం తిని బడికి బోతాడు. పైటాలకింటి కోస్తాడు బోజనానికి. ఇమలమ్మ వాడొచ్చేంత వరకు ఏమీ దినకుండా వటిస్తూంటాది (మాడడం). ఈ మద్య తనూ లేడూర్లో. ఒక్కదానికి టీ గాని కాపీ గాని జేస్కోదు.

సంజన్నకు ఆకలయితూండాది. తిరిపాలు ఓటలు కాడ ఏమన్నా తిని, ఇమలమ్మకు గుడ్క దీస్కపోతే, పిల్లడొచ్చినంక అందరం కల్సి భోనం చేయవచ్చని ఓటలు కాడికి బోయినాడు. పదిన్నర అయితుండాది. తిరిపాలు, ఆయన పెండ్లాం రాజమ్మ ఓటలు ముందు శిన్నరుగు మింద గూసోని ఉన్నారు. సంజన్నను జూసి వాండ్ల మొగాలు యింతయినాయి.

“ఏమప్పా, ఈడిగాయనా, ఎప్పుడొస్తివి?” అనడిగినాడు తిరిపాలు.

“నిన్ననే బావా! అక్కా బాగుండారా?” అనడిగినాడు సంజన్న.

“అదే బాగే నాయినా, ‘గోచీకి ఎక్కువ, సల్యాడానికి తక్కవ’ అన్నట్టుండాది మా బాగు” అనింది రాజమ్మ.

“సామతి (సామెత) బాగుండాది గాని అక్కా, టిపను ఏమయినా ఉంటే పెట్టు”

“అర్దగంట కిందనే ఉగ్గాని బజ్జీ అయిపాయ. ఇప్పుడే అలచంద (బొబ్బర్లు) వడలేసినా. తెస్తానుండు” అని లోపలికి బోయినాది రాజమ్మ.

“ఈది లోన ఎందుకు సంజన్నా, పా లోపలికి పోదాము” అని లోపలికి దీస్కపోయినాడు తిరిపాలు. ఒక నాప బండ మింద ఇద్దరు గూసున్నారు.

రాజమ్మ నాలుగు వడలు ఒక ప్లాస్టిక్ ప్లేటుల ఏసుకోని వచ్చి సంజన్నకిచ్చినది. టీలు గలాసుతో నీల్లతో సా.

“నీ మరదలికి గుడ్క నాలుగు కట్టు. ఆఁ, మొత్తం ఎనిమిది కట్టు. పిల్లోడు అన్నం లోకి నంచుకోనీకె “ అన్నాడామెతో.

వడలు ఇంకా గోరెచ్చగా ఉన్నాయి. “మీ లెక్క (మాదిరి) వడలు చెయ్యనీకె ఎవలికీ రాదు తిరిపాలు బావా!” అని మెచ్చుకున్నాడు. నాలుగూ తినేసి నీల్లు దాగినాడు.

“టీ తాగు నాయినా, బాగుంటాది” అనింది రాజమ్మ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here